కొన్ని ముగింపులు

Art: Satya Sufi

Art: Satya Sufi

ఒకానొక ఆమె. పెళ్లయిన ఆమె.

ఆమె సన్నగా ఉంది,లావుగా ఉంది.  లేదూ సమంగానే ఉంది. పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది. కాదూ సగటుగానే ఉంది. నల్లగా, తెల్లగా, చామన చాయలో. మొహం కోల గానూ, గుండ్రంగానూ. ముక్కు మీదో, బుగ్గ మీదో పుట్టుమచ్చా. పొట్టిదో, పొడుగుదో, ఉంగరాలు తిరిగో సాఫీగానో జుట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లర్క్, టీచర్, సేల్స్ గర్ల్, మేనేజర్. లేదూ ఇంటి వద్దనే పిల్లల్ని చూసుకుంటూ చదివిస్తూ.

బస్టాండ్ లో కలిశారు మొదట. రైల్వే ప్లాట్ ఫాం మీద కూడా కావచ్చు. ఎయిర్ పోర్ట్ బయట ఎదురు చూస్తూనో. లేదూ ఆఫీస్ లో. ఏదో పార్టీలోనో, ఎవరో స్నేహితుల ఇంట్లోనో. ఫేస్బుక్ లో కూడా అయి ఉండొచ్చు. అది మొదటి సారీ కాకపోవచ్చు. ఒకప్పటి క్లాస్ మేటో, స్నేహితుడో, టీనేజ్ కాలపు ప్రియుడో మళ్లీ ఇప్పుడు. రోజూ కలిసే తోటి ఉద్యోగో, పొరుగింటి వాడో, అదే వీధి వాడో కూడా.

అప్పుడు అతన్ని చూడగానే ఆత్మీయంగా అనిపించింది. లేదూ మాటల్లో ఎప్పుడో దొర్లిన చిన్న మాటకో. చేతిలోంచి జారిపడ్డ దేన్నో ఒంగి తీసి చేతికిచ్చినప్పుడో. బహుమతి ఏదో కొని ఇచ్చినప్పుడు. అతను పక్కనున్నప్పుడు హాయిగా వీచిన ఆ సాయంత్రపు గాలి వల్ల. నాలుగు చినుకులు పడ్డందుకు. పక్కనుంచి పూల వాసనకి. ఎక్కడినుంచో వినవస్తున్న ఎప్పటిదో యవ్వనకాలపు పాటకి. ఎప్పటివో జ్ఞాపకాలు కదలాడినందుకు. అహితమైనవన్నీ మరిచిపోయేలా చేసినందువల్ల. మొత్తానికి ఒక మాంత్రిక క్షణం. శాశ్వతం అవుతుందనిపించేలా అవాలనిపించేలా.

ముందు సరదాకే కొనసాగిందది. రోజువారీ పనుల మధ్య ఆటవిడుపుగా. కాదూ ఆశపడ్డట్టుగాలేని సంసారం పట్ల అసహనం నుంచి విడుదలగా. చెప్పుకోలేని ఒంటరితనం, ఇరుకూ, ఏవో అసంతృప్తులూ. ఎవరి మీదో చెప్పలేని విసుగూ. భౌతికమైనదో, మానసికమైనదో హింసా. తెలియని వెలితి ఏదో పూడ్చుకోవడానికి. అంతకుమించి ఉద్వేగపూరితమైనదేదీ చేయడానికి లేక. కాదా ఓదార్పుగా ఒక మాట. మెచ్చుకోలుగా ఇంకో మాట. కలిసిన చూపులో, తెలిసినట్టు ఒక నవ్వో. పోగొట్టుకున్న రోజుల్ని అపురూపంగా మళ్ళీ బతుకుతున్నట్టు.

క్రమంగా అది చిలిపి సంభాషణల్లోకి దిగింది. ఒకరి తోడు ఒకరికి నచ్చింది. మాటలే మాటలు. అటు తిరిగీ ఇటు తిరిగీ దాగుడుమూతలాడీ ఎప్పటికో స్పష్టపడింది. ఆకర్షణలోని ఉద్వేగానికి కొట్టుకుపోతూ. రహస్యంగా వెతుక్కునే కళ్ళూ, వేగంగా కొట్టుకునే గుండే, ఒంట్లో కొసలదాకా పరుగులు తీసే నెత్తురూ, తిరిగొచ్చిన యవ్వనపు అలజడీ, ఎడబాటులో అతనిపైనే ధ్యానమూ.

అది ప్రేమో, అటువంటిదేదో అన్న నిర్ణయానికి వచ్చారు. తమ అదృష్టాలను తాము పొగుడుకున్నారు. తర్వాత ఒకరి అదృష్టాన్ని ఒకరు పొగుడుకున్నారు. అంతకంటే ముందే కలవనందుకు చింతించారు. ఉత్తేజపూరితమైన, ఉద్వేగభరితమైన ఆ దినాల్లో ఒకసారి అడిగిందామె. “మన కథ ఎలా ముగియబోతుంది?”

0.చివరికి ఏమీ కాలేదు. మరెందుకూ దారి తీయక మునుపే అతనికి దూరమయ్యింది. కావాలనే. అప్రయత్నంగానో. అతడికి ఇంకొక ఆమె    ఎవరో పరిచయమయ్యారు ఆశ తీరే దగ్గర దారి చూపెడుతూ. ఆమె భర్త ఉద్యోగం మారడంతోటో, వాళ్లు ఇల్లు మారడంతోటో ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్. కాదూ ఆమె పిల్లల చదువు గొడవలో పడిపోయింది. ఏ తెర మీదో, రోడ్డు పక్కనో ప్రేమ ప్రకటించుకుంటున్న జంటని చూసినప్పుడో, మసక చీకట్లో ఎవరో అతనిలా కనిపించినప్పుడో అతను గుర్తొస్తే కొంచెం దిగులు పడి కాసేపు పాత ఏడుపు పాటలు విని. ఏదయినా బాధ కలిగినప్పుడు ఓదార్పు గానో. కొంత అపరాధభావనా. లేదా చేతికందీ జారిపోయినట్టు చింత. లేదూ మళ్లీ అతనెప్పుడూ ఆమెకు గుర్తు రాలేదేమో కూడా.

1.ఏదో అయ్యేలోపే ఆమెకు మరొకతను దగ్గరయ్యాడు. ఆమెని ఇంకాస్త నవ్వించేవాడు. లేక ఎక్కువ సమయమో, డబ్బో ఉన్నవాడు. ఎట్లాగో ఇంకొంచెం మెరుగయిన వాడు. లేదా ఆమె వినాలనుకున్నవే చెప్పేవాడు. కథ మళ్లీ మొదట్నుంచి. ఏదో ఒకటి జరిగి ఇంకోరకంగా ముగిసిందాకా. లేక ఆమెకు విసుగెత్తిందాకానో, వయసు ఉడిగిందాకానో, మరణించిందాకానో. ఏది ముందయితే అప్పటిదాకా.

2.ఒకరోజు పగలో, రాత్రో, రెంటి మధ్యో. అతనితో సెక్స్. చాలా పకడ్బందీ ప్లానింగ్ తోటే. ఒక్కో అడుగూ ముందుకు జరిగో, ఎప్పుడో ఎలాగో అకస్మాత్తుగానో. ఒకసారో కొన్ని సార్లో లేక దాదాపుగానో. బయట ఎక్కడో హారన్ మోత. ఎక్కడో భయం, అంతలో తెగింపు. మధ్యలో పోయిన కరెంట్, ఆగిన ఫాన్. లేక హుమ్మంటూ ఏసీ.  కాక మొదట్లోనో, మధ్యలోనో మనసు మారి తలుపు తీసుకుని పరుగు తీసి ఇంటికి వచ్చి ఏడ్చి స్నానం చేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామన్న ప్రశ్నే రాలేదు. అతన్ని మళ్లీ కలిసింది లేదు. ఎదురుపడ్డా ఒక పొడి హలో చూపు పక్కకి తిప్పుకుంటూ తప్పుకుంటూ. ఏమీ జరగనట్టూ, జరిగిందీ, జరగందీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ. లేదా ఆమెకు గుర్తున్నదల్లా అతని భుజమ్మీద ఎప్పటిదో మచ్చ.

2.1. తప్పు చేసిన భావన ఆమెను నిలవనీయలేదు. భర్త ఏ కొంచెమో ప్రేమ చూపినప్పుడల్లా అది ఎక్కువయ్యేది. చెప్పడమా, మానడమా అని ఊగులాడింది.

2.1.1. ఆమె తన స్నేహితురాలితో చెప్పుకుంది. ఆవిడ ఆమెని తిట్టింది “ఎందుకిలా చేశావు?” ఆవిడకూ ఎటూ తోచక ఒక ఫేస్బుక్ గ్రూప్ మొదలెట్టి అందులో ఇదంతా ఒక కథ అయినట్టు చెప్పి, ఇప్పుడా పాత్ర ఏం చేస్తే బావుంటుందని అడుగుతూ పోస్ట్ చేసింది. లేదా అప్పటికే ఉన్న గ్రూప్ లోనో. చెప్పడం నైతిక ధర్మమని కొందరూ, చెప్పకపోవడం జీవనధర్మమని కొందరూ వాదించుకున్నారు.  శాస్త్రాలనూ, సోషియాలజిస్టులనూ ఉటంకించారు. చివరికి అది కొన్ని చోట్ల విశ్వనాథ, చలం భక్తుల మధ్య జగడంగానూ, కొన్ని చోట్ల మోడీ భక్తుల మధ్యా ద్వేషుల మధ్యా గొడవగానూ పరిణమించింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. తర్వాత 2.1.2. గానీ 2.1.3. గానీ.

2.1.2. ఒక రాత్రి నిద్రపోతున్న భర్తను లేపి చెప్పింది. “నేను తప్పు చేశాను. మీకు ద్రోహం చేశాను.” ఆమె భర్తకి అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పింది. మౌనంగా ఉండిపోయాడు. “ఎలా జరిగిందో తెలియదు. ఏ వాలునీటిలోనో కాళ్ల కింద మట్టి జారి కొట్టుకుపోయినట్టు.” తల వంచుకుని చెప్పింది. లేదా కళ్ల వెంట నీరు. కాకపోతే అంతా వివరిస్తూ ఒక ఉత్తరం.  “ఇట్స్ ఓకే!” కాసేపటికి చెప్పాడు ఆమె చేతి మీద చేయి వేసి.  “నన్ను క్షమిస్తారా?” ఆగి అంది “నన్ను వెళ్లిపోమన్నా అర్థం చేసుకోగలను.” ఆమె భర్త ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించాడు. “ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లగలిగితే..” అనుకుందామె. ఒక్కోసారి మళ్లీ 2.2 కి. లేదా 6 కు.

2.1.3. ఆమె ఎవరితోనూ మనసు విప్పి చెప్పుకోలేదు. చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆ రహస్యాన్ని జీవితాంతం మోస్తూ బతికింది. చనిపోయే ముందు హాస్పిటల్లో చేయి పట్టుకుని మంచం పక్కనే కూచున్న భర్త వంక చూస్తూ నోరు తెరిచింది. “నన్ను క్షమించగలరా?” అంది. లేదా అనాలనుకుంది. అన్నాననుకుంది.

2.2. తర్వాత చాటుమాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. అతనికెక్కడో వేరే ఉద్యోగం వచ్చి తనతో వచ్చేయమని గొడవ. ఆమె భర్తకు ఏదో అనుమానంగానే ఉంది. లేక అనుకోని షాక్. చెప్పిందామె “అయాం సారీ సారీ సారీ. నాది తప్పే కానీ చేయక తప్పదు. నాకోసం. అతని కోసం”  లేదా “తప్పంతా నీదే. నీమూలానే చేయవలసి వస్తూంది ఇలా!” ఏం చేయాలో పాలుపోలేదు ఆమె భర్తకి. లేదా ఎగిరి గంతేశాడు. అది అతని ఎన్నాళ్ల కలో. “పిల్లలో?” అడిగాడు.”ఫర్వాలేదు , మీరే ఉంఛుకోండి,” అంది. “లేదు లేదు, నువ్వే తీసుకుపో!” అన్నాడు. కాదూ పంచుకోవడమో, తనకే కావాలని గొడవో. పిల్లలు ఆమెను ఎప్పుడూ క్షమించలేదు. ఆపైన 7.1 గానీ 7.2 గానీ.

3.కథ మొదలయిన సంగతి ఆమె భర్తకి తెలుసు. అసలు అతనే దోహదపడ్డాడేమో కూడా. ఏదో వ్యసనం. కాదా దురాశ. మొత్తానికి డబ్బు అవసరం. లేదా లైంగిక అసమర్థత. ఆమెకూ తెలుసు అయినా తెలియనట్టు. లేదా తెలియదు. అతనితో సెక్స్, తర్వాత దొంగచాటుగా కలవడం నుంచి అవసరమయినప్పుడల్లా అతను ఇంటికే రావడం అలవాటయింది. ఆమె భర్త చాకచక్యంగా తప్పుకునేవాడు. లేదూ అతనితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే కూచుని కలిసి తాగే దాకా. ఆమె మీద జోకులు వేసి ఆనందించే దాకా. లేదా జోకు అనుకుంటూ ఎత్తిపొడుపు. “నీ ప్రేమ నా మీదా, నా డబ్బు మీదా? అందుకే వల వేశావు గదూ?” ఆమె వినలేదు. లేక విననట్టు నటింఛింది.

4.బట్టల్లేకుండా వాళ్లు కలిసున్నప్పుడు ఫొటో తీశారెవరో. కాదూ వీడియో. అతని ఫ్రండే. లేదా ఆమె భర్త ఫ్రండ్. కాదూ ఎవరో ముఖపరిచయస్తుడు. అనుకోకుండానో, అతని ప్లాన్ లో భాగంగానో. ఆమె ఫోన్ కి ఒక బెదిరింపు మెసేజ్. బ్లాక్ మెయిల్. ఆమె కావాలి, లేదా డబ్బు. అతను తప్పుకున్నాడు. ఆమె బ్లాక్ మెయిలర్కి అడిగిందల్లా ఇచ్చింది. చెప్పినట్టల్లా చేసింది. అయినా ఫొటోలో వీడియోలో బయటపడ్డాయి. చివరికి నెట్కి ఎక్కాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది. లేదా అతన్ని హత్య చేసింది. తప్పుకోకుంటే అతనితో కలిసేనేమో. ఏ కోర్టులోనూ కేసు లేదు. లేదా ఇంకా నడుస్తూంది. ఇద్దరూ జైల్లోనయినా. కాదూ భయపడి 2.1.2.కో.

5.అతనితో సంబంధం కొనసాగుతుండగా ఆమె భర్తకి అనుమానం కలిగింది. కొన్ని గుర్తులు ఆమె ఒంటి మీదో, ఇంట్లోనో. సమయం కాని సమయంలో ఫోన్లో మెసేజ్లు. అడిగితే చెప్పిన సమాధానాలు అతికీ అతకనట్టు. చివరికి ఆమె భయపడిపోయి అతనితో తెగతెంపులు చేసుకుంది. లేదా చుట్టుపక్కల వాళ్ల గుసగుసలు గమనించి బెదిరిపోయో. ఏ సాక్ష్యమూ దొరక్క ఆమె భర్త అనుమానాన్ని మనసులోనే అణుచుకున్నాడు. తన చిన్న కొడుకుని చూసినప్పుడల్లా అది బయటికి వస్తుంది. తమవి కాని పోలికలకోసం వాడి మొహం వంకే చూస్తాడు. అకారణంగా ఆమెపై విసుగు. లేదా వేధింపులు. ఎప్పుడయినా 2.1.2.కి.

6.ఆ రోజెందుకో ఆమె భర్త తొందరగా ఇంటికి వచ్చాడు. ఎందుకో కాదు అనుమానంతోటే. ఇద్దరూ దొరికిపోయారు.

6.1. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని ఒక్క మాటా అనలేదు. ఆమె ప్రయత్నించింది. ఏడ్చీ, బ్రతిమలాడీ. చుట్టాలూ, స్నేహితులూ చెప్పి చూశారు. తర్వాత విడాకులూ, పిల్లల కస్టడీ గొడవా. ఆమె భర్త మాత్రం ఆమెతో మాట్లాడింది లేదు అప్పటినుంచీ. ఆమె అసలు లేనట్టే.

6.2. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని చితకబాదాడు. లేదా అవమానం, దుఃఖంతో కూర్చుండిపోయాడు. ఆమె ఏడుస్తూ క్షమాపణ అడిగింది. తల గోడకేసి కొట్టుకుంది. ఆమె భర్త ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు మరింత దుఃఖం పొంగుకొచ్చింది. తర్వాత వేరే ఇంటికో, ఊరికో మారిపోయారు.

6.2.1. అయినా ఆమె భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.  మనసు తొలిచే ప్రశ్నలు అడక్కుండా ఉండలేకపోయేవాడు. ‘ఎందుకు?’,’ఎన్నాళ్ల నుంచి నడుస్తుంది?’ నుంచి వాళ్ల మధ్య నడిచిన సెక్స్కు సంబంధించిన ప్రశ్నల దాకా. ఒక్కోసారి భోరున ఏడ్చేవాడు. లేదా ఆమెను కొట్టేవాడు. ఏ వాదన జరిగినా చివరికి ‘నిన్ను క్షమించడం నా బుద్ధితక్కువ!’ తో నోరు మూయించేవాడు. ఒక రోజు ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏవో బిళ్లలు మింగో. లేదా జీవచ్ఛవంలా బతికింది.

6.2.2. ఆమె భర్త ఆ సంగతెప్పుడూ ఎత్తలేదు. తిడితేనో, కొడితేనో బాగుండుననుకునేది. అతని మంచితనాన్నీ, కృతజ్ఞతాభారాన్నీ భరించలేకపోయేది. అప్పుడప్పుడూ గొడవ పెట్టుకునేది “మీకు నామీద ప్రేమ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది?” అదే అబ్సెషన్ కావడంతో కొన్నాళ్ల సైకియాట్రీ ట్రీట్మెంట్ తర్వాత విడాకులు తీసుకుంది. లేదా ఉత్తరం రాసి వెళ్లిపోయింది. కాదూ ఆత్మహత్య.

6.2.3. మళ్లీ అతని మొహం చూడకూడదని కచ్చితంగానే అనుకుంది కానీ అతను కనిపించగానే అన్నీ మరిచిపోయింది. లేదా కొన్నాళ్లు అతను మళ్లీ వెనక పడ్డాక. అతనితో సెక్స్ వీలయినప్పుడల్లా సాగిస్తూనే ఉంది. తిరిగి 6 కి.

6.3. ఆమె భర్త కోపం పట్టలేకపోయాడు. కత్తితో వాళ్లిద్దరినీ ఎడాపెడా పొడిచాడు. లేక ఇద్దరిలో ఒక్కరినో. తర్వాత కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తాపీగా కూర్చుని వాళ్లనెందుకెట్లా చంపిందీ వివరంగా చెప్పి లొంగిపోయాడు. లేదా ఆ శవాన్నో శవాలనో ఎక్కడో పూడ్చో కాల్చో మాయం చేశాక తర్వాతెప్పుడో బయటపడి పోలీసులకి దొరికిపోయాడు. లేదూ ఆమె ఆనవాళ్లు ఎప్పటికీ బయటపడలేదు. కాదా ఆమె భర్త కూడా అప్పుడో కొన్నాళ్లకో ఆత్మహత్య చేసుకున్నాడు.

6.4. ఆమెని తిట్టాడు. కొట్టాడేమో. ఆమె అతన్ని కలవడం మానలేదు. భర్త ఆంక్షలూ, వేధింపులూ తట్టుకోలేక అతనితో చెప్పుకుని ఏడ్చింది.  మరో నాడు పట్టుబడినప్పుడు ఇద్దరూ కలిసి ఆమె భర్తని కొట్టో పొడిచో చంపేశారు. లేదా ప్లాను ప్రకారమే ఆమె భర్తని మట్టు పెట్టారు. తాడుతోనో, దిండుతోనో, విషంతోనో. కాదూ అతను తన స్నేహితులతో కలిసి ఆమె భర్తకు మద్యం తాగించి ఊరవతలకి తీసుకెళ్లి. లేక ఏ కారుతోనో గుద్ది. చివరికి పోలీసులకి చిక్కారు. లేదు.

7.”నీకో విషయం చెప్పాలి” అన్నాడు ఆమె భర్త ఒక రోజు. లేక ఆమే అంది. “ఏమిటి?” “నాకు విడాకులు కావాలి.” “అవునా? నేనూ అదే చెప్దామనుకున్నాను.” “అవునా? నేను ఇంకొకరితో ప్రేమలో.. ఎలా చెప్పాలో తెలియలేదు.” “నేనూ..” ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ఒకరి పుట్టినరోజుకొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

7.1. ఆమె విడాకులు తీసుకుంది కానీ అతను తీసుకోలేదు. ఏవో సాకులు. పిల్లల చదువులనో వాళ్ల ఆవిడ ఆరోగ్యం బాలేదనో. అసలు పెళ్లి చేసుకుందామని తను అనలేదనీ, ఊరికే సరదాకన్నాననీ బుకాయింపు. లేదా మొహం చాటు చేసుకుని తిరగడం. కొన్నాళ్లు ఎదురు చూసి ఒక రోజు వాళ్లింటికే వెళ్ళి తిట్టి వచ్చింది. అతని భార్య ఎదురుగానే.

7.1.1. మళ్లీ అతను ఆమె వద్దకి వస్తూనే ఉన్నాడు. ఆమె అతనికి రెండో సెటప్ అని అనుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్లు. రెండో భార్యగా మిగిలిపోయేనేమిటని దిగులు పడి అతనితో గొడవపెట్టుకుంటుంది అప్పుడప్పుడూ. ఆమె జీతమూ, ఉంటే ఆస్తీ కాజేసుతున్నందుకేమో కూడా. తీసుకెళ్లి భార్యకో, పిల్లలకో పెడుతున్నందుకు కూడా.

7.2. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. లేదా కలిసి బతకడం మొదలెట్టారు. ముందెన్నడూ లేనంత ఆహ్లాదంగా గడిచింది ప్రతి దినమూ. అతన్ని ముద్దు పెట్టుకుంటూ “మనుషులు ఇంత హాయిగా బతుకుతారని నాకు ఇప్పటిదాకా తెలియలేదు” అందామె. లేక అటువంటిదేదో.

7.2.1. మళ్లీ అదే మొనాటనీ. అసంతృప్తి. భర్త మారేడు కానీ అచ్చు ముందులాగే జీవిస్తున్నట్టు. ఒకరోజు ఇంకో అతను కలిశాడు. అదృష్టవశాత్తూ. లేదా దురదృష్టవశాత్తూ. కథ మళ్లీ మొదటికి.

7.2.2. ఒక రోజు ఆమెకి అతని జేబులో పూల రుమాలు దొరికింది. అచ్చు తన రుమాలు ఒకనాడు అతను జేబులో పెట్టుకుని మర్చిపోయి అప్పటి వాళ్లావిడకి దొరికినట్టే. లేదా అలవాటు లేని సెంట్. అడిగితే ఏదో నమ్మలేని బదులేదో చెప్పాడు. “నన్నే అనుమానిస్తున్నావా,” అంటూ బాధపడ్డాడు. దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమా లేక అతన్ని వదిలేయడమా అని ఆలోచిస్తూంది.

ఎన్+1. ___________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________.

ఎగ్జిట్ 1. ఆమె మరణించింది. సమయం తీసుకునో హఠాత్తుగానో. ఏదో కేన్సర్ వంటి తగ్గని జబ్బు. కాదా యాక్సిడెంట్. బస్ బోల్తా, పట్టాలు తప్పిన రైలు, వర్షంలో డ్రయినేజ్ హోల్.  లేదా ఎప్పుడయినా ఒక క్లిక్తోనో,కరెంట్ పోయో. లేదా బ్యాటరీ అయిపోయి.

ఎగ్జిట్ 2. ఉల్కాపాతం. లేదా మూడో ప్రపంచ యుద్ధం. మొత్తానికి మహా విలయం. మానవజాతి సమస్తం నశిస్తుంది. మిగతా ముగింపుల్నీ, వాటిని పట్టించుకునేవాళ్లనూ, ఏదీ పట్టని వాళ్లనూ మింగేస్తూ. అంతా అసంబధ్దంగా మిగిలిపోతుంది. మిగలదు.

—-చంద్ర కన్నెగంటి

 

మీ మాటలు

 1. హ్మ్మ్..గుడ్ వన్. కథేనా అంటే ఏమో! కథేనేమో! ఏమైతేనేం బాగుంది.

 2. గోర్ల says:

  బలే ఉంది. లైఫ్ ను ఎంత బాగా చెప్పారు. చెప్పిన తీరు చాలా బాగా ఉంది. ముగింపు అదుర్స్.

 3. అయితే ఈ ఫ్లో చార్ట్ తో నా లాంటి కథలు వ్రాయలేని వారు కూడా వ్రాసేయచ్చన్నమాట . నిజమే . మధ్య లో మోడీ భక్తులు కూడా వచ్చేస్తారు. అన్నిటికి మేమున్నాం అంటూ . చాలా బావుంది

 4. రాఘవ says:

  ఎలా ఉన్నట్టూ….? ఇది ఏమిటైనట్టు..?

 5. నరహరి says:

  ఇంకా కొన్ని నంబర్లు మిగిలాయేమో!

  ఆమె, భర్త, ప్రియుడు కలసి పరస్పర అవగాహనతో, పరిణిత మనస్కులై ఒకే ఇంటిలో హాయిగా బ్రతకడం మొదలుపెట్టారు. సమాజం కూడా ఆ సంబంధాన్ని కూడా అంగీకరించేసింది. ( ఒక మాజీ ప్రధాని లాగా)

  ఆమె, ప్రియుడు, ప్రియుని భార్య పరస్పర అవగాహనతో, పరిణిత మనస్కులై ఒకే ఇంటిలో హాయిగా బ్రతకడం మొదలు పెట్టారు.

  ఆమె అతడిని విడచి ప్రియుడితో హాయిగా బ్రతకసాగింది. ఆమె భర్త ఆ ప్రియుని భార్యతో హాయిగా బ్రతకసాగేడు.

  మోఢీ భక్తుల్లాగే మోఢీ ఫోబియావున్నవాళ్ళు కూడా ప్రతిదానిలో తలదూర్చడాన్ని మన గమనించవలసివుంటుంది. ఎందుకంటే మనం గురివింద గింజలం కాము గనుక.

 6. ఎ.కె.ప్రభాకర్ says:

  హబ్బ ! వొక్క సారే ప్రేమ క్రైం సస్పెన్స్ అసంబద్ధ అస్తిత్వ వాద ఆధునికోత్తర ….ఇత్యాది ఇన్ని వందల కథలు లేదా వేల కథలు లేదా అన్నీ కలిసి వొకే కథ అదీకాకుంటే అసలు కథ కాని కథ పోనీ కథలాంటి కథ … ఇంకా ఏదన్నా ఏదీ కానిదన్నా చదివిన ఆనందమో ఆశ్చర్యమో అనుభూతో కాకుంటే ‘ఇ’ తో లేదా ‘ఉ’ తోనో మొదలయ్యే మరొకటో కలిగాయి కలగలేదు కలిగాయనుకొన్నా అందుకు అభినందనలు అందుకుంటే అందుకోండి లేపోతే లేదు చంద్ర గారూ మీకిష్టమైనా కాకపోయినా

 7. అసలు (నిజంగా జరిగే, మీకు నచ్చని, ఎవరూ ఎదురు చూడని) ఎగ్జిటు: (ఇద్దరి కోసం ప్రపంచం ఎప్పుడూ నాశనం అయ్యే పరిస్థితి ఎప్పుడు రాదు కనక)

  7.2.3. అలా ఆలోచిస్తూంటే పట్టిన నిద్రలో ఆమె ఎక్కడికో వెళ్ళిపోతోంది. చాలా దూరం వెళ్ళాక రైలు ఆగింది. మెలుకువ వచ్చి చూస్తే చుట్టూ చీకటి. మరో నాలుగంటలు తర్వాత ఎవరో లేపారు. “లేయే ఇలా పడుకుంటే డబ్బులెక్కణ్ణిచొస్తాయేటి?” అంటూ.

  7.2.4. ఆ రోజు తెల్సిందేమిటంటే – తాను గుడ్డిగా నమ్మి అతనికి ఒక వీక్ మూమెంట్లో లొంగిపోయిన తను ఇప్పుడు రోజులో అనేకసార్లు డబ్బిచ్చి సుఖం కొనుక్కునే మారాజులందరికీ వీక్ గా లొంగవల్సిన పరిస్థితి

  7.2.5 ఆరేళ్ళు గడిచాక బొంబాయి నగరంలో రోడ్డుమీద పడి ఉంటే ఎవరో ఎంగిలాకు మీద విసిరారు. వంట్లో ఉన్న సుఖరోగాలతో పుచ్చిపోయిన శరీరం ఆఖరికి ఎంగిలాకుని కూడా ఎత్తలేక అలాగే అచేతనంగా ఉండిపోయింది.

  8. ఎవరో ఎలాగో ఏదో చేసి మొత్తమ్మీద శవ దహనం అయ్యేక అప్పటికి బాగా ముసలాడైపోయిన భర్తకీ పెద్దవాళ్లైన పిల్లలకీ ఆమె చనిపోయినట్టు వార్త చేరేసారు.

  8.1. “అది ఎప్పుడైతే ఇక్కడ్నుంచి పోయిందో అప్పుడే చచ్చినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ చావడం దేనికీ” అని వాలు కుర్చీలో పేపరు చదూకునే భర్త అంటే, పేసుబుక్కులోనూ, వాట్సాప్ మీదా, ఫోనుమీదా మెసేజ్ పంపించుకునే పిల్లలకి ఆ మాట వినపడనే లేదు.

  9. అమె మళ్ళీ పుట్టింది. ఈ సారీ ఆడపిల్లలాగానే. పునరపి మరణం, పునరపి జననం.

  [రచయితకి – తెలుగు సినిమాలు ఈ మద్దెన చూడ్డం మానాసారేటి గురూ గారు? మళ్ళీ మొదలెట్టండి. కత పైనల్ కొచ్చేపాటికి ఎలా సెట్టవ్వాలో మన డైరట్టర్లు చెప్తారు. ముగింపు వచ్చేసరికి మొత్తం అందరూ కనిపించాల బొమ్మ మీద. ఆ మాత్రం తెల్వద్? అసలు “కొన్ని ముగింపు” లేటి? ఉన్నదొక్కటే ముగింపు!]

 8. అవినేని భాస్కర్ says:

  వండర్ఫుల్!

 9. S. Narayanaswamy says:

  Brilliant Chandra !!

 10. Sathyavathi says:

  Baagumdi

 11. sivakumar tadikonda says:

  భార్య, భర్త, ఇంకొకతను – తెలుగులో వఛ్చిన కథల సారాన్ని సమగ్రంగా వడబోచిన ఫ్లోచార్ట్ – రమేషు గారు అందించిన కొనసాగింపుతో కలిపి. ఎందుకు అన్నది ఫ్లోచార్ట్ కు ముందే ఉంది. తరువాత ఏమవుతుందన్నదో లబ్ధప్రతిష్ఠ, వర్తమాన, వర్ధమాన రచయితలూ, రచయిత్రులు ఈ ఫ్లోచార్ట్ ని ఉపయోగించుకుని ముందుకు కొనసాగగలగడానికి ఇది (కథ కాదు) దిక్సూచి.

మీ మాటలు

*