హస్తినలో తెలుగు పూల వనం!

delhi3

ఢిల్లీ ఒక నగరంగా అవతరించి ఎంత కాలమయిందీ?!

చరిత్రకారులు వెయ్యేళ్ళంటారు.

ఐతిహాసికులు ఐదువేల ఏళ్ళనాటి పాండవుల ఇంద్రప్రస్థం ఇదేనంటారు.

ఢిల్లోలో తెలుగు వారి ఉనికి ఎపట్నించీ?

అంతకు ముందటి సంగతి ఎలా ఉన్నా – పదిహేడో శతాబ్దపు జగన్నాథ పండితరాయలు జహంగీర్, షాజహాన్ల ఆదరణలో ఉన్నాడనీ, ఢిల్లీలో నివసించాడనీ, సంస్కృత కవి అనీ, విమర్శా గ్రంథం వ్రాసిన పండితుడని – చరిత్ర చెపుతోంది. కోనసీమలోని ముంగండ (మునిఖండ) అగ్రహారానికి చెందిన ఆయన కవిత్వపు తునకలు మనకిపుడు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. సినిమానుకరణకు గురి అయిన ఆయన జీవిత చరిత్ర 1946 నాటి ‘లవంగి’ అన్న తమిళ చిత్రంలో కనిపిస్తుంది. 50లూ, 60ల నాటి హిందీ సినిమాలలోనూ; మరాఠీ నాటకాలలోనూ ఆయన ఉనికి భద్రపరచబడి ఉంది.

***

ఇరవయ్యో శతాబ్దపు తొలి సంవత్సరాల నాటికి – 1739 నాటి నాదిర్షా ఊచకోతలూ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటులాంటి ఘటనలతో చితికిపోయిన ఢిల్లీ నగరపు జనాభా – నాలుగంటే నాలుగే లక్షలు. అందులో తెలుగువాళ్ళు ఉన్నారా? ఓ పదీ పాతికమంది వ్యాపారులు ఉండి ఉండవచ్చు.

1931 దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారినప్పుడు ఆ నగరం జనాభా ఆరు లక్షలు. 1947 నాటికది పన్నెండయ్యింది. 2016 కల్లా అది కోటీ తొంభై లక్షలకి చేరింది. అందులో తెలుగువాళ్ళ సంఖ్య ఎనిమిది లక్షలు అని ఒక అంచనా.

స్వాంతంత్ర్యానికి ముందే నెలకొన్న పార్లమెంటు వ్యవస్థలో భాగంగా ఆచార్య రంగా లాంటి వారు ఢిల్లీలో నివసించడమన్నది సమీస చరిత్రకు చెందిన వివరం. వేలూ, పదివేలల్లో కాకపోయినా, కనీసం కొన్ని వందలమంది తెలుగువారైనా ఢిల్లీలో నివాసముండి ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చాక అది వేలల్లోకి చేరింది. క్రమక్రమంగా అది లక్షలయింది. ప్రస్తుతానికి ఎనిమిది లక్షలకు చేరింది.

ఈ ఎనిమిది లక్షల్లో రాజకీయ జీవితం కోసం వచ్చిన వారున్నారు. ఉద్యోగ రీత్యా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వ్యాపారంలో స్థిరపడ్డవాళ్ళూ చాలామంది ఉన్నారు. జెఎన్‌యూ లాంటి విద్యాసంస్థలు పిలవగా వచ్చిన వాళ్ళూ ఉన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన రెండో, మూడో తరం వాళ్ళూ ఉన్నారు. ఉద్యోగ వ్యాపారాలలో క్రియాశీలకంగా ఉండే వయసు దాటినా – ప్రదేశం నచ్చడం వల్లనో, ఇతరేతర కారణాల వల్లనో జీవితాంతం వరకూ ఇక్కడే ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు.

***

ఢిల్లీ తెలుగువాళ్ళ సాంఘిక, సాంస్కృతిక జీవనం సంగతేమిటీ?

వందలూ, వేలల్లో తెలుగువాళ్ళు ఢిల్లీలో నివసించడం మొదలెట్టాక సహజంగానే వాళ్ళు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసారు, వాళ్ళను దగ్గరకు చేర్చే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అలాంటి ప్రయత్నాల భౌతిక రూపం 1935లో ఆచార్య రంగా లాంటి వాళ్ళ పూనికతో మొదలయిన ‘ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ’.

తమ తమ పిల్లలకు తెలుగు చదువు అందుబాటులో ఉండాలన్న తపనతో, దుర్గాబాయి దేశ్‌ముఖ్ పట్టుదలతో, 1948లో ‘ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఏర్పడింది.

ఆ తర్వాత పాపులర్ ఫిలిం సొసైటీలు, తెలుగు అకాడమీలు, తెలుగు సంఘాలు ఎన్నెన్నో వచ్చాయి. మహానగరం గాబట్టి విభిన్న ప్రాంతాల్లోని వేలాది తెలుగువాళ్ళు వారి వారి ప్రాంతాల్లో పండగలూ పబ్బాలకు దగ్గరవడం సహజమయిపోయింది.

***

తెలుగు సాహిత్యం సంగతేమిటీ?!

మూడు నాలుగు శతాబ్దాల నాటి పండితరాయల గురించి చెప్పుకొన్నాం. అది గతం. అది సంస్కృతం.

ఎనిమిది లక్షల తెలుగు వాళ్ళలో తెలుగు సాహిత్యంలో, సాహితీ సృజనలో ప్రవేశం ఉన్నవాళ్ళు, రచనా శక్తి ఉన్నవాళ్ళూ ఓ పదిహేనూ ఇరవై మంది….

సీరియస్ సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవారు నాకు తెలిసి – ఢిల్లీలో – ఓ వందమంది ఉన్నారు. నాకు తెలియని వాళ్ళూ, పది మంది దృష్టికీ రానివాళ్ళు మరో ఏడెనిమిది వందల మంది ఉండి ఉంటారు. ‘సీరియస్ సాహిత్యం’ అన్న మడి కట్టుకోకుండా స్వాతి నుంచి సులోచనారాణి వరకూ ఏ పుస్తకాన్నైనా ప్రేమగా చదివేవాళ్లు మరో పదివేలు ఉంటారని అంచనా.

సాహితీప్రియులు ఢిల్లీలో సంఘటితం అవడం అన్నది 1960ల ఆరంభంలో మొదలయింది.

దామోదరం సంజీవయ్య  – భారతదేశపు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి – 1962 నుంచి కాంగ్రెసు అధ్యక్షుడిగానూ, కేంద్రమంత్రిగానూ – చాలాకాలం ఢిల్లీలో గడిపారు. సంగీత సాహిత్యాలు ఆయనకు ఎంతో ఇష్టమైనవి. ఆయన పూనికతోనే అనుకుంటాను – ‘తెలుగు సాహితి’ అన్న సంస్థ ఢిల్లీలో 1962 – 63 ప్రాంతాల్లో ఆవిర్భవించింది.

వాకాటి పాండురంగారావు, మహీధర నళినీమోహనరావు, కొత్తపల్లి వీరభద్రరావు, వాడ్రేవు పతంజలి, క్రొవ్విడి లక్షన్న, వీ. ఆంజనేయ శర్మ, గంటి జోగి సోమయాజులు, రామవరపు గణేశ్వరరావు, తలశిల రామచంద్రరావు… వీరంతా నెలనెలా తెలుగు సాహితి గొడుగు నీడన సంజీవయ్య గారి జనపథ్ నివాసపు పచ్చికబయళ్ళలో కలుసుకోవడం మొదలయింది. తాము తాము రాసినవి చదివి చర్చించుకోవడం, కృష్ణశాస్త్రి, విశ్వనాథ లాంటి వాళ్ళు ఢిల్లీ వచ్చినపుడు వాళ్ళతో సమావేశమవడం – ఓ పదేళ్ళపాటు చురుగ్గా సాగింది.

బలివాడ కాంతారావు, ఉషారాణి భాటియా, అబ్బూరి వరద రాజేశ్వరరావు, అబ్బూరి ఛాయాదేవి, వారితో పాటు తన చివరి రోజుల్లో అబ్బూరి రామకృష్ణారావు ఆ రోజుల్లోనే ఢిల్లీలో ఉన్నారు. అంతకుముందు ఉన్న పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఢిల్లీ నేపథ్యంతో కొన్ని కథలు రాసారు. వాకాటి కథల్లోనూ ఢిల్లీ ఛాయలు కనిపిస్తాయి. బలివాడ ఏకంగా ఢిల్లీ మజిలీ కథలు అంటూ బోలెడు కథలు రాసారు. వాడ్రేవు పతంజలి తన పూనికతో కొన్ని తెలుగు కథలను ఇంగ్లీషులోకి తీసుకువచ్చి స్థానిక ప్రచురణకర్తలు ‘జైకో’ వారితో ప్రచురింప చేసారు… 1973లో గాబోలు – చిన్న వయసులోనే వెళ్ళిపోయిన సంజీవయ్య స్మారక ఉపన్యాసం ఆరుద్ర వచ్చి చేశారు… పుట్టీ పుట్టగానే పరుగులు పెట్టగల ‘కలసి వచ్చిన’ కాలమది – తెలుగు సాహిత్యానికి.

***

ఢిల్లీలో 1969లో స్థాపించబడిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ – జెఎన్‌యూ – పదేళ్ళు తిరిగే లోగా ఒక విలక్షణ విద్యాసంస్థగా రూపొందింది. పాలగుమ్మి సాయినాథ్ లాంటి పాత్రికేయులకీ, సీతారాం ఏచూరి లాంటి దేశనాయకులకూ పుట్టిల్లు అయింది.

ఆ కుదురుకు చెందిన మనిషే టంకశాల అశోక్.

’80ల ఆరంభంలో జంపన, బిబిజి తిలక్ లాంటి సహ విద్యార్థులతో కలసి ‘ప్రగతి సాహితి’ అన్న సంస్థ స్థాపించారు అశోక్. గద్దరు, శ్రీశ్రీ, వరవరరావు లాంటి కవులను ఆ యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్’కు పిలిచి సమావేశాలు ఏర్పాటు చేశారు. 1977 నుంచి ’84 వరకూ ఆలిండియా రేడియోలో వార్తలు చదివిన పి. చలపతిరావు – సాహితీ రంగంలో ‘శ్రీపతి’ – ఈ ప్రయత్నాలకు తనవంతు సహకారం అందించారు. రామవరపు గణేశ్వరరావు కూడా ఓ చెయ్యి వేయగా ‘ప్రగతి సాహితి’ – కొడవటిగంటి కుటుంబరావు మీద ఆయన పోయినపుడు ప్రామాణికమైన వ్యాసాలతో ఓ పుస్తకం తీసుకువచ్చింది. అతి చక్కని సంస్మరణ సభనూ జరిపింది. అలాగే బాలగోపాల్, చాగంటి తులసి లాంటి వారితో సమావేశాలు ఏర్పాటు చేసింది. గద్దర్ పాటల కార్యక్రమాన్ని ఢిల్లీ నగరంలో ఆరేడు చోట్ల నిర్వహించింది.

***

delhi1

సంజీవయ్య అకాల నిష్క్రమణ, వాకాటి లాంటి వాళ్ళు తిరిగి ఆంధ్ర దేశానికి వెళ్ళిపోవడం లాంటి పరిణామాల వల్ల ‘తెలుగు సాహితి’ కార్యకలాపాలు ఓ దశాబ్దం పాటు సన్నబడ్డాయి. మళ్ళా 1982లో గణేశ్వరరావు, నళినీమోహనరావు, ఇలపావులూరి పాండురంగారావు లాంటివాళ్ళ పూనికతో; వేమరాజు భానుమూర్తి, శిష్ట్లా లక్ష్మీపతిశాస్త్రి, జె. లక్ష్మీ రెడ్డి, గూడూరి ఆదినారాయణ శాస్త్రి లాంటి వాళ్ళ సహకారంతో ‘తెలుగు సాహితి’ పునరుజ్జీవం పొంది మరో ఇరవై ఏళ్ళపాటు ఎంతో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగించింది.

ఈ ఎనభైలలోనే ఢిల్లీ సాహితీ రంగంలో ఇద్దరు విలక్షణ వ్యక్తులు తమ కార్యకలాపాలు ఆరంభించారు. వాడ్రేవు పాండురంగారావు గారు అందులో మొదటి వ్యక్తి.

టెలిఫోన్ డిపార్టుమెంట్‌లో చిరుద్యోగిగా జీవితంలోకి అడుగుపెట్టి, స్వశక్తితో ఆంధ్రా యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో ఎమ్మే చేసి, ఆర్కే నారాయణ్ మీద పీహెచ్‌డీ ముగించి, ఢిల్లీ లోని వెంకటేశ్వర కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన మనిషి రంగారావు. పాఠాలు చెప్పడంతో పాటు ఇంగ్లీషులో వ్యాసాలు, కథలు రాయడం మొదలుపెట్టారు. ఆర్కే నారాయణ్, కుష్వంత్ సింగ్ లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొన్నారు. తన కథల సంపుటిని ‘రవి దయాళ్’ సంస్థ ద్వారా ప్రచురించారు. పెంగ్విన్ వారు భారతదేశంలో తమ కార్యకలాపాలను ఆరంభించి మొదట విడతగా 1987లో ప్రచురించిన నాలుగు నవలలలో రంగారావు గారి ‘ఫౌల్ ఫిల్చర్’ (దొంగ కోళ్ళు – అనవచ్చు) ఒకటి. అతి చక్కని ఆంగ్లంలో రాసిన పరిపూర్ణమైన తెలుగు నవల ఇది.

రెండో మనిషి సుప్రసిద్ధ అనువాదకులు జె. లక్ష్మీరెడ్డి.

ఎక్కడో కడప జిల్లా జమ్మలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి ఒక హిందీ టీచరుగారి ప్రేరణతో ఆ భాషను ప్రేమించి, శాంతినికేతన్‌లో చదువుకొని, సాగర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఢిల్లీ లోని హిందీ పిల్లలకు నలభై ఏళ్ళపాటు దయాళ్ సింగ్ కాలేజీలో హిందీ పాఠాలు చెప్పారు!! జ్ఞానపీఠ్ సంస్థ కోసం విశ్వనాథ, బలివాడ రచనలను అనువదించడంతో ఆరంభమైన ఆయన కార్యకలాపం కాలక్రమేణా విస్తరించింది. వాసిరెడ్డి సీతాదేవి, కేశవరెడ్డి, ఓల్గా, పెద్దింటి అశోక్‍కుమార్ లాంటి అనేకానేకుల రచనలను హిందీలోకి అనువదించారు, అనువదిస్తున్నారు. ఆ సాహితీ యాత్రలో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాదపు ఎవార్డు రావడమన్నది సహజ పరిణామం.

***

రంగారావు ఆంగ్ల రచనలతో పాటు తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించే పని మొదలుపెట్టినప్పుడు అనుకోకుండా ఓ ‘సాహితీ వేదిక’ కు పునాది పడింది.

దాసరి అమరేంద్రా, లక్ష్మీరెడ్డి ఆ యజ్ఞంలో పాలుపంచుకోసాగారు. లియోసా సంపత్ కుమార్, కథకులు తోలేటి జగన్మోహనరావు వచ్చి కలిసారు. రంగారావు గారి రెండేళ్ళ కృషి “క్లాసిక్ తెలుగు షార్ట్ స్టోరీస్” అన్న రూపాన పెంగ్విన్ వారి ద్వారా 1995లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మరో మూడు నాలుగేళ్ళకు అదే పెంగ్విన్ వారి ద్వారా రంగారావు గారు “దట్ మాన్ ఆన్ ది రోడ్ అండ్ అదర్ స్టోరీస్” అన్న మరో సమకాలీన తెలుగు కథల ఆంగ్ల అనువాద సంపుటిని వెలువరించారు. అప్పటికీ, ఇప్పటికీ తెలుగులోంచి ఇంగ్లీషులోకి కథలను పంపే ప్రయత్నాలలో ఇవి అగ్రగణ్యాలని నా అభిప్రాయం. అదే ఉరవడిలో మేమంతా కలసి సాహిత్య ఎకాడమీ వాళ్ళ ద్వైమాసిక ‘ఇండియన్ లిటరేచర్’ ఓ సంచికను తెలుగు ప్రత్యేక సంచికగా తీసుకువచ్చాం.

కథల అనువాదాల ప్రయత్నంలో తరచుగా కలుసుకొన్న మా మధ్య ఓ చక్కని సాహితీ బంధం ఏర్పడిపోయింది. ‘మన కలయికకు ఓ స్థిరరూపం ఇవ్వాలి’ అన్న ఆలోచన కలిగి ‘సాహితీ వేదిక’ అనే పేరు పెట్టుకొన్నాం. నెలనెలా తలా ఒకరి ఇంట్లో ఓ ఆదివారమంతా కలసి సాహితీపరమైన కబుర్లు, చర్చలు, పఠనాలు, వాదోపవాదాలతో గడపడం మొదలయింది. ఐఐటీలో ఉండే కల్లూరి శ్యామల, ఐఐఎస్ లైబ్రరీలో పని చేసే విజయామూర్తి, కథకులు వీవీబీ రామారావు, అప్పట్లో ఢిల్లీలో ఉన్న తాళ్ళపల్లి మురళీధర గౌడ్, సంగీతంతో పాటు సాహిత్యంలోనూ ఆసక్తి ఉన్న కాళీపట్నపు వసంతలక్ష్మి, సాహితీ ప్రియులు కోటిరెడ్డి, భూషి పూర్ణకుమార్ దాస్, కె. సుజాత – పదిహేను, ఇరవై మంది నిలకడగా, నెలనెలా కలిసిన వేదిక అది. మా చర్చలతో పాటు ఢిల్లీకి వచ్చిన ఓల్గా, అద్దేపల్లి రామమోహనరావు, రావూరి భరద్వాజ, గోపి, భరాగో, మధురాంతకం రాజారాం, గుంటూరు శేషేంద్రశర్మ, అజంతా – వీరందరితో ఇష్టాగోష్ఠులు.

***

1995 చలం శత జయంతి సంవత్సరం.

ఆంధ్రదేశమంతటా ఊరు ఊరునా 1994-95లలో ఆ ఉత్సవాలు జరిగాయి.

చలాన్ని విపరీతంగా అభిమానించే శ్రీపతికి ఒక సభ ఢిల్లీలో జరపాలన్నది గాఢ వాంఛ. ఓ దశాబ్దం ముందటివరకూ ఢిల్లీలో ఉండి వెళ్ళడం వలన ఆయనకు అప్పటి పరిచయాలు సజీవంగా మిగిలి ఉన్నాయి. ‘తెలుగు సాహితి’ సారధి రామవరపు గణేశ్వరరావును కూడగట్టుకొన్నారు. ‘సాహితీ వేదిక’ ఆధారపీఠమయింది. ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులను ఒప్పించి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. ఆంధ్రదేశం నుంచి మహీధర రామమోహనరావు, వావిలాల సుబ్బారావు, అంపశయ్య నవీన్, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, యాకూబ్, కుప్పిలి పద్మ లాంటి వారిని ఢిల్లీకి తరలించారు. అప్పట్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న వి.ఎస్. రమాదేవి గారి సహాయ సహకారాలు సంపాదించారు…

సభ దిగ్విజయంగా జరిగింది. ఎవరూ ఆశించని రీతిలో అయిదు వందలమంది సభికులతో సభ కళకళలాడింది. అతి చక్కని ప్రసంగాలతో చలం జ్ఞాపకాల పరిమళాలు సభను ముంచెత్తాయి. ‘ఢిల్లీ నగరంలో చలం లాంటి సీరియస్ రచయితల మీద ఇన్ని వందల మందికి ఆసక్తి ఉందా?!’ అని మేమే ఆశ్చర్యపడిపోయాం.

చలం సభ స్ఫూర్తితో సాహితీ వేదికలో ఉత్సాహం పెరిగింది. మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్న తపన మొదలయింది. ఆ తపనలోంచి ‘కథా సదస్సు’ అవతరించింది.

‘కథా సాహితి’ పేరిట నవీన్ – శివశంకర్‌లు అప్పటికి ఆరేడు ఏళ్ళుగా వార్షిక కథా సంకలనాలు తీసుకురావడం, ఆ ప్రయత్నం సాహితీలోకంలో చిరు సంచలనం కలిగించడం గమనించిన మేము ‘కథ 1996’ ను ఢిల్లీలో ఆవిష్కరించాలన్న ప్రతిపాదన పెట్టాం. ‘కథా సాహితి’ అంగీకరించింది. తెలుగు సాహితి ఢిల్లీ వారిని అడిగితే వారూ కలసివచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ ఆర్థిక వనరులు అందించింది. ఇండియన్ లిటరేచర్ సంపాదకులూ, మళయాళ కవీ కె. సచ్చిదానందన్ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అంగీకరించారు…

… అక్టోబరు 1997లో జరిగిందా ఏడెనిమిది గంటల కార్యక్రమం. రోజంతా కథా సదస్సు, కార్యక్రమానికి కలికి తురాయిగా చివర్లో ‘కథ 96’  ఆవిష్కరణ.

కాళీపట్నం రామారావు గారి దగ్గర్నించి కె. శివారెడ్డి దాకా, నవీన్ – శివశంకర్ దగ్గర్నించి దేవీప్రియ దాకా, వారితో పాటుగా వాకాటి పాండురంగారావు గారూ – అత్యంత అర్థవంతంగా జరిగిన సదస్సు. వస్తు విస్తృతీ, గాఢతా, ప్రసంగాల పరిణతిల దృష్ట్యా చూస్తే అది ఢిల్లీ సాహితీ గగనంలో ఒక మెరుపుతీగ అని చెప్పవచ్చు.

1998లో సాహితీ వేదిక కవితా సదస్సు నిర్వహించింది.

వజ్రాయుధం సోమ సుందర్ ఒక వేపూ, దళిత ధిక్కార స్వరపు కత్తి పద్మారావు ఇంకోవేపూ, యువ పరిణిత గళం వాడ్రేవు చినవీరభద్రుడు మరోవేపు – అదో జలపాత ఝరి.  ఆ తర్వాత నవలా సదస్సు..

***

సభలూ, సమావేశాలు సరే – సాహితీ సృజన సంగతేమిటీ?

పురాణం, వాకాటి, బలివాడ, వాడ్రేవు పతంజలి లాంటి వాళ్ళు తాము ఢిల్లీలో ఉన్న కాలంలో చేసిన సాహితీ సృజన గురించి చెప్పుకొన్నాం. అదే బాణీలో అబ్బూరి ఛాయాదేవి, శ్రీపతి, టంకశాల అశోక్‌ల గురించీ చెప్పుకోవాలి. వాళ్ళ ఢిల్లీ జీవిత నేపథ్యాలు వాళ్ళ కథలల్లోనూ, కవితల్లోనూ కనిపిస్తాయి.

ఢిల్లీలో జీవితకాలం గడిపిన సాహితీకారుల ప్రస్తావన ఇంతకుముందు వచ్చింది. వాడ్రేవు పాండురంగారావు, జె. లక్ష్మీరెడ్డి గార్ల సాహితీ వ్యాసంగం గురించి చెప్పుకొన్నాం.

ఆ కోవకు చెందిన – 70లు, 80లలో సాహితీ సృజన చేసిన మరికొందరు గురించీ చెప్పుకోవాలి: ఇలపావులూరి పాండురంగారావు, మహీధర నళినీమోహనరావు, ఉషారాణి భాటియా అందులో ముఖ్యులు.

ఇలపావులూరి ధార్మిక సాహితీకారులు. బహుభాషావేత్త. సంస్కృత పండితులు. అనువాదకులు. ‘వాల్మీకి’ మోనోగ్రాఫ్ రాసారు. ‘రామాయణంలో స్త్రీ పాత్రల’ గురించి రాసారు. ‘కామాయని’ గ్రంథాన్ని హిందీలోంచి తెలుగులోకి అనువదించారు. ‘రామాయణ పరమార్థం’ గురించి రాశారు. ‘అనువాద కళ’ వివరించారు. భారతీయ కవిత్వం గురించి, పోతన గురించి, ఉపనిషత్తుల గురించి, గురజాడ గురించి, యాజ్ఞవల్కుని గురించి, స్వాతంత్ర్యోద్యమ గీతాల గురించి – సుమారు నలభై ఏళ్ళ సాహితీ జీవనంలో నలభైకు పైగా పుస్తకాలు రాసారు. దాదాపు ఏభై ఏళ్ళు ఢిల్లీలో గడిపారు.

మహీధర నళినీమోహనరావు భౌతిక శాస్త్రవేత్త. పాపులర్ సైన్సులో అనేకానేక రచనలు చేసారు. ‘భూదేవి బొమ్మ’ గీసారు. ‘కాలెండర్ కథ’ రాసారు. వేలాది సైన్సు వ్యాసాలు రాసారు. 60లు, 70లలో విద్యార్థుల ఆరాధ్య దైవమాయన. ఆయన సాహితీ జీవితంలో – పదిమందికీ తెలియని మరో విలక్షణ కోణముంది.  ఆయన సంస్కృత పండితుడు, కవీ, గ్రంథకర్త!!

ఉషారాణి భాటియా చలం, కొడవటిగంటిల కుటుంబాలకు చెందిన వ్యక్తి. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ తెలుగు విభాగపు సంపాదకులుగా ఢిల్లీలో చాలాకాలం గడిపారు. సహచరుడు భాటియా గారి పేరును – అది తెలుగు పేరే అన్నంతగా – పాఠకులకు చిరపరిచితం చేసారు. తన రచనలతో ఆనాటి తరం పాఠకులను ఆకట్టుకొన్నారు. ముందువరుస రచయిత్రులలో తనకూ ఓ ఉనికిని సంపాదించుకోగలిగారు.

సాహితీ వేదిక తన కార్యకలాపాలను ఆరంభించిన 1990లలో అందులో సభ్యులుగా ఉంటూ తమదైన రచనలతో రాణించిన వ్యక్తులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అందులో అగ్రగణ్యులు తోలేటి జగన్మోహనరావు.

కేంద్ర ప్రభుత్వపు సెక్రెటేరియల్ సర్వీసెస్ ఉద్యోగిగా దశాబ్దాల పాటు తోలేటి ఢిల్లీలో గడిపారు.  70ల నుంచీ కథలు రాసారు. హాస్యమూ, వ్యంగ్యమూ, సామాజిక ఆవేదనా సరిపాళ్ళలో మేళవించి పాఠకులలో అనేకానేక భావాలు ఒకేసారి కలిగేలా కథలు చెప్పడంలో తోలేటి మహానేర్పరి. కథా శిల్పాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొన్న అతికొద్దిమంది రచయితలలో తోలేటి ఒకరు.

‘లియోసా’ అన్న చైనా నేపథ్యపు కథతో కథా సాహిత్య లోకంలో 1990లలో చిరు ప్రకంపనలూ, చాలా ఆశలు కలిగించిన డాక్టర్ సంపత్ కుమార్ 70ల చివరి సంవత్సరాలలో జెఎన్‌యూలో పిహెచ్‌డీ కోసం ఢిల్లీ వచ్చి అప్పట్నించి ఇక్కడే ఉండిపోయిన వ్యక్తి. సమాజ సంక్షేమ కార్యకలాపాలనే వృత్తిగా ఎంచుకొని ఢిల్లీలో ఎన్‌జీవోలలో పనిచేసారు. కెనడియన్ హైకమీషన్‌లో అదే పని మీద మూడు దశాబ్దాలు దాటి ఉన్నారు. తన వృత్తిపరపు అనుభావాలను కథలుగా, ‘నానీ’లుగా మలిచారు. కంబోడియా ఘటనల గురించి ‘అనగనగా ఒక దేశం’ కథ రాసారు. జెఎన్‌యూ అనుభవంతో ఈశాన్య భారతపు నేపథ్యంతో ‘ఠించెన్’ అన్న కథా రాసారు. రెండు కథా సంపుటాలు, ఒక నానీల పుస్తకం, అనేకానేక వ్యాసాలు వెలువరించారు.

1975 నుంచి ఢిల్లీలో ఉన్న దాసరి అమరేంద్ర రచనా వ్యాసంగం 1990లలో విరివిగా సాగింది. కథలు, కవితలు, వ్యాసాలు, రూపకాలు, ఇంటర్వ్యూలు, యాత్రాగాథలు, అనువాదాలు… పరిపరి విధాలుగా సాగిన ప్రక్రియ అది. ఓ కథా సంపుటం, రెండు యాత్రా గ్రంథాలు, ఓ వ్యాస సంకలనం, ఓ సాహితీ కదంబం – అంతా కలసి గత ఇరవై పాతికేళ్ళలో పది పుస్తకాలు ప్రచురించారు. ఢిల్లీ నగరానికి – బెంగుళూరు, పూణె నగరాలకు తెలుగు సాహిత్యంతోను, తెలుగు రచయితలతోనూ గాఢమైన అనుబంధం ఏర్పడడం విషయంలో విశేష కృషి చేసారు.

రామవరపు గణేశ్వరరావు ఆంగ్ల అధ్యాపకులు. అరుదుగానే రాసే రచయిత. ‘త్రిశంకుని మీద తిరుగుబాటు’ లాంటి విలక్షణమైన కథలు రాసారు. రామవరపు శాంత సుందరి తెలుగు సాహిత్యాన్ని హిందీ పాఠకులకు అందించడం విషయంలో ఎడతెగని కృషి చేసారు. ఈ మధ్యనే అనువాద రంగంలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు.

delhi2

ఏల్చూరి మురళీధరరావు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వెంకటేశ్వర కళాశాలలో తెలుగు ఆచార్యులు. కవిపుత్రులు. స్వయానా పండితులు. సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులు. ప్రాచీన సాహిత్య వ్యాఖ్యాత, విశ్లేషకులు. భాగవతం మీద బృహత్ గ్రంథ రూపకల్పనలో ఉన్నారు. అనర్గళ వక్త.

కందుకూరి మహాలక్ష్మి ఢిల్లీతో దశాబ్దాలుగా ముడిపడిన మరో వ్యక్తి. 70ల నుంచీ కథలు రాసారు, కథా సంపుటాలు తెచ్చారు. ‘వనిత’ లాంటి పత్రికలకు ఢిల్లీ ప్రతినిధిగా వ్యవహరించారు. ఢిల్లీ తెలుగు సాహితి కార్యక్రమాల నిర్వహణలో చురుకైన పాత్ర ధరించారు.

మెడికో శ్యాం దశాబ్దాల పాటు ఢిల్లీలో ఉండి కథలు రాసిన వ్యక్తి. కవీ, జర్నలిస్టు అయిన ఎ. కృష్ణారావు – క్రిష్ణుడు – వృత్తిపరంగా రెండున్నర దశాబ్దాలు ఢిల్లీలో గడిపి ఈమధ్యనే హైదరాబాద్‌కు మకాం మార్చారు. తన ఢిల్లీ నివాస సమయంలో కవితలే గాకుండా వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘ఢిల్లీగేట్’ అన్న వాడీ వేడీ ఉన్న కాలమ్ రాసారు. ‘నడుస్తున్న హీన చరిత్ర’ అనే పుస్తకం వెలువరించారు.

పబ్లికేషన్స్ డివిజన్‌లో చాలా కాలం పనిచేసిన డాక్టర్ జె. భాగ్యలక్ష్మి ఆంగ్లాంధ్ర కథకులు, కవి, అనువాదకురాలు. కేంద్రప్రభుత్వంలో పనిచేసిన పులిగడ్డ విశ్వనాథరావు మరో కథకులు. ‘ఇండియన్ లిటరేచర్’ పత్రికకు సంపాదకులుగా పనిచేసిన దుగ్గిరాల సుబ్బారావు సమీక్షకులు, విమర్శకులు, అనువాదకులు. గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’; ‘మెరుపుల మరకలు’ నవలలను ఆంగ్లీకరించిన వ్యక్తి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం అధిపతిగా పనిచేసిన ఆర్. అనంతపద్మనాభరావు వ్యాసకర్త – అనువాదకులు. ‘ఢిల్లీ ప్రముఖులు’ అన్న పుస్తకం రాసారు. సాహిత్య ఎకాడమీ లాంటి సంస్థల కోసం నవలలను తెలుగులోకి అనువదించారు.

ఢిల్లీలో చాలాకాలం గడిపిన మరో రచయిత వి.ఎస్. రమాదేవి. కథలు, నవలలు, కబుర్లు, వ్యాసాలు, నాటికలు – బహుముఖ వ్యాసంగం ఆవిడది. ‘అందరూ మనుషులే’, ‘రాజీ’ లాంటి ఏడు నవలలు రాసారు. పదీ పదిహేను పుస్తకాలు వెలువరించారు. ఎమర్జెన్సీ నేపథ్యంగా రాసిన ‘రాజీ’, నవలా రచయిత్రిగా ఆవిడకు ఓ విశిష్టమైన గుర్తింపునిచ్చింది.

వెంకటేశ్వరా కాలేజీ, ఐఐటీ ఢిల్లీలలో ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పనిచేసిన కల్లూరి శ్యామల కూడా సాహితీరంగంలో అనువాదకురాలుగానూ, కవితా సంపాదకురాలుగానూ చిరపరిచితులు. ‘చైతన్య దేహళి’ అన్న కవితా సంకలనాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం రూపొందించారు.

1990లలోనే ఢిల్లీ నుంచి ‘ఢిల్లీ తెలుగువాణి’ అన్న మాస పత్రిక వెలువడింది. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు – వేములపల్లి కృష్ణమూర్తి, కంభంపాటి గోవర్ధనరావు – సాహితీప్రియులు. ‘సాహితీ వేదిక’ కార్యక్రమాలకు దన్నుగా నిలిచినవారు. ఆ సమయంలోనే కవి తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో దశాబ్దం పాటు ఉన్నారు. ఈయన కవే గాకుండా ‘యువభారతి, హైదరాబాద్’ వారి ప్రచురణలోను అనుభవం ఉన్న మనిషి. వీరంతా కలసి ఆరంభించిన ‘తెలుగువాణి’ తనదైన విలక్షణతో ఆరేడు సంవత్సరాలు నడిచింది. చక్కని కథలూ, వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ, సమీక్షలూ ప్రచురించింది. పత్రిక ఢిల్లీ తెలుగువారికే గాకుండా దేశవిదేశాలలోని సాహితీప్రియులకు అందేలా చూసారు సంపాదకులు గోవర్ధనరావు.

ఈ సభలూ, సమావేశాలూ, సంపాదకత్వాలూ, ప్రచురణలూ మధ్య అతి నిశ్శబ్దంగా సాహితీ సృజన చేసి చిన్న వయసులోనే నిష్క్రమించిన సీవీ సుబ్బారావు గురించి చెప్పుకోవాలి. జీవితాన్ని ఓ మానవ హక్కుల ఉద్యమంగా మలచుకొన్న సురా రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన మనిషి. ఎమర్జెన్సీలో ఏడాదిన్నర విశాఖ సెంట్రల్ జెయిల్లో ఉన్నారు. 1978లో ఢిల్లీలోని ఖల్సా కాలేజీలో లెక్చరర్‌గా చేరి ’94 జనవరిలో మరణించేంతవరకూ ఢిల్లీలోనే ఉన్నారు. మానవ హక్కుల పరిరక్షణే ఊపిరిగా బతికారు. ఆర్థిక శాస్త్రవేత్తగా, విద్యార్థుల అభిమాన అధ్యాపకులుగా ఉంటూనే, వలస కార్మికులనూ, బస్తర్ ఆదివాసీలనూ, రాజస్థాన్ బీదలనూ, మతకలహాలను తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు సుబ్బారావు. తన జీవన గమనంలో ఎన్నో రచనలు చేసారు. ఈశాన్య రాష్ట్రాలలో జాతుల సమస్య మీద ‘రగులుకొనే రాక్షసి బొగ్గు’ అన్న పుస్తకం రాసారు. ‘విభాత సంధ్యలు’ అన్న సాహితీ విమర్శా గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ‘రాజకీయార్థికశాస్త్రం’ మీద ఓ పుస్తకం రాసారు. ఆయన అకాల మరణం తర్వాత మిత్రులు సేకరించి ప్రచురించిన ‘సందిగ్ధ సందర్భం’ ఓ గొప్ప పుస్తకం. ఇందులో సురా రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, లేఖలు, ఓ నాటిక ఉన్నాయి.

***

ఇరవై ఒకటో శతాబ్దం మొదటి దశాబ్దంలో ఢిల్లీలోని తెలుగు సాహితీకారుల్లో ముఖ్యమైన వాళ్ళు ఢిల్లీ వదిలి వెళ్ళడం జరిగింది.

పెంగ్విన్ రంగారావు రిటరైయ్యాక పుట్టపర్తికి మారారు. తోలేటి, గౌడ్ హైదరాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత గణేశ్వరరావు – శాంత సుందరి దంపతులూ హైదరాబాద్ చేరారు. కల్లూరి శ్యామల, విజయా మూర్తి, తాత్కాలికంగా దాసరి అమరేంద్ర, పూర్ణ కుమార్ దాస్, మెడికో శ్యాం, ఉషారాణి భాటియా, వి.ఎస్.రమాదేవి, జె. భాగ్యలక్ష్మి – అనేకానేక కారణాల వల్ల వీరంతా ఢిల్లీ వదిలి వెళ్ళడంతో నగరంలో తెలుగు సాహితీ కళ వసివాడిందనే చెప్పుకోవాలి.

కానీ కొత్త నీరూ వచ్చి చేరింది.

నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా కవి పత్తిపాక మోహన్ ఢిల్లీ చేరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉప ఆచార్యులుగా గంపా వెంకట్రామయ్య వచ్చారు. విఖ్యాత చిత్రకారులు, కవి ఎస్వీ రామారావు నగరంలో ఉండసాగారు. బంజారా సాహిత్యంలో కృషి చేస్తోన్న రమేష్ ఆర్య సాహితీ బృందంలో చేరారు. సాహిత్యమంటే అనురక్తి ఉన్న ఎమ్వీలక్ష్మి, కుసుమ, కమల, శాంతిశ్రీ, సోమలత, పద్మావతి, కామేశ్వరరావు, శ్రీనివాసరావు, దేవరకొండ సుబ్రహ్మణ్యం, సురేఖ, ప్రభల జానకి లాంటివాళ్ళు బృందపు సభ్యులయ్యారు. 90ల నాటి లక్ష్మీరెడ్డి, సంపత్, తిలక్, సుజాత, మళ్ళీ వచ్చిన అమరేంద్ర ఉండనే ఉన్నారు.

2010 నాటికల్లా మళ్ళా దీపం వెలుగు సంతరించుకోసాగింది. 2012 కల్లా నిలకడగా సాహితీ పుంజాలను ప్రసరించడం మొదలుపెట్టింది. ‘సాహితీ వేదిక’ మరోసారి కాయకల్ప చికిత్స పొంది తన కార్యకలాపాలను కొనసాగించడం మొదలుపెట్టింది. నెలవారీ సమావేశ పరంపర ప్రాణం పోసుకుంది. ‘మా నాయన బాలయ్య’, ‘బోయకొట్టములు పండ్రెండు’, ‘సురపురం’, ‘భూచక్రం’, ‘కోర్ట్ మార్షల్’, ‘అమృతం కురిసిన రాత్రి’ , ‘కథా కథనం’, ‘నూరేళ్ళ తెలుగు కథ’ లాంటి విలక్షణ పుస్తకాల పరిచయం, సమీక్ష, విశ్లేషణ, విమర్శల చుట్టూ ఆ సమావేశాలు సాగాయి. ఓల్గా, రాచపాళెం, కాత్యాయనీ విద్మహే లాంటి సాహితీ ప్రముఖలతో చర్చాగోష్ఠులు జరిగాయి.

వర్తమాన సాహితీ సృజన విషయానికొస్తే దాసరి అమరేంద్ర రచనా వ్యాసంగం సాగిపోతోంది. గత రెండు మూడేళ్ళలో ఆయన మూడు పుస్తకాలు ప్రచురించారు. లక్ష్మీరెడ్డి విలక్షణ అనువాద యజ్ఞం నిరవధికంగా కొనసాగిపోతోంది. తెలుగు సాహిత్యానికి నిలకడ అయిన హిందీ పాఠకులను సమకూర్చి పెట్టారాయన. ఏల్చూరి మురళీధర రావు ప్రాచీన సాహితీ శోధన ఒక మహా యజ్ఞంలా సాగిపోతోంది. ప్రభల జానకి ఈమధ్యనే ‘భారతంలో స్త్రీ పాత్రలు’ అన్న పుస్తకం తీసుకువచ్చారు. గంపా వెంకట్రామయ్య ‘వ్యాస గంగాధరం’ అన్న పుస్తకమూ, కొన్ని కథలూ రాసారు. ఆయన సహచరి ఈడ్పుగంటి శిరీష ‘వాహిని’ అన్న విమర్శా వ్యాసాలనూ, ‘బ్రౌన్ శాస్త్రి’ అన్న జీవిత చరిత్ర గ్రంథాన్నీ వెలువరించారు. నాటకరంగం మీద కామేశ్వరరావు ఓ వ్యాస సంకలనం తీసుకువచ్చారు. కుసుమ, సురేఖ కవితలు, కథలు రాస్తున్నారు. శాంతిశ్రీ వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. రమేష్ ఆర్యకు బంజారా సాహిత్య రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఎవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నియుక్తులైన కృత్తివెంటి శ్రీనివాసరావు ఢిల్లీలోని తెలుగు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమూ, సహాయ సహకారాలందించడమూ చేస్తున్నారు. ఈమధ్య కే.జే. కళ్యాణి అర్థవంతమైన సాహితీ సామాజిక వ్యాసాలు రాస్తున్నారు. విమానయాన రంగం నేపథ్యంతో క్రిష్ణవేణిచారి కథలు రాస్తున్నారు.

రెండేళ్ళ కొత్త నడకల తర్వాత 2013లో ‘సాహితీ వేదిక’ తన వార్షికోత్సవ కార్యక్రమంగా ‘జీవితమూ – సాహిత్యము’ అన్న విషయం మీద ఒక రోజంతా సెమినారు నిర్వహించింది. వాసిరెడ్డి నవీన్ వచ్చి కీలకోపన్యాసం చేసారు. వేదిక సభ్యులంతా ఆ విషయం మీద చిన్నవీ, పెద్దవీ పత్రాలు సమర్పించారు.

2014లో రావిశాస్త్రి కథల మీద వార్షికోత్సవ సెమినార్ జరిగింది. కృత్తివెంటి శ్రీనివాసరావు అధ్యక్షత. కాత్యయని విద్మహే కీలకీపన్యాసం. మల్లీశ్వరి, వివినమూర్తి, అట్టాడ అప్పల్నాయుడు తమ తమ వ్యాసాలు పంపారు. అమరేంద్ర, వెంకటరామయ్య, నవీన్, దేవరకొండ సుబ్రహ్మణ్యం తదితరులు పత్ర సమర్పణ చేసారు. చెప్పుకోదగ్గ ప్రమాణాలు గల ఆయా పత్రాలన్నింటినీ తర్వాత ‘సాహితీ వేదిక’ పుస్తకంగా తీసుకువచ్చింది.

2015లో జరిగిన కొడవటిగంటి సెమినార్ ఈమధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన సాహితీ సభలకు తలమానికం. కాత్యాయని, మల్లీశ్వరి, నవీన్, ఎన్. వేణుగోపాలరావు, ఎ. క్రిష్ణారావు, కొకు కథల గురించీ, నవలల గురించీ, వ్యాసాల గురించీ విలువైన ప్రసంగాలు చేసారు. ఆయన రచనల ప్రస్తుత రెలవెన్సును ఎత్తి చూపారు. సాహిత్యానికి సమాజం మీద ఉన్న ప్రభావశీలత గురించి విస్పష్టంగా వివరించారు.

గత రెండు మూడేళ్ళుగా ఢిల్లీలో దేవరకొండ సుబ్రహ్మణ్యం పూనికతో ఆంధ్రా అసోసియేషనూ, తెలుగు సాహితీ విరివిగా సాహితీ కార్యక్రమాలను నిర్వహించాయి. 2014 ఆగస్టులో ఇరవై మంది రచయిత్రులు  ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఆధ్వర్యంలో ఢిల్లీ వచ్చి వందమంది సభికుల మధ్య రెండు రోజుల పాటు తమ సభలను జరుపుకోవడం ఈ దశాబ్దపు విశిష్ట సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓల్గా, కుప్పిలి పద్మ, మృణాళిని, కాత్యాయని, మల్లీశ్వరి, వీరలక్ష్మీదేవి, కొండేపూడి నిర్మల, అనిశెట్టి రజిత, మెర్సీ మార్గరెట్, పుట్ల ‘విహంగ’ హేమలత లాంటి రచయిత్రులందరినీ ఒకేసారి చూడడం, వినడం ఢిల్లీ తెలుగు సాహితీ ప్రియులకు మరపురాని అనుభవం.

అదే ఊపులో సుబ్రహ్మణ్యం ఈ రెండేళ్లలో చిన్నవీ, పెద్దవీ మరో ఆరేడు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ‘ఉత్తరాంధ్ర కథ’ మీది సమావేశం చెప్పదగ్గది.

***

తెలుగు భాషకు మొట్టమొదటి ఆధునిక రచనను ఇచ్చినా, సాహితీ ప్రక్రియాగా సరి అయిన గుర్తింపు పొందని  ‘యాత్రా సాహిత్యం’ గురించి ‘సాహితీ వేదిక’ నవంబరు 2016లో సెమినార్ నిర్వహించే ప్రయత్నంలో ఉంది. మహా యాత్రికుడు ఎమ్. ఆదినారాయణ 2016లో వెలువరించిన ‘తెలుగువారి ప్రయాణాలు’ అన్న గొప్ప పుస్తకం ఈ సెమినార్ కేంద్ర బిందువు. సిల్కురూటూ, ఛత్తీస్‌ఘడ్‌లో సాహసయాత్రలు చేసిన పరవస్తు లోకేశ్వర్ కీలకీపన్యాసం చేస్తారు. ‘ప్రయాణానికే జీవితం’ అన్న గొప్ప యాత్రా గ్రంథాన్ని తెలుగు చేసిన కొల్లూరి సొమ శంకర్ మరో ముఖ్య వక్త.

సాహిత్యం జీవన స్రవంతిలో ఒక ముఖ్యమైన పాయ అయినప్పుడు ఎనిమిది లక్షల ఢిల్లీ తెలుగువాళ్ళ మధ్య సాహితీ స్రవంతి  తరాల తరబడి సాగిపోవడమన్నది ఓ సహజ ప్రక్రియ. ఆ స్రవంతి ఓ సజీవ చైతన్యానికి ఆలంబనగా నిలబడి తెలుగు సాహితీ రంగంలో ఉడుతాభక్తిని – తాను సైతం సాహితీ భవనపు చిరు బావుటా అయి – రెపరెపలాడుతూ ఉంటూ ఉంటుందనడంలో సందేహం లేదు.

~ 

 

 

 

మీ మాటలు

  1. .దేవరకొండ సుబ్రహ్మణ్యం says:

    చాలా వివరాలతో దేశ రాజధాని లో సాహిత్య సంస్కృతి కార్యక్రమాల గురించి రాసిన అమరేంద్ర గారు, స్థల లోపం వల్ల కొన్ని వివరాలు ఒదిలేశారు. ఢిల్లీ తెలుగు నాటక రంగం కోసం 1958 లో ఇక్కడ అప్పుడే మొదలుపెట్టిన నేషనల్ స్కూల్ ఒఫ్ డ్రామా లో చదవడానికి వచ్చిన ప్రఖ్యాత రంగస్థల నటులు కీర్తి శేషులు కుప్పిలి వేంకటేశ్వర రావు , సినిమా నటులు పొట్టి ప్రసాద్ ఇంకా కొంత మంధి కలిసి దక్షిణ భారత నటీ నట సమాఖ్య ను స్టాపించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగి9నా 58 సంవత్సరాల్లో ఎన్నో తెలుగు నాటకాలను (వందపైనే) నాటక ఉత్సవాలను జరిపారు. భవదీయుడు, వారు తన వ్యాసం లో పేర్కొన్న కామేశ్వరరావు గారు ఆ సంస్థ ద్వారా ఢిల్లీ నాటక ప్రియులకు పరిచితులమే.

    తెలుగు సాహితి సంస్థ దామోదరం సంజీవయ్య గారు అప్ప్తి కేంద్ర మంత్రిగా (కార్మిక శాఖ అని జ్జ్ఞపకం) జంతర్మంతర్ మార్గం లో ఉండే వారు. నేను ఢిల్లీ 1969 జులై లో వచ్చినప్పుడు చేరిన మొదటి సంస్థ అదే. వకటి పాండురంగ రావు , బలివాడ కంతా రావు, గరిమెళ్ళ సీతారాం తదితర రచయితలు సభ్యులుగా ఉండే వారు. 1970 లో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరఓ గారు ఈ ఢిల్లీ లో ఉండే వారు. (ఆకశవాణి ఢిల్లీ కేంద్రం) . నాకు ఇప్పటికీ గుర్తే ఒక సారి బలివాడ కాంతరావు గారి ఇంట్లో జరిగిన తెలుగు సాహితి కలయిక లో వారు శ్రీ శ్రీ గారి మహాప్రస్థం లోని ముఖ్య కవితలను చాలా రాగా యుక్తం గా మా అందరికీ వినిపించారు.

    అల్గే ఢిల్లీలో ఉన్న ఇంకొక సంస్థ ఆంధ్ర వనిత మండలి. వీరెన్నో సాహితి కార్యక్రమాలు, నృత్య గాన కార్యక్రమాలు ఎర్ప్[అటు చేశారు. 1977 లో జరిగిన వారి రజతోత్సవం కార్యక్రమాల్లో, నా ప్రోద్భలంతో, శ్రీకాకులం ఉద్యమం మీద భూశణం గారు రాసిన “కొండగలి” ఆధ్రంగా విస్ఖ వస్తాయులు శ్రీ అత్తిలి కృష్ణరావు గారు రాశి దర్శక్త్వమ్ వహించిన తూర్పురేఖలు ప్రదర్శింపబడడం జరిగింది.

    1990 ల్లో ఆంధ్ర అసోసియేషన్ వారు వేములపల్లి కృష్ణమూర్తి మరియు కభంపాటి గోవర్ధనరావు ల ఆధ్యర్యంలో, తెలుగు సాహిత్యం ప-ఐనా 10 కి పైనే సదస్సులు ఏర్పాటు చేశారు. వీటిలో, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, కత్తి పద్మరావు గారు, మృణాలిని, కాత్యాయని, వాసిరెడ్డి సీతా , కుప్పిలి పద్మ, లాంటి ఎంతో మండి సాహిత్యకారులు పాల్గొన్నారు.

    ఇక జె.యెన్.యు లోని ప్రగతి సాహితి తెలుగు సాహిత్యాన్ని కి ఇచ్చిన పెద్ద బహుమతి వారు ప్రచురించిన “జలపాతం” కవిత సంపుటి. అలాగే వారు రావి శాస్త్రి గారి ఆరు సార కధల ఆధారంగా ప్రచురితమయిన “సారాంశం” నాటికను నా దర్శకత్వం లో 1983 లో ఢిల్లీ లో 5 చోట్ల 5మరియు విజయవాడ లో జరిగిన విరసం లోనూ ప్రదర్శించడం జరిగింది.

    వారు నేన్ను 7 తెలుగు సాహిత్య కార్యక్రమాలు జరిపానని చెప్పారు. అందులో రెండు ప్రస్తావించారు. ఇంకో మూడు కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి 2014 నవంబర్ లో జాషువా గారి సాహిత్యం పై జరిగిన కార్యక్రమం. ఇందులో కాకతీయ విశ్వవిద్యాలయం లోని తెలుగు ఆచర్య్లు శ్రీ బన్నే ఐలయ్య గారు తదితరులు పాల్గొన్నారు. 2015 జనవరి లో .గురజాడ గారి కన్యాశుల్కం నాటకం మీద ఒక వగాహన కార్యక్రమం జరిపాం. ఇందులో విశాఖ కు చెందిన ప్రఖ్యాత రంగస్థల నటులు శ్రీ పి.ఆర్.జె.పంతులు, ప్త్రకారుడు/కవి అయిన శ్రీ ఎ.కృష్ణరావు , ఆచార్య యర్ల గడ్డ లక్శ్మి ప్రసాద్ గార్లు పాల్గొన్నారు.. ఇంకో మంచి కార్యక్రమ ఈ సంవత్సరం (2016) ఆగష్టు 7 న జరిగిన తెలుగు కవితా సదస్సు. ఇందులో తెలుగు కవిత్వం లో పేరున్న శివారెడ్డి, వేణుగోపాల్, విమల , అరుణ గోగులమండ, అరణ్యకృష్ణ, మరియు పలమనేర్ బాలాజి గార్లు పాల్గొన్నారు.

    రెండు కార్యక్రమాల్లో . సెప్టంబర్ 14-15 , 2016 లో జరిగిన తెలుగు సాహిత్యం లో స్త్రీ ల కృషి కార్యక్రమం లో ఒక జెండర్ వివక్షణ మీద ఒక వీధినాటకాన్ని, ఈ సంవత్సరం జరిపిన కవిత సదస్సులో ప్రఖ్యాత రంగస్థల నటి మాయా రావు, స్త్రీల పై జరిగే అత్యాచారాల మీద ఏక పాత్రాభినయం ఏర్పాటు చేసి ఒక కొత్త వరవడిని ఏర్పాటు చేశానన్న తృప్తి ఉంది.

  2. Syamala Kallury says:

    ఛాలా సమగ్రవంతంగా రాసిన వ్యాసం. బాగుంది. విస్తృతమైన పరిధిలో రాసారు. లోతుల్లోకి వెళ్ళాలంటే దీన్ని ఒక చిన్న మోనోగ్రాఫ్లా రాయవచ్చును. పత్రికా రచయితలనుకూడా చేర్చవచ్చును. కుందూరి ఈశ్వరదత్తు, నేషనల్ హెరాల్డ్ చలపతి రావు గార్ల తో మొదలై ప్రసాద్,ఆంధ్రజ్యతి కిష్ణారావ్ గారి్దాకా అనెకానేకులు ఈ రంగానికి మెరుగులు దిద్దారు.

  3. Amarendra Dasari says:

    Ee vyaasam mukhyamgaa gaa Delhi Telugu Sahityam gurinchi…syamalaa, Subramanyam gaari la vyaakhyalaku krutagnatalu.

  4. దేవరకొండ సుబ్రహ్మణ్యం says:

    మీ వ్యాసం మొదలు లో “ఢిల్లీ తెలుగువాళ్ళ సాంఘిక, సాంస్కృతిక జీవనం సంగతేమిటీ?” . ఈ అంశం మీద ఈ వ్యాసం కాకపోతే బహుశా ఈ టైటిల్ ఉండకూడదేమో. మిరే జె.యెన్.యు లో ప్రగతి సాహితి గురించి రాసిన భాగంలో వారి కార్యక్రమాల్లో గద్దర్ పాటలు వగయిరా రాసారు , కానీ వారి ముఖ్య సాహిత్య కృషి “జలపాతం” గురించి రాయలేదు. అది సాహిత్యమే కదా!. కొన్ని సాహిత్య కార్యక్రమాలను వివరం గా రాసి కొన్నిటిని సంఖ్యలో రాయడం ఎందుకో సమంజసం కాదేమో అనిపించింది. నిజానికి తెలుగు సాహితి 2015రెండు ముఖ్య సాహిత్య కార్యక్రమాలు ఢిల్లీ లోని తెలుగు సాహిత్య అభిమానులతోనే జరిపింది. ఎస్.జె. కల్యాణి గారు తన మొదటి ప్రసంగ వ్యాసం ఢిల్లీ లోని మహిళా సహిత్యాభిమానులకోసం ఏర్పరిచిన 2015జనవరి లో జరిగిన కార్యక్రమంలో సమర్పించారు. అప్పటినుంచి ఆవిడ విరివి గా రాస్తున్నారు. అలాగే 1990 ల్లో ఢిల్లీ లోని ఆంధ్ర అసోసియేషన్ వారు నిర్వహించినవి కూడా సాహిత్య సభలూ/సదస్సులే. అలాగే వనిత మండలి వారు మహిళా సాహిత్య కారుల సదస్సు నిర్వహించింది కూడా తెలుగు సాహిత్యం మీదే. ఇక దక్షిణ భారత నటీ నట సమాఖ్య ప్రసక్తి నేను మీ “ఢిల్లీ తెలుగువాళ్ళ సాంఘిక, సాంస్కృతిక జీవనం” చూసి రాశాను. మీ వ్యాసం విస్తృతంగా పూర్తి వివరాలు పాఠకులకు తెలియడం కోసమే అంతా వివరం గా రాయవలసివచ్చింది.

  5. దేవరకొండ సుబ్రహ్మణ్యం says:

    అన్నట్టు వేదిక ప్రచురించిన రవి శాస్త్రి వ్యాస సంపుటి లో బీనాదేవి గారి వ్యాసం కూడా ఉంది.

  6. ఏల్చూరి మురళీధరరావు says:

    నాలుగంచుల నిండైన మనస్వితతో మధురంగా వ్రాశారు.

    అభినందనలు ! ధన్యవాదాలు !!

  7. వెంకటరామయ్య గంపా says:

    ఢిల్లీలో తెలుగు సాహిత్యాన్ని గురించి చాలా వివరణాత్మకంగా రాసిన అమరేంద్ర గారికి అభినందనలు. వ్యాసాన్ని కూడా సృజనాత్మక శైలి విధానంలో రాయడం అమరేంద్రగారి ప్రత్యేకత..
    ధన్యవాదాలు

  8. Dr Vempalli Gangadhar says:

    ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఆధ్వర్యంలో ఢిల్లీ లో సమావేశం జరిగింది ఆగస్టులో కాదు.
    సెప్టెంబర్ మాసం లో. రెండు రోజులు నేను కూడా పాల్గొన్నాను.

    • దేవరకొండ సుబ్రహ్మణ్యం says:

      అవునండి. నేను నా వ్యాఖ్యలో ఆ విషయం రాసాను సెప్టెంబర్ 13-14, 2014 . అమరేంద్ర గారు కూడా పాల్గొన్నారు. పాపం మరిచిపోయినట్టున్నారు. ఆ కార్యక్రమం ఫోటోలు కానీ, తెలుగు సాహితి ఆధ్వర్యంలో జరిగిన ఇతర కార్యక్రమాలు ఫోటోలు పై వ్యాసం లో లేకపోవడం కొంత కొరత ఉంది . నన్ను అడిగితే నేను ఇచ్చి ఉండే వాడిని. అమరేంద్ర గరే రాసినట్టు నేను ఇతర సంస్థల సహకారంతో , ముఖ్యంగా తెలుగు సాహితి, ఆంధ్ర అసోసియేషన్ మరియు టీమ్ ఏ.పి.భవనం , ఢిల్లీ, మరియు ఢిల్లీ కల తెలుగు సాహిత్యాభిలాషుల సహకారం 9 సెప్టంబర్ 13-14, 2014 నుంచి ఇప్పటి దాకా త సాహిత్య కార్యక్రమాలు నిర్వహించను. వాటి ఫోటోలు కూడా పెట్టి ఉంటే హస్తిన పూల వనం ఇంకా కళకళలాడేది.

  9. Amarendra Dasari says:

    Thanks for the correction Gangadhar gaaroo

  10. sangishetty srinivas says:

    ముందుగా అమరేంద్ర గారికి అభినందనలు. మంచి వ్యాసాన్ని అందించారు.. అయితే తెలంగాణ సాహిత్యకారులు కొంతమంది ఇందులో మిస్సయ్యారు. ముఖ్యన్గా డి. రామలింగంని విస్మరించారు. ౧౯౫౦-౧౯౬౦ వ దశకం లో ఆయన ఢిల్లీ సమాచార శాఖలో పని చేశారు. అక్కడ ఉన్నప్పుడే చాలా కథలు రాశాడు. అందులో ప్రధానమయ్యింది ఢిల్లీ జీవితాన్ని చిత్రించిన “బరసాతి” కథ. ఆయన కథలు కాగితపు పడవలు పేరిట ౧౯౬౪లోనే ప్రచురిత మయ్యింది. అందులో ఈ కథ కూడా ఉన్నది.

  11. Amarendra Dasari says:

    Idi viluvaina samachatam..Mundu Mundu vyaasaanni savaristaanu..inkaa evarinainaa porapaatuna vismarinchi unte dayachesi cheppandi sangisetti gaaroo..thx

  12. Doctor Nalini says:

    ఢిల్లీ వారు ఎందుకో డాక్టర్ రమేషుబాబు, కరుణలని మర్చిపోయారు . వారు ఆడిన కన్యాశుల్కం ఎంతో ఇంపుగా ఉండేదని విన్నాను . లుబ్దావధానులుగా రమేషుబాబు , మీనాక్షిగా కరుణ నాటకాన్ని రక్తి కట్టించారు .చేకూరి తో కలిసి వారు ఎంతో సాహిత్య కృషి చేసారని కూడా విన్నాను.

    • దేవరకొండ సుబ్రహ్మణ్యం says:

      అవును నిజమే. ఇది కొంత వరకూ నేరమే. నేను వారితో కలిసి చాలా కార్యక్రమాల్లో పనిచేశాను. నేను దక్షిణ భారత నటీ-నట సంఘం కార్యదర్శి గా ఉన్నప్పుడూ (1975-1980) రమేశ్ బాబు గారు మా కమిటీలో రెండు సంవత్సరాలు సభ్యులుగా ఉండి ఎన్నో మంచి సలహాలు ఇచ్చేవారు. పై వ్యాసం లో అలా మరిచిపోయిన వాళ్ళు కానీ మరిచిపోయిన కార్యక్రమాలు కానీ చాలానే ఉన్నాయి. కొన్ని నేను నా ఉత్తరువు లో రాయగలిగాను. కొన్ని రాయలేకపోయాను. నేను ఇప్పటికీ విశాఖ వెళ్లినప్పుడు వారి పిల్లలని కలుస్తాను. ఆరోజుల్లో లజపతినగర్ లో ఉండే సౌత్ ఢిల్లీ ఆంధ్ర సంఘం చాలా ఆ దంపతుల ఆధ్వర్యం లో మంచి సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు.

      • amarendra dasari says:

        “పై వ్యాసం లో అలా మరచిపోయిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి”…మే బి ట్రూ ..బట్ ఐ థింక్ ది గ్లాస్ is atleast హాఫ్ ఫుల్

      • amarendra dasari says:

        ‘పాప కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా ‘ – అమరేంద్ర రామదాసు

    • amarendra dasari says:

      Dr నళిని గారూ..ఈ వ్యాసం ఢిల్లీ తెలుగు సాహిత్యం గురించి…

      • amarendra dasari says:

        …నాకు తెలిసిన నేను తెలుసుకోగలిగిన విషయాలు చెప్పాను..మరిన్ని మిగిలి ఉండే అవకాశం ఉంది..మీ లాంటి వారి వ్యాఖ్యలు ఈ వ్యాసాన్ని revise చేసినపుడు ఉపయోగ పడతాయి ..థాంక్స్

  13. D. Subrahmanyam says:

    మా మిత్రులు సి,వి,సుబ్బారావు (మీరు వారి గురించి కొంత రాసారు) అందరూ చదివేవ్యాసం రాసేటప్పుడు సరి అయినా ప్-అరిశోధన చేయకుండా ఎప్పుడూ రాయకూడదని తన మిత్రులకు సలహా ఇచ్చేవారు. ఎందుకంటే అప్పుడు ఆ వ్యాసం కేవలం ఒకే దృక్పధంతో రాసినది అవుతుందని హెచ్చరించే వాడు. ఈ వ్యాసం గ్లాస్ నింపడానికి వి౮షయాలు తెలిసిన (మీరు దయతో కొందరిని ప్రస్తావించారు) వారి ఢిల్లీ లోనే ఉన్నారు. అడిగితే విషయాలూ తెలిసేవి ఇంకా ఫోటోలు దొరికేవి. మళ్ళీ తిరిగి రాసినప్పుడైనా మీ వ్యాసం ఢిల్లీ లోని తెలుగు సాహిత్య పరిణామం ఒక్కటేనా లేక సంస్కృతి కూడనా అన్న విషయం ఖచ్చితంగా తేల్చికోండి. కేవలం సాహిత్యం మాత్రమే అయితే సంస్కృతి ప్రసక్తి అసలు ఉండ కూడదన్న అభిప్రాయం ఒప్పకుంటారని తలుస్తాను. డాక్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో గురజాడ సాహిత్యం మీద ఒక బ్యాసం సంపుటి తెచ్చారు. ఆ సందర్భం లోనే కీర్తసేషులు గోపాలకృష్ణ (పూర్వ భారత రంగ్ విద్యాలయం NSD విద్యార్థులు) దర్శకత్వంలో కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు.

  14. Syamala Kallury says:

    మీరు మీ వ్యాసాన్ని రివైజ్ చేస్తే ఈ క్రింద విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోండి:
    కథ డిల్లీ వారు గీతా ధర్మరాజన్ గారి ఆధ్వర్యంలో అనేకకథలు, మిథునంతో సహా ప్రచురించిన తెలుగు అనువాద కథలు మీ లాంటి పెద్దలు నామినేట్ చేసిన కథలు. ఖాదిర్ బాబు లాంటి వాళ్ళు మంచికథలని దేశవ్యాప్తంగా అందించారు.
    నారచనలనేపధ్యం మీకు తెలిసేవుంటుంది. ఆనువాద సాహిత్యం:
    Chinnari Tarangamu; Translated into Telugu, National Book Trust India 1983

    I am Better Than Thou; Translated into Telugu, National Book Trust India 1984

    Symbolism in the Poetry of Sri Aurobindo; Abhinav Publications 1988.

    Bhava Vihangalu; Translation of Stray Birds by Rabindranath Tagore; Visalandhra Publishing House, Hyderabad 1988.

    Telugu Short stories: Women’s Voices-An inner Voyage (1930-2000);
    New Delhi: Asian Publications Services, 2001. (Won Jyeshta Literary Award for Translation for 2001)

    Chaitanya Dehali; Compilation of Twentieth Century Telugu Poetry New Delhi: NBT India, 2002

    Godavari Tales; A Children’s classic in Comics compiled for Viveka Foundation, New Delhi: 2003.

    Twentieth Century Telugu Poetry in English; Translated and compiled as a Companion Volume to Item 6. New Delhi: Shipra Publications 2006

    Swagathalu: An anthology of poems originally written in Telugu Hyderabad: Surya Prachuranalu 2006

    Selections From Sri Sri and Other Essays, a Book that includes five critical essays written by scholars in Telugu and translated into English by me in addition to one original article written by me in English on Sri Sri along with translations from Mahaprasthanam, his film and non film songs: Published by avakaaya.com 2013

    12. If you want to be A poet, Patridge India 2016
    ఇవన్నీ డబ్బా కొట్టుకోటానికి కాదు. మీకు సరియైన సమాచారం అందించటానికి. సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.

    • amarendra dasari says:

      సమాచారం కు కృతఙ్ఞతలు …revise చేస్తే ఇవి తప్పక గుర్తుంచుకుంటాను

  15. డిల్లీలో తెలుగు సాహిత్యం…మంచిప్రయత్నం…….వచ్చిన సూచనలు…వివరణలు…ముందు రాతకు పునాదులు….దేశానికి సంజీవరెడ్డి గారినించి…గిరిగారే కాక పీ వీ ని ఇచ్చిన భాషా తెగ మంచి సాహిత్యం ఇవ్వగలదు……cheers to each of you

Leave a Reply to amarendra dasari Cancel reply

*