నీవూ నేనూ వలచితిమీ…

konni sephalikalu

 

బాల మురళీ గారు ‘దివిజ సంగీతవరు గుండియల్ దిగ్గురనగ’ అన్నట్టుగా అమరపురిని చేరగానే సంగీత ప్రియులందరూ ఆయన పాటల్ని అవిరామంగా పంచుకున్నారు. అలాగ వాట్సాప్ లో నన్ను చేరిన పాట  వింటుండగా రకరకాల ‘జాలి గాధలు, విషాద గాధలు’ గుర్తొచ్చాయి.  “నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగ చూచితిమీ’’ అన్నఆ పాట భీష్మ సినీమా లో సుశీలమ్మ గారితో అనుకుంటాను కలిసి పాడిన పాట.  బాల మురళీ గొంతులో మిగిలిన అన్నింటితో పాటు ‘రసం’ కూడా నిర్భరంగా నిండి జాలుగా ప్రవహించి మననీ అందులోకి లాక్కెళ్ళి ‘పరవశం’ అనే మత్తు కలిగిస్తుంది, అది అనురాగరసం అయితే ఇంకా తొందరగా.

అందుకే ‘నీవూ నేనూ వలచితిమీ’ అని ఆయన నోటి వెంట గాత్ర సమ్మిళితంగా రాగానే ఆ స్వరంలోంచి ఆ పరస్పర అనురాగ మాధుర్యం సాంబ్రాణి పొగలా కమ్ముకుంది. సాధారణమైన ప్రేమికుల భాష ‘ఐ లవ్ యు’ అనగానే వెంటనే ‘ఐ టూ’ అన్నది ఎంత వికారంగానేనా ఉంటుంది వెంటనే అప్పు తీర్చేసుకున్నట్టు.  అలాంటి కృతక వాతావరణంలో ఒక్కసారి ప్రణయ మాధ్వీ రసం జాలువారే స్వరంతో ఆయన ‘నీవూ నేనూ వలచితిమీ’ అనగానే ఎన్నో ప్రణయ హృదయాల సంవేదనలు మదిలో కదిలేయి.

ఈ విషాద ప్రపంచంలో ఏ ఇద్దరేనా సమాన హృదయం ఉన్న స్త్రీ పురుషులు ‘నీవూ నేనూ వలచితిమీ’ అనుకోగలిగితే అది ఎంత గొప్ప అనుభవం. అది కొద్ది కాలమే అగుగాక.  ఎల్ల కాలమూ ఎలాగూ నిలవదు నూరు శాతం.  కాని ఎంత కొద్ది కాలమయినా పరస్పరానురాగం ఆ జీవితాలను గొప్పగా కాంతివంతం చేసి తీరుతుంది.

అలా కానివాళ్ళు, ఒకవేపే ప్రేమించి ఎదుటివారి ప్రేమ కోసం అలమటించే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు పాపం ఆశోపహతులు, ఎప్పటికీ ఆ ప్రేమ పొందలేని వాళ్ళు , నీవూ నేనూ వలచితిమీ అనుకోలేని వాళ్ళు గుర్తొచ్చారు. అందులో మొదటి వ్యక్తి మహా భారత కథలో దేవయాని.

దేవయాని రాక్షస గురువు శుక్రాచార్యుడి గారాల కూతురు. తల్లి లేని పిల్ల.  స్వంత వ్యక్తిత్వంతో ఠీవిగా జీవిస్తున్న స్త్రీ.  తన ఇంటికి వచ్చి, తన తండ్రికి శిష్యుడై, ఆయన కనుసన్నల్లో ఉంటూ తన పట్ల ‘అటెన్షన్’ తో ఉండే  బృహస్పతి కొడుకు కచుణ్ణి ప్రేమించింది.  కచుడిదంతా అవసరం.  కానీ అందులో స్వార్ధం లేదు.  అది పూర్తిగా దేవకార్యం.  కాని దేవయాని తన యవ్వనపు ప్రధమ ప్రణయంలో కచుడిని గాఢతరం గా ప్రేమించింది.  ఆ తన ప్రేమ మాట మాట తండ్రి తో ఎంతో ధైర్యంగా చెప్పింది .ఆ మాటల్ని నన్నయ గారు పద్యాలలోకి ఎలా పట్టి తెచ్చారో చూద్దాం.

అడవికి గోవుల వెంట వెళ్ళిన కచుడు ఇంకా రాలేదు. సాయంత్రం అయినప్పటినుంచీ ఆమె ప్రతి క్షణమూ ఎదురు చూస్తూనే ఉంది.  చీకటి పడి చిక్కబడింది.  అయినా రాకపోతే సరాసరి తండ్రి దగ్గరకే వెళ్లి ఇలా అడిగింది.

వాడి మయూఖముల్ కలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ నిష్టమెయిన్ భవదగ్నిహోత్రముల్

పోడిగ వెల్వగా బడియె ప్రొద్దును పోయె కచుండు నేనియున్

రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నందెనో

భారతీయ సాహిత్యంలోనే ఇది అరుదయిన పద్యం. తన ప్రియుడి కోసం ఎదురుచూసి ఆ ఎదురు చూపు గురించి కన్న తండ్రికే చెప్తూ ప్రశ్నించిన నాయిక దేవయాని .  వెంటనే ఏ తండ్రి అయినా” నీకేమిటి అతని మీద అంత శ్రద్ధ?” అని అడిగి తీరుతాడు . ఎందుకంటే పై పద్యంలోని  ఆమె ఎదురు చూపులో కాలమానం ఉంది. క్షణక్షణమూ ఆమె పడుతున్న ఆందోళన ఉంది. ఆమె ఇలా అంటోంది. “సూర్యుడు అస్త మించాడు.  రోజూ ఆలోపే కచుడు ధేనువులతో ఇంటికొస్తున్నాడు.  కానీ ఆ సమయం దాటి పోయింది.  పైగా ధేనువులు వంటరిగా వచ్చేశాయి.  అయినా నీ అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని నువ్వు నీ నిష్టలోనే ఉన్నావు తప్ప పట్టించుకోలేదు. చివరికి పొద్దు పోయింది కూడా.  అతనికేదయినా ఆపద రాలేదు కదా?” అని అడిగింది.”నీ శిష్యులు ఏమీ చెయ్యలేదు కదా ?”అని కూడా. నిజానికి వాళ్ళే చంపేశారు అతన్ని.

తర్వాత తండ్రి అడగబోయే ప్రశ్నకు కూడా ఆమె వద్ద సమాధానం ఉంది.  ఆమె దుఖం చూసి తండ్రి అన్నాడు కదా” రాక్షసులు అతన్ని చంపేసి ఉండవచ్చు. నీకెందుకు దుఃఖం” అని.  అపుడు ఆమె సాక్షాత్తు తండ్రితో ఇలా చెప్పింది. “ నాన్నా కచుడంటే ఎవరనుకున్నావు.

మతి లోకోత్తరుడైన అంగిరసు మన్మండు, ఆశ్రితుండు, ఆ బృహ

స్పతికిం పుత్రుడు, నీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ

వ్రత సంపన్నుడు, అకారణంబ దనుజువ్యాపాదితుండైన, న

చ్యుత, ధర్మజ్ఞ, మహాత్మఅక్కచున కే శోకింపకెట్లుండుదున్ .

లోకోత్తరుడైన ఒకే ఒక వ్యక్తి అంగీరసుడు.అంతటి వాడి మనుమడు ఇతడు. దేవగురువూ, బుద్దిమంతుడు అయిన బృహస్పతి పుత్రుడు, నీలాంటి వాడికి శిష్యుడు, సుందరుడు, ఇవన్నీ జన్మ వల్ల వచ్చిన అర్హతలు.  నడవడిక వల్ల వచ్చిన అర్హత బ్రహ్మచర్యాశ్రమం,అది వ్రతంగా గలవాడు.  అలాంటి వాడి కోసం కాకపోతే ఇక ఎవరికోసం దుఃఖించాలి అని అంది. ఇంత కన్నా నీకు వివరంగా చెప్పాలా ? నువ్వు అచ్యుతుడివి, ధర్మజ్నుడివి,మహాత్ముడివి కూడా అనీ అంది.

ఆమె వల్ల కచుడు బతికాడు, దేవకార్యం నెరవేర్చాడు. కానీ ఆమె భగ్న మనోరధ అయింది. పై రెండు పద్యాలు దృఢమైన వ్యక్తిత్వం ఉన్న దేవయానిని చూపిస్తాయి.  అలాంటి స్త్రీ కచుడు లాంటి పురుషుడ్ని చూసాక, ప్రేమించాక, అది విఫలమైతే ఇక ఎవరితోనైనా జీవించగలదా? ఎవరైనా ఇష్టమవుతారా ? సాక్షాత్తూ పురూరవ వంశ చక్రవర్తి యయాతే ఆమె భర్త అయ్యాడు.  కానీ ఆమె అతనితో ‘నీవూ నేనూ వలచితిమీ’ అనలేక పోయింది.  జీవితాన్ని అలాగే శుష్క హృదయంతో, దాహంతో ఎండ బెట్టుకుంది.  ఇంకెలాగూ సమాధాన పడలేకపోయింది.

windఎక్కడి భారతం, ఎక్కడి ‘గాన్ విత్ ద విండ్’ నవల. దూరాలు కాలాల తాలూకు ఎంత వ్యవధి . కానీ గాన్ విత్ ద విండ్ లో స్కార్లెట్ అనే అందగత్తె అయిన అమ్మాయి కూడా ఇలా తను అమితంగా ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపొతే  జీవితంతో  పెనుగులాడుతూ, రాజీపడలేక, జీవితాన్ని అనుభావించాలనే తపనతో ఎక్కడికక్కడ చేజార్చుకుంటూ నవల పొడుగునా ప్రయాణిస్తుంది.

మనకి కోపమూ, జాలీ, ఏవగింపు, ఆశ్చర్యమూ, ఒకానొకచో ఆరాధనా అన్నీ కలుగుతాయి. యాష్లీ  ని ప్రేమించిన ఆమె అతను దక్కకపోవడంతో జీవితమంతా ఆ దాహంతోనే బతికింది.  ఆ పెనుగులాటలో ఆమెలో ఉన్న సామర్ద్యాలు బయటికీ వచ్చాయి. మోస ప్రవృత్తి పెరుగుతూనూ వచ్చింది.  దాంతోపాటు దేవయానిలాగే ఆమెలో నిర్భీతి, రాజీపడని తత్వమూను.

చివరకు మరెంతో సమర్ధుడైన, తనలాంటి వ్యక్తిత్వమే ఉన్న ‘రెట్ బట్లర్’ అనే మహారాజు లాంటి వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను అందలం మీద కుర్చోబెట్టినా, యాష్లీని మరవలేకపోయింది. అటు దేవయాని సవతి శర్మిష్ట గానీ, యాష్లీ భార్య మెలనీ గానీ పురుషుల్ని రెచ్చగొట్టే అందాలూ, విలాసాలు ఉన్న స్త్రీలు కారు. శాంతి, సహనాలకు ప్రతీకలు.  అలాంటి వారిని చూస్తే దేవయానికీ, స్కార్లెట్ కీ ఇష్టం లేదు.  వాళ్ళ మీద వారికి చిన్న చూపు.

ఇవాళ స్త్రీ వాదులు ఆడవాళ్ళ నిటారయిన వెన్నుముక యొక్క అవసరం గురించి మాట్లాడిన సందర్భంలో అలాంటి వెన్నుదన్ను ఉన్న ఈ నాయికలిద్దరూ పాపం జీవితం నుంచి ఏం పొందారనిపిస్తుంది. పైగా బాలమురళీ గారు పాడిన లాంటి పాట విన్నపుడు మరీనూ.

అయితే జీవితానికి ప్రణయ సాఫల్యత ఒక్కటే అర్ధాన్నిస్తుందా ? జీవితం అర్ధవంతం కావడానికి ఇలా స్త్రీల వలె పురుషులు కూడా మిధున జీవనమే ఫలప్రదమని భావిస్తారా? అంటే కాదేమో అనిపిస్తుంది. ఒక్క శరత్ దేవదాసు లాంటి మినహాయింపులు తప్పిస్తే.

కచుడు తర్వాత జీవితంలో ప్రేమకోసం వెతకలేదు. తాత్వికుడయ్యాడు. యాష్లీ కుడా మెలనీ లాంటి ప్రశాంత హృదయమున్న స్త్రీతో సరళ జీవనం గడిపాడు. ఈ స్త్రీలు మాత్రమే తమ జీవితాలల్లో తాము కోరుకున్న వ్యక్తులు లభించకపోవడం వల్ల జీవన యుద్ధం చేస్తూనే వచ్చారు.

ఇలాంటప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే స్త్రీలకు, ముఖ్యంగా సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీలకు తప్పనిసరిగా తాము ఎంచుకున్న పురుషుడితో గడిపే ప్రణయ జీవనం, లేదా కుటుంబ జీవనం మాత్రమే ప్రధానమా? మిగిలిన ఎన్ని సామర్ద్యాలు సంపాదించినా ఆ లోటును మర్చిపోలేరా? అన్నది ఆ ప్రశ్న.

వీళ్ళ ఇద్దరి నమునాల్లోంచి కాస్త దగ్గరగా కాలాతీత వ్యక్తులు నవలలోని ఇందిర కనిపిస్తుంది. అదే ధైర్యం, అదే చొరవ, అదే గాఢమయిన జీవితేచ్ఛ.  ఇందిర కుడా దేవయాని లాగే తల్లిలేని పిల్లే.

ఆమెకు ప్రేమ గురించి పెళ్లి గురించి ఖచ్చితమయిన అభిప్రాయాలున్నాయి. ఈ సంక్లిష్ట సమాజంలో బతక నేర్వడం గురించి కూడా. ధైర్యమయిన వాడు, అన్నివేళలా అండగా నిలబడ గలవాడు విశాలమయిన చాతీ ఉన్నవాడు (ఇది ప్రతీక) దొరికితే తప్ప పెళ్లి చేసుకోనంటుంది. ఆమెకు తారసపడిన వాళ్ళు పిరికివాళ్ళే.  వాళ్ళను ఏవగించు కుంటుంది. చివరకు తనలాగే స్వేచ్చ కోరుకొంటూ, తన స్వేచ్చను గౌరవించగలిగే కృష్ణమూర్తి తో సమాధానపడుతుంది తప్ప దేవయాని, స్కార్లెట్ లలాగా వేసారిపోదు. కానీ ఆమె కూడా కృష్ణమూర్తి తో కలిసి ‘నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగా చూచితిమీ ’ అని పాడుకుంటుందనుకోను.

ఏది ఏమయినా దేవయాని తండ్రితో మాట్లాడిన మాటలతో నింపిన నన్నయ భారతం లోని ఆ రెండు పద్యాలు నన్ను ఎప్పుడూ కదిలిస్తో ఉంటాయి.  కచుడి కోసం ఒక సంధ్యా సమయాన ఆశ్రమంలో చెట్ల కింద నిలబడి మాయమవుతున్న సూర్య కిరణాల్ని, మూగుతున్న చీకట్లనీ బెంగతో చూస్తూ, ఆశ్రమంలో వెలుగుతున్న హోమాగ్ని లాగ మండుతున్న గుండెతో వెళ్లి, తండ్రిని ప్రశ్నిస్తూ ఆందోళన పడుతున్న దేవయాని,సౌందర్యవతి అయిన ఆ యువతి, కళ్ళముందు మెదులుతూ ఉంటుంది.

ప్రణయ జీవన సాఫల్యం కన్నా విరహ వ్యధే ఒక్కొక్క సారి జీవితాన్ని ఎక్కువ వెలిగిస్తుందేమో, దాన్ని వెలుగు అనుకోవాలే గానీ.కానీ ఈ స్త్రీలది విరహ వ్యధ కూడా కాదు.వాళ్ళ కోసం మనం ఏం చెయ్యగలం . తలచుకోవడమూ ఆ తర్వాత  మరువలేక పోవడమూ  తప్ప.

*

మీ మాటలు

 1. ప్రమాదో ధీమతామపి! నీవూ నేనూ వలచితిమి అన్న పాట భీష్మ సినిమాలోది కాదు. అది శివాజీ గణేశన్ ‘కర్ణ’ సినిమాలోది.

  • V. Veeralakshmidevi says:

   అవునండీ ఈ సందేహం వచ్చింది. సరి చేసుకునే వ్యవధి లేకపోయింది

 2. Wonderful gaa wraasaaru andee. Mallee chadavaalanipinchenthagaa…very nice

 3. దాట్ల దేవదానం రాజు says:

  అధ్యయనం, అధ్యాపక అనుభవం, సాహిత్యాభిరుచితో ఒక పక్క ప్రేమ ఇరువైపుల ప్రేమ గురించి మంచి విశ్లేషాత్మక వ్యాసం అందించారు. అభినందనలు, వీరలక్ష్మీ దేవి గారూ

 4. సంగాని శ్రీనివాస జీవన్ says:

  కేవలం ఓకే ఒక్క భావన ఈ ప్రపంచం లో అన్ని భావనల్ని అధిగమించ గలదని నాకన్పిస్తూ ఉంటుంది . అది నందన వనం లాంటి ‘ వలపు ‘
  ప్రపంచం లోని అన్ని ద్వాందాలకు (సుఖ – దుఃఖాలకు ) దారి చూపుతుంది.నిర్మాణాత్మాకమైన ఫలితాల కు, చరిత్ర లో హీనులుగా మిగిలిపోయేలా వ్యక్తుల్ని దిగజార్చే శక్తి ఈ భా వనకు ఉంది.
  తరుణ వయస్సు లో మొలకలెత్తిన ‘వలపు భావన ‘ నిప్పుల కొలిమి గా మారి భగ్న జీవులుగా మారిపోయే దశ నుంచి తిరిగి కోలుకొని మళ్ళీ జీవన పోరాటం లో నిలదొక్కుకుని మనిషి గా ఎదగడానికి ఎంత మానసిక ఒత్తిడి, దాన్ని జయించేందుకు ఎంత శారీరక పరిశ్రమ అవసరమో అనుభవిస్తేనే తెలుస్తుంది. దేవయాని, స్కార్లెట్ లకు సంఘీభావం తెలిపెందుకు చాలా మందే ఉంటారు సమకాలీన సమాజం లో ! ఈ శేఫాలికల తో మాల కూర్చి వారి మెడలో వేయాలనుంది.

 5. Mythili Abbaraju says:

  వాహ్ ! దేవయాని, స్కార్లెట్ ఒహారా – ఏమి పోలిక ! !

  ఏ ముద్దు ఏ మోవి దన్నది ఏ పొద్దో రాసున్నదా…

  • Vvlakshmidevi@gmail.com i says:

   Naa sephalikalu mimmalni kuda cherinanduku santosham. Aa mata yevarido? Chala bavundi

   • Mythili Abbaraju says:

    నిరీక్షణ సినిమా లో పాట లో వాక్యమండీ.
    ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది…

 6. వారణాసి నాగలక్ష్మి says:

  Gone with the wind శీర్షిక హక్కు దారుడూ, పతాక సన్నివేశం లో ఆ వాక్యాన్ని పలికిన భగ్నహృదయుడూ అయిన రెట్ బట్లర్ కూడా అదే కోవకి చెందిన వాడు కదా!

  • V. Veeralakshmidevi says:

   Yes, thank you nagalalshmi garu

  • Mythili Abbaraju says:

   నిజమే నాగలక్ష్మి గారూ. ఆ ముగింపు లో ఇద్దరూ గుండెను పట్టి లాగుతారు…

 7. అక్కా,
  నీవూ నేనూ వలచితిమీ…..అనే మురళీమృదురవళితో ప్రారంభించి మీరు చేసిన సుదీర్ఘ విశ్లేషణ ఆలోచింపజేసింది. నమస్కారం!
  -నగేష్ బాబు

 8. దేవరకొండ says:

  అజరామరమైన బాల మురళి గాంధర్వ గానం ఇతర లోకాలను కూడా పరవశింపచేయడానికి వెళ్లిన బరువైన క్షణాల్లో రాసిన వలపు గుండెల వసంత సేన ల పరామర్శ బాగుంది. వీరలక్ష్మీ దేవి గార్కి ధన్యవాదాలు.

 9. janakibala says:

  Chaala bavundi.

మీ మాటలు

*