వేయి ప్రశ్నల ‘పడగలు’

 ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-3

 

sudrarsanamవిశ్వనాథ భావజాలానికి ఆర్.ఎస్ సుదర్శనం ‘బాహ్యమిత్రు’డే కాక’, ఇంగ్లీషు చదువుతో భారతీయేతర గవాక్షం నుంచి దానిని చూసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన వ్యక్తి అన్న సంగతిని మరోసారి గుర్తుచేసుకుని ‘వేయిపడగల’కు వద్దాం.

వేయిపడగలు ఆయనకు పెద్ద పజిల్ గా మారింది. అనేక ప్రశ్నలు, సందేహాలతో పాటు చికాకునూ కలిగించింది. ‘ఏకవీర’లో కనిపించిన తాత్విక పటిమ కానీ, స్పష్టత కానీ ఆయనకు అందులో కనిపించలేదు.

‘నేతి నేతి’ అనే పద్ధతిలో ఆయన పరిశీలన ఇలా సాగుతుంది:

“వాఙ్మయమనగా నేమి?” అని ప్రశ్నించి చివరగా, “కావ్యాత్మయే కాక, కావ్యశరీరము, కావ్యస్వరూపము కూడా నీ జాతి సిద్ధాంతముల మీద నాధారపడియుండును…” అన్న విశ్వనాథ వారి వివరణను తీసుకుని, కావ్య శరీరము, కావ్యాత్మ వేయిపడగలులో ఎలా అనుసంధింపబడ్డాయో సుదర్శనం పరిశీలించారు. ముందుగా కావ్యాత్మను తీసుకుంటే, నవలలోని పాము- అంటే కథాస్థలమైన సుబ్బన్నపేటలో జమీందారు కట్టించిన ఆలయంలో,  బ్రాహ్మణుడు ప్రతిష్టించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు హిందూ వ్యవస్థాధర్మానికి ప్రతీక.  దానికి అతీతమైన, మౌలికమైన సనాతన ధర్మానికి అక్కడే ప్రతిష్టితమైన శివలింగం, లేదా నాగేశ్వరస్వామి ప్రతీక. కథా ప్రారంభంలో రచయిత ఈ ఇద్దరు దేవుళ్ళకు(అంటే వ్యవస్థాధర్మానికీ, సనాతన ధర్మానికీ)భేదం పాటిస్తాడు. కానీ ఆ వెంటనే మొదలుపెట్టి, రచన అంతటా రెంటికీ మధ్య అభేదాన్ని పాటించాడు. ఈ విధంగా, ఏకవీరలో ఉన్న తాత్విక స్పష్టత వేయిపడగలులో ముందే లోపించింది.

పోనీ వ్యవస్థాధర్మంతో అభేదం పొందిన ఆ సనాతనధర్మ నిరూపణే కావ్యాత్మ అవుతుందా? ఆ నిరూపణ ఇందులో చిత్రితమైన పాత్రల ద్వారా జరగాలి. ఇందులోని ముఖ్యపాత్ర ధర్మారావు. అతను ధర్మానికి ప్రతినిధి అని రచయిత ఉద్దేశం. అయితే, ధర్మారావు ఏ ధర్మానికి ప్రతినిధి; వ్యక్తి ధర్మానికా, వ్యవస్థాధర్మానికా, సనాతనధర్మానికా అని ప్రశ్నించుకుంటే  సంతృప్తికరమైన సమాధానం దొరకదు.  రచయితేమో, అతను సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని, వ్యవస్థాధర్మానికి సాధికారవ్యాఖ్యాత, లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అంటాడు. అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గమనీ; భక్తి, కర్మమార్గాలను అనుసరించేవారికి కూడా అతను గురువనీ అంటాడు.

కానీ అతని నడవడి చూద్దామా అంటే ఇవేమీ కనిపించవు. అతను ఏకవీరలా సాధకుడు కాడు. అతనిలో సందేహాలూ, సంఘర్షణలూ లేవు. అయినా అతన్ని సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని అని రచయిత ఎలా (పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలని సుదర్శనంగారి వ్యంగ్యం)అన్నారో? ఇక లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అయ్యే నిర్లిప్తత అతని మనస్తత్వంలోనూ లేదు, దానిని సాధించే పరిస్థితులు అతని జీవితంలోనూ లేవు. ఆపైన అతనిలో ఎంతసేపూ లోకవిమర్శ తప్ప ఆత్మవిమర్శ లేదు. స్వోత్కర్ష మాత్రం కావలసినంత. జ్ఞానమార్గంలో అతను పొందిన పరిణామ మేమిటో రచయిత ఎక్కడా చెప్పలేదు. పైగా అతనిలో హిందూ వ్యవస్థా ధర్మానికి తనే వ్యాఖ్యాతా, సొంతదారు ననే విపరీత అహంకారం.

ధర్మారావు కర్మయోగి, జ్ఞానయోగి అయితే, కొత్త కొత్త పద్ధతుల మీద; జీవిత విధానాల మీద అంత ద్వేషభావం దేనికి? అది జిజ్ఞాసువు లక్షణం కాదు. అతనిలో సమన్వయ దృష్టిలేదు. అతనికి కొత్త ఒక రోత పాత ఒక నీతి. మారుతున్న పరిస్థితులలో కూడా హిందూధర్మం సృజనాత్మక శక్తే నని నిరూపణ చేసే ఉద్దేశమే నవలకు ఉన్నట్లైతే ధర్మారావు సృష్టి మరొక విధంగా ఉండేదన్న సుదర్శనం, ఇక్కడ కూడా ‘మాలపల్లి’తో పోలిక తెస్తారు. ధర్మారావుకు భిన్నంగా ‘మాలపల్లి’ నవలలోని సంగదాసు, రామదాసులు పాత కొత్తల సంగమస్థానంగా, మేలు కలయికగా కనిపిస్తారు.

కనుక కావ్యాత్మ సనాతనధర్మ నిరూపణ కాదు. సనాతన, వ్యవస్థా, వ్యక్తి ధర్మాల మధ్య స్పష్టమైన తేడాను పాటిస్తూ వీటి మధ్య సంబంధాన్ని నిరూపించే తాత్వికదృష్టిని వస్తు విన్యాసంలో రచయిత పాటించలేదు.

పోనీ  వ్యవస్థాధర్మనిరూపణ కావ్యాత్మ అవుతుందా? రచయిత చెప్పినట్టు వ్యవస్థ నాలుగు స్తంభాల ధర్మమంటపం. స్వామి(భగవంతుడు), రాజు, బ్రాహ్మణుడు, గణాచారి(కాలం)…ఈ నలుగురూ నాలుగు స్తంభాలు. స్వామి, ప్రభువు, ధర్మారావు(ధర్మం)ల మధ్య అభేద తాదాత్మ్యం.  ధర్మాచరణ రాజు కర్తవ్యం, ధర్మప్రచారం బ్రాహ్మణుని కర్తవ్యం. పసరిక పైరుపచ్చకు ప్రతీక, దేవదాసి శృంగారయుతమైన భక్తిమార్గం, హరప్ప వైదిక కర్మానుష్ఠానం, గోపన్న సేవావృత్తి. ఇదీ వ్యవస్థకు చెందిన అవయవ విభాగం. ఈ వ్యవస్థకు కేంద్రంలో ధర్మారావు. ఈ ధర్మారావు ఎటువంటి వ్యక్తో పైన కొంత చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు తర్వాత చెప్పుకుందాం.

జమీందారు, అంటే రాజువైపునుంచి, ధర్మాచరణలో జరిగిన ఒక లోపంతో నవల ప్రారంభమవుతుంది. ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి మాసికాన్ని జమీందారు నిర్లక్ష్యం చేస్తాడు. ధర్మారావు రుణగ్రస్తుడైనట్టు సేవకుడు గోపన్న వెళ్ళి చెప్పిన తర్వాతే తండ్రి మాసికానికి ధర్మారావుకు జమీందారు డబ్బు ఇస్తాడు. ముందే తెలుసుకోకపోవడం జమీందారు ధర్మాచరణలో జరిగిన లోపం. అందుకే అతనిని కలలో వేయిపడగల పాము కాటువేసి శిక్షిస్తుంది.  ఇక్కడ ధర్మాచరణ సమ్యక్ స్వరూపం మనకు ఏం తెలిసినట్లు అని సుదర్శనంగారి  ప్రశ్న.

రచయిత చిత్రీకరణ ప్రకారం, “రామేశ్వరశాస్త్రి వర్ణాశ్రమధర్మముల ముద్దకట్టిన మూర్తి, భారతదేశము యొక్క ఆత్మ, త్రయీధర్మవిద్య కొక వ్యాఖ్యానము.” మరోవైపు, రామేశ్వరశాస్త్రి అందగాడు, రసికుడు, దేశము నాలుగుమూలలా తిరిగివచ్చినవాడు. ఆయన వితరణ బుద్ధి హద్దులేనిది. జమీందారు తర్వాత జమీందారు. నాలుగువర్ణాల ఆడబడుచుల్నీ పెండ్లాడి ఒక భోగాంగనను చేరదీసినవాడు.  ఇలాంటి వాడు భోగి కానీ యోగి ఎలా అవుతాడని సుదర్శనంగారి ఆక్షేపణ. “వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి” గా రచయిత  చిత్రించిన రామేశ్వరశాస్త్రి గృహస్థుగానే మరణించాడే, మరి ఆయన పాటించిన ఇతర ఆశ్రమధర్మాలు ఏమిటన్నది ఆయన లేవనెత్తిన మరో ప్రశ్న. అలాగే రామేశ్వరశాస్త్రి చేసుకున్న వర్ణాంతరవివాహాలపైనా అనేక ప్రశ్నలు. అవి వర్ణధర్మాన్ని సమర్థిస్తున్నాయా అంటే, సమర్ధించడంలేదు. అవి నేటి వర్ణవిభేదాలకు పరిష్కారం సూచిస్తున్నాయా అంటే ఆ పరిష్కారం ఎంతమందికి నచ్చుతుంది? దాని యథార్థ స్వరూపం ఏమిటి? ఇలా వ్యవస్థా నిరూపణ ‘ఆదర్శం’ నుంచి ‘యాథార్థ్యం’లోకి దిగివస్తుందంటారు సుదర్శనం.

veyi

ధర్మారావు ‘బ్రాహ్మణత్వం’ అన్న ఆదర్శానికి ఎటువంటి సమర్థన అన్నది ఆయన సంధించిన మరో ప్రశ్న. బ్రాహ్మణత్వం అంటే కేవలం ‘ధర్మప్రచార’మేనా? ఈ విధంగా తర్కిస్తే నవలలో వ్యవస్థా ధర్మ నిరూపణం అసంతృప్తినే కలిగిస్తుంది. ఆకృతి(Form)కి తగిన పుష్టి(Substance) జరగలేదని అనిపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే,  నవలలో రచయిత సమర్థించబూనుకున్న వ్యవస్థకు అసలు ఉనికే లేదు– ఇదీ సుదర్శనంగారి నిర్ధారణ.

మొత్తానికి ఆయనకు ఇదొక  పెద్ద చిక్కుముడి. విశ్వనాథవారి మాటలను పట్టుకుని ఇందులో కావ్యాత్మ సనాతన ధర్మమా, లేక హిందూవ్యవస్థా ధర్మమా అన్నది వెతకబోతే ఆ దారి ఇలా మూసుకుపోయింది. “ఏతావాతా తేలే దేమిటంటే: హిందూ వ్యవస్థ యొక్క ఆదర్శాన్నీ, దాని పటుత్వాన్నీ నిరూపించే ఉద్దేశమే ‘వేయిపడగల’ కావ్యాత్మ అనటానికి, పాత్రచిత్రణమూ, కథాగమనమూ, దాని స్ఫూర్తీ  అందుకు భిన్నంగా ఉన్నా” యన్న నిర్ధారణకు వచ్చారు.

మరి ఇప్పుడేం చేయాలి? దారి మార్చుకోవాలి!

రామేశ్వరశాస్త్రి ‘వర్ణాశ్రమ ధర్మాలు ముద్దకట్టిన మూర్తి’ కాకపోతేనేం, అతనొక ఉత్తముడైన మానవుడే. ఆయన కానీ, ధర్మారావు కానీ ఆనాటి బ్రాహ్మణవర్గానికి ఏవిధంగానూ ప్రతినిధులు కాకపోతేనేం, తమలోని మానవత్వానికీ(సుదర్శనంగారు ఈ మాటను మానుషత్వం అనే అర్థంలో వాడినట్టుంది), దాని విశిష్టతకూ ప్రతినిధులు. అలాగే, అందులోని మిగిలిన పాత్రలు కూడా. “వారిలో ప్రకాశితమవుతున్నది వ్యక్తిగతమైన విశిష్టతే! ఇటువంటి వ్యక్తుల ద్వారా సమకాలీన సమాజంలోని వర్ణవిభేదాలను, వర్గీకరణను సమంజసమని సమర్థించడం ఎట్లా? నవలలో ధర్మారావు ద్వారా జరిగే వ్యాఖ్యానానికి, సమర్థనకూ ఈ దోషం సర్వత్రా ఉంది. అందువల్ల నవలలో వాచ్యముగా జరిగినంత మేర వ్యవస్థ నిరూపణము యాథార్థ్యం దృష్ట్యా జరగలేదనే చెప్పాలి” అని సుదర్శనంగారి తీర్మానం.

ఇలా ‘వేయిపడగలు’ కావ్యాత్మ సనాతన ధర్మ నిరూపణమా, లేక వ్యవస్థా ధర్మ నిరూపణమా అన్న విచికిత్స నుంచి బయటపడిన సుదర్శనంగారు, చివరికి అది ‘ధర్మారావు జీవిత చరిత్ర’ అని తేల్చారు. అది అతని మనస్థితికీ, ఆ మనస్థితికి కారణాలైన సాంఘికపరిస్థితులకూ దర్పణం అన్నారు. కనుక నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే! సనాతనధర్మమో, హిందూ వ్యవస్థా ధర్మమో కావ్యాత్మ అనుకోవడం వల్ల వాటి నిరూపణ అసంతృప్తిని కలిగించి విమర్శలను రేకెత్తిస్తోంది కానీ, ఇలా దృష్టి మార్చుకుని, నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే అనుకుని చూసినప్పుడు చిక్కుముడి విడిపోతుంది…. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ఇందులో గౌణమే తప్ప ప్రధానం కావు. అవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వం ద్వారా మనకు దృశ్యమానమవుతున్నాయి. ఆ మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం వాటిలోనూ దృశ్యమానమవుతున్నాయి…

ఇలా అనుకున్న సుదర్శనంగారు, ఇక్కడ చేసింది ఒకవిధమైన శస్త్రచికిత్స. తల్లి ప్రాణాన్ని కాపాడలేకపోయినా కనీసం బిడ్డనైనా కాపాడే ప్రయత్నం లాంటిది. విశ్వనాథ లక్షించిన వ్యవస్థాధర్మ నిరూపణ లేదా స్వీయ భావజాలం అనే ‘తల్లి’ నుంచి, ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేసి వాటిని స్వతంత్ర జీవంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తల్లిని పక్కన పెట్టేశారు. అప్పుడిక ఆ పాత్రలలో ఎలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతమైనవే తప్ప వ్యవస్థకు సంబంధించినవి కావు. ఇలా పాత్రల ముఖంగా చూసినప్పుడు విశ్వనాథ ఆదర్శం సార్వత్రిక హిందూ వ్యవస్థాధర్మాన్ని చిత్రించడం కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని చిత్రించడం!

ఇలా సుదర్శనంగారి ప్రకారం, నవలలో సుబ్బన్నపేటే తెలుగుదేశం. సుబ్బన్నపేట అంటే ధర్మారావు. ఇది కావ్యశరీరం. ధర్మారావు పాత్ర సమర్థించినది క్రమంగా అదృశ్యమవుతున్న గ్రామీణమైన తెలుగుదనాన్ని. ఆంగ్లభాషా, పాశ్చాత్య నాగరికతా సోకని తెలుగుదనం నిలబడలేదనే అతని ఆవేదన. అందులో లోటుపాట్లు అతనికి కనిపించవు. అదంతా హిందూధర్మ స్వరూపమే నని అతను భ్రమపడతాడు. దాని సమర్థనకోసం తను అహంభావం పెంచుకున్నా ఫరవాలేదనుకుంటాడు. తరచు భావం కంటే అహంభావమే అతనిలో ముందుకు వస్తుంది. రైలు మార్గాలు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాక్టరీలు, డబ్బు చలామణి, శారదా చట్టం, వితంతు వివాహాలు, హరిజనుల ఆలయప్రవేశం సహా అన్నిటినీ వ్యాఖ్యానిస్తాడు. అన్నిటినీ వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషు చదువుకుంటాడు, కానీ ఇంగ్లీషును ద్వేషిస్తాడు. తండ్రి మాసికానికి జమీందారు దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, “నేను యాచించలేదు…ఆయనయే ఇచ్చెను” అని, భంగపడిన ఆహాన్ని సమర్థించుకుంటాడు. “అతనిలో స్వాభిమానము మెండు, దానికి బాధాకరమైన సత్యాన్ని దర్శించే చొరవ, సాహసం అతనిలో లేవు. ఆ పరిస్థితిలో సత్యరూపాన్ని భిన్నంగా తనకు అనుకూలంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే అతని ప్రవర్తన కూడా సమయానుకూలంగా ఉంటుంది” అని సుదర్శనంగారి వ్యాఖ్య.

ధర్మారావు అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడడు. తను చదువుతున్న కళాశాలలో క్రైస్తవ విద్యార్థులు హిందూ మతాన్ని అవమానించినప్పుడు హిందూ విద్యార్థులు చేసిన సమ్మెలో అతను పాల్గొనడు. “ఎదిరించి నీ వేమైన చేయగలవా?”అని ఉపదేశిస్తాడు. ఇక్కడ సుదర్శనంగారి వ్యాఖ్య ఇలా ఉంటుంది: “ఇక్కడ ధర్మరక్షణ కంటే ఆత్మరక్షణ ప్రధానమైనది! ధర్మారావునకు హిందూ ధర్మముతో తాదాత్మ్యము, అది తనకు ఉపయోగపడునంతవరకే. దానికి తాను ఉపయోగపడవలసి వచ్చినప్పుడు వాగ్వాదము, వ్యాఖ్యానము కావలసినంత! ఇక్కడ అసలు విషయం, జమీ లేకపోయినా ధర్మారావు జమీందారు బిడ్డ. కష్టములను ఎదుర్కోవడం కంటే వాటిని తప్పించుకోవడమే అతని స్వభావం.”

ధర్మారావు కవి, భావుకుడు కూడా. తను కష్టపడి సాధించగలిగినదేమీ అతనికి మిగిలినట్లే తోచదు: ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మారావు ఇటు అర్థం కోసం కానీ, అటు మోక్షం కోసం కానీ ప్రయత్నం చెయ్యడు. తనే ధర్మావతారం. పెళ్లి చిన్నతనంలోనే జరగడంవల్ల కామానికి ఇబ్బంది లేదు. ఇక సాధించవలసిందేమిటి? లోకానికి గురువు కావడం! ధర్మారావు గురుత్వం వహించని, సలహా ఇవ్వని అతనితో సంబంధం లేని పాత్రలేదు. ఏ విధంగానైనా అతనికి సమవుజ్జీయో, అధికుడో అయ్యే పాత్ర కనిపిస్తే అతనికి నవలలో చరిత్రే లేదు. వాదంలో ధర్మారావు ముందు ఓడిపోనివారు లేరు. తన గొప్పదనాన్ని గుర్తించని వారి మీద రౌడీలను పురిగొల్పడానికి వెనుదీయడు. ఇక అతని పనేమిటన్నది చూస్తే, స్వామికి ఉత్సవాలు జరిపించడం తప్ప ఏమీ చేయడు. ధనవంతురాలు, ‘పతిత’ అయిన మంగమ్మతో అతనికి ‘రహస్య’ సంబంధం. భార్య అనారోగ్యంతో ఉన్నా, మంగమ్మ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు.

సుదర్శనంగారి ప్రకారం, తులనాత్మకంగా చూస్తే, ధర్మారావుతో పోల్చగల పాత్ర రవీంద్రుని గోరా. కానీ ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంతో తేడా. ధర్మారావులానే హైందవవాది అయిన గోరా, చివరికి ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య ‘ అన్నట్టుగా, “నేనీరోజున భారతీయుడిని. హిందువు, ముస్లిము, క్రైస్తవుడు…ఎవరైనా కానీ, నాలో ఇప్పుడు ఎలాంటి మతఘర్షణా లేదు. ఈ రోజున భారతదేశంలోని అన్ని కులాలూ నా కులమే” అనుకునే స్థితిని చేరుకుంటాడు. కానీ ధర్మారావుకు సర్వధర్మాలూ తనే నన్న భావము. అతను అసలు పయనించనే లేదు, గమ్య స్థానం చేరుకోవడమెక్కడ? ఈ భేదమే రవీంద్రుని విశ్వకవిని చేస్తే, ఆయన కంటే ప్రతిభావంతుడైన విశ్వనాథను తెలుగు కవిసమ్రాట్ గానే నిలిపిందని సుదర్శనంగారి వ్యాఖ్య. “‘నౌకాభంగము’ నుంచి ‘గోరా’వరకు రవీంద్రుడు ఎన్ని మెట్లు పైకి ఎక్కెనో, ‘ఏకవీర’నుంచి ‘వేయిపడగల’వరకు విశ్వనాథ అన్ని మెట్లు క్రిందికి దిగెను” అన్నది ఆ వెంటనే ఆయన చేసిన మరో కీలకమైన వ్యాఖ్య.

ఇలా ధర్మారావులోని లక్షణాలను సుదర్శనంగారు ఎత్తి చూపుతూనే, అతను ఆదర్శప్రాయుడు కాకపోతేనేం, “రాగద్వేషాలూ, రక్తమాంసాలూ, కష్టసుఖాలూ కలిగిన మనిషి. అచ్చమైన తెలుగువాడు. వ్యవస్థా ధర్మానికి, యోగమార్గానికి ప్రతినిధిగా తృప్తి కలిగించకపోయినా తెలుగుదనం ముద్దకట్టిన మూర్తి ధర్మారావు” అంటారు. ఆయన దృష్టిలో, (‘ఏకవీర’కు ఉన్నట్టు)’వేయిపడగలు’కు ఒక తాత్విక దృక్పథం ఆలంబనంగా లేకపోవచ్చు, కానీ అది కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం. తెలుగుదేశంలో శిథిలమై అదృశ్యమవుతున్న పూర్వ నాగరికత చివరి మెరుగుల్ని చూచిన విశ్వనాథ హృదయం సంక్షోభించి వెలువడిన సుదీర్ఘ నిశ్వాసమే వేయిపడగలు. అది ఒక వైయక్తిక హృదయోద్వేగం. అంతేకాదు, సుదర్శనంగారి దృష్టిలో వేయిపడగలు, డి. హెచ్ లారెన్స్ నవల The Rainbow తో పోల్చదగింది కూడా.

***

ఈవిధంగా సుదర్శనంగారు వ్యవస్థాధర్మ నిరూపణం అనే ‘తల్లి’ నుంచి ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేయడమే కాదు; రచనను  వైయక్తిక హృదయోద్వేగాన్ని చాటే గొప్ప సాహిత్యప్రతిపత్తి కలిగిన ఆత్మాశ్రయకావ్యస్థాయికి ఎత్తి సహృదయతను నిరూపించుకున్నారు. నవలలో ప్రకటితమైనది ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వాల మూసలోంచి వ్యక్తమవుతున్న  హైందవవ్యవస్థా ధర్మమే తప్ప అదే అసలు హైందవధర్మం కాదన్న భావనను ధ్వనింపజేశారు. అంటే, ఇందులో ప్రకటితమైన హైందవ ధర్మ, తాత్వికతలకు భిన్నమైన హైందవ ధర్మమూ, తాత్వికతా వేరే ఉన్నాయని ఆయన భావించారన్నమాట.

అలా భావించడంలో సుదర్శనంగారి ‘బాహ్యతా’, ‘మిత్రతా’ కూడా వ్యక్తమవుతున్నాయా?!

(సశేషం)

మీ మాటలు

  1. రాజ్యలక్ష్మి says:

    క్షమించాలి భాస్కరం గారూ. వేయిపడగలు లో ధర్మారావు , మంగమ్మ ల మధ్య అటువంటి సంబంధం గానీ దాని సూచన గానీ లేవండీ.

    • కల్లూరి భాస్కరం says:

      సుదర్శనంగారి పుస్తకం నుంచి…

      “భార్యకు స్వస్థత చెడిన కాలంలోనే ధర్మారావు ఇంటికి ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటుంది…ధర్మారావు మంగమ్మతో నలుగురి ఎదుట మాట్లాడడు. కానీ మంగమ్మ చివరకు కుమారస్వామితో ‘రహస్యము’ చెబుతుంది: “ప్రతిదిన మర్ధరాత్రమున నేను ధర్మారావుగారి శిష్యురాలను. మూడవ కంటికి తెలియదు.”(వే. ప. 24 అ.). ధర్మారావు ప్రవర్తనలో ఈ భాగము ఎలా అర్థం చేసుకోవాలి?”

  2. జయదేవ్ says:

    ధర్మారావుగారి శిష్యురాలను అని మాత్రమే అన్నదని గమనించండి.శిష్య-శిష్యురా౦డ్రు గురువుకి కొడుకు-కూతురి వరస అవుతారు..ఇందులో మీకు ఏకోనంలో పెడర్ధముగోచరించిదో వివరించగలరు..

    • కల్లూరి భాస్కరం says:

      వ్యక్తిగతంగానూ, వ్యాస పరంగానూ చెప్పాలంటే నేను ఇందులో ఎలాంటి పెడర్థాన్ని చూడలేదు, సదర్ధాన్నీ చూడలేదు. ఇది రచయిత చిత్రించిన ధర్మారావు అనే వ్యక్తి జీవితం తాలూకు ఒకానొక వివరం మాత్రమే. సుదర్శనంగారు కూడా ఇందులోంచి పెడర్ధాన్ని లాగడానికి ప్రయత్నించారనుకోను. పెడర్ధమా, సదర్ధమా అన్నది పక్కన పెట్టి; సహజమా, అసహజమా చూస్తే అనే కోణంలో చూస్తే; ధర్మారావుకు, మంగమ్మకు వేరే సంబంధం ఉండడంలో అసహజం ఏమీ లేదు. కానీ, వారి మధ్య గురు-శిష్యురాలి సంబంధం, ఆ విధంగా తండ్రి-కూతురి సంబంధం ఉందన్న మీ వివరణ ప్రకారం చూసినప్పుడు; ఎంత శిష్యురాలైనా గురువు అర్థరాత్రి మూడో కంటికి తెలియకుండా శిష్యురాలి ఇంటికి వెళ్ళి వస్తుండడంలో మాత్రం అసహజం ఉంది.

    • కల్లూరి భాస్కరం says:

      వ్యక్తిగతంగానూ, వ్యాస పరంగానూ చెప్పాలంటే నేను ఇందులో ఎలాంటి పెడర్థాన్నీ చూడలేదు, సదర్ధాన్నీ చూడలేదు. ఇది రచయిత చిత్రించిన ధర్మారావు అనే వ్యక్తి జీవితం తాలూకు ఒకానొక వివరం మాత్రమే. సుదర్శనంగారు కూడా ఇందులోంచి పెడర్ధాన్ని లాగడానికి ప్రయత్నించారనుకోను. పెడర్ధమా, సదర్ధమా అన్నది పక్కన పెట్టి; సహజమా, అసహజమా అనే కోణంలో చూస్తే; ధర్మారావుకు, మంగమ్మకు వేరే సంబంధం ఉండడంలో అసహజం ఏమీ లేదు. కానీ, వారి మధ్య గురు-శిష్యురాలి సంబంధం, ఆ విధంగా తండ్రి-కూతురి సంబంధం ఉందన్న మీ వివరణ ప్రకారం చూసినప్పుడు; ఎంత శిష్యురాలైనా గురువు అర్థరాత్రి మూడో కంటికి తెలియకుండా శిష్యురాలి ఇంటికి వెళ్ళి వస్తుండడంలో మాత్రం అసహజం ఉంది.

  3. సుదర్శనం గారి ప్రతిపాదన ప్రతీదీ ఒక కొలమానం కాదు. ధర్మారావు-మంగమ్మల మధ్య గల ‘వేరే’ సంబంధం సుదర్శనంగారి ఊహా జనితమైనదిగానే తోస్తుంది. శిష్యురాలు అనే మాటకి అనైతిక సంబంధం అంటగడితే ఇంకా లోకంలో శిష్యురాళ్లందరూ ఏమవుతారు? గురు శిష్యసంబంధానికి ఏ సమయమైనా ఒకటేనేమో! గురుస్థానాన్ని అధిష్టించిన సుదర్శనంగారు ఇలాంటి ఊహని ఎందుకు చేశారో!

  4. రాజ్యలక్ష్మి says:

    ‘ అర్థరాత్రమున ‘ , రహస్యముగా చేయవలసిన , చేస్తే ఫలితమిచ్చే విషయాలలో సుదర్శనం గారికి తెలియనివి ఇంకా ఉన్నాయి భాస్కరం గారూ. తెలుసు కొనే ప్రయత్నం చేయండి.

  5. rani siva sankara sarma says:

    కల్లూరి భాస్కరంగారూ
    మంగమ్మకి చెడ్డ పేరు రావడం వల్ల , ధర్మారావు రహస్యంగా విద్యాబోధ చేసేవారని అర్థమా ?ఎందుకంటే మంగమ్మ విగ్రహారాధన గురించి ఇతర ధార్మిక విషయాల గురించి అనర్గళంగా మాట్లాడుతుంది నవలలో. ధర్మారావు సంఘం తో సంఘర్షించకుండా సర్దుబాటు తత్త్వం తో జీవించే వ్యక్తిగా కనబడతాడు.

  6. జయదేవ్ says:

    కొన్ని మార్మికమైన విషయాలుంటాయి భాస్కరం గారు.ఉదాహరణకి అర్ధరాత్రము అనే దానినే తీసుకుందాం.అంటే మోత్హము ఎనిమిది జాములలో అది ఆరోవది.షట్[ఆరు] శబ్దం సేవకు -తాన్త్రికమైన విద్యా రహస్యాలకు సంకేతం.ఆరోవ జాములో శాస్త్రము తెలిశినవారు కానీ-తెలియని వారు కానీ లైంగిక చర్యలకు పూనుకోరు.ఆమె ఆయనకు సేవ నిమిత్హమైనా వెళ్లి ఉంటుంది[ఇక్కడ సేవ అంటే అదే నని అనుకోరని భావిస్తాను]లేక కొన్ని తాంత్రిక శాస్త్ర రహస్యాల చర్చకైనా ఆసమయాన్ని ఎంచుకొనిన ఉండవచ్చును కదా.ఇది సుదర్శనం గారి వూహై ఉంటుంది అని అనుకుంటున్నాను.అంత కచ్చితంగా ఎలా చెప్పగలరని మీరు అడగవచ్చును.విశ్వనాధ వారు నాకు తాతగారి వరస బంధువు …

    • కల్లూరి భాస్కరం says:

      రాజ్యలక్ష్మి, రాణి శివశంకర శర్మ, జయదేవ్, శివరామకృష్ణారావు గార్లకు…

      సుదర్శనంగారి మాటలను కోట్ చేయడం(‘రహస్యము’ అనడంతో సహా) తప్ప వారిది అటువంటి సంబంధమేనని నేను అనలేదు. సుదర్శనంగారు కూడా మంగమ్మ అన్న మాటల్ని కోట్ చేసి “ధర్మారావు ప్రవర్తనలో ఈ భాగము నెలా అర్థం చేసుకోవాలి?” అని మాత్రమే అన్నారు తప్ప వారిది అటువంటి సంబంధమే నని అనలేదు. శర్మగారు అన్నట్టు నవలలో మంగమ్మ విగ్రహారాధనపై తన అభిప్రాయాలను విశ్లేషణాత్మకంగా వ్యక్తం చేసిన తర్వాత, “ఈ చదువంతయూ మీరు ఎప్పుడు చదివితిరి” అని కుమారస్వామి అడిగినప్పుడు మంగమ్మ అది రహస్యమనీ నీకు మాత్రమే చెబుతాను, ఎవరికీ చెప్పవద్దని చెప్పి, “ప్రతిదిన మర్ధరాత్రమున నేను ధర్మారావుగారి శిష్యురాలను. మూడవ కంటికి తెలియదు.” అని అంటుంది. మూడో కంటికి తెలియని ఈ అర్థరాత్రి విద్యాబోధనే సుదర్శనంగారికి ధర్మారావు ప్రవర్తనలో అర్థం కాని భాగమైనట్టు కనిపిస్తుంది. లోకసహజమైన దృష్టితో చూస్తే అది అసహజమే. గురు-శిష్యురాలి సంబంధానికి ఏ సమయమైనా ఒకటే నన్న భావంతో అర్థరాత్రిళ్ళు కూడా మూడోకంటికి తెలియకుండా శిష్యురాలి ఇంటికి వెళ్ళి పాఠాలకు చెప్పడం సహజమని, సంభవమని నాకు తెలియదు.రాజ్యలక్ష్మిగారు అన్నట్టు ఇక మీదట తెలుసుకునే ప్రయత్నం చేయవలసిందే.
      ‘ అర్థరాత్రమున ‘ , రహస్యముగా చేయవలసిన , చేస్తే ఫలితమిచ్చే విషయాలలో సుదర్శనం గారికి తెలియనివి ఇంకా ఉన్నాయి భాస్కరం గారూ…’ అన్న రాజ్యలక్ష్మిగారి మాటలకు వస్తే; నాకున్న జ్ఞానంతో వాటిని తాంత్రిక పద్ధతులని అర్థం చేసుకున్నాను కానీ, ఆ సూచన నవలలో కనిపించలేదు. ఎక్కడైనా ఉంటే సూచించగలరు. తాంత్రిక పూజా పద్ధతులు రహస్యంగా జరగవలసినవి కావచ్చు కానీ అవి తాంత్రిక పూజా పద్ధతులని చెప్పడంలో రచయిత రహస్యం పాటించాల్సిన అవసరం లేదు. జయదేవ్ గారూ దీనిని గమనించగలరు.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

*