ఓ బంగారు ‘కుట్టపాయ్’ కథ

 

 mahy

‘మాహీ’ నా తొమ్మిదేళ్ళ బుజ్జి ఫ్రెండ్. పక్కింటి బీహారీ పిల్ల. ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంచుతాను. ఈ చిన్న సీతాకోకచిలక స్కూల్ లేని టైంలో బుద్ధి పుట్టినప్పుడల్లా నా మీద వచ్చి వాలుతూ ఉంటుంది.  టాటాస్కై చానెల్ లో వస్తున్న ‘ఓట్టాళ్’ మలయాళీ సినిమా చూస్తున్నాను. వచ్చి వాలింది మాహీ. కూచోబెట్టి సినిమా చూడమన్నాను. కుర్చీ తెచ్చుకుని కూర్చుంది బుద్ధిగా.

ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అంటూ ఓ చానెల్ కి పేరు పెట్టి 2015లో వచ్చిన కొన్ని మంచి సినిమాలు వేస్తోంది టాటాస్కై. ఇంతకుముందు దూరదర్శన్ చేసేపనిని చేస్తోందన్నమాట.

‘ఓట్టాళ్’ అంటే అర్థం ‘చేపల్ని పట్టే బుట్ట’ అని. ఇదేదో 70ల్లో వచ్చిన ఆర్ట్ ఫిల్మ్ లా ఉన్నట్టుందిలే, మాహీ తితిలీ రెక్కలు విదిలించి లేచెళ్లిపోతుందని అనుకుంటూనే ఉన్నా, ఇంతలోనే నన్నూ మాహీని బుట్టలో పెట్టేసింది ఆ సినిమా. బుద్ధిని కాదు. మనసుని నిజాయితీగా స్పర్శిస్తోంది ‘ఓట్టాళ్’.

‘వాంకా’ కథ ఏంటన్ చెకోవ్ ది.  వాంకా అనే ఒక చిన్న పిల్లవాడు తన తాతకు రాసిన ఉత్తరం అది. తాత అతన్ని మాస్కోలో ఒకరింట్లో పనికి పెడతాడు. అక్కడ వాళ్ళు తనను పెట్టే హింస అంతా వివరిస్తూ తనను ఇంటికి తీసుకుపొమ్మని ఏడ్చుకుంటూ వాంకా పల్లెటూళ్ళో వున్న తాతను బతిమాలుతూ రాసిన ఉత్తరం ఆ కథ.  చివరకు అడ్రెస్ రాయాల్సిన చోట ‘To my grandfather, The village’ అని రాసి కొంచెం ఆలోచించి తాత పేరు కూడా రాసి పోస్ట్ డబ్బాలో వేసేస్తాడు. మనుషుల అడ్రెస్ లెలా ఉంటాయో తెలియని అమాయకపు పిల్లగాడు వాడు. ఆ రాత్రి నిద్రపోతూ తాత తన ఉత్తరాన్ని చదువుతోన్నట్టు కలగంటూవుంటాడు. కథంతా చదివాక ‘అబ్బా, వీడిబాధ ఇక ఇంతేనన్నమాట’ అని నిస్సహాయతలో పడతాం.  చెఖోవియన్ టచ్…

mahy5

ఈ కథని కేరళకి లాక్కొచ్చి కుట్టనాడ్ నీలాల నీళ్ళూ, ఆకుపచ్చ పొలాలూ, అడుసునేలల మీద నిలబెట్టేడు దర్శకుడు జైరాజ్. (దేశాడనం, కలియాట్టం లాంటి సినిమాలుతో పేరు తెచ్చుకున్న జైరాజ్ ఇంకో సినిమా ‘వీరమ్’ ఈ డిసెంబర్ లో వస్తోంది. ప్రముఖుల సాహిత్యాన్ని సినిమాలు తీయటం ఈయనకు ఇష్టం). చెఖోవ్ కథకు పర్యావరణస్పృహనీ  కుట్టనాడ్ జీవనశైలినీ జోడించి ‘ఓట్టాళ్’ సినిమా తీశాడు జైరాజ్.  ఈ సినిమాలో వున్న తాతా మనవళ్ళ అనుబంధమంత బలంగా కనిపించదు చెఖోవ్ కథలోని వాళ్ళిద్దరి అనుబంధం.  కాకపోతే బాలకార్మికుల వ్యవస్థ నూటముప్ఫై ఏళ్ల కిందట చెఖోవ్ కథనాటికీ ఈనాటికీ మురికిగుంటలా ఊరుతూనే ఉంది.

కేరళ సాంప్రదాయనృత్య రీతులమీదా, సంగీతం, జానపద శైలుల మీదా ఆసక్తి ఉన్న జైరాజ్ ఈ సినిమాకి నాటకరంగ ప్రముఖుడూ కవీ అయిన కావలమ్ నారాయణ పణిక్కర్ ను సంగీతదర్శకునిగా తీసుకున్నాడు. తాతా మనవడూ విడిపోయే ముందు ఒక పాట వస్తుంది. బాధనంతా రంగరించి పణిక్కర్ ఆ పాట రాశారు. (ఆర్నెల్ల కిందటే పణిక్కర్ చనిపోయారు) ఆయనసంగీతం, పాటా తోనే సినిమాకు సగం ఆర్ద్రత వచ్చేసింది. మరింత తడిని అద్దింది సినిమాటోగ్రాఫర్ ఎం.జే.రాధాకృష్ణన్.  ఎంత బడ్జెట్ ఉన్నా ఎడిటింగ్ సూట్ దగ్గర రంగులన్నిటినీ  సాచురేషన్ బార్ చివరికి తీస్కెళ్ళి, ఆకుపచ్చరంగుకైతే  రేడియం అద్దినట్టుచేసి మన మొహాన గుద్దుతున్న  సినిమాలూ సీరియళ్ళనుండి పెద్ద రిలీఫ్ ‘ఓట్టాళ్’.  రేడియం ఆకుపచ్చ కాకుండా పచ్చనిఆకు రంగు దొరుకుతుంది ఈ సినిమాలో.  ఫిష్ ఐ లెన్స్ తో మనోహరమైన కుట్టనాడ్ భూమినీ నీళ్ళనీ వంచినా, బాతులమంద వంకీలు వంకీలుగా నీళ్ళమీద చేసే విహారాన్ని సరైన లెన్సింగ్ తో పట్టినా, ‘కుట్టపాయ్’ నల్లటి చిన్ని మొహంలోని కళ్ళమీది వెలుగుని ఇట్టే పట్టుకున్నా రాధాకృష్ణన్ అన్నిట్లోనూ లీనమై చేశాడు.

mahy2

పై ఫోటో రితు రాజ్ కన్వర్ (‘ది హిందూ’ ఫోటోగ్రాఫర్) అస్సాం వరదలప్పుడు 2014 లో తీసినది. ఈ ఫోటో చూశాకా ‘వాంకా’ కథను ఎలా తీయాలన్న విషయమై ఒక స్పష్టత వచ్చిందని అంటాడు జైరాజ్. తన సినిమాలో కూడా ఇలాంటి ఫ్రేమ్ ను తీయాలని అనుకున్నాడట. అలా కుట్టనాడ్ లోకి వచ్చిదిగింది ‘వాంకా’ కథ.

స.వెం. రమేశ్ ప్రళయకావేరి కథల్లాగా ‘ఓట్టాళ్’ కుట్టనాడ్ జీవనసరళిని గానంచేసే దృశ్యకావ్యం.  ఇది బాలల చిత్రం. పర్యావరణ చిత్రం. తాత్విక చిత్రం. ఇంకా మనిషిని ప్రకృతినుంచి లాక్కెళ్ళి ఎక్కడెక్కడో పరాయిచోట్లకి విసిరేసే అసమానతలనీ బీదరికాన్నీ, డబ్బుకోసం బాల్యాన్ని కాటేసే పాముల దౌష్ట్యాన్నీ  చూపించే చిత్రం.

చలం బెన్నూర్కర్ తీసిన తమిళ డాక్యుమెంటరీ ‘కుట్టి జపానిల్ కులందైగళ్’ (Children of mini Japan) శివకాశీ పరిశ్రమల్లో నైపుణ్యం లేని బండచాకిరీలు చేసి కునారిల్లే బాలకార్మికుల కథల్ని చెప్తూ బాధిస్తుంది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’ చూస్తే ముంబై రెడ్ లైట్ ఏరియాలో కాలిపోతున్న బాల్యపు మొగ్గల కమురువాసన ఘాటుగా ఆవరించి చెమటలు పట్టిస్తుంది. ‘ఓట్టాళ్’ ఓ పక్క ప్రకృతితో మనల్ని ముడేస్తూనే మరోపక్క తెగిన బంధపువేళ్ళ తడిని కంటిమీదికి రప్పిస్తుంది.

mahy4

‘ఓట్టాళ్’ ని తీరికగా ఎక్కడా ఆగకుండా (టాటాస్కై అలాగే వేస్తోంది యాడ్స్ బాధ లేకుండా) కళ్ళకు నింపుకుంటూ చూడాలి. నెమ్మదైన జీవితవిధానానికి తగ్గట్టున్న విలంబిత లయ ఈ సినిమాది. ఎప్పుడూ గేలం వేసి ఒడ్డున కూచుని ఎదురుచూసే ఒక పరిచయస్తుడైన వృద్ధుడు “చేప పడటంలోనే కాదు. ఇలా కూచోడంలో కూడా ఆనందం ఉంది” అంటాడు కుట్టపాయ్ తో. ఎదురుచూడటాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారిప్పుడు? కుట్టపాయ్ ఆయనతో ‘నేను చదువుకుని సిటీకి వెళ్లి చాలా సంపాదించి నీకో పెద్ద గేలం కొనిస్తా’ అంటే ‘చేపలు పట్టటానికి చిన్న గేలం చాలు. చిన్నగా బతికితే చాలు’ అని హితవు చెప్తాడు.

డెబ్భైఅయిదేళ్ళ ‘వలియప్పచ్చాయ్’(వాసుదేవన్) తొమ్మిదేళ్ళ కుట్టపాయ్ (ఆశాంత్ కె. షా)కి తాత. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకు చనిపోగా మిగిలిపోయిన కుట్టపాయ్ ని కుట్టనాడ్ తీసుకొచ్చి బాతులమందను సాకుతూ బతుకు లాగుతుంటాడు. ఆ ఊర్లోనే ఉన్న పెద్దింటి పిల్లవాడు టింకూ కుట్టపాయ్ తో స్నేహం చేస్తాడు.  అతని తల్లి కుట్టపాయ్ ని కొంత దయతో చూస్తుంటుంది. టింకూ తండ్రికి మాత్రం కుట్టపాయ్ ఓ అలగాజాతి పిల్లవాడంతే. తాతను సతాయించి చేపా రొయ్యా పట్టి, గిన్నె గరిటా కొనిపించి మరీ టింకూ కోసం వంట చేయిస్తాడు కుట్టపాయ్.  టింకూని భోజనానికి పిలవటానికని కుట్టపాయ్ వస్తే, ఎందుకొచ్చాడో కూడా తెలుసుకోకుండా ‘మిగిలిన తిండి వస్తువులేవో  వాడికిచ్చి పంపించు’ అని భార్యతో అనగలిగేంత బండమనిషి టింకూ తండ్రి.  కలువపూలూ, బాతులూ, వాటి గుడ్లూ, వాటిని పొదిగే కోడిపెట్టా, పేరులేని కుక్క (దానినలాగే పిలుస్తాడు కుట్టపాయ్), పడవలవాళ్ళ కోసం ఎత్తయిన కర్రచివర్న దీపంపెట్టే పరోపకారీ, ఎప్పుడూ ఓపిగ్గా గేలంవేసి ఎదురుచూసే మరో పండుముసలాయనా,  కుట్టనాడ్ లో ఎవరికీ ఉత్తరాలు రావని చెప్తూ సైకిల్ మీద తిరిగే పోస్ట్ మాన్,  తాత కల్లు తాగే అంగడీ… వీటన్నిటి మధ్య ప్రకృతి పాఠాలతోబాటు బాతుల్ని సాకటం నేర్చుకుంటూ బతికే కుట్టపాయ్ కొంచెం అల్లరీ, ఎంతో తెలివీ, మరెంతో సున్నితత్వం నింపుకున్న బంగారుతండ్రి. స్వేఛ్చగా కుట్టనాడ్ ఒడిలో ఆదమరిచి వున్న వాడి కొంపముంచే మాయరోగం తాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. చావుకి దగ్గరలో ఉన్న తనతర్వాత ఈ పసివాడిని చూసుకునేదెవరని బెంగపడ్డ వలియప్పచ్చాయ్ పాపం ఈ బుజ్జి బాతుపిల్లను, శివకాశీ పరిశ్రమకి పిల్లల్ని అమ్ముకునే పాము మాటలు నమ్మి, వాడితో పంపించేస్తాడు. ప్రశాంత ప్రకృతిలోంచి గాడీరంగుల ఇళ్ళతో నిండిన శివకాశీకి ఒక్కసారి కుట్టపాయ్ తో వచ్చిపడటం మనకీ ఎంత బాధో!  జైరాజియన్ టచ్…

mahy3

ఇంకేముంది? తను పడుతున్న బాధలు వివరిస్తూ ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేస్తాడు కుట్టపాయ్. వాడు రాసిన అడ్రెస్,  “మా తాతకి, కుట్టనాడ్” అంతే.  ఆ రాత్రి నిద్రపోతూ తన ఉత్తరాన్ని తాత, టింకూ కలిసి చదువుతున్నట్టు కలకంటుంటాడు. ఆ కల నిజం అయిపోతే బాగుండును  …

“నా మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

పంటలైపోయాయ్, పండుగలైపోయాయ్.

మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

దేశదిమ్మరిదొర కలలపిట్టా

ఎక్కడికి పోయావ్? ఎటు తప్పిపోయావ్?

మనం ఒకర్నొకరు కనలేదూ ?

ఒకర్నొకరం వినలేదూ?

మనస్సలా చూస్తూనే ఉన్నా, మౌనం ఇంకా బద్దలుకాలేదు.

నా బాతులమంద లాగా

నేను చెదిరిపోయాను.

నేను చెదిరిపోయాను.

మీసాల కొసలు చెదిరిపోయాయ్.

పంపానది ఆత్మలోకి మాయమైపోయాయ్.

కదిలే నా తెడ్లు చెదిర్చిన నీటిలాగా నేనూ చెదిరిపోయాను.”    

తాత చెదిరిపోయాడు. మనవడు పట్నంపాలై పోయాడు.

“ఇలా బాలేదు ఆంటీ. తాత దగ్గరికి ఇంక వెళ్లలేడా?” అని బెంగగా వెళ్ళిపోయింది మాహీ.

(ఈ సినిమా టాటాస్కై ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చానెల్ లో పదేపదే చూపిస్తున్నారు. ఇంగ్లిష్ సబ్స్ తో సహా)

పాట ఇక్కడ ఉంది.

 

 

మీ మాటలు

  1. వెంటనే చూడాలనిపించేలా వుంది మీ పరిచయం. కానీ మీ మాహీ లాగా బెంగొచ్చేసింది అప్పుడే. కొంతమంది దర్శకులు, రచయితలు, గాయకులు, గానుగెద్దుల్లాగా హాయిగా సాగిపోతున్న జనాలని చూసి ఓర్చలేరు. మనసులను మెలి పెట్టి, గుండె వుందని గుర్తు చేసి, ఎండిపోయిన కన్నులకు కన్నీటి మరకలంటించి కానీ వదలరు. తప్పకుండా చూడాలనిపించే పరిచయానికి ధన్యవాదాలు.

  2. ఎంత బాగా రాసారో.

  3. లలిత గారూ – మంచి పరిచయం. ధన్యవాదాలు.
    అయితే మీరు వెంటనే “గిఖోర్ ” సినిమా చూడాల్సిందే .
    Gikor is a 1982 Armenian drama film based on Hovhannes Tumanyan’s

  4. చాలా చాలా ఏళ్ల క్రితం ఢిల్లీ దూర దర్శన్ నుంచి రాత్రి తొమ్మిది తరువాత వచ్చే కార్యక్రమాలలో ఒక్కొక్క ఎపిసోడ్ గా ఒక కధను వేసేవాళ్ళు. ఇదే ఇతివృత్తం తో “नंदू की चिट्टी” అని వచ్చింది. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. 1985 – 90 మధ్యలో.

  5. Mythili Abbaraju says:

    అయ్యో.ఇక అంతేనా…అసలు అమ్మా నాన్నా అలా ఎందుకు –
    ఏడుపొస్తోంది.

  6. manjari alkshmi says:

    చాలా బాగా raasaaru.

  7. DR.suman lata rudravajhala says:

    మీ పరిచయమే ఒక సినిమా చూసిన అనుభూతి నిచ్చింది .ఈమధ్య నేను మరాఠీ లఘు చిత్రాలు టాటా స్కై లోనే చూసి తెలుగు లో ఎందుకు ఇంత బలంగా ఉండవని బాధ పడ్డాను.ధన్యవాదాలు . డా.సుమన్ లత

  8. ఎ కె ప్రభాకర్ says:

    నేనూ వొక కలలా వొక అలలా ‘ చెదరిపోయాను’ .

  9. Vvlakshmidevi@gmail.com i says:

    లలితగారూ
    ఎంత బాగా అందించారు, ఆ తాతా మనవళ్ల అనుబంధవిషాదాల చిత్ర పరిచయాన్ని. గుండె బరువెక్కిపోయింది ఈ తెల్లవారుజామున

  10. Lalitha P says:

    అభిప్రాయాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు…

మీ మాటలు

*