పరిధి

Art: Rafi Haque

Art: Rafi Haque

 

 “చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి…”

కారు ఖైరతాబాద్ ఫ్లైయోవర్ మీద వెడుతోంది. ముందున్న కారుని జరగమన్నట్టు హారన్ కొట్టగానే వినయంగా పక్కకు జరిగిపోయాడు. బండి కొత్తదై ఉంటుంది, లేకపోతే చిన్న కారుకోసం పెద్ద కారు జరగడమే! అందునా ఆడువారు నడుపుతూంటే! చటుక్కున గుర్తొచ్చింది. బహుశా షివల్రి లో భాగమేమో. మొన్న మీటింగ్ నుంచి వెనక్కి వస్తుంటే ఎం. డి వాళ్ళ డ్రైవర్ తో ఏమన్నాడు? ‘మూవ్, మూవ్…పాపం ఆడామె, ఎల్ బోర్డు ఉంది. మనం జరగాలి. లేకపోతే బండి డామేజ్ అవగలదు.’

‘ఏం చేస్తాం, మోడరన్ టైమ్స్!’ గేర్ మారుస్తూ అనుకుంది. ‘తూలిరాలు వటపత్రమ్ముల పై…తేలి తేలి పడు తరువులవే..’ పాట హాయిగా సాగుతోంది.

ఈ హుసేన్ సాగర్ చల్లగాలిలో…ఏ శ్యామసుందరుని మురళి వినిపిస్తుంది? శ్యామసుందరులు, ఎవరు వారు? ఎవరి మురళి వినిపిస్తుందే, చెప్పు? ఆమెకే నవ్వొచ్చింది. ఏ రాయైతేనేమి?

“పూలతీగా పొడరిండ్లమాటునా..పొంచి చూచు శిఖిపింఛమదే…” రజనీకాంతారావూ….నీకు వేల పాదాభివందనాలు. మామూలువి కాదు, నా యోగా క్లాసు లో నేర్పిన అతి క్లిష్టమైన పాదభివందనం. ఎలా రాసావయ్య!

ఫోన్ రింగ్ అవుతోంది. తెలియని నంబరు. తనేనా..?

“మేడం, నేను గీతని…”

“ఊ చెప్పు..గీతా….”అనాసక్తిగా..గీత గుర్తుపట్టి ఉంటుందా?

“మీకు నేను డబ్బులు ఈయాలె..”

ఆ అవును నిజం. మర్చిపోయింది. “చెప్పు”

“ఈ రోజు సాయంత్రం వచ్చి ఈనా?”

సరే. ఎంత ఇస్తుంది? ఆకస్మిక ధనలాభం. ఇంటి అడ్వాన్సుకు బోడి ఆరువేలు ఇచ్చినందుకు. ఇవ్వనివ్వులే కాస్త ఫైనాన్సియల్ డిస్సిప్లిన్ వస్తుంది.

ఇంతకు ముందు ఉద్యోగం లో తన ఆఫీసులో స్వీపర్ గీత. ఇంకా గుర్తుంచుకుందే! నీతీ నిజాయితీ పేదవారిలో లేదన్నవారెవరు? వాడ్ని వెళ్లి ఒకటి తన్ని వస్తే సరి. ముందు ఆగు, సాయంత్రం వచ్చి ఇవ్వాలిగా.

గీత! ఈ గీతే కదా…ఆ రోజు పొద్దున్న అంత కంగారుగా పోనే చేసింది.

“మేడం, మా ఆయన నాకున్న ఇంకో ఫోన్ చూసేసిండు. నాకు భైమైతుంది మేడం.” భయం ఎందుకో అర్ధమవుతూనే ఉంది. ఒక ఫోన్ ఎప్పుడూ ఆఫీసులో ఉంచుకుంటుంది గీత. అందరికీ తెలుసు. అందుకే కాస్త చిన్న చూపు కూడా.

‘ఇప్పుడు ఫోన్ వస్తే..నాకేమో అందులోవచ్చే ఫోన్ నెంబర్ నోటికి నంబరు రాదు మేడం. ఈనకి తెలిస్తే మస్తు కొడతాడు. ఏమైనా చెయ్యండి మేడం.’ తాగుబోతు భర్త. చిల్లిగవ్వ సంపాదించడు. పనికిరాని మొగుడు. తెలిస్తే మాత్రం తంతాడు.

ఆఫీసుకు వెళ్ళి తన ఫోన్ నుంచి గీత భర్త దగ్గరున్న నెంబర్ కి ఫోన్ చేసింది.

“హలో మేడం, నేను గీత పెనిమిటిని.”

“…గీతేది?”

“ఆఫీసుకు పోయనుండే మేడం.”

“మరి ఫోన్ నీదగ్గరుందేంటి? ఆఫీసు ఫోన్లు పర్సనల్ పనుల కోసం వాడుతున్నారా…”

“మేడం, మేడం, గట్లెం లేదు మేడం. మర్సిపోయనుండచ్చు. నేన్ గిప్పుడే తెచ్చిస్త.”

పావుగంటలో ఆఫీసుకొచ్చాడు. గీత సంబరాన్ని అణుచుకుంటూ కేబిన్ లోకి తీసుకొచ్చింది. తను కావాలనే కాసేపు నించోబెట్టింది. కాసేపు మౌనం. ఎందుకంత ఒంగిపోతున్నాడు? పెదాలకు పుండ్లు పడి రసికారుతూ. వీడితో కాపరం ఎలా చేస్తోంది? మొహం లో ఏ భావమూ లేకుండా, “తెచ్చావా?” అడిగి, వాడు ఇవ్వగానే ఫోన్ పక్కన పెట్టేసింది. వాడు వెళ్ళకుండా అలానే ఆని నిలబడ్డాడు. ఇంకాసేపు కావాలనే మౌనం. పర్లేదు, తన పాత్ర బానే పోషిస్తుంది.

“ఏంటి?”

‘ఫోన్ మర్సింది మేడం. సారి. ఇంట్లకి వేరే ఫోన్ ఉన్నది మేడం. జర కోపం జేయకున్రి. ముగ్గురు పిల్లలు మేడం. ఉద్యోగం ల్యాపాతే చాన ఆగమైతది.’ బానే తెలుసు. కాని ఇప్పుడు బోధించే సమయం కాదు. శాసించే సమయం.

‘సరే’ తల తిప్పకుండా అంది.

‘నమస్తే మేడం.’ మళ్ళి ఒంగి సగం నమస్తే చెబుతూ వెళ్ళిపోయాడు. గీత వాడిని సాగనంపే మిషతో కూడా వెళ్ళి, వెళ్ళాడని నిర్ధారించుకుని వెనక్కి వచ్చింది.

Kadha-Saranga-2-300x268

‘థాంక్స్ మేడం మొహంలో బరువు తగ్గిపోయింది. ‘ఎంత రిలీఫ్ వచ్చిందో.’గీత ఇంగ్లీష్ ప్రయోగిస్తూ ఉంటుంది.

‘ఎందుకు రిలీఫ్? తన్నడనా?’

‘అవును మేడం.’ ఇబ్బందిలేని నవ్వు.

ముగ్గురు పిల్లలు మరి. ఒకటి రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కొన్నిరోజులు బావున్నా..మళ్ళీ మొదలు. ఆఫీసుకి వచ్చి మరీ తాగడానికి డబ్బులు పట్టుకెళ్తాడు. ప్రభుత్వానికి మందు అమ్మడానికి కేటాయించిన బడ్జెట్లో డీయడిక్షన్ కి ఏమి నిధులుండవు. కాబట్టి వీళ్ళు తాగుబోతులయ్యాక బాగుపడే అవకాశాలే లేవు. వీళ్ళు చచ్చేరోజు వచ్చేవరకూ..పెళ్ళాలు ప్రతిరోజూ చావాలి.

“వదిలెయరాదు. ఎందుకీ గోల?”

“ముగ్గురు పిల్లలు మేడం. మా అమ్మోల్లు పద్నాలుగేన్లకే పెళ్లి చేసినారు. గిప్పుడు వదిల్తే ఎవరూ సపోర్ట్ చెయ్యరు. ఆయనకి ఊరిలో ఒక ఇల్లుంది. నేను ఇడిశివెట్టి పోయి నాకేమన్న ఐతే ఇంకేవరుంటారు? కనీసం ఆ కొంచం ఆస్తి అన్న మిగలనీయి.”

“పడు ఐతే. అయినా నీ ఫాషన్ పిచ్చిలో కాస్త నీ సంసారం మీద పెట్టరాదా.”

“గట్లనకండి మేడం.” నిరాశగా నవ్వింది. “గిది గూడా లేపోతే ఇంకేం ఉండే జీవితంల. అమ్మోల్లకి పట్టది, అత్తోల్లకి పట్టది. నాకు మాత్రం తప్పదీ యాష్ట.”

ఇట్లాంటి పిల్లకి వేరే ఫోన్ లు ఉంచుకోవడం కరక్ట్ కాదు. రిస్క్ కూడా. అవతల వెధవ ఎవరో! మరి మొగుడితో ఉంటే ఉండే రిస్క్ మాటో…అదివేరేలే..అది ఆమోదయోగ్యమైన రిస్క్! తన్నినా, ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నా…పెళ్ళిలో సబ్ చల్తాహై..

షిట్. రెడ్ సిగ్నల్. ఇంకా లేట్. ఫస్ట్ అవర్ లోనే మీటింగ్ ఉంది. మానేయరాదూ…వెధవ ఉద్యోగం. మానేసి, నీహారిక చెప్పినట్లు తిండి, తిండి, తిండి. వండుతూ కూర్చోవచ్చు.  “కానీ ఇప్పుడు అందరి నోర్లూ మూయించడానికి నా జీతమే ఒక పేపర్ వెయిట్ లా పని చేస్తోంది.”  మొన్న సింపోసియం లో కలిసినప్పుడు లిప్ స్టిక్ పెదాలతో అందంగా నవ్వింది.

ఆఫీస్ దగ్గరపడుతున్న కొద్దీ చేయవలసిన పనులు గుర్తొస్తున్నాయి. అందరిని విష్ చేస్తూ కేబిన్ దగ్గరకు చేరుకుంటే…”హాయ్!” సందీప్ ఎదురొచ్చాడు.

“హే…చెప్పు”

“ఎంత సేపు జానేమన్…నీకోసమే ఈ వెతుకులాట.” తన మార్కు సొట్టనవ్వొకటి విసిరి.

“హౌ ఐ విష్…సరే, నీ పనేంటో చెప్పు. కుదిరితే ఈ రోజే చేస్తా..”

“నో..”గట్టిగా అరిచాడు. “ఇప్పుడే అయిపోవాలి.”

“ఏంటి”..తెల్లబోతూ అడిగింది. “ఆడిట్ రిపోర్ట్ త్వరగా మెయిల్ చేయ్యవా…నా మెయిల్స్ మధ్యలో  ఎక్కడో ఇరుక్కు పోయింది. దొరకడం లేదు. ఐ మైట్ నీడ్ ఇట్ ఫర్ రిఫరెన్స్.”

“గాడ్, యు ఆర్ ఇన్సేన్! ఎందుకంత అరవడం?”

“బేబీ, సానిటి లెవెల్ ని మాచ్ అవ్వాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరమూ ఇన్సేన్ అవుతమన్నాడు ఒక మహానుభావుడు.”

“నిజమే”, ఆలోచిస్తూ అంది.

“బై బేబి. హవె అ లాట్ అఫ్ వర్క్.” వెళ్ళిపోయాడు.

పది నిముషాల్లో మీటింగ్ రూమ్ కి రమ్మని పిలుపు. తన ప్రెజంటేషన్ అయిపోగానే, సందీప్ అందుకున్నాడు. అతని గురించి తెలుసామెకి. కవిత్వం రాసినంత బాగా బిజినెస్ కూడా చేయగలడు. చక్కటి ఉచ్చారణ…లయబద్ధంగా మాట్లాడతాడు. ఎదురుగా కూర్చున్న క్లయింట్ల కళ్ళలో మెరుపు ను చూస్తోంది.

హఠాత్తుగా తన పేరు పెట్టి పిలిచి…అతనేదో అడిగాడు.. తన దగ్గర సమాధానం లేదు. ముందు ప్రిపేర్ అవమని చెప్పి ఉండవలసింది. తరవాత మెయిల్ చేస్తానని చెప్పి సర్దింది గాని తనకి తెలుసు. సందీప్ అసహనంగా బుజాలెగరేసాడు. అందరూ అసంతృప్తిగా లేచారు.

లంచ్ తర్వాత ఎం. డి నుంచి కాల్. ‘నువ్వలా వేగ్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండవలసింది’, తన తప్పేమీ లేదని తెలుసు. కానీ ఎవరో ఒకరు బ్లేమ్ తీసుకోక తప్పదు. ‘ఈ రోజు నువ్వు చేసిన పని ఎంత ఇబ్బందిలో పడేసిందో నీకు తెలియదు.’ సందీప్ ఏ భావం లేకుండా సాండ్ టైమర్ తో ఆడుకుంటున్నాడు. అయినా అప్రైసల్ ముందు ఈ జిమ్మిక్కులు అవసరమే. పట్టించుకోవద్దు….లూయీహే చెప్పాలా.. వి ఆర్ విక్టిమ్స్ అఫ్ విక్టిమ్స్! ఛ…

ఎం. డి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి లంచ్ టైం దాటిపోయింది. వినీల దగ్గరనుంచి ఫోన్.

“హాయ్. చెప్పు”

“నువ్వే చెప్పు. ఎవడికి మూడింది?”

“తెలిసిపోయిందా, ఈ రోజు కాదులే..ముందుముందు…”

“హోలీ షిట్..మళ్ళీనా..ఏం జరిగింది?”

“తర్వాత చెప్తాలే. నువ్వు చెప్పు.”

“సాయంత్రం దారిలో ఆగుతావా. ఒక చిన్న పర్సనల్ పని ఉంది. ఒక్క హాఫ్ ఆన్ అవర్ అంతే.”

“సరే, సీయా.” ఫోన్ పెట్టేసి లంచ్ కు వెళ్ళింది.

ఆఫీస్ నుంచి త్వరగా బయటపడింది. వర్షం పడేట్లుగా ఉంది. సాయంత్రం ఇళ్ళకి వెళ్ళవలసినవాళ్ళతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. మెహది హస్సన్ గజల్స్ కష్టం తెలీనీకుండా ప్లే అవుతున్నాయి.

ఫోన్ మోగింది. చప్పున కాల్ తీసుకుంది. అబ్బా, తను కాదు. “హాయ్ రా!”

“హాయ్, త్వరగా చెప్పు. డ్రైవ్ చేస్తున్నా..”చిరాకును అణుచుకుంటూ..

“ఫోన్ చెయ్యలేదే?” కినుక గొంతులో.

“ఎప్పుడూ..?” రైట్ ఇండికేటర్ ఆన్ చేసింది.

“నిన్న ఫోన్ పెట్టె ముందు, మళ్ళి అరగంటాగి చేస్తానన్నావు.”

పాపం! “సారీ…” హడావిడిలో వదిలించుకోవడానికి వంద అంటాము. అందుకే మనసు చిన్నబోయినపుడు ఇలాంటి పిచ్చిమొహాలను కదపకూడదు. ప్రేమిస్తున్నమేమోనని ఊహించేసుకుంటారు. ఇప్పుడేంటో మరి.

“పర్లేదులే. క్షమించేసాను. ఇంతకీ లంచ్ కి వస్తావా? నీలాంటి వాళ్ళతో డిన్నర్ ఇంకా బావుంటుంది.”

“ఎందుకు బాబూ?”

“అలా అలా డిన్నర్ తో బాటే నిన్నూ, నీ మాటల్నీ, పాటలనీ అస్వాదిస్తూంటే…” ట్రాఫిక్ మధ్య ఈ సంభాషణ భలే ఎబ్బెట్టుగా ఉంది. “ఇంకేంటి?” మధ్యలో కట్ చేస్తూ…

“బోర్ గా ఉందా..”ఆ గోముతనానికి చిరాకెత్తింది.

“మీ ఇంటికి పిలువరాదా, వస్తాను. నీ ఫ్యామిలీ ని కూడా కలవొచ్చు. రేపు రానా?” అడిగింది హాడావిడిగా హారన్ కొడుతూ అంది..

“ఇల్లా…లెట్ మే థింక్. ష్యూర్, వైనాట్…ఆలోచించనీ, ఓకే..రాత్రికి కన్ఫర్మ్ చేస్తా.” ఫోన్ కట్ చేసింది. వీడింకో పది రొజులు నా జోలికి రాడు.

నెమ్మదిగా వినీల ఇంటికి చేరింది.

గేటు నుంచి మొదలుపెట్టి, ఫ్లాట్ లో కూడా పూలు. గుమ్మాలకూ, కిటికీలకూ ప్రతిచోట పూలే. ఏంటిది? ఏదో పర్సనల్ అంది, ఇంత హడావిడా? లోపల నుంచి ఆడవాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి.

“వచ్చేసావా?” వినీల ఉప్పాడ పట్టుచీర గరగరలాదించుకుంటూ ఎదురొచ్చింది. ‘రా’ చేతినిపట్టుకుని లాగుతుంటే వంకీ మెరిసింది.  మెడ కింద కాస్త గంధం గుర్తులు. కనుబొమల మధ్య కుంకుమ.

“శ్రావణ శుక్రవారం పూజ.” ఆశ్చర్యాన్ని ఆపాలన్నట్టు చెప్పింది.

“దీనికే పిలిచావా?”

“అంటే ఇది మాత్రమే కాదు. నిన్ను కలిసి చాలా రోజులైంది కదా..”

“ఇంతకాలం మగాళ్ళు మాత్రమే మాయమాటలతో మోసం చేస్తారనుకున్నానే. నమ్మించి మోసం చేసావ్.”

“నమ్మాక ఇంకా మోసం ఏమిటిలే.”

“వచ్చావా అమ్మా..”లోపల్నించి తెల్లటి మహేశ్వరీ సిల్క్ చీర వచ్చింది. “అదేవిటీ డ్రెస్ లో…చీర కట్టుకురాలేదా?”

‘లేదండీ మీ కోడలు నాకీ నాటకంలో పగటివేషం ఉందని చెప్పలేదు.’ లోపల అనుకుంది.  “నాకు పూజ ఉందని తెలీదండి”, అంది. వెనుక నుండీ వినీల అర్ధంకాని సైగలు చేస్తోంది.

“ఏవిటీ చెప్పలేదూ? చెప్పానన్నదే. ఏంటో మరి…కూర్చో.” పెద్దావిడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఇంకో కుర్చీ లాగి చూపించింది.

“చెప్పిందేమో, నేనే మర్చిపోయుంటా”, ఆగి “నాకైనా ఇవన్నీ అలవాటు లేవాంటి. ఇదెందుకు పిలిచిందో..”

“అదేమిటమ్మా అలవాటు లేకపోవడం. చేసుకోవాలి మరి. మన కల్చర్, ట్రెడిషన్ చూసుకోవద్దూ.”

“మీ అమ్మాయి ఇవన్నీ బాగా చేస్తుందేమో కదా ఆంటీ…అదే ట్రెడిషనూ..అదీ”

“ఆ చేస్తుందమ్మ. ఏదో హడావిడి పడిపోతోంది పాపం.” మళ్ళీ ఆవిడే అంది. “చేసుకునే అదృష్టం కూడా ఉండాలమ్మా. మొన్నటిదాకా అంకుల్ ఉన్నారు. ఇప్పుడు నేను చేయలేను కదా. నాకు పద్నాలుగేళ్ళప్పటి నుంచీ మొదలుపెట్టి, పురుళ్ళప్పుడు తప్ప ఆఫీసు ఉన్నా లేకపోయినా తప్పకుండా వ్రతం చేసాను. పోయినేడాది మీ అంకుల్ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఇంకేం చెయ్యను. అందుకే దీనితో అంటుంటాను. అదృష్టం ఉన్నప్పుడే తీర్చుకోవాలే అని. మీకేమో మొగుళ్ళ విలువ తెలీదు.”

“దాదాపు యాభైయేళ్ళ నుంచి ఇంత నిష్టగా చేసి అంకుల్ పోగానే డిస్క్వాలిఫై అయ్యారా ఆంటీ. మీకున్న శ్రద్ధ దీనికి లేదు. కాని అది చెయ్యొచ్చు మీరు చెయ్యకూడదన్న మాట. ఎవరి రూల్ ఆంటీ ఇది?”

“ఏం చేస్తామమ్మా…”ఆవిడ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. “మా పెద్దది ఐతే నన్ను ఇక్కడికి పంపించేసింది. శ్రావణ మాసం ఎందుకులేమ్మ అని. పిల్లల్ని పెంచడానికి పనికొస్తాను. పూజలు ఎలా చెయ్యాలో నేర్పిందేనేను.” ఎప్పుడు వెళ్లిందో, లోపల ఆడవాళ్ళ మధ్య వినీల నవ్వులు వినిపిస్తున్నాయి.

పెద్దావిడ దీర్ఘంగా నిట్టూర్చి కుర్చిలోంచి పైకి లేచింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి లోపలకి వెళ్లి కాస్త పరమాన్నం బౌల్ లో వేసి తెచ్చి చేతికి అందించింది. లోపల గదిలో కోలాహలం సద్దుమణిగి ఎబ్బెట్టుగా ఉంది. ఒక లంగా ఓణి పిల్ల గజ్జెలు సన్నగా ఘల్ ఘల్మనిపిస్తూ బయటకు తొంగిచూసిదెందుకో.

“మీ అబ్బాయేడాంటి?”  తినబోతూ అడిగింది.

“పైన టెర్రస్ మీద ఉన్నాడమ్మ. ఏదో ఆఫీస్ పార్టీ జరుగుతోంది.”

“మందు పార్టీనా?”

“బిజినెస్ లో తప్పవు కదమ్మ.” అవునన్నట్టు తలూపి ఖాళీ బౌల్ ని చప్పుడోచ్చేలా టేబుల్ మీద పెట్టి లేచింది.“ఇక వెళ్ళొస్తాను,”.

“అయ్యో ఉండు. వాయినం తీసుకోకుండానే?” లోపలకి వినపడేట్లు కోడలిని కేకేసింది.

వినీల గబగబా వచ్చి ఒక కవర్ లో తాంబూలం ఇచ్చి. ఇంకో డెకోరేటివ్ కవర్ కూడా చేతిలో పెట్టింది.

“ఏంటిది?”

“ఏదో రిటర్న్ గిఫ్ట్ లే. డ్రై ఫ్రూట్ బాక్స్, చిన్న ఆర్టిఫాక్ట్.” బొట్టు పెట్టించుకుని బయటికొచ్చి శాండల్స్ వేసుకుంటూంటే, వినీలలోపలకి వెళ్లి కుంకుమభరిణ లోపల పెట్టి వచ్చింది. ఇద్దరూ లిఫ్ట్ లోకి రాగానే వినీల గొంతు పట్టుకుని, “ఏమే, నువ్వు మొన్న పార్టీలో వైన్ తాగి ఎంత గోల చేసావో మీ అత్తగారికి చెప్పమంటావా..” అంది బెదిరించినట్టు.

మెడ మీద నుంచి చేయి వదిలించుకుంటూ వినీల కిలకిలా నవ్వింది. “చాల్లేవే, మా అత్తగారికి  తెలీదనుకున్నావా…ఏంటో ఇదో ఆనందం. పోన్లే అని నేను కూడా ఒక చెయ్యేసా. మా ఆడపడుచు వల్ల కాస్త హర్ట్ అయింది కదా…”

“బావుంది. నగలు వేసుకోవడమేకాక ఇంప్రెస్ చేసే అవకాశం పోగొట్టుకోలేదన్న మాట. ఆన్యువల్ మీటింగ్ మానేసి మరీ…మీ ఆయన మాత్రం పైన దుకాణం పెడతాడు.. కల్చర్ ని కాపాడడానికి.”

“ఏం మీటింగ్ లేవే. ఒక వారం కాస్త ఎక్కువ పని చేస్తే సరిపోతుంది. మా అత్తగారు, మా ఆయన దగ్గర దొరికే పెర్క్స్ కంటేనా..చూడు” మెళ్ళో ఉన్న డైమండ్ నెక్లస్ వేలితో టాప్ చేస్తూ కన్నుకొట్టింది. “నౌ, డోంట్ గెట్ ఫకడ్ అప్, కుళ్ళుగా ఉందా” మాటల్లో అల్లరి తెలుస్తోంది.

“ఓకే కం హియర్, ఒక సెల్ఫీ దిగుదాం.” చేయిపట్టి దగ్గరకులాగి మెడ చుట్టూ చేతులు వేసి,“ది మోడరన్ మిస్ట్రెస్ విత్ ది ట్రెడిషనల్ బిచ్.” వినీల మొబైల్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.

“యు ఆర్ సచ్ ఎ పెయిన్….నీకీ నెక్లెస్ కాస్ట్ తెలుసా…”బలవంతంగా మాటలు ఆపుకుంది. ఈ సమయంలో వినీలకి చెప్పడం అనవసరం. “సరే, మీ ఆయనకి చెప్పు. మాటలాడతానని. ఆయనికి ఏదో ఫౌండేషన్ ఉంది కదా. ఒకమ్మాయి చదువుకి కి సాయం కావాలి.” కార్ డోర్ వేసింది.

కారు రోడ్డు మీదెక్కేసరికి సన్నగా వర్షం మొదలైంది. ఏంటో, వినీలకు నెక్లెస్ ఇచ్చారనే సంతోషమే కానీ….దాని ఖరీదు జీవితాంతం ఇన్ స్టాల్మెంట్లలో ఇలా చెల్లిస్తూనే ఉండాలి. తనకీ ఫర్లేదేమోలే!

మళ్ళీ..రోడ్డు వెంటే.. మ్యూజిక్ సిస్టం ఆన్ చేసింది. ”ఇస్ మోడ్ సే జాతే హై..” ఇంకా నాలుగు కిలోమీటర్లు. జీవితం కూడా అంతే..ఇంకొన్నేళ్ళు! అంతలో అతను….ఉంటాడా తనకోసం..ఈ నాలుగునాళ్ళూ? ఉన్నట్టుండి ఆఫీస్ నుండి కాన్ కాల్ కి పిలుపు. బ్లూటూత్ లో కనెక్ట్ అయింది. మిగిలినవారు ఇంకా జాయిన్ కావలసి ఉంది, వెయిట్ చేయాలి.

స్టీరింగ్ మీద దరువు వేస్తూ మ్యూజిక్ సిస్టం సౌండ్ తగ్గించి చుట్టూ చూపు సారించింది. టూ వీలర్ మీదున్నవారంతా తడిసిపోతున్నారు. అందరి మొహాల్లోనూ, అలసట, చిరాకు. త్వరగా చేరుకోవాలనే తొందర. ముందున్న ఆటో మీద అరుస్తున్నాడు, వెనుక బండతను. ఒకామె చేతిలోని చంటి బిడ్డ తడవకూదన్నట్లు దగ్గరకు పొదువుకుంటోంది. పక్క బైక్ మీద ఇద్దరు పిల్లలు ఆకాశం వైపే నోరు తెరిచి చూస్తున్నారు. హోండా ఆక్టివా మీదున్నతను నెత్తి మీద కవర్ వేసుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. బైక్ వెనుక కూర్చున్న ఒక అమ్మాయి ముందున్న అబ్బాయి వీపు మీద వాలి నడుము చుట్టూ చేతులేసి ఏదో వాదిస్తోంది. అబ్బాయి నవ్వుతూ సమాధానం చెపుతున్నాడు. ఉన్నట్టుండీ అమ్మాయి ఆ అబ్బాయి నడుము చుట్టూ బిగించిన చేతులు తీసేసింది. అతను హెల్మెట్ లొంచి ఆమెవైపు చూడబోయి, తన చేతులు వెనక్కు జరిపుతూ ఆమె చేతులు వెతుకుతున్నాడు. అతను గాలిలో చేతులను వెతుకుతుంటే వెనుక ఆమె పెదవులు బిగపట్టి చేతులు దూరంగా దాచుకుని వినోదంగా చూస్తోంది. అతనికీ ఈ ఆట బావున్నట్టే ఉంది. అతని చేతులు ఆమెను చేరబోతున్నకొద్దీ ఆమె మునిపంటితో నవ్వాపుకొని వెనక్కి వంగుతోంది. ఉండబట్టలేక వెనక్కి తిరిగాడు. దొంగ దొరికింది. ఇద్దరూ ఫక్కుమన్నారు.

గ్రీన్ సిగ్నల్ పడింది. అవతల కాల్ లో తనను పిలిచేసరికి తెలియకుండానే మెదడు అంకెల మీదకి వెళిపోయింది. కాల్ ముగిసేవేళకు ఆమె ఇల్లు చేరుకుంది..

ఆజ్ జానేకి జిద్ నా కరో…..యుహి పెహ్లూమె బేఠె రహో…. రేడియో మోగుతోంది.

ఒక్కో గదీ సర్దుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి పక్క మీద చేరిందామె. పొద్దున్నుంచి హడావిడిగా గడిచిపోయింది. మొబైల్ లో పర్సనల్ మెసేజెస్ చూసుకుని ఒకటి రెండు మెయిల్స్ కు ఫోన్ నుంచే రిప్లై ఇచ్చింది. ఆ నెల కట్టాల్సిన బిల్స్ ఫోన్ నుంచే కట్టేసి, ఫోన్ ఆపి పక్కన పెట్టి ఆవులిస్తూ వళ్ళు విరుచుకుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు! పెన్ను, డైరీ చేతిలోకి తీసుకుని ఆలోచిస్తూ కూర్చుంది. రోజూ పడుకునే ముందు డైరీ కొన్ని లైన్లు రాయడం అలవాటు.

“బంధాల్లో అందాలు నిలవాలంటే…బంధించడమే కాదు, బంధించబడడం కూడా నిలిపివేయాలి.” ఆగి తిరిగి చదువుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జంట గుర్తుకొచ్చారు.

పచ్చికలో దాగున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి

రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.

రాయడం ముగించి డైరీ, పెన్ను సైడ్ టేబుల్ మీద పెట్టి, లైట్ ఆపింది. పక్క మీద ఒత్తిగిల్లి, “రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి”  పెదవులు కదుపుతూ నెమ్మదిగా బయటకే అనుకుంది. ఆలోచనలలో అతను మరొకసారి  తళుక్కుమన్నాడు. చీకటిలో ఆమె నవ్వు వెలిగింది.

(పచ్చికలో దాగున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి

రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. –నీడలు, తిలక్)

మీ మాటలు

 1. బంధాలు నిలవాలంటే .. బంధించటమె కాదు.. బంధింపబడటం కూడా నిలిపి వేయాలి ..
  బావుంది అపర్ణా కథ .. బంధింపబడటం లేదా అలా నటించటం బంధనానికి anti dote చాలామందికి. బంధింపబడి ఉన్నాను అనే ఫీలర్ అవతలివాళ్లకి ఇవ్వటం ద్వారా , వాళ్ళ ఇగో నీ, ఆధిపత్యానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు.
  చాలా సర్వైవల్ టెక్నిక్స్ లో ఇదొకటి.. నీకు తెలీదని కాదు, బట్, ఒక స్ట్రగుల్ ఉంటుంది .. వీళ్ళిలా ఎందుకున్నారు ? కీ, వీళ్ళ తెలివితేటల మీద మన అభిప్రాయాలకీ మధ్య .. ఆ స్ట్రగుల్ నువ్వు ఇంకా వివరించి రాయగలవు అనిపించింది
  రేపటి ఉదయాలకి వెలుగులను ఇవాళే సర్దిపెట్టుకోవటమే అనుకో.. కానీ, వెలుగు నీడన చీకటిలో సర్దే విషయాలు కూడా తక్కువ గౌరవం కలిగినవేమీ కాదు..
  ప్రతీ పరిధి వొక వారధే.. మనం అర్ధం చేసుకోవాల్సిన విషయాలకి ..

 2. అపర్ణా !!
  ఎప్పటి లాగే నీ కథ ఆలోచన లో పడేసింది ..ఎందుకు ఈ పరిధి లో ఇలా ఉంటాం ? స్వచ్చంగా నా ? మరో దారి లేకా ? ఈ బంధాలు లో ఎంత నటనా ,ఇచ్చి పుచ్చుకోడాలూ ,స్త్రీలే ఎక్కువ ఇవ్వడాలూ ఉన్నా ..ఎందుకు అలా పరిధి లో ఉండిపోతాం ..సెకూరిటి ..అని ఏమీ చదువుకోని గీత తెగేసి చె్ప్పేసింది ..చదువుకున్న వినీల నవ్వుతూ నగల ఆకర్షణ లో సర్దుకు పోయింది ..యే భర్త కోసం చేసిందో పూజలు , ఆ భర్తే పోయాక ,ఇంక నీవు పూజకు అనర్హురాలు అన్నా ,కోడలు చేత అవే పూజలు చేయించే స్త్రీ ..వీళ్ళు అందరూ మన వ్యవస్థ లో ప్రాణం ఉన్న పాత్రలు ..తమకి ఆపాదించిన పాత్రల మేరా బాగా నటిస్తారు ..జీవించే క్షణాలు అంటూ ..అక్కడక్కడా మెరుస్తూ ఉంటాయి ..మిగిలిందంతా కెమారాలు లేని వేదిక మీద అందరం చేసే నటన ..ఎవరు బాగా నటిస్తారో వారికి లభించేవి ,సమాజం నుంచి తాలియా ..అంగీకారం ..మీరూ మాలో ఒక్కరే అని ఓ ప్రశంశా పత్రం ..అది పుచ్చుకుని మన పాత్ర లో జీవించాం అని తృప్తిగా నిదుర పోతాం ..ఏ పూట కి ఆ పూటా ..జీవితం చివరి క్షణం లోనూ ..ఇన్ని ఆలోచనలు రేకెత్తించిన కథ మరి మంచిది కాక ఏమవుతుంది ??
  వసంత లక్ష్మి

 3. Jhansi Papudesi says:

  Nice!

 4. Chenna Kesava Reddy M says:

  ” ఏంటో, వినీలకు నెక్లెస్ ఇచ్చారనే సంతోషమే కానీ….దాని ఖరీదు జీవితాంతం ఇన్ స్టాల్మెంట్లలో ఇలా చెల్లిస్తూనే ఉండాలి. తనకీ ఫర్లేదేమోలే!”
  బాగుంది.

 5. మీ కథ బాగుంది అపర్ణ గారు,
  మీ కథ చదివాక కొన్నేళ్ల క్రితం చదివిన ‘స్త్రీ నమూనాలు’ ( పేరు సరిగా గుర్తులేదు, రాసిన వారు కాత్యాయిని విద్మహే గారు అనుకుంటాను ) అనే పుస్తకం గుర్తోచింది. కుటుంబ వ్యవస్థలో మన సమాజం స్త్రీలకు కొన్ని నమూనాలు ఏర్పరిచి పెట్టింది. అత్తగారి పాత్ర ఇలా ఉండాలి. ఆడపడుచు పాత్ర ఇలా ఉండాలి. వదిన మరదళ్ల పాత్ర ఇలా ఉండాలి అని. పసి వయసు నుండే ఆయా నమూనాలకనుంగానే ఆడ పిల్లలు పెంచ బడుతున్నారు ( లేక వంచబడుతున్నారు) పెద్దయ్యాక ఆ పాత్రలకు అనుగుణంగానే వారు నటించడం ఉంటుంది. ఆ నమూనాను దాటి బ్రతికిన వారే కొత్త నమూనాలు ఏర్పర్చగలరు . తన బోటి వాళ్లకు దారి చూపించగలరు. మీరు చూపించిన స్త్రీలు ఈ నమూనాలే! దానికనుంగా ముగింపు వ్యాఖ్యాలు…
  //పచ్చికలో దాగున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
  రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.//

 6. అపర్ణ గారు,

  నేను సాహిత్య జీవి ని కాను, పెద్ద గా చదువుకోలేదు (సాహిత్యం ) కాబట్టి లిటరరీ అట్రిబ్యూట్స్ వాటి కొంపోషన్ గురించి పైన చెప్పిన వాళ్ళ లాగ చెప్పలేను. కానీ మీ కథ చదివి థ్రిల్ అయ్యాను, చాల బాగుందని చాల మంది ఫ్రెండ్స్ కి చెప్పాను. అసలు మీకు కదా చెప్పాలి అని పించింది అందుకే ఈ కొన్ని మాటలు

మీ మాటలు

*