ధర్మారావులో ఒక ‘అపరిచితుడు’

 

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-5

 

sudrarsanamదుఃఖించే మనిషిని చూడండి. అప్పుడతని, లేదా ఆమె ముఖకవళికలను చూడండి. దుఃఖం కళ్ళను తడిపి, ఆ తర్వాత, సృష్ట్యాదినుంచీ తన లోపల గడ్డ కట్టిన  ఒక పెద్ద మంచుఖండం వేదనా విలయాగ్నికి కరిగి ఒక మహా ప్రవాహంలా మారి కళ్ళు అనే రెండు ఇరుకు బిలాలనుంచి ఒక్కుమ్మడి ముందుకు దూకడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టు ఉంటుంది!

ఎప్పుడైనా, ఎవరిదైనా సరే దుఃఖం హఠాత్తుగా మనల్ని ఒక అలౌకిక జగత్తులోకి తీసుకుపోయి అస్తిత్వం తాలూకు అనాది ఆర్తారావాన్ని శబ్దంగానూ, నిశ్శబ్దంగానూ కూడా ధ్వనిస్తుంది.

ప్రతి దుఃఖం వెనుకా గొప్ప కారణం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దుఃఖమూ అర్థవంతం కావాల్సిన అవసరమూ లేదు. అమ్మతో అయిదేరాళ్ళ కుర్రాడు జనసమ్మర్దంలోకి వెళ్లినప్పుడు, అంతవరకూ పక్కనే ఉన్న అమ్మ, అంతలో కనిపించకపోతే భయవిహ్వలతతో బావురు మన్నప్పుడు కూడా ఆ దుఃఖంలో అస్తిత్వపు అనాది ఆర్తారావమే తళుక్కుమంటుంది.  కొత్తగా అత్తింటికి వెళ్ళే నవవధువు తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటప్పుడు పడే దుఃఖం కూడా అలాంటిదే. బిడ్డ పోయినప్పుడు తల్లి, తల్లి పోయినప్పుడు బిడ్డ పడే దుఃఖం వీటికన్నా సహస్రాంశాలు పెద్దవిగా, అర్థవంతమైనవిగా మనకు అనిపించవచ్చు.  కానీ దుఃఖితుడిలో అలాంటి తేడాలు ఏవీ ఉండవు. ఆ క్షణంలో తన దుఃఖమే తీవ్రం. అందుకు దారి తీయించినదే గొప్ప కారణం.

దుఃఖానికి ఇంకొక విలక్షణ స్వభావం కూడా ఉంది. దుఃఖితుడు, అతని లోపాలోపాలు, దుఃఖకారణాలు, అందుకు సంబంధించిన తర్కవితర్కాలు సహా అన్నింటి నుంచి అది వేరుపడి స్వతంత్రను స్థాపించుకుంటుంది. అప్పుడా అశ్రుధార ఏ మాలిన్యాలూ అంటని స్వచ్ఛజలం. తన ‘పరమపావన వంశాన్ని’ వెలగా చెల్లించి కొనుక్కున్న ‘కడజాతి’ ఇల్లాలు మరణించినప్పటి నిగమశర్మ దుఃఖం కూడా అంతటి స్వచ్ఛమే.

ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. ‘వేయిపడగలు’ పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథవారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహా శోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం, అప్రతిభులమైపోతాం, మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో …అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కు తోచని స్థితిలో కొట్టుకుపోతాం.

రచనాంతంలో, ‘ఏమి మిగిలింది?’ అని ప్రశ్నించుకున్న ధర్మారావుతో, ‘నేను మిగిలాను’ అని చిన్న అరుంధతి అంటుంది. ‘అవును. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి. నా యదృష్టము. నీవు మిగిలితివి’ అని ధర్మారావు అంటాడు. కానీ, పుస్తకాన్ని మూసేసి,  ఇంతకీ రచన ఏం చెప్పిందని సవిమర్శకదృష్టితో ప్రశ్నించుకునే పాఠకునికి ధర్మారావుకి లభించిన సంతృప్తి లభిస్తుందా అంటే సమాధానం దొరకదు.

ఒక కారణం, రచన పరిణామశీలాన్నే నిరాకరించడం. రచయిత చిత్రించినది, కాంక్షించినది ఎటువంటి మార్పులకూ, కొత్తదనానికి చోటివ్వని…కాలంలో ఘనీభవించిపోయిన ఒక వ్యవస్థను! రచన చివరిలో ఇలా అంటాడు:

“ఆహా! ఏమి కాలము!  ఏమి మార్పు! ఎన్నెన్ని ప్రాతవి నశించిపోయినవి? ఎన్నెన్ని క్రొత్తవి తలచూపినవి! లోకమంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి యెట్లగును? కొత్తలో గాడిదపిల్ల కూడ కోమలముగానే యుండును. ఆహా! ఎంత నశించిపోయినది? నశించిపోయినదానిని చూచినచో కడుపు తరుగుకొని పోవుచున్నది. ఈ నశించిన దంతయు వ్యర్థమై తేజోరహితమైనదైనచో దుఃఖము లేదు. నా జాతి యింత దైవోపహతమైన దేలకో? ఈ జాతి చేసిన పాపమున కంతులేదు కాబోలు!”

నిత్య పరిణామానికి సాక్షులుగా ఉండి, దానిని సహజంగా తీసుకుని, పాత, కొత్తల మధ్య ఒక సమన్వయానికి నిరంతర సాధన చేసే జనాలముందు పై వాక్యాలు ముందుకీ, వెనక్కీ కూడా  వెళ్లలేని ఒక అడ్డుగోడను రెండు వైపులా నిర్మిస్తాయి. అయోమయాన్ని కల్పిస్తాయి. విశ్వనాథవారు లక్షించిన వ్యవస్థే కానీ, మరొక వ్యవస్థే కానీ ముందు వెనకల ఎలాంటి పరిణామసూత్రమూ  లేకుండా స్వయంభువుగా అవతరించి అలా ఉండిపోయిందా అని ప్రశ్నించుకున్నప్పుడు రచనలో సంతృప్తి కరమైన సమాధానం దొరకదు.

రచయిత లక్ష్యం స్పష్టమే. చాతుర్వర్ణ్యవ్యవస్థను అత్యంత వైభవోపేతంగా, ఆదర్శప్రాయంగా చిత్రించడం. నాలుగు వర్ణాల వారూ ఎవరి ఎవరి వృత్తి ధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం. ఇందులో పంచములకు స్థానం లేదు. అయితే, ఈ వ్యవస్థకు కాల్పనికప్రపంచంలో ఉన్నంత ఉనికి వాస్తవిక ప్రపంచంలో కనిపించదు. అందుకు తగినట్టే ఇందులోని పాత్రలు రామేశ్వరశాస్త్రి, ధర్మారావు, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని, హరప్ప, గిరిక, గణాచారి, పసిరిక, రంగాజమ్మ, రత్నగిరి మొదలైన పాత్రలు కాల్పనిక ప్రపంచజీవులుగా, అతి మానుషులుగా కనిపిస్తారు. పెళ్లై అత్తింటికి వచ్చిన ధర్మారావు భార్య పెద్ద అరుంధతిని కూడా ఆశ్చర్యచకితం చేసిన అతిమానుష స్వభావం వారిది.  ధర్మారావు మిత్రులు కిరీటి, సూర్యపతి, కుమారస్వామి, రాఘవరావు తదితరులు, మంగమ్మ  వాస్తవిక ప్రపంచానికి చెందిఉంటూనే ధర్మారావుకు చెందిన అతిమానుష కాల్పనిక జగత్తుపట్ల సానుకూలతను, ఆరాధనాభావాన్ని చాటుకుంటూ ఉంటారు. రాధాపతి, చక్రవర్తి, పత్రికాసంపాదకుడు వామనరావు తదితరులు  ఆ భావజాలానికి ప్రతివాదులు. కుమారస్వామి అయితే ధర్మారావుకు విస్తరిత రూపమే. ధర్మారావులోని భావతీవ్రతే అతనిలోనూ ఉన్నా, ధర్మారావు ఉగ్రతను శాంతం కప్పి ఉంచితే కుమారస్వామి ఉగ్రత నేరుగా వ్యక్తమవుతుంది. కుమారస్వామి అని పేరుపెట్టడంలో దేవతల సేనాని అయిన కుమారస్వామిని రచయిత దృష్టిలో ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరిలో చిన్న అరుంధతిని పెళ్లాడిన ఘట్టంలో ధర్మారావుకి శివునితో సామ్యం కనిపిస్తుంది.

viswanatha

రామేశ్వరశాస్త్రి, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని తదితర పాత్రలను అలా ఉంచితే; నవలలో దాదాపు చివరివరకు జీవించిన గిరిక, గణాచారి, పసిరికలు పూర్తిగా అతిమానుషప్రపంచంలోనే ఉండిపోతారు. ధర్మారావు ఒక్కడే అతిమానుష, వాస్తవిక ప్రపంచాలకు మధ్య లంకెగా ఉంటూ, వాటి మధ్య పరిభ్రమిస్తూ, రెండింటి తారతమ్యాలను అడుగడుగునా వివేచించుకుంటూ  గడుపుతాడు. అతని స్థితిని రచయితే ఇలా చెబుతాడు:

“ధర్మారావునకు రెండు జగత్తులు. ఒక జగత్తులో మూకీభావము. మరొక జగత్తులో అనియత వాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యము, ఒక జగత్తు భౌమము. భౌమములో అతి భౌమము. ఒకటి పునీతము, ఒకటి ఇంద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుట ఎంత కష్టమో, దీనినుండి దానికి పోవుటయు అంతే కష్టముగా నున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి! సెలవులు లేనిచో కిరీటి, శివరావు, కళాశాల”.

దివ్యజగత్తులో గడిపే ధర్మారావుకు భౌమ(భూసంబంధమైన)జగత్తులో గడిపే ధర్మారావుకు మధ్య ఎంతో వ్యత్యాసం. భౌమ జగత్తులో గడిపే ధర్మారావు పాఠకులు హృదయాలపై గాఢంగా ముద్రపడతాడు. ఈ జగత్తులో అతను నిరహంకారి, నిగర్వి, గొప్ప మానవీయత కలిగినవాడు, వ్యక్తిత్వమూ, శీలమూ, స్వాభిమానమూ, స్నేహశీలమూ ఉన్నవాడు. వాటితోపాటు కొన్ని లౌకికమైన బలహీనతలూ ఉన్నవాడు. అతని స్నేహశీలాన్ని, మానవీయతను, కృతజ్ఞతను వెల్లడించే హృద్యమైన ఘట్టాలు నవలలో అనేకం ఉన్నాయి. మిత్రుడు రాఘవరావు భార్య మశూచితో చనిపోయినప్పుడు, అంతిమ సంస్కారానికి ఎవరూ సాయపడనప్పుడు; ధర్మారావు, అతని మరో మిత్రుడు సూర్యపతి స్వయంగా శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టిన ఘట్టం వాటిలో ఒకటి. అలాంటిదే జేబుదొంగ అయిన ఆసిరి అనే కుర్రవాడిని ఆదరించిన ఘట్టం. నాయర్ అనే ఒక దుకాణదారు తన అవసరానికి రెండు రూపాయలు ఇచ్చి ఆదుకున్నప్పుడు, తన చేతిలో డబ్బు పడీపడగానే అతని బాకీ తీర్చడానికే ధర్మారావు  తొలి ప్రాధాన్యం ఇస్తాడు. తీరా అతని దుకాణానికి వెడితే, అతను తీర్థయాత్రలకు వెళ్ళినట్టు తెలిసి ఎంతో నిరాశ చెందుతాడు. ఇది అతనిలో కృతజ్ఞతాబుద్ధిని చూపుతుంది.  అతను అనుభవించిన పేదరికం మన మనసుల్ని మెలిపెడుతుంది.

లౌకికంగా అతను కూడా అందరూ ఎదుర్కొనే సాంసారిక సమస్యలు ఎదుర్కొంటాడు, డబ్బు కోసం ఇబ్బంది పడతాడు. ఇంగ్లీషు చదువుతాడు. ఉద్యోగం కోసం ఆరాటపడతాడు. ఒక యవ్వనవంతుడిలో ఉండే సహజమైన వాంఛలు అతనికీ ఉంటాయి. మళ్ళీ తను కూడా అందరిలానే ప్రవర్తిస్తున్నానే అన్న స్ఫురణా ఉంటుంది. తన కార్యానికి తానే వందరూపాయలు పుట్టించుకుని అత్తవారింటికి వెడతాడు. వెళ్ళే ముందు దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను చూసి, శివుడికే సంసార జంజాటం తప్పనప్పుడు తనెంత అనుకుంటాడు. ‘ధర్మారావు సగము విరాగి, అతనిలో వైరాగ్యమెంతయో లాలసత యంత’ అని రచయిత అంటాడు. అయితే శోభనం గదిలో పడక మీద భార్య సరసన ఉండి కూడా అతను దైవచింతనలోకి జారుకోవడం కొంత విపరీతంగా అనిపిస్తుంది. అది రక్తికే కానీ, భక్తికి సందర్భం కాదు. అతనిదా వయసూ కాదు. నవలలో విశేషంగా ఆకట్టుకునే వాటిలో ఒకటి, దాంపత్య శృంగార చిత్రణ. దానిని విశ్వనాథ అంత అందంగా, హృదయదఘ్నంగా చిత్రించినవారు మరొకరు లేరేమో ననిపిస్తుంది.

ఇదే ధర్మారావులో కొన్ని ఇతర లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది విశ్వనాథ వాస్తవికతను అనుసరించిన ఫలితం కావచ్చు. ఎవరితోనైనా వాదించేటప్పుడు ధర్మారావు ఆవేశపడతాడు. అదే సమయంలో తాను ఆవేశపడుతున్నానన్న స్పృహ అతనిలో ఉంటుంది. అలాగే, సారంగధర నాటకానికి వెళ్లినప్పుడు ఒకవైపు నాటకం జరుగుతుండగానే తనూ, కుమారస్వామి అందులోని పాత్రధారులపై, వారి ఆహార్య, అభినయాలపై వ్యాఖ్యలు చేస్తారు. అది పక్కవారికి ఇబ్బందికరమన్న చిన్న విషయం ధర్మారావుకు స్ఫురించదు. ఒక ప్రేక్షకుడు దానిని ప్రశ్నించినప్పుడు కోపం పట్టలేకపోయిన ధర్మారావు తెలిసిన ఒక రౌడీని అతనిపైకి పురిగొల్పుతాడు.

ఇక ధర్మారావు, అతని భావజాలం… అదొక విచిత్ర సంబంధం. ధర్మారావు వ్యక్తిగత లౌకిక ప్రవర్తనలో  వక్రత, సంకుచితత్వం, అమానవీయత, అహంకారం  లేవు. కానీ అతను త్రికరణశుద్ధిగా విశ్వసించే భావజాలంలో అవి ఉన్నాయి.  భావనాత్మకంగా, లేదా సిద్ధాంతపరంగా చెప్పుకుంటే  ఆ భావజాలంలోనూ వక్రత, సంకుచితత్వం, అమానవీయత లేవు. కానీ ఆ భావజాలపు లౌకికప్రతిఫలనంలో ఉన్నాయి. వ్యక్తిగా ధర్మారావులో ఆధిక్యభావన, కింది కులాలపట్ల వివక్ష, ఇతర జాతులపట్ల తృణీకారభావం లేవు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వ్యక్తమవుతాయి. అవి కూడా వాస్తవానికి ఆ భావజాల నిర్మాణంలో ఉన్నాయి. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం ద్వారా దృశ్యమానమవుతున్నాయని సుదర్శనంగారు అన్నారు కానీ వాస్తవానికి వాటిలోని వక్రత, సంకుచితత్వమే ధర్మారావులో దృశ్యమానమవుతున్నాయని భావించడం న్యాయం. మనకిప్పుడు బాగా తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే, ధర్మారావు, అతని భావజలాల సంబంధం ‘అపరిచితుడు’ సినిమాలో హీరో తరహాలో ఉంటుంది.

ఆ భావజాలానికి కాల్పనిక జగత్తులో ఉన్న ఉనికి లౌకిక జగత్తులో లేకపోవడం ఈ వైరుధ్యానికి కారణం. అందులో ప్రాధాన్యం వహించే చాతుర్వర్ణ్యవ్యవస్థ అందరినీ ఇముడ్చుకోగలిగినంత వైశాల్యం కలది కాదు. పంచములకు, మతేతరులకు, విజాతీయులకే కాదు సరికదా; దేవాలయం కేంద్రంగా ఉన్న ఆ వ్యవస్థలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలోనే ఉన్న నాస్తికులకు కానీ, ఆ వ్యవస్థను ప్రశ్నించేవారికి గానీ స్థానం ఉండదు. ఆవిధంగా అది ఇరుకుగానే కాక, నిరంకుశంగా కూడా మారుతుంది. దేవాలయాన్ని, దేవుడినీ, మతాన్ని వ్యక్తిగతం చేసి; భిన్న ప్రాతిపదికపై అందరినీ కలిపే ఏర్పాటుకు అందులో అవకాశం లేదు. ఆ వ్యవస్థలోని మూసుకుపోయిన లక్షణమే ధర్మారావు ఆలోచనల్లోనూ మాటల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అతని దృష్టిలో తన దేశానికి, మతానికి, సంప్రదాయానికీ, సాహిత్యానికి, శాస్త్రాలకూ చెందినవన్నీ గొప్పవే; అందులో చెడు ఉండడానికి అవకాశమే లేదు. ఇతరుల మతాలలో, సంప్రదాయాలలో, సాహిత్యంలో అతనికి అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ రకమైన అతని తారతమ్య వివేచనలో అక్కడక్కడ అర్థవంతమైన, లోతైన భావాలు కనిపించినప్పటికీ ఆ వివేచన  చాలాచోట్ల అశాస్త్రీయంగానూ, హాస్యాస్పదంగానూ పరిణమిస్తుంది. అతను వర్ణభేదం, జాతిభేదం రక్తంలోనే ఉన్నాయని అంటాడు. ఇతర జాతులలోని చెడును విమర్శించేటప్పుడు అలాంటిదే స్వజాతిలోనూ ఉన్న విషయాన్ని విస్మరించి ఆ చెడును ఆ ఇతర జాతి మొత్తానికే ఆపాదిస్తాడు. ఉదాహరణకు, బ్రాహ్మణ యువతి అయిన మంగమ్మ కూడా డబ్బు మీద ఆశతో రామేశ్వరం అనే బ్రాహ్మణేతరునితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే డబ్బుకోసం జమీందారు రంగారావును పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని చర్య మాత్రం ఆ జాతి స్వభావంగా  కనిపిస్తుంది. లౌకికంగా హృదయవైశాల్యం ఉన్నవాడిగా  కనిపించే ధర్మారావు భావజాలం దగ్గరికి వచ్చేసరికి కరడుగట్టి కనిపిస్తాడు.  జాతిమతవర్ణభేదాలను ఎత్తి చూపుతూ మనుషుల్ని ఎక్కడిక్కడ చీల్చి తనను ఆధిక్యస్థానంలో నిలుపుకుంటాడు. ఇందులో పరవిమర్శే తప్ప ఆత్మవిమర్శ తక్కువగా ఉంటుంది.

veyi

ఆధునికమైనవీ, నేడు ప్రగతిశీలకంగా భావించే వాటిని అన్నిటినీ ధర్మారావు మూలమట్టంగా వ్యతిరేకిస్తాడు. అతని దృష్టిలో బాల్యవివాహాలే మంచివి. పంచములు దేవాలయంలోకి రాకూడదు. విద్యుద్దీపాలకన్నా ఆముదం దీపాలే శ్రేష్టం. పర్యావరణం గురించి, ప్రకృతిపట్ల ఆనుకూల్యత గురించి అతని ముఖంగా, లేదా ఇతర పాత్రల ముఖంగా  రచయిత చెప్పే అనేక విషయాలు అర్థవంతంగా ఆలోచనీయాలుగా  కనిపిస్తాయి. అయితే పరిణామగతిలో కొంత మంచితో పాటు చెడూ కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుందనీ, ఆ చెడును తొలగించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలన్న స్పృహకు బదులు; అసలు పరిణామశీలాన్నే వ్యతిరేకించి గతంలోనే ఘనీభవించాలన్న ఒక అసహజమైన, సృష్టి వ్యతిరేకమైన ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.

ధర్మారావులో ప్రశ్నను, విమర్శను కూడా నిషేధించే వైఖరి కనిపిస్తుంది. భార్య అరుంధతి తన మామగారు రామేశ్వరశాస్త్రి నాలుగువర్ణాల వారినీ పెళ్లి చేసుకోడంగురించి, ఆయనకు రత్నగిరి అనే భోగం స్త్రీవల్ల కలిగిన దేవదాసి గిరిక గురించి ఎత్తినప్పుడు అతనికి కోపం వస్తుంది. ఆ ప్రస్తావననే అతడు నిషేధిస్తాడు. ప్రశ్నకన్నా విశ్వాసమే అతని ఆలోచనాసరళికి కేంద్రబిందువు అవుతుంది.

అసలు ధర్మారావుకు ఆదర్శప్రాయమైన ఆ వ్యవస్థ అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని ప్రశ్నించుకుంటే దానికీ సమాధానం దొరకదు. ఆ వ్యవస్థకు తనలానే మొత్తం బ్రాహ్మణ్యమంతా ప్రాతినిధ్యం వహిస్తోందా అంటే, మంగమ్మ భర్త, ఉపాధ్యాయుడు అయిన జోశ్యులు తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తాలూకా బోర్డు అధ్యక్షుడైన రామేశ్వరం ప్రాపు కోసం ఎందుకు పాకులాడతాడు? తన భార్యను అతను లొంగదీసుకునే పరిస్థితిని ఎందుకు కల్పిస్తాడు? మంగమ్మ డబ్బు మీద ఆశతో ఎందుకు కాలుజారుతుంది? ధర్మారావు అత్తగారివైపు వారు కూతురిపట్ల అంత నిర్దయగా, ధర్మవిరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు? రామేశ్వరశాస్త్రి మంచి స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల లాభపడిన బంధువులు అతను చితికిపోగానే ఎందుకు మొహం చాటేశారు?

కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తనొక్కడే తప్ప, సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు. మరి బ్రాహ్మణ్యం ఇలా ఎందుకు దిగజారింది అంటే అందుకు కారణం పరాయి పాలన, పాశ్చాత్యపు పోకడలని ధర్మారావు చెప్పగల సమాధానం. అసలు అంత గొప్ప వ్యవస్థ పరాయి పాలనకు, పాశ్చాత్యపు పోకడలకు ఎందుకు అవకాశమిచ్చింది; ముందే తను దిగజారడం వల్ల అలా జరిగిందా, లేక అది జరిగినందువల్ల తను దిగజారిందా? ఏది ముందు, ఏది వెనక? అన్న ప్రశ్నలకూ సమాధానం దొరకదు.

(సశేషం)

 

 

 

 

మీ మాటలు

*