నేను నేనే నేను!

samvedana logo copy(1)నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌భార్య ముఖేశ్‌అంబానీ భార్య ఇద్దరూ సిస్టర్స్ అని కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది అంతగా ప్రాధాన్యమున్న అంశం కాదు. సమస్య తీవ్రతను తక్కువగా చూస్తున్నారు. మోదీ పాలనను కాంగ్రెస్‌స్థాయికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అవినీతిపరుడు అయినా కాకపోయినా అది పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య భావజాల పరమైనది. హిట్లర్‌తో సమస్య అవినీతి కాదు.

నేను, నేనే, నేను మాత్రమే అనేది సమస్య. ఈ దేశాన్ని నేను మాత్రమే దారిలో పెట్టగలను అని ఒక మనిషి అనుకోవడం సమస్య. తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి వ్యవస్థ-నిర్మాణాలు-నిబంధనలు అడ్డంకి అనుకోవడం సమస్య. వ్యవస్థ కంటే తాను పెద్ద వాడిననుకోవడం సమస్య. నేనే నిజాయితీపరుడిని, ఇంకెవరూ కాదు అనుకోవడం సమస్య. తాను కోరుకున్నట్టుగా వ్యవస్థను మార్చే ముళ్లకిరీటాన్ని తన మీద తానే పెట్టుకున్నవాడు అధికారంలో ఉండడం సమస్య. మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమానమనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలని శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.

మోదీ నిజంగానే బ్లాక్‌మనీని ఈ విధంగా అరికట్టాలని అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అతనికి ఆ చిత్తశుధ్ది ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగులబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుధ్ది లేదు అనగలమా! సమస్య అతను అవినీతిపరుడా కాదా అనేది కాదు. ఆ మాట కొస్తే కేంద్ర కేబినెట్లోనూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానూ వ్యక్తిగతంగా అవినీతి జోలికి పోనివారు అనేకులున్నారు. సో వాట్‌!

మోదీ నిర్ణయం చూస్తే కనీసం ఆర్థికమంత్రి, రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌లనైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని అనుమానం వస్తుంది. వాళ్లకి తెలీకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను నేనే నేను మాత్రమే అనుకునే మనిషి ఏమైనా చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఆర్థిక వేత్తలకు ఎటిఎంలలో కొత్త నోట్లు పెట్టడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం తెలీకుండా ఉంటుందని అనుకోలేం. 86 శాతం కరెన్సీ పోతే సిస్టమ్‌ఎలా కుప్పకూలుతుందో తెలీకుండా ఉంటుందని అనుకోలేం. కోరి కోరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని అనుకోలేం. భావజాలపరంగా విభేదించొచ్చు కానీ పరిజ్ఞానంలో వారి స్థాయిని తక్కువగా అంచనా వేయలేం. 90 లతర్వాత పెరిగిన కరెన్సీ ప్రాధాన్యం గురించి ఏ కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్లైనా సులభంగా చెప్పేయగలరు అది ఎంత అల్లకల్లోలమో! దేశభక్తికి 56 ఇంచీల ప్రతినిధి అయిన ప్రధానుల వారు వాళ్లను సంప్రదించారా అనేది సందేహమే.

అవినీతిని దాటి ఆలోచించకపోతే చాలా విషయాల్లో బోల్తాపడే ప్రమాదం ఎక్కువ. బలమైన భావజాలమున్న శత్రువుపై ఆ అస్త్రం పూచికపుల్ల లాంటిది. చావల్‌బాబా రమణ్‌సింగ్‌అవినీతిపరుడు కాకపోవచ్చు. ఆ మనిషి నవ్వు చూస్తే ఇతను చీమకైనా హానితలపెట్టగలడా అనిపించొచ్చు. కానీ చత్తీస్‌గఢ్లో ప్రభుత్వ బలగాలు వారి వత్తాసు ఉన్న బలగాలు ఆదివాసీలపై కొనసాగించిన అరాచకాలు మాటలకందనివి. నవీన్‌పట్నాయక్‌క్లీన్‌, ఎడ్యుకేటెడ్‌, శావీ అనిపించే పెద్దమనిషి కావచ్చు. కానీ ఆయన పాలనలో ఉన్న నేలమీద జరిగిన మారణకాండ,అంతకుమించి అక్కడనుంచి బయటకొస్తున్నకోణాలు మనిషి అనే పదం సిగ్గుతో తలవంచుకునేవి. నిజాయితీ-వ్యక్తిగత అవినీతి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ముందు చిన్నవి. అవి కాంగ్రెస్‌స్థాయి వ్యవహారాలు.

500-rupees
అసలు సమస్య నోట్లకోసం క్యూలో ఉండడం దేశభక్తి అనే మాటలో ఉంది. తానేం చేసినా దానికి దేశభక్తి అనే పేరుపెట్టడంలో ఉంది. దీన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అనే భావజాలంలో ఉంది. మా వైపు లేకపోతే ఉగ్రవాదుల వైపు ఉన్నట్టే, మే చేసిన దాన్ని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్టే అనే వాదనలో ఉంది. ప్రతీదీ దేశభక్తే. ఎనిమిది మంది అండర్‌ట్రయల్స్‌ని చట్టవిరుద్ధంగా చంపేస్తే దేశభక్తి. చట్టం, రూల్‌ఆఫ్‌లా, మనమే ఏర్పరుచుకున్న నిబంధనలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే ఎలా లాంటి ప్రశ్నలు మామూలుగా వేయగలిగే వారిమీద కూడా ఈ దేశభక్తి అనే మాట పనిచేస్తుంది,. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన సర్జికల్‌స్రయిక్సే చేసినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం అనే పని చేసినందుకు అది దేశభక్తి అవుతుంది. అదేంటి, ఎలా జరిగింది, నిజంగా మీరు చెప్పినట్టే జరిగిందా అనిప్రశ్నిస్తే మళ్లీ ఈ దేశభక్తి అనే అస్త్రం ముందుకొస్తుంది.

ఎవరో హేతువాదులపై దాడులు చేస్తారు. ఇంకెవరో బీఫ్‌తినడం దేశద్రోహం అంటారు. విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్‌-మార్క్స్‌వాదులను ఎవరో పనిగట్టుకుని వేధిస్తూ ఉంటారు. రోజూ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అదేదో విడిఘటనలాగా ఉండదు. మన హేతుబద్ధత, మన లాజిక్‌, మన ప్రజాస్వామికత ఓడిపోయినట్టుగా పదే పదే అనిపిస్తుంది. రాజ్యం మన అందరిమీదా కత్తికట్టినట్టుగా అనిపిస్తుంది. మనకు తెలీకుండా మన వెంటనీడలాగా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన నెత్తిమీదే ఒక కెమెరా పెట్టినట్టుగా మన చుట్టూ ఒక కంచె వేసినట్టుగా అనిపిస్తుంది. బాలగోపాల్‌సంస్మరణ సభలో రత్నం చాలా చక్కని మాట వాడారు. విశ్వవిద్యాలయాలను గ్రామాల స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు అని. ఈ మధ్య ఒక జర్నలిస్టు పెద్దాయనతో మాట్లాడుతుంటే ఒక పదం వాడారు. ఇతను వచ్చినప్పటినుంచి రోజూ టెన్షన్‌ఉంటోంది అని. అదీ సరైన అవగాహన. ప్రమాదాన్ని గుర్తించడమంటే అదీ.

ప్రతి సందర్భంలోనూ ఈ దేశభక్తి అనే పదాన్ని ముందుకు తేవడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. తాము చేసే ప్రతిపనిని సమర్థించుకోవడానికి భావజాలంతో ముడిపెట్టడం సిద్ధాంతం అనేది ఉన్న ప్రతి పార్టీ చేసే పనే. ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు. కాకపోతే అది మనుషులందరికీ ఒకే విలువ ఉంటుందని నమ్మే భావజాలమా, సమానత్వాన్ని నమ్మే భావజాలమా దానికి విరుద్ధమైన భావజాలమా అనేది ముఖ్యమైనది. ఇపుడు మన దేశాన్ని పాలిస్తున్న భావజాలం మనుషులందరూ సమానమని నమ్మేదికాదు. పేదలు-దళితులు-మైనార్టీలు- ఆదివాసీలు -మహిళల హక్కులను గుర్తించేది కాదు.

పైగా ఆర్థికరంగంలో పెట్టుబడీదారీ విధానాలను పాలనా వ్యవహారాల్లో ఫ్యూడల్‌భావజాలాన్ని కలిపి కొట్టే వింత మృగం. దేశాన్ని పాలిస్తున్న మనిషి తాను అన్నింటికీ అందరికీ అతీతుడనని తానే సర్వం అని నమ్మేమనిషి. తాను కోరుకున్నట్టుగానే అందరూ ఉండాలని తాను ఆలోచించినట్టుగానే అందరూ ఆలోచించాలని కోరుకునే మనిషి. తాను చేస్తున్న పని దాని ప్రయోజనాల గురించి పరిధి గురించి వాజ్‌పేయికి కనీసం కొన్ని సందేహాలైనా ఉండేవి. ఇతనికి అలాంటివేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌ప్రకటించాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తనంతట తాను ప్రకటించడంలోనే చాలా విషయం ఉంది. మనుషుల కంటే, మనం ఏర్పరుచుకున్న వ్యవస్థీకృత నిర్మాణాల కంటే నిబంధనల కంటే దేశం గొప్పదనేదేదో ఉంది. దేశం కోసం అంటూ నిర్ణయం తీసుకుంటున్నపుడు మిగిలినవాటిని పట్టించుకోనక్కర్లేదు అనే భావన నిలువునా జీర్ణించుకుపోతే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అది కూడా జాతి లాంటిదే. దేశభక్తి అనేదాన్ని నాటి యూదు జాతీయత అనే స్థాయికి తీసుకువస్తున్నారు. అరవై డెబ్భై ఏళ్లుగా సిస్టమ్స్ ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏమయిపోయి ఉండేదో అని భయం వేస్తుంది.

కాంగ్రెస్‌మీద గురిపెట్టినట్టుగా బిజెపి మీద అవినీతి అస్ర్తాన్ని ప్రధానం చేయలేం. మోదీ అధికారంలోకి వచ్చినపుడు ఆ అస్ర్తాన్నే ఎలా తన అధికారం కోసం ఉపయోగించుకున్నారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్‌అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బిజెపి మన మెదళ్లను కంట్రోల్‌చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్ర్తధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అపుడు ఇంత భయానక వాతావరణం ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

*

మీ మాటలు

  1. కాంగ్రెస్‌అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బిజెపి మన మెదళ్లను కంట్రోల్‌చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్ర్తధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అపుడు ఇంత భయానక వాతావరణం ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

    *

    • Wonderful and excellent article, Thank you for the write up

    • venkatrao m says:

      సర్ ఈ ఆర్టికల్ అన్ని పేపర్ లో వచ్చేటట్లు చూడండి సర్
      జనాలు కొద్దిగన్న ఆలోచిస్తారేమో

      చాల బాగుంది సర్

    • పర్ఫెక్టో పర్ఫెక్ట్…

  2. R Bhargavi says:

    well said deep study

  3. ఆర్ బి ఐ గవర్నర్ చెయ్యాలసిన పనిని పి ఎమ్ ఎందుకు చేసి నట్లు? ! నేను నేనే నేను తప్ప మరేది లేదు!
    ఇదీ ఒక తాత్విక బావ జాలమే! ఎక్సలెంట్ ఆర్టికల్.

  4. కె.కె. రామయ్య says:

    రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థల కంటే ఓ వ్యక్తి (ఎంత అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తి అయినా) తాను పెద్దవాడిననుకోవడం సమస్య. అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి ఎంతటి బీభత్సం అయినా సృష్టించగలడు అనేది ప్రపంచ చరిత్రలోని కఠోర వాస్తవం. మితిమీరుతున్న, హద్దులు దాటుతున్న ఈ దేశభక్తికి అడ్డుకట్ట వేయడం అత్యవసరం.

    ఎప్పటిలాగే ఓ అద్భుతమైన వ్యాసాన్ని రాసిన జి.ఎస్. రామ్మోహన్ కృతజ్ఞతలు.

  5. D. Subrahmanyam says:

    చాలా మంచి విశ్లేషణ. హిట్లర్ జ్జ్ఞాపకమోస్తున్నాడు. అభినందనలు

  6. Ravindanath C says:

    దొంగనోట్ల ప్రస్తాపన మీరు చేయలేదు. ఈ చర్య ద్వారా అటు నల్ల ధనం, ఇటు దొoగనోట్లను ప్రభుత్వం అరికట్టగకుగుతున్నది. ఇటువంటి మహత్తర చర్యలకు రాజకీయాలకతీతంగా సమర్ధించాలి. మన దేశంలో చిల్లర కొరత, ఏ.టీ.యం. లలో డబ్బులేకుండా ఇబ్బంది పడటం కొత్తేమి కాదు. కాకుంటే వార్తా మాధ్యమాల అనవసర అతి ఒరచారం వలన, అవసరం ఉన్నా లేకున్నా డబ్బుకొరకు జనాలు ఎగబడినందునే ఈ గందరగోళం. కేరళలో ఎటువంటి గందరగోళం లేదు. అక్కడి వారి విచక్షణా, వినతే అందుకు కారణం. మోడీ చిత్తశుద్ధిని శంకిస్తూ, దానిని అజ్ఞానం, అధికారం, దురహంకారంగా చూడటం విడ్డురంగా ఉన్నది.

  7. “మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమానమనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలని శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.” నిజమే రామ్మోహన్ గారు, ఇదే అసలు సమస్య.

    మనకి నచ్చని భావాలు ఉన్న వ్యక్తి ప్రధాని కావడమే అసలు సమస్య, మనకి నచ్చని వ్యక్తిని ఈ దేశ ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకోవడం సో కాల్డ్ ప్రజాస్వామిక వాదులకి నచ్చకపోవడం అసలు సమస్య. “మోది ఏం చేసినా దేశభక్తే అనడం, వ్యతిరేకిస్తే దేశ ద్రోహి అనడం” ఎంత పెద్ద సమస్యో, మోది ఏం చేసినా తప్పే అనడం కూడా అంతే పెద్ద సమస్య. ఈ రెండు సమస్యల మధ్య నిజం నలిగిపోతోంది.

    తుపాకితో ఈ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకంగా పోరాడతాం, ఈ ప్రభుత్వాన్ని తుపాకులతో కూలుస్తాం అనే వాళ్లకి రాజ్యాంగ హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేస్తూ రాజ్యాంగసవరణ చేయకపోవడం కూడా సమస్యే.

    ప్రపంచంలో ఏ ఒక్క చోట కూడా ప్రశాంతంగా ఉండని మతాన్ని గురించి చర్చించి, ఆ మతం లో ఉన్న లోపాలు ఏంటి, దాన్ని సంస్కరించడం ఎలా అనే ఆలోచన మానేసిన మేధావులు, ఆ మతం సహాయంతో ఈ దేశాన్ని ఎలా కూలుద్దామా అని ఆలోచించడం ఇంకా పెద్ద సమస్య.

    • మీరు పొరబడుతున్నారు.

      ఎవరైతే తుపాకులుపట్టుకొని పోరాడుతున్నారో వారు ప్రజల తరఫున పోరాడుతున్నారు. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కార్పొరేట్లకోసం దేశాన్ని అమ్మేస్తున్నారు. దండకారణ్యంలో జరుగుతున్న మైనింగ్ విష్యాలు, అక్కడి ఆదివాసీలకి సహాయంగా నిలుస్తున్న తుపాకీధారులగురించి మీరు తెలుసొనుంటే ఇలాంటి అభిప్రాయమే మీరు వెలిబుచ్చగలిగేవారు కాదు. దేశ భక్తులు వాళ్ళండీ! మన దేశ సంపద పరాయిదేశాలకు తరలుపోకుండా కుక్కకాపలా కాస్తున్నారు. మనమేమో ఇంకెక్కడివాడో, ఇక్కడికొచ్చి మనల్ని దోచుకుంటే (ఈమాట ఊరికే అనట్లేదు. దండకారణ్యంలో ఒక టన్ను ముడి ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేసినందుకు ముట్టేది 5000/- ఐతే, అందులో ప్రభుత్వానికి దక్కే రాయల్టీ 27 రూపాయలట) మనం “చీర్స్” చెబుతున్నాం. ఒక క్యూలో ఒక్క గంటనుంచుంటేనే బూతుల ప్రవాహం కురిపించేమనం, ఒక పల్లెజీవి, పొరుగునున్న పట్టణానికెళ్ళి క్యూలో నించోవాల్సొస్తే, “ఆ.. అదసలు విషయమే కాదు” అన్నట్లు మాట్లాడుతాం. మనకు మనశ్శుధ్ధేకాదు. వాక్శుధ్ధికూడాలేదు.

      ఇహ రెండవది. హిందువులకిమాత్రం ఎవరితో పడిచచ్చిందట? వీళ్లకు క్రైస్తవులతో పడదు (గ్రాహం స్టెయిన్సూ, నన్నుల అత్యాచారాలూ, మాలికలోని చెత్తరాతలు), ముస్లిములతో పడదు (మీ రాతలు), సిఖ్ఖులతో పడదు (ఖలిస్తాన్ గుర్తుందిగా). అసలు హిందువులకు హిందువులతోనే పడదు (బేమ్మలకు మిగిలివాళ్లంటే చిన్నచూపు. అలా చిన్నచూపు చూడాబడే వాళ్లకు ఇంకొకరంటే చిన్నచూపు). ఎవడో ఆవునిచంపాడన్న ఆరోపణలతో వాణ్ణి చంపేశారు. పశువుకిచ్చిన విలువ మనుషికివ్వలేని మతం మానవజాతికి మేలుచేస్తుందని ఇప్పుడు చెప్పండి.

  8. నేను అనే వాడకాన్ని మన నాయకులు పూర్తిగా కాపీ రైటు హక్కు కొనుక్కున్నారు.
    మేము అన్న మాట వారి నిఘంటువులనుండి పూర్తిగా తొలగించారణాలో నిషేధించారు అనాలో తెలియటంలేదు
    చరిత్రలో నియంతలందరు ప్రజల ఎన్నికతోనే అధికారంలోకి వచ్చి ప్రజల సొంత ఆలోచనలకి గోరికడతారు
    వారికి ఆసమయంలో ఉన్న దారిద్రం దుష్టపాలన అధికారంలోకి రావడానికి కారణమౌతాయి
    వారలా ఎదగకుండా ఆపగలిగేది ప్రజాభిప్రాయమేకాని అడ్డగోలుగా అన్నిటిని విమర్శించే ప్రతిపక్ష పత్రికారంగ కుప్పిగెంతులుకాదు.
    ఇప్పటి నోట్ల రాడ్డుని విమర్శించే వారిలో ఒక్కరుకూడా సహేతుకమైన విమర్శకాని ఉపయోగించదగిన ఆచరణ యోగ్యమైన మాటకాని నా చెవిని పడలేదు.
    శల్యసారధ్యాలు ఒద్దు బాబోయి (ఇది హిందుత్వ వాడుక కాదు మహా కవి కూడా జగన్నాధ రధ చక్ర్రల వాడుకున్నాడు)
    నెలకో స్కాము వినకుండా నా ఈ డెబ్భై ఎల్లా జీవితంలో రెండున్నరేళ్లు గడిచాయి అంతవరకూ ప్రజలసొమ్ము క్షామముగా ఉంన్నందుకు ఆనందిస్తున్న
    వ్యక్తి ఆరాధనతో నియంతలుకాకుండా నాయకులని కాపాడడం యువతరం బాధ్యత అని చక్కగా టీవీ ఛానల్ మార్చినట్లు మార్చి ప్రభుత్వాలని కట్టడి చేయగలరని నా గాఢ విస్వాసం.
    మనం వాడే మందులతో హానికారక సూక్ష్మ జీవులతో బాటు క్షేమకారక సూక్ష్మజీవులు కూడా చస్తాయి అందుకనే డాక్టర్లు విరుగుడు కి మందులిస్తుంటారు మనం అదే జాగ్రత్త తీసుకోవాలి

    • Renuka Sheganti says:

      వ్యక్తి ఆరాధనతో నియంతలుకాకుండా నాయకులని కాపాడడం యువతరం బాధ్యత అని , చక్కగా టీవీ ఛానల్ మార్చినట్లు మార్చి ప్రభుత్వాలని కట్టడి చేయగలరని నా గాఢ విస్వాసం.
      మీ విశ్వాసం నిజమవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

  9. hiranya bhatt says:

    chaala baaga rasarandi na bhayam ee roju que lo nilchodqm kadu repu taxation vishayam lo etuvanti spashtatha ivvakunda pratidaniki addugoda vestadu ani… daaniki meeru aa manishikunna ahankaaramae kaaranam ani cheppadam nijanga valid point ae..

  10. Mandapaka Kameswar Rao says:

    చాలా మంది సంఘీలు అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటే ఎలా అన్నదానికి చక్కని జవాబు..

  11. Pavan Santhosh says:

    //ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు.//
    మనకి నచ్చని భావజాలంతో సమస్య అని సూటిగా చెప్పొచ్చు కదా. చైనాలో వర్గ నిర్మూలన, సోవియట్ రష్యాలో మానవ హక్కుల అణచివేత ఏ మానవత్వానికి అనుకూలమైన భావజాలం వల్ల వచ్చాయి? మోడీని ప్రజాస్వామ్యానికి విలువలకు వ్యతిరేకి అని విమర్శించడం తప్పు కాదు. కానీ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకులైనా మనకు నచ్చే భావజాలం ఉన్నవారైతే ఫర్వాలేదు అనుకోవడంతో నాకు చాలా సమస్య ఉంది.

  12. b.kiranteja says:

    నియంతృత్వ వ్యవస్థని తలపిస్తుంది అనేలా ఉంది అన్న మీ భావనను బాగా తెలియజేసారు

  13. ఇప్పుడు దేశంలో అందరూ ఎమోషనల్‌గా ఉన్నారు.
    ఇది వాస్తవిక ప్రపంచం, దర్శకుడు “శంకర్” సినిమా కాదని చెప్పినా వినేవాళ్ళు లేరు.

  14. PulleswaraRao says:

    చాలా అద్భుతంగా రాశారు.అంతా నేనే అనే ఒక వ్యక్తి యొక్క మానసిక భావజాలనికి , ఒక దేశ ప్రస్తుత సమస్యకు చక్కటి విశదీకరణ.

  15. ఆర్ధిక దాహం కంటే అధికార దాహమే ప్రమాదకరం .మోడీ నోట్ల మనిషి కాకపోవచ్చు కానీ ఓట్ల మనిషి . తన చేసిన పనికి పార్లమెంట్ కి సమాధానం , వివరణ ఇవ్వాల్సిన వాడు ఎన్నికల ర్యాలీలతో ప్రజల ముందు భావోద్వేగాలు రగిలిస్తున్నాడు అదే ఉదాహరణ .

  16. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగులబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుధ్ది లేదు అనగలమా!బాగా చెప్పారు ఎప్పటి లానే …

  17. Chaithanya says:

    చాలా బాగా రాసారు..

  18. C ANURADHA says:

    చాలా బాగుంది రామ్మోహన్ గారు , సరిగ్గా మా ఆలోచనలు చదివి రాసినట్టుంది. నేను అలాగే ఫీల్ అవుతున్నాను. మొత్తం దేశం లోని ప్రజలని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ లోకి నెట్టేసున్నారు మోడీ గారు. అది దేశానికీ మంచిది కాదు.

  19. syed sabir hussainm says:

    రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని లోతుగా పరిశీలిస్తే మోడీ నీతి,నిజాయితీలు ఏమిటో అర్ధం కాగలదు..? కేజరీవాల్ ఆరోపణలను కూడా గమనించాలి. 50కోట్ల rupayala మోడీకి లంచం ముట్టినట్లు ఆరోపిస్తున్నారు కదా. కాంగ్రెస్ ,మోడీ లు అవినీతిలో దొందు దొందే.

  20. చొప్ప.వీరభధ్రప్ప says:

    మరోసారి మరో విశ్లేషణ అవసరం. మీరు ఈ వ్యాసం వ్రాసి వారం దాటిపోయింది.

  21. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

Leave a Reply to P.Jayaprakasa Raju. Cancel reply

*