హ్యాపీ బర్త్ డే !

Artwork: Mandira Bhaduri

Artwork: Mandira Bhaduri

1

 

నాకు పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు ! శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరుపుకున్నట్టు మన జయంతి ఉత్సవాలు మనమే జరుపుకోవడానికి ఏమి సాధించామని? “నేను పుట్టానహో !” అని గొంతెత్తి అరవడానికి చేసిన ఘనకార్యమేమిటని? లోకానికి వెలుగునిచ్చే మహా మహా సూర్యుడే రోజూ సైలంటుగా వచ్చి వెళ్ళిపోతుంటాడు ! మనమెంత?

“నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావోయ్ ! ఆనందంగా ఓ రోజు సెలబ్రేట్ చేసుకోడానికి మనం పెట్టుకున్నవే ఈ పుట్టినరోజులూ పండగలూ వగైరా . పెద్ద కారణం ఉంటేనే తప్ప నేను నవ్వను అని తీర్మనించుకు కూర్చోకుండా ముందు నవ్వడం మొదలుపెడితే కారణాలు అవే పుట్టుకొస్తాయి . కాబట్టి నీ పుట్టినరోజు జరుపుకోవడంలో తప్పేమీ లేదు !” అని నాకు లెక్చర్లు పీకిన వాళ్ళు లేకపోలేదు.

వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఒకటే –  “అయ్యా, నేను నవ్వననీ అనట్లేదు, ఏడుస్తూ కూర్చుంటాననీ అనట్లేదు. నా పుట్టినరోజు నేను జరుపుకోను అంటున్నానంతే . ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నారు . నా ఆనందానికి నన్ను వదిలెయ్యొచ్చు కదా ! మీ ఆనందాలన్నీ నాపై రుద్దాలనే దుగ్ధ మీకెందుకు?”.

దాంతో “వీడికి చెప్పడం మన బుద్ధి తక్కువ !” అనుకుని జనాలు నన్ను వదిలేశారు . మా ఇంట్లో వాళ్ళతో సహా !

చిన్నప్పుడయితే పుట్టినరోజు కోసం చాలా ఆత్రంగా వేచి చూసే వాడిని . పుట్టినరోజుకి నెల రోజుల ముందే అమ్మ కొత్తబట్టలు కుట్టించడానికి టైలర్ దగ్గరకి తీసుకెళ్ళడం, పుట్టినరోజున నాన్న షాపుకి తీసుకెళ్ళి నీకు నచ్చినది కొనుక్కో అనడం, క్లాసులో చాక్లెట్లు పంచడం, స్నేహితులు (ముఖ్యంగా క్లాసులో అమ్మాయిలు!) నన్ను విష్ చెయ్యడం వగైరా విషయాలు ఎంతో థ్రిల్లింగ్ గా ఉండేవి . కానీ పెద్దవుతున్న కొద్దీ ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది . పాతికేళ్ళొచ్చాక కూడా ఇంకా పిల్లాడిలా కేక్ కట్ చేసి, కొవ్వెత్తులు ఊదుతూ ఉండడం చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇవేమీ చెయ్యను . గుడికెళ్ళి దేవుడికి –  “నన్ను పుట్టించి నువ్వు చేసిన తప్పుని మహాపరాధంగా మార్చకుండా ఉంచడానికి నా వంతు నేను చేస్తున్న ప్రయత్నానికి నీ సాయం అందించు స్వామీ!” అని ఓ దణ్ణం పెట్టుకుంటాను . తర్వాత ఓ మూల కూర్చుని, “నేను ఇన్నేళ్ళ జీవితంలో సాధించినదేమిటి, ఇక ముందు జీవితంలో అధిరోహించాల్సిన శిఖరాలేవిటి?” అని ఆలోచిస్తాను . కొంతసేపటికే తల వేడెక్కిపోతుంది ! ఇంత క్లిష్టమైన ప్రశ్నలు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిశ్చయించుకుని ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని రిలాక్స్ అవుతాను !

2

“మన పుట్టినరోజుని ఎంత మంది గుర్తుపెట్టుకుని విష్ చేస్తే మనకి అంత మంది నిజమైన స్నేహితులు ఉన్నట్టనీ, అది అదృష్టమనీ” ఓ అమ్మాయి చెప్పింది . ఈ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ రోజుల్లో గుర్తుపెట్టుకోవడం లాంటి కష్టమైన పనులని ఎవ్వరూ చెయ్యట్లేదనీ, ఫోన్లే “టింగ్” అని మెసేజ్ ఇచ్చి మరీ బర్త్ డేలు గుర్తుచేస్తున్నాయనీ ఆ అమ్మాయికి చెబుదామనుకుని ఆగిపోయాను, మరీ “అన్ రొమాంటిక్” గా ఉంటుందేమోనని ! ఎంతైనా ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. పేరు హాసినీ!  మొన్నామధ్యే మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది . పెద్దలు కుదిర్చిన సంబంధమే . తనూ నాలాగ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఓ వీకెండ్ నాడు మేము కలిసినప్పుడు ఆమె అన్న మాటలవి. “అవును, అదృష్టమే. నువ్వు నాకు దొరికినట్టు” అన్నాను. ఇలా లింకు ఉన్నా లేకున్నా పొగిడినట్టు మాట్లాడితే అమ్మాయిలకి నచ్చుతుందని నా ఫ్లాట్ మేట్ రవి సలహా ఇచ్చాడు. వాడు అమ్మాయిలని హ్యాండిల్ చెయ్యడంలో ఎక్స్పర్ట్, నేను నా ఎంగేజ్మెంట్ కి ముందు అమ్మాయిలని దూరం నుంచి చూసి ఆనందించడంతో సరిపెట్టుకున్నవాడిని !”

“హేయ్! వచ్చే నెల్లో నీ పుట్టినరోజు కదా!  సూపర్ గా పార్టీ ప్లాన్ చెయ్యాలి! రాత్రి పన్నెండింటికి నేనే  ఫస్ట్ విష్ చెయ్యాలి! రోజూలా నిద్రపోకు!“ – తను చాలా ఉత్సాహంగా చెప్పింది.

నాకసలే రాత్రి పదింటికల్లా పడుకోవడం అలవాటు. ఎవరైనా నిద్రలేపితే పరమ చిరాకు. అయినా చక్కగా సుప్రభాతం అయ్యి వెలుగొచ్చాక విష్ చెయ్యొచ్చు కదా! రాత్రికి రాత్రే, గడియారం పన్నెండు కొట్టిన వెంటనే విష్ చెయ్యాలనే వెర్రి తాపత్రయం నాకు అర్థం కాదు. ఇలా అర్థరాత్రీ అపరాత్రీ కాల్ చేసి ప్రేమాప్యాయతలూ, శుభాకాంక్షలు తెలియజేసే వాళ్ళకి వద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. అందుకే నన్ను ఎవడూ పుట్టినరోజు ముందురాత్రి కెలకడు. ఇక పార్టీలు పెట్టుకుని మరీ ఈ తంతు అంతా చెయ్యడం అంటే “బిగ్ నో!” నాకు!

కానీ ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అయిపోయింది. ఇప్పుడే ఇలాటి హెచ్చరికలు జారీ చేస్తే బెంబేలెత్తిపోతుంది. పోనీ తగ్గుదామా, ఎంతైనా కాబోయే భార్యే కదా? నో నో! పెళ్ళి అయ్యాక ఎలాగూ పెళ్ళాం ముందు హస్బెండ్  బెండ్ అవ్వక తప్పదు! కనీసం మిగిలిన ఈ కొద్ది రోజులైనా స్వేచ్ఛావాయువులు పీల్చుకోకపోతే ఎలా? ఇలా పరిపరి విధాల ఆలోచించి ప్రస్తుతానికి ఏదో దాటవేసే సమాధానంతో సరిపెడదామని నిశ్చయించాను.

“నిద్రపోవడమా! నో నో నో! అయినా నీ తలపుల్లో పడిమునకలేస్తున్న నాకు నిద్రేం పడుతుంది చెప్పు?”

హాసినీ మొహం వెలిగిపోయింది. అయినా వెంటనే –

“మరందుకేనా? రోజూ రాత్రి పదింటికే గుడ్ నైట్ చెప్పి పడుకుంటావ్. పెళ్ళి చేసుకోబోతున్న జంటలు రాత్రంతా ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటూ చందమామతో కలిసి జాగారం చెయ్యడం ఎంత బావుంటుందని?”

అమ్మో! బయటపడదు కానీ సరసురాలే! నేను తగ్గుతానా?

“అవునవును! మనలాంటి పెళ్ళి కాబోతున్న జంటలు కుదిరినప్పుడల్లా చాటుమాటుగా కలుసుకుని ముద్దులూ కౌగిలింతల్లో తేలిపోతుంటే సిగ్గుపడి చందమామ మబ్బుచాటుకి వెళ్ళిపోతున్నాడనీ విన్నాను.”

“ఓయ్! ఆగు! ఏమో అనుకున్నాను కానీ అబ్బాయిగారిలో రసికత బానే ఉందే.”

“అమ్మాయిలో రమణీయత ఉంటే అబ్బాయిలో రసికత అదే పుడుతుంది”

“ఆహా! చూస్తా చూస్తా. పెళ్ళయ్యి రెండు మూడేళ్ళు అయ్యాకా కూడా నువ్వీ మాటంటావో లేదో చూస్తా”

“చిత్తం, కాబోయే శ్రీమతి గారు!”

3

తెలివిగా నా బర్త్ డే సంగతి దాటవేశాను అనుకున్నాను కానీ హాసినీ ఏ మాత్రం మరిచిపోలేదు! ఆ రోజు తరువాత జరిగిన మా ప్రతి సంభాషణలో నా పుట్టినరోజు చోటు చేసుకునే ఉంది.  ఎంగేజ్మెంట్ అయిన మిగతా జంటలు ఏమి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారో తెలీదు కానీ, మేము మాత్రం నా పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అని ప్రణాళిక వేస్తూ చాలా గంటలు గడిపాం. అసలు పుట్టినరోజు గురించి జనాలు అంతగా ఆలోచిస్తారని నాకు అప్పుడే తెలిసింది. కేక్ ఎక్కడ కొనాలి, ఎలాంటి కేక్ కొనాలి, కేండిల్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా ఆర్పాలి, ఎలా కేక్ కట్ చెయ్యాలి… ఇలా ప్రతి విషయంలో ఇన్ని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయని నాకు అసలు తెలీదు. పుట్టినరోజు పేరు  మీద చాలా అందమైన వ్యాపారం జరుగుతోందని అర్థమైంది.

తర్వాత విషయం గిఫ్ట్! తను నాకిచ్చే మొదటి గిఫ్ట్ కాబట్టి, నాకు చాలా స్పెషల్‌గా ఉండాలి కాబట్టి ఏం ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తున్నానని చెప్పింది. “అబ్బే! మరీ అంత ఇదైపోకు. ఒక చిన్న ముద్దు ఇచ్చుకో చాలు” అని చెప్తే, “యూ నాటీ!” అని జోక్‌గా తీసుకుందే తప్ప పట్టించుకోలేదు!

అసలు ఇంత మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు. పెళ్ళికి ముందు ఏ చిన్న చిలిపిపని చెయ్యడానికి చాన్స్ ఇవ్వదాయె! అసలు మేం ఇద్దరం ఏకాంతంగా కలవకుండా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడూ మేం కలిసేది కాఫీ షాప్స్, మాల్స్ ఇలా పబ్లిక్ ప్లేసుల్లోనే. ఓ సారెప్పుడో మా ఫ్లాట్ కి వచ్చినప్పుడు కూడా తన ఫ్రెండ్ ఇంకో అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. ఆ అమ్మాయిని చూసి రవిగాడు ఫ్లాట్ అయ్యాడు కూడా. ఇప్పుడు నా ఫ్లాట్లో జరిగే నా బర్త్‌డే సెలబ్రేషన్‌లో ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందన్న ఆనందంలో వాడున్నాడు! ఇలా నా పుట్టినరోజు పేరు చెప్పుకుని లోకం సమస్తం ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే నేను శిలైన దేవుడిలా మిగిలాను!

హాసినీ నా పుట్టినరోజు గురించి చెప్పే విషయాలకి నేను శ్రోతగా ఉంటూ, “ఊ”, “అవునా” వంటి ఏకపదాలతో సమాధానం ఇస్తూ గడుపుతున్నాను. కానీ నేను చెప్పాల్సింది చెప్పక తప్పదు కదా! అప్పటికే ఏం చెప్పాలో ఆలోచించాను.  అది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లూ, తమ ప్రియురాలి ముందు, పెళ్ళాం ముందు, ఇంకా చెప్పాలంటే జీవితం ముందు వాడేదే – “ప్రాజెక్ట్ డెడ్లైన్”. జీవితం ఎంత డెడ్ అయిపోతున్నా ప్రాజెక్ట్ డెడ్లైన్ మీట్ అవ్వడం తక్షణావసరం మరి! దాని కోసం తమ జీవితాన్ని ధారపోయడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే గొప్ప త్యాగం! ఈ త్యాగం వల్ల లోకానికి ఉపయోగం ఏమిటన్న ప్రశ్న పక్కనపెడితే, త్యాగం త్యాగమే!  తిట్టుకుంటూ, తప్పదంటూ చేసే ఆ పనిని మొట్టమొదటిసారి ప్రియమైన అబద్ధంగా చెయ్యాలి నేను.

నా పుట్టినరోజుకు రెండు వారాల ముందు మొదటిసారిగా చెప్పాను తనకి.

“హనీ, (పరిచయం పెరిగాక ఇలా పేర్లు కుదిస్తే, ప్రేమ సాగదీయబడి కలకాలం వర్ధిల్లుతుందని రవిగాడి సలహా!), ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువ ఉంది. ఒక డెడ్ లైన్ కూడా ఉంది. ఆ రోజు ఎంత లేట్ అవుతుందో తెలీదు. ఎలాగూ నా పుట్టినరోజు వీకెండ్ రోజైన శనివారం వచ్చింది కాబట్టి శుక్రవారం రాత్రి కుదరకపోయినా, పక్కరోజు ఉదయం సెలబ్రేట్ చేసుకోవచ్చు!” అన్నాను, “ఉదయం” అన్న పదాన్ని నొక్కిపలుకుతూ!

“అదేంటి, అలా అంటావ్! ఎప్పుడు పన్నెండవుతుందా అని ఎదురుచూస్తూ, కదులుతున్న సెకండ్లని గుండె సవ్వళ్ళతో లెక్కెడుతూ, గడియారం ముల్లు వెంటే ప్రాణం పరిగెడుతున్నప్పుడు….ఆ ఎదురుచూపులు…ఆ థ్రిల్…అది వేరు! “

“నువ్వు కవిత్వం కూడా రాస్తావా? ముందే చెప్పుంటే నీ సంబంధం ఒప్పుకోకుండా జాగ్రత్త పడేవాణ్ణే!

“అబ్బా! విషయం అది కాదు! నువ్వు తెలివిగా తప్పించుకోకు! రాత్రే నీ బర్త్‌డే పార్టీ చెయ్యాలంతే! నైటవుట్లు చేసైనా సరే నీ ఆఫీస్ పని పూర్తిచేసుకో అప్పటికి!”

చచ్చాన్రా దేవుడా! ఈ అమ్మాయి చాలా సీరియస్‌గా తీసుకున్నట్టే ఉందే!  అయితే ఈ సారికి నా పట్టు సడలించక తప్పదా?

4

సోమవారం వచ్చేసింది! ఆ శనివారమే నా పుట్టినరోజు. ఆ శుక్రవారం రాత్రే మా ఫ్లాట్ లో బర్త్‌డే పార్టీ! నాకోసం మరీ ఎక్కువ మందిని పిలవకుండా మినహాయింపు ఇచ్చింది. నేనూ రవీ, హాసినీ, వాళ్ళ ఫ్రెండ్ మేం నలుగురమే! నా పుట్టినరోజు వాడి ప్రేమకి పుట్టినరోజు కావాలని రవిగాడు తెగ ప్రార్థనలు చేస్తున్నాడు.

నేనూ హాసినీ తాపత్రయం చూసి మెత్తబడ్డాననే చెప్పాలి! నాకు నచ్చని కేక్ కటింగ్లకీ, సెలబ్రేషన్స్ కీ  సిద్ధపడే ఉన్నాను.  తనని ఆనందపెట్టడం నా పట్టుదల కన్నా ముఖ్యం కావడం నాకే కొంత ఆశ్చర్యంగా ఉంది. ఇది నాలో మార్పో, ప్రేమో, ఏదో తెలీదు కానీ, ఏదేమైనా బావుంది!

ఇంతలో హఠాత్తుగా ఆఫీసులో అనుకోని అవాంతరం వచ్చింది – డెడ్ లైన్! కష్టమర్ కి కొత్త రిక్వయిర్మెంట్ రావడం వల్ల  కొన్ని ఫీచర్లు  తీసేసి ఈ వారమే డెలివరీ కావాలి అన్నాడు. మా కంపెనీ బిజినస్ కి క్రిటికల్ కష్టమర్ కాబట్టి, అది దాదాపు అసంభవమైన టార్గెట్ అయినా మా బాస్ సరే అనేశాడు. నేను లీడ్ కావడంతో మొత్తం బాధ్యత నాపైనే పడింది. ఇక ఆ వారం క్షణం తీరిక ఉండదని అర్థమైపోయింది.

నిజంగా తథాస్తు దేవతలు ఉంటారని తెలిసుంటే ఇంతకంటే మంచి కోరికలు కోరుకునేవాణ్ణి! కానీ నేనీ డెడ్ లైన్ కోరుకోవడంతో ఆ వారం అంతా నిద్ర మానుకుని మరీ పనిచెయ్యాల్సి వచ్చింది. హాసినీతో నా రోజూవారీ ముచ్చట్లూ కుదర్లేదు. పాపం తనూ అర్థం చేసుకుంది. ఎలాగోలా శుక్రవారం సాయంత్రానికల్లా మా రిలీజ్ అయిపోతుందన్న ఆశాభావంతో ఉంది. కానీ నాకు నిజం తెలుసు – ఎంత చెప్పుకున్నా ప్రేమికుల ఊసులూ, ఎంత పనిచేసినా ప్రాజెక్ట్ టాస్కులూ తరగవు!

శుక్రవారం ఉదయం వచ్చేసింది. అప్పటికి పరిస్థితి అంత గొప్పగా లేదు. డెవలప్మెంట్ దాదాపు అయిపోయినా ఇంకా కొన్ని బగ్స్ ఉన్నాయి. బగ్గులూ దగ్గులూ ఓ పట్టాన పోవు! నేను, మా టీంతో కలిసి ఎంత కష్టపడినా సాయంత్రం ఆరింటికి ఇంకా ఒక మేజర్ బగ్ మిగిలిపోయింది. అదొక్కటి ఫిక్స్ చేసేస్తే రిలీజ్ చేసేయ్యొచ్చు. కానీ అది “చిక్కదు దొరకదు” మోడ్ లో ఉంది. హాసినీ కి కాల్ చేసి పరిస్థితి చెప్పాను. రాత్రి పార్టీ సంగతి దేవుడెరుగు, మొత్తం వీకెండే గోవిందా అయిపోవచ్చు అని కూడా చెప్పాను!

తను చాలా నిరుత్సాహపడింది! అయినా పని సాధించే మార్గాలు వెతుకుతూనే ఉంది!

“పోనీ నేనే మీ ఆఫీస్ కి వచ్చి, కాంఫరెన్స్ రూంలో నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తే? మీ టీం కూడా రిలాక్స్ అయ్యినట్టు ఉంటుంది!”

“అసలే మా మేనేజర్ టెన్షన్‌తో చచ్చిపోతున్నాడు. మనం “హేపీబర్త్ డే” పాట పాడుకుని, కేకులు తింటూ సెలబ్రేట్ చేసుకుంటే చిర్రెత్తుకొస్తుంది ఆయనకి!”

తన వైపు నుంచి మౌనం! కొంత నెమ్మదిగా చెప్పాను –

“హనీ సారీ! మన మిడ్నైట్ సెలబ్రేషన్స్ ఇంక కుదరవులే. ఈ రాత్రి రిలీజ్ అయిపోతే వీకెండ్ జరుపుకుందాం నా పుట్టినరోజుని! సరేనా?”

“ఊ!” అంది, వినీ వినబడనట్టు. అంతలోనే గొంతెత్తి –

“కానీ రాత్రి 12 కి నేనే కాల్ చేసి విష్ చేస్తాను. నాదే మొదటి విష్ అవ్వాలి నీకు!”

నేను చిరునవ్వుతో – “సరే! సరే!” అన్నాను. నా చికాకు ఎక్కడికి పోయింది?

5

మేం అర్థరాత్రి నైట్ అవుట్ చెయ్యాల్సిన అవసరం లేకుండానే బగ్ దొరికి రాత్రి 11.30 కి రిలీజ్ పూర్తి చేశాం.  హాసినీకి చెబితే ఉత్సాహంగా ఎగిరి గంతేసి ఎక్కడో చోట నా బర్త్ డే సెలబ్రేషన్ చేద్దాం అంది కానీ, నేనే వద్దని కన్విన్స్ చేశాను. తను చాలా దూరంలో ఉంటుంది, టైం కూడా లేదు.  నా ఫ్లాట్ ఆఫీస్ కి దగ్గరే కావడంతో 11.45 కి ఇంట్లో ఉన్నాను. వెంటనే ఓ ఐదు నిమిషాల్లో షవర్ చేసి, మంచంపై నడుంవాల్చి హాసినీ కాల్ కోసం వైట్ చేస్తున్నాను. ఆ వారం అంత బాగా అలిసిపోయి ఉన్నానేమో, మొదటిసారిగా ప్రశాంతంగా అనిపించింది.

11:55…ఇంకా ఐదు నిమిషాల్లో తను కాల్ చేస్తుంది…

ప్రతి ఏడూ ఫోన్ ఆఫ్ చేసి పడుకునే నేను, చిత్రంగా తన ఫోన్ కోసం వైట్ చేస్తున్నాను! పెళ్ళి మనుషులని మార్చేస్తుంది అంటారు, అది ఎంత నిజమో తెలిసొచ్చింది. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కోసం ఒకరు సర్దుకుపోతూ ఉంటే, ఆ ఆనందం వేరు!

రింగ్ వినిపిస్తే నా ఆలోచనలనుంచీ బయటపడ్డాను. 12:00 అయినట్టుంది!

కానీ ఆశ్చర్యం! మోగింది ఫోన్ కాదు. టైం కూడా 6:15 చూపిస్తోంది. బయట తెల్లారినట్టుంది!

నాకేమయ్యిందో అర్థం కాలేదు! అంటే నిన్న రాత్రి నేను నిద్రపోయానా? బాగా అలిసిపోవడం వల్ల నిద్ర పట్టేసినట్టుంది. వెంటనే ఫోన్ లో మిస్డ్ కాల్స్ చూశాను, హాసినీ పాపం ఎన్ని సార్లు కాల్ చేసిందో అనుకుంటూ! మళ్ళీ ఆశ్చర్యం!

హాసినీ కనీసం ఒక్కసారి కూడా కాల్ చెయ్యలేదు. అదేంటి? ఇదంతా కలా నిజమా? ఈ రోజు నా పుట్టినరోజేనా? తేదీ కరెక్టుగానే చూపిస్తోందే ఫోన్‌లో!

ఇలా నేను ఆశ్చర్యపోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఇందాక నాకు మెలకువ వచ్చింది ఆ కాలింగ్ బెల్ కే అని అప్పుడు అర్థమైంది. ఇంత ఉదయాన్నే ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను.

ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నా హాసినీ! ఓ పూల బొకేతో! జీవితంలో అంత అందమైన ఉదయం ఎప్పుడూ ఎదురుకాలేదు నాకు!

“హ్యాపీ బర్త్‌డే! కాబోయే శ్రీవారూ!”

“హేయ్! హాసినీ! వాట్ ఏ సప్రైజ్! సారీ, నిన్న రాత్రి నిద్రపట్టేసింది, అయినా నువ్వు కాల్ చెయ్యలేదేంటి?”

“ఎందుకంటే నీకు రాత్రి 12 గంటలకి బర్త్డే విషస్ చెప్పడం నచ్చదు కాబట్టి!  చక్కగా తెల్లారి వెలుగొచ్చాక చెప్పొచ్చు కదా!  ఐనా చిన్నపిల్లల్లా ఇంకా కేకులు కట్ చెయ్యడం పార్టీలు చేసుకోవడం ఏంటి?” – కొంటెగా నవ్వుతూ, నన్ను అనుకరిస్తూ చెప్పింది!

చాలా ఆశ్చర్యపోయాను నేను! తనకు ఎలా తెలిసిపోయిందబ్బా!

“రెండు నెలల క్రితం నీ పుట్టినరోజు ప్లాన్ చేద్దాం అని రవిని అడిగితే, “ఆ పని అస్సలు చెయ్యకు! వాడికి నచ్చదు” అని నీ కథంతా చెప్పాడు. నాకు నీ పుట్టినరోజు సెలబ్రేట్ చెయ్యాలని చాలా ఉన్నా,  మంచి అమ్మాయిని కాబట్టి నీ ఇష్టమే నా భాగ్యం అనుకుని అడ్జస్ట్ అయిపోయాను”

నిజమే అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టమే కదా!

“కానీ నిన్ను టీజ్ చెయ్యాలనిపించింది! అందుకే కావాలని నీ బర్త్ డే సెలబ్రేషన్ చేద్దామని నిన్నడిగా. నువ్వు వద్దంటావనే అనుకున్నా!  కానీ నువ్వు నా కోసం నీ పట్టుదలని వదులుకుని మరీ ఒప్పుకున్నావ్!  ఆఫీసులో పీకలదాకా పనున్నా నా కోసం నిన్న ఎర్లీగా రావడానికి ప్రయత్నించావ్! ఎంత ఆనందం వేసిందో! అయామ్ సో లక్కీ!”

హమ్మయ్య! “డెడ్ లైన్ బతికించిందిగా!” అనుకున్నాను మనసులో! ఏదేమైనా కాబోయే పెళ్ళాం మనసు దోచుకోవడం, తనని ఆనందపెట్టడం నాకూ ఆనందమే! ఇంత చక్కని సరదా అమ్మాయి ఎంత మందికి దొరుకుతుంది?

“హనీ! నేను అసలు లక్కీ, నువ్వు కాదు! పార్టీలేవీ చెయ్యకుండానే నా జీవితంలో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్న పుట్టినరోజు ఇదే! నాకు వచ్చిన బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ కూడా నువ్వే! ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? మరీ మొదటిముద్దు పాచిమొహంతో పెడితే ఏం బావుంటుందని ఆగాను కానీ…”

“ఏయ్!” అంటూ తను నా గుండెలపై ఒదిగిపోయింది ప్రేమగా!

*

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. ప్రసాద్ చరసాల says:

    చక్కటి కథనం. చివరిదాకా ఉత్కంఠతో చదివించింది.

  2. Yashwanth Ponugoti says:

    ఒక్క మాటలో చెప్పాలంటే మధురమైన కథ.

  3. Chala bagundandi. Kadha aasantham aahlaadangaa haayigaa undi.

  4. Sivalakshmi says:

    “నాకు పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు ! శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరుపుకున్నట్టు మన జయంతి ఉత్సవాలు మనమే జరుపుకోవడానికి ఏమి సాధించామని? “నేను పుట్టానహో !” అని గొంతెత్తి అరవడానికి చేసిన ఘనకార్యమేమిటని? లోకానికి వెలుగునిచ్చే మహా మహా సూర్యుడే రోజూ సైలంటుగా వచ్చి వెళ్ళిపోతుంటాడు ! మనమెంత?”
    ఈ వాక్యాలు నిజం,చాలా నచ్చాయండీ! కథనం కన్విన్సింగ్ గా ఉంది. అభినందనలు!

Leave a Reply to Sivalakshmi Cancel reply

*