ధర్మారావు గెలిచాడు!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-4

 

sudrarsanam‘వేయిపడగలు’పై సుదర్శనంగారి విశ్లేషణ తీరును రెండు ఉపమానాలతో చెప్పుకోవచ్చు. రెండూ పరస్పర విరుద్ధమైనవి.

మొదటగా, ఇంగ్లీషు చదువుల శిక్షణ నుంచి లభించిన  సునిశితమైన తర్కమూ, హేతుత్వమూ అనే సూది మొనను దానికి తాకించి చూశారు. దాంతో అది గాలిబుడగలా పేలి పోయింది. అయితే, అలా పేలిపోతే ఎలా?  ధర్మారావు అనే పాత్రను సనాతన ధర్మాన్ని దర్శించిన జ్ఞానిగానూ, వ్యవస్థాధర్మానికి సాధికార వ్యాఖ్యాతగానూ, అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గంగానూ రచయిత చెబుతున్నాడే! కనుక రచయిత ధర్మారావు గురించి చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్య నున్న వైరుధ్యంలో మన అవగాహనకు అందనిది ఏదైనా ఉందేమో!

తీరా అదేమిటో చూద్దామనుకునేసరికి నవల గుండ్రాయిగా మారి సూదిమొనే వంగిపోయింది.

ఈ పరిస్థితిలో, తనకు సైతం సానుకూల దృక్పథం ఉన్న హైందవ ధర్మమూ, తాత్వికతా అనేవి నవలలో ధర్మారావు మనస్తత్వంలోని వక్రత నుంచీ, సంకుచితత్వం నుంచీ వ్యక్తమవుతున్నాయి కనుక అవే నిజమైన హిందూ ధర్మమూ, తాత్వికతా  కావన్న నిర్ధారణకు రావడమే మార్గం.  రచయిత చిత్రించదలచుకున్నది నిజమైన హిందూధర్మ, తాత్వికతలు కాక;; వాటికి ఆలంబనంగా తనను తాను భావించుకునే ధర్మారావు అనే, వక్రత, సంకుచితత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆత్మకథను! ఆపైన, అసలు రచయిత చిత్రించదలచుకున్నది హైందవ వ్యవస్థను, తాత్వికతను కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని!

హైందవ ధర్మమూ, తాత్వికతా, ధర్మారావులోని వైరుధ్యాలు…ఈ గంద్రగోళాన్ని అంతటినీ పక్కన పెట్టేసి, కేవలం సాహిత్య కోణం నుంచి ఒక రచనగా ‘వేయిపడగ’లను అంచనా వేయడం అంతకన్నా సురక్షితమైన మార్గం. ఆ విధంగా చూసినప్పుడు అందులో గొప్ప పఠనీయత ఉంది. అద్భుతమైన పాత్రపోషణ ఉంది, తెలుగుదనం ఉంది. ఆధునికత తెలుగువారి జీవితంలో తీసుకొచ్చిన అనేకానేక పరిణామాలను ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం స్థాయిలో చిత్రించడం ఉంది. అది, కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం!

ఈవిధంగా సుదర్శనంగారి వేయిపడగల పరిశీలన అందులోని హైందవ ధర్మ, తాత్వికతల పరిశీలనతో ప్రారంభించి అది సంతృప్తి కలిగించకపోవడంతో, దానిని తెలుగుదేశమూ, తెలుగుదనాలకు కుదించి ఒక ఉత్తమ సాహిత్య సృష్టిగా నిలబెట్టడంతో ముగుస్తుంది.

ధర్మారావు గురించి రచయిత చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్యనున్న వైరుధ్యం ఎలాంటిదన్నది పరిశీలించకపోవడం –విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే భావజాలానికి బాహ్య మిత్రుడిగా ఆయనకు గల పరిమితి.

***

అసలు ఆ వైరుధ్యంలోనే హిందూ ధర్మ, తాత్వికతలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? ధర్మారావు, అతని తండ్రి రామేశ్వరశాస్త్రే ఆ  హైందవ ధర్మానికి, తాత్వికతకు అసలు సిసలు ప్రతినిధులు ఎందుకు కాకూడదు? వాటికి భిన్నమైన, నిజమైన హైందవధర్మమూ, తాత్వికతా వేరే ఉంటాయని ఎందుకు అనుకోవాలి?

ఎందుకంటే, వాటిలో తనూ ఒక వదులైన భాగమే అయినా, వాస్తవంగా వాటి జన్మస్థానంతోనూ, అక్కడి జీవితాలతోనూ, వారి తలపులతోనూ  గాఢమైన పరిచయం లేని బాహ్యుడు కనుక!

దూరం నుంచి చూసినప్పుడు అదొక గొప్ప రొమాంటిక్ అడ్మిరేషన్ కలిగిస్తుంది. అందులో భాగమై చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దాని తలుపులు చాలావరకు మూసి ఉంటాయి. తెరచుకున్నప్పుడు కూడా బయటినుంచి చూసినప్పుడు కలిగే రొమాంటిక్ అడ్మిరేషన్ ను నిలబెట్టే మేరకే ఓరగా తెరచుకుంటాయి.

విశ్వనాథ దృష్టిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల గురించి తను చెప్పినదానికీ, వారి నడవడికీ మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండడానికి వీలులేదు. అంత పెద్ద లోపాన్ని ఆయనకు ఎలా ఆపాదిస్తాం? కనుక ఆ వైరుధ్యం బయటినుంచి చూసినప్పుడు కలిగే భ్రాంతి. అంతర్గతంగా చూసినప్పుడు అందులో వైరుధ్యం ఉండడానికి అవకాశం లేదు. అది రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల దృష్టిలో కూడా వైరుధ్యం ఎప్పుడవుతుంది? వారు కూడా దానిని, గుర్తించి అంగీకరించినప్పుడు. వారు గుర్తించే అవకాశం లేదు కనుక అది వైరుధ్యం కానే కాదు. ఆపైన అది  వైరుధ్యమా, కాదా అన్నది నిర్ధారించవలసిన అధికారం కూడా వారిదే కనుక; ఇంకొకరు అలాంటి ఆరోపణ చేయడం చెల్లదు.

కనుక రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా హైందవ వ్యవస్థా, తాత్వికతలను చిత్రించడంలో విశ్వనాథ నిజాయితీని పాటించారు. వారు అలా తప్ప ఇంకోలా ఉండే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవన సరళే అతని తాత్వికతను అభివృద్ధి చేస్తుందని అనుకుంటే, రామేశ్వర శాస్త్రి, ధర్మారావుల జీవితమే వారి తాత్వికత. వారే హైందవ ధర్మ, తాత్వికతలకు నిర్ణేతలు, భాష్యకారులు, హక్కుదారులు కనుక వారి జీవితమే హైందవధర్మ, తాత్వికతలకు ప్రతిబింబం.

విశ్వనాథ అజాగ్రత్త ఉంటే ఎక్కడ ఉంటుందంటే, హైందవధర్మ, తాత్వికతలను చిత్రించడానికి ఆధునిక ప్రక్రియ అయిన నవలను స్వీకరించడంలో. ఆపైన దానిని ఇంగ్లీషు చదువుల శిక్షణనుంచి సంక్రమించే తార్కికతా, హేతుత్వాల ఉపకరణాలతో చూసినప్పుడు అది ఎలా పరిణమిస్తుందన్న సంగతిని విస్మరించడంలో. ఆధునిక నవలా ప్రక్రియలో వ్యక్తుల జీవిత చిత్రణ విధిగా వాస్తవికతను అనుసరిస్తుంది. అలాగే, హైందవ వ్యవస్థా, తాత్వికతలను వస్తువుగా తీసుకున్నప్పటికీ  రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల జీవితచిత్రణలో ఆయన వాస్తవికతను అనుసరించారు. తీరా చూస్తే ఆ వాస్తవికత ఆయనకు తెలియకుండానే వస్తువుకీ, పాత్రలకూ మధ్య వైరుధ్యాన్ని ఎత్తిచూపి రెండింటి పట్లా అపోహలకు దారితీయించింది.

సుదర్శనంగారే దీనిని గుర్తించి మిల్టన్ పారడైజ్ లాస్ట్ తో పోలిక తెచ్చారు. ఆయన ఇలా అంటారు:

“మిల్టన్ తన పారడైజ్ లాస్ట్ (Paradise Lost)లో సృష్టించిన సైతాన్ (Satan)పాత్ర కవి ఉద్దేశానికి భిన్నంగా, అంటే వీరోచితంగా, ఆకర్షణీయంగా రూపొందడం వల్ల, “He was of the Devil’s party without knowing it” అనే విమర్శ వచ్చింది. కొంతవరకు ఈ విమర్శ విశ్వనాథ ఈ మూడు నవలలకూ(ఏకవీర, వేయిపడగలు, చెలియలికట్ట)వర్తిస్తుంది.”

హైందవ ధర్మ, తాత్వికతలు ఎంత విశిష్టమైనవి, లోతైనవి అన్నది వేరే పరిశీలన. రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా  వాటి ప్రతిఫలనం ఎలా ఉందన్నదే ఇక్కడ విచారణ.

viswanatha

విషాదం ఏమిటంటే, రామేశ్వరశాస్త్రి, ధర్మారావులు తమ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోడానికి ఎదురుగా వేరే అద్దం ఏదీ లేదు. తామే అద్దం. తాము ఎలా ఉన్నారో చెప్పడానికి, లేదా ప్రశ్నించడానికి వేరొకరికి తాహతు లేదు, అధికారం లేదు, జ్ఞానం లేదు. తాము ఉన్నదే జ్ఞానకాంతులు విరజిమ్మే లోగిలిలో. గడప దాటితే అవతల అంతా అజ్ఞానాంధకారం. అంతిమ పర్యవసానం…తులనాత్మకంగా చూడడానికి అవతల మరొకటి లేని స్థితిలో, ఉన్నా చూడదలచుకోని స్థితిలో, తమ విశ్వాసాలను, కోరికలను, లౌల్యాలను, తమ జీవన సరళిని, అందులో ఇతరులకు వైరుధ్యాలుగా కనిపించేవాటితో సహా అన్నిటినీ ధర్మబద్ధం చేసి, తాత్వికీకరించి చివరికి తాము సైతం అవే నిజమనుకునే భ్రమలో గూడులో రెక్కలు ముడుచుకుని ఉండిపోవడం!

తాత్విక స్థాయిలో బ్రహ్మం ఎలా అనిర్వచనీయమో, ఎలా కంటికి కనిపించదో, ఎలా ద్వంద్వాలకు, ప్రశ్నలకు, సందేహాలకు అతీతమో జీవనస్థాయిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల నడవడి కూడా అంతే. రామేశ్వరశాస్త్రి యోగి, వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి. కానీ పైకి భోగిలా, రసికుడిలా కనిపిస్తాడు. ఆయన నాలుగువర్ణాల స్త్రీలనూ పెళ్లి చేసుకున్నాడు. ఒక భోగాంగనను చేరదీశాడు. నాలుగువర్ణాల వారినీ పెళ్లిచేసుకునే అర్హత ఆయనకు తప్ప ఇంకొకరికి లేదు. ఎందుకులేదని ప్రశ్నించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కల్పించింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి కర్త ఆయనే.

ధర్మారావూ అంతే. అయితే, అతని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆధునికత విజృంభిస్తోంది. ఇంగ్లీషు చదువులు రాటుదేలుతున్నాయి. తాము ముడుచుకుని ఉన్న భ్రమల గూడుమీదే దెబ్బలు పడుతున్నాయి. అంతవరకు తమకు ఆశ్రయమూ, అధికారమూ ఇచ్చిన  జమీందారీ వ్యవస్థా, దానితోపాటే తమ ఆశ్రయమూ, అధికారమూ కుప్ప కూలుతున్నాయి. ధర్మారావు తమ జ్ఞాన కాంతుల లోగిలి నాలుగు గోడల మధ్య నుంచి అప్పుడప్పుడు ఆజ్ఞానాంధకారపు బాహ్య పరిసరాలలోకి రావలసి వస్తోంది. ఇంగ్లీషు చదవవలసివస్తోంది. కానీ భౌతికంగా అతను బాహ్య పరిసరాలలోకి వస్తున్నా అతని ఆత్మ మాత్రం తన భ్రమల గూడును విడిచి రావడంలేదు. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అతను మరింతగా అందులో ముడుచుకుంటున్నాడు. బాహ్య పరిసరాలు ఎంత మారుతున్నా, వాటికి అనుగుణంగా తానూ ఎంతో కొంత  మారుతున్నా అతని ఆత్మలో మార్పు లేదు. అది ఎప్పటిలానే తన భ్రమల గూడును పట్టుకుని వేలాడుతూనే ఉంది. శిథిలమవుతున్న  ఆ గూడును తలచుకునే అతనిలో నిస్పృహా, నిర్వేదం. అదే వేయిపడగలు.

మారిన పరిస్థితిలో, బహుశా తండ్రి రామేశ్వరశాస్త్రికి అదనంగా, ధర్మారావు జీవితంలో అస్తిత్వం తాలూకు అభద్రత ప్రవేశించింది.  ఆ అభద్రత రెండు రకాలు. మొదటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అభద్రత. ఇంగ్లీషు చదువుకుని ఉద్యోగం వైపు మళ్లి ఆ అభద్రతను జయించవచ్చు. ధర్మారావు కాకపోయినా ధర్మారావు వారసులు అదే చేయబోతున్నారు. రెండవది, తమ సాంస్కృతిక, మత, తాత్విక, ధార్మిక, రాజకీయ ఆధిపత్యానికి కలుగుతున్న అభద్రత.

ధర్మారావు వైపునుంచి చెప్పుకుంటే  ఈ రెండు రకాల అభద్రతలకు అంతస్సంబంధం ఉంది. సమాజంలో తను అల్పసంఖ్యాకవర్గం. శ్రమ చేయలేడు. బలిష్టుడు కాదు. ఈ బలహీనతలనే బలంగా మార్చుకోవడం, అవి కల్పించే అభద్రతనుంచే భద్రతను నిర్మించుకోవడం –ఇదీ అతని తాత ముత్తాతలనుంచీ జరుగుతూ వచ్చింది. ఈ ప్రయత్నంలోంచే అతని మతం, తాత్వికత, ధర్మశాస్త్రం, సాహిత్యం, సమస్త వాఙ్మయం పుట్టాయి.  ఇప్పుడు వీటన్నిటితో కూడిన వ్యవస్థకే అభద్రత వాటిల్లింది. ఇందుకు ధర్మారావుకు కనిపించిన పరిష్కారమేమిటంటే, ఆ అభద్రతను ఎదుర్కోవడానికి, అలాంటి అభద్రత నుంచే పెంపొందించిన వ్యవస్థలోనే తిరిగి భద్రత వెతుక్కోవడం!

ఒక కోణం నుంచి చూస్తే ధర్మారావు పాత్ర జాలిగొలుపుతుంది. అతనిలో తాను సర్వాధికుడినన్న భావన. అది అతనిలో అధికారాన్ని, అహాన్ని మాత్రమే కాదు; తన ఊహలను, అభిప్రాయాలను సమానఫాయీలో ఇంకొకరితో పంచుకోలేని ఒంటరితనాన్నీ అతనిపై విధిస్తుంది. అతను వ్యాఖ్యానించని విషయం ఉండదు. కానీ అవతల ఉన్నది ఎవరు? అతని వ్యాఖ్యలపై  ప్రతిస్పందించడానికి అతనితో సమానమైన జ్ఞానమూ, స్థాయీ లేని మూగ శ్రోతలు. వక్తా, శ్రోతా కూడా తనే. తన గొంతు ప్రతిధ్వని తనకే వినిపిస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి తన దగ్గరకే వచ్చినట్టుగా తన అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ మళ్ళీ తన దగ్గరకే వస్తాయి.

veyi

అతని మాట, ప్రజాస్వామికమైన డైలాగ్ కు అవకాశం లేని, ఒక మోనోలాగ్. అక్కడ ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా  చెరిగిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేని స్థితిలో అతని ప్రైవేట్(వైయక్తిక)ఊహాప్రపంచమే పబ్లిక్ గా మారిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేనప్పుడు అక్కడ తర్కం, హేతుత్వం ఉండవు. పైగా అవి అక్కర్లేదన్న అహం ఉంటుంది. చరిత్ర ఉండదు. అది అక్కర్లేదన్న అహం ఉంటుంది. సాలె పురుగు తనలోంచే దారాన్ని సృష్టించుకుని, దానితో గూడు కట్టుకుని అందులో ఎలా ఉండిపోతుందో; తన ఊహల దారాలతో తనే అల్లుకున్న గూడులో తను ఉండిపోవడం…ఇదీ అతని బౌద్ధిక జీవితం.

తనే లోకానికి గురువు. కనుక వేరెవరికీ, ఎప్పటికీ శిష్యుడు కాలేని పరిస్థితి అతనిది. దాంతో అతనికి కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఋష్యశృంగుడు ఉన్నచోట అనావృష్టి ఉండదు. అలాగే, తన ఉనికే లోకకళ్యాణం కోసం!

తీరా  సుదర్శనంగారు తర్కమూ, హేతుత్వమూ అనే తూనిక రాళ్ళతో వేయిపడగలను తూచబోయేసరికి అది తేలిపోయింది. అందులో బరువైన సరకు బదులు డొల్ల కనిపించింది. అయితే ఆ డొల్లను పట్టుకుని ఉన్న మనిషి నిజం. తన భ్రమల గూడుపై పడుతున్న దెబ్బలకు అతను పడుతున్న కలవరం, అస్తిత్వ భయం, అవి కలిగించే హృదయభారం నిజం. అవి నవలలో ప్రతిభావంతంగా వ్యక్తమయ్యాయి.

***

ముందే చెప్పినట్టు, ధర్మారావును తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగానూ, వేయిపడగలను ఆధునికత  తెలుగునాట తెచ్చిన  మార్పుల చిత్రణగానూ కుదించడం ధర్మారావు బౌద్ధిక జీవితానికి ‘బాహ్యు’నిగా సుదర్శనంగారికి గల పరిమితి. నిజానికి ధర్మారావు భారతదేశమంత వైశాల్యం కలిగిన పాత్ర. అతని సంఘర్షణ మూలాలు భారతీయ సమాజం తాలూకు అతి పురాతనపు లోతుల్లో ఉన్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితిగతులకు అతను శాసనకర్త. ఇంత వైవిధ్యవంతమైన దేశాన్ని తన దృష్టికోణం అనే మూసలో ఇరికించడానికే అతని నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతనికి విజయాలూ ఉన్నాయి, అపజయాలూ ఉన్నాయి. అతని పెనుగులాట ఎంత వైయక్తికమో, అంత వ్యవస్థాగతం. చరిత్ర పొడవునా జరుగుతున్నఅతని పెనుగులాటా, అందులో అతని గెలుపు, ఓటముల చరిత్రే ప్రధానస్రవంతికి చెందిన భారతీయ వాఙ్మయం.  పాశ్చాత్య నాగరికతా ప్రభావమూ, అవైదిక ధోరణుల విశృంఖలత్వమూ నేపథ్యంగా వేయిపడగలులో చిత్రితమైనది– అతని అనేకానేక పెనుగులాటలలో ఒకటి మాత్రమే.

వేయిపడగలు అతని ఒకానొక తాత్కాలికమైన  ఓటమిని చెబుతుంది. అది అతనికి కలిగించిన నిర్వేదాన్ని, నిస్పృహను చెబుతుంది. అయితే తన చరిత్రలో అనేకసార్లు జరిగినట్టుగా , అంతులేని నిరీక్షణ తర్వాత అతను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు కనుక ధర్మారావు చరిత్రను తిరగరాస్తే, అది ఒక విజేత చరిత్ర అవుతుంది. ఇప్పుడతనిలో నిస్పృహా, నిర్వేదం లేవు. వాటి స్థానంలో అతని ముఖం నిండా విజయదరహాసం!

(సశేషం)

 

 

 

మీ మాటలు

*