అసంతృప్తి  

satya2

art: satya sufi

 

అతనంటే నాకిష్టం లేదు, నాకతన్ని చూసినప్పుడు భగభగమండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకిష్టం లేదు, అతను నా పక్కనుంటే, నాకు – పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగనక్కలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటుబాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా చిన్నతనంగా వుంటుంది. యెందుకు? అతను నాకన్నా చదువుకున్నాడా? లేదు. నాకన్నా ధనవంతుడా? కాదు. నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో!

అతను నా చిన్ననాటి స్నేహితుడు. మా ఇద్దరిదీ వొకే వీధి, వొకే స్కూలు. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే అతిపెద్ద ఇల్లు, ఆ వీధిలోకెల్లా అతన్దే అతిచిన్న ఇల్లు. మేం ధనవంతులం, నా తండ్రి నగరంలో టాప్ క్రిమినల్ లాయర్. అతని తండ్రి వారానికోసారి మాత్రమే అన్నం తినేవాళ్ళా బక్కగా, బలహీనంగా వుండేవాడు. ఆయనకేదో చిన్నఉద్యోగంట, జీతం కూడా సరీగ్గా ఇవ్వర్ట. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!

స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. అతను బిడియస్తుడు, భయస్తుడు, తనదికాని ఈ ప్రపంచంలో టిక్కెట్టులేని రైలు ప్రయాణికుళ్ళా బెరుగ్గా వుండేవాడు. నేనెక్కువగా నాకిష్టమైన క్రికెట్ ఆట ఆడేవాణ్ని, అతను నేను షాట్లు కొట్టేందుకు వీలుగా బౌలింగ్ చేసేవాడు. అతను నాతో క్రికెట్ ఆడటమే గొప్ప ఎచీవ్మెంట్లా భావించేవాడు. అతను నేనడక్కుండానే నాకో ఉన్నత స్థానం ఇచ్చేశాడు.

అతను మా ఇంటిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. ‘భౌ’మనే మా టామీని చూసి భయపడ్డాడు, కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ ‘ట్రింగ్ ట్రింగ్’ మన్నప్పుడు సంబరపడ్డాడు. ఇలా – నన్నూ, నా ఐశ్వర్యాన్నీ అతను ఎడ్మైరింగ్గా చూడ్డం నాకు చాలా ఆనందం కలిగించేది.

కానీ – నా ఆనందం, నా ఈగో అంతలోనే ఆవిరైపొయ్యేవి. అందుక్కారణం – చదువులో అతని ప్రతిభ. మునిసిపాలిటీ కుళాయి నీళ్ళుపట్టి మోసుకెళ్ళడం, వంట చెయ్యడం, బట్టలుతకడం.. ఇలా అన్నిపనుల్లో తల్లికి సాయం చెయ్యడంలో అతను బిజీగా వుండేవాడు. పరీక్షల్లో మార్కులు మాత్రం అన్నీ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కోమార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు – యెలా సాధ్యం!

అతను మంచివాడు. అతని మాట నిదానం, మనిషి నిదానం. చదువు తప్ప మిగిలిన విషయాల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు కష్టంగా అనిపించిన పాఠాల్ని అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతని వల్ల నేను చాలా లాభపడ్డాను. కష్టమైన పాఠ్యాంశాల్ని కూడా సులువుగా అర్ధం చేసుకునే అతని ప్రతిభకి ఆశ్చర్యపొయ్యేవాణ్ని, లోలోపల రగిలిపొయ్యేవాణ్ని. అతను నాతో యెంత స్నేహంగా వున్నా, అతని చదువు మాత్రం నాకు ముల్లులా గుచ్చుకుంటూనే వుండేది.

మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతీ ఆగదు. ఇవేవీ ఆగకపోయినా, కుటుంబ సమస్యల్తో చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం అతను స్కూల్ ఫైనల్తో చదువాపేసి ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతున్న నా జీవితానికి అతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.

ఆ తరవాత నా చదువు చక్కగా ‘కొన’సాగింది. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొన్లేమంటారు గానీ చదువుని మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. కేవలం డబ్బువల్లే ఉన్నత చదువులకి గోడమీద బల్లిలా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సులు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.

ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్దకంపెనీలో పెద్దకొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్తో అందమైన భార్య, కాంప్లాన్ బాయ్ల్లాంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చుకుక్కలు. మూడు కార్లు, నాలుగు బిల్డింగులు, పెద్దవ్యాపారాల్లో భారీపెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాలరాశి. కానీ – అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

మా ఊళ్ళో మా కుటుంబానికున్న పొలాలు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపొయ్యాయి. కొన్నికోట్ల విలువైన ఒక స్థలం రిజిస్ట్రేషన్ కోసం నేను యెన్నో యేళ్ళ తరవాత మా ఊరికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు అతన్ని పలకరించడం కూడా ఒక పనిగా పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ పని లంచ్ సమయానికి పూర్తైపోయింది. కారు వెనుక సీట్లో కూలబడి డ్రైవర్కి అతని ఇంటి ఎడ్రెస్ చెప్పాను.

మా ఊరు ఒకవైపు అందంగా సుందరంగా పొడవాటి బిల్డింగుల్తో ‘అభివృద్ధి’ చెంది కుర్రకళతో తళతళల్లాడుతున్నా, పాత ఊరు మాత్రం ముసలి పేదరాశి పెద్దమ్మలా అలాగే వుండిపోయింది. అతనా ముసలి ప్రాంతంలో వొక ఇరుకు వీధిలో అద్దెకున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనేనా? కాకపోవచ్చు, ఇన్నేళ్ళ తరవాత అతని యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా నేను సాధించేదేమీ లేదు. అతన్ని చూడటం ద్వారా నాలో గూడు కట్టుకున్న అసంతృప్తి కొంతైనా తగ్గచ్చొనే ఆశతో వెళ్తున్నాను.

ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా వుంది. అమెరికావాడి అప్పుకోసం ఇండియావాడు షోకేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా వుంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకువీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అది రెండుగదుల పెంకుటిల్లు. రోడ్డువైపుకు ఓ చిన్నగది, లోపల ఇంకో చిన్నగది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ అరవయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెంమీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో వొక పాతకుర్చీ, మూలగా ఒక చింకిచాప. మై గాడ్! వొక ఇల్లు ఇంత పేదగా కూడా వుండగలదా! ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!

ఆ కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. వార్ధక్యంలో, పేదరికంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే డాక్టర్లు పొట్టకోసి పేగులన్నీ తీసేసి ఖాళీపొట్టని మళ్ళీ కుట్టేసినట్లున్నారు. ఆయన వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుంది.

ఆయన.. ఆయనకాదు.. అతను! అతను.. నా స్నేహితుడు! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. నన్ను పోల్చుకున్నట్లుగా లేదు. మళ్ళీ తల దించుకుని మౌనంగా, శూన్యంలోకి చూస్తున్నట్లుగా అలా వుండిపొయ్యాడు. యేంచెయ్యాలో తెలీక పొడిగా దగ్గాను. తలెత్తి మళ్ళీ నావైపు చూశాడు. అతనికి నేనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నట్లు లేదు.

“నేనెవరో గుర్తు పట్టావా?” ముందుకు వొంగి అడిగాను.

“క్షమించాలి, నాకు చూపు సరీగ్గా ఆనదు.” నెమ్మదిగా అన్నాడు.

“నేను.. నీ చిన్ననాటి స్నేహితుణ్ణి.” అన్నాను.

కళ్ళు చిలికించి చూస్తూ నన్ను పోల్చుకున్నాడు. అతని కళ్ళల్లో కనీసం వొక చిన్నమెరుపైనా కనిపిస్తుందని ఆశించాను, కానీ – అతని చూపులో జీవం లేదు. నెమ్మదిగా లేచి యెదురుగానున్న చాపమీద కూర్చున్నాడు. నేనా డొక్కుకుర్చీలో కూలబడ్డాను. నా ప్రశ్నలకి అతను నెమ్మదిగా, అతిచిన్నగా సమాధానం చెప్పాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని గూర్చి కొద్దివివరాలు తెలిశాయి.

తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. అతని కొద్దిపాటి జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీరుస్తూ, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య అతన్ని అతని పేదరికానికి వదిలేసి కొడుకుని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాడు. నాకతను దిగాలుగా భారంగా జీవిస్తూ, చావు కోసం ఆశగా ఎదురుచూసే నిరాశాజీవిలా కనిపించాడు.

నాకు ఆ వాతావరణం చాలా ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించసాగింది.

ఒక్కక్షణం ఆలోచించి అడిగాను – “నీకిన్ని ఇబ్బందులున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు?”

సమాధానం లేదు.

“నీకు తెలుసా? ఇప్పుడు నేను నీకు యే సహాయమైనా చెయ్యగల స్థాయిలో వున్నాను.” అన్నాను.

అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకు సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. ఆ తరవాత కూడా అతనేమీ మాట్లాడలేదు. అతనికి నాతో మాట్లాడే ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కుకుర్చీకీ, అతనికి పెద్ద తేడాలేదు. ఇక అక్కడ వుండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.

నన్ను గమనించిన డ్రైవర్ హడావుడిగా కారు వెనుక డోర్ తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాకు మరింత అసంతృప్తిగా వుంది. నాదికాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు కొరికే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేసిన దొంగపిల్లిలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.

నా అసంతృప్తి క్రమేపి కోపంగా మారింది. అతని పరిస్థితి బొత్తిగా బాలేదు, నేను చాలా ఉన్నత స్థానంలో వున్నాను. నాగూర్చి అతనికి తెలీకుండా యెలా వుంటుంది? అతనికి నా ఎడ్రెస్ తెలుసుకోవడం క్షణం పని. నా దగ్గరకొచ్చి – ‘మిత్రమా! నా పరిస్థితేం బాలేదు, సాయం చెయ్యి.’ అని అడగొచ్చుగా? అతనికి యేదోక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించడం నాకెంతసేపు పని! కానీ.. అతను నన్నడగడు. అతనిది మొహమాటం కాదు – పొగరు, నా పొజిషన్ చూసి ఈర్ష్య! శ్రీకృష్ణుణ్ణి కలవడానికి కుచేలుడికి అహం అడ్డు రాలేదు, తన స్నేహితుడి ఉన్నతిని కుచేలుడు మనస్పూర్తిగా కొనియాడాడు. మరి అతనో? శ్రీకృష్ణుణ్ణే తిరస్కరించాడు!

నేనెంత స్థాయిలో వున్నాను? యెంతో బిజీగా వుంటాను? అయినా కూడా నా చిన్ననాటి స్నేహితుడి పట్ల అభిమానంతో వెతుక్కుంటూ వచ్చాను, కానీ అతను నా ఉనికినే గుర్తించకుండా పోజు కొట్టాడు! ఇంతకీ అసలతను తెలివైనవాడేనా? అయితే ఆ జానాబెత్తెడు జీవితంతో యెందుకు మిగిలిపొయ్యాడు? చిన్నప్పుడు యేవో నాలుగు పాఠాలు గుర్తుంచుకున్నంత మాత్రాన నాకన్నా తెలివైనవాడైపోతాడా?

యుద్ధరంగంలో యుద్ధం కడదాకా చేస్తేనే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ – అతను మధ్యలోనే తప్పుకున్నాడు. కడదాకా యుద్ధం చేసినట్లైతే నేనతన్ని ఓడించేవాణ్నేమో! యేమో కాదు.. ఖచ్చితంగా ఓడించేవాణ్ని. శత్రువుని యుద్ధరంగంలో ఓడిస్తే ఆ గెలుపు సంతృప్తినిస్తుంది, కానీ – శత్రువుకి ఏదో రోగమొచ్చి ఆస్పత్రిలో రోగిష్టివాడిలా మిగిలిపోతే యెంత అసంతృప్తి!

జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నాను. నేనిలా ఆలోచించడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్నిలా ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్నీ, ఉదారగుణాన్నీ తగ్గించుకోవాలి.

ఇలా నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నంలో యేదో వొకరోజు విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ – ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!

*

మీ మాటలు

  1. CHALLA VENKATA RAO says:

    మీరు ఇంత చక్కగా రాయగలరు అని నేను ఊహించలేదు రమణ యడవల్లి గారూ. చాలా బాగుంది. ఎవరో కామెంట్ చేసినట్లు రాచకొండ గారి సాహిత్యం చదువుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ మీ శైలి మీది. మీరు ఇంతకుముందు ఇలా వ్రాసిన ఆర్టికల్స్ గాని పుస్తకాలు గాని వుంటే తెలుపగలరు. అద్భుతం గా ఉంది నాకు మాత్రం.

    • Ramana Yadavalli says:

      Thanks a lot for the nice words. నేను అప్పుడప్పుడు ఈ మేగజైన్‌లోనే రాస్తుంటాను (రెగ్యులర్‌గా రాసే అలవాటు లేదు). నాపేరిట పుస్తకాలేమీ లేవు.

  2. గోవులొస్తున్నాయి జాగ్రత్త లో కిరీటిరావు పాత్ర. అద్భుతంగా ఉంది. నాకు రావిశాస్త్రి గారే కనిపిస్తున్నారు.
    ఎక్సలెంట్.

    • Ramana Yadavalli says:

      మీకు నా రచనలో రావిశాస్త్రి కనిపించడం గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను, ధన్యవాదాలు.

  3. రమ్యజ్యోతి says:

    వాస్తవాన్ని అంంగీకరింంచలేని / జీర్ణింంకోలేని ఒక మనిషి తత్వంం ఈ కథలోని ప్రధాన వస్తువు. తన స్నేహితుడు తన కంంటే వ్యక్తిత్వ పరంంగా ఎత్తులో ఉన్నాడనే విషయాన్ని గుర్తింంచి కూడా అతని కంంటే గొప్ప స్థాయిలో ఉన్నానని తనను తానే మోసగింంచుకుంంటున్నాడు. మనుషుల్లో గల ‘ ఈగో ‘ వారినే ఎలా మోసంం చేస్తుంందో అనే విషయాన్ని రచయిత బాగా చిత్రింంచారు.

    • Ramana Yadavalli says:

      థాంక్యూ. Psychodynamic perspectives రాయడం నాకు కొంచెం సులువైన పని. :)

  4. Suresh Venkat says:

    చాలా బాగుంది సర్

  5. చందు తులసి says:

    రమణ గారూ… సూపర్.
    ఏం చెప్పాలి. అతనిలా ఎందరో అవకాశం లేక నలిగిపోతున్నారు. ఇతనిలా కొందరు మాత్రం బల్లుల్లా పైకి ఎగబాకుతున్నారు. మీరు రాసిన తీరూ చాలా బాగుంది. రావిశాస్త్రి అభిమాని …..ఎలా రాయాలో ఆ స్థాయిలో రాశారు. విరివిగా రాయండి.

  6. JyothiRani Thota says:

    Andariki telisina vishayame….yenta adbhutamga rasarandi…..రమణ garu….great expression……

    • Ramana Yadavalli says:

      అవును, అందరికీ తెలిసిన విషయమే. ఒక ఫ్లోలో రాసుకుంటూ పొయ్యాను, థాంక్యూ!

  7. కె.కె. రామయ్య says:

    అతనంటే నాకిష్టం లేదు. ఇంట్లో రావిశాస్త్రి గారి పటం పెట్టుకున్నాడు. వీధినబడి రావిశాస్త్రి గారు పూనినట్లు అలవోకగా రాసి పదిమంది దగ్గరా పుంజీడు మార్కులు కొట్టేస్తున్నాడు. ఇతగాడు ఇంకా ఇంకా విజయాలు సాధిస్తాడని నాకు తెలుస్తోంది. అందుకే ఈ కళింగ వీరుడు, విశాఖ డా. యడవల్లి రమణ అంటే ఈర్ష్య తప్ప, అతనంటే నాకిష్టం లేదు.

    • Ramana Yadavalli says:

      మీ వ్యాఖ్య నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, థాంక్యూ!

      (అన్నట్లు – నా ఊరు గుంటూరు, రావిశాస్త్రి మా ఊరిపేరుతో ఒక సరదా కథ రాశారు.)

  8. మీరు ఖచ్చితంగా “పన్” డాక్టర్ అండీ!
    ~లలిత

  9. Madhu Chittarvu says:

    Raavi sastry Beena devi ni gurthuku thechcharu.keep writing.Andamyna dayyapu pilla maatram mee adbhutamyna creation.Of course you have to write more creating your own style which is fantastic in the present setting…

    • Ramana Yadavalli says:

      Thank you for the nice words. నేను రావిశాస్త్రిని మాత్రమే చదువుతాను, ఇంకెవర్నీ చదవను.:) అంచేత – నాపై రావిశాస్త్రి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది, ఇందుకు నేను గర్వంగా ఫీలవుతుంటాను. నన్ను ప్రోత్సాహిస్తున్న ‘సారంగ’కి కృతజ్ఞతలు.

  10. కె.కె. రామయ్య says:

    ఈ “అసంతృప్తి” ని చదివి త్రిపుర గారి ఆప్తమిత్ర శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు అత్యంత తృప్తి చెందారు; ఆంద్రజ్యోతి స్వర్ణయుగం నాటి తన మిత్రులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, రావిశాస్త్రి గార్లలా నేడు గురుతర బాధ్యత నిర్వహిస్తున్న సారంగ అఫ్సర్ గారు, డా. యడవల్లి రమణ గార్ల కృషిని మనసారా అభినందిస్తూ.

    ఈ వాక్యాల ప్రవాహ ఝరి, ఊపిరాడనివ్వని ఈ ఉపమాలు (సిమిలీలు), ఈ భావావేశం, మానవత్వం పట్ల ఆర్తి ల మరిన్నిరచనల కోసం తెలుగు పాఠక లోకం ఆశతో ఎదురుచూస్తున్నది యడవల్లి రమణ గారు.

  11. గుడ్ స్టోరీ.

  12. syed sabir hussain says:

    ఇంతమంచి కథ అందిచ్చిన సారంగకు,రచయితకు అభినందనలు.

మీ మాటలు

*