మరాద్దప్పేరు

pagideela-padava

 

‘ గిద్దన్నర బియ్యం పొయ్యిమీదడేసి, బద్దన్నర పప్పుతో  రాచ్చిప్పడు పప్పులుసెట్టుకొని, రెండుపూటలా సుష్టుగా భోంచేస్తూ బోషాణం పెట్టి పక్కనే మంచవేసుకొని, కంటికి రెప్పెయ్యకుండా కాపలా కాచుకుంటూ మా సుబ్బారాయ్డుమామ్మియ్య ఎన్నేళ్ళనుంచో దాచుకుందంతా రాత్రికిరాత్రే చడీచప్పుడు కాకుండా దోచుకుపోయారు దొంగ సన్నాసులు. ఆళ్ళకిదేవన్నా మరేదా? మీరే చెప్పండి’

కోలంక శివారు పెదలంక.చాలా సంవత్సరాల క్రిందటి సంగతి.

ఆరోజు, పెరట్లో ముంజకాయల బండి దొళ్ళించుకుంటున్నాడు. చిరంజీవివర్మ అనే  వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు.

సుబ్బన్నయ్య  చురకత్తి మీసం తిప్పుకుంటూ అరుగు దిగడం చిరంజీవి కంట్లో పడింది.

ఎక్కడి బండి అక్కడే పడేసి, వీధిలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అతను ” నేనూ వత్తా ” అంటూ గారాలు పోయాడు.

” నువ్ బళ్ళోకెళ్ళేద్రా ” అన్నాడు సుబ్బన్నయ్య. కంపెనీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటూ.

” నీకూడా వద్దావని మానేసాన్లే ” అని సుబ్బన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు చిరంజీవి. వదిలేస్తే  ఎక్కడ వెళ్ళిపోతాడోనన్న భయంతో.

సుబ్బన్నయ్య జేబుల్లో అన్నీ ఉన్నాయో లేదోనని తడుముకుంటుంటే…

” ఏయ్ పూన్నా! నా జోళ్ళిలా ఇసిరీవే,  అలాగెళ్ళొత్తా ” హాల్లోకి చూస్తూ అరిచాడు చిరంజీవి.

పూర్ణ చిరంజీవికి పిన్నమ్మ, సుబ్బన్నయ్యకి   చెల్లెలు. నిజానికి సుబ్బన్నయ్య  చిరంజీవికి మేనమామ.  వాళ్ళ అమ్మ, పిన్ని, మిగతా మావయ్యలు ఆయన్ని అన్నయ్యన్నయ్యని పిలుస్తుండంతో చిరంజీవికీ  ఆ పిలుపే అలవాటయిపోయింది.

” ఏమే, ఒసేయ్, ఏంట్రా? ఆ పిలుపు. పెద్దంత్రం, చిన్నంత్రం లేదా? ”  అంటూ మధ్యగదిలోంచి జోళ్ళిసిరేసిన పూర్ణ, వాటికన్నా జోరుగా వీధి గుమ్మంలోకి వచ్చేసింది.

చిరంజీవి రెక్క పట్టుకుని రెండు తగిలించాలన్నంత కోపంతో .

” ఆడిట్టం. మీకు నచ్చితే పలకండి, లేపోతే అంతా కట్ట కట్టుకొని గోదాట్లో దూకండి. ఏరా బాజ్జీ అంతేనా ” అన్నాడు సుబ్బన్నయ్య.

” నువ్వలా వెనకేసుకొస్తే, వీడెందుకూ పనికి రాకుండా పోతాడు కొన్నాళ్ళకి ” వెనక నుంచి వినిపిస్తున్న పూర్ణ  మాటలు వినపడనట్టే, ఆ మామా అల్లుళ్ళిద్దరూ  అల్లుడు మావా గిత్తల్లా ముందుకు కదిలారు.

తెల్లటి షరాయి, లాల్చీ వేసుకున్నాడు సుబ్బన్నయ్య. సుబ్బన్నయ్య వ్రేలు పట్టుకొని, కొబ్బరి తోటలోంచి చలాగ్గా నడుస్తున్నాడు చిరంజీవి.

తోట దాటి,  పంటబోది మీద అడ్డుగా ఉన్న  కర్రల వంతెనపై జాగ్రత్తగా నడచి మాణిక్యాలమ్మ గుడి దగ్గరకి వచ్చారు ఇద్దరూ.

కాల్వకి ఈ పక్కన మాణిక్యాలమ్మ గుడి, గుడిపక్క నుంచే ఇంజరం కాల్వగట్టు, గట్టు పక్కనే ప్రవహిస్తున్న ఇంజరం కాల్వ. కాల్వకి ఆ పక్కన ఏటిగట్టు, ఏటి గట్టుకా  కింద, దూరంగా గోదారి. ఇంజరం కాల్వని అటూ ఇటూ దాటడానికి బల్లకట్టు. ఏటి గట్టుమీద రావిచెట్టు, దానికెదురుగా ఈ ప్రక్కన కాలవ గట్టు మీద మర్రిచెట్టు.

మర్రిచెట్టుకి తలకిందులుగా  వ్రేళ్ళాడుతూ ఋషిపిట్టలు తపస్సు చేసుకుంటున్నాయి.

రావిచెట్టు పచ్చనాకుల్లో ఆకుల్లా కలిసి పోయిన రామచిలకలు కళ్ళకి కనిపించట్లేదు. కానీ కీకీమని అరుస్తూ ఋషిపిట్టలకి తపోభంగం కలిగించే పనిలో తలమునకలయ్యాయి. ఎర్రటి మర్రి పళ్ళని ముక్కున కరుచుకొన్న నాలుగైదు కాకులు, కావ్ కావ్ మంటూ రామచిలకల కేరింతలకి ఆటంకం కలిగిస్తున్నాయి. కాకి ముక్కున  గమ్మత్తుగా కనిపిస్తున్న మర్రిపళ్ళు రామచిలకలకి వళ్ళు మండిస్తున్నాయి.

మర్రిచెట్టు క్రింద ఉన్న భద్రం కాపు వొటేల్ ముందు, తాటిపట్టి బల్లల మీద కూర్చున్న పనీ పాటా లేని ముసలి వాళ్ళిద్దరు కాలవగట్టంటా వచ్చే పోయే వాళ్ళని ఆపి  యోగక్షేమాలు విచారిస్తున్నారు.

సుబ్బన్నయ్య  చెప్పులు విప్పేసి,  కళ్ళు మూసుకొని మాణిక్కాలమ్మకి మనసు నిండా దణ్ణం పెట్టుకున్నాడు. పళ్ళెంలో ఉన్న కుంకుమ బొట్టు వ్రేళ్ళతో తీసి మొహంపై పెట్టుకొని, అది చూస్తున్న చిరంజీవి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి   చిన్న బొట్టు పెట్టాడు.

కుంకుమ కళ్ళల్లో పడితే మండుతుంది కదా! తర్వాత చిరంజీవి కాళ్ళకి ఉన్న  చెప్పులు విప్పించేసి, రెండు చేతుల్తో అతన్ని కొంచెం పైకెత్తి తలుపుకు ఉన్న డిబ్బీలో  పావలాకాసు దక్షిణ వేయించాడు.

దక్షిణలూ దణ్ణాలూ అయ్యాకా మళ్ళీ ఇద్దరూ నడవడం మొదలెట్టారు.

నడిచి  వెళ్ళడమంటే చిరంజీవికి మహా సరదా.

కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే,   సత్తిగాడి భుజాల మీద మేకపిల్ల ఎక్కించి పంపిస్తారు ఇంట్లో.

పక్క పక్కనే  వాళ్ళలా కాల్వ గట్టంటా నడుచుకుంటూ పోతుంటే సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మర్యాదకి సగం సైకిల్ దిగి వీళ్ళని దాటేసేకా మళ్ళీ   తొక్కుకుంటూ పోతున్నారు.

నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు నవ్వుతూ ” సుబ్రారు బాన్నారా? ” అని పలకరిస్తూ నమస్కారాలు పెడుతున్నారు.

కొంతమందైతే తలపాగాలు తీసేసి, చేతులు కట్టుకొని  విప్పేస్తున్నారు.

ఏటిగట్టుకింద, ఇటు వైపు కూర్చొన్న కొంతమంది కుర్రాళ్ళు కాల్వలో గేలాలేసి చేపలు పడుతున్నారు.

కాలవగట్టు మలుపు దగ్గర ఉన్న రేవులో,  కొంతమంది ఆడవాళ్లు బట్టలు ఉతుక్కుంటున్నారు. మావా అల్లుళ్ళు రావడం చూసి,  వాళ్ళు దోపుకున్న కచ్చాకట్టులు విప్పేసి, పైట కొంగు నెత్తిన కప్పుకొని మేం ఏమీ చూడలేదు అన్నట్టు అటు తిరిగి నిలబడుతున్నారు.

” సుబ్బన్నయ్యా! నాకొహటో తరవాతి పుష్కం మొత్తవొచ్చేసింది. రెండెక్లాస్ పుష్కం కొనెయ్ ” అన్నాడు చిరంజీవి.

” వచ్చినా రాపోయినా, ఏడాది మొత్తం  అదే చదూ కోలెదవా ”

” నీకు తెల్దులే. కావాలంటే అప్ప జెప్పేత్తాను చూడు. అ  అమ్మ, ఆ ఆవు , ఇ ఇల్లు, ఈ ఈగ ” అని పుస్తకం చదవడం మొదలు పెట్టాడు చిరంజీవి.

ఇంతలో వెనకాల నుంచి…

” ఏండోయ్ సుబ్నబారు, సుబ్నబారండోయ్. ఇంత చేటరుత్తున్నా చూడ్రేటండి బాబూ ” అంటూ సైకిల్ పట్టుకొని, పరిగెత్తుకు వస్తూ  గావు కేకలు పెడుతున్నాడు వెంకన్నగాడు.

” సైకిల్ తోసుకొచ్చేకన్నా తొక్కుంటా రావొచ్చుకద్రా, ఎదవ మర్యాదా నువ్వూను. గుండాగి చత్తావ్ ” అన్నాడు వెనక్కి చూసిన సుబ్బన్నయ్య.

“మరేదా కాదు, మసేనం కాదండి బాబూ చైనూడి పోంది. ఇంటికెల్తే, పూన్నమ్మ గోరిప్పుడే ఎల్లేరని చెప్పేరండి. అందుకే గేలాపు నొత్తంట. మీకెదర చూపే గానీ ఎనక చూపుంటేనా? ”

” ఏడ్చావులే ఇగో ఈడ్ని నీ సైకిలెక్కించుకో ”

వెంకన్న సైకిల్ నిలబెట్టగానే సుబ్బన్నయ్య చిరంజీవిని సైకిల్ సీట్ మీద కూర్చోబెట్టాడు.

వాడు నెమ్మదిగా సైకిల్ దొర్లిస్తున్నాడు.

” యా, ఏంటీ పని? ” అడిగాడు సుబ్బన్నయ్య.

” ఏం లేదండె మైనర్ బారు, పేకాటకి యాండ్ కాలీగుంది సుబ్రారున్నారేమో సూసిరారా అన్నారండే ”

” ఓహ్ అదా! అక్కడికే  బైదెల్లేనురా, ఇంతట్లోకీ నువ్వొచ్చేసావా? సన్నాసని ”

” ఐతే ఫుల్ బోడ్డడిపోనట్టే. మీరూ, బద్రంగోరు, టాట్రుగోరు, కాశీరారూ, చుట్టంరాజుగోరు, తాతరారు,మారాజు గోరు ఏడుగురూ సరిపోఏరండే ఇంచక్కానూ ” లెక్క పెట్టుకున్నాడు వెంకన్న.

” ఆహా, ఏర్పాట్లేటైతే? ”

” మల్లిసాల నుంచి మైనర్ బారి మాంగోరు, కొండగొర్రి మాసం అంపేరండే. అంతో ఇంతో అడింపంది కూడా ఉంద్లేండి. మజ్జేనం బోజనోల్లోకి చిన్నయ్యగోరు కొండగొర్రి పులావూ, పెద్దయ్యగోరు అడుంపంది కూర్మా కూరా  చేత్తన్నారు. యానాం నుంచి సీమ సరుకట్రమ్మని పెద్ద పాలేర్నంపేరండీ ”

” మీరాజు యవ్వారం మా జోరుమీదుందైతే  ”

” మరేండి ” అన్న వెంకన్న, చిరంజీవి వంక అనుమానంగా చూసి ” సిరంజిగోరు మీకు దన్నం వెడతానండీ బాబూ. దైచేసి మీ పుష్కం పాటం మొదలెట్టకండే.అసలే ఆయాసంతో చత్నానూ ” అన్నాడు.

‘పుష్కం’ మాట వినపడేసరికి నడుస్తున్న వాడల్లా ఆగి మరీ  చూసేడు సుబ్బన్నయ్య వాళ్ళిద్దరినీ.

” సిరంజీగోరి చదుం, ఊరు మొత్తం తెల్సి పోందండి. మీ నోగిట్లో అడుగు ఎట్నాకే బైపడి పోత్నారంతా ”  చెప్పాడు వెంకన్న .

వెంకన్న రాకతో పుష్కం గొడవ మర్చి పోయిన చిరంజీవికి,  వాడి వాగుడుతో మళ్ళీ అది గుర్తుకు వచ్చింది.

వాడు సైకిల్ దొర్లిస్తుంటే  ” ఇగో రెంకన్న, ఇలా ఇన్రా నువ్వూ ” అని  ‘ తెలుగువాచకం ఒకటవ తరగతితో మొదలు పెట్టి, అంటరానితనం అమానుషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకూ’ వల్లించడం మొదలు పెట్టాడు చిరంజీవి.

వెంకన్న ఆ పాఠాలు వినలేక  వెర్రిమొహంతో  ఈసురోమని నడుస్తుంటే, సుబ్బన్నయ్య ముసిముసిగా నవ్వుతూ చురుగ్గా ముందుకు అడుగులు వేస్తున్నాడు.

వాళ్ళు కాపుల వీధుల్లోంచి,  రాజుల లోగిళ్ళు దాటి, మైనర్ గారి మండువా ఇంటి ప్రహరీగేటులో అడుగు పెట్టేసరికి, చిరంజీవి పుస్తకంలో పాఠాలన్నీ వెంకన్నగాడికి అప్ప జెప్పి పారేసాడు.

” అత్తమానూ ఒకే పుష్కం చదీతే  చిరాకేత్తంది. అందుకే నాకు రెండెక్లాస్ పుష్కం కావాలంట ” చెప్పాడు చిరంజీవి సుబ్బన్నయ్య లాల్చీ పట్టుకొని లాగి.

” అరే ఎంకన్నా ”

” చిత్తం ”

” నువ్ యానాం పేపర్ తేడానికి వెళ్లినప్పుడు ఈడికి రెండెక్లాస్ పుస్తకాలు రెండు తెచ్చి పడెయ్యరా. ఒకటి చిరీ పోయినా ఇంకోటుంటది ” పురమాయించాడు సుబ్బన్నయ్య.

” ఇయ్యాలకి ఇంకవ్వదండే. పేక్కట్టలకి ఎల్లినప్పుడే  ‘వాందరపొబ’, ‘వాందరపొతిరిక’ వట్టుకొచ్చేసేనండీ. ఒకేల ఎల్దారన్నా వంటల గొడవోటుంది కదండి మరి ” చెప్పాడు వెంకన్న.

” నాకేం, నాక్కుదర్దు. నాకియ్యాలే కావాలి. లేపోతే నే సైకిల్దిగను ” అంటూ హెచ్చరించాడు చిరంజీవి.

” ఐతే ఎవరి దగ్గరన్నా, పాత పుస్తకం ఉందేమో పట్టు కొచ్చియ్యరా  అందాకా ”

” ఆయ్, అలా అన్నారు పట్టుగుంది ” అన్నాడు వెంకన్న సైకిల్ స్టేండేస్తూ.

సుబ్బన్నయ్య వాళ్ళిద్దరినీ వాళ్ళ మానాన వదిలేసి, మైనర్ గారి మండువా వేపు అడుగులు వేసాడు.

ఎత్తుగా ఎడం వేపున్న  అరుగుమీద జిమ్మకానాలు పరిచారు. వాటిమీద గుండ్రంగా కూర్చొని పేకాడుతున్నారు రాజులంతా. ఊళ్ళో రాజులతో పాటూ చుట్టపు చూపుగా వచ్చిన రాజులు కూడా ఉన్నారు అక్కడ.

సుబ్బన్నయ్యని చూడగానే…

“రావోయ్ సుబ్రాజూ”

“రండి బావా”

“చాన్నాళ్ళ కండోయ్”

అని ఆహ్వాస్తూ వంతుల వారీగా మర్యాద ప్రదర్శించారు.

” దిగండే. తాలింపుకి కరేపాకు కొయ్యాల. అసలే ఆలీస వైపోయింది ”  అన్నాడు వెంకన్న. చిరంజీవిని సైకిల్ దింపడానికి చేతులందిస్తూ.

” నేను మాటంటే మాటే, మరేద్దప్పను.  ముందు నాకు పుష్కం పట్రా, అప్పుడు దిగుతా ” అన్నాడు చిరంజీవి కరాఖండీగా.

ఎంతసేపు బ్రతిమాలినా చిరంజీవిని సైకిల్ దింపడం వాడి తరం కాదు కదా! వాడి తాతతరం కూడా కాకపోయింది.

” దీనెమ్మ పుష్కం, దొబ్తున్నాడు చిన్రాజు ” అని  చిరంజీవిని అలాగే సైకిల్ మీద వదిలేసి, తలపాగా దులుపుకుంటూ మైనర్ గారి మండువా పక్కన ఉన్న సుబ్బారాయ్డు మామ్మియ్య గారింట్లోకి వెళ్లిపోయాడు వెంకన్న.

చిరంజీవికి వాడు కాస్త మర్యాద వదిలేసినట్టు అనిపించింది. చూద్దాంలే? ఎక్కడకి పోతాడు? మనసులోనే అనుకున్నాడు.

అరుగు మీద కూర్చున్న రాజులంతా మధ్య మధ్యలో సైకిల్ మీద కూర్చున్న చిరంజీవినీ, బ్రతిమాలుతున్న వెంకన్ననీ మార్చి మార్చి చూస్తుంటే, సుబ్బన్నయ్య నవ్వుతూ వాళ్ళకి ఏదో చెబుతున్నాడు. వాళ్ళేం చెప్పుకుంటున్నారో చిరంజీవికి వినపడ్డంలేదు.

సుబ్బారాయ్డు మామ్మియ్యగారి ఇంటి వైపు వెళ్ళిన వెంకన్న, తిన్నగా నూతి దగ్గరకి పోయి చేదతో చేదడు మంచినీళ్ళు తోడుకుని గటగట త్రాగేసాడు.  తువ్వాలు టపాటపా దులిపి మళ్ళీ తలకి బిగించుకొని గుమ్మం వేపు వచ్చాడు.

సైకిల్ సీటు మీద ఎత్తుగా కూర్చోవడంతో, చిరంజీవికి పిట్టగోడ మీదనుంచి లోపల వాడేం చేస్తున్నాడో, అంతా వివరంగా కనిపిస్తోంది.

ఎకరంస్థలంలో కట్టిన  విశాలమైన లోగిలి సుబ్బారాయ్డు మామ్మియ్యది.కానీ లోగిలంత విశాలమైన మనస్సు కాదు సుబ్బారాయ్డు మామ్మియ్యది. పీనాసి, గయ్యాళి లాంటి మారుపేర్లు చాలానే ఉన్నాయి మామ్మియ్యకి.

అరుగుమీద సుబ్బారాయ్డుమామ్మియ్య పెంపుడు అల్లుడు సీతమావయ్య, పారిన్ అంబర్ సైకిల్ కి సుతారంగా సన్నటి గుడ్డతో కొబ్బరి నూనె పెట్టుకుంటున్నారు.

ఆ సైకిల్ ఎప్పుడో సుబ్బారాయ్డుమామ్మియ్య పెనిమిటి, గొప్పిరేవు హైస్కూల్ కి వెళ్ళినప్పుడు  కొనుక్కున్నది. నిన్నో మొన్నో కొన్నట్టు ఇంకా కొత్త దానిలాగా తళ తళ మెరుస్తోంది.

సీతమావయ్య దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న వెంకన్న ” ఏండె సీతగోరూ ఆ సుబ్రారి మేనల్డు గోరికి, ఏదన్నా పాత పుష్కం  ఉంటే ఇయ్యండే గోలెట్టేత్తనారు ” అని అడిగాడు.

సీతమావయ్య వాడిని ఎగాదిగా చూసి, చిరంజీవి వైపు గోడమీద నుంచే ఓసారి అలా తొంగి చూసారు.

” పిల్ల పుస్తకాలు మన దగ్గరేముంటాయండీ? అన్నీ పెద్ద పుస్తకాలే. అవేనా ఇంగ్లీష్ బుక్సే ఉంటాయండి ”

” ఆళ్ళ మాయగోరే మిమ్మల్నడిగి రమ్మన్నారండే, లేదండం  రాజుల కేవన్నా  మరేదేటండీ. ఏదోటి ఆ వింగ్లీసు పుష్కమే అడెయ్యండి మరి. ఆకలి దంచేత్తంది.” రాజులకే మర్యాద నేర్పేలా బ్రతిమాలాడు.

వాడు చేసే ప్రయత్నం  అంతా చిరంజీవికి కళ్ళకి కట్టినట్టు వినపడుతోంది.

సీతమావయ్య  ఏమనుకున్నారో ఏమో? అరుగు మీద వున్న గదిలోకి వెళ్ళి,  సుబ్బారాయ్డుమామ్మియ్య కానీ చూడ్డం లేదు కదా! అన్న అనుమానంతో రెండు మూడు సార్లు లోపలకి తొంగిచూసి, ఆయన ఎప్పుడో రాసేసిన రామకోటిపుస్తకం ఒకటి తెచ్చి వెంకన్న చేతిలో పెట్టారు.

పుస్తకం చేతిలో పడగానే వెంకన్న  మొహం మతాబాలా వెలిగిపోయింది.

పరుగులాంటి నడకతో చిరంజీవి దగ్గరకి వచ్చేసి ” ఇగోండే సిరంజీగోరూ అన్నెక్లాసుల్కీ ఇదే పుష్కం అంట, సీతగోరు చెప్పేరు. చింపేయకుండా సదుం కోలి మరి ” అంటూ ఆ పుస్తకం చేతుల్లో పెట్టాడు.

దాన్ని చూడగానే చిరంజీవికి ఎగిరి గంతెయ్యాలనిపించింది.

“ఇక దిగండే. కడుపులో ఎలకలు పరిగెడత్నాయి. చద్దొన్నం కూడా తిన్లేదు పొద్దున్నుంచీ ” అని వెంకన్న  చేతులు అందివ్వగానే  సైకిల్  మీదనుంచి వాడి చంకలోకి  చెంగున దూకేసాడు చిరంజీవి.

‘ ఎంకన్నగాడు మర్యాదస్తుడే! ఆకలీ, దాకం పాపం ఆడి చేతలా చెయ్యించాయి.అనవసరంగా తప్పుగా అర్ధం చేసుకున్నాను వాన్నీ  అనుకున్న చిరంజీవి సుబ్బన్నయ్యా వాళ్ళూ కూర్చున్న వైపు పుస్తకం పట్టుకొని పరిగెత్తాడు.

అప్పటికే రాజులపేకాట జోడుగుర్రాల్లా పరిగెడుతోంది.

రాజులు పేకాట ఆడుతున్న ఎడమ చేతి వైపు అరుగు మీదకి కాకుండా, ఖాళీగా ఉన్న కుడి చేతి వైపు అరుగు మీదకి వెళ్ళి ఆత్రంగా పుస్తకం తిరగేసాడు చిరంజీవి.

‘శ్రీరామ శ్రీరామ’ అని తప్ప అందులో ఎక్కడా బొమ్మన్నదే కనపడ్డంలేదు.

దీంతో బిక్క చచ్చిపోయిన అతను  బుర్ర గోక్కుంటుంటే, అరుగుకి ఆ చివరన  సగం చిరిగిన  పేపర్ ఒకటి కనిపించడంతో అటు జరిగాడు.

“ఏంట్రా అల్లుడూ ఏం పుస్తకం తెచ్చుకున్నావ్? ఏదిలా పట్రా ఓ సారి చూసిస్తా ” అంటూ పిలిచారు మైనర్ మావయ్య.

” ఉండండి, అట్టేసి తెత్తాను ” అని పేపర్ని అడ్డంగా చింపి, ఓముక్కతో రామకోటికి అట్టవేసి, పుస్తకానికి గట్టిగా బందోబస్త్ చేసిన చిరంజీవి, దానిమీద కూర్చొని అటూ ఇటూ రెండుసార్లు తిప్పి సాపు చేసాడు. తర్వాత మైనర్ గారి దగ్గరకి పట్టుకెళ్ళి,” ఇగోండి మోవయా ” అని  ఇచ్చాడు.

దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చూసిన ఆయన ” హహ్హహ్హ ” అంటూ పెద్ద నవ్వు నవ్వడం మొదలు పెట్టారు.

పేకాట రాజులంతా ఆయన వంక చాలా ఆశ్చర్యంగా చూసారు.

” ఏంటి బావా? ” అని బెల్ట్ భద్రం, ” ఏంటన్నయ్యా? ” అంటూ తాతనాన్న ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించేరు.

“కుర్రోడు ఏడుస్తున్నాడంటే, ఏదో బొమ్మలబొక్కు ఇచ్చాడనుకున్నాన్రా. కానీ ఆ సీతగాడు చూడండ్రా, ముసలోడికి ఇచ్చినట్టు రామకోటిచ్చి పంపాడూ ” అన్నారాయన నవ్వు ఆపకుండానే.

” వీడసాధ్యం కూలా! అలా చేసేడా?  ఏదీ. చూడనీ ” అంటూ చెయ్యి చాపారు ట్రాక్టర్రాజుగారు.

సుబ్బన్నయ్యతో సహా ఒకరి తరువాత ఒకరు రామకోటిని పరిశీలించి పరిశీలించి చూడడం మొదలు పెట్టారు.

“మరి చూసేరా? ఆడి ఇరక తరకలు. అంటే అన్నాననీ, తిడితే తిట్టాననీ అంటారు గానీ మీరు ”  పళ్ళు కొరికారు తాతనాన్న.

లోపలనుంచి వెంకన్న, ఓ పళ్ళెంలో యాలిక్కాయలు వేసి పెట్టిన టీని ఇత్తడి గ్లాసుల్లో పోసి పట్టుకొచ్చేడు. వాటిని అందరికీ అందించి, మైనర్ మావయ్యకి దగ్గరగా వెళ్ళి, ఆయనకి మాత్రమే వినిపించేలా  ” అందాకా తింటానికి ఏడిసెనక్కాయలు ఏవైనా ఏపమంటారా? లేపోతే ఉప్మాలాటిది కానీ చైమంటారో? అడిగి రమన్నారండి చిన్నయ్యగోరు ” చెవిలో గుసగుసగా అడిగాడు.

” ఓ పంజెయ్యమను. జీడిపప్పుని దోరదోరగా ఏయించి, పల్చపల్చగా పకోడీలొండించి పంపమను ” పురమాయించారు  అంతే గుసగుసగా మైనర్ మావయ్య.

సీతమావయ్య అంటే తాతనాన్నకి అస్సలు పడదు.

తాతనాన్న సుబ్బారాయ్డుమామ్మియ్య వాళ్ళ రాజుగారికి అన్నగారి కొడుకు.  పద్దతి ప్రకారం సుబ్బారాయిడ్డుమామ్మియ్య ఆస్థంతా ఆమె తదనంతరం తాతనాన్నకే దక్కాలి. కానీ సుబ్బారాయుడ్డుమామ్మియ్య, వాళ్ళ రాజుగారు పోయాక,  ఆమె అన్నగారి కొడుకున్నూ తనకి మేనల్లుడున్నూ అయినట్టి సీతమావయ్యని కోటనందూరు నుంచి తెచ్చి పెంచుకుంటున్నారు.ఆస్థంతా చిల్లిగవ్వతో సహా ఆయనకే అంటూ రాతకోతలు చేసేసారు. దాంతో తాతనాన్నకి ముట్టాల్సిన ఆస్థంతా సీతమావయ్య సొంతవయిపోయింది. కానీ ఏం లాభం? సుబ్బారాయ్డుమామ్మియ్య ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప, సీతమావయ్యకి జేబులో చిల్లుకానీ కూడా ఉండదు. సుబ్బారాయ్డుమామ్మియ్య తెచ్చి పెట్టుకున్న ఈ పెంపుడు అల్లుడు వల్ల, ఊళ్ళో చుట్టాలంతా మామ్మియ్యకి చాలా వ్యతిరేకం అయి పోయారు. ఆ ఇంటికి రాకపోకలు కూడా తగ్గించేసారు. ‘ బానే మానేసేరు. ఈ మాయముండా సంతంతా వచ్చెళ్తుంటే, ఈ పాటికి గుమ్మాలూ తలుపులూ ఇరిగిపోను. ఆ బాధ తప్పింది ‘ అని సుబ్బారాయ్డుమామ్మియ్య తెగ సంతోషించారు తప్ప, కించిత్ కూడా విచారపడలేదు.

” ఆడు మాత్రం చేసిందేముందిరా తాతా? మీ కన్నమ్మ కొంగుచాటు అల్లుడు కదా! ఆళ్ళింట్లో రామకోటి తప్ప ఇంకేముంటుంది చెప్పు ” అన్నారు ట్రాక్టర్రాజు గారు ముక్క కొడుతూ.

ఆ ముక్క ఎత్తుకున్న  సుబ్బన్నయ్య ముక్కలని అటిటు, ఇటటు మార్చి షో తిప్పేసాడు.

” చంపేసారు బావా. ఫుల్ కౌంట్ ” అన్నారు తాతనాన్న ఉస్సూరుమంటూ ముక్కలు కిందకి విసిరేసి.

” ఇంత పాస్టయి పోందేటాట. నాదీ కౌంటేరా సుబ్బన్నా ” అన్నారు మైనర్ మావయ్య కూడా. సుబ్బన్నయ్య చూపించిన ఆటని వ్రేలితో కెలికి కెలికి పరీక్షిస్తూ.

” మీరు కుదురుండ్రండే. ఆ చతాడీగాడి పేరు తలుచుకున్నారు. ఇద్దరం ఫుల్ కౌంట్ అయిపోయేం ” చిరాకు పడ్డారు తాతనాన్న మైనర్ మావయ్య మీద.

“ఊరు కోవోయ్.  పగిడీ చుట్టలేక తలొంకర అన్నాడంట, ఎనకటికి నీ బోటోడే. ఆటలు కొట్టాలన్నా! ఆస్థులు కలవాలన్నా! ఆషామాషీ ఏంటి? సుడుండాల. నీకు అదిలేదు కాబట్టే ఆస్థి ఆడికి పోయింది. నా మీదెగురు తావేటీ. మీ కన్నమ్మీద చూపించు నీ పెతాపం ” అంటూ పైకి లేసారు మైనర్ మావయ్య. పైన ఉన్న డబ్బులు అయిపోయినట్టున్నాయి. మొల దగ్గర వున్న లింగీ మడత లోంచి డబ్బులు తీయడానికి మొలతాడుని వదులు చేసుకుంటూ.

“పంట్లాం ఏసుకొని పేకాట్లో కూచ్చున్నంత బుద్ది తక్కువ ఇంకోటి లేదు.కాళ్ళు పట్టేత్నాయి బాబోయ్. హమ్మ ” అంటూ పైకి లేచి,  పంట్లాం జేబీలోంచి కత్తిరి మార్కు సిగరెట్టుపెట్టి తీసి, అందులోంచి ఓ సిగరెట్ లాగిన తాతనాన్న, మైనర్ గారి మండువా అరుగు మీంచి సుబ్బారాయ్డు మామ్మియ్య  ఇంట్లోకి అలా తొంగి చూసారు.

చూసిన ఆయన చూసినట్టు ఉండకుండా …

” మైనరన్నయ్యా బేగా రండే. మీ వోడు ఏం చేస్తున్నాడో? చూద్దురు గాని ” అని పిలిచారు. అగ్గిపుల్ల వెలిగించుకుంటూ.

గబగబా మైనర్ మావయ్య తాతనాన్న పక్కకి వెళ్ళారు.

అక్కడ కరివేపాకు మొక్క మొదట్లో  బియ్యంకడుగు పోస్తున్న నాగమణిని చూస్తూ ” అదెవత్రోయ్,  పిటపిటలాడి పోతోంది. కొంపదీసి కోటేశు గాడి కొత్తకోడలా? ” అనడిగారు అసలు విషయం వదిలేసి.

“ఊకోండే. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు,   మీకంట్లోనూ అదే పడిందా?  దాన్ని తీసేసి మీ సీతగాన్ని చూడండే. గుమ్మాలని, తలుపులనీ ఎలా అరగ దీసేత్తన్నాడో ” కసురుకున్నారు తాతనాన్న.

” అవున్రొరేయ్ ఎంత నీట్నీసో కదాడికి. ఇంట్లోకి ఈగనే కాదు, అరుగుమీదకి దుమ్మూదూళ్నీ కూడా రానియడు. ఆడ్రా కుర్రోడంటే నిజంగా ” మెచ్చుకున్నారు మైనర్ మావయ్య.

” ఆపండే, ఎప్పుడూ ఆడి పల్లకీ యే మోస్తారు.  ఓ ఎకరం ఏవన్నా రాసిస్తాడు అను కుంటున్నారేటీ ? ” అన్న తాతనాన్న గట్టిగా దమ్ము లాగి, సిగరెట్ విసిరేసి ఆయన చోట్లోకి వచ్చి కూర్చున్నారు .

సీతమావయ్య మీద వంకపెట్టి, నాగమణిని అమితారాధనగా చూస్తున్న మైనర్ మావయ్య అది అలా తిప్పుకుంటూ లోపలికి పోగానే…

” సీతా, ఏమోయ్ సీత్రావరాజూ ” అంటూ చప్పట్లు కొట్టి పిలిచారు సీతమావయ్యని.

అప్పటికి తలుపుల్నీ గుమ్మాల్నీ మూడో సారో, మూడున్నర సార్లో తడిగుడ్డతో తుడిచేసిన సీతమావయ్య  మైనర్ మావయ్యని చూసి నవ్వుతూ “అయ్యా! పిలిచారా అన్నయ్యా ”  నన్నేనా? అన్నట్టు గుండెలమీద చెయ్యి పెట్టి చూపించుకున్నారు.

” నిన్నే, నిన్నేన్రా, ఓ సార్రారా మళ్ళెళ్లి పోదూ గానిలే ”

” అయ్యా!  చేతులు కడుక్కుని వస్తానండీ అన్నయ్యా ” అంటూ సైగలు చేసారు  సీతమావయ్య అటు వైపు నుంచి.

“రాడం ఎందుకు? పోడం ఎందుకు? మనందరి మీదా పసుపునీళ్ళు కానీ జల్లేసి పోతాడో ఏంటో? ” ఎకసెక్కం చేసారు తాతనాన్న.

పెరట్లోంచి పలావ్ వాసన వీధిలోకి మహా ఊపుగా వస్తోంది. మండువా ఇంటి ముందు నుంచి కాలి బాటమీద పోతున్నవాళ్ళు, ఓ సారి అలా ఆగి ఇలా ‘ఊంఊం’ అంటూ ముక్కు ఎగబీల్చి, ‘ రాజులొంట దంచేత్తనారు, దేనికైనా దంత సిరొండాల’ అని నిట్టూరుస్తూ ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళి పోతున్నారు.

శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు ఒకరి వెనక నుంచి మరొకరి వెనక్కి, వజ్రాసనంలో పాక్కుంటూ  పాక్కుంటూ  తాతనాన్న పక్కకి చేరుకున్నారు. ఆయనకి పేకాట ఆడటం కంటే, చూడటం ఎక్కువ ఇష్టం. ప్రస్తుతం ఆయన అదే పనిలో తీరుబాటు లేకుండా ఉన్నారు. అందరినీ పేరుచివరన కుమారం అని తగిలించి  పిలవడం ఆయనగారికి అలవాటు.

” అదేమిటోయ్ తాతకుమారం, అస్తమాటుకూ ఆ దత్తకుమారాన్ని అలా ఆడి పోసుకుంటావు? ఈ పరగణాలో ఏ పనికిమాలిన కుమారవన్నా చెన్నపట్నం వెళ్ళి, లా చదూకున్నాడా చెప్పు? ఇక్కడిక్కడే ముగ్గులెయ్యడం తప్ప” ప్రశ్నించారు. తాతనాన్న  పేకముక్కలని నిశితంగా పరిశీలిస్తూ.

” లాయే చదూతున్నాడో, బజారంట ఇనబ్బకెట్లే అట్టుకు తిరుగు తున్నాడో, మనవెళ్లి చూడొచ్చామా తాత కుమారం? ” అంటూ  కయ్యిమన్నారు తాతనాన్న.

” రేయ్ తాతా!  నువ్వు  సీతమీదా, మీ కన్నమ్మ మీదా, వాజ్జం మీద వాజ్జం ఏసేసి డిక్రీ పొందెయ్యొచ్చు కదరా? ” సలహా పారేసారు ట్రాక్టర్ రాజుగారు ఆటని డ్రాప్ చేస్తూ.

ఆయన కూర్చొన్నప్పట్నుంచీ టిక్కున ఒక్క ఆట కూడా బోణీ కొట్టలేదు.

” వీళ్ళకలాంటి ఎదవ్వయిడియాలు వస్తాయనే, ఈళ్ల కన్నమ్మ సీతగాడిచేత మెడ్రాస్లో  ప్లీడరీ చదివిస్తుంట” అడ్దుపడ్డారు మైనర్  మావయ్య.

” తమరి ఉచిత సలహాయే అయ్యుంటది లెండి. లేపోతే ఆవిడకన్ని అతిక తెలివితేట్లెలా వస్తాయి? ఏరా తాతా నిజవే కదా! ” మధ్యలో  దూరారు బెల్ట్ భద్రం.

ఇంతలో సీతమావయ్య  అక్కడకి వేంచేసారు. అందరికీ చేతులు జోడించి నమస్కరించి, తాతనాన్న మొహంలోకి తప్ప, ప్రతోళ్ల మొహంలోకీ పరికించి పరికించి చూసి, వాళ్ళందరి చేతా తిరిగి మర్యాదపూర్వకంగా తల ఊపించుకున్నారు.

సీతమావయ్య బోస్ ఫేంట్ వేసుకొని, పైన దసరాబుల్లోడు చొక్కా తొడుక్కున్నారు.కాళ్ళకి పేషన్ చెప్పులు కట్టుకున్నారు.కుడి చేతికి పోచ్చీ, ఎడం చేతికి చైనోచ్చీ తగిలించుకున్నారు.బొటనవ్రేళ్ళు మినహా అన్ని వ్రేళ్ళకీ ముద్దుటుంగరాలు మెరుస్తున్నాయి. మెడలో కన్నెతాడంత లావున బంగారం గొలుసుంది. దానికి చివరన పులిగోరు వ్రేళ్ళాడుతోంది.

అందరికీ వందనాలయ్యాకా, రెండో అరుగు అంచుమీద, అంటీ అంటనట్టుగా కూర్చుండీ కూర్చోనట్లుగా కూర్చొన్నారు. శుభ్రం ఎక్కువ కదా! బట్టలు మాసి పోతాయేమోనని.

” ఏమోయ్ సీతా! హేండ్ డల్లయి పోయింది. నాయి రెండాటలు చూసి పెట్టకూడదూ ” అన్నారు ట్రాక్టర్రాజు గారు.

” హమ్మో! నేనా? పేకాట జోలికి వెళ్ళనని అత్తయ్యాజీకి ప్రామిస్ చేసానండీ ” అంటూ చిరంజీవి వైపు చూసి ” పిల్లలు ఇక్కడెందుకూ మీరు, బేడ్బోయ్ అనరా? ఎవరన్నా చూస్తే ” అని తన దగ్గరకి రమ్మన్నట్టు చెయ్యి ఊపారు.

” నువ్, పెద్ద పోత్సుమెన్నంట కద్రా.  అందులో  పేకాటుండదేటోయ్? ” సందేహం వ్యక్తం చేసారు రాజబాబు. మల్లిసాల నుంచి కొండగొర్రీ, అడవిపంది మాంసం ఆయనే పట్టుకుని వచ్చారు.

ఆయన తిక్కప్రశ్నకి ఉక్కిరి బిక్కిరయిన  సీతమావయ్య, ఏం సమాధానం చెప్పాలో తెలీక,  చిరంజీవికి హస్తసాముద్రికం చూడడం మొదలు పెట్టారు.

శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు  మెల్లగా సుబ్బన్నయ్య వెనక్కి చేరి ఆటని పరిశీలిస్తూ ” మా అల్లుడు కుమారంగారు ఎప్పుడైనా కనిపిస్తున్నారేటోయ్? సీతకుమారం ” అని అడిగారు.

సీతమావయ్యతో సహా అక్కడున్న కుమారాలంతా ఆయన వంక చాలా ఆశ్చర్యంగా చూసారు.

పిల్లా జల్లాలేని వృధ్ధ రాజావారికి!  అల్లుడెలా పుట్టుకొచ్చాడా? అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం.

” మీ అల్లుడెవరండి తాతయ్యా? ” అడిగారు బెల్టు భద్రం. ఆశ్చర్యంలోంచి అందరికన్నా ముందు తేరుకొని.

” అదేనోయ్ మన రాపర్తికుమారంలేరూ? హర్నాదో, హరనాధమో అంటారు కదా! సిన్మా యాట్రు. ఆ మజ్జన వారి బావాజ్జీ కనబడినప్పుడు, రాజుల వంశవృక్షమేదో రాస్తన్నానని కూడా చెప్పేరు ”

“ఆంహా! రాపర్తి రాజులకీ, చిల్లంగి రాజులకీ చుట్టరికం ఎక్కడి దండోయ్? బావగారూ ” కూపీ లాగడం మొదలు పెట్టారు రాజబాబు.

” ఆ బోడి చుట్టరికాల్దేం వుందండీ? బావకుమారం. తాడు పేన్నట్టు పేనుకుంటూ పోతే, అయ్యే కలిసి పోతుంటాయి ” అన్న శ్రీరాజా వత్సవాయి శ్రీశివనాగరాజుగారు,  కాశీరాజుగారి పేక ముక్కల్లోకి తన కళ్ళని తనే నమ్మలేనట్టుగా చూసారు. ఆయన మొహంలో రంగులు గాభరాగా గాభరాగా మారిపోతున్నాయి. అక్కడున్న అంతా ఆ రంగులని గమనించినా గమనించనట్టే ఉన్నారు.

” షో ” అన్నారు ట్రాక్టర్ రాజుగారు.

” నిల్ ”

” నిల్నిల్ ”

” నిల్నిల్ నిల్నిల్ ” అంటూ ఆటగాడు రాజులు, వివరంగా ముక్కలు చూపించి,వాటిని కింద పడేసారు. ఒక్క కాశీ రాజుగారు తప్ప.

” కొట్టక్కొట్టక చచ్చాట కొట్టానన్నమాట త్పూ ” అంటూ నిట్టూర్చారు ట్రాక్టర్రాజు గారు.

” అలా చింతించకులే కుమారం. ఈ కుమారంగారు చాలా బలంగా ఇచ్చేర్లే ” అన్న శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు ” హేమిటోయ్ కాశీకుమారం, నీ అధ్వాన్నం ఆటా నువ్వూనూ. సుబ్బన్న కుమారం తిప్పిన ఓపెన్ కార్డ్  రెండెత్తేస్తే, నీది డీల్  షో అయి పోయింది కదా! నీకీ కౌంట్ ఖర్మెందుకూ? ”  అంటూ కాశీరాజు గారి మీద కోప్పడ్డారు.

వెంకన్నగాడు, లోపలనుంచి క్రీడాప్రాంగణంలోకి ఆదరా బాదరాగా ప్రవేశించాడు. అందరికీ పళ్ళెంలో ఉన్న జీడిపప్పు పకోడీవున్న ప్లేటులు అందించి, నెమ్మదిగా మైనర్ మావయ్య దగ్గరకి వెళ్ళి చెవిలో ” అడింపంది ఆరు, ఆ పళంగా కూరలో ఉంచెయ్యమన్నారా? లేపోతే  పచ్చేకంగా పులుసెట్టమన్నారా? ఇవరంగా అడిగిరమ్మన్నారండీ పెద్దయ్యగోరు ”   గుసగుసగా అడిగాడు.

” ఓ పని చెయ్యమను, ఆటిని తమాసగా ఏపించేసి అరిటాకుల్లో పెట్టి పంపమను. మందులో నంజుకోడానికి బాగుంటాది. ఇంకోసారి ఎవరన్నా టీ పుచ్చుకుంటారేమో అడుగు. ఈసారి అల్లం టీ పెట్టించి పట్టుకురా. ఆ పెద్ద పాలేరొచ్చేడా? రాలేదా? ఓసారి చూడు ” వాడి చెవిలో ఎవరికీ వినపడకుండా చెప్పేరు మైనర్ మావయ్య.

” అది, అరక రెండండీ. అందుకే ఎత్తలేదు ” అన్నారు పంచడానికి ముక్కలు కలుపుతున్న కాశీ రాజుగారు కత్తిరేస్తూ.

“అయితే ఏంటోయ్? చెయ్యట్టుక్కానీ కరిచేస్తదా? పోగాలం కాపోతే ”

” అయ్యో! మావయ్యా మీకెలా చెప్పాలి? నిరుడు కాశీ ఎళ్లినప్పుడు దాన్ని గంగలో వదిలేసొచ్చానండి.ఇందాకట్నుంచీ అందుకే నేనా ముక్క ఎత్తడంలేదు.ఒకేల పేకలో తగిలినా ఎంటనే ఇసిరేత్తనాను. ” వివరణ ఇచ్చారు.ఆయన మాటలకి అక్కడున్నవాళ్ళు ఉలిక్కిపడ్డంకంటే కూడా ఇంకా  ఏదో ఎక్కువే పడ్డారు.’ కాశీలో వదిలేసేవా’,’ కాశీలో వదిలేసేవా’ అంటూ అంతా కళ్ళు తేలేసేసారు. ఇంక ఏంజెయ్యాలో తెలీక.

కాశీరాజుగారి వివరణతో పేక చూడటమే కానీ, ఆడడం ఎరగని శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారికి తల దిమ్మెక్కిపోయింది. తలపాగా లేపి, అందులో దాచుకున్న అమృతాంజనం సీసా తీసుకొని, కణతలకి దట్టంగా పట్టించుకున్నారు.

” అదేంటయ్యా సీతకుమారం? పిల్లాడు ఏడుస్తుంటే ఏ చందువాయో, బొమ్మిడాయో ఇచ్చి పంపించకుండా రామకోటిచ్చి పంపావ్? ”  సీతమావయ్యని అడిగారు శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజు గారు. ముక్కలు కలుపుతున్న కాశీరాజు గారి వెనక నుంచి, మైనర్ మావయ్యకీ  తాతానాన్నకీ మధ్య ఉన్న ఖాళీలోకి  పాకుతూ.

”  వాట్ చందువా? వాట్ బొమ్మిడాయ్? ఐ కాంట్  ”  ఆదుర్దాగా అన్నారు  సీత మావయ్య .

“అదేరా తమ్ముడూ  చందమామ, బొమ్మరిల్లు ఉంటాయి కదా! కధల పుస్తకాలు  అయ్యి ” అన్నాడు సుబ్బన్నయ్య.

“ఓ అవా? మనదగ్గర ‘సిడ్నీ షెల్టన్’, ‘ఇర్వింగ్ వాలెస్’ వీళ్ళవే ఉంటాయన్నయ్యా ” చెప్పారు సీతమావయ్య చిరంజీవి చొక్కాకి పీక బొత్తాం పెడుతూ.

” చట్నీ చేస్తాన్ ? ఇడ్లీలొండుతానా? ఇదేంటోయ్ చెన్నపట్నవెళ్ళి వకీలవుతున్నావా? వంటోడివవుతున్నావా?  ఇదేం టిలాటియ్యి చదుంతున్నావ్? ” ప్రశ్నించారు బెల్ట్ భద్రం.

పేకాటరాజుల పరాచికాలకి సీతమావయ్య, మైనర్ గారి వంటింట్లో ఉడుకుతున్న అడవిపంది మాంసంలా కుతకుతా ఉడికి పోతున్నారు. కానీ పైకి ఏమీ తేలడం లేదు.ఆయన పరిస్థితిని చూసి తాతనాన్న మనసులోనే తెగ పండగ చేసుకుంటున్నారు.

” హిహ్హిహ్హ్హ్హి ” అంటూ తింగరి నవ్వొకటి సమాధానంగా పడేసిన సీతమావయ్య, తనదృష్టి పూర్తిగా చిరంజీవి మీదనే కేంద్రీకరించి “హౌఓల్డార్యూ? ” అనడిగారు చెయ్యిని ప్రశ్నార్ధకంలా ఊపుతూ.

మొన్నా మధ్య  రామచంద్రపురం వెళ్ళినప్పుడు, కండక్టర్ బస్ వెళ్ళేటప్పుడు ఓల్డానని, బస్ ఆగినప్పుడు రైట్రైట్ అని అనడం గుర్తుకు వచ్చిన చిరంజీవి, సీత మావయ్య ‘ఓల్డాన్’ అన్నారు కాబట్టి మనం  ‘రైట్ రైట్’  అనాలేమో అనుకొని ” రైట్ రైట్ ”  అనేసాడు.

మొహమాటం కోసం, నవ్వు ఆపుకుంటున్న పేకాటరాజులు  చిరంజీవి చెప్పిన  సమాధానంతో ఇంక నవ్వు ఉగ్గబట్టు కోలేక పోయారు.

సీతమావయ్యకి  నవ్వాలో ఏడవాలో తెలీని దుస్థితి వచ్చేసింది.అయినా చిరంజీవి ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని పరిక్షించడంలో ఆయన ఏమాత్రం వెనక అడుగు వేయదల్చుకోలేనట్టుంది.

” పోనీ ఇదన్నా చెప్పండి? వాటీజ్ యువర్ నేం ” అనడిగారు.

“ఏంటీ”

” అదే మీ పేరేంటీ అనడగుతున్నా ”

” ఓ ఆ వాట్టా? నేనింకో వాట్టనుకున్నాన్లెండి ” అన్న చిరంజీవి  “వోత్సవాయ్ చిట్వెంకట్ పాత్రాజ్ ” అని ఇంగ్లీష్లో చెప్పాడు . సీతమావయ్యకన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.

” పార్డన్ ” అన్నారు. సీతమావయ్య మొహం చిట్లించి.

” పాడనా? సరే ” అని ఎడం చేత్తో ఎడమ చెవి మూసుకొని, కుడి చేత్తో గాలిని అడ్దదిడ్డంగా నరికేస్తూ, కళ్ళు మూసుకొని మనసులో కురుక్షేత్రం నాటకంలో  కృష్ణున్ని తలచుకొన్న చిరంజీవి ” వో…త్సవాయీ… చిట్టీ… వేంవేంవేం… కటా…పతీయ్ తీయ్ తీయ్య్ తీయ్ తీయ్  రాజూజూజూజూ, వాత్సవాయి చిట్టి వెంకట పతి రాజూజూజూజూ… ” అని పాడి పారేసాడు.

తన పేరు పాడుకొని చిరంజీవి కళ్ళు తెరిసే సరికి, అరుగు మీదున్న రాజులు ఎక్కడి ముక్కలు అక్కడే పడేసి, పొట్టలు నొక్కుకుంటూ పడిపడి నవ్వుకుంటున్నారు.

తాతనాన్న అరుగుదిగి, వాకిట్లో ఓ మూలకి పారిపోయేరు. కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తున్నాయి, ఆయన ఏడుస్తున్నారో నవ్వుతున్నారో ఎవరికీ  అర్ధం కావడంలేదు.

“ఓహ్ సారీ ” అన్నారు సీతమావయ్య.

ఆయన మొహం చిన్న గోళీకాయంత అయిపోయింది. ఆ గోళీకాయలో అక్కడనుంచి ఏదోలా పారిపోవాలన్న ఆత్రం కనిపిస్తోంది.

” సుబ్బన్నయ్యగారూ బాబునలా తీసుకెళ్ళి కొంచెం ‘బేసిక్స్’ అవీ నేర్పి తీసుకు రమ్మన్నారా? ” అన్నారు లేస్తూ.

“వద్దులేరా తమ్ముడూ, వాడసలే వికారంగాడు ” వారించాడు సుబ్బన్నయ్య.

” ఏం ఫర్వాలేదండీ, నన్నడిగితే పిల్లలని  ఈ ఎన్విరాన్మెంట్లోకి అస్సలు రానీయకూడదు తెలుసా? కాస్త ఆల్ఫాబెట్స్ అవీ చెబుతాను. డెవలప్ మెంటొస్తుంది ” అంటూ చిరంజీవి చేయిపట్టుకొని ” తమరు రండీ ” అన్నారు.

చిరంజీవికి మీరూ తమరూ అంటూ తెగ మర్యాదిస్తున్న సీతమావయ్య అంటే భలే గౌరం కలిగింది.

” ఏరా అల్లుడూ “, ” ఏరా తాతా “, ” బుజ్జిగోరో”, “గజ్జిగోరో” అనేవాళ్ళే తప్ప, ఇలా సీతమావయ్యలా పధ్ధతిగా మీరూ, తవరూ అని మర్యాదిచ్చిన వాళ్ళు ఇంతవరకూ ఎవరూ కనపడలేదు అతనికి.

అందులోనూ ‘బేసిక్స్’ అయీ అంటున్నారు. అయి బిస్కట్లా కమ్మగా ఉంటాయో? చాక్లెట్లా తియ్యగా ఉంటాయో? రుచ్చూసొద్దాం పోనీ ‘   అనుకొని సీతమావయ్య చెయ్యి పట్టుకొని సుబ్బారాయ్డుమామ్మియ్య ఇంటివైపు కదిలాడు .

పెద్ద ఇత్తడిపల్లెంలో, నీళ్ల చెంబులూ ఖాళీ గ్లాసులు తెచ్చి, వాటిని రెండో అరుగు మీద సర్ది, మళ్ళీ లోపలకి వెళ్ళి, అరిటాకుల్లో అడవిపంది వారుమాంసం ఉన్న  ఇంకో పళ్ళెం తెచ్చి, దాని పక్కనే ఇది  పెట్టి, మెల్లగా మైనర్ మావయ్య దగ్గరికి వెళ్ళాడు వెంకన్న.

” మీరెప్పుడు చెప్తే, అప్పుడు వడ్డన్లు చేసేత్తామన్నారండీ చిన్నయ్యగోరు ” అన్నాడు  గుసగుసగా.

” ఇప్పటికే ఐదొందలు బొక్కలో ఉంది మన కంపెనీ. అది రికవరైయ్యాకే వడ్డన్లు. ఈలోగా ఆడోళ్ళని భోంచేసి, ఓ కునుకు లాగెయ్యమను. ఈళ్లకి, గ్లాసుల్లో మందేసేటప్పుడు రెండు చుక్కలు ఎక్కువ తగిలింతుండు. అప్పుడే కిక్కెక్కేసి, ఏ ఆట పడితే ఆ ఆట లాగేస్తారు. మనం కంట్రోల్లో ఆడి, ఎంటనే రికవరై పోవచ్చు ఏవంటావ్? ” ఎవరికీ వినపడకుండా గుసగుసగా చెప్పేరు మైనర్ మావయ్య.

” నాకొదిలీండింక, ఒక్కోల్లనీ ఎలా తొంగడేసేత్తానో మీరే చూద్దురుగాని ” గుసగుసగా చెప్పి, ఉత్సాహంగా గ్లాసుల్లో మందుపోయడం మొదలు పెట్టాడు వెంకన్న.

” నన్నడిగితే నట, ఈడ్నెవడడిగేడండీ బోడి? పళ్ళు రాలగొట్టెయ్యలేపోయారూ! ఎదవ బడాయి కాపోతే ” అంటూ వాకిట్లో పడీ పడీ నవ్వుకుంటున్న తాతనాన్న,  సీతమావయ్యా  చిరంజీవీ ఇలా  బయలుదేరగానే అలా అరుగు పైకి వచ్చేసారు.

” కడుపుబ్బించేసాడు, బాలకుమారం ” అన్నారు శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజు గారు.

” అవునండే ” అంటూ తాతనాన్న మళ్ళీ గట్టిగా నవ్వడం మొదలెట్టేరు.

అందరూ మళ్ళీ ఘొళ్ళుమంటూ నవ్వుకోవటం వెళ్ళే వాళ్ళకి వెనక నుంచి వినిపిస్తూ ఉంది.

చిరంజీవీ సీతమావయ్యా కలిసి, వాళ్ళింట్లోకి రావడం సుబ్బారాయ్డు మామ్మియ్య పెరట్లోంచి చూసేసారు. కళ్ళజోడు లేకపోయినా.

” ఏవిరా సీతప్పడా, ఎవుర్రా ఆ పిల్లోడు? ఇలా పంప్మీ ” అంటూ లోపలనుంచి  గాండ్రించారు మామ్మియ్య.

” మన వరాలప్ప కొడుకులుంగారు అత్తయ్యాజ్జీ ” అని చెప్పిన సీత మావయ్య ” నేనిక్కడే ఉంటా మామ్మియ్యాజ్జీ పిలుస్తున్నారు తమరిని, వెళ్ళిరండి. ” అంటూ చిరంజీవిని లోపలకి తోసేసేసారు.  అతని చేతిలో ఉన్న రామకోటి  లాగేసుకొని.

లోపల, వళ్ళో సాపుపీట పడుకో బెట్టుకుని, దాని మీంచి జారబోస్తూ  సుబ్బారాయ్డు మామ్మియ్య, పెసలు బాగు చేస్తున్నారు.

మామ్మియ్య బాగు చేసిన పెసలని నాగమణి తిరగట్లో పోసి విసురుతోంది.

నూనె రాసిన పచ్చని పెసలు  నిగనిగా నాగమణిలాగా  మెరుస్తున్నాయి.

” నువ్వహ్టోయ్ సింజీ, బాగా సాగిపోయావ్ సుమా. దా దా కూకో ” అంటూ ముక్కాలి పీటని ఆమె దగ్గరకంటా లాగి సుబ్బారాయ్డు మామ్మియ్య చిరంజీవిని కూర్చోమన్నారు.

ఆ ముక్కాలిపీటని, మళ్ళీ తన దగ్గరకంటా లాక్కుని కూర్చొని, పళ్ళెంలో ఉన్న పెసలని గుప్పెటతో తీసి, మామ్మియ్య వళ్ళో ఉన్న పీట మీద మెల్లిగా పొయ్యడం మొదలు పెట్టాడు చిరంజీవి.

సుబ్బారాయ్డుమామ్మియ్య  రుబ్బురోలుపొత్రంలా గుండ్రంగా, నిండా ధాన్యంపోసిన పొనకలా పొడుగ్గానూ దిట్టంగానూ ఉన్నారు.

” అప్పయ్య ఊరెళ్ళేహ్టగా, వచ్చేసారా? హేవిటోయ్ ” అని అడిగారు.

” ఇంకా రాలేదు మామ్మియ్యా, రేపో ఎల్లుండో కోలంక బండి పంపుతా అన్నాడండి, మా రామన్నయ్య ” చెప్పేడు చిరంజీవి.

చిరంజీవీ సుబ్బారాయ్డుమామ్మియ్యల వేపు కళ్ళు భూచక్రాల్లా తిప్పి తిప్పి చూస్తూ, చేత్తో  గురుజు పట్టుకొని తిరగలి చక్రాన్ని గిర్గిరా తిప్పుతా ఉంది నాగమణి. దాని తిప్పుడికి పెసలు బదాబద్దలై, తిరగలి కింద వేసిన చిరుగు చీర మీద పడుతున్నాయి.

” హేంటో, మా ఇద్దరి బతుకులూ చెరో తీరయి పోయాయంకో. ఆవెకేమో ఇంటినిండా మనుషులున్నా సుకంలేదు. నా కేమో కబురు తేడానికైనా   కాకుండదు. లంకంత కొంపలో ఒంటిపిల్లి రాకాసిలా పడుంట్నా అంకో ” పెసలు నేమడాన్ని ఆపి, మధ్యలో మామ్మియ్య కొంగుతో ముక్కు చీదుకున్నారు.

” అయ్యగారండేయ్! నా తెలీకడుగుతాను. మీరెప్పుడన్నా ఎంగిలి చేయిదిలింతేనా? మనింటి కాడ కాకులోలడానికి? ” ప్రశ్నించింది నాగమణి విసురుతున్న తిరగలిని ఓసారి ఆపి.

” నువ్వూరికే మిట మిట్లాడి పోకే మిడత మొందానా. పద్దానికీ తయారై పోత్నావీ మజ్జన ” కస్సుమన్నారు ఉడుక్కున్న మామ్మియ్య .

” హుహ్హూం, ఉన్నమాటంటె ఉలుకుందెకో ” అని మూతి తిప్పుకుంటూ, నాగమణి చీరమీద పడ్డ పెసరపప్పుని చేటలోకి ఎత్తడం మొదలెట్టింది.

” మిట మిటలాడిపోతున్నావ్! అనకూడదు మామ్మియ్యా,   పిట పిట లాడిపోతున్నావ్ అనాలి ” చెప్పాడు చిరంజీవి. ఇందాకా మైనర్  మావయ్య అన్న మాటలు గుర్తొచ్చి. సుబ్బారాయ్డుమామ్మియ్య  తప్పుని సరి దిద్దుతూ.

చిరంజీవి మాటలకి, మామ్మియ్య శవంలా కొయ్యబారి పోయారు.

నాగమణి మాత్రం తోక తొక్కిన త్రాచులా లేచిపోయింది.

” ఈ రాజుల నోటికి సుతం బొతం లేకుండా పోతంది. ఏల్డంత లేపోనా, ఎంత లేసి మాటలంట్నారో? చెబ్తా చెబ్తా, నాక్కానీ మండిందంటే కోసి కారం బెట్టేత్తా నొక్కోళ్ళకి  ” అని సాగ దీసుకుంటూ, విసిరిన పప్పుని చేటలో వేసి తెగ చెరగడం మొదలు పెట్టింది.

“………”

” వామ్మో!  మంచెడ్లుండవ్ కానీ, ఈళ్ల మొకాలకి మళ్ళీ మరేదలోటీ ” చేట చెరుగుడు వేగం ఇంకా పెంచింది.

చేటలోంచి వస్తున్న దూగరకి, చిరంజీవికీ మామ్మియ్యకీ ఊపిరి ఆడడం మానేసింది.

” ఆగవే, ఆగంట్నానా ” అని మామ్మియ్య రంకెలేస్తున్నా వినిపించుకోవడం లేదు నాగమణి.

“ఒసేవ్,ఒసేవ్ ,  నీయమ్మ కడుపు మాడా. నా ఇంట్లో నువ్వోచ్చణం ఉండొద్దే ముండా, అవతలప్పో” అంటూ నాగమణి మీదపడి  చేతిలోంచి చేట లాగేసుకున్నారు మామ్మియ్య. ఇంక దీనితో ఇదికాదు పని అని చెప్పి.

” ఆ పోతాం, పోపోతే, మీ మీద కాలేసుకుని కాపరం చేత్తాం అను కొంట్నారా? ” అంటూ కచ్చా విప్పేసి,  కొంగు నడుం చుట్టూ బిగించి, దొడ్ది గుమ్మంలోంచి బయటకి పోయింది. కాలికి అడ్డంపడ్డ అంట్ల తెపాలాలని టపా టపా కసిగా తన్నుకుంటూ.

దగ్గుకుంటూ, తుమ్ముకుంటూ  చిరంజీవీ మామ్మియ్యా పెరట్లోంచి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వీధిలోకి వచ్చి పడ్డారు.

అప్పటి వరకూ లోపల జరుగుతున్నదంతా వీధి గుమ్మంలోంచి కాలుగాలిన పిల్లిలా  నక్కి నక్కి చూస్తున్న సీతమావయ్య, మామ్మియ్యా చిరంజీవీ  వస్తున్న సడి అవ్వడంతో ఏమీ తెలియనట్టు కుర్చీలో కూలబడ్డారు.

మామ్మియ్యని చూడగానే, వందనంగా లేచి నిలబడి ” అత్తయ్యాజ్జీ నన్నూ, బాబునీ అలా వెళ్ళి శివాలయం చుట్టూ  మూడు ప్రదక్షిణలు చేసి వచ్చెయ్య మన్నారా ” అని అడిగారు వినమ్రంగా.

కళ్ళల్లోకీ, ముక్కుల్లోకీ దుమ్మూ దూగరా దూరిపోయి, దగ్గలేక కిందా మీదా పడుతున్న సుబ్బారాయ్డుమామ్మియ్య  ఏమీ మాట్లాడలేక ‘పొండి పొండన్నట్లు’ చేతులు రెండూ గాల్లోకి ఊపారు.

సీతమావయ్య, చిరంజీవి చేయ పట్టుకుని రెండు అంగల్లో గుమ్మం దిగేసారు. మామ్మియ్య మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటారో అన్న భయంతో కాబోలు. ఇంటి గేటు దాటాకా, బొడ్లో దోపుకున్న  రామకోటి పుస్తకం చిరంజీవికి ఇచ్చేసారు.

“అదేంటి మోయ్యా! గుడి  ఆఏపు కదా? ఇయ్యేపు ఎళ్తన్నామేంటి? ” అనడిగాడు చిరంజీవి, దారి మారడం గమనించి.

” ఇలాగైతే త్వరగా వెళ్ళిపోతామండీ”

” ఓహో ”

ఇద్దరూ బోదిగట్టు ఎక్కి నడుస్తున్నారు. అలా కొంతదూరం వెళ్ళేటప్పటికి నాగమ్మ ఇల్లు వచ్చింది. నాగమ్మ తాటాకు ఇంటిచుట్టూ ఎత్తుగా కొబ్బరాకుల దడి ఉంది. వీధిలో దడి గుమ్మానికి నాగమ్మ కొబ్బరీఅకుల చాపని తలుపులాగా కట్టుకొంది.ఇద్దరూ ఆ ఇంటి ముందుకు వచ్చేసరికి ఎండు చేపలకూర ఘుమ ఘుమలాడుతూ  పలకరించింది. దడి గుమ్మానికి అడ్దంగా నాగమ్మ నిలబడి ఉంది. పువాకు బొండంలా ఉండే నాగమ్మ వాలకం, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. లేకపోతే కూరవాసన బయటికి పోతోందన్న బెంగతో అది అలా గుమ్మానికి అడ్దంగా నిలబడిందో.

” ఆయ్, రండ్రండే బాన్నారా?  బాగా అలిసి పోనట్టున్నారేటీ? కూసేపు కూకెనులుద్రు గాని లోపల్రండి ” అంటూ, మొహమంతా నోరు చేసుకొని నవ్వుతూ ఆహ్వానించింది, సీతమావయ్యనీ చిరంజీవినీ.

” వద్దులే, మాకు పెద్దపనే వుందియ్యాళ. శివాలయం చుట్టూ మూడేస్సార్లు తిరగాలి మేం ” అంటూ ఆ ఆహ్వానాన్ని మన్నించ లేక పోయాడు చిరంజీవి.

” పోనీ లెద్దురూ. పెద్దామె రమ్మంటున్నారు కదా పాపం. ఓ సారి ఇలా వెళ్ళి, అలా కూర్చుని వచ్చేద్దాం, పీలవుతారేమో ” అన్నారు సీత మావయ్య.

ఇక తప్పదన్నట్టు, ఇద్దరూ లోపలకి వెళ్లి నాగమ్మ ఇంటి అరుగు ఎక్కారు.

సీతమావయ్య అక్కడ వున్న కర్ర కుర్చీలో కూర్చొంటే, చిరంజీవి అరుగుమీద కూలబడ్డ నాగమ్మ కాలుమీద సుఖాసీనుడయ్యాడు.

” అమ్మలమ్మో, ఇదేటిలా బరువెక్కిపోఏరు. పెద్దోలయిపోత్నారండి, ఓ పాలుండండి. సరీ కూకుందురు ” అని నాగమ్మ చిరంజీవిని లేపి కాలు సర్దుకొంది.

” ఏంటలా డల్ అయి పోయారు? కొంపదీసి మేకపిల్ల కానీ ఎక్కించు కోమన్నారా! ఏంటి? ” అని ప్రశ్నించారు సీతమావయ్య చిరంజీవి మొహంలోకి  చూస్తూ.

పొద్దున్నుంచీ నడిచి నడిచి అలసి పోయున్నాడేమో, అదే మంచిది అనుకొని ”  ఎక్కించేసుకోండయితే ఎళ్ళి తిరిగేద్దాం ” అన్నాడు చిరంజీవి.

” నాన్సెన్స్, నేనా ? మిమ్మల్నా? మేకపిల్లా ? నో. ఓ పని చెయ్యండైతే, నాగమ్మగారు తాటిపళ్ళు ఏరడానికి వెళతారట, కూడా వెళ్ళిపోండి .ఇంటిదగ్గర దిగ బెట్టేస్తారు మిమ్మల్ని” అంటూ సలహా ఇచ్చారు సీతమావయ్య.

“అదెంత బాగ్గెం, రండి బావైతే ” అని, ” ఒలేయ్ఓ లి సరసోయ్!  ఆ  మంచంకింద, చిన్న గంపుంటాది ఇలాగియ్యే ” అని పిలిచింది లోపలకి చూస్తూ.

” వత్తానని, రాపోతే శివుడు మూడోకన్ను తెరుస్తాడేమో ” అన్నాడు చిరంజీవి భయంగా.

” ఫర్లేదండీ మీ పేరు చెప్పి, నేను ఇంకో మూడు నాలుగు రౌండ్లు ఎక్కువ వేసేస్తా లెండి, అలా చెయ్యొచ్చట ” చిరంజీవి భయం పోగొట్టారు సీతమావయ్య.

లోపలనుంచి నాగమ్మ కూతురు సరస గంప తెచ్చి, చిరంజీవిని చూసి పలకరింపుగా నవ్వింది. అతని రెండు బుగ్గలూ గట్టిగా సాగదీసి  ‘ఉం’అంటూ ఒక్క అంగలో లోపలకి గెంతేసింది.

” నీయ్యెమ్మ, మండిపోత్నాయే. నా బుగ్గల్లాగొద్దని నీకెన్ని సార్లు చెప్పేనే, దొంగముండా ” అంటూ చిరంజీవి దాన్ని కొట్టడానికి పైకి లేచాడు.

” పోలెద్దురూ.ఏదో చిన్నపిల్ల. సద్దా పడింది. కుదురుగా గంపలో కూకోండి ఇంటికెళ్ళిపోదారి ” అంది నాగమ్మ చిరంజీవి చెయ్యి పట్టుకొని ఆపుతూ.

” అది చిన్న పిల్లేటి? పొదుగుడు పెట్టలా ఉంటే ”

” రాజుల్కి, చిన్నప్పట్నుంచీ సరసాలే. నడండి నడండి” అంది నాగమ్మ గంపలో పాతచీర  సర్దుతూ.

అప్పటికి ఇక సరసని క్షమించేసి,  గంపలోకి ఎక్కి గుమ్మడిపండులా కూర్చున్నాడు చిరంజీవి. సీతమావయ్య సాయం చెయ్యడంతో గంప నెత్తిమీద పెట్టుకుని, నాగమ్మ వయ్యారంగా బయలుదేరింది.

గంప ముందుకు కదులుతుంటే, వెనక్కి వెళ్ళిపోతున్న తాడిచెట్లకి లేత ముంజకాయలు కనిపిస్తున్నాయి. ‘ఈ తింగరి దానికి ఇప్పుడు తాటిపళ్ళెక్కడ దొరుకుతాయి? అన్నీ ముంజకాయలే ఉంటే! అనుకొన్న చిరంజీవి, ఆ విషయం నాగమ్మకి చెబుదాం అనుకున్నాడు. కానీ అంతట్లోకీ అతనికి రామకోటి పుస్తకం గుర్తొచ్చింది. నాగమ్మ ఇంటి అరుగుమీద మర్చి పోయాడుదాన్ని .

” ఏయ్, నాగమ్మా ఆగవే. ఓ సారి గంప కిందకి దింపు” అని ఆజ్ఞాపించాడు.

“ఎందుకు? బావూ  ఏం? ” అంటూ గంపని పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుకి దాపెట్టి కిందకి దింపింది నాగమ్మ. వెంటనే చిరంజీవి గంపలోంచి చెంగున కిందకి దూకి, నాగమ్మ ఇంటి వైపు దూసుకుపోయాడు.

కంగారుపడ్డ నాగమ్మ “యాండే ఎక్కడికండీ బావుగోరూ,నా కొంప ముంచీసీలా ఉన్నారు” అంటూ  గంపపట్టుకొని చిరంజీవి వెనకాల పడింది.

చిరంజీవి  నాగమ్మ ఇంటికి  వచ్చేసరికి దడికి తడక వేసేసి ఉంది.తడక తోసుకుని లోపలకి వెళ్ళేసరికి, ఎండ పడకుండా కాబోలు చూరుకి ఈ చివర నుంచి ఆ చివరి దాకా చీర కట్టేసి ఉంది. గాలికి ఎగురుతున్న చీర కింద నుంచి  రామకోటి కనిపించడంతో అది పట్టుకొని, మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి పరుగు అందుకున్నాడు చిరంజీవి.

అప్పటికి నాగమ్మ ఆపసోపాలు పడుతూ పరుగులాంటి నడకతో దొర్లుకుంటూ వస్తోంది.

” యాండే బాబూ ఎక్కడికి లగెత్తారు “.

“ఇగో ఈ పుష్కం మర్చిపోయా ” అని రామకోటి చూపించాడు.

“ఓహ్ ఇదా? ఏం మోయ గారున్నారుకదా? ఆయనట్టుకొద్దురు కదా? ” అంది తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ.

” ఏమోనెహే, ఉన్నారో ఊడేరో ఎవడికి తెలుసూ, నాకు ఆకలేసేత్తంది. బేగా ఇంటికి తీసుకెళ్లి పోవే బాబూ “అన్నాడు. చిరాగ్గా గంపలోకెక్కి.

అలా సైకిల్ మీద వెళ్తున్న ఓ మనిషిని పిలిచి, నాగమ్మ గంపని నెత్తికి ఎత్తమంది.

తీరా చూస్తే, వాడు  సత్తిగాడు కొడుకు వీరాసామి.వాడు గంపలో ఉన్న చిరంజీవిని చూడనే చూచేసాడు.

” చీచ్చీ, గంపలో కుచ్చున్నారా? రాజుల మరాదేవన్నా మన్నుద్దా? ఎవులైన చూత్తే ఎంత నామద్దా? దిగండి దిగండే. దిగి నా సైకిలెక్కెయ్యండి జోరుగా పోదాం ” అన్నాడు వీరాస్వామి.

గంపలోంచి గబుక్కున దిగేసి, ఎవరూ చూడలేదని నిర్ణయించుకున్నాకా, వీరాస్వామి సైకిల్ ఎక్కేసాడు   చిరంజీవి.

చిరంజీవి ఇంటికొచ్చే సరికి, వసారాగదిలో పందిరిమంచం మీద పడుకొన్న  రామన్నయ్య డిటెక్టివ్ యుగంధర్ తో కుస్తీ పడుతున్నాడు.

చిరంజీవిని, ఓసారి వారగాచూసి  ” రాత్రి ఒంటిగంట ”  అని మళ్ళీ పుస్తకంలో మొహం దూర్చేసాడు.

పూర్ణ పెరటి వైపు వసారాలో కూర్చొని, చెలికత్తెలతో చింతపిక్కలు  ఆడుకుంటోంది.

” పూన్నా, అన్నం” అంటూ గట్టిగా కేకేసాడు చిరంజీవి.వీధిలో ఉన్న బిందెలోని నీళ్లతో కాళ్ళు, చేతులూ, మొహం కడుక్కొని.

చిరంజీవి, హాల్లో  పడక్కుర్చీలో కూర్చొంటే,  పూర్ణ అన్నం తినిపించింది. పొద్దుటి కోపం మర్చిపోయినట్టుంది, ఏమీ అనలేదు. అన్నం తినడం అయ్యాకా, చిరంజీ రామకోటిని అందరికీ చూపించాలన్న ఉబలాటంతో తోట పక్క, దిగువ పేటలోకి పరిగెత్తాడు.

చిరంజీవి, పొద్దున్న లేచేసరికి ఊరు మొత్తం అగులో బొగులో అంటూ ఉంది.

రాత్రి సుబ్బారాయ్డుమామ్మియ్య  ఇంట్లో దొంగలుపడి సమస్తం దోచుకు పోయారు.

ఈ ఇరవై, పాతికేళ్ళలో ఇంత పెద్ద దొంగతనం చుట్టు పక్క లెక్కడా చూడలేదని ఊళ్ళోవాళ్ళు చెప్పు కుంటున్నారు.

సుబ్బారాయ్డుమామ్మియ్య బోషాణంపెట్టి గొళ్ళెం ఊడగొట్టేసి, మూటలు మూటలుగా కట్టి పెట్టుకున్న,  డబ్బూ దస్కం మొత్తం ఊడ్చి పారేసారు.

ఒక్క బంగారమే ఏడీసెలో, ఎనిమిదీసెలో ఉంటుంది అంటున్నారు.డబ్బు అయితే లెక్కేలేదు.నాలుగైదు లక్షలు దాటొచ్చు అట.

సీతమావయ్యకి, మామ్మియ్య మురిపెంగా చేయించిన, ఏ బంగారపు వస్తువూ దొంగ వెధవలు మిగల్చలేదు.

‘ గిద్దన్నర బియ్యం పొయ్యిమీదడేసి, బద్దన్నర పప్పుతో  రాచ్చిప్పడు పప్పులుసెట్టుకొని, రెండుపూటలా సుష్టుగా తింటూ… బోషాణం పెట్టి పక్కనే మంచవేసుకొని… కంటికి రెప్పెయ్యకుండా…. కర్రట్టుక్కాపలా కాచుకుంటూ…  మా సుబ్బారాయ్డు మామ్మియ్య ఎన్నేళ్ళనుంచో దాచుకుందంతా రాత్రికి రాత్రే చడీచప్పుడు కాకుండా దోచుకుపోయారు దొంగ సన్నాసులు’

“అయ్యో” అని ఏడ్డానికి కూడా పాపం మామ్మయ్యకి  అవకాశం లేకుండా పోయింది.

ఎంతెంత మంది, ఈనోటట్టం మనిషి నోరు పడిపోతే బావున్నని శాపనార్ధాలు పెట్టారో? ఏమిటో ? అవన్నీ ఆలస్యంగా విన్న, తదాస్థు దేవతలు అలాగే అనేసినట్టున్నారు. దొంగలని చూసిన భయం వల్లనో ఏమిటో? మామ్మియ్యకి పక్షవాతంవచ్చి నోరు ఒక పక్కకి లాగేసి, మాట పడి పోయింది.కుడిచెయ్యి, ఎడంకాలు కూడా లాగేసింది. నడవడానికి లేకుండా.

“చూడకూడనిది ఏదో అకస్మాత్తుగా చూసి, తీవ్రమైన భయాందోళనలకి గురైనప్పుడు,  ఇలాంటి విపరీత పరిణామాలు సంభవిస్తాయి” అని రాంచంద్రపురం నుంచి కారులో వచ్చిన పెద్ద డాక్టర్ గారు చెప్పారు. ” భవిష్యత్ లో  మరిక బాగు అయ్యే అవకాశం కూడా లేదు ” అన్న ఆ డాక్టర్ గారు ” ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు ” అని తేల్చి చెప్పి  ఫీజు పట్టుకుని వెళ్ళిపోయారు.

మైనర్ మావయ్య, కోటేశుగాడికి ఖర్చులకి డబ్బులు ఇచ్చి, మామ్మియ్య వాళ్ళ చుట్టాలకి కబురుచెప్పి రమ్మని కోటనందూరు పంపించారు.

ఊళ్ళో వాళ్ళంతా వచ్చి మామ్మియ్య మీద జాలి, సానుభూతి వానలా కురిపించి వెళ్ళి పోతున్నారు. సత్తిగాడి భుజాల మీదనుంచి మేకపిల్ల దిగిన చిరంజీవి స్థిమితంగా మామ్మియ్య దగ్గరకి వెళ్ళాడు.మామ్మియ్య మనుషులని బాగానే గుర్తు పడుతున్నారు.చిరంజీవిని  చూడగానే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూ ” బ్బేయ్ బ్బెయ్ ” అన్నారు. ఎడమ చేత్తో గాల్లో బొమ్మలు గీస్తూ. ఎవరితో నైనా మాట్లాడాలని అనిపిస్తే పాపం మామ్మియ్యకి ” బ్బేయ్ బ్బెయ్ ” అన్న ముక్క ఒక్క మాత్రమే ఓపక్క నోట్లోంచి వస్తోంది.

ఆ ” బ్బేబ్బే”  చిరంజీవికి ” మీ అమ్మమ్మ ఊర్నొంచొచ్చిందా? ” అని అడిగినట్టు అనిపించింది.

” ఇంకా రాలేదు మామ్మియ్యా. మీ ఇంట్లో చోరీ పరిశోధనలో మునిగితేలుతున్న మా రామన్నయ్య, కోలంక బండి పంపడం మరిచి పోయాడు” అన్నాడు.

” బ్బెబ్బే” అన్నారు మామ్మియ్య మళ్ళీ.

” ఇక వచ్చేకా చెబుతాలెండి మరి, నోరడి పోయే ముందు మామ్మియ్య నిన్నే తలుచు కున్నారని ” అని చెప్పి అక్కడ నుంచి వీధిలోకి వచ్చేసాడు. ఆ బే భాష భరించ లేక.

వసారా గదిలో కూర్చున్న, సీతమావయ్య బాధ అంతా ఇంతా కాదు. ఆయన్ని ఓదార్చడం ఎవరి వలనా కాక పోతోంది. వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని ఘొళ్ళుమని ఏడ్చేస్తున్నారు కూడాను. ” బేడ్ వెరీ బేడ్, క్యాషూ గోల్డూ  పోయిందని కాదండీ బాధ. నిక్షేపంలాంటి అత్తయ్యాజ్జీ నోరూ చెయ్యీ పడిపోవడమే సేడ్. అన్యాయం  చేసాడండీ ఆ గాడ్. అప్పటికీ  శివాలయం చుట్టూ ఆరు ప్రదక్షిణలు కూడా చేసాను నిన్న” అంటూ బావురుమంటున్నారు.

ఆయన ఏడుపుచూసి, ఎప్పుడూ ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే , తాతనాన్న కూడా కరిగి నీరై పోతున్నారు.

” ఎప్పుడూ ఎంగిలిచేత్తో కాకినన్నా కొట్టేవోరు కాదు మా కన్నమ్మ. అంతా ఆ బగమంతుడి లీల. ఇలా జరుగుతుందని ముందే తెల్సినట్టు, ఇంకెప్పుడూ చేసి పెట్టలేనని అనుకున్నారో ఏటో! సీతగాడికోసం కజ్జికాయలూ, పోకుండలూ వండి, గోరుమిటీలు పాకంపట్టి, పూచ్చుట్టలు చుట్టించి బిందెల్లో వాసం గట్టుంచారట పాపం. మారిన మా కన్నమ్మ మనస్సన్నా అర్ధం చేసుకోలేపోయావా దేముడా ” అని మామ్మియ్య కాళ్ల దగ్గర కూర్చుని వలవలా ఏడవడం మొదలెట్టారు తాత నాన్న.

ఎడంచేత్తో, ఆయన జుట్టు పట్టుకుకొన్న మామ్మియ్య “బ్బే బ్బే” అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించడం చూసి, అందరి మనస్సూ కలిచి వేసింది.’జుట్టట్టుకున్నారేవిటి ఈవిడ? పాత పగలు కానీ మర్చిపోలేదా?’ ఎందుకన్నా కానీ దూరంగా వుండడం మంచిది. అని అక్కడ్నుంచి లేచి పోయారు తాతనాన్న.

కోడికూతల వేళ, కసరత్తు చెయ్యడం కోసం లేచిన సీతమావయ్య బయటకి వచ్చి చూసే సరికి, వాకిట్లో మూటలు విప్పేసిన చీర పీలికలు చెల్లా చెదురుగా పడున్నాయట.అందులోనూ ఇవాళ సీతమావయ్య చెన్నపట్నం ప్రయాణం కూడానూ. లోపలకి వెళ్ళి చూస్తే ఎప్పుడూ లేంది,  గొళ్ళెం ఊడిపోయిన బోషాణం పెట్టి తలుపు లేపేసి ఉంది.  పాపం మామ్మియ్య మంచం మీద అడ్డ దిడ్డంగా పడుకొని, కాళ్ళూ చేతులూ కొట్టు కుంటున్నారట. వెంటనే వెళ్లి , విషయం చెప్పి మైనర్ మావయ్యని లేపి తీసుకొనివచ్చారు సీతమావయ్య.

ఏ తెల్లవారు జామునో వచ్చుంటారు దొంగలు. ఇంతింత బరువులతో ఎంతో దూరం పోయి ఉండరులే?  పట్టుకొని నరికివేద్దాం. అని ఊళ్ళో వాళ్ళంతా పొలాలకి అడ్డంబడి టేకుతోకలూ , కర్రలూ, కత్తులూ , గొడ్డళ్ళూ,గునపాలూ  పట్టుకొని అణువణువూ గాలించారు.ఎక్కడా ఒక కొత్తమొహం అన్నదే కనపడలేదు ఎవరికీ. ఎలా దాటించేసారో బిందెల కొద్దీ బంగారమూ డబ్బూను.  చిత్రంగా దాటించేసారు.అంతా మాయలా ఉంది. అందరినోటా ఇదే మాట.

పోనీ పోలీస్ ఠాణాకి వెళ్ళి ఫిర్యాధు ఇద్దామంటే, పొద్దుగూకే దాకా రాజులంతా మైనర్ గారింట్లో పేకాట ఆడుతూనే ఉన్నారు. ఆ పోలీసులు ఏమయినా ఇంట్రాగేషనూ, ఇసాకపట్నం అంటే  రాజుల మర్యాదేమైపోవాల? ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో దొంగల్లా మిగల్రూ? ఎవరికి ఎంత రుణమో అంతే. అని సీతమావయ్య సర్ది చెప్పడంతో ఎవరి మట్టుకి వాళ్ళే, బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుని పోలీస్ మాట ఎత్తలేదు ఇంక. చిన్నోడైనా సీతమావయ్య చూపిన పెద్ద మనసుకి ఊళ్ళో రాజుల గుండెలన్నీ గోదారైపోయాయి.

మామ్మయ్యకిలా అవడంతో సీతమావయ్య చెన్నపట్నం ప్రయాణం ఆగి పోయింది. లేకపోతే  ఈ పాటికి సవారీబండి మీద కాకినాడకి కూతవేటు దూరంలో ఉండాల్సింది. మామ్మియ్య సీతమావయ్యకి చెయ్యక చెయ్యక చేసిన ఫలహారం బిందెలు వసారాగదిలో ఆయన మంచంకింద కుదురుగా సర్ది ఉన్నాయి.చిరంజీవికి ఆకలి వేసినట్టు అయ్యి, బిందెలోంచి ఏదో ఒకటి తీసుకుని తిందామనిపించింది.’ కజ్జికాయలొద్దు ఎదవ కొబ్బరినూని కంపు, పోకుండలైతే పంటికి అంటుకుంటాయి అసయ్యంగా. మైసూరు పాకుల గురించి తెలీందేముంది గోడకి మేకులు దిగ్గొట్టు కోవాలంతే వాటితో. మురిపీలు గాడిదగుడ్దుల్లా వంకర టింకరగా ఇంతపొడవుండి అంగిలి కొట్టుకు పోతుంది. అదే పూచ్చుట్టలైతేనా! ఆహా మెత్తగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. నెమ్మదిగా మంచంమీద  కూర్చున్నట్టే కూర్చొని ఎవరూ చూడకుండా వాసం కట్టిన బిందెలోకి చెయ్యి తోసి  దాన్ని అటూ ఇటూ ఆడించాడు. పూచ్చుట్టలు మెత్తగా కాకుండా గట్టిగా తగులుతున్నాయి.

ఇంతలో అది చూసిన   సీతమావయ్య ఖంగారుపడిపోయారు  ” అయ్యయ్యో, ఇదేమన్నా మర్యాదా?మీకు  ”  అని బిందెలని లోపలికి తోసెయ్యడంతో,  దొరికిపోయిన దొంగలా అవమానభారంతో బయట కొచ్చేసేడు చిరంజీవి.

‘ పోనీ వచ్చినోళ్ళందరికీ ఆ ఫలారం తలా ఒకటీ పెట్టి మర్యాద చేద్దామన్నా! ఆ ఇంట్లో ఆడ దిక్కు వుంటేనా? మామ్మియ్యేమో మూలన పడి పోయారాయె. నిన్నటి దాకా ఉన్న నాగమణిని,  మామ్మియ్యే నానా తిట్లు తిట్టి తగిలేసారు.అంతా నా వల్లే. అది వుంటే, అసలు మామ్మియ్యకి ఈ యాతనే లేపోనేమో? ఆడ దిక్కులేని ఇంట్లో, ఏదో చిన్నపిల్లాడు ఆశగా ఓ పూచ్చుట్ట తీసుకుంటే తప్పా? వద్దొద్దనడం, మర్యాదస్థుడైన సీత మావయ్యకి ఏవన్నా మరేదేనా? బిందెలకొద్దీ ఫలారం ఒక్కల్లే తిని అరిగించుకోగల్రా? అయ్యిందేదో అయ్యింది. సీతమావయ్య చెప్పింది కూడా నిజమేలే! ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,  వాళ్ళు పెడితే తినడమే మనకీ ఆళ్ళకీ మర్యాద. సీతమావయ్య మర్యాదస్థులు కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ చెప్పరు. ఒకేళ, తను చేసిన పని నలుగురికీ తెలిత్తే, ఏవన్నా ఉందా! ఎంత అప్రదిష్ట?’ అని  తనలో తనే తెగ మధనపడ్డాడు చిరంజీవి.

మజ్జాన్నం దాకా “అయ్యో అయ్యో ” అని కిందా మీదా పడ్డ అయ్యలూ, అమ్మలూ అంతా ఎవరి దారిన వాళ్ళు నెమ్మదిగా జారుకున్నారు. మధ్య గదిలో మామ్మియ్య, వసారా గదిలో సీత మావయ్యా ఒంటరిగా మిగిలి పోయేరు.’ఎవరికి తప్పినా, మామ్మియ్య బాజ్జత సీతమావయ్యకి తప్పుద్దా ఏవన్నానా?  ఒకేళ ఆయన ఇక్కడ మామ్మియ్యకి, సేవలు చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ప్లీడర్ చదువు  చంకనాకిపోదా? భగమంతుడా, సీతమావయ్యకి ఇన్ని కష్టాలు పెట్టేవేటి తండ్రీ’ అని తనలో తనే నిట్టూర్చాడు చిరంజీవి. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయిన సీతమావయ్య,  మామ్మియ్య దగ్గరికెళ్లి మొహం చూపే సాహసం చెయ్యలేక పోతున్నారు. ఏంచెయ్యాలా? అనాలోచించి,ఆలోచించి ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అలా నాగమ్మ ఇంటివైపు వెళ్ళారు. నాగమ్మని బతిమాలి,బామాలి ఎలాగోలా ఒప్పించి దాన్ని సాయంత్రానికి మామ్మియ్యకి సంరక్షకురాలిగా నియమించారు.

నాగమ్మని చూడగానే మామ్మియ్య మళ్ళీ ‘ బెబ్బే ‘ భాషలో లబోదిబోమన్నారు.

” మీ బాధ నాకు అద్దమైంది లెండయ్యగోరూ, మెల్లిగా  అన్నీ నేను చక్కబెట్టుకుంటాను కదా!”   అంటూ మామ్మియ్యకి కొంత దూరంలో చతికిలబడింది.

“మడిసంటే నాగమ్మే మడిస్రా! తస్సారవ్వలా, మూలన పడ్డోళ్లకి సేవ చేయడానికి ఎంతిత్తే మాత్రం  ఎవరొత్తారు? అదీ సుబ్బారాయుడ్డు గార్లాంటి గయ్యాలయ్య గోరికి సేవ చేనాకి ” అని నాగమ్మని ఒహటే పొగిడేసారు ఊళ్ళో వాళ్ళంతా.

నాల్రోజులు ఇట్టే గడిచి పోయాయి.ఐదో రోజున సీతమావయ్య బట్టల పెట్టెలూ, పుస్తకాల సంచులతోపాటూ సుబ్బారాయ్డుమామ్మియ్య  బిందెల్లో వాసంకట్టుంచిన ఫలహారాలన్నీ, మైనర్ మావయ్య స్వయంగా దగ్గరుండి మరీ సవారీ బండికి ఎక్కించారు.

” అప్పుడప్పుడూ చూసి వెళ్ళండి అన్నయ్యా ” అంటూ మైనర్ మావయ్య చేతులు పట్టుకొని  కన్నీళ్ళతో మామ్మియ్యని అప్పగింతలు పెట్టి,  చెన్నపట్నం వెళ్ళడానికి సవారీ బండెక్కారు సీతమావయ్య.

మధ్య గదిలోంచి, ఇదంతా చూస్తున్న సుబ్బారాయ్డుమామ్మియ్య ” బెబ్బే బెబ్బే ” అంటూ ఎడంచేత్తో బోషాణం పెట్టిని పట్టుకొని, కుడికాలిమీద బలవంతంగా పైకి లేచారు. ఆసరాకి మరోచెయ్యి, అడుగెయ్యడానికి  ఇంకో కాలూ సహకరించక, మామ్మియ్య   అదుపు తప్పి బోర్లా పడిపోవడంతో నుదుటికి పెద్దదెబ్బ తగిలేసింది.అదిచూసిన  మామ్మియ్య వైపు  చుట్టాలూ,  మైనర్ మావయ్యా,  అయ్యో అయ్యో అంటూ లోపలకి పరిగెడుతుంటే…

” నాకు ట్రెయిన్ కి టైం అయిపోతోంది, నన్నెళ్ళొద్దని అత్తయ్యాజ్జీ చెప్పాలనుకుంటున్నారేమో? కాస్త మీరే సర్ది చెప్పండి ” వెనకనుంచే పరిగెత్తేవాళ్ళకి చెప్పి “బండిని పోనియ్యండి” అన్నారు. బూరయ్యతో   సీతమావయ్య.

కనీసం బండన్నా దిగకుండానే, పడిపోయిన మామ్మియ్యని పలకరించకుండానే,  సీతమావయ్య అలా వెళ్ళిపోవడం అరుగు మీద నిలబడి  చూస్తున్న చిరంజీవికి నచ్చలేదు. సీతమావయ్య ఎందుకో మరాద్దప్పేరనిపించింది.

దారి పొడుగునా తెలిసిన వారెవరైనా కనిపిస్తే, బండిని ఆపించి, వారి నుంచి ఎంతో కొంత సానుభూతిని మూటగట్టుకుంటూ, సీతమావయ్య ఊరి పొలిమేరలు దాటారు.అక్కడకి వెళ్ళేసరికి  నెత్తిమీద రేకుపెట్టె, ఓ జబ్బకి  చేతి చిక్కం తగిలించుకొని కోలంకవైపు నడిచి వెళుతున్న ఓ ఆడమనిషి బండి ఆపమంటూ సైగ చేసింది.

” య్యా యేటీ? ” అన్నాడు బూరయ్య బండి ఆపి.

” కూతంత, ఆ కోలంక దగ్గర దింపెయ్యరా అయ్యా.బస్సుకి ఆలీసవైతే రాజమంద్రంలో రెయిలు తప్పోతాది ” బతిమాలింది ఆ ఆడ మనిషి.

“ఎళ్ళెళ్ళు, బాడుగ బండనుకుంట్నావా? రాజుల సవారీబండిది. నీలాటోళ్ళనెక్కించుకుంటే ఆళ్ళ మరేదేమన్నా మిగుల్దా లెగు లెగాసి ” అంటూ విసుక్కున్నాడు బూరయ్య గిత్తలని అదిలిస్తూ.

” ఎవరండీ వారు ? ” అడిగారు సీత మావయ్య బాధనిండిన కళ్ళని తెరవకుండానే.

” మనూరేనండె, బోదిగట్టునుంటది కదండీ నాగమ్మ. దాని కూతురు సరసమ్మండి.  కోలంక దాకొత్తానని లబలబలాడతందండి ”

” అరరే, ఆ నాగమ్మ గారు మనింట్లోనే కదండీ పని చేస్తున్నారు. వారి అమ్మాయిగారా,   పాపం ఎక్కించుకోండి. ఏం పోయింది? ” అన్నారు సీత మావయ్య దయ తలుస్తూ. బండి వెనక నుంచి ముందుకు జరుగుతూ.

గిత్తలు పరుగు వేగం పెంచాయి.

కోలంకలో   సరసని దింపేసిన సీతమావయ్య, కాకినాడ రైల్వే స్టేషన్ దాకా సవారీ బండి మీదవెళ్ళి అక్కడ నుంచి  చెన్నపట్నం  వెళ్ళే రైలు ఎక్కేసారు.

రాజమండ్రి బ్రిడ్జ్ మీదనుంచి చెన్నపట్నం రైలు డబడబమంటూ పోతోంది.

వెళ్తున్న రైల్లోంచి గోదారిని చూడ్దం సీతమావయ్యకి మొదట్నుంచీ సరదా.

ఎప్పట్లాగే అలవాటుగా గోదారిని చూద్దామని, రైలు తలుపు దగ్గరకొచ్చిన సీతమావయ్య అప్పటికే అక్కడ నిలబడి గోదారి అందాన్ని చూస్తున్న  సరసని చూసి ” నువ్విక్కడున్నావా? ” అన్నారు.

పనోళ్ళనీ, పిల్లల్నీ కూడా ‘ అండీ ‘, ‘రండీ’, ‘ ఏవండీ’ అని మర్యాదచేసే సీతమావయ్య  సరసని ‘ నువ్వు ‘ అనడం  చూసివుంటే? చిరంజీవి ఏమనుకునేవాడో? కానీ  అక్కడ లేడు కదా!.

*

మీ మాటలు

 1. suryavamsie says:

  ఒకటో తరగతి పుస్తకం అట్టమీద ‘ అంటరానితనం అమానుషం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ ఎన్నేళ్ల కిందటిమాట? టైం మిషన్లో కూర్చోబెట్టి ఎక్కడికో తీసుకు పోయారు.

 2. ఈ కాశీరాజెక్కడ దొరికాడండీ బాబూ.అరక రెండు కాశీలో వదిలేసి, తగుదునమ్మా అని పేకాటక్కూర్చున్నాడా? నవ్వలేక, నవ్వాపుకోలేక ఈడ్చి తన్నాలనిపించిందీ అయన్ని. మొత్తానికి పగిడీల పడవ, పకపకల పడవ అయి ఫోయింది.

  • కాశీరాజుగారి అసలు సిసలు విన్యాసాలు, ముందు ముందు ఇంకా ఉన్నాయి.

 3. రెడ్డి రామకృష్ణ says:

  పగిడీల పడవ చూడముచ్చటగావుంది.మనసుని ఊయలలూపింది. మరాద్దప్పేరు పదం మాత్రం అర్ధంకాలేదు

  • “మర్యాద తప్పారు” నేను కూడా 2 , 3 సార్లు చదివా ఆ పదం ఏంటా అని 😀

   • జ్యోతిగారు చాలా సంతోషం అండీ. మీరు అనుకున్నది బాగా కరష్టండీ.

  • నరహరి says:

   ’’మర్యాద తప్పారు‘‘ అని అయివుండవచ్చు.

  • మీకు కధ నచ్చినందుకు,మనసు మద్రాసైపోందండి.ఎగువ గోదావరి యాసలో ‘ మర్యాద ‘ ని మరాద, మరేద అంటూ ఉంటారు. ‘ మర్యాద తప్పారు ‘ అనడాన్ని మరాద్దప్పేరు, మరాద్దప్పారు,మరేద్దప్పేరు ఇలా ఎవెరికి నోరు తిరిగినట్టు వాళ్ళంటుంటారు. అందుకే కధలో అక్కడక్కడా ఈ పదాలు వచ్చేయి.

   • రామకృష్ణగారండీ… మీకు కధ నచ్చినందుకు,మనసు మద్రాసైపోందండి. గోదావరి యాసలో ‘ మర్యాద ‘ ని మరాద, మరేద అంటూ ఉంటారు. ‘ మర్యాద తప్పారు ‘ అనడాన్ని మరాద్దప్పేరు, మరాద్దప్పారు,మరేద్దప్పేరు ఇలా ఎవరికి నోరు తిరిగినట్టు వాళ్ళంటుంటారు. అందుకే కధలో అక్కడక్కడా ఈ పదాలు వచ్చేయి.

   • సువర్చల చింతలచెరువు says:

    మరాద్దప్పేరు అని చూడగానే(చదవగానే) నాకర్ధమైందండి. (నేను గుంటూరు జిల్లా అయినప్పటికీ)
    మరియాద భాష .. గోదావరి యాస నాకెంతో ఇష్టం!
    ఇక ఈ కథ సజీవచిత్రమండీ!

 4. Bhaasha , kathanam adbhutham. Pandinchaaru. Raajula logillalo vinabade telugu meekelaa pattubandindi?! Aascharyam kaligindi. It’s a visual treat. You made it huge yet sublime …! All praise to your narrative skills …

  • చాలా సంతోషం సార్. తవరి స్పందన మంచి టానిక్ మాకు.

 5. భలే బాగుంది 👏👏. చిరంజీవి “గారి” తోటి మమ్మల్ని (పాఠకులందర్నీ, గౌరవ వాచకం కాదు ) కూడా పెదలంకంతా పరుగులు పెట్టించారు, కనీసం ఓ పూచ్చుట్టైనా నోట్లో వేసుకోనీకుండా (పూతరేకేనా ?)
  ఈదేసిన గోదారిలా ఇది కూడా ఒక సీరీస్ లా రాయండి, ప్లీజ్.
  కజ్జికాయలు కొబ్బరి నూనెతో చేస్తారా ?

  • మామూలుగా పూతరేకులు పూతరేకులే. వాటిని నెయ్యితో తడిపి, పంచదార పొడుం చల్లి,యాలిక్కాయల గుండ అద్ది పొట్లంలా చుడితే… పూచ్చుట్ట అనబడును.కజ్జికాయల లోపల కొబ్బరి, బెల్లంతో చేసిన ‘ లచ్కోరా ‘ లేదా ‘ లౌజు ‘ అనే పదార్ధం నింపెదరు. నిత్యం తినే వారికి కాస్త మొహం మొత్తడం సహజం.కొండొకచో కొబ్బరి ముదరదైనను… నూనె వాసన వచ్చునేమో.( అయితే కజ్జికాయలు ఇలానే చెయ్యాలని రూలేం లేదు) నువ్వుల చిమ్మిడి (లి),వేరుశనగ పప్పు లతో కూడిన పదార్ధాలని కూడా కొన్ని ప్రాంతాల్లో కూరవచ్చు.ఏదేమైనా అన్నీ నూనె రిలేటెడే అవడంతో కంపు కామనే కదాండీ.

 6. భలేగా ఉందండీ మరేద్దప్పిన సీతమావయ్యగోరి, మరేదలు నేరుసుకుంటున్న సిరంజీవి గోరి కథ.. థాంక్స్..

 7. చానా సంతోషమండయ్యా. మాభలేటోరే తవరూనూ… … ఒక్క సీత మావయ్యేనా? మైనర్ మావయ్య దొంగ మరేదలు మీకు ఆనలేదా? భోజనాలతో మరేద చేసినట్టే చేసి…, వెంకన్న గాడి చేత ఎంత కుట్ర పన్నారాయన?పోయిన ఐదొందలు రికవర్ చేసుకోనీకి.అద్సరేలేండి. కనిపించే పెతి మరేదెనకా కనిపించని ఓ కుట్రుంటదని సిరంజీగోరికి చిన్నప్పుడే తెల్సిపోవడమే ఇప్పుడు పేద్ద పేచీ.

 8. మరాద్దప్పని మీ కథ చాలా బావుందండీ – ఆయ్!

 9. Maryadapperu superb.Reactions&Reflections are also superb.Thanks you all for taking away from routine to aedolokalloki teesukellinanduku.waiting for many more kita kitalu & vatsayaori vetakaralaku.
  Once again thank you all.
  Untanandi aay.
  Mee narsimurthy.

 10. నీవు నేర్పిన విద్యయే… నీరజాక్షా. ఆనందం నర్సిముత్తీ?

మీ మాటలు

*