వాగర్థాలు కలిసి మురిసిన మురళి!

mangalam

ఆయన  తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు.  కృతుల సంకలనానికి ఉంచిన పేరు ‘ సూర్య కాంతి ‘ . ఆయన మాత్రం చల్లని వారు –  మేలుకొలుపులు పాడినప్పుడూ వెన్నెట్లోకి రమ్మన్నట్లే ఉంటుంది. చూడలేక కళ్ళు చిట్లించుకోవలసినది అందులో ఏవేళ లోనూ లేదు.  అమ్మ ఒళ్ళో కూర్చున్న పిల్లాడు ” దా ! దా ! ” అన్నట్లు. అమ్మ ఆయన కి సొంతం కనుక మనందరినీ అలాగే చూస్తుందనే పసి నమ్మిక అది – నిజమెందుకు కాదు ,  ఆయన ఉండగా. అరటి పండు ఒలిచిపెట్టిన వెండిపళ్ళెం మనకే.

  అపండితులకూ ” ఆహా , సంగీతం వింటున్నామ ” న్న గర్వాన్ని ఆయన సృష్టిస్తారు.  ప్రాసాదాల నడవా లలోకీ  సాదా పెంకుటిళ్ళ  పంచల లోకీ ఒక్కలాగే  కురిసిన చంద్రిక ఆయన పాట. అరుదుగా –  సమయా సమయాలున్నాయేమో కాని వృద్ధి క్షయాలు లేవు.

ఎటువంటి సంగీతజ్ఞానమూ లేని మాడ్రైవర్ ,  పాతిక ముప్ఫై ఏళ్ళ యువకుడు – రోజూ కార్ లో వినబడే రామదాసు కీర్తనలని వినీ వినీ గొంతు కలపేసేవాడు. వినకుండా  ఉండలేకపోయేవాడు. ఆ పని   మరింకొక విద్వాంసుల వలన కాదు ,  నాకు తెలియదు. తన స్వరూప స్వభావాలనేమీ మార్చుకోకుండానే వసంతం తరలి వచ్చింది .   దిగి రాలేదు. ఆ పైన నువ్వు అందిస్తే నీ చేయి పుచ్చుకుని తీసుకుపోతుంది – మరింకా వేర్వేరు చోట్లకి. నాతో సహా ఇంకెంతెంత మందికో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసిపెట్టిన ఉపకారం అది.

  ఖంగున మోగే గొంతులూ సర్కస్ చేసే  పాటలూ తెలుగువారికి ఇష్టం . చలం గారెన్నడో అని ఉన్నట్లు , కష్టమైన సంగతుల విన్యాసానికి  మాత్రమే చప్పట్లు కొట్టే మోటుతనం మనది. సహజ ప్రశాంతమైన మాధుర్యం చప్పున లాగదు  . అటువంటి గుండెల్లోకీ చొరబడగలగటం ఆయనకి చేతనయిన ఒక విద్దె. సంగీతాన్ని దాని అన్ని రూపాలలోనూ ఆయన కౌగలించుకోగలరు , సినిమా పాటలతో సహా. దేన్నీ చిన్నబుచ్చగలిగే నిర్దయ అక్కడ ఉండే అవకాశం లేదు.

ఈ వైపునుంచి  –  సమస్త  ప్రపంచం లోని అన్ని విధాలైన పద్ధతులనూ కర్ణాటక సంగీతం తనలో ఎలాగ ఇముడ్చుకోగలదో చేసి చూపించిన పని అది. మీరూ నేనూ మాట్లాడుకునే మాటలకీ స్వరాల ఆధారాన్ని ఇవ్వగలరు . లయ సమంగా ఉందో లేదో తేల్చగలరు.  నాదం , దాని వెనుక శబ్దం – అది సర్వవ్యాప్తమైన ఆకాశలక్షణం గా చెప్పబడే భారతీయత – మన కాలానికి ఎంచుకొని ధరించిన రూపమది , ఇంతకాలమూ. భాష తెలియనివారికీ భావమేదో స్ఫురించేలాగా , తెలిసినవారికి తెలిసివచ్చేలాగా – వాగర్థాలు కలిసి ఉండటానికి బ్రహ్మాండమైన నమూనా  .

  అరే, అదేమి నవ్వు , అదెంతటి ఉల్లాసం !!! స్మితమో మందహాసమో మొహాన కనిపించకుండా పాడటం ఎప్పుడన్నా ఉందా ? ఒక కొత్త కల్పనను వేదిక మీద అప్పటికప్పుడు చేశాక వచ్చే దరహాసం- ఆ   బంగారపు జరీ అంచుల తళతళ…  ఎవరన్నా పలకరించి మాట్లాడినా ఆహ్లాదమే తిరిగి వచ్చేది. ఇంకొందరు ఉన్నతులలో లాగే ఆ హాస్య స్ఫూర్తి  ” అబ్బే. తూచ్ ! ఇందులో ఏమీ లేద ” నే ఎరుక. మనుషుల పైన అనురాగం ప్రతి చేత లోనూ కవళిక లోనూ చిందిపోవటం అదొక దివ్యమైన బహూకృతి – ఆయనకూ మనకూ. బహుశా కళ మనిషిలో లీనమైతే రాగల బహిఃఫలం.

ఉత్సాహం పోకుండా, ఫిర్యాదులు రాకుండా –  అంతా తెలిసిందనీ లక్ష్యాలు లేవనీ అనకుండా – అది గొప్ప పుట్టుక !

” మా రోజుల్లో అయితేనా ..” అన్న మాటలు రాలేదు కడదాకా.

వినా దైన్యేన జీవనం.

   ఏ వ్యక్తిగత పరిచయమూ లేని ఎన్నో లక్షల మందికి ఆయన తమవాడు – నాకూనూ.  రోజూ చూడని వాడైనా మళ్ళీ కనిపించని బాధ అందరిదీ , నాది కూడా. మాట్లాడే అర్హత ఉందీ లేదూ కాదు – ఒక చంద్రుడు సమస్త జీవులకు తానొక్కొకడయి తోచును గనుక, నూలుపోగును  తప్ప ఇవ్వలేను గనుక.

     వేయికి పైనే పున్నములు గడిచినాయి గానీ చాలదు.  అద్దం లోనూ నీళ్ళలోనూ  పట్టి దాచుకున్నదే  చాలుతుండాలి ఇక మీదట .  

      అంతే.  

          *                                     

 

మీ మాటలు

  1. Madhu Chittarvu says:

    Chalaa ardhratha tho raasaaru.nachindi.

  2. D. Subrahmanyam says:

    మంచి పదాలతో నివాళి.

  3. D. Subrahmanyam says:

    నేను మొదటి సారి వారి గాత్రకచేరి 1969 లో ఉద్యోగ రీత్యా ఢిల్లీ వచ్చినప్పుడు విన్నాను. జీవితం లో మరిచిపోలేని కార్యక్రమం. వారి నాగు మోము కానీ, వారి థిల్లానాలు కానీ, వారి రామదాసు భజనలు కానీ ఏవి మరవలేనివి. నా స్నేహితులు నన్ను ఆటపట్టించే వారు, దేముడి మీద నమ్మకం లేని నేను ఇవన్నీ వింటున్ననై. కేవలం వారి అద్భుత గానం వింటున్నప్పుడు ఆ గాత్రం ముందు ఇవన్నీ చిన్నవిషయాలనిపించేది. వారి పాటల్లో గొప్ప విషయం ఏమిటంటే వారు సాహిత్యాన్ని అర్ధమయేల పడే వారు. “ఏ తీరుగా నను దయచూసేదవో” రామదాసు భజనం వింటుంటే గోల్కొందో లో ఆ కరగ్రహం లో రామదాసు బాధ దప్తమయిన వేడుకోలే కనపడేది. అంతా గొప్ప గాయకుడి లేరని నేననను. ఎందుకంటే వారి కీర్తనాలెన్నో నేను చనిపోయేదాక వింటూనే ఉంటాను

  4. “వేయికి పైనే పున్నములు గడిచినాయి గానీ చాలదు. అద్దం లోనూ నీళ్ళలోనూ పట్టి దాచుకున్నదే చాలుతుండాలి ఇక మీదట .”
    ఆయన్ని వేదికల మీదే చూడడం. వీడియోల్లో దాదాపు రోజుకి ఒక అరగంటైనా చూడడం. అయినా ఆయన వెళ్లిపోయారంటే ఇంట్లోని మనిషి వెళ్ళిపోయినంత దుఃఖం పెల్లుబుకొచ్చింది. మనసులో వెన్నెలలు పూయించిన గళం అది. ఆత్మీయ నిగళంలా పట్టుకుంది.
    నిన్నటినించీ అన్యమనస్కంగానే ఉన్నాం అందరమూను.
    మరువలేని మహనీయుడి గురించి ఎంత చక్కని మాటలు చెప్పారు మైథిలి గారూ! వసంత వాటికలూ, అమృతపు సోనలూ, మృదుత్వం అంటే ఇదీ అని తెలిపే నవ్య నవనీతాలూ దాచుకున్న ఆ గొంతు లోనించి ఇంక విమల గాంధర్వం ఉబికిరాదని కుములుతున్న వారందరికీ గుండె దిటవు చేసుకోమని బోధించిన మీ వ్యాసపు చివరి వాక్యం ఆవశ్యపు భరోసా!

  5. Sasikala volety says:

    Kallu chemarinchelaa raasaaru. Inthakanna baagaa,,ekkuvagaa inkevaroo aayanni,,aayana vyakthi,,shakthi soundaaryaanni,,,manam penavesukunna bandhaanni marevaru రాయలేరేమో.

  6. రవి ప్రసాద్ says:

    నమస్కారము ఇంంతకన్ననేనేమి చెప్పలేను

  7. “నాదం , దాని వెనుక శబ్దం – అది సర్వవ్యాప్తమైన ఆకాశలక్షణం గా చెప్పబడే భారతీయత – మన కాలానికి ఎంచుకొని ధరించిన రూపమది , ఇంతకాలమూ. భాష తెలియనివారికీ భావమేదో స్ఫురించేలాగా , తెలిసినవారికి తెలిసివచ్చేలాగా – వాగర్థాలు……..నమూనా

    బాలమురళి క్రిష్న గారికి మీ పర్యాయ పదాల అలంకరణ చాలబాగుంది మైథిలి గారు.

    నడిచే పాదాలలొ,నవ్వే ముఖములో సంగీతాన్ని వినగలనని సగర్వంగా చెప్పుకున్న మెధావి . చిరునవ్వులు చిందిస్తూ గంధర్వ గానాన్ని వినిపించె మొము,గొంతు మరపు రానిది మరువలెనిది .నాకెంతొ ప్రియమైన గొంతు / స్వరం వారిది .

  8. Mahendra Kumar says:

    ఎంత గొప్ప ఆర్ధ్రమైన నివాళి

  9. మంగళంపల్లి మరణించారన్న మాట మింగుడుపడని,
    మన తెలుగువారికి ఆ వాగ్గేయకారునికి తెలుగు నేల
    తన విద్వత్తుకి తగిన గౌరవమివ్వలేదన్న కించిత్ కాని
    కినుకుందని ఎరికైతే ఇప్పుడైనా కొంతైనా చేస్తెకాసింతతృప్తే
    ఓ గులుకు రాణి

  10. Sridhar Bollepalli says:

    అక్షరాలు.. అచ్చంగా అక్షరాలే..
    స్వచ్ఛంగా, అనాచ్ఛాదితంగా…
    కష్టపడి కలిపి కుడితే ఆగినవు కావు..
    మచ్చిక చేయమంటూ చేతుల్లో వాలిమరీ ఒదిగిపోయిన గువ్వపిట్టలు..
    ఎవరు మరి? మా అమ్మ మైథిలి కాదూ..!!

  11. కె.కె. రామయ్య says:

    ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారి స్పందనే నాదీనూ ( ఎటువంటి సంగీతజ్ఞానమూ లేకున్నా మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గానామృతాన్ని ఆస్వాదించగల నా స్పందన ). బందరులో (మచిలీపట్టణం) వారి సంగీత కచేరీని చూసే అదృష్టం మాకు కలిగిందో సారి .

    అంతర్జాలం లో ఎంబీఎస్ ప్రసాద్ గారు సమర్పించిన నివాళి వల్ల తెలిసిన మరో విశేషం; ప్రజాదరణ పొందిన రేడియో కార్యక్రమం “భక్తి రంజని” బాల మురళి గారి చలువేనని. ఓ గొప్ప శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు అయిన బాల మురళి జానపద గీతాలు ఆలాపించారని, శాస్త్రీయ సంగీతంలో కాలానుగుణ మార్పులను అభిలషించారని తెలుసుకునే ఆశ్చర్యం వేస్తుంది.

    పరిశోధన పుస్తకాల సీరీస్ లో కావలి రమణయ్య మాస్టారు గారు తీసుకొచ్చిన “మధు మురళి” పుస్తకం ని తలుచుకుంటున్నా ఈ సందర్భంలో.

    ఆర్ధ్రమైన నివాళి రాసిన మైథిలి అబ్బరాజు గారికి కృతజ్ఞతలు.

  12. పాడిన దేదైనా,సుస్వరంలొ,పాడటాన్ని ఆస్వాదిస్తు,సగర్వంగా,
    పాడుతు,వారిదైన పాండిత్యాన్ని,పండిత్యగర్వాన్ని శ్రోతలకళ్ళల్లో
    ప్రతిఫలిస్తు,పాడే గాయకశ్రేష్టులు పాలువాయి,మంగళంపల్లి వారి
    గొంతుతొ దివిజగాయకుల ఆటాడించ ఒక్కరొక్కరుగ మన్నివిడిరే
    ఓ గులుకు రాణి

  13. కె.కె. రామయ్య says:

    ” మహనీయుడు, శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారికి ఎంత గొప్ప ఆర్ధ్రమైన నివాళి సమర్పించారు డా. మైథిలి అబ్బరాజు గారు. ఎంత ఫ్రీ ఫ్లోలో, ఎంతగా హాయిగా రాశారు.
    ఒక విషయం తెలియడం వేరు, దాన్ని గురించి రాయడం వేరు. పాఠకులకు నచ్చే విథంగా రాయటం మరీ కష్టం.
    అందుకు డా. మైథిలి గారికి హ్రదయపూర్వక అభినందనలు. ” ~ త్రిపుర గారి ఆప్తమిత్ర, శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

*