ఎల్లలు దాటిన అద్భుతం – ఎల్లోరా!

ellora1

~

మా ఎలోరా యాత్ర చాలా అకస్మాత్తుగానే జరిగింది. ‘ఈ సారైనా దసరా సెలవులకు ఎటైనా వెళ్దామా?’ అంటూ మా అమ్మాయి కావ్య అడిగిన ప్రశ్న కొంచెంగా కుదిపిందనే చెప్పాలి. చాలా స్తబ్ధంగా విరామం లేకుండా పరిగెట్టి ఒక్క తెరిపి చిక్కే సరికి ‘అవును ఎందుకెళ్ళగూడదు?’ అనే ప్రశ్నే సమాధానమనిపించింది. కొల్హాపూర్ లో వున్న తమ్ముడి కుటుంబాన్ని పలకరించి అలా షిర్డీ, పండరి, అజంతా – ఎలోరా లలో ఒకటైనా సరే చూసి వద్దామని బయలుదేరాం.

నేరుగా కొల్హాపూర్ కు రైలు లేకపోవడంతో  డబుల్ డెకర్ ట్రైన్ లో హైదరాబాదు సాయంత్రానికి చేరి నకోడా స్లీపర్ సర్వీస్ లో మర్నాడు వుదయానికి  దట్టంగా పొగమంచులో కిటికీ నుంచీ వరుసగా దాటిపోతున్న  గ్రామాలు, మనుషులను చూస్తూ సాంగ్లీ చేరేసరికి వుదయం 6.45 అయింది.  పొద్దున 7 .30 కల్లా కొల్హాపూర్ లోకి ప్రవేశించాం. నేనూహించిన సాంప్రదాయకమైన మహరాష్ట్ర దుస్తులలో మనుషులు ఎక్కడో ఒకటి, రెండు చోట్లలోనే కనిపించారు. బహుశా ఇంకా లోపలి వూళ్ళ కెళితే కనిపిస్తారు కాబోలు అనుకున్నాం. గ్లోబలైజేషన్ పుణ్యమా అని వేషం, భాష కట్టుబాట్లు మారుతున్నాయి గదా. భాషలు పేరులే మార్పు కానీ ప్రదేశాలన్నీ ఒకటే.

ellora4

తమ్ముని కుటుంబంతో ఓ రోజు గడిపి ఆ సాయంత్రం కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించాం. గోకుల్ పాలెస్ లో భోజనాల సమయంలో ‘కేవలం ఈ దేవాలయమే  కాక కొల్హాపూర్ లో పంచగంగా ఘాట్, శ్రీ ఛత్రపతి సాహు మ్యుజియం గా మలచబడిన రాజ సౌధం, టౌన్ హాల్ మ్యుజియం కూడా సందర్సించ దగినవి. కొల్హాపూర్ చెప్పులకు, బెల్లానికి కూడా ప్రసిద్ధి’ అని కూడా తెలిసింది. ఆ రాత్రే షిర్డీ కి బయలుదేరి తెల్లారేసరికి చేరాము.

మొదటి సారి షిర్డీ లో అడుగుపెట్టగానే అంతా గందరగోళంగా అనిపించింది. భక్తీ అంటే వాణిజ్యమనే నానుడి (నా గొణుగుడు) నిజమనిపించింది. ఇలా వాణిజ్యం లేకుండా మనుషులు జీర్ణించు కోలేరేమో. చుట్టుముట్టిన ఆటో వాలాలు, గదులు కావాలా, హోటల్స్ కావాలా, చాలా చవక అంటూ దళారీలు- ఓ నిముషం ఉక్కిరి బిక్కిరి అయ్యాము. అందర్నీ తప్పించుకు కొంత దూరం నడిచి ఊపిరి పీల్చుకు ఓ మాదిరిగా  మంచి హోటల్ లో రూమ్ తీసుకున్నాము. స్నానం , బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనానికి వెళ్ళడం మరో అధ్యాయం.

భక్తి అంటే  పెరిగిన ప్రేమ, అభిమానమే. దైవం మానుష రూపం లో అన్నట్లు గా తన సమాజంకోసం, తనను నమ్మిన వారికోసం కులమతాల కతీతంగా జీవించిన షిరిడీ బాబా పై ప్రత్యేక మైన ప్రేమ. అయితే ఈ ప్రేమను కూడా ఇలాటి చోట్ల, డబ్బు చేసుకునే వ్యాపారుల వల్లే కొంచెం పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే జంకు. అనవసరమైన వన్నీ భక్తులకు అంటగట్టాలని దారి మళ్ళించే వ్యాపార దళారీలను తప్పించుకొని మొబైల్ వగైరాలు బయటే జమచేసి దర్సనానికి వెళ్ళి వచ్చాం .  షిరిడీ ఆలయం చుట్టూరా ఉన్న గ్రామమంతా హోటళ్ళు, లాడ్జి లతో నిండిపోయింది. మా కారు డ్రైవర్ చెబితే విని ఆశ్చర్య పోయాము, ‘వీటిలో ఎక్కువ భాగం తెలుగు వారివే నట’. నిజమైన మహారాష్ట్ర గ్రామీణ వాతావరణం చూడాలంటే గుర్రపు జట్కా లో పక్కనున్న పల్లెలను చూడాల్సిందే. షిర్డీ వెళితే బళ్లపై అమ్మే ఎర్రటి జామపళ్ళు తినాల్సిందే.

మర్నాడు ఉదయమే బయలుదేరి ఎలోరా వెళ్ళాము. చాలా ఆహ్లాదకరంగా కొండలు, కోనలు, చెరువులు గల దారిమధ్యలో ఘ్రుష్ణేశ్వర ఆలయాన్ని దర్శించాము. పెద్ద స్తంభాలు, చుట్టురా ఎత్తైన అరుగులు కలిగి విశాలమైన ప్రాంగణం కల చాలా పురాతన ఆలయం. ఈ రహదారి నేరుగా వెళితే ఔరంగాబాద్ కు, ఎడమకు వెళితే అజంతా కు తీసుకెళ్తుంది.

ఈసారి  ఎల్లోరా నే చూద్దామనుకున్నాం.  ఎప్పటినుంచో  వేరుల్, లేక ఏలపుర, లేక ఏలుర – అదే మన ఎలోరా గురించి విని, చదివి ఉండడంతో చాల్ల ఉత్సుకత నిండిన మనస్సులతో చేరుకున్నాం. కొండలను గుహలలా, ఆలయాల్లా మలిచి సృష్టించిన మహాద్భుతం ఈ ఎల్లోరా గుహల సముదాయం. బౌద్ధ, హిందూ జైన సంప్రదాయాలకు సంబంధించినవీ గుహలు. ఈ గుహలనన్నీ  చరణాద్రి పర్వత సానువుల్లో (600 – 1000 C.E)  తొలిచి నిర్మించినవి.

ellora2

మనం అక్కడికి చేరుకోగానే గైడ్ లు మనల్ని అనుసరిస్తారు. ముందుగానే వివరాలన్నీ దగ్గరుంచుకుని లేదా మంచి అనుభవజ్ఞు దిన గైడ్ ను ఎంచుకుని దర్శించవచ్చు. బయట ఎలోర కు సంబంధించిన పుస్తకాలు అమ్ముతూ కొందరు అనిపిస్తారు. వీరి వద్ద కంటే లోపల ప్రభుత్వం వారి టూరిజం కౌంటర్ లో ధర తక్కువగా లభిస్తాయి.

ఇక్కడ దాదాపు వంద గుహలున్నాయి. అయితే 34 గుహలు మాత్రమే దర్శించడానికి అనుమతిస్తారు. వీటిలో 12 (1-12) బౌద్ధ గుహలు, 17 (13-29) హైందవ గుహలు, 5 (30-34 ) జైన గుహలు. ప్రతి గుహా వారి వారి పురాణాలకు సంబంధించిన గాధలను తెలిపే శిల్పాలను ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ  కూడా రాష్ట్రకూటులు, యాదవ వంశస్తులు నిర్మించినట్లు చరిత్ర, శాసనాలు తెల్పుతున్నై. ఒకప్పుడివి ప్ర్రార్ధనాలయాలుగా భాసించ బడ్డా, కాలక్రమంలో శత్రువుల దండయాత్రలలో దెబ్బతిని, ప్రాభవాన్ని కోల్పోయి ప్రస్తుతం పురాతన సందర్శనా స్థలాలుగా నిలిచిపోయాయి.

16 వ నంబరు గుహ అత్యద్భుత సాక్షాత్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద, మొదటి ఏకశిలా కైలాస దేవాలయం. కైలాసాన్ని తలపించే ఒక పెద్ద దేవాలయాన్ని , చుట్టురా ఉండే ప్రాకారం, రెండు ధ్వజ స్తంభాలు, ఎదురుగా రెండు పెద్ద ఏనుగులు , ఆలయ పాలకుడి మందిరం, ప్ర్రార్ధనాస్థలం, గర్భాలయం, దాని చుట్టూ బయటగా ఐదు చిన్న ఆలయాలు – ఇవన్నీ ఒకే పర్వతం లో ఒక మహా దేవాలయంలా నిలువెత్తు , అంటే దాదాపు పది పదిహేను అడుగుల ఎత్తుగల శైవ వైష్ణవ గాధలను ప్రతిబింబించే శిల్పాలు కనులముందు నిలిచి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఒడలు గగుర్పొడిచి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రవేశద్వారానికి అటూ ఇటూ పురాణేతిహాసాలకు సంబంధించిన శిల్పాలు దర్సనమిస్తాయి. లోనికి ప్రవేశించగానే గణపతి, మహా శివుడు, మహావిష్ణువు, గజలక్ష్మి , శిల్పాలు కనుల విందు చేస్తాయి.

ఈ ఆలయాన్ని దాదాపు 200,000 టన్నుల  రాతిని తొలిచి శిల్పులు నిర్మించారు. అంత కొండ ని తొలచి ఆ శిలా వ్యర్ధాన్ని తరలించి అంత పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టించారో నన్న ఊహే మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

గర్భ గుడి ముందరి ప్రార్ధనా మందిరం విశాలంగా పెద్ద పెద్ద స్తంభాలతో తీర్చిదిద్దబడి  ఉంటుంది. మామూలుగా నేలపై నిర్మించిన దేవాలయంలో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఆలయం చుట్టూ మరియు ఇతర గుహలలో దశావతారాలు, శివ పార్వతుల కళ్యాణ అంశాలు, నరసింహ, రామ, కృష్ణ అవతార విశేషాలు ప్రముఖంగా కనిపిస్తాయి.

ellora3

అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రదేశాన్ని తిలకించడానికిమంచి కాలం. అంత ఎండా అంత చలీ కాకుండా కుటుంబ సభ్యులతో కులాసాగా వెళ్ళి రావచ్చు. ఎలోరా పూర్తిగా చూడడానికి మూడు రోజుల సమయం కేటాయిస్తే బాగుంటుంది. ఒక రోజులో ఐదారు గంటలలో రెండు గుహలను మాత్రమే చూడగలం.  విహార యాత్రలు చేస్తూ, భారత దేశంలో పుట్టి అజంతా ఎల్లోరా లను చూడకపోవడం మహా ద్రోహమే ననిపిస్తుంది. మానవుని సృజనాత్మక శక్తికి, విధ్వంసపుటాలోచనా విధానానికీ ఎల్లోరా ఒక సజీవ చిహ్నం.

తిరిగి వస్తుంటే కావ్య ఒక ప్రశ్న అడిగింది. ‘ నైట్ ఎట్ ది మ్యుజియం’ సినిమా లో లాగా ఈ శిల్పాలకు రాత్రి సమయాలలో ప్రాణం వస్తే ఎలా ఉంటుందీ?’ అని. అవును, ఆ ఊహే చాలా విచిత్రం. అంతటి మహారూపాలు సజీవంగా సంచరిస్తే ? ఆ సంగీత ధ్వనులు, ఆభరణాల సవ్వడులు, నృత్యాలు, ఏనుగులు, గుర్రాలు, శరభాలు, సింహికలు, యక్షులు, యుద్ధశబ్దాలు ,.. ఓహ్, ఓ అద్భుత దృశ్య కావ్యం! అయితే నాకు ఇంకో కోరికా కలిగింది. వెన్నెల్లో స్నానించే ఎల్లోరా ను చూడాలని!

ఫోటోలు: శ్రీ కావ్య,కోగంటి

మీ మాటలు

  1. Suparna mahi says:

    నిజంగా మీ యాత్రాస్మృతి చాలా చాలా కొత్త ఆలోచనలనీ తీసుకొచ్చింది సర్.. ఇంత గొప్ప అద్భుతం ప్రపంచ వింతల్లో ఎందుకు చోటుచేసుకోలేదో అర్థం కాని ప్రశ్న… చక్కని ఆర్టికల్ కు ధన్యవాదాలు సర్…

    • విజయ్ కోగంటి says:

      ప్రశంస కు ధన్యవాదాలు మహీ. అవును నాకూ అది ఆశ్చర్య కరమైన ప్రశ్న లాగ్ ఉంది.

  2. జూనియర్ కాలేజ్ లో excursion కి వెళ్లినప్పుదు ఎలోరా గుహల్లో శివాలయం చూపిస్తూ మా guide శివ-పార్వతీ కల్యాణ ఘట్టం వున్న చోట ఆగి – పార్వతీ దేవి సౌందర్యానికి మైమరచి ఆవిడ చేతిని అందుకోబోయి ఆవిడ చేతిలోనే తన చెయ్యి వుంచాడని చెప్పిన మాటలు – కళ్ల నిండా ఆ శిల్పాన్నిచూస్తూ చెవులనిండా విన్న రోజులు గుర్తుకొచ్చాయి మీ వ్యాసం చదివాక.

    http://www.holidayiq.com/destreviewimages/AjantaEllora-494345_6.JPG

  3. Dasaradhi Koganti says:

    బాగుంది భాయ్..ఎప్పటిలాగే చక్కటి ఎక్స్ప్రెషన్….మంచి పదాల వాడుక…మీరు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు…. ఈ సారి అందరం కలిసి వెళదాం..

Leave a Reply to Lalitha TS Cancel reply

*