ఎద లయలో ఇళయ”రాగం”

 ilaya1

           సంగీతం ఏమీ చెప్పదు. సంగీతం అస్తిత్వపు మాధుర్యాల్ని చూపిస్తుంది. అదే అందులోని సౌందర్యం.

సంగీతం వింటున్నప్పుడు అది సత్యమా? అసత్యమా? అన్న తాత్విక మీమాంస మనలో ఉదయించదు. పూర్తిగా మమేకమై వింటాం.సంగీతం మనల్ని వశ్యం చేసేసుకుంటుంది.మనకి తెలియని మరో లోకాలకు తీసుకుని వెళుతుంది.మనం ఉన్న వాస్తవిక ప్రపంచానికి అతీతంగా మరో దృశ్య రూపాన్ని చూపిస్తుంది. అప్పుడింక మనం మామూలు ప్రపంచం లో ఉండలేము. సంగీతం మనల్ని  ఆప్యాయంగా వేలుపట్టుకుని అస్తిత్వపు అత్యున్నత రహస్యాల వైపుకి  తీసుకుని వెళుతుంది” .

అందుకే మార్మిక జ్ఞానులు సంగీతాన్ని “దైవం” అన్నారు. దైవం అంటే ఒక వ్యక్తి కాదు. ప్రకృతి లో ఉండే అత్యున్నత సామరస్యా పూర్వక అనుబంధం. అది ఒక ఆర్కెస్ట్రా లాంటిది. ప్రతీది ప్రతిదానితో సంబంధం కలిగి ఉంటుంది. వృక్షాలు భూమి తో అనుబంధం కలిగి ఉంటాయి. భూమి కి , గాలి తో అనుబంధం కలిగి ఉంటుంది. గాలికి ఆకాశం తో అనుబంధం , అలాగే ఆకాశానికి నక్షత్రాలతో అనుబంధం ఉంటుంది.

క్రమానుగత శ్రేణి అన్నది ప్రకృతి లో ఉండదు. చిన్న గడ్డి పరక కి కూడా అతి పెద్ద నక్షత్రానికి ఉన్న విలువే ఉంటుంది. అని సంగీతం గురించి అంటారు ఓషో.

ఇది ఇళయరాజా విషయంలో అక్షర సత్యం. తన సంగీతం మనకి తెలియని లోకాలని పరిచయం చేస్తుంది.

ఆ లోకాల్లోనే శ్రోతలకు శాశ్వత స్థానం ఇచ్చి తన సంగీతం తో మనసుని, ఆత్మ ని రంజింపజేస్తాడు.

నేను స్కూల్ కి వెళ్లే రోజుల్లో రేడియో లో, టేప్ రికార్డర్ లో పాటలు వినటం అలవాటుగా  ఉండేది. అప్పటికి ఇంకా టీవీల ప్రభావం అంతగా లేదు.  నాన్నగారికి  ఉన్న సంగీత, సాహిత్య అభిరుచి వల్ల  నాకూ  చిన్నతనంలోనే సంగీత-సాహిత్యాలతో అనుబంధం ఏర్పడింది.

సినిమాల గురించి కానీ , సంగీత దర్శకుల గురించి కానీ నాకు అంతగా అవగాహన లేని రోజులు అవి . అప్పుడు బహుశా ఐదు-ఆరు సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మ కి ఉన్న సంగీత ప్రవేశం వల్ల తాను కొన్ని పాటల్ని అప్పుడప్పుడు పాడటం వల్ల , రేడియో లో కానీ టేప్ లో కానీ వింటున్నప్పుడు మాత్రం కొన్ని పాటలు చాలా బాగా అనిపించేవి.మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేట్టుగా ఉండేవి ఆ పాటలు.

ఆ తరువాతి రోజుల్లో , హైస్కూల్ స్థాయికి వచ్చాక సినిమాల మీద ఇష్టం ఏర్పడి విపరీతంగా సినిమాలు చూడటం మొదలైన తరువాత, అంతకుముందు నేను విని, నాకు నచ్చిన పాటలు ఏ సినిమా లోవి? ఎవరు సంగీత దర్శకులు ? అని తెలుసుకున్నతరువాత ఆశ్చర్యం అనిపించేది .ఆ పాటల్లో 95% వరకు అన్నీ ఇళయరాజా బాణీలు సమకూర్చిన పాటలే!

ఒకసారి బాగా ధైర్యం చేసి ఒంటరిగా సినిమా కి వెళ్లాలని అనిపించింది. బహుశా అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయేమో. థియేటర్ లో రష్ చూసి భయపడ్డా. టికెట్ కౌంటర్ దగ్గర జనాలు తొక్కి చంపేస్తారేమో అనిపించింది. అది చిరంజీవి సినిమా, అదే రోజు రిలీజ్. మొత్తానికి ఒక రిక్షా అతనికి డబ్బులు ఇచ్చి టికెట్ సాధించి, అతను అడిగితే అతనికీ సినిమా టికెట్ కొనుక్కుమ్మని డబ్బులు ఇచ్చి హ్యాపీ గా సినిమా చూసి వెళ్ళాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , ఒంటరిగా, నాకున్న ఇష్టం తో సినిమాలకి వెళ్ళటం అప్పుడే మొదలయింది.మా ఊరిలో 6 సినిమా టాకీసులు ( థియేటర్ అని అనకపోయేది అప్పట్లో, టాకీస్ అనే అనేది ) ఉండేవి. ప్రతీ వారం సినిమాలు మారిపోయేవి ఏదో ఒకదాంట్లో.

ప్రతీ శనివారం స్కూల్ నుండి రాగానే అమ్మ దగ్గర్నుండి డబ్బులు తీస్కొని నాకు నచ్చి , కనెక్ట్ అయిన పోస్టర్ ని చూసి, దాని మీద నేను ఇష్టపడే పేర్లు చూసుకుని ఇంకో ఆలోచన లేకుండా ఒక్కడినే వెళ్లిపోయేవాడ్నిఆ సినిమాకి. అలా నచ్చి ఇష్టపడి వెళ్లే  వాళ్లలో “ఇళయరాజా” ఒకరు.

ఇళయరాజా పేరు పోస్టర్ మీద చూస్తే చాలు ఏదో తెలియని ఆనందం. అలా ఎన్ని డబ్బింగ్ సినిమాలు చూశానో లెక్కలేదు. సినిమా కొంచం అటూ ఇటుగా ఉన్నా , నేపథ్య సంగీతం తో సంబరపడేవాడ్ని.

ఈ ఇష్టం మెల్లి మెల్లిగా ఆరాధనగా మారి, ఇళయరాజా భక్తుడిగా మారిపోయా.

“నాయకుడు-గీతాంజలి-అంజలి”, సినిమాల తరువాత ఆ ఆరాధన మణిరత్నం మీదా మొదలయింది. అది తరువాతి రోజుల్లో ఎంతవరకు వెళ్లిందంటే. మణిరత్నం MBA  చేశాడన్న కారణం తో నేనూ MBA చేసే విధంగా ప్రేరేపించింది.సరే అది వేరే విషయం అనుకోండి.

“ఇళయరాజా-మణిరత్నం” కాంబినేషన్ లోని సినిమాలు ఇళయరాజా సంగీతం మీద ఉన్న అభిమానాన్ని ఇంకో స్థాయికి తీసుకు వెళ్లాయి. అలా కాంబినేషన్ తో అద్భుతమైన పాటలు “భారతీరాజా-ఇళయరాజా”, “కే విశ్వనాధ్ -ఇళయరాజా”,”బాలచందర్-ఇళయరాజా”, ” వంశీ-ఇళయరాజా” ,”బాలుమహేంద్ర -ఇళయరాజా”, “కోదండరామిరెడ్డి -ఇళయరాజా”, “గీతాకృష్ణ-ఇళయరాజా” , ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా గొప్ప కాంబినేషన్స్  ఉన్నాయి.

అతిశయోక్తి అనిపించవచ్చేమో కానీ ఇళయరాజా బాణీలు సూటిగా “అనాహత చక్రం “(హృదయ స్థానాన్ని) తాకుతాయేమో అనిపిస్తుంది. లేదంటే అంత లోతుగా మన భావోద్వేగాలని కదిలించటం కష్టమే.

ఇళయరాజా సంగీతమూ, పాటలు , ,మన హృదయాల్ని తాకుతూ , మనలోని “అరిషడ్వార్గాలని”, “నకారాత్మక భావనల్ని” నెమ్మదిగా దహనం చేస్తుంటాయేమో అనిపిస్తుంటాయి.ఆయన సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. డిప్రెషన్ లో ఉన్న సమయం లో ఐతే ఆయన సంగీతమే ఒక మంచి థెరపిస్ట్ లా పని చేస్తుంది. ఇది వ్యక్తిగతంగా నా అనుభవం.

సంగీతం గురించి ఇళయరాజా ఏమంటారంటే ” ఏ సంగీతమైనా ప్రేక్షకుడిని (శ్రోతని) మరో ప్రపంచానికి తీసుకెళ్లాలి. శ్రోత మనసంతా ఆ సంగీత మధురిమలతో నిండి పోవాలి. ఈ సంగీతానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నా మనసుకు ఎందుకు ఇంత దగ్గర ఎందుకు అవుతుంది? అని శ్రోత అనుకోవాలి. ఆ సంగీతం అలా ఉండాలి. భావాన్ని వ్యక్తీకరించటానికి అనేక మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి, మాటల్లో చెప్పలేని భావాల్ని సంగీతం ద్వారా ఆవిష్కరించవచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదు.” అని అంటాడు.

ఇక్కడ నేను ఇళయరాజా నేపథ్య సంగీతాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఆయన పాటలు గురించి మాట్లాడాలంటే అదొక మహాసముద్రం. పాటల గురించి దాదాపుగా అందరికి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశ్యం తో కేవలం “నేపథ్య సంగీతాన్ని”  ఇక్కడ నేపథ్యంగా తీసుకుంటున్నాను. వీలయితే మరోసారి కేవలం ఇళయరాజా పాటల గురించి ప్రస్తావనతో రాస్తాను. ప్రస్తుతానికి మాత్రం నేపథ్య సంగీతం లో కొన్ని సినిమాల గురించి ప్రస్తావిస్తాను.

నేపథ్య సంగీతం

చాలా తక్కువమంది సంగీత దర్శకులు మాత్రమే నేపథ్య సంగీతం తో ఒక సన్నివేశాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లగలరు. ఇంకా చెప్పాలంటే అలా తమ సంగీతం తోనే సంగీత దర్శకులు కొన్ని సినిమాలని ఆడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇళయరాజా స్థానం శిఖరాగ్రం.

దర్శకుడి ప్రతిభ  ఎంత ఉన్నా, ఇళయరాజా నేపథ్య సంగీతం లేకుంటే ఆ సన్నివేశం అంతగా రక్తికట్టదు అనిపిస్తుంది. టీవీ ని మ్యూట్ లో ఉంచి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. దర్శకుడి ప్రతిభ ని తక్కువ చేయటం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. దర్శకుడు ఎప్పటికి “కెప్టెన్ అఫ్ ది షిప్”. అందులో ఇంకో ఆలోచనే లేదు.

నేపథ్య సంగీత పరంగా కొన్ని సినిమాల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను..

గీతాంజలి సినిమా (నాగార్జున, గిరిజ), మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కి నేపథ్య సంగీతం ప్రాణం. మణి రత్నం చెప్పాలని అనుకున్న విషయాన్ని అదే స్థాయిలో ఇళయరాజా తన నేపథ్య సంగీతం ద్వారా  విశదీకరిస్తూ వెళ్తుంటాడు. గీతాంజలి సినిమా ని నేను 100 కంటే ఎక్కువ సార్లు చూసాను. సంభాషణలే కాకుండా BGMs కూడా కంఠతా వచ్చు. సినిమా లో చాలా సందర్భాల్లో నేపథ్య సంగీతం సూటిగా హృదయాన్ని తాకి , దాని తాలూకా ప్రకంపనలు శరీరం మొత్తం వ్యాపించినట్టు అనిపిస్తుంది. సన్నివేశం తో పాటుగా ఆయన సంగీతం తనదైన భాషలో ఆ నేపథ్యాన్ని ప్రేక్షకుడికి విడమరచి చెపుతున్నట్టు అనిపిస్తుంది.

గీతాంజలి క్లైమాక్స్ లో నాగార్జున ఊరికి వెళ్లిపోయే సమయం లో గిరిజ తాను నాగార్జున ని కలవాలని అంటుంది. గిరిజ ని తీస్కుని అంబులెన్సు లో రైల్వే స్టేషన్ కి వెళ్లే సీన్ లో డైలాగ్స్ పెద్దగా ఉండవు. దాదాపు 5 నిమిషాల పాటు ఉండే నేపథ్య సంగీతం ఆ సన్నివేశం లోని ఆంతర్యాన్నిఆవిష్కరిస్తూ ఉత్కంఠగా ప్రేక్షకుడిని ప్రకాష్ , గిరిజ ల మానసిక సంఘర్షణ ఏ స్థాయి లో ఉందొ తెలుపుతుంది.

నాగార్జున, గిరిజ ని ఊరికి దూరంగా వదిలేసి, నడుచుకుంటూ రమ్మంటూ వచ్చేస్తాడు.ఆ  తరువాత గిరిజ చెల్లి నాగార్జున ఇంటికి  వెళ్లి బయట చలిగా ఉంది, అక్క ఇంకా రాలేదు భయంగా ఉంది అని చెపుతుంది. అప్పుడు నాగార్జున, గిరిజ ని వెతకడినికి వెళ్తాడు. తాను ఎంత వెదికినా దొరకకపోవడం తో ఆందోళన ఒక వైపు తను ఏమైందో అన్న భయం ఇంకో వైపు,  ఆ తరువాత గిరిజ దొరగ్గానే ఆనందంగా గిరిజాని లాలించే సన్నివేశం లో పైన చెప్పిన మానసిక స్థాయిలన్నీ నేపథ్య సంగీతం లో కని(విని)పిస్తాయి

సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ , వైరాగ్యం, నిరాశ,ఆకర్షణ, కరుణ, రౌద్రం, భయం..ఇలా ప్రతీ భావోద్వేగానికి సరిపోయే నేపథ్య సంగీతం, కథకి అనుగుణంగా, పాత్రల్లో, సన్నివేశాల్లో కరిగిపోయి, మిళతం అయ్యేలా చెయ్యటం ఇళయరాజాకే సాధ్యం.

ఇళయరాజా కి ముందు గాని ఆ తరువాత వచ్చిన సంగీత దర్శకులు కానీ(కొందరు) , కొన్ని సన్నివేశాలకి రెడీమేడ్  BGMs ఇచ్చేవారు .చాలా మూసగా ఉండేవి అవి.

ఉదాహరణగా చెప్పాలంటే విలన్ కనిపించే సన్నివేశంలో, కామెడీ సన్నివేశాల్లో బాగా ఉపయోగించిన BGM లనే వాడేవారు. కొత్తగా మళ్ళీ కంపొసిషన్ కి టైం దొరక్కో, అవసరం లేదు అనుకునో , అన్ని సినిమాల్లో దాదాపుగా అవే BGMs ఉండేవి అప్పట్లో.

కానీ ఇళయరాజా ఆ కథకి, పాత్ర స్థాయి కి అనుగుణంగా నేపథ్య సంగీతాన్ని ఇచ్చేవాడు. ఆ తపన మనకి తెర మీద కనిపించేస్తుంది. ఒక హోమియో వైద్యుడిలా,” పొటెన్సీ” ఎంత అవసరమో అంతే డోసెజి ఉంటుంది తాను ఇచ్చే నేపథ్య సంగీతం.అంతలా తపన పడతాడు రాజా.

రుద్రవీణ సినిమా లోని ఒక సన్నివేశం లో చిరంజీవి కోపంగా తన తండ్రిని నిలదీస్తాడు. తాను ఒప్పుకుని ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండేవాళ్ళం అని చెపుతూ, ఆ చావుకి కారణం “మీరే” అంటాడు. ఆ మాట విని చిరంజీవి వదిన సుమిత్ర, చిరంజీవి ని చెంపదెబ్బ కొట్టి తండ్రిని అనేంత గొప్పవాడివి అయ్యావా? అని మందలిస్తుంది.ఆ తరువాత చిరంజీవి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.ఆ సందర్భంలోనిది ఇది.

హృదయం సినిమా లో మురళి, హీరా ని ప్రేమించి తనతో చెప్పేస్తాడు. తరువాత క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయేముందు హీరా తనతో మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ బెంచ్ మీద తల పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. హీరా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది.తన దగ్గరికే వస్తుండటంతో తనతోనే మాట్లాడటానికి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నంతలో హీరా, ” పర్సు మర్చిపోయా”, అని తీస్కుని వెళ్లి పోతుంది”.ఇక్కడ నేపథ్య సంగీతం మురళి మానసికంగా పడే వేదనని తెలియపరుస్తుంది. హృదయం సినిమాలో నేపథ్య సంగీతం మొత్తం చాలా అద్భుతంగా  ఉంటుంది.

శివ సినిమా లో ఒక సందర్భం లో నాగార్జున , జె డి చక్రవర్తి ని కొట్టే సన్నివేశం లో ఇళయరాజా bgm రెగ్యులర్ గా ఫైట్ కి ఇచ్చేట్టుగా కాకుండా ,  పాథోస్ BGM ఇస్తే,  రాంగోపాల్ వర్మ కి అర్థం అవలేదట. “ఏంటి రాజా గారు ఇలా పాథోస్(విషాదం) బిట్ ఇచ్చారు?” అని అడిగితే అని అడిగితే  సమాధానంగా ఇళయరాజా ” ఎంతో కష్టపడి చదువుకొమ్మని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఇలా గొడవల తో భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు కదా అందుకని, పాథోస్ ఇచ్చాను” అని చెప్పారట ఇళయరాజా .ఈ విషయం రాంగోపాల్ వర్మే ఒకసారి ప్రస్తావించాడు.

శ్రీరామరాజ్యం సినిమా, ఒక దృశ్య కావ్యం.బాపు గారి కుంచె కి ఇళయరాజా సంగీతం తోడై , అవి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. లైవ్ ఆర్కెస్ట్రా తో ఇళయరాజా సృష్టించిన సంగీతం మహాద్భుతం గా ఉంటుంది. ఈ సినిమాకి సంగీతాన్ని ఒక తపస్సులా భావించి చేశారనిపిస్తుంది. పాశ్చాత్య సంగీతకారులతో, సింఫనీ తో శ్రీరామరాజ్యం లాంటి పౌరాణిక సినిమా కి ప్రాణప్రతిష్ట జరిగింది. అందులోని సన్నివేశాలు..

సీతాదేవి రాముని అంతఃపురానికి అదృశ్య రూపంలో వాల్మీకి పంపినప్పుడు , సీతమ్మ తన బంగారు విగ్రహాన్ని చూసే సన్నివేశం.

భూదేవి సీతాదేవి ని తనతో పాటు తీసుకువెళ్లే సన్నివేశం. సీతాదేవి రాముడికి చివరి వీడ్కోలు పలికే ఈ సన్నివేశం లోని నేపథ్య సంగీతం మన కన్నులు చెమర్చేలా చేస్తుంది. చాలా హృద్యంగా ఉంటుంది.

ఇలా చూపుతూ వెళితే కొన్ని వందల సినిమాల గురించి చెప్పుకోవచ్చు . కానీ అన్నిటినీ ప్రస్తావించాలంటే ఒక మహాగ్రంథమే అవుతుంది. ఇక్కడ సమయాభావం వల్ల కొన్నిటిని మాత్రమే తీసుకున్నాను. నేను  ప్రస్తావించని సినిమాలు చాలా ఉన్నాయి, అంతమాత్రం చేత ఆ సినిమాలు గొప్పవి కాదని కాదు. సందర్భానుసారంగా నాకు తెలిసినవి కొన్నిటిని గురించి చెప్పాను.అర్థం చేసుకుంటారని ఆశిస్తాను

(మళ్ళీ వచ్చే వారం!)

మీ మాటలు

 1. సాయి.గోరంట్ల says:

  ఓహ్ బ్యూటిఫుల్ శరత్ కుమార్ గారు.ఆర్టికల్ చదివే ముందు నేనేం సినిమాలు ఆనుకున్నానో ఆవన్నీ ప్రస్తావించారు…శ్రీరామ రాజ్యం సినిమా ను ,పాటలను BGM ని అద్బుతం అని చెప్పొచ్చు.ఇక దళపతి ఆంతే..

  ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు..
  చక్కని ఆర్టికల్ రాసి న్అందుకు దన్యవాదాలు💐

  • sharrath kumar G says:

   థాంక్స్ సాయి గారు. శ్రీరామరాజ్యం నేపథ్య సంగీతం అద్భుతం గా ఉంటుంది. అదొక్క దాని మీదే చాలా రాయొచ్చు. మీరు చెప్పినట్టు దళపతి, మౌన రాగం , అంజలి ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. నిడివి దృష్ట్యా చాలా కుదించి రాయాల్సి వచ్చింది. మునుముందు తప్పకుండా రాస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు..!

 2. Suresh katthi says:

  Excellent write up, one of good write up on music awesomeness …

 3. Venkat Suresh says:

  చాలా బాగుందండి మీ ఆర్టికల్. రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నాను :)

  • Sharrath kumar Gaddameedi says:

   థాంక్స్ వెంకట్ సురేష్ గారు. రెండో భాగం వచ్చే వారం వస్తుంది.

 4. ఈ ప్రకృతిలో గాలి అంతటా ఆక్సిజెన్ వుంటుందో లేదోకానీ ఆయన సంగీతం వ్యాపించే వుంటుంది ,మంచి ఆర్టికల్ !శరత్ కుమార్ గారికి అభినందనలు

  • Sharrath kumar Gaddameedi says:

   శారద గారు.. మీ ఉపమానం ఇళయరాజా కి సరిగ్గా సరిపోతుంది. ఎన్ని ఉపమానాలకి అయినా ఆయనకి కుదిరిపోతాయి, సంగీత పరంగా. మీ అభిమానానికి కృతజ్ఞతలు..!

 5. Suoer bro it’s too good

 6. హాయ్ శరత్…నేను విజయ్ కుమార్ కొండపాక నీ చిన్నప్పటి క్లాస్మేట్…గ్రేట్ జాబ్ రా…కీప్ గోయింగ్…గ్రేట్ ఇయర్స్ ఎహెడ్…బై రా☺

 7. గంగాధర్ వీర్ల says:

  బావుంది. అనేక లయగతుల లోతుల్ని స్పృశింంచారు. ఇలయరాజాని చక్కగా ఆవిష్కరించారు.
  డాన్స్ మాష్టర్.. వసంతకోకిల.. సితార, మహర్షి, నాయకుడు, దళపతి వంటి సినిమాలు.. చాలామంది జీవితాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి.. ఇప్పటికీ గుండెల్నీ మెలిపెడుతూనే ఉంటాయి..
  అలాంటి సినిమాల్లో ఇళయరాజాని.. చూడ్డం, వినడం… తనివితీరని అనుభూతి. ఆ పాటలు కూడా ప్రస్తావించాల్సింది. ఇళయరాజా సంగీతాన్ని ఆటవిడుపుగా ఆకలింపుచేసుకుని.. వర్ణించడం.. ఎవరికైనా అనితర సాధ్యమే.. కీపిట్ అప్ శరత్ కుమార్ గారు!!
  -గంగాధర్ వీర్ల

  • Sharrath kumar Gaddameedi says:

   థాంక్స్ గంగాధర్ గారు..నిడివి కి ఉన్న పరిమితుల రీత్యా, చాలా పరిమితంగా కుదించి రాయాల్సి వచ్చింది.
   ఇళయరాజా పాటలు అంటే దాదాపు 1000 సినిమాలు ఉన్నాయి. చాలా పాటల్ని ప్రస్తావిస్తూ రాద్దామనుకున్నా, అప్పుడది “ధారావాహిక” అవుతుంది అనిపించింది. అందువల్ల నేపథ్య సంగీతం ని మాత్రమే తీసుకున్నా. అది కూడా కేవలం కొన్ని సినిమాలని మాత్రమే సృజించాను.తప్పకుండా పాటల మీద రాస్తాను.మీ అభిమానికి ధన్యవాదాలు.

 8. ట్రై టూ రీడ్ బీథోవెన్స్ -ది ఫిలాసఫీ అఫ్ మ్యూజిక్ ..ఒన్స్
  ..

  • Sharrath kumar Gaddameedi says:

   తప్పకుండా జయదేవ్ గారు.. ఐ విల్ …థాంక్స్ ..!

 9. Swetha Naama says:

  Wonderful Sharath, the way you expressed by taking your childhood experiences and the great moments from those execellent movies is awesome…👍

  • sharath kumar gaddameedi says:

   థాంక్స్ శ్వేతా. మీ అభిమానానికి ధన్యవాదాలు.

 10. శరత్..ఇట్’స్ ఆసమ్ …. ఇళయ రాజా గురించి ఎంత చెప్పిన తక్కువే ….I

  తెలుగు అంతరించి పోతుంది కావచ్చు అని అనులోనే వాడిని. నీవు రాసే విధానం ,కూర్పు నాకయియే బాగా నచ్చాయి .

  జితేంద్ర

  • sharath kumar gaddameedi says:

   అవును ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే. అదొక మహా సముద్రమే.. ఎంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పటానికి మిగిలే ఉంటుంది. ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా రాసే ప్రయత్నం చేస్తాను.

 11. పుడమి తల్లి అనతంగా ఆలపించె ప్రక్రితి నెపద్య రాగాలను,గీతాలను పట్టుకున్న సంగీత కారుడు ఇలయరాజా అందుకె అతని సంగీతం అంత సహజమని అనిపిస్తుంది నాకు.

  ఇలయరాజా గారి almost అన్ని పాటలు నాకిస్టం . మీ సమీక్ష బాగుంది శరత్‌ బబు గారు అతని నెపద్య రాగాల పై .

 12. Sharath kumar Gaddameediy says:

  మీరు చెప్పింది అక్షరాలా సత్యం. ఇళయరాజా ప్రకృతి నుండే తన సంగీతాన్ని గ్రహిస్తాడు. ప్రకృతి మాత తనలోని సంగీతాన్నిఅలా చేరవేస్తుంది అనిపిస్తుంది. ఆర్టికల్ మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.

 13. Srinivas Kasturi says:

  Excellent sir.

 14. vinnakota koteseararao says:

  నేను విని, నాకు నచ్చిన పాటలు ఏ సినిమా లోవి? ఎవరు సంగీత దర్శకులు ? అని తెలుసుకున్నతరువాత ఆశ్చర్యం అనిపించేది .ఆ పాటల్లో 95% వరకు అన్నీ ఇళయరాజా బాణీలు సమకూర్చిన పాటలే!ఈ ఇష్టం మెల్లి మెల్లిగా ఆరాధనగా మారి, ఇళయరాజా భక్తుడిగా మారిపోయా
  సార్ మీలాగే నేను మీ అంత అనుభూతికిలోనైనాను.కాబట్టే మీ మాటలే కాపి చేయడం జరిగింది.క్షమించాలి.10 పాటలలో లేని అనుభూతి ఒక్క ఇళయరాజా గారి పాట వినగానే హృదయం పులకిస్తుంది

మీ మాటలు

*