వెంటాడే ప్రశ్నల పెరుమాళ్ నవల!

murugan

పెరుమాళ్ మురుగన్ గానీ ఆయన రచనలు గానీ నాకు తెలిసింది ఆయన రాసిన “మాధుర్భగన్” వివాదాస్పదమయ్యాకే. దీన్ని అనిరుద్దన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి “One Part Woman” పేరుతో అనువదించారు. తమిళం మాతృక పేరు “మాధుర్‌భగన్”, “మాదోర్‌భగన్”, “మాధోర్‌భాగన్” ఇలా వేర్వేరుగా అక్కడక్కడా రాయబడింది. ఏదీ సరైనదో తమిళం తెలిసిన వారు చెప్పాలి.

కథంతా తృతీయ పురుషలో వుండినా అక్కడక్కడా ఆయా పాత్రల స్వగతంతో ప్రథమపురుషలోనూ వుంటుంది. వరుసక్రమంలో కథ నడిచినట్లున్నా సందర్బాన్నిబట్టి ఆయా పాత్రల ఆలోచనల్లో, సంబాషణల్లో వెనక్కి, ముందుకూ వెళుతూ వుంటుంది. అయినా ఎక్కడా వర్తమానాన్ని వదిలిపెట్టిన స్పృహ వుండదు. చాలా సహజంగా కథ నడుస్తూ వుంటుంది. నాకు అలవాటులేని పాత్రల పేర్లు కావడం వల్లనేమో కథ మొదలయిన చాలా సేపు “కాళి” అనగానే నాలో అమ్మాయి మెదిలేది. కాళి పేరులో అబ్బాయిని చూడటం కాస్తా యిబ్బంది పెట్టింది.

పిల్లలు లేని యువదంపతుల ఆవేదన ప్రతి దృశ్యంలోనూ కనిపిస్తుంది. కాసే చెట్టు, ఈనే ఆవు, పిల్లల కోడి, ఆడే పిల్లలు … ఇలా ప్రతిదీ ఆ కోణంలోనే వారికి కనిపిస్తుంటుంది. పిల్లలు నిజంగా వారికోసం కావాలా? లేక కేవలం సమాజపు మెప్పుకోసం, అంగీకారం కోసం కావాలా అన్న ప్రశ్న మనలను వెంటాడుతూవుంటుంది.

నవలా నేపథ్యం స్వాతంత్య్ర పూర్వం తిరుచెంగోడ్ పట్టణ పరిసర పల్లెలు, తిరుచెంగోడ్ తిరునాళ్ళు. కాళి, పొన్నయి అనే దంపతుల చుట్టూ అల్లబడిన నవల. పెళ్ళి అయిన మూడు నెలల నుండీ ప్రారంభమవుతుంది కథనం. పెళ్ళి అయి నెలలు గడిచేకొద్దీ పిల్లలు కలగని దంపతుల అవస్థలు ఎలా వుంటాయో ఈ ఆధునిక యుగంలో కూడా నాకు కొంత పరిచయమే. అలాంటిది ఎటువంటి వైద్యపరమైన చికిత్సలూ, బిడ్డలు కలగకపోవడానికి గల కారణాలు కనుక్కోగల పనిముట్టులూ లేని ఆ రోజుల్లో ఓ పల్లెటూరిలోనిలోని దంపతుల వ్యథ ఎలావుంటుందో చెప్పనలవిగాదు. కొంతమంది తెలిసీ, మరికొంతమంది తెలియకా పిల్లలు కలగని వారిని మానసిక వత్తిడికి గురిచేస్తూ వుంటారు. ఆ వత్తిడి ఎన్ని మార్గాల్లో, ఎన్ని విధాలుగా వుంటుందో తెలిస్తే ఓ విధమైన షాక్‌కు గురవుతాము.  

కథలోకి వస్తే కాళి, పొన్నయి ఒకరిపై ఒకరికి అనురాగమున్న కొత్త దంపతులు. పెళ్ళి అయిన మరుసటి నెల నుండే నెల తప్పలేదేంటని కంగారు మొదలవుతుంది. పిల్లలు పుట్తకపోవటమన్న బెంగ పీడిస్తూవుంటుంది. వూరి జనాలవల్ల రకరకాలుగా అవమానింపబడతారు. కాళి పెళ్ళికి ముందు తన మిత్రబృందంతో ఎంతో కలివిడిగా, హుషారుగా తిరిగినవాడు. కానీ పెళ్ళయిన కొన్ని నెలలనుండీ ఏదో సందర్భంలో మిత్రులనుండి తను నపుంసకుడు అన్న అర్థంలో మాటలు పడాల్సి వస్తుంది. అప్పటినుండి మెల్లమెల్లగా తనలోకి కుచించుకుపోతాడు. మొదట తన తల్లి రెండోపెళ్ళి గురించి మాట్లాడినా తన భార్య స్థానంలో మరో స్త్రీని వూహించుకోలేడు. అదీగాక తనలోనే లోపముండీ ఆమెకూ పిల్లలు పుట్టకుంటే ..అన్న ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంది. తను కేవలం ఇంటికీ, పొలానికే పరిమితమయి ఈ బయటి హేళనల నుండి కాస్తా వుపశమనం పొందినా, పొన్నయి అవమానపడిన ప్రతిసారీ ఆమెను ఓదార్చలేక కృంగిపోతూవుంటాడు. ఇద్దరూ ఒకరిలోఒకరు కరిగిపోవడం ద్వారా వుపశమనం పొందుతూ వుంటారు.

ఆమె గొడ్రాలుతనాన్ని అలుసుగా తీసుకొని ఆమెను పొందాలని ప్రయత్నిస్తాడొకడు. వాళ్ళకు ఎలాగూ పిల్లలు లేరు కదా వారి తదనంతరం ఆస్తి తమపిల్లలకు చేజిక్కించుకోవచ్చని దూరపు బంధువులు తమ పిల్లలను వీరింటికి పంపుతూ వీరికి చేరువ చేయాలని చూస్తూ వుంటారు. ఓ అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు జరిపిన వేడుకలో పొన్నయిని దూరంగా వుంచుతారు. ఓ గొడ్రాలు దీవిస్తే ఆ అమ్మాయికి అశుభం అని వాళ్ళ నమ్మకం.

“కూడబెట్టి కూడబెట్టి ఏమి చేసుకుంటారు డబ్బుని, బాగా తిని, మంచి బట్టలు వేసుకొని హాయిగా వుండండి.” అంటుంది ఆమె ఆడపడచు ఒకసారి. “ఏం, ఇప్పుడు మేము ఆకలితో ఛస్తున్నామా? బట్టలు లేకుండా మీయింటిముందు బిత్తల తిరుగుతున్నామా?” అని పొన్నయి విరుచుకుపడుతుంది. పక్కవూరిలో తన స్నేహితురాలి ఇంట్లో పెళ్ళికి వెళుతుంది ఓసారి. ఆ స్నేహితురాలు ఈమెను తనకు సహాయపడటం కోసం పెళ్ళి సమయం కంటే బాగా ముందే రమ్మన్నా, ఎవరూ తోడులేకపోవడంతో అందరితో పాటే వెళుతుంది. “ముందే రమ్మని చెప్పినా ఇప్పుడు వస్తున్నావు, నీ కూతుర్లను తయారుచేసేసరికి ఇంత ఆలస్యమయ్యిందా?” అని నిష్టూరమాడుతుంది ఆమె. పొన్నయి అక్కడ కోపంతో ఏమేమో అని పెళ్ళి చూడకుండానే తిరిగి వెళ్ళిపోతుంది.

పొన్నయి ఎన్నోసార్లు తన పొలంలో ఏమి నాటినా విరగ్గాసింది. ఏ కోడిని పెంచినా పిల్లల్లని తెగ పొదిగింది. తన యింట్లో మేక, గేదె దూడలని కంటూనే వున్నాయి. తన పొరుగువారి పొలంలో ఒకసారి గొర్రులకు విత్తనం అందించే పనిచేస్తుంది పొన్నయి. అదికూడా ఆ పొలం యజమాని కోరితేనే! అయితే అదనులో విత్తకపోవడంవల్ల పంట ఆశించినట్లు రాదు. వూరంతా గొడ్రాలు చేయి తగిలిన విత్తనం ఎలా పైకి వస్తుందని గుసగుసలు పోతుంది.

గొర్రెలు తనపొలంలో పడి తింటున్న ఆక్రోశంలో పొన్నయి ఆ గొర్రెల కాపరిని తిడుతుంది. ఆ గొర్రెల కాపరి “వారసులు లేని ఆస్తిని మూటగట్టుకొని పోతావా” అని నిందిస్తుంది.

తన యింటికి వచ్చి ఆడుకునే పిల్లలను బాగానే చూసేది పొన్నయి. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుంటే “పిల్లలుంటే కదా తెలిసేది పిల్లలని ఎలా చూసుకోవాలో” అని ఆ పిల్లాడి తల్లి రుసరుసలు పోతుంది.

ఇలా అనుదినమూ అవమానాలు పడే వాళ్ళకు నల్లుపయ్యన్ మామ ఒకడే ఊరట. అతను పెళ్ళిచేసుకోకుండా వుండిపోయివుంటాడు. పిల్లలు లేనంత మాత్రాన ఏ నష్టమూ లేదని, వూరి మాటలని పట్టించుకోవద్దని వీళ్ళకి స్వాంతన కలిగిస్తూ వుంటాడు.

చివరికి వీళ్ళకు ఇక పుట్టరని నిర్ణయానికి వచ్చిన పొన్నయి తల్లి, తండ్రి, అన్న, కాళి అమ్మ కలిసి పొన్నయిని తిరుచెంగోడు తిరునాళ్ళకు పదులాలుగవ రోజు తీసుకెళ్ళాలని యోచన చేస్తారు. కానీ అది పొన్నయికి, కాళికి ఎలా చెప్పాలో తెలియక తర్జనభర్జన పడతారు. చివరికి ఆ ఆలోచనని కాళి తల్లి కాళితో చెబుతుంది. కాళి సుతారామూ అందుకు ఒప్పుకోడు. ఓ ఏడాది పైగా పొన్నయితో ఆమాట చెప్పడానికి కూడా ఒప్పుకోడు. చెబితే తన ప్రతిస్పందన తీవ్రంగా వుంటుందని, ఒప్పుకోదన్న అంచనాలో వుంటాడు. కానీ ప్రతిసారి తిరునాళ్ళ పండగ రోజులని అత్తవారింట్లో గడిపే వాళ్ళకు ఆ ఏడాది నుండీ ఎందుకు కాళి వద్దంటున్నాడో పొన్నయికి అర్థంగాక నిలదీస్తుంది. అప్పుడు కాళి పెద్దవాళ్ళ ఆలోచనని బయటపెట్టి “పద్నాలుగవ రోజు నిన్ను పంపుతామంటున్నారు. వెళతావా?” అని కోపంగా అడుగుతాడు. అయితే భర్త అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోని పొన్నయి “నువ్వు వెళ్ళమంటే వెళతానంటుంది”. అందులో భర్త పట్ల ప్రేమ, బిడ్డల పట్ల కాంక్ష తప్ప తనకింకో దురుద్దేశం లేదు. అయితే ఈ సమాధానంతో కాళి నిరుత్తరుడవుతాడు.

ఇలా భార్యాభర్తల మధ్య, ఇరుగుపొరుగు మధ్య జరిగే మాటల ఘర్షణ, మనోభావాల ఘర్షణ, అంతరంగాల ఘర్షణ ఈ నవలంతా! ఇంతకీ ఆ తిరునాళ్ళలో పద్నాలుగవ రోజు విశేషమేమిటంటే… పెళ్ళయిన, పిల్లలు కలగని ఆడవాళ్ళు ఆరోజు ఏ అపరిచుడితోనే సంగమించి పిల్లలని కలగడమనే ఆచారం. దాన్నెవరూ తప్పుగా అనుకోరు. ఆ దేవుడే ఆ అపరిచితుడి రూపంలో వచ్చి గర్భదానం చేశాడనుకుంటారు. దాన్ని అప్పటి సంఘం ఆమోదించింది.

పొన్నయి వెళ్ళిందా? కాళి పంపించాడా? ఆ తర్వాత ఏమి జరిగింది అన్నదానికోసమే కాకుండా ఓ పిల్లలులేని దంపతుల ఆవేదన, అవమానాలు, అప్పటి పల్లె జీవితం చుడాలంటే తప్పక చదవాల్సిన నవల ఇది. amazon.comలో కొన్ని ప్రతులు ఇంకా దొరుకుతున్నాయి.

అయిదు మంది భర్తలను కలిగిన ద్రౌపదిని అంగీకరించి, ఇదే పద్దతిలో పుట్టిన పాండవులను, కౌరవులను అంగీకరించిన సమాజంలో, అలాంటి ఒక ఆచారం గురించి చెప్పినంతమాత్రానికి ఈ నవల మీద రచ్చ జరగడం ఆక్షేపణీయం. ఆ ఆచారాన్ని పక్కనబెట్టి ఓ గొడ్రాలు (ఈమాట అనాలంటే మనసు రావట్లేదు, కేవలం పిల్లలు కలగని స్త్రీ అనే అర్థంలో మాత్రమే అంటున్నాను) పడే రోజువారీ అవమానాలు, ఆ భర్త ఎదుర్కొనే అవమానాలు వీటిని గురించి చర్చ చేయాలి. కానీ అది పక్కన బెట్టి కేవలం తనకు నచ్చని ఓ కోణాన్ని మాత్రమే పైకి తెచ్చి రచ్చ చేశారు. ఈరోజుకీ పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని ఎన్నెన్నో మాటలతో అవమానించడం మనం చూడవచ్చు. ఆ విషయమై చర్చ జరిగివుంటే ఈ రచన ఆ బాధలు పడే స్త్రీలకు కొంతైనా స్వాంతన కలిగించి వుండేది!

*

మీ మాటలు

 1. సుజాత says:

  ప్రసాద్ గారూ, చాలా బాగా రాశారు. మీరు ఈ నవల పూర్తి చేశానని చెప్పినపుడు, దీని గురించి రాయండి నేనే అడగాలనుకున్నాను. పిల్లలు లేని స్త్రీల జీవితాల గురించి, చదువుకున్న వారున్న సొసైటీలో కూడా ఇవాల్టికీ ఇవాళ్టికీ ఇలాటి మాటలే వినిపిస్తూ ఉండటం విచారకరం.

  తప్పక చదవాలి ఈ పుస్తకాన్ని

 2. Venkata ramana charasala says:

  సమాజం యొక్క స్పందన ఎలా వుంటుందో చక్కగా వివరించారు. తప్పక చదవాల్సిందే

 3. ప్రసాద్ చరసాల says:

  ఏ కారణం వల్లైనా పిల్లలు పుట్టకున్నా, ఆలస్యమయినా ఆ యువ దంపతుల్ని పెట్టే మానసిక హింస అంతా ఇంతా కాదు. దీన్ని ఎంతో కూలంకషంగా చర్చించిన ఈ నవలమీద కేవలం తమకు నచ్చని ఒక పాయింటూ పట్టుకొని వివాదాస్పదం చేశారు.
  వివాస్పదమయ్యాక కూడా అసలు విశయం మీద పెద్ద చర్చ జరిగిన దాఖలాల్లేవు.

 4. rani Kumari charasala says:

  చాలా బాగున్ది ప్రస్థుథమ్ నెను పనిచెస్థున్న ఉరిలొ ఈ సమస్యపై పొలిస్ స్తెశన్ కు వెల్లి వచారు.

 5. నవల పేరు, “మాథొరుభాగన్”
  చిత్రం ఏమిటంటే ఈ నవల తెలుగు అనువాదం “అర్థనారీశ్వరుడు ” అన్న పేరుతో L .R . స్వామి గారు అనువదించగా ఆగస్టు నెలలో విశాలాంధ్ర ప్రచురణగా వచ్చింది.

  ఓల్గా గారి అనువాదం “అర్థనారి” అన్న పేరుతో నవంబరులో ప్రజాశక్తి ప్రచురణలో వెలువడింది.
  ఒక నవలకి రెండు అనువాదాలు రావడం కొత్త కాక పోయినా, ఇంత కొద్ది అవకాశంలో వెలువడడం అపూర్వం. పెరుమాళ్ గారి నవలకు ఉన్న ప్రాధాన్యతను ఇది తెలియ జేస్తుందని నేను భావిస్తున్నాను. ఈ మధ్య యానాం కవితోత్సవానికి వెళ్ళినప్పుడు ఓల్గా గారి “అర్థనారి” నవలను కొనుక్కున్నాను. తమిళంలో చదవాలనుకుంటే, పుస్తకం అందుబాటులో లేని వాళ్ళకి పిడిఎఫ్ వర్షన్ నెట్ లో ఉంది.
  ఇదే అంశం బోయి జంగయ్య గారి “జాతర” నవలలో ప్రస్తావించ బడి ఉంది.

  • ప్రసాద్ చరసాల says:

   గౌరి కృపానందన్ గారు,
   మంచి సమాచారం ఇచ్చినందులకు కృతజ్ఞతలండి. ఈ నవలను ఆంగ్లంలోకంటే మన భారతీయబాషల్లోనే చదివితే మరింత బావుంటుంది అని చదువుతుంటే అనిపించింది. కానీ చదవాలన్న వుత్సుకత, తెలుగు అనువాదాలు అందుబాటులో లేక పోవటం వల్ల ఆంగ్లం మీద ఆధారపడాల్సి వచ్చింది.

 6. ప్రసాద్ మీరు ఒక రచయిత అని నాకు తెలీదండి. బాగా వ్రాసారు. ‘పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని ఎన్నెన్నో మాటలతో అవమానించడం మనం చూడవచ్చు. ‘. మనుష్యులు తమ అసమర్థత ని, ఏమి చేయలేక అభద్రతా భావాన్ని ఇంకొకరి మీద కి నెట్టి వేయడానికే ఈ విధం గా చేస్తుంటారు అంటాను నేను. భర్త లేని వారిని చూస్తే ఎదో మూల భయం తన భర్త అలా చనిపోతాడేమో అన్న అభద్రత. పిల్లలు లేని స్త్రీ ని చూస్తే తన పిల్లలు ఏమయిపోతారో అన్న అభద్రత. ఇప్పుడు మోడీ నోట్లు రద్దు చేయడం రోజు వారి జీవితం పై ఆ దెబ్బ పడటం తో చదువుకున్న వారు/ చదువుకొనని వారు ఆయనకి సంసారం లేదు/పిల్లలు లేరు కాబట్టి అలా చేసాడు అంటున్నారు. ఆయన్ని స్వవిషయాలు పై ఆరోపణ చేయడం ఎంత వరకు సబబు? ఇదీ అంతే కదా!! అది ఫిక్షన్ పుస్తకం అయిఉండచ్చు. కానీ ఆ గుడి/ఆ ఊరు కల్పితం కాదు. నిజంగా ఉన్నాయి . కథంతా ఆ గుడి చుట్టూ తిప్పి లేని ఆచారాన్ని చెప్పి ఫిక్షన్ అంటూ చెప్తే ఎలా ? నేను ‘హరికాలం’ లో ఈ పుస్తకం పైన వచ్చిన కోర్టు తీర్పు గురించి చెబుతూ ఆయన వ్రాసిన టపా చదివాను. ఆయన ఒక ప్రశ్న వేశారు. ఈ గుడికి వెళ్లి వచ్చాక సంతాన ప్రాప్తి పొందిన ఆడవారి మనోభావాల్ని ఈ రచయిత/ కోర్టు వారు గాయపరిచలేదా, మరి ఆ మాటేమిటి అని. ఆ ప్రశ్న కి సమాధానం ఈ రచయిత వ్రాసినదాన్ని సమర్థించిన వారెవరూ చెప్పరేమో :) ‘అయిదు మంది భర్తలను కలిగిన ద్రౌపదిని అంగీకరించి, ఇదే పద్దతిలో పుట్టిన పాండవులను, కౌరవులను అంగీకరించిన సమాజంలో, అలాంటి ఒక ఆచారం గురించి చెప్పినంతమాత్రానికి ఈ నవల మీద రచ్చ జరగడం ఆక్షేపణీయం. చాగంటి గారు భారతం ఆదిపర్వం లో ద్రౌపదీ దేవి వివాహం గురించి చెబుతూ, ‘మీలో ఎవరైనా వ్యాసుడంతటి వాడు వచ్చి చెప్తే పిల్లని అలా ఐదుగురికి ఇచ్చి వివాహం చేస్తారా లేక ద్రుపదుడిలాగా ఆలోచిస్తారా ? ‘ అని ప్రవచనం వింటున్నవారిని ప్రశ్నించారు. ఎవరూ సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ‘ ఎవరైనా మీలాగే ఆలోచిస్తారు. మీ ఆలోచన తప్పు కాదు’ అన్నారు. అలవాటు లేని ఆచారం అంటే ఎవరూ ఆమోదించరు. మహాభారతం రోజుల లో ధర్మం అనేది ఒక క్రమ శిక్షణ తో పాటించారు. ఈ రోజు న కూడా అదే ధర్మం అంటే ఆడవారికి భద్రత ఉంటుందా ఒకసారి ఆలోచించండి. కల్పితానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి గా !! ‘పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని’ గురించి మాత్రమే ఆయన వ్రాయదల్చుకుంటే గుడి ఆచారం ప్రస్తావించకుండా కథ వేరే ఉండేది. కథ వేరుగా వ్రాస్తే ఇంత గుర్తింపు ఎలా వచ్చేది :) రాదు కదా. అది ఆయనకి తెల్సు !!

  • ari sitaramayya says:

   చంద్రిక గారు,
   కల్పితానికి హద్దులు ఎందుకుండాలి? అలా ఉంటే అది కల్పితం ఎలా అవుతుంది?
   మనోభావాలు! మనో భావాలు గాయపడిన వారు డాక్టర్లను సంప్రతించాలి, కోర్టుల్ని కాదు. మనోభావాలు గాయ పరచడం తప్పయితే మానవ సమాజం ఇంకా కొండ గుహలలో ఉంటూ ఉండేది.

   • నరహరి says:

    ఛార్లీ హెబ్డో కార్యాలయం మీద దాడిచేసిన వాళ్ళకి, రంగీలా రసూల్ పబ్లిషర్ని చంపిన వాళ్ళకి, ఈ మధ్య కేరళలో ప్రొఫెసర్ మీద చేతులు నరికినవాళ్ళకి, తస్లీమా నస్రీన్ కి తన రాష్టంలో ఆశ్రయమివ్వకుండా తరిమివేసిన అప్పటి, ఇప్పటి అధికార పార్టీకి, సనాల్ ఎడమరుకుని ఈ దేశంనుండి తరిమివేసిన సువార్త సంఘాలకి కూడా ఈ కొండగుహల సిద్ధాంతం చెబితే మారతారేమో? చెప్పడానికి ప్రయత్నించండి.

 7. ప్రసాద్ చరసాల says:

  చందన గారూ,
  నేను రచయితను కాదండి. పాఠకుడిని మాత్రమే!
  ఇందాకే మీరుదహరించిన “హరి కాలం” చదివాను. చాలా సంవత్సరాలు బిడ్డలు పుట్టక ఆ తర్వాత పుట్టిన సందర్భాలు అందుకు గల వేల్వేల కారణాలతో నేనూ ఏకీభవిస్తాను. కొన్నేళ్ళు పిల్లలు పుట్టక ఆ తర్వాత పుడితే అందుకు కారణం మరొకడితో శారీరకంగా కలవడమే అనే వాదనను నేను అంగీకరించను. కానీ అదే సమయంలో భర్తవల్ల కొన్నేళ్ళ పాటు పిల్లలు కలగకపోతే మరొకరితోనైనా ప్రయత్నిద్దాము అన్న ఆలోచన/ప్రయత్నమూ కొత్తదీ కాదు, నేరపూరితమూ కాదు. ఈ ఆలోచనలో/ప్రయత్నములో వున్నది స్వచ్చంగా పిల్లలు పొందాలన్న వాంఛ మాత్రమే. ఆ సొంత కోరికకు తోడు సమాజం పెట్టే వత్తిడి కూడా ముఖ్యకారణం. ఈ నవలంతా రచయిత ఆ సమాజపు వత్తిడి ఎన్ని రకాలుగా వుంటుందో చెబుతున్నాడు. ఈ వత్తిడి రూపాన్ని దేన్నైనా నిరూపించమని రచయితను అడిగితే ఎలా నిరూపించాలో, ఆ నిరూపణ రూపాలేమిటో నాకు తెలియదు.

  కేవలం దేవున్ని దర్శించుకొనో, ముడుపులు కట్టుకొనో, మరేవో ప్రార్థనలు చేసో పర పురుషుడి కలయిక లేకుండా కూడా పిల్లలు కలిగిన సందర్భాలు ఖచ్చితంగా వుంటాయి. వాటి మీద నవల రాయాలనుకున్నా నవల రాసినా ఎవరికీ అభ్యంతరం లేదు. అలాగే పరపురుషుడితోనైనా పిల్లలు కందామనే ఆలోచన ఆ స్త్రీ యొక్క లేదా దంపతుల యొక్క లేదా కుటుంబం యొక్క విపరీత కాంక్షను తెలియజేస్తుంది. ఆ మార్గాన్ని ఎన్నుకోవడానికి దారితీసిన సమాజపు ఒత్తిడిని ఎత్తి చూపుతుంది. నా అనుభవాలని బట్టి ఆరోజుల్లో అలాంటి ఆచారం వుండి వుండానికే అవకాశం వుంది. రచయిత ఫిక్షన్ అని చెప్పినా, అది కేవలం వివాదం నుండి బయటపడడానికే అయ్యుంటుందని నేననుకుంటున్నాను. (సినిమా ఎవరిగురించో అందరికీ తెలిసినా అది కేవలం కల్పితం అని ముందే ప్రకటించడం లేదా?)

  ఈ మధ్యనే పిల్లలు కలగని ఒకామె ఓ ఆసుపత్రినుండీ అప్పుడే పుట్టిన బిడ్డను దొంగిలించిందని వార్తల్లో చూశాను. అమెరికాలో ననుకుంటా కొన్నేళ్ళ క్రితం పిల్లల కోసం నెలలు నిండీన మరొకామెపై దాడి చేసి పొట్టకోసి బిడ్డనెత్తుకుపోయింది. సమాజం వత్తిడి అంత తీవ్రంగా వుంటుంది. పరపురుషుడితో పిల్లలు కనడం అనే ఆలోచన అంత పరాయిదీ, కొత్తదీ కాదనడానికి మహా భారతం నుండీ అంబ, ఆంబాలిక, కుంతి, మాద్రి మొదలగు వాళ్ళ ఉదాహరణలు వుండనే వున్నాయి.

  ఇందులో స్త్రీని అవమానించేదేమైనా వుందని నేను అనుకోను. వుంటే గింటే స్త్రీని అంత ఒత్తిడికి గురిచేస్తున్న సమాజం అవమానపడాలి, సిగ్గుపడాలి.

  • ఏది నేరపూరితము కాదు ఈ రోజుల్లో. పెళ్లి చేసుకుకోకుండా పిల్లల్ని పొందినా తప్పు లేదు కదా . కానీ ఈ పుస్తకం విషయానికొస్తే, ఆ గుడి ఉంది. ఈ రోజుకి కూడా అటువంటి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్నారని కూడా విన్నాను. అది కల్పితం కాదు. అటువంటి ఆచారం ఆ గుడి లో ఉందో లేదో తేలియకుండా తెలిసి తెలియనివి వ్రాయటం సబబు కాదు నా అభిప్రాయం. నిజమే సినిమాలు కల్పితం అనే చెప్తారు. అందుకే ప్రపంచం మొత్తం ఆడిన కొన్ని సినిమాలు మన దగ్గర మాత్రమే బాన్ చేయబడతాయి. ఉదాహరణలు మీకు చెప్పక్కర్లేదనుకుంటాను :). మహాభారతం వేరు. ఈ పుస్తకం వేరు. ఈ పుస్తకం గట్టిగా కూర్చుని రెండు గంటల్లో చదవచ్చేమో !! మహాభారతాన్ని ఏంటో అందులోని ధర్మ సూక్ష్మం ఏంటో చదవడానికి/అర్ధం చేసుకోవడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఏదైనా విషయం వినటానికి/చదవటానికి మాత్రమే ఎంటర్టైన్మెంట్. మన దాకా వస్తే కానీ తెలీదు కదా మనం ఏది ఆమోదిస్తామో & పాటిస్తామో :)

 8. కె.కె. రామయ్య says:

  ప్రియమైన చంద్రిక గారు, మీ అభిప్రాయాలు మీకుండవచ్చు, తప్పు లేదు.

  కానీ, ప్రముఖ కదా రచయితా, అమెరికా నివాసి, విజ్ఞాన శాస్త్రవేత్త అయిన శ్రీ ఆరి సీతారామయ్య గారు లాంటి విజ్ఞులు చెబుతున్న దాన్ని కూడా కొద్దిగా సహనంతో వినరా.

  ‘మనోభావాలు గాయ పరచడం’ అనేది సమాజ పురోగమనానికి, సృజనాత్మక జీవుల స్వేచ్ఛకి ( రచనా స్వేచ్ఛకి ) ఆటంకం కాకూడదు అని మీకు తెలిసిన విషయవే కదా. ఈ కామెంట్ చదివిన వెంటనే … ఆ దేశంలో అట్టా జరిగింది, ఈ బుక్కుని ఇట్టా బాన్ చేశారు అనే ఉదాహరణలు దయచేసి తీసుకు రావద్దు.

  • నేను నా అభిప్రాయం గురించి ఇంత వరకు మాట్లాడినది ప్రసాద్ చెరసాల గారితో. ఆరి సీతారామయ్య గారు ఎవరో నాకు తెల్సు. ఆయనకి నేను సమాధానం ఇవ్వగలిగిన దాన్ని కాదు _/\_. నా సంప్రదాయం , సంస్కృతి నాకు కొన్ని నేర్పింది. అందుకే నేను ఏమి మాట్లాడలేదు. ఆ సమాధానం నేను ఇచ్చినది కాదు. జాగ్రత్త గా పరీశీలింపగలరని మనవి

మీ మాటలు

*