రూప్యములు!

 

        rupees

“నల్ల ధనం అంటే..?”

“వెయ్యి.. ఐదు వందల నోట్లు అని అర్థం!”

*   *   *

“మోడీ గారి నిర్ణయం వల్ల మీకేమర్థంయ్యింది..?”

“క్యాష్ ను లిక్విడ్ రూపంలో దాచకుండా- భూముల రూపంలోనో.. బంగారం రూపంలోనే దాచుకోవాలి..!”

*   *   *

“చంద్రబాబు అవినీతి పోరాటం ఫలించింది, వెయ్యి-ఐదొందల నోట్లు ప్రభుత్వం నిషేధించాలని పలు మార్లు మోడీని కోరారు..”

“బాబుగారు ముందే జాగ్రత్తపడ్డారన్నమాట..!”

*   *   *

“బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు డోకా లేదుగా..?”

“స్విస్సు బ్యాంకులో దాచుకున్నా డోకా లేదు..!”

*   *   *

పేపర్లో ఒక ప్రకటన:

“మాభూములకూ- వ్యాపార వ్యవహారాలకూ- బినామీలు వున్నట్టే.. మా నగదునకు కూడా బినామీలు కావలెను!”

*   *   *

“భలే మంచి చౌక బేరము.. సమయం మించినన్ దొరుకదు..”

“వందకు ఐదు అదొందల నోట్లట..?!”

*   *   *

“ఇక ఐదొందల నోట్లూ వెయ్యి నోట్లూ చెల్లవు..!”

“మంచి పని చేసారు, ఇక ఎంచక్కా రెండువేల రూపాయల నోట్లు దాచుకోవచ్చు..!”

*   *   *

“మోడీ విదేశీ పర్యటనలు చేసి చేసి విదేశాల మీద తనకున్న మమకారం మరోసారి చూపించుకున్నారు..!”

“అందుకేగా.. విదేశీ నల్లధనం వెనక్కి రప్పించేబదులు.. స్వదేశీ నల్లధనం వెలికి తీయిస్తున్నారు..?!”

*   *   *

“అసలు నోటుని చూసి నకిలీ నోటు నవ్విందట.. యెందుకూ..?”

“ఇప్పటికైనా అర్థమయ్యిందా.. నకిలీ నోట్ల వల్ల నష్టం లేదు, అవి యెలాగూ నకిలీయే! అసలు నోట్లే చెల్లవూ..అని!”

*   *   *

“మన రిజర్వుబ్యాంకు 1946లోనే వెయ్యి, పదివేల రూపాయల నోట్లని రద్దు చేసింది, 1978లో వెయ్యి, ఐదువేలు, పదివేలు రూపాయలు వంటి పెద్దనోట్లని రద్దు చేసింది.. చెలామణిలో వున్న నోట్లని రద్దు చేయడం యిదే ఫస్ట్..!”

“అయినా నల్లధనం పెరిగిందే కాని తరగలేదు..!”

*   *   *

“ఇప్పుడు నీకేమర్థమయ్యింది..?”

“డబ్బుని యెప్పుడూ ఇంట్లో దాచుకోకూడదు! విదేశీ బ్యాంకుల్లోనే దాచుకోవాలి..!”

*   *   *

“అప్పు యిచ్చినా వద్దన్నావా..?”

“అన్నీ పాత వెయ్యీ ఐదొందల నోట్లు యిస్తాడట..!?”

*   *   *

“వెయ్యీ ఐదొందల నోట్లు కేన్సిల్..”

“కాదు.. మా సినిమా కేన్సిల్ అయింది..!”

*   *   *

“దీనివలన భవిష్యత్తులో టెర్రరిజం పోతుందంటారా..?”

“చెప్పలేం, కాని రెండువేల రూపాయలనోటు కూడా వుండదు, పోతుంది..!”

*   *   *

“నరుడా ఏమి నీ కోరిక..?”

“పెట్రోలు బంకులూ రైల్వే స్టేషన్లతో పాటు వైన్ షాపుల్లో ఒక్కరోజుకి ఈ నోట్లు చెల్లుబాటు అయ్యేలా చూడు స్వామీ..!”

*   *   *

“మన బ్యాంకుకు చాలా రిక్విజేషన్స్ వచ్చినట్టున్నాయి.. ఏమిటవి?”

“మనబ్యాంకులో రుణంగా తీసుకున్నప్పుడు మనం అన్నీ వెయ్యీ ఐదొందల నోట్లే యిచ్చామట.. అవి చెల్లవు గనుక యిచ్చిన అప్పు కూడా చెల్లదని గుర్తించమని కోరుతున్నారు సార్..”

*   *   *

 

 

 

మీ మాటలు

  1. రాజకీయంగా సుదర్శన చక్రం……యు పి ఎలక్షన్లు ఏకపార్టీ విజయం…..ఆమ్ ఆద్మీ….ఏపార్టీవాడైనా!!!!!

  2. నరసింహారావు says:

    1) వెయ్యి, ఐదు వందల నోట్లు కూడా దాచుకున్న నల్లధనం లో భాగమే.
    2) భూముల రూపంలోనో, బంగారం రూపంలోనో దాచుకోవడానికి ముందుగా వాటిని కొనాలి కదా. అప్పుడు ఉపయోగించేది లెక్కలోకి రాని నల్లధనమైన ఆ నోట్లతోనే. ఏ రియల్ ఎస్టేట్ కొనుగోలులోనూ 10 శాతం మాత్రమే వైట్ మనీ. మిగతాది ఆ నల్లడబ్బే, ఆ నోట్లే, భవిష్యత్ లో ఆ బంగారం, ఆ భూములు కొనుగోళ్ళలో నల్లడబ్బు ప్రవాహాన్ని తగ్గించడానికి ఈ చర్య చాలా ఉపయుక్తం.
    3) ఇప్పుడున్న పరిస్థితులలో నకిలీ నోట్లను చలామణిలోంచి తొలగించడం అసాధ్యం. క్రొత్త రెండు వేల రూపాయలన నోట్లను కూడా దాచుకుంటారని గ్రహించడానికి మనకున్న అద్భుతమైన మేధోశక్తి కారణమయితే ఆ మాత్రం తెలివి, జ్ఞానం ప్రభుత్వానికి కూడా లేకపోలేదు. క్రొత్త రెండువేల రూపాయల నోట్లలో నానో జి.పి.యస్. చిప్ వుంటుంది. దాని ద్వారా ఎవ్వరూ దానికి నకిలీ నోటు తయారుచేసే అవకాశం లేదు. కాబట్టి అది EASILY IDENTIFIABLE TRACKABLE AND TRACEABLE . అది హై సెక్యూర్డ్ కరెన్సీ.
    4) అధికారంలో వున్నవాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఏది మాట్లాడినా నూటికి నూరుపాళ్ళూ బూటకమే, పూర్తిగా పేదల దోపిడీకే అనే అభివ్యక్తీకరణకు పరాకాష్ఠ.
    5) స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తెప్పించడం అనేది నల్లడబ్బు సమస్యకు వేరే పార్శ్యం. దానికీ దీనికీ ముడిపెట్టడం అనేది పైన చెప్పిన అభివ్యక్తీకరణలోనే మరొక కోణం.
    6) చలామణిలో వున్న నోట్లలో దాదాపు పది నుండి పదిహేను శాతం నకిలీ నోట్లే. గత ఆరేళ్ళలో 500 నోట్లు 70 శాతం, 1000 నోట్లు 110 శాతం చలామణి పెరిగింది.
    7) నగదుకు బినామీలు కావలెను; అనే దానిని తప్పించడం చాలా సులభం. నిజంగా దోపిడీకీ, పీడనకు గురవుతున్న అమాయక ప్రజలు అలా బినామీలుగా మారి బ్యాంకుల్లో నల్ల త్రాచుల డబ్బును మార్చకుండా వుండే విధంగా మహా రచయితలు వారిలో చైతన్యం తీసుకురావచ్చు.
    8) ఇదివరకి నోట్లు రద్దుచేసినప్పుడు నల్లధనం తరగకుండా పెరగడానికి కారణం దాని తరువాత తీసుకోవలసిన నిర్ణయాలను, చర్యలను తీసుకోకపోవడం. జనతా ప్రభుత్వం తరువాత కాంగ్రెస్ రావడం.
    9) విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం కన్నా స్వదేశీ పుట్టలలో వున్న నల్లనాగులు వేయి రెట్లు. నకిలీ నోట్లలో వున్న నాగులు రెండు రెట్లు.
    10) బ్యాంకుల్లో తీసుకున్నరుణం ఇంకా ఇంట్లో దాచుకునే వున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై. అది నిజంగా బ్యాంకుల్లో తీసుకున్న రుణమే అయితే బ్యాంకుకు ఆ వివరాలు చెబితే వెంటనే మార్చి ఇస్తారు.
    నిరంతర, పరమ అసహనం, నిత్య వ్యతిరేకత అనేదానికి మాత్రమే మన రచనలు పరిమితమయితే నిర్మాణం వుండదు, విధ్వంసమే వుంటుంది.
    మనం ఎంత నిరంతర పాలక పక్ష వ్యతిరేకులమయినా మన దృష్టిలో పీడనకు, దోపిడికీ గురవుతున్నవాళ్లు ఏ మాత్రమూ ఇబ్బంది పడకుండా మొత్తం విధ్వంసం జరగడం, క్రొత్త నిర్మాణం జరగడం అసాధ్యం అన్న విషయాన్ని గుర్తించడం ముఖ్యం. పాకిస్తాన్ లోని ప్రెస్సుల్లో వారానికి అచ్చంగా ఒక రోజు అచ్చయ్యే నకిలీ నోట్లు ఎన్ని వున్నాయో, అవి ఏయే మార్గాల ద్వారా మనదేశంలోకి వచ్చి రకరకాల అవినీతి, ఉగ్రవాద కార్యక్రమాలకు మూలకారణంగా మారుతున్నాయో మనకు తెలిస్తే నల్ల చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికి ఈ చర్య ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. కొంత అధ్యయనం చేస్తే నకిలీ నోట్ల వలన జరిగే అనర్థం తెలియడానికి అవకాశముంది.
    ఇప్పడు ఊడిస్తే భవిష్యత్తులో రాదు అనడానికి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు ఈ నోట్ల ఉల్బణాన్ని, మనలోని అజ్ఞానాన్ని ఊడ్చుకోకపోతే నకారాత్మకత మాత్రమే మిగులుతుంది.

    • హాట్స్ ఆఫ్ నరసింహారావు గారు…కనీసం సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారని ఆశ కలిగింది మీ స్పందన చూశాక!

    • Chandrasekhar Neriyanuri. says:

      మంచి సకారణాత్మక విశ్లేషణ.
      అన్ని ధర్మ(?)సందేహాలకూ సరియైన సమాధానము తెలియజేసినారు.
      అభినందనలు్

    • Sanjeevareddy says:

      చేతకాని మాటలు.

    • Sombabu tangudu says:

      గుడ్ రిప్లై సర్, కొంతమంది మేధావులు తమ మేధస్సుని ఎక్కడోదాచిపెట్టి కేవలం కలం నుండి వచ్చినది మాత్రమే ప్రజలకు చేరవేస్తారు

  3. కె.కె. రామయ్య says:

    బడా బాబులందరూ ముందే జాగ్రత్తపడ్డారన్నమాట.
    బడా బినామీల భరతం పెట్టె రోజెప్పుడోరన్నా? గజ్జెల మల్లన్నా!

    ఈ అపురూప్యంని రాసిన బజరా మెళ్ళో వెయ్యీ ఐదొందల నోట్ల …. కాదు కాదు … కొత్త నోట్ల దండ వేద్దాం.
    ( ఒక్కో నోటుకి మధ్యన గజం దూరం పెట్టి, మధ్యలో పూలు పళ్ళు పెట్టి, కర్సు తగ్గించిన దండే సుమా )

  4. డబ్బనే విలువకొలిచి,వినిమయానికి,సంపద దాచుకొనడానికి సాధనమైన
    సౌలభ్యాన్ని వాడుకొడం అలవాటుపడ్డ మనం,ఒక్కసారి అదిలేకపోతె ఎంత
    ఇక్కట్లుపడతామొ తెలుసుకోడానికి,విలువున్నదనుకొన్నవి ఉత్తకాగితాలంటె
    ఇలా బెంబేలెత్తుతామని బాపు రమణల ‘బంగారం సింగారం’ కధ ‘మోడి’చూపెనే
    ఓ గులుకు రాణి

  5. కె.కె. రామయ్య says:

    ప్రియమైన శ్రీ నరసింహారావు గారు,

    దేశం లోని నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్య లోని సబబు గురించి మంచి వాదనని వినిపించారు. కానీ, ఇలాంటి చర్యల చిత్తశుద్ధిని శంకించటం ‘బజారా’ లాంటి మేధావుల హక్కు. ఇది రానున్న రాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్షాల ధన బలానికి “చెక్” పెట్టటం కోసవేఁ తీసుకున్న చర్యగా మారితే అందువల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. అలాగే

    1) ఒకప్పుడు గరీబీ హటావో అన్నారు. మరి పేదరికాన్ని ఎంత వరకు నిర్మూలించగలిగారు?
    2) నల్ల డబ్బు, తెల్ల డబ్బుల గురించిన వాదన కూడా వద్దు.
    ధనిక పేదల మధ్య వ్యతాసం అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది?
    3) దేశ సంపద, ప్రకృతి వనరుల లూటీ ( National Plunder ) ఏ స్థాయిలో జరుగుతున్నది?
    4) అవినీతి ఎంత వికృత రాక్షస రూపంలో ఉన్నది? ఎలక్షన్లలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వెదజల్లుతున్న డబ్బు,
    అనేక వాణిద్య, వ్యాపార, పరిశ్రమల రంగాల్లోని అవినీతి మాటేవిటి? వీటి కొమ్ము కాస్తున్న వారెవరు?
    5) పాలక ప్రతిపక్షాల లోని వారెవరైనా, ధనిక వర్గంలోని వాళ్ళైనా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోని విలాసాలాలు,
    vulgar display of wealth, criminal waste of money ఎంతలా కనపడుతున్నది ?
    6) కోటాను కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన వాళ్ళు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్న వాళ్ళు,
    కాలరెగరేసుకుంటూ ఎలా తిరగగలుగుతున్నారు ?
    7) చట్ట సభల్లో అవినీతి నిరోధక చట్టం తీసుకు రావటానికి, CBI, Lokayukta, Vigilence ఏజెన్సీలకు స్వయం ప్రతిపత్తిని
    కలిగించటానికి జంకు ఎందుకు ?

    ఇలాంటి గత చేదు అనుభవాల నుంచి వచ్చిన నిరసన గళం బజారా గారు.

    • శ్రీ రామయ్య గారు
      నేతల చేతలలో లోటుపాట్లతో బాటు సమస్య యొక్క పరిమాణం కూడా ఒక సమాజంగా మనం పరిష్కరించలేని సమస్యలకి ముఖ్య కారణం అది మనుషులకి ఇజాలకి కూడా వర్తిస్తుంది
      స్వార్ధమన్నది అందరిని వెనకనుండి నడిపిస్తుందన్నది నిజమేకదా/
      అనాదిగా జీవులన్నింటి వెన్నంటి ఉన్న అసమానతల వెనకున్నది ఇదేగదా ?
      జీ బీ శాస్త్రి

    • రామయ్య గారు, ప్రభుత్వం చేపట్టే ఏ చర్య కూడా మీ లాంటి వారు, ఈ రచయిత లాంటి వారు అభినందించలేరు. 60 ఏళ్ల నుంచి పేరుకు ఉన్న మురికిని మంత్రం పెట్టినట్టు మాయం చేయాలి మీకు. దేశం అంతా ఈ విషయాన్నీ మెచ్చుఁ కుంటూ ఉంటె మీ లాంటి వారు మాత్రం సహించలేరు.

  6. నరసింహారావు says:

    రెండువేల రూపాయల నోట్లలో న్యానో జి.పి.యస్ పెట్టబోవడంలేదని, ఆ వార్తలని నమ్మవద్దని ఆర్. బి. ఐ. స్పందించింది. నా వ్యాఖ్యలోని ఈ విషయాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. వార్తామాధ్యమాల్లో విశేషంగా వచ్చింది కాబట్టి ప్రస్తావించడం జరిగింది.

  7. ఈ చర్య ని హిందుత్వ అజెండా లో భాగంగా చూస్తున్నాను నేను .

  8. ప్రసాద్ చరసాల says:

    నిన్న ముగ్గురు నా దగ్గరి స్నేహితులు పోన్ చేశారు.

    ఒక ఫ్రెండు: మీకేమయినా దగ్గరలో CITI NRI Branch వుందేమొ తెలుసా? (బహుశా వాళ్ళన్నా తమ దగ్గర వున్న నోట్లు తీసుకుంటారని ఆశేమొ)
    మరొకతను: రేణుకా, (నా పేరు రేణుకా ప్రసాదు లెండి) దగ్గరలో మనీ ఎక్సేంజి సెర్వీసు ఎక్కడ వుంది? నా దగ్గర 20వేల ఇండియన్ కరెన్సీ వుంది. దగ్గరలోని ఎయిర్ పోర్టుకెళితే పనవుతుందా?
    ఇంకొకతను: మొన్న ఇండియానుండీ వచ్చినపుడు నా దగ్గర ముప్పైవేలుండి పోయాయి. నువ్వేమన్నా డిసెంబరు లోపల ఇండియా వెళుతున్నావా నేనిస్తాను.

    ఇదంతా నల్లడబ్బు కాదు కాని వెతలు తెల్లవే!

    • ప్రసాద్ గారు,
      నాకు తెలిసి 10000 రూపాయల కంటే NRI ఎక్కువ ఉంచుకోకూడదు. అటువంటప్పుడు అది భారత ప్రభుత్వం బాధ్యత కాదు.

  9. కె.కె. రామయ్య says:

    చంద్రిక గారు బాగున్నారా. చాన్నాళై మీ వాదనలు వినపడలేదు. ” దేశం లోని నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్య లోని సబబు గురించి మంచి వాదనని వినిపించారు నరసింహారావు గారు ” అన్న నా వాక్యాలని ఒక్క సారి చూడండి చంద్రిక గారు.

    కాకుంటే బజారా గారు లాంటి మేధావి నిరసన గళానికి మా లాంటి వాళ్ళ భేషరతు మద్దత్తు ఉంటుంది. అది మా బలహీనత.

    విదేశీ బాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నం చెయ్యాలి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మరింత సమర్ధవంతంగా జరగాలి. పేదలకు భూమి పంపకం జరగాలి. ఆర్ధిక అసమానతలు తగ్గాలి. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చెయ్యాలి. మన పెద్దలు రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిజం, సెక్యులరిజం వైపు పయనించాలి. మీరెంతో ప్రేమించే మన మాతృదేశం ‘ Banana Republics ‘ కంటే ఎంతో ఉన్నతంగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు మాకున్నాయి.

    • వాదనలు చేసే ఉద్ద్యేశ్యం నాకెప్పుడూ లేదండి. సంఘం లో జీవిస్తున్నాము అంటే ప్రతి విషయం లోను మంచినే చూడాలంటాను. ఒక్కొక్కటే మార్పు జరుగుతోంది. ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎలాగా ప్రజలకి ?పేదరికం నిర్మూలన అంటే ఉచితం గా అన్నీ పంచి ఇవ్వటమేనా ? వారి వంతు కృషి చేయరా? దేశం నాకేమిచ్చింది అనే ప్రశ్న ముందు నేను దేశానికీ ఏమి ఇస్తున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి. అంతకు మించి నా వాదన అంటూ ఏమి లేదు.

    • కేవలం మాయావతిని ఓడించటానికి మోడీ గవర్నమెంట్ తెచ్చిన చట్టానికి దేశమంతా భలి అయి పోవాలా? దేశం లో ఎనభై శాతం మంది అవస్థలు పడుతున్నారు. వీరేనా నల్ల కుభేరులు !

      • నల్ల దానం వెలికి వస్తే ఒక్క మాయావతి గారేమిటి అందరు రాజకీయనాయకులకు అన్ని రాజకీయ వర్గాలకి దెబ్బేకదా తిరుపాలు గారు?

  10. రాఘవ says:

    ” పాలకవర్గ ప్రలోభాలకు లొంగిపోతూ వారి ప్రయోజనాలకు ఊడిగం చేస్తూ కూడా తమ జీవిత విధానాల్ని తామే మల్చుకుంటున్నామనే దయనీయమైన అహంభావంతో ఉన్న ప్రజలు..” అంటాడు గోర్కీ. ” ధనికులను ప్రేమించమని పేదవారికి చెప్పడం, యజమానిని ప్రేమించమని కార్మికునికి చెప్పడం నా పని కాదు. నేనెవరినీ ఓదార్చలేను. ప్రపంచమంతా ద్వేష వాతావరణం నిండి ఉందనీ అది నానాటికీ చిక్కబడుతుందనీ అదీ ఒక విధంగా మంచిదేననీ నాకు స్పష్టంగా తెలుసు…” అని కూడా అంటాడు. – ఇదే విషయం బజరా ( లాంటి రచయితలకు )కు కూడా తెలుసు..- ఇది ’నెగెటివ్’ ఆటిట్యూడ్ ని నూరిపోయడం గా కొందరికి అనిపిస్తే, అలా ఎందుకనిపిస్తుందో కూడా తెలుసు…

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

*