అతని ఊహా వైపరీత్యం!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-6

 

sudrarsanamనిజానికి ‘వేయిపడగలు’ లోని ధర్మారావు ఒక మనస్తత్వ సంబంధమైన కేసు. నవలలో చిత్రితమైన మేరకు అతను జీవితం పొడవునా చేసినది ఒకటే… వాస్తవిక జగత్తు అనే చతురస్రంలో కాల్పనిక జగత్తు అనే వలయాన్ని ఇరికించే ప్రయత్నం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. అయినా విసుగూ, విరామం లేకుండా ధర్మారావు చేసింది అదే. ఆ వైఫల్యమే అతనిలో నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిష్క్రియతా పెంచి; స్వరాజ్యోద్యమంలో పాల్గొన్న అతని మిత్రుడు రాఘవరావుతో పోల్చినా అతనినొక నిరుపయోగిగా మార్చింది. అలాంటి ధర్మారావును యోగిగా, విరాగిగా, నిర్లిప్తుడిగా చూపించబోవడం రచయిత విశ్వసించే తాత్వికతలోని ఒక వైచిత్రి.

ధర్మారావుకు చెందిన కాల్పనిక జగత్తు ఒక విశిష్టమైన జగత్తు. అందులో అందరూ విశిష్టులే ఉంటారు. వారిది ఎంతో విశిష్ట సంప్రదాయం. వారిలో గాఢమైన, లోతైన రసజ్ఞత, అనుభూతి సాంద్రతా ఉంటాయి. వారు మనసును నియమించుకుని, నిగ్రహించుకోగల స్థితిలో ఉంటారు. వారిలో అతీతమైన, అలౌకికమైన జ్ఞానం వెల్లివిరుస్తూ ఉంటుంది. వాస్తవిక జగత్తు అందుకు భిన్నం. అందులో అంతా సామాన్యులు, నేలబారు మనుషులు;  లోతైన రసజ్ఞత, అనుభూతి గాఢత  లేనివారు, లౌకికమైన సుఖాలకోసం, సంపదకోసం పాకులాడేవారు ఉంటారు. గొప్ప జ్ఞానిగా, వివేకిగా  రచయిత చిత్రించిన ధర్మారావులోని భ్రమాజనిత విశ్వాసం ఎలాంటి దంటే; ఒకప్పుడు ఈ దేశంలో అందరూ విశిష్టులు, ఉన్నతులే  అయిన  వ్యవస్థ నిజంగా ఉండేది!

ధర్మారావు ఊహల్లోనూ, అతను మిగతా పాత్రలతో జరిపే సంభాషణల్లోనూ ఈ విశిష్టతా-సామాన్యతల మధ్య వివేచన నవల అంతటా జరుగుతూనే ఉంటుంది. పింగళి సూరన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం చదివి రసస్ఫూర్తిని పొందిన ధర్మారావు, అందులోని “(కొన్ని) భాగములు నేటి కసభ్యములుగా నగుచున్నవి. గాఢమైన శీలము చచ్చినకొలది ప్రాణములు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పైపై మెరుగులతో తృప్తి చెందును. అదియే నాగరికత యని విర్రవీగును” అనుకుంటాడు. మిత్రుడు రాఘవరావుతో కలసి రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీడుకు వెళ్ళి అక్కడి శిథిలాల మధ్య తిరుగుతున్నప్పుడు, “ఆ రెడ్లు, వారి పరాక్రమము, వారి ఔదార్యము, వారు పోషించిన కవులు” వారి హృదయాలను ఆనందభరితం చేస్తాయి. “అది యొక పుణ్యసమయము. మన మపుడైన బ్రతికి యున్నాము కాదు” అని ధర్మారావు అనుకుంటాడు. ఇంకోచోట, “రసమునందు పర్యవసించుట యెవనికి? రసజ్ఞుడైన వానికి. ప్రతివిషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో వాడు రసజ్ఞుడు. ప్రతివాడు నట్లు చేయలేడు…భగవంతుడెంతయైన లోతైన విషయము. ఆ లోతు మహాపరిపక్వ దశయందున్న దేవదాసి మనస్సునకే తెలియుచున్నది” అనుకుంటాడు.

రాణి రుక్మిణమ్మారావుతో మాట్లాడుతూ, “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది. రంగాజమ్మగారిని చూడుడు! ఆమె పూర్వపు భావోన్మాదము, పాతివ్రత్యము, వర్ణస్వచ్ఛతకు చిహ్నమైన మూర్తి. అవి యన్నియు యామెతో నంతరించినవి. కృష్ణమనాయుడుగారు పూర్వరాజచిహ్నము. ఆయనతో అది పోయినది. దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును. మీతో మహారాజ్ఞీత్వమే నశించును…నేను మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనునూ ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!” అంటాడు.

రాచరికవ్యవస్థతోనూ, గతంతోనూ ధర్మారావు తాదాత్మ్యం ఎంతటి దంటే, “కోటకు కోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యింటి యాకారము పడినది” అనుకుని బాధపడతాడు.

ఇంతకీ ధర్మారావుకు అంత ఆదర్శవంతంగా కనిపించిన సుబ్బన్నపేటలోని రాచరిక వ్యవస్థ ఎలాంటి పునాదుల మీద లేచింది? అది మరో ఆశ్చర్యం. రచయిత ఏ మాత్రం దాపరికం లేకుండా దానిని బయటపెడతాడు.  అయిదారు జతల ఎడ్లను కిరాయికి తిప్పుకుంటూ  జీవించే వీరన్ననాయడు అనే సాధారణ సంసారి, టిప్పు సుల్తాన్ పై యుద్ధానికి వెడుతున్న ఇంగ్లీష్ వారికి తన ఎడ్లనిచ్చి సాయపడతాడు. వారు శ్రీరంగపట్నాన్ని దోచుకుంటారు. అప్పుడు వీరన్ననాయడు తనవంతు దోపిడీకి అవకాశమిమ్మని అడుగుతాడు. వారు కోటలోని ఒక కొట్టును చూపించి దానిని దోచుకొమంటారు. అతని అదృష్టం కొద్దీ దానినిండా నవరసులు ఉంటాయి. వాటిని అతను రహస్యంగా ఎడ్లకు ఎత్తుకుని ఇంటికి తోలుకుంటాడు.

veyi

ఆ దోచుకున్న ధనబలంతోనే అతను సుబ్బన్నపేటకు రాజవుతాడు. స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు అతనికి తోడవుతాడు. ఫలానా చోట కోట కట్టుకోమని అతనే చెబుతాడు. బ్రాహ్మణునికి కావలసింది ఆ ఊళ్ళో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టించడం. కోట నిర్మాణం, గుడి నిర్మాణం ఒకేసారి మొదలవుతాయి. వారిద్దరి అన్యోన్యత అలా ప్రారంభమై నానాటికీ బలపడుతుంది. విశేషమేమిటంటే,  వీరన్ననాయడు ఏ కులంవాడో రచయిత మొదట్లో ఎక్కడా చెప్పడు. కానీ రాజు కాగానే ‘క్షత్రియు’డైపోతాడు. మన దేశంలో వివిధ రాచవంశాల పుట్టుక గురించి ఇక్కడ విశ్వనాథ వాస్తవాన్నే బయటపెడుతున్నారు. ఈ దేశంలోనే ఉన్న ఇతర రాజ్యాలను దోచుకునో; లేదా దేశీయుడా, విదేశీయుడా అన్న తేడా కూడా చూడకుండా దోపిడీ శక్తులకు సాయపడో గడించిన సంపద పునాదుల మీద లేచినవవి. దోచుకున్న వ్యక్తి ఏ కులానికైనా చెంది ఉండవచ్చు; కానీ అధికారబలం, ధనబలం లభించగానే  బ్రాహ్మణ్యం అతనికి క్షత్రియత్వం కల్పిస్తుంది. ఇది ఉభయతారకమైన ఏర్పాటు. దోచుకున్న సొమ్ము అయితేనేం, అందులో కొంత దేవాలయానిర్మాణం వంటి దైవకార్యాలకు వినియోగిస్తే అది పవిత్రమైపోతుంది. ఈ రోజున కూడా తిరుపతి హుండీలో నల్లడబ్బు ఏ ప్రమాణంలో చేరడం లేదు?

ధర్మారావు ఊహాజగత్తులో అత్యంత విశిష్టంగా, ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్న సుబ్బన్నపేట జమీందారి యథార్థరూపం ఇదీ. తన ఊహాశాలితను కాస్త నేలమీదికి మళ్లించి జమీందారీ మూలాలను తడిమి ఉంటే, అది దోపిడీ సొమ్ము మీద లేచిన వైభవోపేత నిర్మాణం అన్న సంగతి ధర్మారావుకు తెలిసేది. కానీ వాస్తవికత అనే నేల విడిచి ఊర్ధ్వయానం  సాగించడమే తప్ప కిందికి ప్రసరించే తత్వం అతని ఊహాశాలితకు లేదు. ఆ ఊర్ధ్వయానంలో పై పైకి వెళ్ళిపోయి కింద వాస్తవిక ప్రపంచం అనేది ఒకటుందన్న సంగతిని కూడా అతను ఒక్కోసారి మరచిపోతాడు. కావ్య రసాస్వాదన విషయానికే వస్తే, అతను తరచు రసప్రపంచంలో తప్ప మనుష్యలోకంలోనే ఉండడు. కావ్యజగత్తు గురించిన అతను చేసిన కింది  ఊహలు, వ్యవస్థ గురించిన అతని  కాల్పనిక ఊహలకూ యథాతథంగా వర్తిస్తాయి:

“ఓహో! కావ్యజగత్తు కల్పితజగత్తనుకొంటిని. కావ్యజగత్తే యథార్థమైన జగత్తు. అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావములు కలిగిన మనమే కల్పిత జగత్తు. యథార్థమైన మనోభావములు, నిర్మలమైన హృదయము, మహానాగరకత పొందిన బుద్ధీంద్రియములు కలిగినచో, తన దృష్టి, తన రక్తము కల్మషరహితమై, ధర్మగుణభూయిష్ఠములైనచో శీలము నందంత గాఢత్వముండును. అంత యేకాగ్రత యుండును…వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది.”

రాచరికవ్యవస్థ గురించిన అతని ఊహలు ఇంకా ఎంత హాస్యాస్పదంగా వ్యక్తమవుతాయంటే; అవి నవ్వునీ, బాధనీ కూడా కలిగిస్తాయి. అతనొకసారి ఇలా అనుకుంటాడు:

“మా తండ్రి నన్నేమో మహావైదికుని చేయవలెననుకొనెను. అన్న రామచంద్రరాజును గొప్ప విలుకానిని చేసి, అతనికి బ్రహ్మోపదేశము చేసి అధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పితములు కావు, యథార్థములని రుజువు చేయించి, జగత్తు మరల క్షత్రియులచే నేలించవలయు ననుకొన్నాడు.”

ఈ నవల రచించే కాలానికి ఎంతో ముందే యుద్ధతంత్రంలోకి ఆధునిక మారణాయుధాలు ప్రవేశించాయి. మరో ఒకటిన్నర దశాబ్దాల కాలంలో అణ్వాయుధాలు కూడా ప్రయోగంలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారావు విలువిద్య గురించి, అధర్వవేదాన్ని పునరుద్ధరించి బ్రహ్మాస్త్రం మొదలైనవి కల్పితాలు కావని నిరూపించడం గురించి, జగత్తును(ఒక్క భారతదేశాన్నే కాదు) క్షత్రియులచే ఏలించడం గురించి కలలు కనడం అతని మానసికవైపరీత్యాన్నే సూచిస్తుంది. అతని ఊహలు పరిణామశీలాన్ని గుర్తించకపోవడమే కాదు; కాలాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షత్రియుడి పాలనను జగత్తు మొత్తానికి విస్తరింపజేస్తున్నాయి.

అతని ఊహలు, మధ్య మధ్య రచయిత చేసిన నిర్ధారణలు హాస్యాస్పదాలే కాదు; తర్కానికీ, హేతుబద్ధతకూ, శాస్త్ర నిరూపణకూ, చరిత్రకూ నిలవనట్టు ఉంటాయి. ఒకచోట రచయిత ఇలా అంటాడు: “ఏదో బలహీనపు గాలి మన దేశము మీదికి విసిరెను. ఆజానుబాహులై, విశాలవక్షులై, యేనుగు తొండము పూని విరువగల జాతికి; గుజ్జులై బక్కపలచనై, తెల్లవారి లేచినంతనే యేదియో యాహారము లేకపోయినచో తపతపలాడిపోవు జనులు పుట్టిరి.” మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఒకప్పుడు అందరూ ఆజానుబాహులు, విశాలవక్షులు ఉండి; ఇంకొకప్పుడు అందరూ గుజ్జులు, బక్కపలచని వారు ఉండడం జరుగుతుందా? శరీరాకృతులు కానీ, ఆరోగ్యఅనారోగ్యాలు కానీ, ఆయుర్దాయంకానీ ఆయా కాలాలలో పుష్టికరమైన ఆహారలభ్యత, వైద్యసేవలు, ఆర్థిక సమానత లేదా అసమానత  మొదలైన భౌతిక, శాస్త్రీయ కారణాలపై ఆధారపడి ఉంటాయి తప్ప నిత్యసత్యాలుగా ఉండవు.

రక్తం, వర్ణం మొదలైన ప్రాతిపదికలపై జాతులను, మనుషులను విడగొట్టి చేసే ఊహలు కూడా అంతే అతార్కికంగా, అశాస్త్రీయంగా ఉంటాయి. ఆయా భాషల్లోని ఆయా వైచిత్రుల సమగ్రత తెలియడం, అవి అర్థమవడం ఆ దేశాల్లో పుట్టి ఆ భాషలు చిన్నప్పటినుంచి మాట్లాడితే కానీ సాధ్యం కాదని ధర్మారావు అనుకుంటాడు. “ఒక జాతి గుణములు, మతాభిప్రాయములు, తజ్జాతి రక్తము నెట్లుండునో, ఆ జాతి మాట్లాడు భాషలోని సమగ్రమైన రసాభావాదులర్థము చేసికొనుట కూడ శరీరములోని తద్రక్తము వలననే సంభవించు నని”  ఊహించుకుంటాడు. “వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది” అనుకుంటాడు. “ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు…ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికి నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును…క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే…అందర మొక్కటి యను సిద్ధాతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది…అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి” అంటాడు. “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది…జలమే తాను తన యున్న భిన్నప్రదేశమును బట్టి భిన్నత్వము తెచ్చుకున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతిచేత జీవుడు భిన్నుడగుచున్నాడు” అని తీర్మానిస్తాడు.

పోనీ వాదానికి రక్తభేదం, వర్ణభేదం ఉన్నాయని ఒప్పుకున్నా; అవి సంకరం కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? ప్రపంచచరిత్రలోకి వెడితే వర్ణసంకరం, జాతి సంకరం కాని కాలమే కనిపించదు. నాగరికత సోకని ఏవో మారుమూల ఆదివాసుల ప్రాంతాలలో తప్ప; నాగరికత పరిధిలోకి వచ్చిన ప్రపంచ జాతులు, మనుషుల మధ్య సాంకర్యం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. వర్ణసాంకర్యం గురించి మహాభారతంలోని అర్జునుడే గగ్గోలు పెట్టిన ఉదాహరణ ఉండగా, ‘వేయిపడగలు’ రచయిత ఏ వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడుతున్నట్టు?

ఇంకోచోట, “కులవిద్యయే  కూడు బెట్టును. ఇప్పుడు కులవిద్యలు చెడిపోయి, సంపాదించుటకు చదువు కొనవలసివచ్చుచున్నది” అంటాడు. ఇక్కడ కులవిద్య అనే మాటను వృత్తి విద్యగా తీసుకుంటే బ్రిటిష్ పాలనలో వృత్తులు క్షీణించి వాటిని ఆశ్రయించుకున్న జనం అల్లాడవలసివచ్చిన మాట నిజమే. వారికి తగిన ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందని మేరకు పై అభిప్రాయంలో కొంత నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, కులవిద్య అన్నప్పుడు ఏ విద్య ఏ కులానిది; ఎక్కడ హద్దులు గీయగలం అనే ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు మంత్రులుగా, సేనానులుగా లేరా? యుద్ధాలు చేయలేదా? అలాంటప్పుడు వారి కులవిద్య ఏదని చెబుతాం? అలాగే, వర్ణవ్యవస్థ ప్రకారం రాజ్యాధికారం క్షత్రియుడిది అనుకుంటే, రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ క్షత్రియులేనా? రాజులుగా ఉన్నవాళ్ళు అందరూ పుట్టు క్షత్రియులు కారనీ, వారికి క్షత్రియత్వం కల్పించారనీ, అందుకు హిరణ్యగర్భ క్రతువు వంటి అనేక ప్రక్రియలను అనుసరించారనీ తెలిపే ఉదాహరణలు అనేకం కనిపించడం లేదా? కులవిద్యనే అంటిపెట్టుకుని ఉంటే, ఒక వ్యవసాయదారుడు, ఒక కమ్మరి, కుమ్మరి, రజకుడు అధికారి, మంత్రి కాగలరా?

ఎలాంటివాడు ధర్మారావు? ఒకవైపు ఒక సంప్రదాయం చచ్చిపోతోందంటాడు. ఏదో బలహీనపు గాలి దేశం మీదికి విసిరిందంటాడు. ఒక మహా ప్రచండవాయువు వీస్తూండగా ఒరిగిపోయే వృక్షాలను నిందించి ఏం లాభమంటాడు. ఎవరిలోనూ ఉత్తమగుణాలు లేవంటాడు. మహార్థవంతమైనవన్నీ నశించిపోతున్నాయనీ, అల్పప్రయోజనములైనవన్నీ విజృంభిస్తున్నాయంటాడు. ఇంకోవైపు, ఇంతటి విపత్కరస్థితిలో కూడా కులవిభజన, వర్ణవిభజన, జాతి విభజన అంటూ ఎక్కడికక్కడ మనుషుల్ని చీల్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న పతనం నుంచి బయటపడడానికి ఐక్యంగా ఏం చేయాలన్న ఆలోచనే అతనిలో కనిపించదు. అతని ఉద్దేశంలో వర్ణవ్యవస్థ మళ్ళీ అవతరించి, జగత్తును అంతటినీ ఏలే అధికారం తిరిగి క్షత్రియుడికి కట్టబెడితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి.

అతనిలోని విభజిత దృష్టికి అంతే కనిపించదు. మనుషుల్నే కాదు మతాలను విభజిస్తాడు, సాహిత్యాన్ని విభజిస్తాడు, శిల్పాన్ని విభజిస్తాడు, చిత్రకళను విభజిస్తాడు. ఈ విభజనలో కొన్ని చోట్ల ఎక్కడైనా, ఏ కొంచమైనా వాస్తవం ఒకింత తళుక్కు మంటే అనవచ్చు. కానీ అతనిలో విరాట్ రూపంలో వ్యక్తమయ్యే స్వ, పర చింతన దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అన్ని నదులూ సముద్రంలో కలసినట్టు ధర్మారావు ఊహలన్నీ ఆత్మోత్కర్షలో కలుస్తాయి. ఎందులోనైనా సరే మనమే గొప్ప. “మన దేశమునందు పుట్టిన దేనికి మాపులేదు. ఖద్దరు గుడ్డకు మాపేమిటి? అది యెప్పుడును పవిత్రమే. ఎప్పుడును నిర్మలమే” వంటి నిర్ధారణలు సర్వత్రా కనిపిస్తాయి. మళ్ళీ ‘మన దేశీయులు’ అన్నప్పుడూ అక్కడ మరో విభజన:

“మన దేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము నని యర్థము. ఈ భూఖండము నందు పుట్టినంతలో నొరిగినది లేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మన దేశస్థుడు.”

(సశేషం)

 

 

 

మీ మాటలు

 1. Prof P C Narasimha Ready says:

  veeyi padagalu = veeyi pidakalu !!!

 2. బూర్ల వెంకటేశ్వర్లు says:

  సమాజాతీత సాంప్రదాయికత కోసం ప్రాకులాడే పాత్రను గూర్చి చక్కని విశ్లేషణ చేశారు సర్… గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్న సూక్తి ఎంత నిరర్థక భావనో కూడా అర్థం చేసుకోవచ్చుననిపించింది… ధన్యవాదాలు

  • కల్లూరి భాస్కరం says:

   థాంక్స్ వెంకటేశ్వర్లు గారూ…

 3. manjari lakshmi says:

  నేను వేయి పడగలు చాలా కాలం క్రితం కష్టపడి చదివాను. దాని మీధ విమర్శ ఉందన్నారు కానీ ఎక్కడ దొరకలేదు. ఇన్నాళ్లకు ఇంత విమర్శనాత్మకంగా రాస్తున్న మీది చదవటం కుదిరింది. మీ విమర్శ చాలా చక్కగా ఉన్నది.

  • కల్లూరి భాస్కరం says:

   థాంక్స్ మంజరి లక్ష్మీగారూ…వేయిపడగల మీద ఎలాంటి విమర్శలు వచ్చాయి, దానిపై రచయిత కానీ, ఆయన భావాలను సమర్థించేవారు కానీ ఎలా స్పందించారన్నది తెలుసుకోవాలన్న అకడమిక్ తరహా కుతూహలం నాకూ కలిగింది. ఒకవేళ తగినంత విమర్శ రాకపోతే అదీ కుతూహలం కలిగించే విషయమే. అదే ఒక మంచి పరిశీలనాంశం అవుతుంది.

మీ మాటలు

*