డియర్ జిందగీ

zindagi

ఏక్టర్లు: అలియా భట్, షా రుఖ్ ఖాన్.
కేమియో పాత్రల్లో-కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేదీ, ఈరా డూబే.
రిలీస్ తేదీ-నవెంబర్ 25, 2016.

రెడ్ చిల్లీస్, ధర్మా ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద- గౌరీ షిండే దర్శకత్వంలో, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. కరణ్ జోహార్ కో-ప్రొడ్యూసర్.
లక్ష్మణ్ ఉతేకర్ ఫోటోగ్రాఫర్.

బాల్యంలో జరిగిన ఒక సంఘటనో, ఏదో అనుభవమో, పెద్దయ్యాక జీవితాలమీద ఏదో దశలో ప్రభావం చూపించకుండా ఉండదు. ఇది సామాన్యంగా ప్రతీ ఒక్కరూ, ఎప్పుడో అప్పుడు ఎదురుకునేదే. ఈ పాయింటునే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, తీసిన సినిమా ఇది.

కథ: సినిమా ప్రారంభంలో, క్రేన్ మీద కూర్చుని ఒక సీన్ షూట్ చేస్తూ కనిపించిన కైరా(అలీయా భట్ )-ఉర్ఫ్ కోకో 20లలో ఉన్న ఒక సినిమాటోగ్రఫర్. ముంబయిలో ఆమె గడిపే జీవిత విధానాన్నీ, ఈ తరపు యువత కష్టపడి పనిచేసి, అంతే ఉల్లాసంగా పార్టీలలో పాల్గొనడమూ అవీ చూస్తాం. కైరాకి జీవితంలో ఎంతో సాధించాలన్న ఆశ ఉంటుంది. కాకపోతే, వృత్తివల్ల పొందగలిగే సంతృప్తి దొరకదు. తనకి తారసపడిన యువకులతో ప్రేమలో పడుతూ కూడా, ఏ బంధానికీ కట్టుబడి ఉండలేకపోతుంది.
మొండి స్వభావం, ముక్కుమీదుండే కోపం. డిప్రెషన్‌కి గురై- స్నేహితులయిన ఫాతిమా, జాకీతోనే గడపడంతోనూ, ఈ బే లో షాపింగ్ చేయడంలోనూ ఓదార్పు వెతుక్కుటూ ఉంటుంది. బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటవుతుంది.

ముంబాయిలో, తనున్న అపార్టుమెంటులో పెళ్ళవని వాళ్ళని ఉండనివ్వనని ఇంటి యజమాని చెప్తాడు. వీటన్నిటివల్లా, ఇన్సొమ్నియక్‌గా తయారవుతుంది. దిక్కు తోచక, అయిష్టంగా, తల్లితండ్రులుంటుండే తన స్వంత ఊరైన గోవా వెళుతుంది. వాళ్ళతో సంభాషణ అన్నా, కలిపి ఉండటం అన్నా విముఖత. తన హోమోసెక్స్యువల్ స్నేహితుని మాట విన్న తరువాత, ఒక మెంటల్ అవేర్‌నెస్ కాన్ఫెరెన్సులో సైకోలొజిస్ట్ జహంగీర్ ఖాన్ (బ్రెయిన్ డాక్టర్- షా రుఖ్ ఖాన్, కైరా మాటల్లో-జగ్)మాట్లాడుతుండగా విని, అతని క్లినిక్కి వెళుతుంది.
ఒక థెరపీ సెషన్లో కోకో- తను బాల్యంలో అనుభవించిన వేదనా, నిస్పృహా, ఆశాభంగాన్నీ అతనికి వెల్లడిస్తుంది. తన చిన్నప్పటి అనుభవాలని బట్టి, వదిలివేయబడటం అంటే కలిగిన భయం వల్ల తానే ఏ బంధాన్నీ నిలుపుకోలేకపోతోందని జగ్ చెప్పి, కైరా తన తల్లితండ్రులని క్షమించనవసరం లేదు కానీ వారిని ఒక తప్పు చేసిన, సామాన్యమైన మనుష్యులుగా మాత్రం చూడమని సూచిస్తాడు.

ఈ సినిమాలో ఖాన్‌కీ, ఆలియాకీ ఈ సినిమాలో ఏ శృంగారపరమైన సంబంధమూ ఉండదు. కాబట్టి ఖాన్ సినిమా అనుకుంటూ చూద్దామని వెళితే కనుక, నిరాశకి లోనయే అవకాశం ఉంది.
“నీ గతం నీ వర్తమానాన్ని బ్లాక్‌మైల్ చేసి, అందమైన భవిష్యత్తుని నాశనం చేయకుండా చూసుకో” అన్న జగ్ సలహా ప్రకారం, కన్నవాళ్ళతో రాజీపడి ఎన్నాళ్ళగానో వెనకబడి ఉన్న తన షార్ట్ ఫిల్మ్ పూర్తి చేస్తుంది.
బీచ్ మీద తన జీవితంలో భాగం అయిన వారందరిముందూ ఫిల్మ్ స్క్రీన్ చేసినప్పుడు- వారిలో, త్వరలోనే తను ప్రేమలో పడబోయే ఆదిత్య రోయ్ కపూర్ కూడా ఉంటాడు.
నిజానికి, సినిమాకి ప్లాటంటూ ఏదీ లేదు. కథనం సాగేది కొన్ని సంఘటనల, కదలికల, భావోద్వేగాలవల్లే.

కైరాకి సినిమాటోగ్రఫీలో సామర్థ్యం ఉందని మొదటి సీన్లోనే చూపించినప్పటికీ, తన వృత్తిలో ఆమె పడే శ్రమకానీ ప్రయాస కానీ కనపడవు. నిజానికి, ఆమె ఆకర్షణీయమైన జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందమైన అపార్టుమెంటూ, ఆర్థిక ఒత్తిడి లేకపోవడం, మద్దత్తుకి ఇద్దరు స్నేహితురాళ్ళూ, రొమాన్సుకి ముగ్గురు అందమైన అబ్బాయిలూ.

కైరా పాత్రకీ, ‘హైవే’ సినిమాలో చివర సీన్లలో ఆమె చూపిన కొన్ని లక్షణాలకీ బాగా పోలిక ఉంది. అవే అణిచివేయబడిన అనుభూతులూ, వేదనాభరితమైన జ్ఞాపకాలని వదిలిపెట్టి, ముందుకు సాగాలన్న సందేశాలూ. అయితే, దీనిలో మట్టుకు వీటిని చూసినప్పుడు మనకి అంత బాధ కలగదు.
ఖాన్ ట్రేడ్ మార్కులయిన శరీర భంగిమలు, పెదవి విరుపులూ అవీ ఈ సినిమాలో కనబడవు. సూపర్ స్టార్‌గా కాక, ఆలియా పాత్రకే ప్రాముఖ్యతని వదిలి, తను పక్కకి తప్పుకున్నాడు. పూర్తి ఫోకస్ ఉన్నది ఆలియా భట్ మీదనే.
గోవా వీధులూ, సముద్రం, ప్రామాణికతని కనపరుస్తాయి. ఆలియా వేసుకున్న బట్టల డిసైన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఉంటాయన్నదాన్లో సందేహం ఏదీ లేదు.

పెద్ద హిట్ అయిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాని డైరెక్ట్ చేసిన గౌరీ షిండే, మరి ఎందువల్లో కానీ ఈ సినిమాలో అంత ఎక్కువ వ్యక్తీకరించలేకపోయిందనిపిస్తుంది.
2.5 గంటల నిడివి కొంచం ఎక్కువే అనిపించినప్పటికీ, 4 ఏళ్ళల్లోనే 10 సినిమాల్లో నటించి, ఆలియా ఒక ఏక్టర్గా ఎంత ఎదిగిందో అని చూడటానికి ఈ అదనపు టైమ్ వెచ్చించడం సమంజసమే.

అమిత్ త్రివేదీ సంగీతం తేలిక్గా ఉంది. ‘గో టు హెల్’ అన్న పాట, హర్టుబ్రేక్ తర్వాత కలిగే నొప్పిని చక్కగా వర్ణిస్తుంది. ‘లవ్యు జిందగీ’ పాట వింటే, జీవితాన్నీ అది కలిగించే అనుభూతులన్నిటినీ అంగీకరించాలనిపిస్తుంది. కౌశార్ మున్నీర్ లిరిక్స్ ఇంపుగా ఉండి, అర్జీత్ సింగ్ పాడిన ‘ఏ జిందగీ’’ పాట, ఇప్పటికే అందరి నాలికలమీదా ఆడుతోంది.

ఖాన్‌తో థెరపీ సెషన్స్ అయిన తరువాత తప్ప, కైరా చిరాకెందుకో మనకకర్థం అవదు. తన తల్లితండ్రులతో, బంధువులతో కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు.

ఒక యువతి అంతర్గత జీవితాన్ని ఇంత విశదంగా అన్వేషించిన బోలీవుడ్ సినిమాలు చాలా తక్కువ.
ఈ ఫిల్మ్ ఉద్దేశ్యం కేవలం ప్రేక్షకులకి ఒక కథ అందించడమే అనీ, ఏ సామాజిక సందేశాలనీ ఇవ్వడం కాదనీ షిండే, భట్, ఖాన్ ముగ్గురూ-ఇంటర్వ్యూల్లో చెప్పినప్పటికీ, ఈ మధ్యే కొంతమంది సెలెబ్రిటీలు తాము తమ డిప్రెషన్తో ఎలా పోరాడారో అని పబ్లిక్గా చెప్పిన వెనువెంటనే, మానసిక ఆరోగ్య థెరపిస్టులని విసిట్ చేయడం అంటే ఏ పిచ్చిలాంటిదో ఉన్నప్పుడే, అన్న భ్రమని డియర్ జిందగీ కొంతలో కొంతైనా తొలిగించగలుగుతుందేమో!

సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరికీ బి డి (బ్రెయిన్ డాక్టర్) అవసరం తప్పక ఉంటుందనీ, దాన్లో తప్పేమీ లేదనీ మనం అంగీకరిస్తాం.
ఒక సీన్లో, కైరా బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటయిందని స్నేహితురాలైన ఫాతిమా( ఇరా డూబే) చెప్పినప్పుడు, పచ్చిమిరపకాయొకటి కొరికి నమిలి మింగేసి, ఎగపీలుస్తూ, ‘అది మిరపకాయవల్లే’ అని ఫాతిమాతో అని, తప్పించుకుంటున్న ఆలియా మొహంలో చూపిన షాక్, అపనమ్మకం లాంటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఒక ఏక్టర్గా ఈ మధ్య తనకి ఇంత చిన్న వయస్సులోనే, ఇంత పేరెందుకు వస్తోందో అర్థం అవుతుంది.

ఇకపోతే, షిండే చాలా భారీ పాఠాలన్నిటినీ ఒకే స్క్రిప్టులో కూరడానికి ప్రయత్నించిందేమో అనిపించక మానదు.

కైరాని, ఆమె అంకుల్ తను ‘లెస్బియనా?’ అని అడగడానికి బదులు ‘లెబనీసా?’ అని అడగడం హాస్యం అనిపించదు.
సినిమాకి అతకకపోయిన కొన్ని ఇలాంటి చెదురుమదురు సీన్లు తప్పితే, డియర్ జిందగీ తప్పక చూడవలిసిన ఫిల్మ్.
*

 

 

మీ మాటలు

  1. Suresh Venkat says:

    చాలా చాలా బాగుంది మీ రివ్యూ. కొన్ని కొత్త సంగతులు తెలిసాయి మీ వ్యాసం చదివిన తరువాత. మీరు అన్నట్లు హైవే పాత్రకి, ఇందులో పాత్రకి కొద్దిగా పోలిక ఉన్నట్లే ఉంది. ఇది చదివాక నిజమే అనిపించింది నాకు. షారుఖ్ ట్రేడ్మార్క్ ఆక్టింగ్ ఇందులో లేక పోవటం భలే రిలీఫ్ కదండీ :D ?

    ఇక పోతే, కైరా అందరి పై చిరాకుగా ఉండటానికి కారణం నాకు తెలిసి, అదొక మాస్క్… తన vulnerable సైడ్ బయట ప్రపంచానికి తెలియకుండా వేసుకొన్న మాస్క్. ఈ మధ్య చూసిన సినిమాలలో నాకు బాగా నచ్చిన సినిమా పై మీ రివ్యూ కూడా నాకు బాగా నచ్చింది. thank యు వెరీ మచ్

    • Krishna Veni Chari says:

      థేంక్యూ, థేంక్యూ, థేంక్యూ-నచ్చినందుకూ, మెచ్చుకున్నందుకూ కూడా.
      అవును, హైవేలో అలియా పోషించిన పాత్రకి గతం గురించి ఉన్న మానసిక సంఘర్షణ ఇక్కడా కనబడుతుంది. ఖాన్ సోబర్ ఏక్టింగ్ మెచ్చుకోదగ్గదే.

  2. amarendra dasari says:

    ఏ రివ్యూ కయినా ‘ఆ విషయం మీద చదువరులకు ఆసక్తి కలిగించి – ‘చూడాలి’ అన్న ఉత్సుకత కలిగించడమే పరమార్ధం’ అయినట్లయితే ఈ రివ్యూ నిజం గా సఫలం !! థాంక్స్

    • Krishna Veni Chari says:

      ఓపికగా చదివి, మెచ్చుకున్నందుకు చాలా థేంక్సండీ అమరేంద్రగారూ.
      చూడండి. నచ్చుతుంది మీకు.

  3. Sasikala Volety says:

    Chakkaga విశ్లేషించిన రివ్యూ. నేను మూవీ చూసాను. అలియాBhat ఎంత పరిపక్వమయిన నటన చూపించిందో!!. మొదటి ట్వంటీ మినిట్స్ సినిమా మామూలు Bollywood కరణ్ johaar మూవీ లాగే ఉంది. కానీ రానుraanu జీవం పుంజుకుని అర్ధవంతంగా ముగుస్తుంది . షారుఖ్ రోల్ చాలా రిలీఫ్. మూవీ లో క్లారిటీ తక్కువ . కానీ ఈతరం vaari మానసిక సంఘర్షణ అర్ధం అవుతోంది . మొత్తం మీద మంచి సినిమా అనిపిస్తుంది. మీ సమీక్ష చాలా sensible గా,,డిటైల్డ్ గా ఉంది. Humour లేకపోవడం కొంత disappointment . మంచి రివ్యూకు ధన్యవాదాలు.

    • Krishna Veni Chari says:

      శశికళ వోలేటిగారు,
      చదివి కామెంటు పెట్టినందుకూ, మెచ్చుకున్నందుకూ బోల్డు థేంక్యూలు.
      కరణ్ జోహార్ కో- ప్రొడ్యూసర్ మాత్రమే అయినందువల్ల అతని మార్క్ కనిపించకపోవడమూ మంచిదే అయింది-నిజమే.
      హ్యూమర్ లేకపోవడం- అన్నది ప్లస్ పోయింటే అనుకుంటాను. లేకపోతే సబ్జెక్టుకి ఉన్న సీరియస్ నెస్ డైల్యూట్ అయి ఉండేదేమో మరి!

  4. గంగాధర్ వీర్ల says:

    రివ్యూ.. బావుంది. రివ్యూకి ఉండాల్సిన లక్షణాలన్నీ మీ విశ్లేషణలో కనిపించాయి.
    చెప్పే విధానం బావుంది. కావాలని సినిమాను ఖండ ఖండాలుగా చీల్చి చెండాడకుండా.. న్యాయం చేశారు

    • Krishna Veni Chari says:

      గంగాధర్ వీర్లగారూ,
      థేంక్యూ ఆండీ. వెబ్ పత్రికకి రాసే రివ్యూ ఇలాగే ఉండాలో, మరొకలాగానో అన్న నా సందేహాన్ని తీర్చారు మీ కామెంటుతో.

  5. చాలా బాగా రాసారండి.మీరు రాసిన దానిని బట్టి తప్పక చూడాల్సిన సినిమా అనిపిస్తోంది.

    • Krishna Veni Chari says:

      థాంక్యూ మాలగారూ.
      సినిమాలో లొసుగులు లేవని కాదు కానీ, వస్తున్న కమర్ష్యియల్ కినిమాలతో పోల్చి చూస్తే, ఒకసారైనా చూడతగిన సినిమా. చూడండి. నచ్చుతుంది మీకు.

  6. ఎం సెప్తిరి ఎం సెప్తిరి మరి కేక కాదు కానీ బాగా సెప్తిరి

    “నీ గతం నీ వర్తమానాన్ని బ్లాక్‌మైల్ చేసి, అందమైన భవిష్యత్తుని నాశనం చేయకుండా చూసుకో

    ఇది సూపెర్స్తో సూపర్

  7. Krishna Veni chari says:

    Venkat garu,
    Thank you for reading. By the way, I was not the dialogue writer for this movie.

  8. నేను ఇందాకే చూసివచ్చాను .మీరు చాలా కరెక్ట్ గా విశ్లేషించారు .ఆలియానటన చూసి చాలా అబ్బురపడ్డాను .అంత చిన్న వయసులో ఆమె చూపిన హావభావాలు ఎంతో అద్భుతంగా వున్నాయి .మొత్తంగా ఒకసారి సినిమా చూడవచ్చు ,మీకు అభినందనలు కృష్ణవేణి గారూ

    • Krishna Veni says:

      మన్నెంశారదగారూ,
      థేంక్యూ అండీ.
      కొత్త సినిమా కదా! ప్లాటూ కథా బయటపెట్టకుండా ఎలా రాయాలో, అని చాలా తటపటాయించి రాశాను. మీరు మెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది.

  9. చాలా బావుంది వేణి గారు.

  10. By now, most must have watched the movie.
    If possible, kindly do share your views too.
    Thank you.

Leave a Reply to amarendra dasari Cancel reply

*