విప్లవంలో స్వేచ్ఛా సమానత్వాల సాహచర్యం

karuna

 

‘విప్లవ రాజకీయాలు చదువుకున్నవారికి చేరాలంటే మార్గం సాహిత్యమే’ అని నమ్మి ఆచరించిన  ఆమె అసలు పేరు పద్మ. పదిహేనేళ్ళ వుద్యమ జీవితంలో అన్నీ వొదులుకొన్నట్టే సొంత పేరును కూడా వదిలేసింది. 1994లో తాయమ్మ కథ రాసి కరుణగా సాహిత్య లోకానికి పరిచయమైంది. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పదేళ్ళు కావొస్తున్నా , అటు తర్వాత మరో ముప్ఫైకి పైగా కథలు రాసినా ఆ తొలి  కథే  కరుణకు చిరునామా అయ్యింది. ‘తాయమ్మ’ ఆమె యింటి పేరయ్యింది. ఆ కథ పొడవునా వున్న కఠోర జీవన వాస్తవికత పాఠకుల బుద్ధిని రాపాడితే , ముగింపులోని తాయమ్మ దు:ఖం మాత్రం  గుండెను మెలిపెడుతుంది.  కరుణ చిత్రించిన తాయమ్మ , కవులమ్మ , లచ్చుమమ్మ మొదలైన గ్రామీణ స్త్రీ  పాత్రలు మన కళ్ళముందు కదలాడే  నిజ జీవితంలోని వ్యక్తులే  కావడం వల్ల వాటికి యెంతో  సహజత్వం అబ్బి  పది కాలాలపాటు నిలచిపోయేలా రూపొందాయి. ఒక రచయిత పేరు చెప్పగానే వాళ్ళ రచనల్లోని పాత్రలు వెంటనే స్ఫురించడం ఆ రచయిత సాధించిన విజయంగానే భావించాలి.

విప్లవాచారణలో తలమునకలై  సాహిత్యం  గురించి తీరిగ్గా ఆలోచించటానికీ, నగిషీలు చెక్కటానికీ వీలులేని జీవితంలో – నిత్య నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య  కథా శిల్పానికి  మెరుగులు దిద్దడానికి సరైన వనరులు అందుబాటు లేని పరిస్థితుల్లో , యెవరికైనా చదివి వినిపించి దిద్దుకోడానికి సైతం వెసులుబాటు దొరకని సందర్భం లో కథ పట్ల అందులో తాను చెప్పదల్చుకొన్న విషయం పట్ల వొక ప్రత్యేక శ్రద్ధ, దాని రూపం పట్ల కూడా అంతర్గతంగా వొక అదృశ్య స్పృహ వుండటం వల్ల కరుణ కథలు విప్లవ సాహిత్యంలో సైతం ప్రత్యేకగా నిలుస్తున్నాయి. సరళమైన నిరాడంబర శైలి ,   కథనంలో సూటిదనం స్వీకరించిన వస్తువునే కాదు;  రచయిత దృక్పథాన్ని సైతం దీప్తిమంతం చేస్తాయి అనడానికి కరుణ యిటీవల రాసిన ‘సహచరులు’ కథ చక్కటి వుదాహరణ(అరుణతార, మే 2016).

[కథ లింక్ : http://virasam.org/article.php?page=57  ; పే.20 – 26]

విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెన్నో సందేహాలు , అపోహలు. వాటిలో  పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే , వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా  పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు జెండర్ పరంగా విధాన నిర్ణయాల్లో , యితరత్రా తామెదుర్కొన్న వివక్షతల గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో విస్తృతమైన చర్చలకి కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో నూతన మానవ ఆవిష్కరణ లక్ష్యంగా  వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెంత బలంగా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథ ‘సహచరులు’.

విప్లవోద్యమ జీవితంలో సహచరులకి కష్టాలే గానీ సుఖాలుండవు. సొంత సుఖాలపైకి వారి ఆలోచనలు పోవు. అడవిలో కేంప్ లో డెన్ లో యెక్కడ యెన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు కలిసుంటారో యెప్పుడు విడిపోతారో తెలీదు. ఒకే దళంలో వున్నా ప్రశాంతంగా మాట్టాడుకొనే అవకాశమే చిక్కకపోవచ్చు. శత్రునిర్బంధంలో అసలుంటారో పోతారో తెలీని అభద్ర జీవితం. కార్యాచరణకి అనుగుణంగా  సహచరుల మధ్య ప్రేమనీ యెడబాటునీ పార్టీయే ఆదేశిస్తుంది. వారి వుద్వేగాల్ని ఆలోచనల్నీ జీవన గమనాన్నీ  వుద్యమావసరాలే నిర్దేశిస్తాయి. అనుక్షణం ప్రమాదాల  కత్తి అంచున నిలబడి కూడా సాహచర్యంలోని సాధకబాధకాల్ని అర్థంచేసుకున్న దీప అనిల్ అనే యిద్దరు వుద్యమకారుల జీవిత శకలాల ద్వారా విప్లవోద్యమాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుద్వేగభరితంగా యెంత మానవీయంగా వుంటాయో యీ కథలో  కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

దీప, అనిల్ ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తలుగా వచ్చాకనే సహచరులయ్యారు. దీప గ్రాడ్యుయేట్, అనిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పార్టీలోకి దీపకన్నా ఎనిమిదేండ్లు ముందు అనిల్ వచ్చాడు. అతను సెక్రటేరియట్ మెంబర్. ఆమె జిల్లా కమిటీ సభ్యురాలు. ఎవరి ఏరియాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం, ప్రేమ. ముఖ్యంగా దీపకు అనిల్ మీద గౌరవం.’ అతను ఆమెకి జీవితంలోనూ , వుద్యమంలోనూ వొక విధంగా మెంటర్ , మార్గదర్శకుడూ.  ‘అనిల్ దగ్గర ఉంటే దీప తల్లికోడి చుట్టూ తిరిగే పిల్లకోడే.’ రవికిరణం తాకిన పద్మమే. వారి మధ్య ఆధిపత్యాలకి తావులేదు.  అభిప్రాయాల్ని  పంచుకుంటారు. వాటిని పరస్పరం మన్నించుకుంటారు. డెన్ లో వుంటే యింటి పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒకరి క్షేమం పట్ల మరొకరికి  లోలోపల వొక ఆతురత , కన్సర్న్.

అలా అన్జెప్పి వారి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. ‘ఒకరికొకరు ఎంత అర్థమైనా కొన్నిసార్లు కొన్నిమాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కాకపొతే ఆ ఇబ్బంది దీప అనిల్ ల మధ్య కొద్దిసేపే. పొరపాటును గుర్తించడం , క్షమాపణలు చెప్పుకోవడం .. లేదా క్షమాపణలు చెప్పుకోకున్నా లోపల బాధపడుతున్న విషయం ఇద్దరికీ అర్థమవడం …’  ఆ క్రమంలో వైరుధ్యాల్ని యే విధంగా పరిష్కరించుకుంటారన్నదే కథలో ప్రధానాంశం.

నిజానికి కథ వొక  వైరుధ్యంతోనే మొదలవుతుంది. అలా మొదలు పెట్టడంలోనే కథా నిర్మితిలో రచయిత పరిణతి తెలుస్తుంది. దళం నుంచి ‘సైడ్’ కి వెళ్ళినప్పుడు (అలా సైడ్ కి వెళ్ళాడానికి వుండే యిబ్బందుల్నీ దళ కమాండర్ కి తెలియజేయకుండా వెళ్తే  యెదురయ్యే ప్రమాదాల్నికూడా రచయిత కథలో ప్రస్తావించింది) వర్షంలో టెంట్ సరిగ్గా కట్టడం చేతకాలేదని  దీప అనిల్ పై విసుక్కుంటుంది. అక్కడనుంచి కథ గతంలోకి ప్రయాణం చేస్తుంది. రహస్య జీవితంలో వాళ్ళిద్దరూ నడిచిన తొవ్వలోకి రచయిత స్వయంగా మన చెయ్యిపట్టి యెటువంటి కుదుపూ లేకుండా నెమ్మదిగా  తీసుకెళ్తుంది.

అనిల్ మృదు స్వభావి. శారీరికంగా కూడా సున్నితంగా వుంటాడు. అంతర్ముఖుడు. పనిలో యెటువంటి వూగిసలాటా వుండదు. కేడర్ కు అతనంటే ప్రాణం. కేడర్ కి గానీ తన గార్డుకి గానీ పనులు చెప్పడు. నాయకత్వ స్థానంలో వుంటూ యెప్పటి కప్పుడు స్వయం విమర్శకి సిద్ధంగా వుండేవాడు.

దీపది బడాబడా మాట్లాడే స్వభావం. మాటల పోగు. మనసులో ఏదీ దాచుకోదు. కొద్దిపాటి అసహనాన్నైనా వెంటనే వ్యక్తం చేసేస్తుంది.  ఒక్కోసారి ‘పుసుక్కున మాట జారుతుంది.’ అసలు ‘లౌక్యం’ తెలీదు. ఆమెకు తన సహచరుడితో వీలైనంత యెక్కువసేపు గడపాలనీ మనసారా మాట్లాడాలనీ వుంటుంది.

కానీ అనిల్ కి ప్రేమని ప్రదర్శించడం రాదు. ఇంట్లో యిద్దరే వున్నా మాట్టాడేది తక్కువే. ఇక నలుగురిలోనో మూడో వ్యక్తి సమక్షంలోనో  భార్యాభర్తలుగా మెసలడానికి అతనికి యిష్టం వుండదు. మరీ ముడుచుకు పోతాడు. దీపతో కాసిన్ని మాటలు కూడా బందై పోతాయి. దాంతో చాలాసార్లు ఆమె నొచ్చుకుంటుంది. అవమానంగా భావిస్తుంది.  అతని యీ తత్త్వాన్ని యితరుల ముందు తనని లెక్కజేయనట్టు ప్రవర్తించే ‘మొగుడి అహంకారం’గా భావించి తప్పు పడుతుంది. ఒకసారి ఆ కారణంగా అనిల్ ఆమెని ‘బుద్ధిలేద’ని తిడడతాడు. బయట కుటుంబాల్లో స్త్రీ పురుషుల మధ్య వుండే  వుండే అసమ సంబంధాలని చూసి విసిగి  ‘వాటిని ఎదిరించి , మార్పును ఆశించి పార్టీలోకి వస్తే అక్కడా అదే పరిస్థితా’  అని ఆమె కోపించింది, బాధపడింది, దు:ఖించింది. ఆత్మాభిమానతో నిరసన ప్రకటించింది.  తన ప్రవర్తనకి అనిల్ సంజాయిషీ యిచ్చుకొంటే గానీ దీప శాంతించలేదు.

ఇటువంటి సంఘటనల్ని కేవలం మనస్పర్థగా భావించకుండా ఆత్మ విమర్శతో కుటుంబ సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థంచేసుకొనే తమని తాము సవరించుకొనే ప్రయత్నం చేస్తారిద్దరూ. తమ ప్రవర్తనకి తాము పుట్టి పెరిగిన నేపథ్యాలెంత వరకు కారణమో విశ్లేషించుకుంటారు. అభివృద్ధి నిరోధకమైన భావజాలాన్ని వదిలించుకోడానికి సిద్ధంగా వుంటారు.  నిజానికి సహచరులు యిద్దరూ నిరంతరం యెంతో చైతన్యవంతంగా వుంటేనే గానీ వారి మధ్య అడపా తడపా చోటు చేసుకొనే వైరుధ్యాల్ని పరిష్కరించుకోలేరు.  అందుకు అవసరమైన పరిణతి కూడా వారికి వుద్యమభావజాలం నుంచే లభించిందని కథలో సూచ్యంగా పాఠకులకి తెలుస్తూ వుంటుంది. పురుషాధిపత్య భావజాలంతో నడిచే బయటి సమాజంలోని పరిస్థితికి భిన్నంగా ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుదాత్తంగా ఆదర్శవంతంగా వుంటాయనీ – వుండాలనీ రచయితకున్న బలమైన ఆకాంక్ష వొకటి కథ పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

భార్య మెత్తగా ఉంటే భర్త ఆడించడం, భర్త మెత్తగా ఉంటే భార్య పెత్తనం చెలాయించడం … ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనుకోవడం … ఒకరిని మరొకరు అణచాలని చూడటం. భార్యాభర్తల సంబంధం ఇల్లనే చిన్న రాజ్యంలో అధికారపీఠం కోసం జరిగే యుద్ధంలా’  పరిణమించడానికి గల కారణాల్ని తాత్త్వికంగా అన్వేషించే ప్రయత్నం కూడా కథలో చోటుచేసుకొంది.

భార్యా భర్తలు కూడా యెవరి స్వేచ్ఛా పరిధుల్లో వాళ్లుండాలనీ , భార్య అయినా భర్త అయినా ఎవరైనా కావచ్చు కొన్ని ‘గిరులు’ ఉండాల్సిందేననీ ,  ఆ గీతలు దాటితే ‘నేను చెప్పినట్టల్లా అవతలి వ్యక్తి వినాలి’ అనే వరకు వెళ్లి ఒకరిపై మరొకరి ఆక్రమణ ఆధిపత్యాలు చోటు చేసుకోవచ్చనీ , అది మొదలయ్యేది ప్రేమ పేరుతోనే  అనీ అనిల్ ముఖత: రచయిత చేసిన సూత్రీకరణలు వుద్యమ జీవితంలోనే కాదు స్త్రీ పురుష సమభావనలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని  యే కుటుంబానికైనా అన్వయించుకోవచ్చు. possessiveness లోనే వొకరిపై మరొకరు అధికారాన్ని ప్రకటించే వైఖరి దాగి వుంటుందని మరోకోణాన్ని చూడగలం.

‘విప్లవకారుల్లో పరిమితులు దాటిన ప్రేమ ఏవిధంగా చూసినా అనర్థమే. ‘తామిద్దరే’ అనే స్పృహ వస్తే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనుకాడక పోవచ్చు. లేదా సహచరున్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళలేని  స్థితి రావచ్చు. పార్టీలో భార్యా భర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండటం అనేది అసాధ్యం.’

అనిల్ మాటల్లో భార్యా భర్తల సంబంధం కన్నా వుద్యమావసరాలూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బలమైన ధ్వని వుంది. లొంగుబాటుల కారణాల విశ్లేషణ వుంది. ఉద్యమకారులకి వుండాల్సిన  కర్తవ్య నిష్ఠ త్యాగ నిరతి కూడా అతని మాటల్లో వ్యక్తమవుతాయి. అదీగాక యెప్పుడు యెవరికి యేమౌతుందో తెలీని వుద్యమ జీవితంలో హద్దుల్లేని  ప్రేమ మంచిది కాదని అనిల్ ఆలోచన. సాన్నిహిత్యం పెరిగితే వుద్యమ కార్యాచరణలో అది ఆటంకంగా పరిణమిస్తుందేమోనని అతని భయం. అనిల్ ఆలోచనతో భయంతో  ఏకీభావం వున్నప్పటికీ   ‘ఎప్పుడో ఏమో అవుతదని ఉన్నంతకాలమూ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటామా ?’ అని దీప వాదన.

జీవితం పట్ల ప్రేమాభిమానాల పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల్లో సహజంగా వుండే తేడాని ఆవిష్కరించడానికి కరుణ కథలో యెంతో సున్నితమైన సన్నివేశాల్ని కల్పించింది.అనిల్ దీపల మధ్య యేకాంత సందర్భాల్ని చక్కగా వుపయోగించుకొంది. భావ వినిమయానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించింది. అందుకు యే మాత్రం కాఠిన్యానికి తావులేని మృదువైన  సంభాషణాత్మకమైన నిరాడంబరమైన శైలిని ఆశ్రయించింది.  కథాంశంలోని సంక్లిష్టతని కథచెప్పే పద్ధతిలోకి రానీయకుండా జాగ్రత్తపడింది.

సర్వసాక్షి కథనంలో రచయితే కథ చెప్పడంవల్ల అనిల్ దీపాల ప్రవృత్తిలోని మంచిచెడ్డల్ని, మనోభావాల్ని, బలాల్నీ బలహీనతల్నీ నిశితంగా విశ్లేషించగలిగింది. వారి అంతరంగాల లోతుల్ని తడమగలిగింది. సందర్భానుసారంగా వారి మాటల ద్వారా రాజకీయ సిద్ధాంత చర్చల్ని సైతం నడపగలిగింది. వారిద్దరి మధ్య సంభాషణలు సంవాదాలుగానో వివాదాలుగానో  పరిణమించకుండా వుద్వేగ ప్రధానంగా నడపడంలో గొప్ప సంయమనాన్ని ప్రదర్శించింది. కరుణ కంఠం దీపలో విన్పించకుండా తాటస్థ్యాన్ని పాటించింది. కానీ యిదంతా ఆమె అనుభూతిలోకి వచ్చిన విషయమేనని కథ చదువుతోన్నంతసేపూ  అనిపిస్తుంది.  జీవితాన్ని సిద్ధాంతాలతో గాక అనుభవాలతో వ్యాఖ్యానించడం వల్ల విప్లవోద్యమానికి చెందిన కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తూ కథ ఫ్రెష్ గా వుంది.

కరుణ స్వీయ వుద్యమ జీవితానుభవం నుంచే వచ్చిన కథ కావడం వల్ల ‘సహచరులు’ లో పార్టీ నిర్మాణంలో వుండే క్రమశిక్షణ గురించి దాన్ని పాటించడంలో వ్యక్తుల బలాబలాల గురించి లోటుపాట్ల గురించి , అడవిలోపల  దళాల కదలికల గురించి , బయట  డెన్  లో రహస్య పరిరక్షణ కోసం తీసుకొనే టెక్ జాగ్రత్తల గురించి పాటించాల్సిన  గోప్యత గురించి  ఆమె నిర్దిష్టంగా ప్రస్తావించిన అంశాలకు ప్రామాణికత లభించింది.    

ఆ క్రమంలో తాను నడిచి వచ్చిన వుద్యమాల బాటలో యెదురైన సవాళ్ళని చర్చకి పెట్టడానికి కూడా రచయిత్రి యెక్కడా వెనుకాడలేదు. పార్టీలో అమలయ్యే కేంద్రీ కృత ప్రజాస్వామ్య విలువల గురించి , పాత కొత్త ఆలోచనల మధ్య రేగే వైరుధ్యాల గురించి , దీర్ఘకాలిక ప్రజా యుద్ధం పట్ల నాయకత్వ స్థానంలో వున్న వారి తప్పుడు అవగాహన గురించి , క్రమశిక్షణ విషయంలో వైయక్తికంగా నాయకులు ప్రదర్శించే వుదార వైఖరి వల్ల కలిగే అనర్థాల గురించి , గ్రామాల నుంచి పట్టణాలకి వుద్యమ స్ఫూర్తి వ్యాపించాల్సిన అవసరాల గురించి దీపా అనిల్ ల మధ్య నడిచిన మాటలు సైద్ధాంతికంగా లోతుగా ఆలోచింపదగినవి. ఆ సందర్భంలో  ‘ఒక మనిషి జీవిత కాలంలో విప్లవ విజయాన్ని చూడాలి’   వంటి వ్యాఖ్యలు ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి.

నిజమే అటువంటి బలీయమైన ఆశ వుంటేనే విప్లవాచారణలో స్థిరంగా నిలబడగల్గుతాం. కానీ రాజ్యాధికారమే అంతిమ విజయమైతే అది వొక మనిషి జీవిత కాలంలో సాధ్యం కావచ్చు – కాకపోవచ్చు. విప్లవ విజయాన్ని తమ జీవితంలో చూడలేక ఆచరణనే తప్పుబట్టే ప్రమాదం వుంది. అందుకే విప్లవాచారణలో స్వల్పకాలిక లక్ష్యాలనూ దీర్ఘకాలిక లక్ష్యాలనూ యెప్పటికప్పుడు నిర్వచించుకుంటూ ఫలితాల్ని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది.

రహస్యోద్యమాల్లో పనిచేసే ఆడ మగా మధ్య లైంగిక విశృంఖలత్వం గురించి జరిగే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కథలో వొక సందర్భాన్ని రచయిత ప్రత్యేకంగా సృష్టించుకొంది. వస్త్వైక్యత చెడకుండా అది కథలో వొదిగి పోయింది. కథకి లోతుతో పాటు విస్తృతిని కల్గించింది. నిండుదనాన్నిచ్చింది.

స్త్రీ పురుషులు విచ్చలవిడి సంబంధాలకోసం  చావుకు సిద్ధపడి విప్లవం బాట పట్టాల్సిన అవసరం లేదనీ , నిజంగా అటువంటి సంబంధాలు పార్టీలో ఉంటే అందులో పడి కొట్టుకుపోతారు తప్ప విలువలకోసం  ప్రజల తరపున నిలబడి పోరాడలేరు – నిర్బంధాన్ని తట్టుకోలేరనీ చెబుతూ దీప అటువంటి ‘సంబంధాల కోసమైతే బయటే ఉండొచ్చుగా’  అని మరో మాట అదనంగా అంటుంది.

‘ఉద్యమంలో దోపిడీ పీడనల అంతం ఒక్కటే కాదు. పురుషుడికి మల్లే స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని కోరుతున్నామంటే అర్థం  …  అనైతిక సంబంధాల విషయంలో కాదు. దంపతీ వివాహం ఉన్నతమైందని పార్టీ నమ్ముతుంది. అమలు చేస్తుంది.  ఊహల్లో ప్రేమతో కాదు , నిజమైన ప్రేమతో సహచరులు కలిసి ఉంటారు.’ అని ఆమె ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగింది.

పార్టీలో యెట్టి పరిస్థితుల్లోనూ అనైతిక సంబంధాల్ని అంగీకరించరని బలంగా చెప్పడమే  ఆమె వుద్దేశం. నిజానికి యే యిద్దరు స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా వెంటనే వాళ్లకి పెళ్లి చేసేయడం కమ్యూనిష్టు వుద్యమాల్లో మొదటి నుంచీ వుంది. దీన్ని నైతికత విషయంలో భూస్వామ్య విలువల నుంచీ బయటపడక పోవడంగానే భావించే వీలున్నప్పటికీ బయటి వాళ్లకి వేలెత్తి చూపే అవకాశం యివ్వడం పార్టీకి కీడు చేస్తుందని వాళ్ళ నమ్మకం.

 విప్లవ పార్టీల రాజకీయ ఎజెండాలో స్త్రీల నిర్దిష్ట సమస్యలకి చోటులేకుండా పోతుందనే విమర్శకి కూడా రచయిత దీప ఆలోచనల ద్వారా సమాధానం చెప్పించి వుంటే బాగుండేది కానీ కథలో ఫోకస్ పాయింట్ పక్కకి పోయే ప్రమాదం వుంది. అది మరో కథకి వస్తువౌతుంది. కథ మాత్రమే చెప్పాలన్న స్పృహ కథా రచయితకి వుండటం వల్ల ప్రయోజనమిది.

 

దీప అనిల్ మధ్య మాటల్లో సాహిత్య విషయాలెన్నో చోటు చేసుకునేవి. నిజానికి మాటల్లో యెంతో పొదుపరి అయిన అనిల్ సాహిత్యం గురించి , సిద్ధాంతం గురించి మాట్టాడాల్సి వస్తే మాత్రం గొప్ప ప్రవాహ శీలి అయిపోతాడు. కథ గురించి అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘ఎవరూ ఎన్నుకోని వస్తువుని ఎన్నుకున్నప్పుడే కథ నిలుస్తుందనేవాడు. వస్తువు పాతదాన్నే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ముగింపునో , కొత్త శైలినో ఎన్నుకోవాలి అనేవాడు. శిల్పం గురించి అవసరం లేదంటారు కానీ చెప్పే పధ్ధతి బాగుండాలి…’ కథలో వస్తు శిల్పాల ప్రాధాన్యాల గురించిన అనిల్ ఆలోచనలు రచయిత్రివే  ( వాటి వెలుగులో కరుణ కథల్ని ప్రత్యేకంగా  అధ్యయనం చెయ్యొచ్చు ).

అందుకే కథ ముగింపు విషయంలో కూడా కరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చివరికి సామరస్య వాతావరణంలో  ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అని అనిల్ నవ్వుతూ అంటే  , ‘పితృస్వామ్యం నశించాలి’ అని దీప రిటార్ట్ యివ్వడంతో కథ ముగుస్తుంది. ఐక్యత – ఘర్షణ – ఐక్యత అన్న గతితార్కిక అవగాహనని అతి సున్నితంగా ఆవిష్కరించిన ముగింపు పెదాలపై నవ్వు పూయిస్తుంది. ఉద్యమాల్లోనే కాదు ; యెక్కడైనా స్త్రీ పురుష సంబంధాలు అసమానతలకీ ఆధిపత్యాలకీ తావులేకుండా సంతోషమయంగా వుంటే బావుంటుంది గదా అని అనుకోకుండా వుండలేం.

ఇప్పుడిహ  యిది యే అస్తిత్వ వాదానికి చెందిన కథో అని విమర్శకులు విద్యాత్మక పరిశోధనలు మొదలెట్టొచ్చు. ఇదంతా శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అని తలలు బద్దలుకొట్టుకొనే వాళ్ళని వాళ్ళ  మానానికి  వొదిలేసి కరుణ తన యెరుకలోకి వచ్చిన  జీవితాన్ని కథలుగా మలిచే కృషిని యిలాగే నిరంతరం కొనసాగించాలని  కోరుకుంటున్నాను. విప్లవోద్యమ సాహిత్యానికి కరుణ లాంటి రచయితల అవసరం యెంతైనా వుంది.

 

 

 

మీ మాటలు

 1. థాంక్యూ సార్. ఒక ఆనందo నన్ను ఆవరించింది. అతిగా చెప్పడం కాదు సార్.
  ఏమీ అనుకుని ఈ కథను (ఆ మాటకు వస్తే ప్రతీ వాక్యాన్ని) రాశానో…. అందులోని ప్రతి అంశాన్ని ప్రతీ అంశాన్నీ పట్టుకున్నారు. అందుకే అంత సంతోషం కలిగింది. ప్రయోజకుడు అయ్యాడని ఎవరైనా తన బిడ్డ గురించి అంటే ఆ తల్లీకీ తండ్రికీ సంతోషం ఉండదా సార్. ఎందుకోగానీ ఈ సందర్భoలో మా రవి (మంజీర) ఉంటే బాగుండునని అనిపించింది సార్.
  థాంక్యూ సార్.

  • Santhisri says:

   Shethukamaina pogadtha..Karuna tharupuna nenu kuda prabhakerji..salam..Manchu sameeksha… Marosari maa Karuna marintha unnathamgaa anipinchindhi..love u dear. Karunaa..

   • థాంక్యూ మేడం. ఈ థాంక్యూ పదం క్రుతకoగా అనిపిస్ఉంతోంది. కానీ అంతకంటే ఇంకా ఎట్లా చెప్పాలి… థాంక్యూ శాంతి శ్రీ మేడం.

 2. Doctor Nalini says:

  చాలా మంచి సమీక్ష . కరుణలోకి పరకాయప్రవేశం చేసి తను చెప్పాలనుకున్న విషయాన్ని సరైన విశ్లేషణతో మీరు విప్పి చెప్పడం గొప్ప ప్రయోగం . ఆ మంచి కధకి ఇది అందమైన కిరీటం .

 3. ఓహ్.. కధా, సమీక్షా రెండూ రెండే .. హృదయం లో చేరిపోతూ…

 4. కెక్యూబ్ వర్మ says:

  మంచి కథకు అవసరమైన విశ్లేషణ అందించారు ప్రభాకర్ గారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న దుష్ప్రచారానికి సమాదానంగా వచ్చిన కథను మీ పరిచయం పాఠకులకు తమ సందేహాలకు జవాబుగా వుంది. కరుణమ్మకు మీకూ అభినందనలు.

 5. థాంక్యూ వర్మ సార్

 6. B.Bhaskar says:

  కథను చదవాలని అనిపించింది ఈ రివ్యూ . ఎక్సలెన్ట్

 7. Shanti Prabodha says:

  కథ నుంచి చాలా నేర్చుకున్నా . కరుణ మనసులోతుల్లోంచి పుట్టే భావనలు, అనుభవాలు వ్యక్తీకరించే విధం నాకెంతో నచ్చుతుంది. ఇప్పుడు సమీక్ష కూడా ఎంతో లోతుగా .. . కరుణకి , ఏకే ప్రభాకర్ గారికి అభినందనలు

 8. DrPBDVPrasad says:

  విస్తృతంగా సమగ్రంగా సమీక్షించటం మావూఁలు విషయం కాదు.
  ఇద్దరికీ అభినందనలు.
  ఏకే గారు మీ సమీక్షలు పిహెచ్ డీల కన్నా ఎక్కువ.

 9. Good review sir

 10. అజిత్ కుమార్ says:

  విప్లవంలో స్వేచ్చా సమానత్వాల సాహచర్యం – ఈ టైటిల్ లో సహచర్యం అని ఉండాలి.

  కధలో దీప అనీల్ అడవిలో ఎందుకున్నారు?
  వారు ఒక్కోసారి ఐదారు నెలలపాటు కలుసుకోకుండ వుండవలసిన అవసరమేమొచ్చింది?
  రాష్ట్ర కమిటీ వారు వారిద్దరికీ ఒకే ప్రాంతంలో డ్యూటీ వేయవచ్చుగదా ?
  అడవిలో మీటింగులెందుకు?
  క్యాడర్ అంటే ఎవరు ? వారు ఏఏ పనులు చేస్తుంటారు ?
  ఎప్పుడూ ఒకే విధమైన పనులా ? లేక తరుచూగా మారుతూంటాయా ?
  ఉద్యమం అంటే ఏమిటి?
  లౌక్యం అంటే ఏమిటి ?
  విమర్శ అంటే రాయి వెయ్యడమా ?
  పార్టీ పత్రిక పని చేస్తే ఎదుగుదల ఉండదా ? ఎదిగే పనులు ఏమిటి ?
  దళాలు అడవిలో ఎందుకు ఉంటాయి ?
  రాష్ట్ర కమిటీ సభ్యునికి ఒక గార్డు కాపలా ఉంటే… మరి గార్డుకు కాపలా ఎవరు ? అసలు ఒకరికి మరొకరు కాపలా ఎందుకు కాయాలి ?
  స్త్రీ పురుష లక్షణాలు వేర్వేరుగా ఉంటాయని అనిల్ దీప లకు తెలియక వారి మధ్య అసహనం చోటు చేసుకుంటుంది. ఆ విషయం బహుశా రచయితకు కూడా తెలీనందు వల్ల దాన్ని గురించి ఆశ్చర్యంగా చెప్పినట్లుంది. దీప పార్టీలోకి వచ్చింది సమాజం లో ఉన్న పురుష అహంకారం నచ్చకనట.
  కనుక పార్టీలోకి వచ్చేవాళ్ళు సమాజం లో తమకు ఏదైనా నచ్చకపోతే పార్టీలో చేరతారా? పార్టీ అంటే సమాజం కాదా? సాంప్రదాయ తేదాలను హెచ్చుతగ్గులుగా భావించవచ్చా? జానకి వచ్చినప్పుడు వారి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు దానిపై జరిగిన చర్చ కూడా స్త్రీ పురుష సహజ లక్షణాల తేడా వలన ఏర్పడినవే గదా.
  కేంపుసిబ్బంది కొన్నిసార్లు భార్యాభర్తలను ఇబ్బంది పెడతారని చెప్పడం పార్టీ లోని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది.
  వారు చావుకు ఎందుకు సిద్ధపడ్డారు ?
  ప్రజల తరఫున పోరాడాలని ప్రజలు లేని చోట్లకు ఎందుకు వెళ్ళారు?
  వివాహం ఉన్నతమైనదని ఎలా చెప్పగలరు?
  ఊహల్లో ప్రేమ కంటే నిజమైన ప్రేమ గొప్పదని ఎలా చెబుతారు?

  ఇలాగా ఈ కథను విమర్శ చేయాల్సిందని నా అభిప్రాయం.

 11. ‘viplamlo swechaa samaanatvaala sahacaryam’ katha, daani meeda jaragia charcha vijnanadaayakanga undi.

 12. Narayanaswamy says:

  చాలా మంచి పరిచయం ప్రభాకర్ గారూ

 13. లక్ష్మణరావు says:

  ప్రభాకర్ గారికి నమస్సులు. మీరు రాసిన వ్యాసం, మీరు ట్యాగ్ చేసిన కథను చదివాను. ఆ మేరకు నా ఆలోచనలు మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.

  1)సహచరులు కథ గాని, సహచరులు మీద చేసిన సమీక్ష గాని రెండూ రాజ్య భాషనే పలుకుతున్నాయి అనిపించింది. నూరు పూల వికసించాలంటే వెయ్యి ఆలోచనలు సంఘర్షించాలన్న మావో సూక్తిని వెటకరించినట్లుగా అనిపించింది. కథకురాలిని ప్రోత్సహించే పేరిట ఎదురయ్యే ప్రశ్నలను, తలెత్తే సందేహాలను పట్టించుకోకుండా కథారచన చేసుకుంటూ
  వెళ్లిపొమ్మని చెప్పడం ఎందుకనో మాకు ఏలికల మాట్లాడినట్లుగానే తోస్తుంది. మేము నిర్ణయాలు చేస్తాం. అభివృద్ధి పేరిట అమలుచేసుకుంటూ పోతాం. ఎవరూ అడగడానికి లేదు. అడిగినా సమాధానం చెప్పాల్సిన అవసరం తమకి లేదు. ప్రజలు మమ్మల్ని ‘నమ్మి’ ఓటు వేశారు. కాబట్టి ప్రజల మా వెంటే ఉన్నారు. అలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే ఈ దేశ ప్రజలను ప్రశ్నించడమే, అభివృద్ధి అడ్డుకోవడమే అన్నట్లుగా అనిపించింది. ప్రభాకర్ సార్ కరుణగారికి చేసిన సూచన. ఇటీవల కాలంలో మార్క్సిస్టు రచయతలమని చెప్పుకునే వారు సారంగలో వివిధ చర్చా సమయంలో ఇదే ధోరణిని కనబరచడం ఓ విషాదమనే చెప్పాలి.

  2) “కార్యాచరణకి అనుగుణంగా సహచరులు మధ్య ప్రేమని, ఎడబాటుని పార్టీయే నిర్ధేశిస్తుంది” ఇదొక అపురూపమైన కార్యక్రమంగా మీ రాసిన వ్యాఖ్యలా మాకు అర్ధమయ్యింది. వాస్తవానికి ఇది కూడా రాజ్య మాటలా ఉంది. దంపతీ వ్యవస్థలో భాగంగా ఇద్దరిని ఒక దగ్గరకి చేర్చిన తరువాత వారి మధ్య ప్రేమని, ఎడబాటుని పార్టీ నిర్ధేశించడం రాజ్య నియంత్రణలా నాకు అనిపించింది. అచ్చు ఇలానే బూర్జవా సమాజం కూడా ఆలుమగలూ మధ్య అన్యూన్యత ఏ సమయంలో ఉండాలి, ఎలా ఉండాలన్నది నిర్ధేశిస్తున్న విషయం బయట ఉన్న వాళ్లకి వేరేగా చెప్పనక్కర్లేదు. (ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు). అదే పద్దతిని లోపలి వాళ్లు అమలుచేస్తే అపురూపంగా చూడాలని ఎందుకు అనిపించిందో నాకు అర్ధం కాలేదు. రాత్రి పూట పని చేయించడాన్నే తప్పు పట్టిన భావజాలాన్ని చేబూనిన వాళ్లు ఇలా బూర్జవా ఆలోచనను పార్టీలో అమలు చేయడాన్ని ఆక్షేపించకపోవడంలో ఆంతర్యమేమిటో తెలుసుకోవలనిపిస్తోంది. నిజానికి కథలో చెప్పినట్లు భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే “‘తామిద్దరమే’ అన్న స్పృహ వచ్చినట్లే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనకాడకపోవచ్చు. లేదా సహచరులను వదిలి వేరే ప్రాంతానికి వెళ్లలేకపోవచ్చు. అలా దీప ‘భార్య’చట్రంలోకి ఒదిగిపోతుందేమోనన్న భయం” పార్టీని వెన్నాడుతున్నట్లుగా అనిపించింది. రాజకీయ లక్ష్యం గురించి సరైన అవగాహన కలిగించకుండా, ప్రజా విముక్తి ద్వారానే అన్ని రుగ్మతులకు పరిష్కారమన్న స్పృహను కలిగించకుండా, వారంతట వారుగా వేర్వేరుగా ఉండే చైతన్యాన్ని కల్పించకుండా, ఇలా భయాలు పేరిట వేర్వేరుగా ఉంచడం వలన సాధించే ప్రయోజనమేమిటో అర్ధం కావడం లేదు. మానసిక వేదనను మిగల్చడం తప్పా.

  3) ఇందులో అనీల్ చేసిన జ్ఈాన బోధ అచ్చం బూర్జవా ఆర్ధిక శాస్త్రవేత్త వ్యాఖ్యలానే అనిపించింది. రచయత చూపినట్లు అనీల్ రాజకీయ పరిణితి చెందిన నాయకుడు. మంచి చెడులను విశ్లేషించి, మార్క్సిస్టు ఆలోచనలకు అనుగుణంగా కేడర్ కి నిర్ధేశం చేసిన వాడు. కాని, అటువంటి నాయకుడు ఆలుమగలు మధ్య గీతలు చాలా అవసరమని చెప్పడం విడ్డూరంగానూ, విస్మయాన్ని కలిగించింది. గీతలు లేని రాజ్యాన్ని కాంక్షించే పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరి హద్దుల్లో వారు ఉంటే శాంతియుత సహజీవనం సాగించవచ్చునన్న సూత్రీకరణను వల్లె వేసినట్లు అనిపించింది. గ్రామాలలో రచ్చబండ తీర్పులు ఇలా ఉంటాయి. బయట రాజ్యం కూడా అదే మాట చెబుతోంది. ఎవరి పాత్రను వారు పోషిస్తే అశాంతికి తావే లేదు కదా అని. ఇదే విషయాన్ని భావవాద ప్రియులు వివిధ రూపాలలో ఉపదేశం చేస్తూనే ఉన్నారు. బయట వాళ్లు చేస్తే తప్పు పట్టే పార్టీ నాయకులు…తమ కుటుంబాల వద్దకు వచ్చే సరికి ఆ హద్దును నిర్ధేశించడం ఎంత వరకూ సబబో విశ్లేషించకపోవడం చిత్రంగా తోచింది. అనీల్ ఉపదేశాలకు కొంత మేర ప్రశ్న వేసుకున్నా అది అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్లు ఉన్నానని దీపిక సమాదానపడడం సాధారణ మహిళకి, బయట సమాజంలో కొనసాగుతన్న పీడనలకి వ్యతిరేకంగా పార్టీలోకి వెళ్లిన మహిళకి ఏమి తేడా ఉంది అనిపించింది. అంతేగాకుండా భార్య పట్ల ప్రేమ చూపితే అంతిమ లక్ష్యం దెబ్బతింటుందని అనీల్ తన మాటల ద్వారా వ్యక్తపరచడం విచిత్రంగా ఉంది.పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇంతటి మానసిక, ఆలోచనల బలహీనులు ఉన్నారా అన్న ప్రశ్న తలెత్తేటట్లు చేసింది.

  4) ఇక గార్డు విధానం… బయట అమలులో ఉన్న ఆర్డర్లీ వ్యవస్థనే గుర్తుకుతెస్తోంది. అనీల్ గురించి దీప ‘ టెంటు వేయడం, చలి నుంచి కాపాడుకునేందుకు మంట పెట్టడం’ రావని చెబుతుంది. తొలి రోజుల్లో రాలేదంటే అర్ధం చేసుకోవచ్చు. కాని, పదేళ్ల అయినా, కార్యకర్త స్థాయి నుంచి నాయకుడుగా ఎదిగిన తరువాత ఆ రెండూ రాలేదంటే ఆశ్చర్యమనిపించింది. దీప వ్యాఖ్యలు బట్టి లోపలి నాయకత్వం ఆర్డర్లీ వ్యవస్థని కొనసాగిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గార్డుకి అనీల్ ఏ పని చెప్పుడు..అతడు గుర్తించి చేస్తే తప్పా అని అనడంలో ఇతరలు కన్నా ఒక్క అనీలే కాస్త బెటర్ గా ఆలోచన చేస్తున్నట్లు అవగతమవుతుంది. నిజానికి, అనీల్ లౌక్యం తెలిసిన వ్యక్తి. ఒక్క ఆదేశం కూడా ఇవ్వకుండా ఇష్టంగా మాట్లాడడం ద్వారా తన పనులన్నింటినీ తన కింద స్థాయి ఉద్యోగులతో చేయించడం, పైగా వారితో మంచి వాళ్లు అనిపించడం అదొక టెక్నిక్. ఆ టెక్నిక్ నే నమ్ముకున్నట్లు కథ మొత్తంలో అనీల్ పాత్ర చెప్పకనే చెబుతుంది. లౌక్యంగా చేయించుకున్నా, నాయకులకి ఆ
  పనులు చేయడం గార్డుల బాధ్యతగా కొంతమంది నిర్ధేశించినా ఇది ముమ్మాటికీ విప్లవాదర్శనాకి పాతర వేయడమేనని నిష్కర్షగా విమర్శించాల్సిన విషయమనే చెప్పాలి. విప్లవోద్యమాన్ని నిర్వర్తించడానికి వెళ్లిన వాళ్లు తాము సమీకరించిన వాళ్లుని తమలా మార్చేందుకు కృషి చేయడం మానేసి, స్థాయీ బేధాలు పేరిట సేవకులుగా వినియోగించుకోవడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. నాయకత్వ రక్షణ వేరు, సేవలు చేయించుకోవడం వేరుగా చూడకుండా ఆర్డర్లీ వ్యవస్థ మాదిరీగా లోపల అమలుచేయడాన్ని ఎ.కె.ప్రభాకర్ గారు ఎందుకు విస్మరించారో తెలుసుకోవాలని అనిపించింది.

  5)” దీర్ఘకాలిక ప్రజాయుద్ద ఉంటే వందలేళ్లు చేసేది అన్న ఓ నాయకుడి అవగాహనగా ఉందని” అనీల్ తీవ్ర మనోవేదనకి గురవుతాడు. ఏమయ్యింది ఈ నగరానికి అన్నట్లు నాయకులు అలా ఉంటే క్యాడర్ ఎలా ఉంటుంది అన్నంత వరకూ ఆయన మెదుడిని తొలిచేస్తోంది. తీవ్రంగా సతమత ఆయనలో కనిపించింది. ఆయన లేవనెత్తిన గొంతుక్కి, మీరు చెప్పే విధానానికి ఎక్కడా పొసిగినట్లు అనిపించలేదు. తన జీవిత కాలంలో విప్లవాన్ని విజయవంతం చేయాలన్న స్థిరాభిప్రాయమే కనిపించింది. ఇది కూడా భావ వాద దృక్పధం కాదా. బూర్జవా మనస్తత్వం కూడా ఇందుకు విరుద్దంగా ఉంటుందా? తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని, తానే శాసించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించకుంటాడు. పరిపూర్తి చేసేందుకు ఎన్ని అడ్డుదారులైనా తొక్కుతాడు. చివరికి తన మెడకి తానే ఉరితాడు వేసుకుంటాడు. గమ్యానికి చేరుకోవాలని లక్ష‌్యాన్ని పెట్టుకోవడం తప్పు కాదు. అలా లక్ష్యాన్ని నిర్ధేశించుకోకపోతే అడుగే ముందుకు వేయలేం. కాని, తన కాలంలో గమ్యాన్ని చేరుకోవాలని ఆతృత
  చెందడమే అపసవ్య ధోరణి, అశాస్త్రీయ ప్రయాణం అవుతుంది. అంటే ప్రజలే ఉద్యమ నిర్మాతలు అన్న సూత్రీకరణని గోడకి వేలగట్టి, భావ వాదప్రియత్వంతో ‘హీరో’యిజంతోనే లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పినట్లు అవదా. అంతిమంగా ఆ ఉద్యమ ఫలితం తమ త్యాగ ఫలితమన్న అహంకారానికి దారితీయదా. బయట ఫలానా పథకం మా నాన్న దయ, ఫలానా పథకం నా కొడుకు ఆలోచన అని చెప్పుకున్నట్లు యుద్ధం కూడా ఫలానా వాడి కల అని చెప్పడం కాదా? సామాజిక పరిస్థితులకు దూరంగా యుద్దాన్ని కాంక్షించడమవుదా? వ్యక్తులా, వ్యవస్థా యుద్దాన్ని చేపట్టాల్సింది అన్నది కూడా వివరిస్తే బాగుండేది.

  6) అన్నింటి కన్నా ఈ కథలో మరో సీరియస్ వ్యాఖ్య ఒకటి కనిపించింది. నాయకులు చేసిన తప్పులను నిర్మోహమాటంగా తప్పుపట్టినందుకు, ప్రశ్నించినందుకు అనీల్ ని ఇబ్బంది పెట్టిన వైనం రాజ్య స్వభావాన్నే ప్రస్పుట పరుస్తోంది. ‘సైడ్’ కి వెళ్లకుండా ఆ ఒకరిద్దరు నాయకులు ఇబ్బంది పెట్టడం నిజంగానే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. చర్చ, సంస్కరణ, కేంద్రీకృత ప్రజాస్వామ్యం అన్న నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన పార్టీలో ఇటువంటి మానసిక వేదింపు ధోరణులు కొనసాగడం ఓ విషాదం. ఈ అంశంలో ప్రతీ సారి నాయకత్వం ముందుకు దీప వెళ్లి సైడ్ కి వెళ్తామని చెప్పాల్సిన రావడం కూడా మరీ దారుణం. ఈ విషయాన్ని ప్రభాకర్ గారు గాంచకపోవడమేమిటిని సందేహం కలిగింది.

  7) దీప పాత్ర పూర్తిగా బయట ఉన్న ఆడపిల్లలు కనే కలలు, ఆశలు, అమాయకత్వం అన్నీ ఉన్నాయి. అదే సమయంలో పార్టీ ప్రేరణతో చదివిన సాహిత్యం వలన కొద్దిమేర ప్రశ్నించేతత్వం కూడా అడపాదడపా ఉండేది. అదే సమయంలో ‘రాజీ’కి నచ్చేది కూడా. సరిగ్గా బయటా, లోపలా కూడా మహిళలు ఒకేలా ఉన్నారన్నది ఆ పాత్ర స్పష్టం చేస్తూనే ఉంది. కాని, ఎందుకనో నీరజ అడిగిన ప్రశ్నకి దీప ఒకింత అసహనాన్ని గురైనట్లు అనిపించింది. లోపల ఉన్న పాత్ర కావడం వలన లోపలి సమాజం మీద అమితమైన ప్రేమతో బయట సమాజం నొచ్చుకునే విధంగా తీవ్ర వ్యాఖ్య కూడా చేశారు. ‘విచ్చలివిడి సంబంధాలు కోసమే అయితే బయట ఉండొచ్చుగా” అని. రాజ్యం కూడా అప్పుడప్పుడు తన అవసరాల కోసం మన దేశ సంస్కృతి గొప్పదని చెప్పే పేరిట విదేశీ మహిళలంతా వ్యభిచారులు అన్నట్లు కుటుంబ వ్యవస్థని విశ్లేషిస్తుంది. సరిగ్గా ఇలానే దీప వ్యాఖ్య అనిపించింది. బయట ఉన్న వాస్తవిక పరిస్థితులు ఇలా ఉన్నాయో నేను వేరుగా చెప్పనవసరం లేదు. వనజ
  చెప్పకనే చెప్పింది. ఇక్కడ కూడా వ్యక్తుల్లోంచి వస్తువును పరిశీలించడం కాకపోతే మరేమిటో చెప్పాలి. ఎనిమిదేళ్ల అయినా కూడా సాధారణ మహిళలానే తన ఆలోచనలు ఉండడం ఇదేనా రాజకీయ తర్ఫీదు అని పది మంది ప్రశ్నించే అవకాశం కల్పిస్తోంది. కాదంటారా?

  వ్యక్తుల గుణగుణాల్లోంచి, వ్యక్తుల పట్ల ఆరాధానలోంచి, వ్యక్తుల తీరు పట్ల తీవ్రమైన ఆగ్రహంలోంచి రాసే కథలు విప్లవ కథలవుతాయా? అన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. పదార్ధం బట్టి చైతన్యం ఉంటుంది అన్న సూత్రీకరణ విప్లవ కథకి వర్తించదా అని అనిపించింది. మరి ఎ.కె. ప్రభాకర్ గారు ఏమంటారో?

 14. ఎ.కె.ప్రభాకర్ says:

  కరుణ కథ పై నా పరామర్శపై స్పందించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
  అజిత్ కమార్ లేవనెత్తిన ప్రశ్నలకు చిన్న వివరణ
  1. వ్యాసం శీర్షికలో ‘సాహచర్యం’ పదమే సరైనది. ‘సహచర్యం’ తప్పు. గూఢచర్యంతో పరిచితివల్ల సహచర్య ప్రయోగం ఆయనకు స్ఫురించిందేమో!
  2. ఏదైనా కథని మనం మన జీవిత నేపథ్యాలనుంచీ , సామాజిక సాహిత్య దృక్పథాల నుంచీ చూస్తాం చదువుతాం అర్థం చేసుకుంటాం. అందువల్ల అజిత్ కుమార్ కథని చదివేక్రమంలో ఆయనలో ఆ ప్రశ్నలు వుత్పన్నమయ్యాయి. నేను నాకర్థమైన రీతిలో పరామర్శించాను.
  3. కాబట్టి ‘ఇలాగా ఈ కథను విమర్శ చేయాల్సిందని ‘ ఎవరూ ఎవరినీ నిర్దేశించలేరు.

మీ మాటలు

*