మీటితే చాలు, పలికే మురళి!

balamurali

మంగళంపల్లి బాల మురళి గారు పరమపదించారు అన్న వార్త నేను కాకినాడలో మా ఇంటి ముందు వరండాలో వాలు కుర్చీలో కూచుని మా మామిడి చెట్టుని చూస్తూ  అమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో నాకు చెప్పిన ఆ మానవుడిని లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. ఎందుకంటే అబద్ధాలాడే వారంటే నాకు అయిష్టం.

కానీ, వెనువెంటనే అప్పుడే వచ్చిన రోజు వారీ పత్రికలూ, నేను ఇండియాలో అరుదుగా చూసే టీవీల వలన ఆ వార్త  నిజమే అని తెలియగానే నా మనసు 1968, జనవరి మూడో వారానికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బొంబాయి I.I.T లో M. Tech చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో మా కేంపస్ లో “స్వరాంజలి” అనే శాస్త్రీయ సంగీత అభిమానుల గుంపు ఉండేది. మహమ్మద్ షేక్ అనే అతను ప్రధాన నిర్వాహకుడు. సమస్య అల్లా.. ఆ గుంపు లో ఉన్న వారందరికీ భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే కేవలం హిందూస్థానీ మాత్రమే. బెంగాలీ వారి రబీంద్ర సంగీత్, మరాఠీ వారి సంగీతం మొదలైన కచేరీలు కూడా ఏర్పాటు చేసే వారు..కానీ కర్నాటక సంగీతం అనగానే చిన్న చూపుతో ఒక్క కార్యక్రమం కూడా జరగ లేదు. అప్పటికి చాలా చిన్న వయసులో ఉన్న నా దృష్టిలో వారి అవగాహనా రాహిత్యం ఒక కారణం అయితే, కేంపస్ లో ఉన్న దక్షిణ భారతీయులు కొందరు బెంగాలీ, మరాఠీ, హిందూస్థానీ సంగీతాలని ఆస్వాదించడం ప్రగతి పథంలో పయనించి తమ విశాల దృక్పథం ప్రదర్శించుకోవడంగా భావించుకునే వారు. కర్నాటక సంగీతాన్ని పట్టించుకునే వారు కాదు.

సరిగ్గా ఆ తరుణంలో మంగళంపల్లి వారు సయాన్-మాటుంగాలో ఉన్న షణ్ముఖానంద వేదికలో కచేరీ చేస్తున్నారు అనే వార్త వచ్చింది. నేనూ, నా ఆప్త మిత్రులు భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తీ,  పులపాక రామకృష్ణా రావు (గాయని పి. సుశీల తమ్ముడు) ఆ కచేరీకి టిక్కెట్లు కొనేసుకున్నాం. కానీ మా కేంపస్ లో విశ్వనాథన్ గారూ (చిట్టి బాబు సహాధ్యాయిగా మంచి వీణా విద్వాంసులు), AIR మొదటి గ్రేడ్ లో అద్భుతమైన గాయని నాగరాజ మణీ నటరాజన్, ఇతర కర్నాటక సంగీతాభిమానులూ పట్టుపట్టి “స్వరాంజలి” వారిని ఒప్పించి బొంబాయి IIT కేంపస్ లో మొట్టమొదటి శాస్త్రీయ కర్నాటక సంగీత కచేరీ…బాల మురళి గారిచే చేయించే ఏర్పాట్లు చేశారు.  ఐ ఐ టి లో అనగానే బాలమురళి గారు తక్షణం అంగీకరించారు.

కానీ ఒక సమస్య వచ్చింది. ఏ కారణానికో ఇటువంటి సంగీత కార్యక్రమాలు జరిగే “లెక్చర్ థియేటర్” అనే 300 మంది పట్టే ఆడిటోరియం దొరక లేదు. అందుచేత  మా మైన్ బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఒక సర్వ సాధారణమైన హాలులో ఈ కచేరీ ఏర్పాటు చేశారు. అంటే పెద్ద స్టేజ్ , హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఒక చాంబర్ కాన్సెర్ట్ లా అనమాట. ఒక వేపు హిందుస్థానీ పద్దతిలో రొజాయిలూ. దిండ్లు పెట్టి పాడే వాళ్లూ, వినే వాళ్లూ అందరూ నేల మీదే కూచోడమే! రాత్రి భోజనాల తర్వాత 9 గంటలకి బాలమురళి కొలువు తీరారు. ఇప్పుడు 90 సంవత్సరాల అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, దండమూడి రామ్మోహన రావు గారు మృదంగం. సుమారు వంద మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు…అంతే…ఆ రోజు బాలమురళి రెచ్చి పోయారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లారగట్ట  ఒంటి గంట వరకూ..

ఆ రోజు ఆయన చేయని సంగీత విన్యాసం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. పాడని కృతి లేదు. అలుపూ, సొలుపూ అసలు లేనే లేదు. మా…లేదా మన దురదృష్టవశాత్తూ ఆ రోజుల్లో కెమేరాలూ, విడియోలూ లేవు. అరా కోరా ఉన్నా ఎవరికీ అందుబాటులో లేవు. అదృష్టవశాత్తూ …నా మనోఫలకం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెరిచే ఉంటుంది..నాకు నేనే ఎప్పడు కావాలంటే అప్పుడు ఆవిష్కరించుకుంటూ ఉంటాను. గత వారం రోజలుగా నేను నలభై ఏళ్ల నా బాలమురళీ పరిచయాన్ని ఆవిష్కరించుకుంటున్నాను. ఆయనతో నా తొలి పరిచయం 1968 లో బొంబాయి లోనే!

ఆ తరువాత గత నలభై ఏళ్లుగా ..ఒకటా రెండా .కనీసం పాతిక సార్లు ఆయన కచేరీలు వినడం కానీ, నిర్వహించడం కానీ జరిగాయి. ఆ మహానుభావుడితో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. ఆయన హ్యూస్టన్ ఎన్ని సార్లు వచ్చినా ఆయనతో కచేరీలు ఆనందించడమే కాకుండా ఆయనతో కాలం గడపడం, విహారాలకి తీసుకెళ్లడం, ఆయన చిద్విలాసంగా చెప్పే కబుర్లు వింటూ ఆనందించడం ..అవన్నీ తీపి గుర్తులే! ఆయన పోయిన మర్నాడు మా కాకినాడ సరస్వతీ గాన సభ -సూర్య కళామందిరంలో జరిగిన సంతాప సభలో నా జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఆయన ఆ సభకి బాలమురళి గారు గౌరవాధ్యక్షులు. అలనాటి సూర్య కళా మందిరాన్ని ఆధునీకరణ చేసి 2003 లో బాలమురళి గారే పున:ప్రారంభం  చేశారు. ఆ వేదిక బాలమురళిగారికి అత్యంత ఆత్మీయమైన వేదిక. ఆ సభలో స్థానిక ప్రముఖులు, మునుగంటి శ్రీరామముర్తి గారి కుమారులు వెంకట్రావు గారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

బాలమురళీ గారి సంగీత ప్రాభవం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ, ఒక వ్యక్తిగా ఆయన హాస్య ప్రవృత్తి గురించి నేను విన్నవీ, స్వయంగా తెలిసినవీ  కొన్ని మాటలు చెప్పగలను. ఒక సారి ఒక పెద్దాయన మృదంగం నేర్చుకున్న తన కొడుకు బాల మురళి గారితో ఒక కచేరీలో వాయిస్తే చాలు. అతని కెరీర్ కి ఉపయోగపడుతుంది అని బతిమాలితే ఆయన ఒప్పుకున్నారు. కచేరీ అయ్యాక ఈ తండ్రి బాలమురళి గారిని “మా వాడికి తన్యావర్తనం అవకాశం కూడా ఇస్తారు అనుకున్నాను. అంటే కచేరీ మధ్యలో మృదంగం ప్రతిభ చూపించుకునే అవకాశం. దానికి బాలమురళి గారు “ఇవ్వకేం ..మొత్తం మూడు గంటలూ తను చేసింది తన్యావర్తనమేగా. నేనేదో పాడుతున్నాను. అతనేదో వాయించుకు పోయాడు. అంత కంటే ఏం కావాలి” అని చురక అంటించారుట.

అలాగే ఒక సారి ఆయనా, మరి కొందరూ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉంటే “ఫలానా రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుచుచున్నది” అని స్పీకర్ల లోంచి ఒకావిడ మెసేజ్ వినపడింది. అందరూ విసుక్కుంటూ ఉంటే బాలమురళి గారు “పాపం ఆ ఏనౌన్సర్ ని ఏమీ అనకండి. ఆవిడే ఒప్పుకుందిగా రైలు నడుచుచున్నదీ అని. రైలు పరిగెడితే సమయానికి రాగలదు కానీ నడుస్తుంటే ఆలస్యం అవదూ” అని వాతావరణాన్ని తేలిక పరిచారు.

ఆయనకీ వచ్చిన బిరుదులు కేవలం యాదృచ్చికం. ఆయనకీ అవసరం లేనివి. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ “నేను ఒక వాయిద్యం లాంటి వాడిని, మృదంగం మీద చిన్న దెబ్బ వేస్తే ఆ దరువు వినపడుతుంది. వీణ మీటితే నాదం వినిపిస్తుంది. అలాగే నన్ను మీటితే సంగీతం వస్తుంది. నాకు ఎక్కువ సాధన అక్కర లేదు. నా సహ వాయిద్యం వారికోసం సాధన చేస్తాను” అన్నారు.

అపర త్యాగరాజు, కర్నాటక సంగీతానికి, యావత్ భారతీయ సంగీతానికి రారాజు శ్రీ మంగళంపల్లి బాల మురళి గారి కి ఇదే నా ఆత్మీయ నివాళి.

*

 

 

మీ మాటలు

  1. విజయ్ కోగంటి says:

    అలాటి మహా గాయకులతో ఆత్మీయ బంధమే ఒక అదృష్టం. మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  2. శాయి says:

    రాజు గారూ, బాలమురళి గారితో ఉన్న మీ అనుబంధంతో రాసిన నివాళి చాలా బాగుంది. త్యాగరాజు కాలంలో మనం లేము. అన్నమయ్య పదాలు పాడుతుంటే మనం వినలేదు. కానీ బాలమురళి గారు సంగీతం సృష్టించిన చరిత్ర పుటలు భవిష్యత్తులో తిరగవేసినప్పుడు ఆ పుటలపై పడిన ధూళి రేణువులలా మనమూ వుంటాం. అదే మనం చేసుకున్నపుణ్యం.

    శాయి

  3. వంగూరి చిట్టెన్ రాజు says:

    చాలా బాగా చెప్పారు,శాయి గారూ…మీ స్పందనకి ధన్యవాదాలు.

  4. muralikrishna ch says:

    మీకు అపార గంధర్వుడితో ఆస్వాదించిన అనుభవాలు తెలిపారు .బావుంది

    మీకు తెలిసిన ఆయన ప్రజ్ఞా పాటవాలను కూడా రాస్తే మాలాంటి పామరులకు విజ్ఞాన ఆనందం కదా

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ఆ విషయం స్మగీత విద్వాంసులు, పండితులు రాస్తూనే ఉన్నారు అనేక దశాబ్దాలగా …ఆయన ప్రజ్ఞా పాటవాల గురించి వ్రాసే సంగీత పరిజ్ఞానం నాకు లేదు. ఏం చేస్తాం?

  5. శర్మ దంతుర్తి says:

    రాజు గారు
    మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదములు. బాల మురళి లాంటివారు అరుదుగా పుడుతూ ఉంటారు. అదీ మన తెలుగు వాడై పుట్టడం మన (దుర)(అ)దృష్టం.

    ఇలా అంటున్నానని ఏమనుకోకండి కానీ త్యాగరాజుకీ బాలమురళికి పోలిక ఏమీ బావోలేదు. ఒకరికొకరే. ఎక్కడి త్యాగరాజు ఎక్కది బాలమురళి? బాలమురళి కంఠం అద్భుతం అని నేనూ ఒప్పుకుంటా కానీ త్యాగరాజు ఎక్కడ బాల మురళీ ఎక్కడా? స్పాంటేనియస్ గా పాట నోట్లోంచి వస్తే దాన్ని అక్కడికక్కడ ఎవరూ మర్చిపోలేని విధంగా – ఎవరినుంచీ ఒక్క పైసా ఆశించకుండా రాముడికి మాత్రమే అనుకుంటూ కన్నీళ్ళతో పాడడం వేరూ, పాటలు బాగా పాడడం వేరూ కదా?

    ఇద్దరికీ ఇద్దరే కానీ ఇలా కంపేరిజన్ మాత్రం బావోలేదు, కనీసం నా ఉద్దేశ్యం అది; మీరు నన్ను ఎలా తిట్టినా సరే, ఏమన్నా సరే.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ‘అపర త్యాగరాజు’ అన్న ఒక్క మాటలోనే మీకు నేనేదో వారిద్దరినీ పోల్చి త్యాగరాజు వారిని తక్కువ చేసినట్టు భావించడం ఆశ్చర్యంగానే ఉంది. అది అనాలోచితంగా అన్న మాటే కానీ, నాకేదో తెలిసినట్టుగా త్యాగరాజ స్వామి తో బాల మురళి గారిని పోల్చడం నా ఉద్దేశ్యం కానే కాదు. త్యాగరాజు ల వారిని చూడ లేకపోయినా, ఆ అనుభూతి బాల మురళి మనకి కలిగించారు అనుకోడంలో అంత తప్పు లేదు అనుకుంటాను.

    • మన మాంస నేత్రం తో చూసాము కాబట్టి ఆయన త్యాగరాజు గా అనిపించకపోవచ్చు. ఈ రోజు మీరు త్యాగరాజు గురించి ఎలా చెబుతున్నారో ఇంకో వందేళ్లు గడిచాక ఈ మహనీయుడి గురించి అలా చెబుతారు.

      • వంగూరి చిట్టెన్ రాజు says:

        ఆందులో అనుమానం ఏమీ లేదు. బాల మురళి వాళ మురళే!

  6. కె.కె. రామయ్య says:

    ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మగారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ( బాలమురళి గారిని నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి వారితో పోల్చటం విషయంలో ).

    సమకాలీనులైన సంగీత విద్వాoసులతో కాకుండా తనను Musical Trinity ల విద్వత్తుతో పోల్చి చూడమని బాలమురళికృష్ణ గారు ఎదో మాటల సందర్భంలో అన్నట్లుగా వార్త ఉన్నా దాన్ని తప్పుగా అర్ధం చేసుకోవక్కరలేదనుకుంటా. బాలమురళికృష్ణ గారికి వారి పట్ల ఉన్న గౌరవానికి సూచనగానే అర్ధం చేసుకోవచ్చు.

    తమిళనాడు తంజావూరు దగ్గరి తిరువైయ్యారు లో, కావేరీ నదీతీరంలో ఉన్న త్యాగరాజ స్వామి వారి సమాధిని దర్శించుకోవటానికి వచ్చిన వారిలో నూతన దంపతులు కూడా ఉండటం చూసి, వారెంతో భక్తిప్రపత్తులతో స్వామి వారి సన్నిధికి సాగిలపడటం చూసి నాకెంతో ఆశ్చర్యం, ఆనందం కలిగింది. అందులోని అత్యధికులు తమిళులే అని చెప్పాల్సిన అవసరంలేదనుకుంటా.

    మంగళంపల్లి బాల మురళి కృష్ణ లాంటి అసాధారణ ప్రజ్ఞా పాటవాలు కలిగిన శాస్త్రీయ సంగీత వాగ్గేయ కారుడు మన తెలుగు వాడైనందుకు గర్విద్దాం.

    డా. మైథిలి అబ్బరాజుగారు రాసిన మరో అద్భుత నివాళి ( వాగర్థాలు కలిసి మురిసిన మురళి! ) కూడా చదివి ఉంటారని ఆశిస్తున్నా.

  7. వంగూరి చిట్టెన్ రాజు says:

    మీ స్పందనకి ధన్యవాదాలు. విని ఆనందించడమే తప్ప బాల మురళి గారి సంగీత ప్రజ్ఞా పాటవాల విషయంలో ఇసుమంతైనా పరిజ్ఞానం కానీ, వారిని త్యాగరాజ స్వామి తో పోల్చే దుస్సాహసం కానీ నాకు లేవు.

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

*