ఇక్కడ గొంతులు నొక్కబడును

డేవిడ్ కథకు పాఠాంతర పరామర్శ

ఆకాశంలా ఆవరించిన అనుభవంలో అరూప్యమైన మబ్బు తునకల వంటివి కదా జ్ఞాపకాలు. ఎగుడుదిగుడు అంతరంగంలో ఒకే జ్ఞాపకంగా కుదురుకున్న అనేకానేక సంఘటనల, సన్నివేశాల సమాహార బిందుసందోహాన్ని కలిపి గీసే contour line వంటి కథ ఎలా ఉంటుంది? మబ్బుపింజకి జరీ అంచులా మెరిసే కిరణపు అనాకృతిని పోలి ఉంటుందే తప్ప నిర్దిష్టంగా ఉండదు, ఉండాల్సిన అగత్యం లేదు. కానీ, అడ్డూఅదుపూ లేని, మొదలు- తుది ఉండనక్కర్లేని అటువంటి అపురూపమైన వంకర్ల పరివృత్తంగా కొనసాగుతున్న రచనని చప్పున ఒద్దికైన సరళరేఖగా వొంచిన తొట్రుబాటుకి, తొందరపాటుకీ తాజా ఉదాహరణ మన్నం సింధుమాధురి ‘డేవిడ్’!

ఆకతాయి అంగలతో టీనేజీ లోగిళ్ళు దాటుతున్నప్పుడు తోడైన చెంబుగాడు, యవ్వనారంభంలో వయసుపొదల మాటున ఎన్నో దైహిక రహస్యాలు దారికాసిన వైనాన్ని గుర్తుచేశాడు. నిజానికి ఆ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేంత ఆరితేరిన ఆగడీడు కాడు, చెబుతున్నట్టే తెలుసుకున్న ఆరిందగాడు.  తుంగభద్ర ఒడ్డున, హంపీ ఒడిలో చెట్టూ చేమా గుట్టా పుట్టా…. అన్నింటినీ తమ తూరుపూ- పడమరలంత దూరాల్ని రద్దు చేసేకుకొని మరీ ఆటాపాటా చేసుకున్న చిన్నారి నేస్తులు, ఆపై ఈడొచ్చిన పిల్ల ప్రేమికుల ఈ కథని ఒక సారాంశంగా రెండుమూడు వాక్యాల్లోకి కుదించుకొని చెప్పుకుంటే ఏముంటుంది విశేషం? కేవలం story for story sake గా, బండ్లకెత్తబడుతున్న అనేకానేక కథలకి మరో చేర్పు వంటి కథే అయినట్టైతే: నూనూగు ప్రాయల అమలిన ప్రణయం- విలనై విడదీసే విధి- చివర్లో శుభం కార్డుకు ముందు పునస్సమాగమం- అని మూడు ముక్కల్లో తేల్చేయొచ్చు! అలాంటప్పుడు దీనికి కథానాయకుడు లక్కవరప్పాడు, లేదా లక్నో, కాదంటే ఇలా లండన్- ఎక్కడి వాడైతేనేం?  కానీ, చిన్నదో… పెద్దదో – అదనుకొక అనుభవంగా, దిగంతాలే హద్దులుగా చెలరేగిపోయిన, విశృంఖల వాక్యాలుగా వెదజల్లుకుపోయిన కథనం కదా – ‘డేవిడ్’ అనే ఈ కథకి ప్రాణం… ప్రణవం! ఐతే, మొదట్లోనే ఆరోపించినట్టు- స్ఖలిత బ్రహ్మచారి డేవిడ్ virginityకి సంప్రదాయక మురిపెంతో నాయిక ఎసరుపెట్టడం ద్వారా ఉన్నట్టుండి కథ ఒక ఒద్దికైన సాదాసీదా ముగింపుకి చేరుకొని చదువరిని కుదేసింది. ఆత్మగతమైన ‘memoir’ని depersonalize చేసి ‘కథ’గా విశ్వజనీనం చేయడం, అన్యానుభవాన్ని కూడా సహానుభూతితో ‘స్మృతిరచన’గా సొంతం చేసుకొవడం- అనే రెండు భిన్నమైన genresకి ఒక మేలైన సంయోగంగా నడిచిన ఈ రచనని చిట్టచివర్లో రచయిత్రి తేల్చేశారన్నదే నా ప్రధాన అభియోగం.

(అసలు నా అభియోగంతోనే సమ్మతి లేనప్పుడు, ఇక ముందు నేను చేయబోయే వాదనలు పట్టించుకోనక్కర్లేదు, ఈ వాక్యాన్ని దాటి బహుశా చదివే శ్రమ తీసుకో పన్లేదు)

**           **           **

art: satya sufi

art: satya sufi

ఆదిమధ్యాంతరాలతో ఒక ఎత్తుగడలాగా, పతాక ఘట్టం ఒక పకడ్బందీ స్కెచ్ మాదిరిగా కథ ఉండవల్సిన పన్లేదని నవతరం కథకుల రచనలు  ప్రపంచ కథా సాహిత్యవీధుల్లో భాషాతీతంగా ఎప్పటినుంచో చాటి చెబుతున్న విషయం రచయిత్రి సింధు మాధురికి తెలియకే తన కథని ఒక సుఖాంత సీమలకి నడిపించారా? ప్రశ్నలా కనిపించే ముందు వాక్యానికి అవునో… కాదో రచయితకి బదులుగా- అభియోగాలు మోపి, ప్రశ్నలు సంధించిన నేనే వివరణ ఇవ్వడం హాస్యాస్పదం, అసంబద్ధం కావొచ్చు. నేనిక్కడ ఇవ్వబోయే వివరణ కథ తాలూకూ వాచకపు హద్దులు మీరి, text కు మాత్రమే పరిమితం అయ్యే (అవ్వడానికి మాత్రమే తయారుగా ఉన్న) పాఠకుడి హక్కుని కాలరాయడం వంటిది; పాఠకుడి కట్టెదురున ఉన్న  వాచకాన్ని దాటి పిల్లిమొగ్గలేసి, పాఠాంతరమైన మరేవో అసందర్భ అంశాల్ని అతని ముందుకు లాకొచ్చి ప్రదర్శించే దాష్టికంలాంటిది. ఇదంతా తెలిసి కూడా, ‘డేవిడ్’ అనే రచనకి సంబంధించిన వాచకానికి పరిమితం కాకుండా, ‘రచయిత – సింధుమాధురి (అక్షరంతో మాత్రమే)తో నాకు పరిచయం ఉంద’న్న సంజాయిషీ వంటి సాకులే పునాదిగా నా ఈ వాదన అనే మట్టిగోడని నిలబెట్టదల్చుకున్నాను.

**           **           **

‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా…’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు 35 ఏళ్ల క్రితం రాసిన ముందుమాటలో. ‘బైటపడిపోతామేమో అన్న భయం’ ఒక్క పాలగుమ్మినే కాదు, మొత్తం ఆధునిక తెలుగు సాహితీకారులందరినీ పట్టిపీడించింది. ఇంకా ఆశ్చర్యమేమంటే, సాహిత్యం- జీవితం అనేది అసలు ద్వంద్వమే కాదని తన యావజ్జీవితాన్ని రుజువుగా నిలిపి చూపిన చలం గారి తర్వాత యుగం యావత్తూ ఆ భయానికే బద్ధులై ఉండటం.

ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు. Lyotardని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆవాహన చేసుకొని తెలుగులో నామిని సుబ్రమణ్య నాయుడు వంటి రచయితలు గొప్ప సాహిత్యాన్ని కల్పించారు. అంతకు ముందటి తరాన్ని పీడించిన ‘బైటపడిపోతామేమో అన్న భయాన్ని’ మొదలంటా పెకలించి పడేసి, తామే హీరోలైన తమ రచనల్లో సన్నివేశాలకి, సందర్భాలకి, పాత్రలకీ కాస్తంత దూరంగా వుండడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ తరహా రచయితల తరం ఫోకస్ చేసిన అంశం ‘పేదరికం’. ప్రతిభావంతంగా చెప్పినా, తమ తమ మాండలికాల్లో చెప్పినా, చాప్లిన్ హాస్యంలా నవ్వించి గిల్లినట్టు చెప్పినా – తమ nostalgiaలో ప్రాధానంగా రాజ్యమేలింది ‘పేదరికమే’నని చిత్రించారు. వారి వారి కుల, ఉపకుల, మత, ప్రాంత, సామాజిక సాంస్కృతిక నేపథ్యాల భిన్నత్వం ఆ రచనల్లో కదలాడినా, స్థూలంగా చూస్తే అన్నీ మూసపోసినట్టై, ఆ లేమికి చెమర్చకపోతే, లేదా ఆ బీదతనాన్ని చూసి బిక్కపోకపోతే ఎక్కడ అగ్ర కుల.. మత దురహంకారమని ముద్రలేస్తారోనని భయంతో చదువరులు మూకుమ్మడిగా సంఘీభావాలు ప్రకటించేలా తయారయ్యాయి. దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.

అదే స్వకీయ, స్థానికీయ కథనాల ఆధునికోత్తర వాతావరణం ఇచ్చిన దన్నుతో వచ్చినట్టే కనబడిన సింధుమాధురి తాలూకూ ప్రపంచం మానసికంగా, భౌతికంగా భౌగోళికంగా కూడా పెద్దది కావడమే విశేషంగా, ఆమె ప్రత్యేకత గానూ గుర్తించాలి. అంటే, పైన చెప్పిన, monotonous మంద నుంచి వేరై uniqueగా నిలిచిన సింధు మాధురి అనే ఈ రచయిత్రి దేశదేశాలూ తిరిగారా? తన కథలన్నీ ఆమె స్వానుభవాలా? – వంటి వ్యక్తిగతమైన ప్రశ్నలకి అనేకానేక ఆమె పాఠకుల్లో ఒకడిగా నాకూ సమాధానాలు తెలియవు. ఒకవేళ తెలిసిన వారెవరి వకాల్తా అయినా, పాఠకులుగా మనం వినవల్సిన అగత్యం లేదు. కానీ, గతంలో ప్రచురించబడిన కథల ఆధారంగా hypothesis వంటి కొన్ని తీర్మానాలు చేసుకోవడం ఏమంత పెద్ద పాఠాంతర దోషం కాదనుకుంటాను.

అటువంటి hypothesis ఆధారంగానే, డేవిడ్ కథలో నీరసపడిన ఉపసంహారానికి కారణాలు ఊహిస్తున్నాను:  ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో నాలుగేళ్ల క్రితం ‘కలాపి ‘ అనే కథ రాశారు సింధు మాధురి. ఐదారు పెళ్లిళ్లు చేసుకున్న ఓ polyandrous స్నేహితురాలి జీవితచిత్రాన్ని కథగా ప్రతిభావంతంగా చిత్రించారామె ఆ కథలో. అది ఆ తర్వాత వివాదాలకు దారితీయడం వేరే వ్యవహారం. కానీ, అంతకు ముందే, ఆ కథ ప్రచురించినప్పుడు దాని illustration గా protagonist రూపాన్ని నేరేటర్ సింధు మాధురి (ఫొటో ఆధారంగా ) పోలికలతో portrait గా గీశాడు ఆంధ్రజ్యోతి (మగ) ఆర్టిస్టు. ‘కలాపి’ అనే ప్రొతాగనిస్టుకి సింధు మాధురి అనే రచయిత బొమ్మ వేయడం తెలియకో, పొరబాటునో, యథాలాపంగానో జరిగింది కాదు. అటువంటి బరితెగింపుల కథానాయికగా రచయిత్రినే చేయడం వెనక సగటు మగవాడికి ఉండే photo morphing syndrome వంటిదే పనిచేసింది. ఇటీవల వచ్చిన ‘పింక్’ సినిమా పరిభాషలో చెప్పాలంటే, మగవాళ్ల రూల్ బుక్కులో అటువంటి లైంగికాంశాలు రాసే ఆడవాళ్లు ‘కొంచెం లూజు’, ఈజీగానే ‘పడతారు’!

రచన అంటేనే- అనలవేదిక ముందు అస్రనైవేద్యం; సింధు మాధురిలా లోనుంచి పెకలించుకు వచ్చే అనుభవాలను అక్షరబద్ధం చేసే రచయితల విషయంలో అయితే మరీనూ. జ్వాలా సౌందర్యాన్ని గాఢంగా కోరి, ఆ కాంతిలో ఐచ్ఛికంగా కాలి, దీపం సెమ్మ నీడలో రెక్కలు రాలిపడినా ఉపశమించని ఉసిళ్ళ మోహావేశం వంటి అనలాక్షరాపేక్ష ఉన్న ఇటువంటి రచయితలకు, అందులో ఆడవారైన పాపానికి రకరకాల రూపాల్లో, వేషాల్లో వేధింపులు ప్రతిఫలంగా ఎదురౌతుంటే ఏమవుతుంది? అక్షరానికి దాపరికం అవసరపడుతుంది, ముసుగుల పనిబడుతుంది, చివరికి సత్యాన్వేషణకి హిపోక్రసీ అడ్డుపడుతుంది.

‘… బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉండే అనుభవాన్ని ఇద్దరం కలిసి చూద్దామ’ని బరితెగించి అడిగిన నెరజాణ సొంత కథే ఇది అనిపిస్తే అంటగట్టబడే vulnerabilities అన్నింటికీ వెరసి, కథతో తగుమాత్రం దూరాలు పాటించడానికే, బహుశా సింధు మాధురి ‘డేవిడ్’ కథకి నప్పనిదే అయినా, ఒక నాటకీయమైన ముగింపు ఇచ్చారని నా ఊహ. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్యంలో(భారతీయ, ప్రపంచ సాహిత్యంల్లో కూడా కావొచ్చు) వినిపిస్తున్న స్త్రీ స్వరాలు- అయితే పురుషులవీ, లేకుంటే, యుగాల పురుషాధిక్య దౌర్జన్యం మీద reactionary గా పుట్టుకొచ్చిన ‘పెడసరి’ ‘గయ్యాళి’ స్త్రీవాదులవీనూ. ఎక్కడైనా అరుదుగా ఇప్పుడిప్పుడే సహజంగా వికసిస్తున్న, వినిపిస్తున్న గొంతుకల్ని కూడా నొక్కేసే దౌర్జన్యం పలు రూపాల్లో కొనసాగితే మిగిలేవి ముసుగులు, ముసురులే.

–నరేష్ నున్నా

డేవిడ్ కథను ఇక్కడ చదవొచ్చు.

మీ మాటలు

 1. Mythili Abbaraju says:

  ఊహూ. ‘కల్పన లో ఊహించిన హొయలు ‘ లోనూ మనకు మనం ఒప్పుకోగల అస్థిమితత్వాలే కావలె.
  ఆ రంగు చీరకి ఈ అంచే కావాలి, ఎందుకు లేదూ….

 2. Dr.posani srinivas says:

  ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు.

  I don’t understand how relevant Mr Lyotard’s take on Narrative is relevant here. Writer of this comment, for the sake of readers defined “petits recits” in Telugu. But at the same time confused some like me by putting meta-narrative in parenthesis immediately after “ petits recits”.

  To me it looked as if the commentator was suggesting that they both or synonymous. In fact they are opposite to one another. “ petits recits” is micro rather than an Grand, what meta stands for.

  Interesting facts here is Mr Lyotard himself repented about his opinion on death of meta narrative. He said that his book “ The Postmodern Condition” is “ a parody”, “simply worst book”. He admitted he has “ made stories up” with “ less than limited “ knowledge of science. Ironically the term and ideology put forward in that book influenced many. Interpretations are many as well. People understood what they felt like blind interpreting elephant based on what they touched, whether it is trunk or tail or feet.

  He didn’t say goodbye to meta-narrative. He simply said people are incredulous towards all-encompassing explanations, theories, solutions. He just observed what had happened and happening rather than what should happen.

  Meta Narrative is still alive and it will live in future as long as human race desire a comprehensive, sequential, organized explanation of the problem and predictably unpredictable solution to it. Saying this, “petits recits” exists even before modern era, not just a postmodern phenomena.

  దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.

  Anything that is repeated becomes monotonous. Fault just doesn’t lie with writer. Reader’s restlessness over predictability also play an equal role. Shock and excitement are not meant to be routine.

 3. Naresh Nunna says:

  @ Dr. Posani Srinivas Garu
  1. “In fact they are opposite to one another. “ petits recits” is micro rather than an Grand, what meta stands for.”
  Yes sir. I must thank Dr Posani for correcting me. My intention was to refer to micro- narratives. Instead, I wrote meta-narratives ; It was a typo!
  2. “Interesting facts here is Mr Lyotard himself repented about his opinion on death of meta narrative”
  I merely committed Lyotord’s essence to my memory, as I had gone through his ‘The Postmodern Condition’ long ago. Revelation to me here is Lyotard’s repentance on his opinion.
  I swear that I am not devoted to careless name-dropping. But, it seems, the mistakes both typological and factual in my above article in quoting Lyotard or someone else, is brazenly dispersing the facts of my indiscipline and non- academic reading without the faintest hint of modesty. I am also apologetic for it.
  మహాకథనాలకు వీడ్కోలు పలికి, స్వకీయ, స్థానిక కథనాలను స్వాగతించిన ఆధునికోత్తర పరిణామం తెలుగు సాహిత్యానికి చేసిన మేలు- కీడు గురించి చెప్పడం నా ఉద్దేశం. భూగోళంలో ఎంత మూలన, ఎంత చిన్న, అప్రధానమైన ఊరు, వాడ, కూటమి, సమూహపు కథనైనా విశ్వ వివేకానికి appeal చేసుకోవచ్చుననే భరోసా, అల్పమైనదిగా తోస్తున్న దానిలో అనల్పాన్ని దర్శించవచ్చుననే తెలివిడి – ఏ కారణాలతో, ఏఏ అధ్యయన ఫలితాలతో మన తెలుగు సాహిత్య సీమలకు బట్వాడా అయినప్పటికీ, అది ఎందరో రచయితల పుట్టుకకీ, ఎన్నో సంస్కృతుల ఆవిష్కరణకీ దారి తీసింది. The writers of this understanding, started perceiving the art – not in broad strokes, big pictures- grand narratives; but in the minute scrutiny of the seemingly mundane. అటువంటి పరంపరలో మొలకెత్తి, కుదుళ్లు అక్కడే ఉన్నా, ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న వృక్షమే సింధు మాధురి అని నా పరిశీలన. Thus, I felt Lyotard is relevant to the context.
  ————-
  @ Dr. Mythili Abbaraju garu
  ” ఊహూ. ‘కల్పన లో ఊహించిన హొయలు ‘ లోనూ మనకు మనం ఒప్పుకోగల అస్థిమితత్వాలే కావలె.
  ఆ రంగు చీరకి ఈ అంచే కావాలి, ఎందుకు లేదూ…. ”
  మీ profound, subtle comment కొంచెం elaborate గా ఉంటే బాగుండేదండీ (మీ సహజ ధోరణిలో పెట్టిన కామెంట్ కూడా ‘ఎందుకొచ్చిందిలెమ్మన్న ‘ ధోరణిలో delete చేయరని ఆశిస్తూ :-) )

  • Mythili Abbaraju says:

   నరేష్ గారూ , సూత్రకారులదీ పీఠాసీనులదీ కర్తవ్యమవునేమో విపులీకరణ , నాది కాదు :)

   చనువు కొలదీ స్పల్పపు చాపల్యమిలాగ , చాలా కొలది సార్లు.
   ( ఇక్కడి వ్యాఖ్యలతొలగింపు కు నేను అశక్తురాలిని అని మనవి :) )

మీ మాటలు

*