శాంతికీ కాంతికీ లోగిళ్ళు!

 

chettinadu-mansion

తుప్పరలతోబాటు వీచిన గాలి కి గోధూళి అలుముకుంటుంది. ఉరుములు మెరుపులతోబాటు చిలికిన జల్లులకి కోనేరు నిండిపోతుంది. అప్పటిదాకా ఆడుకుంటున్న పిల్లల ఆటవిడుపుకి మరో నిర్వచనం వచ్చి చేరుతుంది. వడివడిగా ఎవరిళ్లకు వారు పరిగెడతారు.   అల్లిబిల్లి ఆడుతూ మండువా లోగిళ్లలోనూ, పూరిళ్ల చూరు కిందనూ వాననీటిని ఒడిసిపట్టుకున్న చిట్టి ఆటల చేతులు! వాననీటికి మట్టిమిద్దె గంధపు పవనాలు! వాన వస్తే ఇంటికి రావాల్సిందే!

కార్తీక దీపంతో చలికాచుకుంటుంది తులసికోట. చేమంతులు పూసే హేమంతవేళ…. వెన్నెల్లో .. గోరుముద్దలు తినిపిస్తుంటే పెరడంతా తిప్పే పిల్లలు ఆ చిట్టి చేమంతుల్లా విరగబూస్తారు! అయినా చలిగాలులు ఊపేస్తుంటే ఆ సుకుమారమైన  పూలకు, మొక్కలకు ఉన్న శక్తి బలవంతులైన మనుషులకెక్కడ ఉంటుంది? వణికే చల్లటిగాలులకు వెచ్చదనాన్ని అందించే కంబళి ఇల్లు!

పేరుకు మధుమాసం.  వసంతమే కానీ, మండిపడే సూర్యుడికీ, వడగాడ్పులకీ మామిడిపండ్లు, తాటిమున్జెలు తట్టుకునే ఉపాయాన్ని చెప్తాయి. అ ఊరటతో ఇంట్లోనే సాయంకాలందాకా ఇంటి ఆటలు,  గిల్లికజ్జాలతో సరిపోతుంది పిల్లలకి. పగలంతా ఇల్లే బుజ్జగించి కూర్చోబెడుతుంది.

ఇల్లు….. ఋతువులకనుగుణంగా, ఆదరాభిమానాలు అను-గుణాలకు మరోరూపంగా ఉండేది!  బంధుమిత్రుల్ని ఆదరించేది! ఎంత చిన్న ఇల్లైనా ఎంతమందివచ్చినా పుష్పకవిమానంలా మరొకరికి చోటునిచ్చేది! పదిమందికిపైగా కూర్చోబెట్టుకొని కబుర్లాడిన అరుగులు! పెళ్ళిల్లు జరిగినా, పేరంటాలు జరిగినా  గొప్ప వేదిక అరుగు!ఆటలు ఆడినా, పాటలు నేర్చినా ఈ అరుగు ఆసరా.

ఈ ప్రహరీ గోడల్లోనే జాజులు పూయించినా, సంపెంగలు పూయించినా  అరటిపాదులు వేసినా, కూరమళ్లు నాటినా అదో గొప్ప విజయం!

ఈ అంగణంలో కల్లాపి జల్లి ముగ్గులు దిద్దినా, చిన్నిపాపలు దోగాడినా అదో మురిపెం!

శుచిగా, రుచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకునేందుకు అనువైన మట్టి కుండలు; కంచు,  ఇత్తడి, రాగి, ఇనుప వస్తు సామాగ్రి; రాతి తో చేసిన చిప్పలు, తిరగళ్లు, రోళ్లు;  వెదురు పుల్లలతొ అల్లిన బుట్టలు..ఇవన్నీ వంటింటి ఆరోగ్య సంపత్తులు!

పాడిపంటలకు, వృత్తి ప్రవృత్తిలకు అనుగుణమైన వెసులుబాటు ఉన్న ఇల్లు! .ఒకవైపు ఆవులు దూడల చావిడి మరోవైపు నట్టింట ధాన్యపు గాదెలు లేదా గరిసెలు!

ఇల్లు పుస్తకాల నిలయం! మంచి ఙ్ఞాపకాల చాయాచిత్రాల సమాహారం! లోపల దూలాలు, వాసాలతో ఉన్న ఇంటిపైకప్పు లోపలిభాగం , దూలానికున్న ఇనుప కొక్కేలకు తగిలించిన ఉయ్యాలబల్ల గొలుసులు, అమరిన ఉయ్యాలబల్ల, లాంతర్లు వేలాడదీసే ఇనుపరింగులు, పిచ్చుకలు ఉయ్యాలలూగే ఇనుపరింగులు,   ఆ  రింగు కు వేలాడుతున్న ఒక తీగకు గుచ్చిన ఉత్తరాల కట్ట తో ఎంత కళాత్మకం!

ఒక్కసారి ఇటువంటి ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టినట్లు ఊహించుకుంటే..సెపియా వర్ణ  యుగంలోకి అడుగుపెట్టినట్లుంటుంది.

ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తమ చిన్నప్పటి అనుభవాలే!

కానీ ఇంతటి ఆనందమైన , కాంతిమయమైన అనుభవాలన్నీ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలతో కూడినవే!

అవును..గచ్చుఇళ్లు, బంకమట్టి ఇళ్లు ప్రకృతితో మేళవింపు కలిగి, నివసించేవారిక్కూడా మేలుచేసేవి.

కొన్ని దశాబ్దాల కిందటిదాకా కూడా సంప్రదాయాలకు లోబడే ఇల్లు రూపుదిద్దుకునేది.  అక్కడక్కడే లభ్యమయ్యే పదార్ధాలతోనే అక్కడక్కడి వాతావరణానికి అనుకూలంగానే కట్టబడేది. మార్పు చాలా సహజం.కొండగుహల్లో తలదాచుకున్న మనిషి అద్భుతమైన సౌధాలని నిర్మించలేదూ!?

కౌరవుల రాజధాని నగరంలో ఇళ్లు రెల్లుగడ్డిపై తాపడం చేసిన బంకమన్ను భవంతులు. అని మా పితామహులు చెప్పారు.

512px-dakshina-chitra-kerala-house

హంపి కట్టడాలు – లోటస్ మహల్, ఉదయపూర్ రాజస్థాన్ నీర్ మహల్, త్రిపుర  నీర్ మహల్….రాజులు, జమీందారుల వాతావరణ అనుకూల కట్టడాలు, ఆ కాలపు సాంకేతికత మనల్ని అబ్బురపరుస్తాయి.  ఏన్నో పురాతన హవేలీలు ఉత్తరభారతమంతటా నిలువెత్తు నిదర్శనాలుగా అనిపిస్తాయి. కొండరాళ్లని తొలిచి నిర్మించిన కోవెళ్లలో , చారిత్రిక  కట్టడాలలో, పురాతనంగా నిర్మించబడిన  గుడి, మసీదు, దర్గా, చర్చి లాంటి దేవాలయాల్లో కూడా చల్లటిగాలులు ఒదిగి ఒదిగి వీస్తాయి.  చిన్ని పూరిళ్లలోనూ, మట్టిమిద్దెల్లోనూ, పెంకుటిళ్లలోనూ అవే చల్లటిగాలులు ఆప్యాయంగా  వీస్తాయి. కలిమి లేముల ప్రసక్తి ప్రకృతికి లేదు కదా! ఆంతా సమానమే దాని దృష్టిలో!

సామాన్యమానవుడైనా, ఎంత గొప్ప మహారాజైనా వాతావరణనికి అనుకూలంగానే నిర్మించాడు కదా!

సామాన్యుడి ఇంటి గోడలు బంకమట్టిలో, వడ్లపొట్టు ని కలిపినవి అయితే, కలవారి ఇంటి గోడలు  ఎండిన లేదా కాల్చిన మట్టి ఇటుకలతో ఉండేవి!  అయితే ఇద్దరి ఇళ్ల గోడలకి మాత్రం  సారూప్యంగా సున్నపురాయి పూత ఉండేది.  సున్నపురాయి క్రిమి కీటకాలను రానీయకుండా చేయటమేగాకుండా ,  సూర్యకాంతిని పరావర్తనం చేసే శక్తి కలిగుండి,  వేసవిలో ఇంట్లో ఉండే  వేడి తీవ్రతని తగ్గిస్తుంది.  బాగా నూరిన సముద్రపు చిప్పల పొడి, సున్నపురాయి, బెల్లం కరక్కాయ ల మిశ్రమాన్ని కూడా గోడలకు పైపూతగా పూస్తారు. ఈ విధానం  వర్షాకాలం, చలికాలం లో ఇంటి ని తేమ  బారి నుండి కాపాడుతుంది. గోడలు చిరకాలం పాటు మన్నుతాయి. పైగా గోడలు చాలా నున్నగాకూడా ఉంటాయి.  సున్నపురాయి పూత పూసిన గోడలు వాన చినుకులు పడినా, నీటి జల్లు పడినా  పరిమళాలు వెదజల్లేవి.

నా చిన్నప్పుడు ఉలగరం గా ఉన్నట్లుంది అంటే, మా బామ్మ “నోట్లో మంచినీళ్లు పోసుకొని పుక్కిలించి గోడమీద ఉమ్మేసి వాసన చూడు” అనేది.  నీళ్లు పడగానే,  గోడనుంచి కమ్మని సున్నపు గచ్చు వాసన. గుండెలదాకా దాన్ని పీల్చటం అదో సరదా! అదో రసాస్వాదన! అదో ఆరోమా థెరపి.

ఇప్పుడేవి శోభాయమానంగా ఉండే ఈ స్వర్ణకాంతులు?

ఇప్పుడేవీ ఈ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలు అని ప్రశ్నించుకుంటే దక్షిణచిత్ర అని చెప్తుంది మనసు రూఢీగా!

దక్షిణచిత్ర  Deborah Thiagarajan స్థాపించిన , చారిత్రిక జీవనశైలిని ప్రతిబింబించే పద్ధెనిమిది ఇళ్ల సముదాయపు హెరిటేజ్ మ్యూజియం. architects : Laurie Baker,  Benny Kuriakose .

ఇది ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన  గృహాలను తరలించి , పునర్నిర్మించిన సారస్వత వైభవ చిహ్నం!  ఇది  దక్షిణభారతం లోని నాలుగు రాష్ట్రాల లోని ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వృత్తిప్రవృత్తులకు సంబంధించిన జానపద జీవనశైలిని మన కళ్లముందు ఉంచుతుంది కాలుష్య రహితమైన వాతావరణాన్ని  గుర్తుచేయిస్తుంది. ప్రకృతి సామరస్య కట్టడాల ప్రాశస్త్యాన్ని నొక్కిచెప్తుంది.

చెన్నాపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లేదారిలో  సంప్రదాయ పురాతన భవనాలతో అలరారే దక్షిణచిత్ర ని మనం చూసితీరాల్సిందే! ఇక్కడ ప్రతిఒక్క ఇంటిలోనూ ఆయా వృత్తిపనులు కొనసగుతూనేఉన్నాయి. దీన్ని ఒక జీవనచిత్రమనొచ్చు. చెప్పానుగా సెపియా టిన్ టెడ్ కాలంలోకి వెళ్లిపోయిన అనుభూతి అని!

మొదట తమిళనాడు విభాగం  తో  హెరిటేజ్ టూర్ మొదలుపెడదాం. ఈ తమిళ ఇళ్ల నమూనాలలో  అన్నింటికంటే ఆకర్షణీయమైనది చెట్టినాడు ఇల్లు. ఇది చెట్టియార్ల మండువాలోగిలి.  స్తంభాల తో ఉండే వరండా, అరుగులు , మండువా చుట్టూ గచ్చుడాబా గదులతో,మండువా అంతా ఎర్రటి మంగుళూరు పెంకులతో ఇల్లు విశాలంగా ఉంటుంది.

చెట్టియార్ల ని నట్టుకొట్టై  చెట్టియార్లు అంటారు. వీళ్లు  వర్తకులు. బాగా శ్రీమంతులు. వాళ్ల ఇళ్లంతా బర్మా టేకు తో చేసిన సీలింగులతో ఇంటి దూలాలు, స్థంభాలేకాకుండా ఇంటిలోపలి భాగమంతా టేకుతో చేసిన నగిషీలు చెక్కిన ద్వారబంధాలు,    మార్బులు ఫ్లోరింగులతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నగిషీలు చెక్కి, ఇత్తడి గుబ్బలు పొదిగిన ప్రధాన ద్వారము, ద్వారబంధరము పై చిక్కని నగిషీలుచెక్కిన దేవుడి బొమ్మలు ఈ దేశవాళి ఇళ్ల  ప్రత్యేకత.

చెట్టియార్ల ఇళ్లని మనం అధ్యయనం చేస్తే వీళ్లు ప్రకృతి సామరస్యంగా ఎలా ఇళ్లని నిర్మించుకున్నారో మరింతగా తెలుసుకోవచ్చు.  ఎత్తైన సీలింగులు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే అనువైన కిటికీలు, తలుపులు అన్నీ టేకు కలపతో చేసినవే. అన్నీ . ఈ ఇంటి గదులు ప్రత్యేకమైన పూత వేయబడినవి.

కరైకుడి  అనే ప్రాంతం చెట్టినాడు. హెరిటేజ్ బంగ్లాలకు పెట్టింది పేరు

ఇవి పురాతన వైభవం, సాంస్కృతిక సంపత్తుకి ఆలవాలంగా ఉంటాయి.

agraharam

తరువాత సంప్రదాయ బ్రాహ్మణ ఆగ్రహరము. దీన్ని దక్షిణచిత్ర లో విష్ణు అగ్రహారము అని అంటారు. ఇది తిరునెల్వేలిలోని అంబూరు గ్రామపు  సంప్రదాయ బ్రాహ్మణ అగ్రహారాన్ని పోలిఉంటుంది/తలపిస్తుంది.  మద్రాస్ టెర్రస్ లు, బర్మా టేకుతో చేసిన దూలాలు, స్తంభాలు, సున్నపురాయి పూతలున్న గోడలు, సరైన గాలి, వెలుతురుల సదుపాయాలతో ఉన్న ఇళ్ల సముదాయము. అగ్రహారపు వీధి అంతా వరుస ఇళ్లతో ఒకదానినొకటి ఆనుకొని ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఈ వీధి చివర ఒక విష్ణు అలయం కూడా ఉంటుంది. ఈ ఇళ్లు రెండంతస్తులచిన్న భవనాలు.  కలప స్తంభాలతో అరుగు, లోపల హాలు, చిన్న గదులు, పూజగది, వంటిల్లు , పెరడు, పై అంతస్తులో గదులుంటాయి.  గాలి వెలుతురు ప్రసరించటానికి పై అంతస్తులో చిన్న కిటికీలు ఉంటాయి.   ఈ వీధికి ఒక చివర పెద్ద వేపచెట్టు నీడనిస్తూ ఉంటుంది.  ఈ వీధి ఓ  సామాజిక  జీవనచిత్రాన్ని మన కళ్లముందు ఉంచుతుంది.

ప్రతింటికీ ఉన్న అరుగు …పెద్దవాళ్లు, బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వాళ్లు   చర్చించిన సామాజిక, రాజకీయ విశేషాలకు వేదిక ఇదే! చిన్నపిల్లలు ఆడుకున్న  గొప్ప ఆటస్థలమిదే! చుట్టువైశాల్యం ఎక్కువగా ఉన్న అరుగుమీది స్తంభాలు దాక్కునేందుకు మంచి జాగాలు. అంతేనా

ఉదయం మొదలుకొని సాయంత్రందాకా భయమన్నదే తెలియక ఎప్పుడూ తలుపులు తెరిచుంచిన ఇళ్లలో అసంఖ్యాకమైన  పిల్లల దాగుడుమూతల ఆటకు ఎన్ని జాగాలు!  ..నట్టింటిలో ధాన్యం గాదెలు, బస్తాలు, గరిసెలు, అటకలు..ఇలాంటివెన్నో!  ఇటువంటి నేపథ్యం నుంచి ఉన్నతంగా ఎదిగిన పిల్లల సమాజం ..తలచుకుంటే చాలు ఒక రీలులా తిరుగుతుంది.   ఏవరికివారే తమ చిన్ననాటి అనుభూతుల్ని నెమరివేసుకునేలా చేస్తుంది.

మాతామహుల ఇంటికి వేసవిసెలవులకు వెళ్లినప్పుడు, మధ్యాహ్నపు వడగాడ్పులకు మమ్మల్ని ఇంట్లోనే కట్టిపడేసేంతపనిచేసేవారు. ఆంత పెద్ద మధ్యహాలు బేతంచర్ల బండలు నల్లగా నిగనిగలాడుతూ ఉండేవి. పిల్లలందరం హాల్లోనే పడిదొర్లుతుండేవాళ్లం. విసనకర్రలు తప్పించి విదుత్ పంఖాలు ఇంకా ప్రవేశిన్చని కుగ్రామమది. మరి అంతమంది  ఉన్నా ఉక్కబోత ఉండేదికాదు. ఉన్డుండి వీచే సెగ గాలులు ఇంట్లో ప్రవేశించేసరికి చల్లని సమీరాల్లా మారిపోయేవి. ఆ ఇల్లు చేసిన మాయాజాలమిది!  ఈ కబుర్లు కొరతలేనివి. వీటిని కొద్దిసేపు పక్కనపెట్టి  హోం టూర్ కి మళ్లీ వచ్చేద్దాం.

dakshinachitra-traditional-chikkamagaluru-house1

మరో ఇల్లు తమిళనాడు పట్టునేత వాళ్లది. పట్టునేత అనగానే గుర్తొచ్చేది కాంచీపురం.  కంచిపురం నుండి తరలించిన ఇంటి నమూనానే ఇది. రంగురంగు పట్టుదారాలతో మగ్గము ఉన్న లోపలి వరండా కనిపిస్తుంది.  కళకళలాడే పట్టుచీరలు, వాటిని కట్టుకునే  పుత్తడిబొమ్మలు. ఆ శోభని ఏమని వర్ణించగలం!? కళామయమైన ఈ మగ్గపు ఇళ్లు , ఆ నేతకారుల రంగులమయ స్వప్నాలకు ప్రతీకగా కనిపిస్తుంది.

ఇక మరో ఇల్లు వ్యవసాయదారుని ది. ఇది కొంచెం చెట్టినాడు ఇంటిని పోలి ఉంటుంది. ఇవే కాకుండా కుమ్మరి, మేదరవాళ్ల(బుట్టలల్లేవారి) ఇళ్లుకూదా ఉన్నాయి.  అవి బంకమట్టితో నిర్మించిన ఇళ్లు. ఇళ్ల పైకప్పుగా తాటాకులుంటాయి. ఈ ఇళ్లక్కూడా ఇంటిముందు అరుగు ఉంటుంది.

మరిక ఆంధ్రప్రదేశ్ విభాగానికి వస్తే ప్రస్తుతానికి రెండిళ్లు మాత్రమే ఉన్నాయి. వరంగల్ జిల్లా గ్రామపు ఇల్లొకటి , దాన్ని ప్రాంతీయంగా “భవంతి” అని అంటారు. ఇది చేనేతకారుల గృహం. ఇంటిముందు రెండువైపులా పొడవాటి అరుగులు ఉంటాయి. ఇంకొకటి విశాఖపట్టణ ప్రాంతపు చుట్టిల్లు అని పిలవబడే ఇల్లు. చుట్టిల్లు అంటే గుండ్రంగా ఉన్న ఇల్లు అని అర్ధం. సముద్రతీర ప్రాంతం లోని ఇళ్లు ఇలా గుండ్రంగా ఉండటం వల్ల తరచూ వచ్చే తుఫాన్ తాకిడికి తట్టుకుంటాయి. గోడలుకూడా గుండ్రంగానే ఉండి,

పూర్తిగా బంకమట్టి తో కట్టినవి.

ఇంకా మరికొన్ని ఆంధ్రప్రదేశ్ ఇళ్లను రీలొకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నప్పటికీ, తమిళనాడులోని అగ్రహారం, వ్యవసాయదారుడి, కుమ్మరి, మేదర, పద్మశాలీల ఇళ్ల వాతావరణమే  తెలుగునాట కూడా కనిపిస్తుంది.

ఇక కర్ణాటక గృహాల విషయానికొస్తే బాగల్ కోట్ లోని ఇల్కాల్ చేనేతకారుని ఇల్లు. పూర్తిగా బండరాళ్లతో కట్టబడింది.

ఈ ఇంటిని చూడగానే సత్రాలు గుర్తుకువస్తాయి. బన్డలు పరిచిన బండ్ల మిద్దె.  చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన  అంతా సున్నము వేస్తారు.  కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. పుణ్య క్షేత్రాల సమీపాన నిర్మించిన సత్రాలు అన్నీ ఇటివంటివే. ఇవి చిరకాలము నిలుస్తాయి. త్రిపురాంతకేశ్వరుడు, , బాలా త్రిపుర సుందరి ఆలయాల ధర్మకర్త మా మాతామహులు. ఆ ఆలయకొండ దగ్గరే మా సత్రం కూడా ఉండేది.  మరి ఇటువంటి సత్రం, చుట్టూ చింతచెట్లగాలి..ఉగాది సమయంలో, ఎండ తీవ్రతని కలిగించనీయని ఈ సత్రంలో దేవుడి ఉభయం అత్యంత సందడిగా జరిపించేవారు మా తాతయ్య.

ఇల్కాల్ చేనేతకారుని ఇంటికి బండరాళ్లతో,  చెక్కతో ఉన్న ఒక పెద్ద ప్రవేశద్వారాన్ని నిర్మించారు. ఈ ఇంటిపైకప్పు  చదరమైన బండలు, మట్టి సాయంతో పేర్చబడింది.

ఈ ఇంటిలో ఏకొద్దిపాటి చెక్కను వాడినా, అదిమాత్రం వేపచెక్కనే వాడారు. ఉత్తరకర్ణాటకలో ఎక్కువగా దొరికేది వేప కలపనే. దాన్నే వాడుకున్నారు.

వేప త్వరగా పుచ్చిపోదు. ఇళ్ల కిటికీలకు, తలుపులకు, గుమ్మాలకు వాడొచ్చు. టేకుని వాడేంత ఆర్ధికస్థితి లేనప్పుడు వేపచెక్కని వాడటమే శ్రేష్ఠం.

మరొక ఇల్లు చిక్ మంగుళూరులోని సంప్రాదాయ రెండంతస్తుల భవనం. ఇది ముసల్మానుల గృహం.  చిక్ మంగుళూరు లోని కొండప్రాంతంలో సమృద్ధిగా దొరికే కలపతో నిర్మించారు. ముస్లిముల వైభవాన్ని, కొంత అరబ్, టర్కీ దేశాల వాస్తు ప్రభావాన్ని కలిగున్న 1914 నాటి కట్టడమిది.  దక్షిణచిత్రకి తరలించి తిరిగి అలాగే నిర్మించారు. దీని వరండా విల్వంపు కమానులతో, నిలువెత్తు స్తంభాలతో , అందంగా చెక్కిన ముఖద్వారంతో  ఉంటుంది.  కిటికీలు కలప, సున్నపుపూతతో అద్దిన డిజైన్స్ తో అందంగా అమరించిఉన్నాయి.  ఇంటిలోపల పింగాణీ కళాకృతులు, మేజాలు, సోఫాలతోనూ ఐశ్వర్యమయంగా ఉంటుంది.

ఇక కేరళ ఇళ్లు..వీటిగురించి తెలియనిదేముంది?  ఎర్రటి దేశవాళీ పెంకుల వాలు వసారాలతో, పైకప్పులతో ప్రతిఒక్క వాననీటిబొట్టు తిరిగి ధరిత్రిని చేర్చే సహృదయంతో ఉంటాయి ఈ ఇళ్లు.

dakshinachitra_traditional_kerala_syrian_christian_house1

ఇక్కడ దక్షిణచిత్రలో నాలుగు రకాల కేరళ ఇళ్లు ఉన్నాయి. మొదటిది సిరియన్ క్రిష్టియన్ ఇల్లు . ఇది ట్రావెంకూర్ ఇళ్ల నమూనాలా ఉంటుంది. ఇది 1850 లో కట్టబడినది. దక్షిణచిత్రలో  తిరిగి దీన్ని నిర్మించారు. ఇల్లంతా పూర్తిగా కలపతోనే నిర్మితమై ఉంటుంది.  కలప మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారిదీ గృహం. ఇ ఇంటి వరండాకి ఒక పడవ వేలాడదీసి ఉంటుంది.

ఇక పుట్టుపల్లి ఇల్లు. ఈ ఇంటిలో కలపతోచేసిన ధాన్యాగారము, ఆవుల చావిడి కూడా ఉంది. ఈ ఇల్లు కొంచెం బ్రిటీష్ వాస్తుని పోలి ఉంటుంది. తిరువనంతపురం లోని నాయర్ ఇల్లు ఇక మూడవది. ఇది కూడా పుట్టుపల్లి ఇంటిలానే ఉన్న పెద్ద భవనం. పూర్తిగా టేకుతోనే కట్టారు. ఇది దక్షిణ కేరళ ఇళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉత్తర కేరళలోని కాలికట్ ఇల్లు మరొకటి,  దీన్ని కంకరతో కట్టారు. ఇది ఒక మేనన్ కుటుంబానికి చెందినది.  దీని ఇంటిమండువాని  నడుముట్టం అని పిలుస్తారు. ఎత్తైన టేకు స్తంభాలతో ఇంటి మధ్య లోగిలి తో ఉంటాయి. పైనుంచి తొంగిచూసే కాంతి, ఉండుండి వీచే చల్లటిగాలి , అప్పుడప్పుడు చప్పుడు చేసే వాన చినుకులతో మంచి ఙ్ఞాపకాల్ని అందిస్తుందీ నడుముట్టం.  ఈ ఇంటినిండా చిన్న చిన్న  గదులు చాలా ఉన్నాయి. కాంతి చాయలు పరుచుకున్న ఈ నడుముట్టం వరండాలలో కేరళలో ప్రాశస్తమైన మ్యూరల్ పెయింటింగ్స్ ఉన్నాయి.

ఈ దక్షిణచిత్రని చూస్తే మళ్లీ మనకు అవసరమైన సాంఘిక, ప్రకృతిమయ జీవితం తిరిగి పొందినట్లు ఉంటుంది. పిల్లల ఆటపాటలతో , పెద్దల సామరస్య జీవన కట్టుబాట్లతో ఒకప్పుడు సామాన్య ప్రజలు  ఎలా జీవించారో తెలియచేస్తుంది.

కేరళ వాళ్లు ఇటువంటి ఇళ్లని, భవనాల్ని ఇంకా కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఇళ్లు అడపాదడపా ఎక్కడో అక్కడ మనము పుట్టిన తెలుగునాట మొదలుకొని దేశమంతటా కనిపిస్తూనే ఉంటాయి.  స్పెయిన్, ఫ్రెంచ్ . ఫొర్చుగీసు , బ్రిటీష్ వారి వాస్తుశైలికి ప్రభావమై నిర్మించిన  హెరిటేజ్ కట్టడాలను కలకత్త, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, కూర్గ్, కేరళలలో హోంస్టే లుగా టూరిస్ట్ లకి వసతిని కల్పిస్తున్నారు. కొన్ని  హెరిటేజ్ బంగ్లాలు అధునాతన హోటళ్లుగా రుపుదిద్దుకున్నాయి. యాంటిక్ శైలికి ప్రభావితులైనవారకి  సెలవుల్లో విడిదిగృహాలవుతున్నాయి. .

ఈ దక్షిణచిత్రని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకుంటే, చిన్నపిల్లలు సరికొత్త అనుభూతులకు లోనౌతారు.  ఉదయం నుంచి సాయంత్రందాకా తిరుగుతూ ఆ ఇళ్లమధ్య తమని తాము తిరిగి పొందవచ్చు!

గుండెలోతుల్లో నిక్షిప్తమైన ఆ రోజుల్ని కళ్లముందు తిరిగి ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది ఈ దక్షిణచిత్ర!

మున్ముందు అవసరమయ్యే ప్రకృతి సామరస్య జీవన విధానానికై కనువిప్పు కలిగించి, స్ఫూర్తిని అందిస్తుంది ఈ దక్షిణచిత్ర!

*

మీ మాటలు

  1. Mythili Abbaraju says:

    ఎంత బాగా చెప్పారు !!
    వైవిధ్యం వేర్పాటు తనం కాదు అన్న అంతర్ధ్వని ఇంకొంత శాంతి ని ఇచ్చింది.
    చాన్నాళ్ళ తర్వాత మీ ప్రత్యేకపు గొంతు వినిపించింది

    • సువర్చల says:

      సరీగ్గా గ్రహించారు మైథిలిగారూ! నిజంగా ఆ భావన నా మనసునిండా ఉంది.
      కలిసి బతకటం చేతకావాలి. అదే విజయం!
      అదే ఈ వ్యాసం పరమార్ధం!
      నా అంతర్ధ్వని మీకు వినిపించటం నాకు మరింత సంతోషం!

  2. Venkat Suresh says:

    అబ్బా !! ఎంత బాగుందో చదువుతుంటే !!

    • సువర్చల says:

      వెంకట్ సురేష్ గారూ! చిన్నపిల్లాడిలా సంబరం మీలో! నాకు మరింత మోదం!

  3. సువర్చల గారూ, ఎంత బాగా రాశారు!
    “ఇల్లు….. ఋతువులకనుగుణంగా, ఆదరాభిమానాలు అను-గుణాలకు మరోరూపంగా ఉండేది! బంధుమిత్రుల్ని ఆదరించేది! ఎంత చిన్న ఇల్లైనా ఎంతమందివచ్చినా పుష్పకవిమానంలా మరొకరికి చోటునిచ్చేది! పదిమందికిపైగా కూర్చోబెట్టుకొని కబుర్లాడిన అరుగులు! పెళ్ళిల్లు జరిగినా, పేరంటాలు జరిగినా గొప్ప వేదిక అరుగు!ఆటలు ఆడినా, పాటలు నేర్చినా ఈ అరుగు ఆసరా.”
    ఎప్పుడో చదివిన కృష్ణ శాస్త్రి గారి ‘మా వూళ్ళో వీధి అరుగు’ వ్యాసం గుర్తొచ్చింది.
    ఊళ్లు తిరగడం ఒక ఎత్తైతే, అక్కడి మనుషులూ, వారి తీరు తెన్నులూ, ఇళ్ళూ-వాటి నిర్మాణ వైచిత్రులూ అన్నే లోతుగా పరిశీలించగలగడం మరొక ఎత్తు.
    పరిశీలనా దృష్టి కలిగి ఉండడం, దాన్ని చక్కగా నలుగురికీ చెప్పగలగడం … మీ శైలిలో… అభినందనలు, ధన్యవాదాలూను!

    • సువర్చల says:

      చాలా ధన్యవాదాలు శివరామ కృష్ణారావు గారూ! మీరు చెప్పాక మా వూళ్ళో వీధి అరుగు చదవాలనిపిస్తుంది.

  4. వారణాసి నాగలక్ష్మి says:

    ‘ఎర్రటి దేశవాళీ పెంకుల వాలు వసారాలతో, పైకప్పులతో ప్రతిఒక్క వాననీటిబొట్టు తిరిగి ధరిత్రిని చేర్చే సహృదయంతో ఉంటాయి ఈ ఇళ్లు’ ప్రకృతి పట్ల మీ ప్రేమంతా రంగరించి మాకందించారుగా! థాంక్యూ! ఇక్కడికి మీతో వెళ్లా లనిపించింది!

    • సువర్చల says:

      నాగలష్మి గారూ! నాపై మీ ఆత్మీయత వెలలేనిది! ఎనలేనిది!

  5. ఇంటిని గురించి ఇంత చక్కని వర్ణన ఎక్కడా చదవలేదు. దక్షిణచిత్రలో రకరకాల ఇళ్లను గురించి బాగా చెప్పారు.మనం నివసించే ఇల్లు మన మనోవికాసానికి దోహదపడాలి పూర్వం అలానే ఉండేవి .మీరు అన్నట్లు ఇల్లు ప్రతి ఒక్కరి జ్ఞాపకాల పొదరిల్లు. చిన్ననాటి జీవిత మంతా గుర్తుకు తెచ్చే అనుభవాల గని.మరొక్కసారి చిన్ననాటి పారిజాత పరిమళాలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు సువర్చలా గారు.

    • సువర్చల says:

      వసుధ గారూ! థేంక్సండీ.
      “మనం నివసించే ఇల్లు మన మనోవికాసానికి దోహదపడాలి” చాలా మంచిమాట చెప్పారు.

  6. sumalatha majeti says:

    చాలా బావుంది మేడం. మేము దాదాపు ఒక 10 ఏండ్ల క్రిందట అనుకుంటా పిల్లలతో వేసవిలో వెళ్ళినాము. నాకు దక్షిణచిత్ర అంటే వెంటనే గుర్తుకురాలేదు. కాని అంతా చదివిన తర్వాత, ఎక్కడో దాగిన హాయైన ఆనాటి అనుభవం గురుతుకు తెచ్చింది. అవును నిజమే అక్కడ తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాల పవనాలు వీస్తూవుంటే వేసవిలో చెన్నై లో చల్లగా హాయిగా అనిపించిది. ఇవ్వన్నీ మన సంస్కృతికి చిహ్నాలే కదా అని గర్వంగా కూడా అనిపించిది.

  7. సువర్చల says:

    సుమలత గారూ! ధన్యవాడాలండి. మీరు దక్షిణచిత్ర చూసినందుకు సంతోషమనిపించింది.

  8. Suvarchalagaaru, very informative aticle.you did lot of work and reserach and wrote beautiful article.. I went to my old days. Food habits,dress, houses, economic conditions 100% depends on geographical conditions. I felt so happy after reading your article. Thank you very much.

    • సువర్చల says:

      చాలా సంతోషమండి. మీ మాటలు నాకు బాగా నచ్చాయి. మీకు మరిన్ని ధన్యవాదాలు సుశీలగారూ!

  9. బావుంది వ్యాసం.. మీరు పంపక పోతే మిస్ అయ్యేదాన్ని. న ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశా.
    ఇంకో సాయం చెయ్యండి.. మీరుతెలుగులోకి అనువదించే అప్ ఏది వాడుతున్నారు?నాకు కూడా పంపండి ప్లీజ్.

    • సువర్చల says:

      చాలా సంతోషం రమణిగారూ! బోలెడు థేంక్స్ కూడా!
      ఇక నేను ఏ ఆప్ వాడటంలేదండి. లేఖిని తెలుగు టైపింగ్ మాత్రమే వాడ్తాను.

Leave a Reply to సువర్చల Cancel reply

*