ప్రధానమంత్రికి ప్రేమలేఖ!

 

images

ప్రధాన మంత్రి మోడీగారికి-

అయ్యా.. మీరు తీసుకున్న చర్య బహు బాగున్నది. మీ లాంటి ఉత్తములు ప్రధాన మంత్రి కావడం మాలాంటి నిజాయితీ పరులకు ఊతమిస్తోంది. ఊపిరి పోస్తోంది. సరిగ్గా ఆలోచించేవాళ్ళు వున్నారు సార్.. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్ళు వున్నారు సార్.. అందుకే మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, (మన వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ తెలీకుండా మాట్లాడుతున్నారు) అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చెయ్యండి.. ఏం ఫరవాలేదు. ఇలాగే నాల్రోజులు గోలగోల చేసి అలిసిపోయి ఆగిపోతారు. అలవాటైపోతారు. కాని సార్.. ముందుగా ముఖ్యంగా చెప్పేది.. ఆ కోర్టుల నోళ్ళు మూయించండి సార్.. ఏ దేశంలోనయినా న్యాయం ఆరాజ్య ఆకాంక్షలకు లోబడి కట్టుబడి వుండాలి కదా

సార్.. మన సుప్రీం కోర్టును చూడండి యెలాంటి వ్యాఖ్యలు చేస్తోందో.. ఇది చాలా తీవ్రమైన విషయమట! ప్రజలు క్యూల్లో నిలబడడం తీవ్ర సమస్యట! ప్రజలు ఉపశమనం కోసం కోర్టులకు వెళతారట! కేంద్ర నిర్ణయంతో ప్రజలు ప్రభావితం అయ్యారట! ప్రజలు ఆవేశంలో వున్నారట! దాడులు కూడా జరగొచ్చట! అల్లర్లు జరగొచ్చట! అవకాశాలు వున్నాయట! అంచేత కోర్టులకు యెక్కే అవకాశం యిస్తే ఉపశమనమట! సరే, ఒకవేళ ప్రజలు అలా వున్నా- వున్నారని అనొచ్చునా? రెచ్చగొట్టినట్టు అవదూ? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందా? ప్రజలకు లేనిపోని ఆలోచనలు అందిస్తోందా? ప్రజలను అల్లర్లకూ అలజడులకూ పురికొల్పుతోందా?

జీ.. మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, అవసరమయితే వందా యాభై యిరవై కాదు, పది నోట్లనీ రద్దు చెయ్యండి. నోట్లనేవే లేకుండా రద్దు చేయండి. దెబ్బకి దేశం లైన్లోకి వస్తుంది.. ఇప్పటికే వచ్చేసింది.. లైన్లోకి వచ్చి నిలబడింది.. ఎటియంల ముందు! ఫేస్ బుక్కుల్లో ఈ విషయాన్ని గర్వంగా పెడుతూవున్నారు. మనకు మద్దతునిస్తూవున్నారు. ఏటియంల ముందు నిల్చుంటే యేo? సినిమా టిక్కెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి చచ్చిన వాళ్ళు లేరా? రేషన్ కోసం క్యూ లైన్లలో కొట్టుకు చచ్చినవాళ్ళు లేరా? దేవుడి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడినవాళ్ళు లేరా? కరెంటు బిల్లులూ వాటరు బిల్లులూ కట్టడానికి క్యూ లైన్లలో అఘోరించినవాళ్ళు లేరా? రైలు రిజర్వేషన్లకి క్యూ లైన్లలో రేయింబవళ్ళూ కాచినవాళ్ళు లేరా? పిల్లలకి చదువుకోసం సీట్లకోసం క్యూ లైన్లలో కునుకుపాట్లు పడుతున్నవాళ్ళు లేరా? ఈసేవా మీసేవా అని సేవలు అందుకోవడానికి క్యూ లైన్లలో కుదురుగా వున్నవాళ్ళు లేరా? ఫోను చేస్తే కూడా యూ ఆర్ యిన్ క్యూ- అంటారే.. జీవితమంతా క్యూ లైన్లలోనే బతికి చచ్చిన వాళ్ళకి క్యూలోనే వుండడం కొత్తా కాదు. కష్టమూ కాదు. అందరూ లైన్లలోనే వున్నారు. దేశమొక్కటే లైన్లో లేదు. మీరు లైన్లో పెడుతున్నారు. పెట్టండి. మేమంతా అచ్చాదిన్ కోసం యెదురు చూస్తున్నాము. అచ్చాదిన్ రావాలంటే కొందరికి చచ్చేదిన్ తప్పదు. చచ్చాదిన్ రుచి చూసినప్పుడే అచ్చాదిన్ కు విలువ. మీ విలువ మాకు తెలుసు!

మీరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లోకం ఆ శ్రీరామచంద్రుడినే- భార్యని అడవిలో నిండు చూలాలిగా వదిలిపెట్టాడని, వాలిని చెట్టుచాటు నుండి యెన్కౌంటరు చేసాడని- యెన్నో విధాల నిందించింది. ఆ రాముణ్ణి నమ్ముకున్న పార్టీ మీది. ఆ పార్టీకి సారధి మీరు. మీకు నిందలు రాకపోతే ఆశ్చర్యపోవాలి గాని వస్తే ఆశ్చర్యపోయేది యేమీ లేదు. అయినా మీకు నిందలు కొత్తా? గుజరాత్ అల్లర్లలో వేలాది మందిని హింసించి చంపించడంలో మీదే అసలు పాత్రని ఆనాడు లోకం కోడై కుయ్యలేదా? ఈనాడు మీకు బ్రహ్మరథం పట్టలేదా? అప్పుడు ప్రపంచానికి పెద్దన్న మీ వీసాని కూడా రద్దు చెయ్యలేదా? అమెరికా రావడానికి లేదని వీల్లేదని నిషేధం కూడా విధించలేదా? మళ్ళీ మిమ్మల్ని పిలిచి పీట వేయలేదా? అంతెందుకు వైట్ హౌస్ లోకి రానున్న ట్రంప్ నిన్నటికి నిన్న మీ పాలన బాగుందని కితాబు యివ్వలేదా? అమెరికా ప్రెసిడెంటే యిచ్చినప్పుడు యింకా మన దేశ ప్రజలు యిస్తే యెంత? యివ్వకపోతే యెంత? వీళ్ళ మాటలెంత? వీళ్ళివాళ నొచ్చుకున్నా రేపు మళ్ళీ మిమ్మల్ని చచ్చినట్టు మెచ్చుకుంటారు. అంచేత యెప్పుడూ ఈ పరిస్థితే వుండదు! మీరు క్షిపణిలా ప్రజల మీదకి దూసుకుపొండి! క్షిపణి అంటే గుర్తుకువచ్చింది.. మీరు చేసింది ప్రజల మీద ‘సర్జికల్ దాడి’ కాదట, ‘కార్పెట్ బాంబింగ్’అట.. సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్య.. ముందుగా ముఖ్యంగా చెప్పేది ఆ సుప్రీమ్ కోర్టు నోరు ముయ్యించండి సార్.. ప్రజలనోళ్ళు ఆటోమేటిగ్గా మూతబడిపోతాయి. సోషల్ మీడియాలో మిమ్మల్ని తప్పుపడుతూ పోస్టు పెట్టిన యిద్దరు వుద్యోగులని విధులనుంచి తప్పించారని వార్తలు చూస్తున్నాం. ఆ సంఖ్యను యింకాస్త పెంచితే అందరూ ఆఘమేఘాల మీద మీ చర్య వుత్తమోత్తమైనది అంటూ బుద్దిగా వుద్యోగాలు చేసుకుంటూ బతికేస్తారు.

అప్పుడే ఎనభై మంది ప్రజలు నోట్ల రద్దువల్ల చనిపోయారని లెక్కలు చూపిస్తున్నారు. ఎనభై కాకపోతే నూటాయెనభై మంది ప్రజలను చావనివ్వండి. బ్యాంకు వుద్యోగులు యిరవైమంది వొత్తిడితో చనిపోయారని చెపుతున్నారు. ఇరవై కాకపోతే నూటాయిరవై మంది వుద్యోగులను చావనివ్వండి. రథాన్ని లాగినప్పుడు తలలు రాలిపడతాయి. అయినా రథయాత్రలు చేసి రణరంగం వీరంగం చేసిన పార్టీవారు మీరు. మీకు చెప్పాలా? అయినా ప్లేగు వస్తే చావలేదా? కలరా వస్తే చావలేదా? డెంగ్యూ వస్తే చావడం లేదా? చికెన్ గున్యా వస్తే చావడం లేదా? ఎలకలకి నీటి కలకలకి దోమలకి అంతమందిని అప్పజెప్పినప్పుడు దేశ ప్రధానిగా మీకు వెయ్యీ పయీ అప్పజెప్పొద్దా? ఆమాత్రం మీపట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే మండుతోంది.

ఏమయినా ఒకమంచిపని చేసేటప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటారు. బురద జల్లుతారు. తిట్టిపోస్తారు. శాపనార్థాలు పెడతారు. అసలు ప్రభుత్వం యేది చేసినా ప్రజలను మోసం చేసి పార్టీకి మేలు చేయడానికేనని పెడార్ధాలు తీసే మేథావులు మందలకొద్దీ మనకున్నారు. వాళ్ళు యూపీ ఎలక్షన్ల కోసమే మీరు యిదంతా చేసారని అంటున్నారు. అనుకోనివ్వండి. అలా అన్నా నోట్లతో వోట్లని కొనడానికి వీలు లేకుండా చేసిన మిమ్మల్ని అభినందించాలి కదా? మీ పార్టీ వాళ్ళు ముందే జాగ్రత్తపడ్డారని, సాక్ష్యంగా మీ ప్రకటనకు ముందే రెండువేల నోటుని సాంఘిక మాధ్యమాల్లో మీ నాయకుడు ట్వీట్ చేసాడని అంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరు అనిల్ అంబాని మరదలికి మొగుడు అంటున్నారు. అన్నీ అందరికి తెలుసు అంటున్నారు. ఒకటా రెండా గవర్నరు సంతకాల దాక.. యెన్నో ఆధారాలంటూ ముందుకు తెస్తున్నారు. తేనివ్వండి. ఏనుగు వెళిపోతుంటే వెయ్యి కుక్కలు మొరుగుతాయి. మొరగనివ్వండి. అధికారం మంత్రదండం. ఆ మంత్రదండమే మీ చేతిలో వుంది. అంతకు మించిన ఆయుధం లేదు. అణచివేత మీ సాధనం. అదే యింధనం. మీదే విజయం!

అవకాశం కోసం కాచుకూర్చున్న ప్రతిపక్షాలు మీ మీద యుద్ధం చేస్తున్నాయి. చెయ్యనివ్వండి. పాకిస్తాన్ యుద్ధమే నోట్ల రద్దు దెబ్బకి ఆగిపోయింది. ఆ వార్తలే పత్రికల్లో లేకుండా పోయాయి. నోట్లు రద్దవడం కాదుగాని అన్ని సమస్యలూ దెబ్బకి రద్దయిపోయాయి. ప్రజలకీ పార్లమెంటుకీ వొక్కటే ఎజెండా. నోట్లే జెండా. నోట్ల రద్దుతో మీరు అనేక సమస్యల్ని అవలీలగా రద్దు చేసేసారు. మీ తెలివి చూస్తే నాకు ముచ్చటేస్తోంది! మీరు అధికారంలోకి వచ్చాక అన్నిటా అంతటా హిందూత్వం పెరిగిపోయిందని, గోరక్షణ పేరుతో దళితుల మీదా మైనారిటీల మీదా-  దాడులూ హత్యలూ దేశంలో యెక్కడో వొక చోట ఆగకుండా జరుగుతూ మీకు మచ్చతెచ్చాయి. ఆమచ్చ చెరుపుకోవడానికి ఆలస్యంగానైనా మీరు ‘దళితులు నాసోదరులు, నన్ను చంపాకే దళితుల్ని చంపండి’ అని ప్రకటించాల్సి వచ్చింది. ఆమొత్తాన్ని మీరిప్పుడు చెరిపేశారు.

మీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం మధ్యతరగతి జీవుల్లో మీకు మంచి మార్కులే వేసింది. మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళనే తప్పు పట్టే దేశభక్తుల్ని తయారు చేసింది. పైగా ‘నా నిర్ణయంలో దురుద్దేశం వుందని తేలితే నన్ను నడిబజార్లో వురి తీయండి’ అని మీరు భావోద్వేగాలకు గురి కావడం- ‘నన్ను ప్రాణాలతో వుండనివ్వరేమో? ఐనా జంకను, సజీవ దహనం చేసినా నల్లధనం పై పోరు ఆపను’ అని మీరు కళ్ళనీళ్ళపర్యంతం కావడం- మమ్మల్ని చాలా దుఃఖానికి గురి చేసింది. మీరు మాటి మాటికి ‘నన్ను చంపండి.. నన్ను కాల్చండి.. నన్ను వురి తియ్యండి.. నన్ను సజీవ దహనం చేసినా..’ అని అస్తమానూ అనకండి సార్.. పైన తధాస్తు దేవతలు వుంటారు! మీరు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నాను! దేశాన్ని అనాధను చెయ్యొద్దు! మీ పాలనలో ప్రజలు యెంత సుఖ సంతోషాలతో వున్నారో మీరెరుగరా?!

జీ.. రేపటి యేడాదికి డబ్బై యేళ్ళుగా పట్టిన మురికిని మంత్రం వేసినట్టు మాయం చెయ్యడం వశమయ్యే పనేనా? చురుక్కు మనకుండా యింజక్షనే వెయ్యలేరే. నొప్పి లేకుండా పుప్పన్నే తీయలేరే. మన గడ్డం మనం గీసుకున్నా- అది మన బ్లేడే అయినా- మన చెయ్యే అయినా- తెగకుండా వుంటుందా? అంతెందుకు నొప్పులు లేకుండా ప్రసవం అవుతుందా? ప్రసవ నొప్పులు ప్రజలకూ వుంటాయని తెలుసుకోవాలని యీ సందర్భంగా ప్రజలకు మీ విధేయునిగా విజ్ఞప్తి చేస్తున్నాను!

యధ్బావం తద్భవతీ.. అన్నారు. ప్రతిదాంట్లోనూ మంచి చూస్తే మంచి- చెడు చూస్తే చెడు కనిపిస్తాయి. మీ నిర్ణయంలో మంచిని చూశాను. ఇంత మంచిని చేసిన మీముందు ఆ మంచి మంచి విషయాలూ ఫలితాలూ రాశి పోసి పంచుకోకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది.

ఎన్నడూ లేనిది ప్రజలకు డబ్బులు లేకుండా జీవించడం వచ్చేసింది. ఉన్నదాంట్లో వొద్దికగా బతికే నేర్పు వచ్చేసింది. ఆర్భాటాలు లేవు. అనవసర ఖర్చులు లేవు. షాపింగులు లేవు. సరదాలు లేవు. సందళ్ళు లేవు. సినిమాలు లేవు. షికారులు లేవు. పనుల్లేవ్. పాకుల్లేవ్. ఉన్నదాంట్లో తిన్నామా.. ఏటియం క్యూ లైన్లో నిల్చున్నామా.. వచ్చి గూట్లో గుట్టుచప్పుడుగా పడుకున్నామా.. అంతే. పొదుపుగా పొద్దు పుచ్చడం వచ్చింది. (చెప్పకేం దుబారా చేసే మాఆవిడ కూడా యెంత చిక్కిడి అయిపోయిందో..?) రేపు డబ్బులు చేతికి వచ్చినా ఏం చేసుకోవాలో తెలీక జనాలు తికమకపడతారంటే అతిశయోక్తి కాదు. కాదంటే మీ మీదొట్టు..

మరొక్క విషయమూ యిందులో వుంది. మనిషి తన మూలాలను గుర్తిస్తున్నాడు. వస్తుమార్పిడి విధానం మళ్ళీ మొదలైంది. మాదగ్గర బియ్యం తీసుకు వెళ్ళే మా పక్కింటివాళ్ళు మాకు అందుకు ప్రతిగా పప్పులూ ఉప్పులూ యిస్తున్నారు. మేం చింతపండు యిస్తే వాళ్ళు ప్రతిగా పసుపూ కారం యిస్తున్నారు. మనదగ్గర వున్నది యివ్వడం.. వాళ్ళదగ్గరున్నది పుచ్చుకోవడం.. యిలా యిచ్చిపుచ్చుకోవడంలో దేశ ప్రజల సహనమూ సౌశీల్యమూ స్నేహమూ సౌభ్రాతృత్వమూ యింకా చాలా చాలా వగైరాలు చూడగలిగాను!

మీ నిర్ణయం తర్వాత తాగుబోతులు తాగడం తగ్గించేసారు. జేబులు ఖాళీ అయి బుద్దిగా యింటికి వెళ్ళిపోతున్నారు. తంతే మరి నాలుగు పెళ్ళాలని తంతున్నారే తప్ప-  తప్పతాగి యెక్కడికక్కడ పడిపోవడం లేదు. చిల్లర సమస్య తాగుబోతులకు వుండరాదని రౌండ్ ఫిగరు చేసినప్పటికిన్నీ నలభై నుండి యాభై శాతం తాగడం తగ్గింది అంటే ముందు ముందు ఆశాతం మరింత పెరగొచ్చు అని రూడీగా చెప్పొచ్చు. చచ్చినట్టు మద్యపాన ప్రియులు కుటుంబప్రియులు అవుతారు. దేశంలోని మహిళలంతా యెప్పటికీ మీ ఋణం తీర్చుకోలేరు గాక తీర్చుకోలేరు!

కొందరు పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయని ఓ గగ్గోలు పెడుతున్నారు తప్పితే, సింపుల్ గా పెళ్లి చేసుకోవడం నేర్చుకు చావరే. అయినా పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల దేశానికి యెంతో మేలూ లాభమూ వున్నదన్న సంగతి మర్చిపోతున్నారే. పెళ్ళయితే యేముంది? మాహా అయితే పిల్లల్ని కంటారు. కోట్లలో జనాభాను పెంచుకుపోతారు. అదే పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల సంతతి ఆగిపోతోంది.. జనాభా తగ్గిపోతోంది. ప్రతి దానిలో పాజిటీవు కోణం చూడగలిగిన వాడే నిజమైన భారతీయుడు కాగలుగుతాడు!

పెద్దనోట్ల రద్దువల్ల యిచ్చిన లంచం తిరిగి వెనక్కి యిచ్చేస్తున్నారు ప్రభుత్వోద్యోగులు. లంచం లేకుండానే పనులు చేసేస్తున్నారు. ‘ఇప్పుడు కాదు, పని అయ్యాక ఆరుమాసాలు పోయాక యివ్వండి’ అని అంటున్నారు. డబ్బులు యిస్తేగాని పనిచెయ్యమని యిన్నాళ్ళలా పీక మీద కత్తి పెట్టుకు కూర్చోవడం లేదు. ఇంతటి పెను మార్పును మా జీవితాల్లో మేము చూస్తామని యెన్నడూ కలలో గాని అనుకోలేదు. ఈ శుభపరిణామానికి దేశంలోని పరిణామాలే కారణమని చెప్పకతప్పదు. అందుకు కారణమైన మిమ్మల్ని అభినంధించకా తప్పదు!

పేకాట రాయుళ్ళు పేకాట మానేశారు. డబ్బులు లేకుండా వొత్తి పుణ్యానికి ఆడడంలో వాళ్లకి మజా లేదు. అంతెందుకు కుర్రాళ్ళంతా వారం వారం అడ్డమైన సినిమాలను చూసేవాళ్ళు. వారానికి వో అరడజను సినిమాలు రిలీజు అయ్యేవి. యేవి.. యిప్పుడు వొకట్రెండు సినిమాలే ట్రెండు. బెండు తీసారు. ఇప్పుడు పిల్లలు గమ్మున యింటిపట్టున వుండి ఫేస్ బుక్కులు చక్కగా చదువుకుంటూ యూ ట్యూబులు చూసుకుంటూ వున్నారు.  టీవీల్లో వచ్చే సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ వున్నారు. యువత మీ మేలు మరిచిపోదు.. పోలేదు!

మరో ముఖ్యమైన విషయం చెప్పనా? దొంగతనాలు మా బాగా తగ్గాయి. అలవాటులో పొరపాటుగా వచ్చిన దొంగలు వెయ్యీ ఐదు వందల నోట్లు కళ్ళముందు కనిపించినా యెత్తుకు పోవడం లేదు. మా ఆవిడ దాచుకున్న పాతిక వేలు యెలా మార్చడమా అని ఆపసోపాలు పడుతున్న వేళ.. మొన్నటికి మొన్న మా యింట్లో పడ్డ దొంగ అది చూసి నన్ను బుద్దుందా? అని తిట్టాడు. క్లాసు కూడా పీకాడు. కౌటిల్యుడిలాగ బోధించాడు. డబ్బును డబ్బుగా దాస్తే దాని విలువ తగ్గిపోతుందట. కోల్పోతుందట. అందుకని బుర్రన్న వాడెవడైనా డబ్బు దాచుకోడట. భూమ్మీదో బంగారమ్మీదో షేర్లమీదో బినామీల మీదో పెడతాడు తప్ప యింట్లో లిక్విడ్ క్యాష్ దాచుకోర్రా యెర్రి నాగన్నా.. అని హితబోధ చేసాడు. నీదగ్గర కోటిరూపాయలు వుంటే పదిలక్షలైనా జేబులో కాదు కదా యింట్లో పెట్టుకుంటావా?.. అని అడిగాడు. డబ్బు పొదుపు చేసే కన్నా పొదిగితే పెరుగుతుంది.. ఈ సత్యం తెలియని సత్తికాలపు సత్తెయ్యవా నువ్వు?  దాచుకున్నా అది అయిదూ పది శాతమేన్రా నీ యబ్బా.. అని తిట్టి పోశాడు. బుర్రతక్కువ యెదవలు అని కూడా అనేశాడు. ఆ తిట్టు నాకు తగిలినందుకు కాదు, మీకూ తగిలినందుకు నేను చాలా విచారపడి విలవిలలాడిపోయానంటే నమ్మండి. మా ఆవిడ కూడా దొంగకే వంత పాడింది.

పర్లేదు.. మీది మహోన్నత నిర్ణయం. మీ దయవల్ల అందరికీ పని దొరుకుతోంది. బిందెలకు మాట్లేస్తాం.. అన్నంతగా మూల మూలలా వేల వేళలా- మీ పాత బిందెలకు కొత్త బిందెలు యిస్తాం.. అని అన్నంతగా  మీ పాత నోట్లకు కొత్తనోట్లు యిస్తాం.. అని నోట్లు మార్చే పని కుటీర పరిశ్రమలా సాగుతూ వుంది. అన్ని వ్యాపారాలు ఆగిపోయినా ఈ యవ్వారాలు ఆగలేదు. పెద్ద పార్టీలకు థర్టీ పర్సెంట్. డోర్ డెలివరీ సదుపాయం కూడా వుంది. బ్యాంకు మారాజులు మా బాగా చెయ్యి కలుపుతున్నారు. పోస్టుమాస్టర్సూ పోస్టాఫీసుల్లో నగదు మార్పిడిల్లో మాబాగా మార్చారు. ఏమార్చారు. ఏమయితేనేం మనం పాజిటీవుగా చూస్తే చాల మందికి పని దొరికింది. మీపేరు చెప్పుకొని పావలా పరకో యింతో అంతో సంపాదించుకుంటున్నారు.

అసలు సంపాదించుకోనిది యెవరు? ప్రభుత్వ సంస్థలే తీసుకుంటే యింతకు మునుపు కునారిల్లిపోయి వుండేవి. ఇప్పుడు కూటికి లేనివి కోటికి పడగలెత్తాయి. వెయ్యీ ఐదువందల నోట్లతో అన్ని పన్నులూ పాత బకాయిలూ కట్టొచ్చునని చెప్పినతరువాత మా హైదరాబాదు జీహెచ్ఎమ్సీ రెండువందల కోట్ల పైనే రాబట్టింది. గత వసూళ్లతో పోలిస్తే రెండువేల రెండువందల రెట్లు యెక్కువని కూడా వార్తలు వస్తున్నాయి. మొండి బాకాయిలు వసూలవుతున్నాయి. గుడ్డివాళ్ళు యివన్నీ చూడలేరు.

ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రవేటు వ్యక్తులకు అప్పులు వున్నా- బ్యాంకులకు అప్పులు వున్నా కూడా కొందరు ఆపద్భాందవుల్లా ముందుకు వచ్చి మీ అప్పులు తీరుస్తామని కోరి చెపుతున్నారు. మీరు తరువాత మాకు తీర్చండి అని భరోసా యిస్తున్నారు. మనిషిని మనిషి నమ్మని యీ రోజుల్లో యీ విధంగా మానవీయత పరిమళిoచడం మానవత్వం కాదా? ఇంతకుమించిన మానవత్వం వుంటుందా అని అమర్త్యసేన్ని అడుగుతున్నాను..

మనుషులే కాదు దేవుళ్ళ పరిస్థితి కూడా మెరుగయ్యింది. గుళ్ళూ గోపురాలు పుట్టిబుద్దెరిగి యింత కలక్షన్లు కల్లజూసాయా అని అడుగుతున్నాను. కలక్షన్ల కింగ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామివారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతుంది. శ్రీవారికి వొక్క రోజుకే ఆదాయం నాలుగుంపావూ నాలుగున్నర కోట్లు దాకా వస్తోంది. విజయవాడ దుర్గమ్మకూ మునుపెన్నడూ లేని ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నెలాఖరుకల్లా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం ఆదాయం లేని స్థానిక దేవుళ్ళ గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. తీర్థ ప్రసాదాలు అందుతున్నాయి. ఇదంతా మీ చలవే. భక్తులు పాత నోట్లని సగర్వంగా సమర్పించుకుంటున్నారు. అదీ యీ మీడియా వాళ్ళకి తప్పే. పాపంలో వాటా భగవంతుడికీ పంచుతున్నారని గోల పెడుతూ ప్రోగ్రాములమీద ప్రోగ్రాములు చేసేస్తున్నారు. దేవుడి దృష్టిలో చెల్లుబాటు అయేది.. చెల్లుబాటు అవనిది అంటూ వుంటుందా? దేవుడు అన్నిటినీ సమంగా స్వీకరిస్తాడు అన్న సత్యాన్ని మరిచిపోతున్నారు. తుచ్చులు.. సమాజానికి ఉచ్చులు..

అరే హాస్పిటల్స్ లో రోగాలన్నీ నయం చేసుకుంటున్నారు. అనారోగ్యాలను యేమాత్రం వాయిదా వెయ్యడంలేదు. నోట్లని మార్చేసుకోవడానికిది మరో మార్గం అని అంటున్నారే తప్ప యిందులోని పాజిటీవు అవకాశపు కోణం చూడరే అంధులు.. అర్భకులు..

విదేశాల్లోని నల్లధనం మీరు తీసుకురాలేక ఆ చిత్తశుద్ది మీలో లేక స్వదేశంలో డ్రామాలు చేస్తున్నారని అన్నవాళ్లకీ ఆడిపోసుకున్నవాళ్ళకీ వొక్కటే నా సమాధానం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సంస్కృతీ సాంప్రదాయాలూ వీళ్ళకి తెలిసి చావవు. అయినా స్విస్ బ్యాంకు రెండేళ్ళ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా ఖాతాలు తెరిచినవాళ్ళ వివరాలను చెపుతామని చెపితే సంతోషించక- అది మీ కృషి అని అంగీకరించలేక-  పాత ఖాతాదారుల వివరాలు రాబట్టలేరా.. అని తిరిగి అడుగుతారు. మాల్యాని మీరే టిక్కట్టు తీసి దగ్గరుండి పంపించినట్టు మాట్లాడుతారు. వదిలేసారని వాపోతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడువేల పదహారు కోట్లు ‘రద్దు పద్దు’లో వేసి నీళ్ళోదిలేసిందని, అందులో పన్నెండు వందల వొక్క కోటి విజయమాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దని, యిందులో ఆరు సంస్థలు మన తెలుగు రాష్ట్రాలవని కూడా వున్నాయని వాపోతున్నారు. అక్కడితో ఆగక మా బాకీలు కూడా మీ ‘రద్దు పద్దు’లో వేసి ఆదుకోమని వాడెవడో బయలు దేరాడు. ఇంక అందరూ అలా ముందుకు వస్తే బ్యాంకింగు వ్యవస్థ కుప్పకూలిపోదూ? అందుకే గదూ రైతుల్ని చితకతన్ని పాతిక వేలయినా లాక్కోనేది.. జప్తు చేసేది? మన బ్యాంకులను, మన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవద్దూ? ప్రతి దానిలో మంచి చూడడం వీళ్ళకు యెందుకు రాదో నాకర్థమే కాదు!

ఉగ్రవాదం.. తీవ్రవాదం.. నక్సలిజం యివన్నీ అంతరించిపోవాలంటే నల్లదనం అరికట్టాలి. ఆ నల్లదనం పెట్టుబడిదారుల వ్యాపారుల దగ్గర వుంటే వ్యాపారాలు చేస్తారు. వారు అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తారు. మనీని డెడ్ చెయ్యరు. డెత్ కు వాడరు. మరంత మనీ జనరేట్ చెయ్యడానికి వాడుతారు. అంచేత అందర్నీ వొక గాట కట్టలేం!

మీ విజన్ మాకు తెలుసు. మీరు మన కంట్రీని  క్యాష్ లెస్ కంట్రీగా చెయ్యాలని కలలు కంటున్నారు. మీరు మాత్రమే కలలను నిజం చెయ్యగలరు. ఎనభైయ్యారు శాతంగా వున్న పెద్దనోట్లు రద్దయ్యాక- ఎనభైయ్యారు శాతం ఏటీయంలు పనిచెయ్యకుండా వున్నాక- అంతా క్యాష్ లెస్సే! మనది క్యాష్ లెస్ కంట్రీయే! మరో విషయం పాలుకీ పనిమనిషికీ కూరలకీ కోడిగుడ్లకీ స్వైప్ మిషనేనా అని యెద్దులు యెద్దేవా చేస్తున్నారు! కాని చిన్న చిన్న దుకాణాలలో అమ్ముకొనే స్క్రాప్ ని మీరు తీసి పడేసి- అంతా అందంగా హై ఫై చేసి- కార్పోరేట్ వ్యాపారాలవైపుకు మళ్లిస్తున్నారన్న మర్మాన్ని అర్థం చేసుకోరే?! పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టి మనదేశానికి వచ్చిన వాళ్ళని మనం ఆ మాత్రం ఆదరించవద్దా?

చిన్నా పెద్దా తేడాలేకనే లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పుతీసుకున్న ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, రూలియా బ్రదర్స్, అనిల్ అగర్వాల్, గౌతమ్ ఆదాని- వేల కోట్లు అప్పుతీసుకున్న సైరుస్ మిస్త్రీ, మనోజ్ గౌర్, సజ్జన్ జిందాల్, లాంకో మధు, జియం రావ్, వియ్యన్ ధూప్, జీవీకే రెడ్డి- వీళ్ళ గురించి యిప్పుడే కొత్తగా తెలిసినట్టు తెగ యిదై పోతున్నారు. వాళ్ళు చేసిన రుణాలు కక్కించమంటున్నారు. లాగొచ్చు. కాని ఆ డబ్బు యెవరిది? వాళ్ళ వ్యాపారాలలో వున్నది ప్రజల డబ్బే. వాళ్ళు కుదేలయితే ప్రజలకు ఆ దెబ్బతాకుతుంది. అందుకని యిలాంటి పెద్దల్ని గౌరవంగా చూసుకోవాలి. ప్రోత్సహకాలు యివ్వాలి. రైతులకు సబ్సీడీలు తీసేసినా వ్యాపారాలకూ పెట్టుబడిదారులకూ సబ్సిడీలను యిచ్చి ప్రోత్సహించాలి. ఉచితంగా కోరినంత భూమి, కరెంటు, నీళ్ళు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలి. మీ చర్యతో బ్యాంకుల్లో చేరిన అనెకౌంటెడ్ మనీని.. ఎకౌంటెడ్ మనీని- ఈ పెద్దలకు మళ్ళీ మళ్ళీ రుణాలుగా యివ్వాలి. వాళ్ళు వ్యాపారాలు చేసి దేశ ప్రజలకి ఉపాధి కల్పిస్తారు. ఊతమిస్తారు. అంతే కాదు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. వాళ్ళని క్యూల్లో వచ్చి నిలబడాలని కొందరు మూర్ఖంగా ఆలోచనలు చేస్తున్నారు. మన దేశం సంపన్నుల జాబితాలో చేరడానికి కారకులైన వాళ్ళను మనం గౌరవించకపోతే ప్రపంచం గౌరవిస్తుందా? పేద దేశంలో ధనికులుగా రాణించడం అంత ఆషామాషీ యవ్వారం గాదు. అందుకైనా వాళ్ళ కాళ్ళు కడిగి మన నెత్తిన పోసుకోవాలి. ఆపనిచేస్తున్న ఏలికలకు యెంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

బీజేపీ యంపీ హర్షవర్ధన్ గారిని జనం అసహనంతో చితకబాదితే దేశమంతా అసహనం వున్నట్టు చిత్రీకరిస్తున్నారు. పాతిక రోజులుగా జనం కుక్కిన పేనుల్లా పడి లేరా? అవస్థలు పడుతూ ప్రజలు మీకు సహకరిస్తూ వుంటే వీళ్ళకు  కంటగింపుగా వుంది. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళకు తగిన సమాధానం యిచ్చారు. అవినీతి పరులుగా ముద్ర వేసారు. అందుకే ప్రతొక్కరూ’ మోడీగారి నిర్ణయం మంచిదే కాని..’ అనేదాకా వచ్చారు. అది చాలు.. మీరు విజ్రుభించేయడానికి!

ప్రజలకి ఓర్పు లేకపోతే యెలా? భార్యా బిడ్డలా యేమి స్వార్థం మీకు? కాని భార్యా బిడ్డలు వుంటే మీరు యిలా చేసేవారా.. అని తిరిగి అడిగేవారూ వున్నారు. ఇలాంటి ప్రజలకోసమా మీరిన్ని అవస్థలూ పడుతున్నది అని తలచుకుంటే దుఃఖం వస్తుంది.

అప్పుడే రెండువేల నోట్లు నకిలీవి వచ్చేసాయని అంటున్నారు. ఇదీ తప్పేనా? తెలివిగా ఆలోచిస్తే నోట్ల కొరత వున్నప్పుడు నకిలీ నోట్లు కూడా చెలామణీ కావడం కొంత ఊరటే. అవి ఖాళీలను పూరిస్తాయి. అన్నీ నోట్లూ ప్రింట్ అయి వొకేసారి రావాలంటే కష్టం గదా? ఆమాటకు వస్తే మన భారతదేశానికి పాకిస్తానుకు మెటీరియల్ సరఫరా చేసేవాడు వొక్కడే. ఇప్పుడు యేమయ్యింది.. నోట్ల కొరత కొంత తీరుతోంది గదా.. అని పాజిటీవ్ గా చూస్తే నెలకొన్న సమస్య తీరడంలో నకిలీ నోట్లు అవసరం. లోపాలతో వున్న అయిదువందల నోట్లని వొదల్లేదా? రెండువేలతో సహా అన్నీ రేపు భవిష్యత్తులో రద్దయ్యేవేగా?

చెప్పడం మరిచాను. జనధన్ ఖాతాల్లో భారీగా డబ్బు చేరడంవల్ల పేద సాదలకు పైసా పరకో దొరుకుతుంది. మీరు చూసీ చూడనట్టు పోవడం వల్ల రేపు మీరు వొక్కొక్క ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ముందే యిచ్చిన హామీని నిలబెట్టుకోకపోయినా పోయింది పొల్లు వచ్చింది గట్టి.. అని మిమ్మల్ని మన్నిస్తారు.

మీ ధ్యేయం ఫలిస్తోంది. నలుపు తెలుపవుతోంది.. బ్లాక్ మనీ మీరన్నట్టే తీసి పారేశారు. నల్లధనం లేదు. వుండదు. ఈ డిసెంబరు ముప్పైలోగా వున్న నల్లధనం తెల్లధనంగా మారిపోతుంది. స్వయంగా వస్తే ఫిఫ్టీ పర్సెంటు.. మేం పట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటు.. అని బంపరాఫరే యిచ్చారు. నలుపుని తెలుపు చేసుకొనే మహదవకాశం మీరిచ్చారు. కాని మనవాళ్ళు ఈలోపలే మార్చేసారు. ఉన్న అరా కొరా మీరిచ్చిన ఆఫర్లో మార్చేసుకోవచ్చు. నల్లధనమే కాదు, నాలుగు వందలకోట్ల నకిలీ నోట్లు కూడా దెబ్బకి బ్యాంకుల్లో జమయిపోయాయి. చెల్లని నోటుకు మళ్ళీ అది అసలా నకిలీనా అని చూస్తారా? అంత సమయం మన బ్యాంకుల వాళ్ళకి వుందా? లేదు! మన దేశంలో రద్దయిన పెద్దనోట్ల మొత్తం విలువ పదిహేనున్నర లక్షల కోట్లు. నవంబరు ఆఖరి నాటికే పదకుండు లక్షలకోట్లు బ్యాంకుల్లో జమయినాయి. మిగిలిన నాలుగున్నర లక్షలకోట్లు ఈ నెలాఖరులోపల ఈజీగా జమవుతాయి. బ్యాంకులకు రాకుండా నల్లధనం బయట మిగిలిపోయే అవకాశమే లేదని ఆర్ధిక నిపుణులు లెక్కలు కడుతున్నారు. తిరిగి లక్షన్నర కోట్లు మీ చర్య వలన నష్టం వస్తుందని కూడా చెపుతున్నారు. ఎవరెన్ని చెప్పినా యిప్పుడు మీ అడుగు వెనక్కి తీసుకోవడానికి లేదు. దేశం వృద్ధిరేటు తగ్గినా తప్పులేదు. ఎందుకంటే మీరు యెంతో సాహసంతో దేశంలో నల్లధనం లేకుండా చేసారు.  అది చాలు. ఆపేరు చాలు. నల్లధనంతో నానా అవస్థలూ పడుతున్న పెద్దలకు మీరిచ్చిన అవకాశం అమూల్యమైనది. అపురూపమైనది. మీరే మళ్ళీ మళ్ళీ మనదేశ ప్రధానమంత్రిగా వుండాలి. నల్లధనం లేని దేశంగా భారత దేశాన్ని మార్చేసి  చరిత్రలో స్థానం కల్పించిన మీకు ఈ దేశప్రజలు యెప్పటికీ ఋణపడే వుండాలి. వుంటారు!

ఈ దేశప్రజల్లో వొకడినైనందుకు యెంతగానో గర్విస్తున్నాను!

కృతజ్ఞతా పూర్వక నమస్కారాలతో-

మీ

అనామక భక్తుడు.

 

మీ మాటలు

  1. PM.KIRASINALETTER..BHAGUNDHI..KANNI..MEEBhavanalu..variki..cheruthaya?

  2. కరుణాకర్ says:

    అద్భుతం. వ్యంగ్యాన్ని పతాకస్థాయికి చేర్చారు.

  3. నరహరి says:

    బెమ్మాండం. తమ ఆవేదనని మమతా బెనర్జీకో, క్రేజీవాల్కో, ఛోటా భీమ్ రాహుల్ బాబా కో కూడా పంపిస్తే వారు కూడా తమలాగే అనామక భక్తులై పోతారు, ఇంకా గొప్పగా సైన్యం coup ని, బెంజ్ కార్లో వచ్చి ఎటిెెఎమ్ ముందు నిలబడడాన్ని మనం చూడవచ్చు. మోడీ ఫోబియాను దేశమంతా ప్రచలించిన అనామక తెలుగు భక్తుడిగానూ పేరు పొందవచ్చు. తక్షణ, సత్వర నెగెటివ్ పరిష్కారాలే మోడీని మట్టుబెట్టడానికి మార్గాలు. అవి వచ్చేంతవరకూ మహా రచయితలకు ఈ కలంశోష తప్పదు.

  4. THIRUPALU says:

    చెప్పాల్సిన దంతా పొల్లుపోకుండా చెప్పేసారు. దేశాన్ని అభివృద్ధి పరుగులు తీయుస్తున్న ప్రధాని గారికి అది వివరించిన మీ ధన్యవాదాలు.

  5. D.RAJABABU says:

    అనామక మహాశయా ! మీరు నన్ను అర్ధం చేసుకున్నట్టు ఎవరు అర్ధం చేసుకోలేదు. దేశంలో నోట్ల రద్దు చేసి నేనోదో మహా నేరం చేసానని నన్ను అదే పనిగా ఆడిపోసుకోవడం ఎందుకు?పెళ్ళాం పిల్లలు లేనివాడిని, సగం సన్యాసిని, అర్ధాంగిని పాలించడం చేతకాక ముఠా ముల్లె సర్దుకొని వెళ్లిన వాడికి ఏకంగా రాష్ట్ర ముఖ్య మంత్రినే చేసారుగా. నాడు ప్రజల విజ్ఞత ఏ ఏమైంది? ప్రజల విజ్ఞత దిన దినాభి వృద్ధి చెంది ప్రధాన మంత్రి పీఠం మీదే కూర్చోపెట్టారు. మహాశయా వారు బ్యాంకులలో, ఏటియం లలో క్యు లో నిల్చోవడం ఎందుకు చక్కగా లైన్లో నే పద్మాసనం వేసుకుంటూ వెళ్ళమనండి. డబ్బు దొరక్కపోతే ముద్దుగా శవాసనం వేసుకోమనండి. త్వరలోనే ఆకలిని జయించే ఆసనం డబ్బును జయించే ఆసనం కనిపెట్టి దేశ ప్రజలకు అందచేస్తా. ఇంక కోర్టులు అంటారా? కోర్టులకే సరిగా చీము నెత్తుర్లు లేవు. దశాబ్దానికోమారు స్పందించాలా ? వద్దా అన్న రీతిలో స్పందిస్తాయి. వాటి స్పందన జనానికి అర్ధమైన కాకున్నా అంతిమనంగా మేలు జరిగేది ఎవరికో లోకానికి తెలియదా? కోర్టులకు కాలక్షేపం కానప్పుడల్లా పాలకుల మీద నాలుగు రాళ్ళూ వేయడం మాములే మహాశయా !

  6. syamasundar says:

    అనామకుడి ఉత్తరము ప్రధానికి బాగుంది యదార్ధ పరిస్థితిని వివరించారు హిందీ లోనో ఇంగ్లిష్ లోనో తర్జుమా చేసి ప్రధానికి చేరేటట్లు చూడండి తిడుతున్నారో,పొగుడుతున్నారా అర్ధముకాక జుట్టు పీక్కుంటాడు

  7. మహాప్రభో !

  8. రెడ్డి రామకృష్ణ says:

    డియర్ బజరా!వ్యాసం బాగుంది.వ్యంగ్యం ఎక్కడ సడలకుండ ఏకబిగిని చదివించింది.

  9. Kalyani SJ says:

    “చచ్చాదిన్ రుచి చూసినప్పుడే అచ్చాదిన్ కు విలువ”
    కానీయండి రుచి చూపించాకైనా మేలుకుంటారేమో…

  10. కె.కె. రామయ్య says:

    విదేశీ బాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనం జోలికి పోకుండా,
    స్వదేశంలో భూములు, బంగారం, వ్యాపార లావాదేవుల రూపంలో చెలామణి అవుతున్న నల్లధనం జోలికి పోకుండా,
    అవినీతి, నల్లధనం ఉత్పత్తికి మూలకారకాలైన వాటిని, ఎలక్షన్స్ రిఫార్మ్స్ వంటి వాటి జోలికి కూడా పోకుండా,
    రక్తం రుచిమరిగిన అవినీతి పులులకు, గంగిగోవుల్లాంటి సామాన్య ప్రజలకు సరి సమాన న్యాయం చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రికి ప్రేమలేఖ రాసిన బమ్మిడి జగదీశ్వర రావుకు కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు.

    The shadow economy of India estimated at 25% of the total economy, will be equal to over $2 trillion.

    ” 500 billion dollars of illegal money belonging to Indians is deposited in tax havens abroad ” ~CBI report.

  11. అజిత్ కుమార్ says:

    ప్రజలకు నగదు రహిత లావాదేవీలను అలవరచే ఉద్దేశ్యంతో మోడీగారీ పనికి పూనుకొని ఉంటారనిపిస్తుంది. ప్రజలకు నగదును తగినంత అందనీయకుండా ఇబ్బంది కలిగించితే వ్యాపారులకు అమ్మకాలు తగ్గి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిత్సారని బహుశా వారి అంచనా కావచ్చును. చెత్తరహిత పాలనేగాక నగదు రహిత పాలనగూడా ప్రవేశపెట్టడం వారి ఆశయం కావచ్చు. వంద రూపాయలకు మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగా కార్డుద్వారానే జరగాలనే ఆంక్షవిధించి కూడా దీనిని సాధించవచ్చు.
    అవినీతి పద్ధతులలో నడిచే ఆర్ధికరంగంలో అన్నింటా నిజాయితీ కొరవడిందనేది నిజం. రంగురంగుల దుస్తులు ధరించితే అవినీతి పోదు. అంటే సంబంధంలోని పనుల వల్ల లక్ష్యాన్ని సాధించలేము.

  12. Pradhaanamantriki Bajara prema lekha saamaanyudi baadhantaa vyangangaa vellagakkuthu, samagranga undi.

  13. కె.కె. రామయ్య says:

    ” నలుపుని తెలుపు చేసుకొనే మహదవకాశం మీరిచ్చారు. కాని మనవాళ్ళు ఈలోపలే మార్చేసారు ” ….
    అన్న మీ ‘బజరా’ గారికేవైనా దివ్యదృష్టి, అంజనం వేసి చూడటం, కర్ణ పిసాసి లాంటి విద్దేలేవైనా వచ్చా
    ప్రియమైన శ్రీ రెడ్డి రామకృష్ణ మాస్టారూ.

    కూసాలుకి ఓ సిన్న ఉదాహరణ. మొన్న బెంగుళూరులో పిల్ల పెళ్లి వేడుకల్లో చేతి కరుసులకి ఉంటాయని చెప్పి అస్మదీయుడైన ఓ పెజా సేవకుడు వంద కోట్ల పాత నోట్లు చిటికేసినంత వీజీగా కొత్త నోట్లుగా మార్చుకున్నాడు అని నీలాపనింద. ఇరుగు వాడు బాగుపడితే, పొరుగు వాడికుక్రోషం అని శ్రీశ్రీ అన్నది ఇందుకేనెమో.

    ఇట్టా అపవాదులకు గురవుతున్న నిస్వార్ధ పెజా సేవకులు, జాతి పురోభివృద్ధికి తమ జీవితాలని అంకితం చేస్తున్న భారీ వాణిజ్యవేత్తలు, ప్రజా పరిపాలనా భారమంతా తమ భుజస్కంధాల మీదే మోస్తున్న బడా బాబులు మన దేశం నిండా కోకొల్లు అని ఎందరెందరో ప్రఘాడ విస్వాసం.

    అయినా అవినీతికి అడ్డుకట్టలు వెయ్యండి; అవినీతికి అడ్డుకట్టలు వెయ్యండి అని కర్ణాటక రాష్ట్ర మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు న్యాయవాది సంతోష్ హెగ్డే లాంటి వాళ్ళు కాకి గోల చెయ్యడం ఎందుకో నాలాంటి నేలక్లాసు ప్రేక్షకుడికి ఎప్పటికీ అర్తవై సావదు.

  14. బావుంది .ఒక సారి మాట్లాడదాం .ఒక మిస్సెద్ కాల్ ఇస్తారా ?

Leave a Reply to రెడ్డి రామకృష్ణ Cancel reply

*