అర్థాన్ని వెతికిన ప్రయాణం!

                                         Mythili

   సంతెశివర లింగణ్ణయ్య భైరప్ప గారు తెలుగువారికి బాగా పరిచయమైన కన్నడ రచయిత . నవోదయ, నవ్య, నవ్యోత్తర – ఏ కన్నడ సాహిత్య విభాగం లోనూ ఆయనను చేర్చటం వీలవదు గానీ , 2007 కు ముందు ప్రగతిశీలులందరూ ఏటవాలుగానే అయినా [ చాలా ‘ పాపులర్ ‘ రచయిత కనుక ] అక్కున చేర్చుకున్న రచయిత. ఆ ఏడు ‘ ఆవరణ ‘ నవల విడుదలయాక ‘’నవల రాయటమే రాదని ‘’ అనిపించుకున్నరచయిత కూడా . ఎవరన్నారు, ఎందు వలన అనేది చాలా పెద్ద చర్చ. మొత్తం మీద అదొక betrayal  గా తీసుకోబడింది.

బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్ లు – భైరప్ప రాసిన వంశవృక్ష, తబ్బలియు నీనదె మగనె నవలలని  సినిమాలు గా తీసుకున్నంత మాత్రాన  వారు అనుకున్నవన్నీ భైరప్ప లో అప్పటివరకూ ఉండినాయా ? ఉంటే వారు అనుకున్న పద్ధతి లోనే ఉండినాయా ?

కాకపోవచ్చు.

పరిమాణం లొనూ నేపథ్యం లోనూ మాత్రమే కాదు – తాత్వికం గా కూడా భైరప్ప గారి సరిహద్దులు పెద్దవి. ఆ సంగతి నాకు ‘ వంశవృక్ష ‘ నవల చదినప్పుడు అర్థమైంది. అందరి మాదిరే ఆ కథ ను నేను 1980 లో బాపు గారు సినిమా తీస్తేనే తెలుసుకున్నాను. మళ్ళీ వివాహం చేసుకున్న సరస్వతి [ నవలలో ఆమె పేరు కాత్యాయని ] వైపుకి మొగ్గిందన్నది స్పష్టమే. అందులో ఏమీ అన్యాయం అప్పుడు తట్టలేదు, ఇప్పుడు అంతకన్నా తట్టదు. కాని కథ లో కొన్ని ఖాళీ లు కనిపించినాయి సినిమా చూస్తుంటే. సరస్వతి ఇంటికి రాని రోజున మామ గారు ‘ చీకటి పడింది కదా, దారి తప్పి ఉంటుంది ‘ అంటాడు. అది చాలా లోతయిన వాక్యమని అప్పట్లో చెప్పుకోవటం గుర్తు.   సినిమా కథ పరం గా అది తప్పు ధోరణి.   అయినప్పుడు ఆ మాటలను అంత గంభీరం గా అనిపించటం లో ఔచిత్యం ఏముంది ? శంకరాభరణం లో వేసి జె. వి. సోమయాజులు గారు దొరికారని కాకపోతే, సినిమా లో బాపు గారు తేల్చినదానిలో    పెద్దాయన కు ఔన్నత్యాన్ని ఆపాదించేందుకు చోటు ఎక్కడ ?  ఆ పాత్ర చాలా linear గా ఉంటుంది సినిమా లో. చివరకు ‘ కనువిప్పు ‘ కలిగాకా అంతే. ఆ తర్వాత సరస్వతి కి బిడ్డలు దక్కకపోవటం ఒక విషయం. అందుకు  ఆమె అపరాధ భావనతో కృశించటం లో నాకు  అర్థమూ అగత్యమూ కనిపించలేదు.

 మరొక ఇరవై ఏళ్ళ తర్వాత – ‘ ఆ. ఎందుకులే ‘ అనుకుంటూనే చదివిన నవల నాకు మరి కొన్ని కిటికీలను తెరిచింది.

” ఇది జీవితం. ఇలాగే ఉంటుంది. ఇంత కర్కశం గా, నిర్దాక్షిణ్యం గా ఉంటుంది ” – అది రచయిత చెప్పదలచినది. ఏ పాత్రనూ సమర్థించలేదు, విమర్శించ లేదు. విభిన్నమైన ధర్మాల , కామన ల సంఘర్షణ ను చాలా నిజాయితీ గా చిత్రీకరించారు.భైరప్ప లో సర్వదా , సర్వత్రా ఒకటి కన్న ఎక్కువే దృక్కోణాలు ఉంటాయి . ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడి disillusionment  కనుక దానికి ఒక్క వైపు భాష్యమే ప్రసిద్దికెక్కింది. ఆ యేడు సితార పత్రిక అవార్డ్ లు ఇచ్చింది – వంశవృక్షం అత్యుత్తమ చిత్రం, శంకరాభరణం ద్వితీయ ఉత్తమ చిత్రం.

   భైరప్ప గారివి నేను  చదివినవి ఆరు నవలలు.  వంశవృక్ష, గృహభంగ, దాటు , పర్వ – తెలుగు లో; ఆవరణ , సార్థ ఇంగ్లీష్ లో. మొత్తం ఇరవై నాలుగింటి లో ఈ సంఖ్య కొద్దిదే. కాని అవన్నీ వేర్వేరు దశలలో రాసుకున్నవి కనుక రచయిత చేసిన ప్రయాణం ఏ మాత్రమో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ అవగాహన లో నా అంతస్సూత్రాలు పనిచేయలేదని అనను. ఎన్ని సూత్రాల అన్వయానికైనా భైరప్ప గారి సంకీర్ణత లో వీలుంది.

 ” మృత్యువు నాకు అత్యంత  సన్నిహితం గా, అతి అనివార్యమైనది గా కనిపిస్తుంది. ఆ రహస్యానికి దగ్గరవుదామనే , అన్వేషణ లో భాగం గా  తత్త్వ శాస్త్రాన్ని  అధ్యయనం చేశాను ” అని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసు లో తల్లినీ, ఇద్దరు సోదరులనూ ఒక అక్కనూ ప్లేగు వ్యాధి వల్ల పోగొట్టుకున్న నిర్వేదం , నిర్లిప్తత , భీతి – ప్రాణమున్నంత వరకూ పోవు , మరిక ఎన్నటికీ ‘ మామూలు ‘ అయేది లేదు. చిన్న పనులు చేసీ ఒకోసారి బిచ్చమెత్తీ చదువుకున్నారు. ఫిలాసఫీ లో ఎం. ఏ, ఆ తర్వాత పి. హెచ్. డి ‘ సత్యం- సౌందర్యం ‘ [Truth and Beauty ] అన్న విషయం లో. ఇటువంటి మనిషి ఏ వాదం లోనైనా ఎట్లా ఇముడుతారు ?

ఆ దుర్భరమైన బాల్యాన్నంతా ‘ గృహభంగం ‘ లో రాస్తారు. లేదు. ఏమీ నిష్కృతి లేదు. నివృత్తి లేదు. ఇచ్చేందుకు రచయితకు మనసొప్పలేదు. ప్రపంచపు మహా విషాద కృతులలో చోటు చేసుకోదగిన నవల అది – వివరించేందుకు నాకూ చేతులు రావు.

 ‘ దాటు’ లో  ఒక బ్రాహ్మణ అమ్మాయి వక్కళిగ అబ్బాయిని ప్రేమిస్తుంది. కర్ణాటక లో వక్కళిగులు ఆర్థికం గానూ రాజకీయం గానూ బలమైనవారు. ఆ వివాహం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అబ్బాయి తండ్రి కొంచెం ఊగుతాడు, అమ్మాయి తండ్రి ఒప్పుకోక పోయాక మరింకొక వివాహ పథకాన్ని వేసుకుంటాడు కొడుకుకి. అబ్బాయి

తండ్రిని ఎదిరించలేనివాడు. అమ్మాయి  తీవ్ర స్వభావ. ఆమె  తండ్రి అంత కన్నా తీవ్రుడు – ప్రతిగా తనని తను హింసించుకుంటాడు.  ఎవరికీ ఆ పల్లెటూరు వదిలిపోయేందుకు లేదు. అదీ నలుగుబాటు.

    భైరప్ప గారి నవలలో కాలం ఒక ముఖ్యమైన పాత్ర – అది సాగే కొద్దీ ప్రవృత్తులు కాస్త కాస్త గా మారుతూ ఉండటాన్ని అతి దగ్గర గా చూపించగల శక్తి ఉంది ఆయనకు.  బ్రాహ్మణుడిని    ‘ మచ్చ లేనివాడు ‘ గా ఏమీ చూపించలేదు. ఉందనే చెబుతారు, కావాలనే – అయితే అది గతం లోనే  ముగిసిపోయిన సంబంధం . అతను  గానీ ఆ నిమ్నజాతి స్త్రీ గానీ దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనో దాని వల్ల తమ జీవితాలు మారిపోవాలనో అనుకోరు. ఎందుకంటే ఆ కాలానికి అది సహజం కాదు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానమైతే ఉంటుంది ఆ తర్వాత కూడా – వారు జంతుసములు కారు. అంతకు మునుపే వచ్చిన ‘ సంస్కార ‘ లో అటువంటి సంబంధానికే ఇచ్చిన నాటకీయతను భైరప్ప గారు ఇవ్వదలచుకున్నట్లులేదు.

 పర్వ.   దీనికి చాలా ప్రశంసలు వచ్చాయి . మహా భారత ఇతిహాసాన్ని మరొక వైపునుంచి చూడటం కన్న సరదా పని ఇంకేముంటుంది ? ఇందులో గాంధారి నిస్పృహ తో కళ్ళ గంతలు కట్టుకుంటుంది. పాండురాజు ఇంచుమించు నపుంసకుడు. కుంతి అతనిని ఆకర్షించలేకపోతుంది. ఆమె శారీరకం గానూ మానసికం గానూ కూడా  ‘ పృథ ‘ – ఆమె ముందు పాండురాజు కు తను తక్కువవాడిననిపిస్తుంటుంది. మాద్రి ని డబ్బు ఇచ్చి తెచ్చుకుంటారు. పాండవులు దేవతలకు కాక హిమాలయ ప్రాంతాల లోని కొందరు ఉన్నత వ్యక్తులకు జన్మిస్తారు.

  భీమసేనుడి తండ్రి కుంతిని నిజంగా ప్రేమిస్తాడు, తన తో వచ్చేయమని బ్రతిమాలుతాడు. అతని వేదన, కుంతి నిస్సహాయత  నొప్పిస్తాయి. ధర్మరాజు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు – వీళ్ళలో రక రకాల ఛాయలు తెలుగుపౌరాణిక చలన చిత్రాలలో మనం చూసి ఉన్నవే, ఆశ్చర్యం కలిగించవు. భీముడిని మాత్రం పరిపూర్ణమైన వాడిగా , గొప్ప ప్రేమికుడిగా, మత్సరం లేని వాడి గా చూపిన తీరు నిండుగా ఉంటుంది. [ ‘ పర్వ’ భీముడి కోసం ఇంకా వెతుకుతూ భీముడే నాయకుడు గా ఎం.టి. వాసు దేవన్ నాయర్ ‘ రండా మూళ్జం ‘ వెతికి చదివాను – ఊహూ. ]

ద్రౌపదీ అర్జునుల మధ్య  అనురాగం, దాని లోని నెరసులు, విసుగులు – ఆమె మీద కక్ష తో సుభద్ర ను పెళ్ళాడితే – ద్రౌపది ముందు సుభద్ర ధూపానికి కూడా ఆగకపోవటం – గొప్ప చాతుర్యం తో రాస్తారు. అది అందం ప్రసక్తి కాదు , వ్యక్తిత్వం- ముఖ్యం గా తెలివితేటలు, ఆసక్తి కరమైన సాహచర్యం. సుభద్ర నిద్రపోతుంది అర్జునుడు మాట్లాడుతూండగానే – బుర్ర తక్కువదా అనిపించేలా [ పద్మవ్యూహాన్ని వివరించేప్పుడు సుభద్ర నిజం గానే పాపం నిద్ర పోయింది ] .

పర్వ లో గొప్ప న్యాయాన్ని చూపించింది కృష్ణుడి పాత్ర లో. నరకుడి చెర నుంచి విడిపించిన స్త్రీ లందరినీ ఆయన పెళ్ళాడిన కారణం వారికీ వారి సంతానానికీ సమాజం లో గౌరవాన్ని కల్పించాలని . ఆ కోణం భైరప్ప గారికి కనిపించటం విశేషం. అందరి తో ఒక్క రోజయినా  కృష్ణుడు గడపగలడని కాదు, అతి జాత్యుడని కాదు.

యుద్ధం – దాని భీకరత్వం, మిగిల్చే సర్వనాశనం – వీటిని అతి బిగ్గరగా వినిపించిన నవల ‘ పర్వ ‘ .అందులో ఉన్నది కేవలమైన పురాణవైరం కాదు

   నేను చదివినవాటిలో ‘ సార్థ ‘ కాలానుసారం ఆ తర్వాతది.నేను చదివిన వరస లో ఆఖరిది . వర్తకులను సార్థవాహులంటారు . వారి వెంట పంపబడిన నాగభట్టు అనే బ్రాహ్మణుడి కథ ఇది. సార్థ అన్న మాట లో  ఉన్న శ్లేష నవలంతా కనిపిస్తూనే ఉంటుంది

కథాకాలమైన ఎనిమిదవ శతాబ్దం లో వేద, జైన, బౌద్ధ మతా ల సంఘర్షణలు పతాక  స్థాయిలోకి చేరాయని రచయిత అంటారు. ఆదిశంకరుడు, కుమారిలభట్టు, మండనమిశ్రుడు, ఉభయ భారతి, రాజు అమరుకుడు – ఇందులో పాత్రలు గా వస్తారు. ఎక్కడికక్కడ న్యాయాన్ని  ప్రశ్నిస్తూ నవల నడుస్తుంది. ఎక్కడా నిలిచి stagnate  కాదు, అతి చలనశీలం గా ఉంటుంది. [ అలా రచయిత చెబుతూ ఉన్నది మనకు నచ్చుతోందా లేదా అన్నది కాదు ప్రశ్న .  ఆ ‘ నచ్చటం ‘ అనేది చాలా ప్రాథమికమైన చదువరుల లక్షణమని నేను అనుకుంటాను- ఉద్దేశపూర్వకం గా అలాగే ఉండదలచిన వారిది కూడానేమో, తెలియదు ] .

 రాజు అమరుకుడు నాగభట్టు భార్య ను కామించి అతని అడ్డు తొలగించేందుకు వర్తకుల రహస్యాలు తెలుసుకొనే మిష తో అతన్ని పంపించి వేస్తాడు. దారి లో ఎదురయిన బౌద్ధ విహారాలు. వాటిని నిర్మిస్తుండే శిల్పులలో ఒకరు నాగభట్టు తో మొర పెట్టుకుంటాడు – ‘ ఇదేమిటి ? వైదిక  దేవతల వర్ణన లకు తగినట్లు వారి దేవతల శిల్పాలు చెక్కమంటున్నారు ? ” – అని. బుద్ధుడు చెప్పివెళ్ళిన వర్ణరహిత  విరాగం లో ఎన్నెన్ని రంగులు – కొత్త కొత్త అవసరాల మేరకు చేరిపోయాయో రచయిత నిర్మొహమాటం గా రాస్తారు. ధనం, ఆధిపత్యం – వాటినే అవి ఎట్లా పెంచుకుంటూ పోతాయో

, వాటికి ఏమి పేర్లు తగిలిస్తారో కూడా.  ఒక నాటక సమాజం వారు అతని చేత కృష్ణుడి వేషం వేయిస్తారు – అక్షరాలా కృష్ణుడే అయినట్లు అతని రూపం సరిపోతుంది. అప్పుడు అతను అనుకుంటాడు – ” నిజం గా నేను అంత అందగాడినే అయితే నా భార్య రాజునెందుకు వలచింది ”- అని. ఈ ప్రశ్న ఆధునికానంతర కాలానికీ వచ్చి తగులుతుంది – అందం ఒకటీ చాలదు, అసలు ఏ ఒక్కటీ చాలకపోవచ్చు – ఎంచుతూ పోతే.

ఒక నాట్యగత్తె తో అతని స్నేహం , ఆమె దైహిక సంబంధానికి ఒప్పుకోకపోవటం – చివరికంటా నడుస్తుంది. ఒకే యోగి దగ్గర ఇద్దరూ ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఆమె మున్ముందుకు వెళుతుంది, అతను అల్ప సిద్ధులను ఉపయోగించుకోబోయి పతితుడవుతాడు. తర్వాత కాపాలికుడయే ప్రయత్నం చేస్తాడు – ప్రయాణం సాగుతూనే ఉంటుంది.

నలందా విహారం లో – బౌద్ధుల రహస్యాలు తెలుసుకుందుకు మహా పండితుడైన కుమారిల భట్టు మారు వేషం లో చేరటం చరిత్ర లో ఉన్న విషయమే. పట్టుబడిన తర్వాత ఆయన ‘ గురు ద్రోహం ‘ [ బౌద్ధాచార్యుడి పరంగా ] చేసినందుకూ ఇటువైపున  లక్ష్యం  లో విఫలుడైనందుకూ తనకి తాను శిక్ష  విధించుకుంటాడు. వడ్ల పొట్టును పేర్చి మధ్యలో నిలుచుని దానికి నిప్పు అంటించటం ఆ శిక్ష. ఆ తీక్షణత్వం భైరప్ప రచన లో  చాలా చోట్ల కనిపిస్తుంది . సనాతన ధర్మం లో దేహం ప్రధానం కాకపోవటాన్ని అలా తీసుకొస్తారో లేక  కన్నడ దేశం లో ప్రబలిన జైనుల ఆత్మహింస [self molestation]  ఛాయ లో మరి …

 ఆ సంఘటన తర్వాత , కుమారిల భట్టు చెల్లెలు భారతీ దేవి [ ఉభయ భారతి ] కి వర్తమానం చెప్పేందుకు తిరిగి  నాగభట్టు స్వదేశం వెళతాడు. ఆమె భర్త మండనమిశ్రుడు ఒకప్పుడు తనకు గురువు. వారి ఇల్లు, గృహస్థ జీవనం, విద్యాదానం, అతిథులకు సత్కారం, అభ్యాగతులకు ఆశ్రయం – ఇది జీవిత పరమ ధర్మం గా రచయిత నిరూపిస్తారు.

కాని –

కర్మ యోగానుసారి అయిన మండనమిశ్రుడు జ్ఞాన యోగాన్ని వ్యాప్తి చేసిన ఆది శంకరుల చేతిలో ఓడిపోతాడు.  గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలు దాటకుండా బ్రహ్మచారి సన్న్యాసం తీసుకోవటం వేద విరుద్ధమని మండన మిశ్రుడు వాదించినా ఉపయోగం ఉండదు. బౌద్ధులకు విరుగుడు గా శంకరులు బలపరచిన మాయా వాదాన్ని ఒప్పుకోలేకపోతాడు. మధ్యస్థం వహించిన ఉభయభారతి కామశాస్త్రం లో ప్రశ్న లు అడగటమూ శంకరులు రాజు అమరుకుడి దేహం లో ప్రవేశించటమూ – ఇక్కడ , శిష్యులు వెళ్ళి హెచ్చరిస్తే గాని ఆ దేహాన్ని వదిలి రావాలని శంకరులకు తోచదు. మాయాబద్ధులయినారు కద.

    శంకరులు యువకుడు, ఎక్కువ జవసత్త్వాలున్నాయి. మండన మిశ్రుడి శరీరానికీ బుద్ధికీ కూడా వార్థక్యం వస్తోంది – అతను ఓడిపోతాడు. అలా అని భారతీ దేవే ప్రకటించవలసి వస్తుంది. మాట ఇచ్చిన మేరకు ఆయన సన్న్యాసి అయి శంకరులకు శిష్యుడవుతాడు.ఆ తర్వాత శంకరులు ఉభయభారతి ని శృంగేరి శారదాంబ గా ‘ ప్రతిష్టించారనే ‘ ఐతిహ్యం ఉంది. ఈ నవల లో భారతీ దేవి భర్త సగం లో వదిలేసి వెళ్ళిన పనిని నిబ్బరం గా పూర్తిచేసేందుకు సిద్ధమవుతుంది, అంతే.

  అనేకమైన కారణాల వలన ఒక వాదం  ఒక చోట, ఒక సమయం లో  వీగిపోవచ్చును – గెలిచినదే సత్యం అయి తీరాలని లేదు. ఈ విషయం బాహాటం గానే ప్రకటిస్తారు  రచయిత.

   అందరూ భిక్షుకులైతే భిక్ష పెట్టేవారెవరు ? అందరూ సన్న్యాసులైతే బిడ్డలను కని ప్రపంచాన్ని నడిపించేవారెవరు ? అలా కాక కొందరికే అది వర్తిస్తుందంటే దానికి ప్రచారమూ పోటీలూ దేనికి ? మేధా శక్తి ఎక్కువ ఉన్నవారిని ఆ వంక తో లోపలికి లాగితే తమ వాదం బలపడుతుందనా ? నిర్భయం గా రచయిత వేసిన ప్రశ్నలు ఇవి.

 నవల చివర లో అరబ్ ల దండయాత్ర. బలవంతపు మత మార్పిడులు జరుగుతుంటాయి. నాగభట్టూ అతని స్నేహితురాలూ ఇద్దరూ పట్టుబడతారు . అరబ్ సేనాని నాగభట్టు తో వాదిస్తాడు. ఇతను అంటాడు – ” నేను భగవంతుడున్నాడని నమ్ముతున్నానో లేదో నాకే తెలియదు. అలా కూడా ఉండేందుకు మా ధర్మం లో వీలుంది. ఎవరూ ఎందుకూ బలవంతపెట్టరు ” అని. అరబ్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత హేళన చేస్తాడు – ” మీది అసలు మతమే కానట్లుందే ” అని.

  అవును.  అనాదిగా ఈ దేశంలో మతం లేదు – ధర్మం మాత్రమే ఉంది. బల ప్రయోగాలూ ప్రలోభపెట్టటాలూ ఇక్కడ పుట్టినవారూ బయటినుంచి వచ్చినవారూ  కూడా ఆ పిదపనే  చేసుకుపోయారు.

 ముగింపులో నాగభట్టును రక్షించేందుకు స్నేహితురాలు అరబ్ సేనానికి లోబడిపోయి  గర్భవతి అవుతుంది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఇద్దరూ తప్పించుకోగలిగి గురువు దగ్గరికి వెళతారు. గురువు వారిని   వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లో ప్రవేశించమనీ ఆ బిడ్డ ను నాగభట్టు బిడ్డ గానే పెంచమనీ ఆదేశిస్తాడు.

    సార్థ 1998 లో వచ్చింది. ఆవరణ ఆ తర్వాత తొమ్మిదేళ్ళకి వచ్చింది .

      స్వ స్తి.

*

                              

మీ మాటలు

 1. SrInivas Vuruputuri says:

  చక్కని విహంగవలోకనం!

  మీరు పేర్కొన్న నవలలలో వంశవృక్ష ఒక్కటి చదవలేదు.

  “ఆత్మహింస [self molestation] ఛాయ లో మరి …” – Self Flagellation/Self immolation అనాలా?

  కాస్సేపాగి మళ్ళీ రాస్తాను.

  • Srinivas Vuruputuri says:

   ఈ ప్రాయశ్చిత్త కాండ శంకర విజయంలోని కుమారిలభట్టు కథననుసరించినదే కానీ భైరప్ప గారి కల్పన కాదు, జైన ప్రభావంతో రూపు దిద్దుకున్నదీ కాదు.తుషానల ప్రవేశం చేసి దేహత్యాగం చేసాడని ఐతిహ్యం.

   అన్నట్లు,

   “సార్థ 1998 లో వచ్చింది. ఆవరణ ఆ తర్వాత తొమ్మిదేళ్ళకి వచ్చింది.” అనేసాక స్వస్తి చెప్పారు. రెండో భాగం రాసే ఆలోచనలో ఉన్నారా?

   • Mythili Abbaraju says:

    దాన్ని కల్పన అనటం కాదండీ నా ఉద్దేశం, ప్రముఖం గా చూపించటాన్ని గురించి అనిపించినది. సనాతనులు౼ అందరూ అనుకునే లాగా ‘హింసిస్తారు’ మాత్రమే కాదు, హింసపడతారు కూడా అని భైరప్ప గారు నొక్కి చెప్పిన దాని వెనక ఏముందా అని.. .
    లేదండీ. మరొక భాగం రాయను. అది అసంపూర్ణ విశ్లేషణే. :)

 2. ఒక రచయితని తీసుకొని ఆయన రచనలన్నీ (అన్నీ కాకపోయినా దొరికిన మేరకు) చదివి, వాటిని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని అంచనావెయ్యడం, చదివినవాటిలోని తాత్త్విక విషయాలను, సామాజిక కోణాన్ని ఆ రచయిత ఎలా ఆవిష్కరించారు, అందులో ఆయన ఎలా సఫలీకృతులయ్యారు… అన్న విషయాలను బేరీజువేయ్యడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందులో ఆ రచయిత పరభాషకు చెందినవారు. మీరు బాగా విశ్లేషించారు. లోతైన పరిశీలనా దృష్టి ఉన్నవారే మీలా చెయ్యగలరు.

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలండీ.
   ఇలాగ దేనికది విడి విడిగా కనిపించేందుకు
   ఒకానొక మహా రచయిత నవలలు చదువుకుంటే చాలు ( విమర్శ గ్రంథాల వరకూ వెళ్ళనే అక్కర్లేదు)

 3. jayasree Annineni says:

  అబ్బురం మీ విశ్లేషణ. మీరు ప్రస్తావించిన వాటిలో వంశవ్రృక్షం మరియు సంస్కార మాత్రమే చదివాను. నేను ఇంటర్లౌ వంశవ్రృక్షం చూసిన తరువాత వ్యవస్థను బట్టి అహం వస్తుందా అని నాకు సందేహం ఉండేది. ఎందుకంటే విజ్ఞానం అన్నింటినీ మించినది. వేదవేదాంగాలు, భారత రామాయణాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టిన వ్యక్తి నుండి ఆ సంకుచిత ధోరణి నాకు నచ్చలేదు.
  👌👌👌👌👌

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలండీ.
   కాదు. భైరప్ప గారు చెప్పాలనుకున్నది ఆ మాట కాదు. ఆ వైశాల్యం సినిమా లోకి రాలేదు.
   తీసిన వారి దృక్కోణం అది. వారికి అదే నిజమని తోచి ఉండచ్చు. చిక్కు ఏమిటంటే – ఏ విషయంలో నైనా ఒకే ఒక్క నిజం ఉండటం అరుదు…

 4. Suresh Venkat says:

  ఈ రచయిత కన్నడంలో వంశ వృక్ష రాసారని మాత్రమే తెలుసు.. ఆయన రచనలు ఇంత గొప్పగా ఉన్నాయని ఈ వ్యాసం ద్వారానే తెలిసింది!!. వంశ వృక్ష అంటే ఒక రకమైన చిరాకు నాకు, కానీ నవల లో రచయిత ఏ పాత్రని సమర్ధించకుండా “విభిన్నమైన ధర్మాల , కామన ల సంఘర్షణ ను చాలా నిజాయితీ గా చిత్రీకరించారు” అని తెలిసాక, ఒక సారి చదవాలి అని అనిపించింది. అంత మంచి రచయితని, ఇంత గొప్పగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండీ.

  • Mythili Abbaraju says:

   ధన్యవాదాలండీ.
   ఈ రచయిత ఇప్పుడు ఇలా చెప్పిన దాని వెనక ఆయన ప్రస్థానం ఎలా ఉందో జాడలు తీసే ప్రయత్నం చేశాను…

 5. దాటు నేను కూడా చదివాను..మనకి అర్థం కానంత మాత్రాన వ్యర్థం కాదు అనుకున్నాను…మీ సమీక్ష చదివి నాక చాలా మందికి అర్థం కానంత ఎత్తులో ఆయన రచనలు ఉన్నాయని అర్థం అయినది …గందరగోళం నుండి బయట పడవేసి నందుకు ధన్యవాదములు..మీ సునిశిత పరిశీలనా శక్తికి నమో నమః

  • Mythili Abbaraju says:

   చాలా సంతోషమండీ. భైరప్ప గారిని అర్థం చేసుకోవటానికి నామాటలు ఏమాత్రం సహకరించినా అది నాకు గొప్ప సంగతే.

 6. Srinivas Vuruputuri says:

  కొంత తాటస్థ్యం, కొంత తాదాత్మ్యం… మీ పుస్తక పరిచయం చాలా ఆసక్తికరంగా ఉండింది.

  నాకు పర్వ నవలతో భైరప్పగారి పుస్తకాలతో పరిచయం ఏర్పడింది (సాహిత్య అకాడెమీ ముద్రణ, వంశవృక్షం ఫేం – భైరప్ప పేరు చూసి కొనుక్కున్న పుస్తకం). పౌరాణిక కల్పనలను అతిశయోక్తులను ఒక్కొక్కదాన్నే నేర్పుగా దాటిస్తూ, మహాభారత కథను సంభావ్యత పరిధిలోకి తీసుకు రావటమూ, ఒక్కో అధ్యాయంలో ఒక్కో పాత్ర పరంగా కథ చెబుతూ అనేక కంఠ స్వరాలను విశ్వసనీయంగా పలికిస్తూ బిగువు చెడకుండా కథ చెప్పటమూ నన్ను ఆకట్టుకున్నాయి. ధర్మరాజును మందలిస్తున్న కృష్ణుడి నోట ఋగ్వేదంలోని ద్యూత సూక్తాన్ని ప్రస్తావింప చేయటం చూసినప్పుడు అబ్బురపడిపోయాను. ఎంత సమయ స్ఫూర్తి! సమయానికి తగు మాటలాడటం అంటే ఇదే కదా అని అనుకున్నాను.

  ఆ తరువాత, గృహభంగం – బుక్ ఫెయిర్లో యాభై రూపాయలకే దొరికింది. ఇంకోలా చెప్పేందుకు వీలు కానంత బాగా రాసారనిపించినప్పుడు రచయిత పట్ల కలిగిన సాదర భావం రెట్టింపైపోయింది, ఆ నవలలో కనబడ్డవి భైరప్పగారి బాల్యపు కన్నీటి మరకలే అని తెలుసుకున్నప్పుడు. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అంత గొప్పగా అనువదించిన “సంపత్” అంటే శంఖవరం సంపద్రాఘవాచార్యులని చెప్పారు కొలిచాల సురేశ్.

  వీలుంటే భిత్తి చదవండి – 1990ల దాకా భైరప్పగారు చెప్పుకున్న ఆత్మకథ. మీకు నచ్చుతుందనుకుంటాను.

 7. Mythili Abbaraju says:

  ధన్యవాదాలండీ.
  ‘ భిత్తి ‘ చదివే ప్రయత్నం లో ఉన్నాను.
  గొప్ప రచయితల పదార్థం ఎలాఉంటుందంటే, ఏ విమర్శ ఆకారంలోకైనా ఒదిగే లాగా. ” అది కూడా అవును, అది మాత్రమే కాక పోవచ్చును ”
  ఇది నా కొలపాత్ర రూప స్వభావాలను అనుసరించిన వ్యాఖ్య.
  మీ స్పందన ఆనందాన్నిచ్చింది.

మీ మాటలు

*