శ్రమను లాలించే దయా దీవి

chinukuజి. వెంకట కృష్ణ ప్రసిద్దకథకుడు, కవి, విమర్శకుడు. వీరు ఇటీవల “చినుకు దీవి” పేరుతో కవిత్వ సంఫుటి వెలువరించారు. “చినుకు దీవి” పదబంధం ఆకట్టుకొనేలా ఉంది. కొంత అస్ఫష్టంగానూ అనిపిస్తుంది. అదే శీర్షికతో ఉన్న ఓ కవితలో ఆ పదబంధాన్ని విప్పుకొనే తాళం చెవి దొరుకుతుంది.

చినుకు సృష్టికి ఆది
శ్రమను లాలించే దయా దీవి — (చినుకు దీవి).

ఎంతగొప్ప భావన ఇది. చినుకు పడితేనే వ్యవసాయం నడుస్తుంది, రైతుల శ్రమ ఫలిస్తుంది, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రజలు చేసుకొంటారు. మరీ ముఖ్యంగా వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలకు చినుకు అనేది ఎంత అపురూపమో, అవసరమో, చినుకు వాలటం ఎంతటి దయాపూరిత చర్యో పై వర్ణన తెలియచేస్తుంది. అలాంటి చినుకుని ఒక దయాదీవి గా పోల్చటం, ఆ పోలికనే కవితా సంపుటి శీర్షికగా ఎంచుకోవటం వెంకట కృష్ణ అభిరుచిని తెలియచేస్తుంది.

తెలుగు సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఉత్తరాంధ్రనుంచి వచ్చే సాహిత్యానికి ఉద్యమనేపథ్యముంటుందని, గోదావరి జిల్లాల కవిత్వంలో కడుపు నిండిన వ్యవహారం కనిపిస్తుందని, సీమ సాహిత్యం కరువు, పంటలెండిపోవటం లాంటి అంశాలను వ్యక్తీకరిస్తుందని తెలుగు సాహిత్యకారుల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం, ఒక కవి తాను సృజించే కవిత్వంలో తాను బ్రతుకు తున్న ప్రాంతం యొక్క అస్థిత్వం, తాను జీవించే జీవితం తాలూకు పదచిత్రాలు ప్రవహించక తప్పదు. అదొక అనివార్యత. ఆ కారణంగా పరిణామ క్రమంలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అదే సంఫూర్ణ సత్యం కాబోదు.

వెంకట కృష్ణ కవిత్వం అలాంటి పడికట్టు అభిప్రాయాల్ని బద్దలు కొట్టిందనిపిస్తుంది. సీమ కరువును, రైతు అస్థిత్వాన్ని ఎంతైతే బలంగా వ్యక్తీకరించిందో అంతే బలంగా చిక్కని భావుకతా, సౌందర్యం, సౌకుమార్యాలు కూడా అనేక కవితలలో అలవోకగా అంతే ప్రాధాన్యతతో ప్రతిబింబించాయి. దుఃఖమమయమైన సందర్భాల్ని చెప్పేకవితలకు కూడా చక్కని ఆశావహముగింపు ఇవ్వటం కూడా వెంకట కృష్ణ కవిత్వప్రత్యేకతగా భావించవచ్చు.

వెన్నెలను వర్ణిస్తూ…..

ఆకసం పొయ్యి లోన
పగలు మణిగిన జాబిల్లి పిల్లి
రాత్రి సంచారానికి లేచి
అంటిన బూదిని దులిపనట్లు వెన్నెలా — (వెన్నెల) — అంటూ చేసిన వర్ణన అపూర్వమైనది. అనాదిగా వెన్నెలను ఎంతమంది కవులు ఎన్నిరకాలుగా వర్ణించినా ఇంకా చాలానే మిగిలిఉందన్న భావన కలిగిస్తుంది.

ఇంటి మెట్ల అరుగులమీద కూచుని మూడు తరాల స్త్రీలు ఒకరి జడ ఒకరు అల్లుతూ కనిపించే దృశ్యం ప్రస్తుతం ఒక పురాస్మృతి. పల్లెటూర్లలో అయినా కనిపిస్తుందో లేదో!. జడ అల్లటాన్ని వస్తువుగా చేసి వ్రాసిన “జత పదార్ధం” అనే కవిత వెంకట కృష్ణ ప్రతిభకు గీటు రాయి. సామాన్యమైన వస్తువును కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది.

ఇద్దరు తనూ లతలు – వొకరిలో ఒకరు చుట్టుకున్న వాళ్ళు
తమనవ్వులను పురితిప్పి అనుబంధాలను కదా అల్లటం//
జడ అల్లడమంటే
ముచ్చటగా ప్రేమను తురమటం// — (జత పదార్థం) — తనూలతలు, తురమటము అన్న పదాలు ఎంత అందంగా ఒదిగిపోయాయీ సందర్భానికి. నిజమే కదా! జడ అల్లటం అంటే ప్రేమను తురమటమే!

ఒక బైరాగిని వర్ణిస్తూ వ్రాసిన ఈ వాక్యాలలో పొంగే ఊహాశాలిత చాలాబాగుంది

అప్పుడప్పుడూ అతని పెదవులు తాకి
పరవశించి పాడుతాయి వెదురు కన్నులు
ఆ పాటలు వినడానికి భూమిలో నుండీ
తొంగి చూస్తాయి వజ్రపు తునకలు (రవ్వల దీవి)— వెదురుకన్నులు పరవశించి పాడుతాయనటం, వజ్రపుతునకలు ఆ గానాన్ని వింటున్నాయనటం నూతన అభివ్యక్తి.

వెంకట కృష్ణ కవిత్వంలో కాల స్పృహ అనేక కవితలలో బలంగా వినిపిస్తుంది. లో-హితుడు అనే కవితలో—

ఒక గొంతుకు వురి బిగించి
పెళపెళ పెటిళ్ళున
ఎన్ని గొంతుల గొలుసులు తెంపి
యిలాగైనా యీ దళపతుల నోటి కుట్లు
తెంపావురా! — (లో-హితుడు) — కుల వివక్షకు బలైన రోహిత్ ఆత్మహత్య వృధా కాలేదని కొన్ని కోట్ల గొంతులు ఎలుగెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాయనటం, రోహిత్ మరణంలో మనంచూడాల్సిన మరోకోణంగా భావించవచ్చు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చింపబడుతున్న అంశం రైతు ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్రాసిన మూగ బాసట అనే కవితలో రైతుకు ఎద్దుకూ ఉన్న అవినాభావసంబంధాన్ని అత్యంత కరుణరసార్థ్రభరితంగా వర్ణిస్తారు.

పాదయాత్రలు చేసే వాళ్ళంతా
సింహాసనాల పైకే చేరుకుంటుంటే
ఎన్ని వేల పాదముద్రలో విత్తిన వాడు
చెట్టెందుకెక్కాడో
అట్నుంచీ పాడెందుకెక్కాడో
అర్ధంకాని మూగెద్దులు సలిపే సంభాషణ — (మూగ బాసట) రాజకీయ తంత్రంలో రైతు స్థానం కడపంక్తే. రైతు పిడికెడు మట్టై చెట్టుకు వేలాడాల్సి రావటం ఒక సామాజిక వాస్తవం. రైతు నేస్తం ఎద్దు. అలాంటి ఎద్దు కళ్ళనుండి “బాధా సర్పం జారిపడ్డదట”, “ఎద్దు పుండు ఎవరికిష్టం” అంటూ కవిత ముగుస్తుంది. రైతుకి ఎద్దుతో ఉండే ప్రేమానుబంధాన్ని అత్యంత అనుకంపనతో వ్రాసిన గొప్ప కవిత ఇది.

“తండ్రులు-కూతుళ్ళు” కవిత టీనేజ్ కూతుర్లున్న తండ్రులను తప్పక కదిలిస్తుంది. ప్రతీ వాక్యమూ గొండెలోపొరల్ని స్పృశిస్తుంది. గొప్ప ఆర్థ్రత నిండిన కవిత ఇది. (ఈ కవిత చదివినప్పుడల్లా ఇంటర్ చదువుతున్న మా అమ్మాయే నా తలపుల్లో మెసలుతాఉంది.)

“కవిత్వం మానవజీవితాన్ని ఆశ్రయించి ఉద్భవించిన కళ” అంటారు పింగళి లక్ష్మీ కాంతంగారు. కవి తాను జీవించే జీవితం, అనుభూతులు, తానునమ్మిన దృక్పథాలు తనకవిత్వంలో స్వాభావికంగానే ప్రకటితమౌతూంటాయి. ఎందుకంటే కవిత్వం ఎక్కువగా అంతశ్చేతనకు సంబంధించింది కనుక. వెంకట కృష్ణ కవిత్వంలో దళిత, బహుజన దృక్పథం , సమాజాన్ని చైతన్యపరచాలనే ఆకాంక్ష, బలహీనులపట్ల సహానుభూతి వంటివి అనేక కవితలలో కనిపిస్తాయి. ఇది ఇతని కవిత్వ తత్వం.

అరఅడుగు వొరలో వొదిగిన
ఆరడుగుల చీర
తనకంటే వొద్దికైన వాణ్ణి చూపించనా అంటుంది (కళతన నేతన్నా) అంటూ నేటి చేనేతకార్మికుల వెతలను అక్షరీకరిస్తాడు. ధనంనిండిన మార్కెట్ మాయాజాలం లో చిక్కుకొన్న నేతన్నలో స్థైర్యం, చైతన్యం నింపేలా కవిత ముగుస్తుంది.

పర్వాంతం అనే కవితలో ఈ దేశపు కర్షక, కార్మికులు సామాజికంగా, రాజకీయంగా ఎలామోసానికి గురవుతున్నారో, న్యాయం చేయమని తట్టిన న్యాయాలయాలు కూడా ఏ రకమైన తీర్పులు చెపుతున్నాయో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు వెంకట కృష్ణ

దేశంలోని ప్రతి రైతుదేహానికీ
ఒక తెల్లగుడ్డ
ప్రతి కార్మికుడి దేహానికీ
ఒక ఎర్రగుడ్డ
పరిహారం పంపిణీగా కోర్టు తీర్పు (పర్వాంతం) అంటూ ఆధునిక జీవనపోరాటంలో బలహీనుల పక్షాన నిలిచారు. ఈ కవితను ముగిస్తూ ఈ నాటకాన్ని మలుపు తిప్పాలనుకొనే ఔత్సాహికుడు, సాహసికుడు, ఉద్యమకారుడు అయిన ఒక పాత్ర ప్రవేశిస్తుంది అనటం ద్వారా ఒక ఆశావహ దృక్కోణం ఆవిష్కృతమౌతుంది.

సాధారణంగా ఉగాది కవితలు సౌందర్యంతో మెత్తమెత్తగా చక్కని ఉపమానాలతో సాగుతాయి. సమాజం పట్ల నిబద్దత, మార్పురావాలనే ఆకాంక్ష హృదయాంతరాళాలో పొదువుకొన్న ఈ కవి ఆ వచ్చిన ఉగాది అతిథికి….

శ్రమజీవన సౌందర్యానికి శ్రమదానం చెయ్యమని
నేల పాతరేసిన ఉషస్సును
జనానికి పంచమని! (అతిథి)— ఉపదేశిస్తాడు. గొప్ప సామాజిక చైతన్యం, ఈ వ్యవస్థ బాగుపడాలన్న నిబద్దత కలిగిన కవిమాత్రమే వ్రాయగల వాక్యాలివి.

ఒక హిజ్రా పై వ్రాసిన “స్వదేహ పరాయీకరణ” కవిత తీసుకున్న వస్తువులోని భిన్న పార్శ్వాలను స్పృశించిన తీరు అద్భుతమనిపించక మానదు. . చాలా గాఢత కలిగిన కవిత అది. అందులో ఒకచోట

జీవితమంతా అజ్ఞాతవాసంలో వుండటం
ఏ బృహన్నలకు మాత్రం సాధ్యం
రణరంగమొకటి రోజూ ఎదురొస్తుంటే
ఏ వొక్క క్షణాన్నీ ఎలా శాంతిగా గడపటం — అన్న వాక్యాల వద్ద తడిలాంటిదేదో చదువరుల హృదయాల్ని తాకుతుంది. వెంకట కృష్ణను- వాస్తవిక వాదిగా, వస్తువును శిల్పంగా, ఉద్వేగంగా, ఉదాత్త వాక్యాలుగా మార్చగలిగే శక్తి కలిగిన గొప్ప కవిగా నిరూపిస్తుందీ కవిత.

ఇంకా ఈ సంపుటిలో, యస్. ఆర్. శంకరన్, అరుణ్ సాగర్, కొండేపూడి నిర్మల, మార్క్వెజ్, కొప్పర్తి లపై వ్రాసిన ప్రేమపూర్వక కవితలున్నాయి.

ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఈ పుస్తకానికి  కాశీభట్ల వేణుగోపాల్, శ్రీ జి.ఎస్. రామ్మోహన్ లు ఆప్తవాక్యాలు వ్రాసారు.

రఫీక్ అహ్మద్ అందమైన ముఖచిత్రాన్ని అందించారు.

పుస్తకం వెల: 100/-

కాపీల కొరకు: 8985034894

*

మీ మాటలు

  1. రాఘవ says:

    ఒక నిబద్ధత..తానేమి రాసినా..- కొందరిని ప్రేమించడం కష్టం, వెంకట కృష్ణ గారిని ప్రేమించకుండా ఉండటం కష్టం !

మీ మాటలు

*