అమ్మా! ఇదిగో నీ కుమారుడు

rafi

Art: Rafi Haque

 

అవునమ్మా!

నీ కొడుకే దొరుకుతాడు

హంతకుల చేతికి ఉరి తాడు

నిజమేనమ్మా !

నీ కొడుకు ఏం నేరం చేసాడని

పొట్టనపెట్టుకున్నారు ?

నీ విలాపాల వాక్యాల నిండా

నీ కడుపుకోత కనిపిస్తూనే వుంది

నీ గొంతు ఘోష లోంచి

అరణ్య హింస వినిపిస్తూనే వుంది

నీ కొడుకేమైనా

యువ రాజకీయ నాయకుడా

సినిమా కథా నాయకుడా

నిలువెత్తు  ఫ్లెక్సీలలో

నిలబడి కనబడడానికి

నీ కుమారుడేమైనా వీధి రౌడీ నా

నెంబర్ వన్  కేడీనా

బలిసిన మంత్రిగారి కుమారుడా

తెలిసిన కుర్రకారు కుబేరుడా

ఏం చేసాడని

మగత నిద్రలో మట్టుపెట్టారు

ప్లాస్టిక్ సంచిలో కలిపికుట్టారు

నీ కొడుకు మాన భంగం చెయ్యలేదే

నిర్భయ కేసులో  ఇరుక్కోలేదే

తాగి వాహనం నడపలేదే

కారు చక్రాల కింద ఎవరినీ చంపలేదే

బాల చంద్రుడిలాంటి వాణ్ణి

బలితీసుకున్నారు  కదా

నువ్వు నెత్తీ నోరు బాదుకొని

గుండె బావిలోంచి నెత్తుటి కన్నీళ్ళని చేదుకొని

ఎంత ఏడిస్తే మాత్రం

కొడుకొస్తాడా తల్లీ

వేట గాళ్ళ ఉచ్చుల్లో

ప్రాణం పోయిన పసికూన

రెండు పదులు దాటకుండానే

తెగిపోయిన అడవి వీణ

న్యాయం ఇక్కడ అమ్ముడవుతుంది

ధర్మం ధరకు లొంగిపోతుంది

దీన్ని ధిక్కరించిన వాడే  నీ కొడుకు

కొత్త సమాజం కోసం

గొంతెత్తిన వాడు

కొత్త సర్కారుని స్వప్నించిన వాడు

శిరీష కుసుమం లాంటి కుమారుణ్ణి కోల్పోయిన దుఖ్ఖితు రాలా

నిజంగా నీ కొడుకు

చనిపోలేదమ్మా!

అడవి తల్లి కడుపులో

దాచుకుంది చూడు

తునికాకు పచ్చదనంలో ఉన్నాడు

తుడుం మోతలో వున్నాడు

కొమ్ము బూర లో ధ్వనిస్తున్నాడు

తూర్పు వనంలో వికసిస్తున్నాడు

పాల పిట్టలా నవ్వుతున్నాడు

పూల బుట్టలా పరిమళిస్తున్నాడు

తేనె తుట్టె లో వున్నాడు

అగ్గి పెట్టెలో వున్నాడు

రేపటి వాగ్ధానం కోసం

వసంత కాల మేఘమవుతున్నాడు

భూమి పుత్రుల నాగేటి చాళ్ళ కోసం

రేపటి  భూపాల రాగమవుతున్నాడు

తట్టుకో తల్లీ

కడుపు ఒడిని పట్టుకో తల్లీ

రేపటి కాలం మరో కొత్త కొడుకుని ప్రసాదిస్తుంది

కొత్త ఉద్యమ సూర్యుణ్ణి ప్రసవిస్తుంది

కొత్త నక్షత్రమై ప్రభవిస్తుంది

×××××

 

మీ మాటలు

 1. అన్నా అద్భుతం

 2. a v subrahmanyam says:

  చాలా baagundhi

 3. D. Subrahmanyam says:

  ఈ మధ్య జరిగిన నరహత్యల కి నిరసనగా బచ్చిన మంచి కవితలో సుధాకర్ గారి కవిత ఎన్నదగ్గది. రేపటి వాగ్ధానం కోసం

  వసంత కాల మేఘమవుతున్నాడు

  భూమి పుత్రుల నాగేటి చాళ్ళ కోసం

  రేపటి భూపాల రాగమవుతున్నాడు

  తట్టుకో తల్లీ

  కడుపు ఒడిని పట్టుకో తల్లీ

  రేపటి కాలం మరో కొత్త కొడుకుని ప్రసాదిస్తుంది

  కొత్త ఉద్యమ సూర్యుణ్ణి ప్రసవిస్తుంది

  కొత్త నక్షత్రమై ప్రభవిస్తుంది –

  నిజమే కొత్త నక్షత్రాలై ప్రభావిస్తాయి

 4. m.viswanadhareddy says:

  సుభద్ర వీరుడిని పంపింది భారతంలో
  శిరీష శిరస్సును ఇచ్చింది వనవాసంలో
  అది తండ్రి లేని సమయం లో ఒక వీర మరణం
  ఇది తండ్రి ముందే శిరచ్ఛేదం
  కాలాలు మారినాయి కానీ
  కారణాలు మారలేదుకదా
  దశాబ్దాలు మోసిన కన్నీటిని
  ఒక్కసారిగా దింపుకున్న
  తల్లి కంటి కొలుకుల రాసిన
  త్యాగ చరితను మోయలేక
  నేడు అడవితల్లి ఆర్తనాదాలు
  చేస్తోంది

 5. SREEKANTH SODUM says:

  శానా బాగుండాది. గుండెను తడిగా తాకినాది.

 6. Narayanaswamy says:

  అన్నా అద్భుతమైన కవిత – చాల శక్తివంతంగా ఉంది

 7. syed sabir hussain says:

  అమ్మ లారా… అక్కలారా…చెల్లెళ్ళరా…మీకు వేన వేల వందనాలు.. మీ త్యాగం వృధా కాదు ..మీ నెత్తురు ఇంకి పోదు …అదిగో అటు చూడండి… ఆకాశం పురిటి నొప్పులు పడుతుంది ..కొత్త సూర్యుడ్ని జన్మనిస్తుంది..ఆ సూర్యుడిలో మీ బిడ్డల నగుమోములు కనిపిస్తున్నాయి చూడండి.

 8. కె.కె. రామయ్య says:

  తట్టుకోలేని కడుపుకోతకు గురైన శిరీష తల్లికి ఓదార్పు వచనాలు పలికిన డా. ఎండ్లూరి సుధాకర్ గారికి వొందనాలు.

 9. ఎండ్లూరి
  సుధాకర్ గారు కవిత చాల బాగుంది. ఎంతో ఆర్ద్రంగా ఉంది.

మీ మాటలు

*