విశ్వనాథ దిగిన మెట్లు!

viswa1

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్:2

ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యప్రపంచంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక కోణంలో విరాణ్మూర్తే. ఆ విషయంలో ఎవరికి మాత్రం సందేహం ఉంటుంది? అయితే, ఆయన దృక్పథం మాటేమిటి?

ఒక కవిగా, పండితుడిగా, సాంప్రదాయిక సాహిత్యవేత్తగా, నవలాకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా విశ్వనాథ సాహిత్యపరామర్శా, విశ్లేషణా విస్తృతంగా జరిగి ఉండవచ్చు. బహుశా ఎనభై దశకం నుంచీ మారుతూ వచ్చిన ఆర్థికసామాజిక రాజకీయ పరిస్థితుల కారణంగా విశ్వనాథను సరికొత్త స్ఫూర్తిదాయక శక్తిగా దర్శించి ఆరాధించడం ప్రారంభించిన మధ్యతరగతిలోని ఒక నూతన విద్యాధిక తరం ఇప్పటికీ ఆ పని చేస్తూ ఉండవచ్చు. కానీ ఆయన దృక్పథాన్ని నిర్మమ దృష్టితో పరిశీలించి చర్చించడం ఎక్కడైనా జరిగిందా, జరుగుతోందా?

sudrarsanamఆర్.ఎస్. సుదర్శనంగారు తన ‘సాహిత్యంలో దృక్పథాలు’ లో విశ్వనాథ గురించి రాసిన భాగాలు చదువుతున్న కొద్దీ; అప్పుడు కానీ ఇప్పుడు కానీ విశ్వనాథ దృక్పథం గురించి వచ్చిన రచనలు ఏమేమి ఉన్నాయన్న ఆసక్తిదాయక ప్రశ్న నన్ను వెంటాడుతూనే వచ్చింది. సుదర్శనంగారి విశ్లేషణపై అప్పటివారు ఎలా స్పందించారు, దానిపై ఎలాంటి సమీక్షలు వచ్చాయి, ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి; అన్నిటికంటే ముఖ్యంగా ‘సాహిత్యంలో దృక్పథాలు’ వెలువడిన కాలానికి విశ్వనాథ జీవించే ఉన్నారు కనుక తనపై విశ్లేషణకు ఆయన ఎలా స్పందించారన్నవి, అంతే కుతూహలం రేపిన మరికొన్ని ప్రశ్నలు.

కొంత అకడమిక్ స్వభావం కలిగిన ఈ ప్రశ్నల్ని వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తాను.

‘సాహిత్యంలో దృక్పథాలు’లో ప్రప్రథమంగా ఆకట్టుకున్నది, విశ్వనాథ గురించి రాయడంలో సుదర్శనం ప్రదర్శించిన అద్భుతమైన వస్తుగతదృష్టి.  నా ఉద్దేశంలో సాహిత్యవిమర్శలో అది ఒక మంచి నమూనా. ఆయన కొన్ని చోట్ల విశ్వనాథను ఆకాశానికి ఎత్తారు. కొన్ని చోట్ల అంత ఎత్తునుంచీ కిందికి జార్చారు. ఆక్షేపణలూ చేశారు, అభినందనలూ వర్షించారు. ఒకచోట విశ్వకవి రవీంద్రునికన్నా విశ్వనాథ ప్రతిభావంతుడని అంటూనే, ఆ వెంటనే,  ఒక తత్వదర్శిగా రవీంద్రుడు ఎన్ని మెట్లు ఎక్కాడో విశ్వనాథ అన్ని మెట్లు కిందికి దిగారంటారు.

నవలాకర్తగా విశ్వనాథపై ప్రశంసాత్మక దృష్టినుంచి చేసిన సుదర్శనంగారి మదింపు ఇలా ఉంటుంది:

‘ఏకవీర’ గురించి:  విశ్వనాథలోని ఆధ్యాత్మికమైన లోచూపు ఇతర కాల్పనిక రచయితల భావనకు లేని తత్వ పరిపూర్ణతను ఇచ్చింది.  పూర్తిగా రొమాంటిక్ సంప్రదాయంలో పుట్టిన ‘ఏకవీర’ ఆ సంప్రదాయాన్ని అధిగమించి కావ్యగౌరవం పొందింది. ఈ నవల చివరి మూడు అధ్యాయాలూ ఉత్తమ కవిత్వం, ఔచిత్యం, మనస్తత్వ చిత్రణం, శాస్త్రపరిజ్ఞానం, తత్వదృష్టి, ధ్వని పరిపుష్టంగా ఉన్న రచన. ఈ స్థాయిలో వచనకవిత్వం, అసలు ఇంతకంటే కవిత్వం విశ్వనాథ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఏకవీర’తో పోల్చదగిన నవల రవీంద్రుని ‘నౌకాభంగము’. అందులో భావనాత్మకమైన ప్రేమ కన్నా, హిందూ వివాహవ్యవస్థ శక్తిమంతమని నిరూపించే ప్రయత్నం చేశాడు రచయిత. కానీ ఆ ప్రయత్నం అస్తవ్యస్తంగా పరిణమించింది. ‘ఏకవీర’కు ఉన్న తాత్వికమైన పటిమ రవీంద్రుని నవలకు లేదు. ఏకవీర కావ్యమైన నవల.

మనస్సులో అవ్యక్తమైన భాగం (Unconscious)ఒకటి ఉందనీ, దానికీ, వ్యక్తమైన భాగా(Conscious)నికీ సంఘర్షణ ఉంటుందనీ గుర్తించి పాత్రపోషణ చేసిన మొదటి తెలుగు నవలా రచయిత విశ్వనాథ. ‘ఏకవీర’లో వివాహవ్యవస్థనూ, వైయక్తికమైన వలపునూ -రెంటినీ ఆయన సమర్థించలేదు. వాటికి అతీతమైన సమన్వయాన్ని సూచించారు. అదే హైందవ సంప్రదాయమూలసూత్రం. అప్పట్లో వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించే బంకిం చంద్ర మార్గం కన్నా, వైయక్తికమైన ధర్మాన్ని కాల్పనిక వాదంలో భాగంగా సమర్థించే రవీంద్ర ప్రభావితులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి, వెంకట పార్వతీశ్వర కవుల కన్నా విశ్వనాథ తొక్కిన మార్గం ప్రత్యేకమైనదే కాదు, ఉత్కృష్టమైనది.

‘వేయిపడగలు’ గురించి:  ‘వేయిపడగలు’ నవల చదవడం ఒక అపూర్వమైన అనుభవం, మరపురానిది. అందులో ఎంత సంతృప్తి ఉన్నదో అంత అసంతృప్తి కూడా ఉన్నది. ‘వేయిపడగలు’ గొప్పదనం అది ఏకపాత్ర చిత్రణం కావడం. ఆ చిత్రణం వేయి పుటల దాకా విస్తరించినా, వేయి పుటలూ తప్పక చదివిస్తాయి. పాశ్చాత్యనాగరికతా ప్రభావం ముప్పై ఏళ్లలో ఏ విధంగా తెలుగువారి జీవనవిధానంలో ఒడిదుడుకులకు. అవకతవకలకు హేతువైందో విపులంగా విమర్శనా దృష్టితో వర్ణింపబడడం కావ్యాన్ని అపురూపమైనదిగా చేస్తున్నది. అలా చూస్తే ‘వేయిపడగలు’ ఒక చిన్న సైజు ‘విజ్ఞాన సర్వస్వం’ అనిపిస్తుంది. ధర్మారావుతో పాటు విశ్వనాథ సృష్టించిన పాత్రలు చాలావరకు సజీవమైనవి. ‘వేయిపడగలు’,  కాల్పనికోద్యమ కాలంలో వెలువడిన ఆత్మాశ్రయ కవిత్వ(Subjective Poetry) శాఖలో ఒక అపురూపమైన కావ్యం. దాని వైశిష్ట్యం, అది వేయి పుటల నవలగా రూపొందడమే. నవలకు కవిత్వగుణ మబ్బడం 20 వ శతాబ్ది సాహిత్యములో ఒక మహత్పరిణామం. తెలుగు సాహిత్యములో స్వతంత్రంగా ఈ పరిణామం తెచ్చిన ఖ్యాతి విశ్వనాథది.

మొత్తంగా ఆయన నవలల గురించి:  విశ్వనాథ నవలను కావ్యంగా, తత్వవిచారంగా రూపొందించారు. అది ఆయన సాహిత్యానికి కూర్చిన నవ్యత. విశ్వసాహితిలో తెలుగు నవలకు స్థానం ఏర్పరచిన నవ్యత.

***

విశ్వనాథ పాండిత్యం, అవగాహనల లోతును, కల్పనాశక్తిని, పాత్రచిత్రణను. ఇంకా ఇతరేతర అనేక గుణాలను ప్రతిబింబించే కొన్ని ఘట్టాలనో, భావ శకలాలనో  ఆయన రచనలనుంచిఎత్తి చూపి ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు ముగ్ధులవడం వేరు. ఒక రచనను మొత్తంగా చూసి అందులో ఆయన ప్రదర్శించిన వస్తు నిర్వహణ నైపుణ్యాన్ని, స్పష్టతను, ముఖ్యంగా ఆ రచన వెనుక ఉన్న ఆయన దృక్పథాన్నీ విశ్లేషించి అంచనా వేయడం వేరు. సుదర్శనంగారు చేపట్టినది రెండో పద్ధతి.

విశ్వనాథ దృక్పథ పార్శ్వానికి వస్తే, అది ఆయనకు చాలా అసంతృప్తినే కాదు, ఆవేశాన్ని, ఆవేదనను కూడా  కలిగించింది. అక్కడక్కడ ఆక్షేపణ, వ్యంగ్యం రంగరించి మరీ విమర్శ చేయడానికి ఆయన వెనుకాడలేదు. అదే సమయంలో ‘ఏకవీర’ నుంచి ‘తెరచిరాజు’ వరకు వివిధ నవలలో విశ్వనాథ దృక్పథం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో, దాని వెనుక ఎలాంటి అంతస్సూత్రత ఉందో; ఆ క్రమంలో విశ్వనాథ ఎలాంటి ద్వైధీ భావానికీ, ఘర్షణకూ, కలవరానికీ లోనయ్యారో, చివరికి ఎక్కడ ఆగిపోయారో సుదర్శనం విశ్లేషించిన తీరు అత్యద్భుతం. అది చదువుతున్నప్పుడు 20 వ శతాబ్ది తెలుగుసాహిత్యంలో ధీర గంభీర ఆజానుబాహువుగా కనిపించే అంతటి విశ్వనాథ , పసివాడుగా మారి బేల చూపులు చూస్తున్న దృశ్యం పొడగడుతుంది.  బాహ్యంగా ముద్రపడిన ఇమేజికి, ఆంతరిక ఇమేజికి ఉన్న ఈ తేడా; ఒక రాజకీయ నాయకుని, లేదా మత నాయకుని లేదా మరొకరి ఇమేజి నిర్మాణంతో ఏమైనా సామ్యాన్ని సూచిస్తోందా?!

viswa1

ఏకవీర

ప్రస్తుతానికి దానినలా ఉంచితే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో, అంతకు ఒకింత ముందు సాంప్రదాయిక ప్రభావాలనుంచి నవ్యతకు మళ్లిన అనుభవం ఎక్కువమంది కవి, రచయితలలో కనిపిస్తే; నవ్యతనుంచి సంప్రదాయం వైపు,అంటే వెనక్కి మళ్లి, అందులోనే కరడుగట్టిన అరుదైన సాహితీవేత్తగా విశ్వనాథ కనిపిస్తారు. మొదట్లో ఆయన కూడా తన సమకాలికులైన రాయప్రోలు, కృష్ణశాస్త్రి వగైరాలలానే కాల్పనికవాదంతో ప్రభావితులయ్యారు. ఆ కొత్త కళ్ళద్దాలతో జగత్తును నూతనంగా దర్శించి, పులకించి, భాష్యం చెప్పే వైశాల్యం వైపు ప్రవహించే ప్రయత్నం చేశారు. ‘ఏకవీర’లో అది ఎలా ప్రతిఫలించిందో సుదర్శనం విశ్లేషించారు. కాల్పనికోద్యమ ప్రభావంలో పుట్టిన ‘ఏకవీర’ కథలో, నిర్మాణంలో ఆ ఉద్యమ సంప్రదాయాన్ని పూర్తిగా అనుసరిస్తూనే; ఏకవీర పాత్రపోషణ, కథ ముగింపు విశ్వనాథ ప్రత్యేకదృక్పథాన్ని సూచిస్తాయని ఆయన అంటారు. నవలలో కుట్టాన్-మీనాక్షి; వీరభూపతి-ఏకవీర ప్రేమికులు. కానీ పెళ్లి అనే వ్యవస్థాధర్మం దగ్గరికి వచ్చేసరికి జంటలు తారుమారు అయ్యాయి. దానితో రెండు జంటలలోనూ సంఘర్షణ ఏర్పడింది. ఆ సంఘర్షణ తిరిగిన మలుపు ఈ నవలలో ఇతివృత్తం. పెళ్ళికి, ప్రేమకు మధ్య జరిగిన ఆ ఘర్షణలో ఏకవీర ద్వంద్వాతీతమైన తాత్వికస్థితిని చేరుకుని, లోకాన్నీ లోకధర్మాన్ని విడిచి వైగై నదిలో మునిగిపోయింది. వీరభూపతి సన్యాసి అవుతాడు.  వీరికి భిన్నంగా కుట్టాన్, మీనాక్షి పెళ్లి అనే వ్యవస్థాధర్మంతో రాజీపడే ప్రయత్నం చేస్తారు.

ఏకవీర, వీరభూపతిలలో ధర్మానికీ, ప్రేమకూ జరిగిన సంఘర్షణను, అది తిరిగిన మలుపును ప్రత్యేకంగా చిత్రించడమే విశ్వనాథ నిరూపించదలచుకున్న తాత్విక విషయమని సుదర్శనం అంటారు. కాల్పనికోద్యమ ప్రభావంలో ఉన్న ఈ దశలో విశ్వనాథ వైయక్తిమైన వలపును కాదనలేదు; అయితే వివాహవ్యవస్థా ధర్మాన్నీ కాదనలేదు. రెండింటికీ అతీతమైన ఒక సమన్వయాన్ని దర్శించారు. ఇందులో ఆయన నిరూపించదలచుకున్నది కేవల హైందవవ్యవస్థ కాదు; దానికి మూలతత్వమేదైతే ఉందో అది. అదే సనాతనధర్మం. వ్యక్తి ధర్మానికీ, వ్యవస్థా ధర్మానికీ జరిగే ఘర్షణలో రెంటి వైపూ మొగ్గక, రెంటినీ అధిగమించే సమన్వయాన్ని సాధించే ద్వంద్వాతీతమైన తత్వమే సనాతన ధర్మం. అది సామూహికం కాక, వ్యక్తిగతం. క్రమంగా విస్తృతమూ, వైవిధ్యవంతమూ అయిన అయిన హైందవ సంప్రదాయస్వరూపం ఇదే నని సుదర్శనం అంటారు. నాటి వంగ సాహిత్యంలో వ్యవస్థాధర్మాన్ని సమర్థించిన బంకిమ్ చంద్ర మార్గం కన్నా, కాల్పనికవాదంలో భాగంగా వైయక్తిక ధర్మాన్ని సమర్థించిన రవీంద్రుని మార్గం కన్నా, విశ్వనాథ ఏకవీరలో ప్రదర్శించిన సమన్వయ పూరితమైన సనాతనధర్మ మార్గం ఉత్కృష్టమైనదని ఆయన నిర్ధారణ.

viswa2

అయితే అదే సమయంలో ఈ ‘ఏకవీర’లోనే తన మతావేశంపై, తత్వాన్ని వదలి దాని ప్రతీకలపై విశ్వనాథలో ఉన్న చాపల్యాన్ని సూచించే చిత్రణలూ ఉన్నాయని సుదర్శనం ఎత్తి చూపించారు. ఆ చాపల్యం, లేదా వ్యామోహమే క్రమంగా ఆయనలో పెరిగి పెద్దదై అనంతర రచనల్ని ఆక్రమించుకుందనీ, ద్వంద్వాతీతమైన సనాతనధర్మాన్ని వదిలి ద్వంద్వంలో ఒకటైన వ్యవస్థాధర్మాన్ని సమర్థిస్తూ వచ్చారనీ, వ్యవస్థాధర్మమే సనాతన ధర్మం అనే అపోహను కల్పించే ప్రయత్నం చేశారని సుదర్శనం విశ్లేషణ. అంటే, కాల్పనికోద్యమ ప్రభావంతో కొత్త చూపును తెచ్చుకోబోయిన విశ్వనాథే, వ్యవస్థ పట్ల రొమాంటిక్ వ్యామోహంలో పడిపోయి పాత చూపుకు తిరోగమించారని సారాంశం. ఆయన దృక్పథ పతనానికి ఇదే ప్రారంభం.

వేయిపడగలు

‘వేయిపడగలు’ నవలలో వ్యక్తమైనది ఇదే!

కారణం, వ్యవస్థకు పట్టిన క్షీణదశ అంటారు సుదర్శనం. దాంతో వ్యవస్థను సమర్థించడం, కాపాడడమే ఆయనకు ముఖ్యంగా తోచిందనీ; హేతువాదం, భౌతికవాదం, పురాణాల నిరసన మొదలైనవి కలిగించిన ఆవేశంతో విశ్వనాథ సాహిత్యరంగాన్ని సమరరంగంగా దర్శించారని ఆయన అంటారు. పాశ్చాత్య ప్రభావాలు, ఇంగ్లీష్ చదువులే కాక,  గాంధీజీ స్వాతంత్ర్య సమరంలోకి దళితులను, ముస్లింలను ప్రవేశపెట్టడం మొదలైన, సుదర్శనం చెప్పని ఇతరేతర పరిణామాలను కూడా వీటికి జోడించుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలోనే సుదర్శనం ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. వ్యవస్థ కాలం వెంబడి మారే సాధనం మాత్రమేననీ, అంతకంటే అది ప్రాతినిధ్యం వహించే తత్వం ముఖ్యమనీ; దానిని కొత్తగా, కొత్త సమన్వయంతో పునర్మించాలనీ విశ్వనాథకు తోచలేదని ఆయన అంటారు. అయితే, ఆ వెంటనే, “అలా ఆలోచించే అవకాశం అప్పట్లో ఆయనకు లే”దని సుదర్శనంగారే అనడం ఏమరుపాటో లేక ఉద్దేశపూర్వకమో తెలియదు. బహుశా, తాత్విక స్థాయిలోనే కావచ్చు కానీ, విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే హైందవసంప్రదాయం పట్ల ఒక అడ్మిరేషన్ కలిగిన ‘బాహ్యమిత్రు’డిగా ఆయనకు ఇలా సందేహలాభా(benefit of doubt)న్ని ఆపాదించి ఉండవచ్చు. ఎందుకంటే, విశ్వనాథకు సమకాలికుడైన ఉన్నవ లక్ష్మీనారాయణగారి ‘మాలపల్లి’ నవల గురించి ‘సాహిత్యంలో దృక్పథాలు’లో సుదర్శనంగారే చర్చిస్తూ ఆ నవలకూ, వేయిపడగలకూ ఉన్న తేడాను నిర్వచనప్రాయంగా ఆవిష్కరించారు.

‘మాలపల్లి’ ఆనాటి సామాజిక చైతన్యానికి ప్రతిబింబం కావడమొక్కటే కాదు, ఆ చైతన్యానికి నూతన దృక్పథాన్ని, పరిణామమార్గాన్ని నిర్దేశించిందని ఆయన అంటారు. ఆయన ప్రకారం, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రెండు విభిన్న మార్గాలను అనుసరించడం సాధ్యం. మొదటిది,  వర్ణాశ్రమ వ్యవస్థ శిథిలమైందనీ, వైదికధర్మం అడుగంటిందనీ, పరాయి మతస్థుల, విదేశీయుల పాలనలో భారతీయ సంస్కృతి, భాషలు, హైందవధర్మం, జీవనం సంకరమైపోయాయనీ, ఇక మిగిలిందేముందనీ అనుకుంటూ నిస్పృహ, నిర్వేదం ప్రకటించడం. ఇది ‘వేయిపడగలు’ లో ప్రతిభావంతంగా వ్యక్తమైంది. రెండవది,  పై వైఖరి సంపూర్ణ సత్యం కాదని చెబుతూ, మౌలికమైన హైందవధర్మమూ, సంస్కృతీ సజీవంగానే ఉన్నాయనీ, నెలవులు మార్చుకుని కాలగతిలో నివురు గప్పిన నిప్పులా ఉంటూనే ఉన్నాయనీ భావించడం. ఇది ‘మాలపల్లి’లో కనిపిస్తుంది. యధార్థం ఒకటే అయినా ఈ రెండు రచనల ప్రతిపాదనలు వేరు వేరుగా ఎందుకు ఉన్నాయంటే, హైందవధర్మమూ, సంస్కృతీ అగ్రవర్ణాలవారిలో, ధనికులలో పూర్వస్థితినుంచి శైథిల్యాన్ని పొందినా సామాన్యప్రజల్లో, పంచముల్లో, నిరుపేదల్లో సజీవంగా ఉండడం ఒక కారణం.  ‘వేయిపడగలు’ అగ్రవర్ణాలవారినీ, జమీందారులనీ ఆలంబనం చేసుకోగా, ‘మాలపల్లి’ పంచములను, శ్రామికులను ఆలంబనం చేసుకుంది. విశ్వనాథ వర్ణవ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యం సనాతనధర్మానికి ఇవ్వలేదు. ఉన్నవవారు సనాతనధర్మానికీ, మోక్షసాధనకూ ఇచ్చిన ప్రాధాన్యం వర్ణవ్యవస్థకు, వైదికకర్మానుష్ఠానానికీ ఇవ్వలేదు. ఇలా పోల్చి చూసినప్పుడు హైందవధర్మనిరూపణలో ఒకరిది ‘వెనుక చూపు’, ఇంకొకరిది ‘ముందుచూపు’ అని సుదర్శనం అంటారు.

ఇలా ‘వేయిపడగలు’ను, ‘మాలపల్లి’ని పోల్చి చూసినప్పుడు ఇంకా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సుదర్శనంగారు ‘వెనుకచూపు’గా పేర్కొన్న ‘వేయిపడగలు’కు లభించిన ప్రాచుర్యం, ‘ముందుచూపు’గా పేర్కొన్న ‘మాలపల్లి’కి ఎందుకు లభించలేదు; ‘వేయిపడగలు’ చర్చలోకి వచ్చినంతగా ‘మాలపల్లి’ ఎందుకు రాలేదు,  వర్ణాశ్రమ ప్రాధాన్యాన్ని కాక, సమన్వయాత్మకమైన సనాతన ధర్మాన్ని ప్రతిపాదించిన ఆ నవల అనంతరకాలానికి ఒక గొప్ప స్ఫూర్తీ, నమూనా ఎందుకు కాలేదు—అన్నవి ఈ ప్రశ్నలలో కొన్ని. ఇంకొకటి ఏమిటంటే, ‘మాలపల్లి’కి ఉన్నది స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం, గాంధీ తాత్వికత. ఉన్నవవారు స్వయంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. సుదర్శనంగారు గుర్తించి ప్రస్తావించనిది ఏమిటంటే, ‘వేయిపడగలు’ వెనుక ‘మాలపల్లి’కి ఉన్నట్టు బలమైన స్వాతంత్రోద్యమ నేపథ్యం లేకపోవడం. ‘వేయిపడగలు’,  ఆయనే అన్నట్టు, వ్యవస్థా శైథిల్యం పట్ల ఒక వ్యక్తి చెందిన నిర్వేదం, నిస్పృహ. ఉన్నవలా విశ్వనాథ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు.

స్వాతంత్ర్యోద్యమ ప్రభావాలనుంచి ‘వేయిపడగ’లూ, దాని రచయిత దూరంగా ఉండడం చారిత్రక దృష్టినుంచి మనకు ఏం చెబుతుంది? దళితులను, ముస్లిం లను, కార్మిక, కర్షకులను స్వాతంత్ర్యోద్యమంలోకి తీసుకొచ్చి ఉద్యమ పరిధిని అనేకరెట్లు విస్తృతపరచిన గాంధీ;  దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగివచ్చాక తన శేషజీవితం పొడవునా బ్రిటిష్ తో పోరాటానికి సమాంతరంగా, అంతకంటే ఎక్కువగా పోరాడినది ఛాందసవాదహైందవశక్తులతో. చివరికి ఆ శక్తుల చేతిలోనే ఆయన మరణించాడు కూడా. ఈ ఛాందసవాద హైందవ శక్తులు కూడా గాంధీ నాయకత్వంలోని నాటి స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఆ శక్తుల అండదండలతో, భావజాలంతో ప్రాణం పోసుకుని  నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి కూడా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటానికి దూరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ‘వేయిపడగలు’ వెనుక స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం లేకపోవడం ఆ రచనను, రచయితను ఎవరి మధ్య నిలబెడుతోంది? ‘మాలపల్లి’కి భిన్నంగా ‘వేయిపడగలు’ విశేష ప్రాచుర్యాన్ని, అడ్మిరేషన్ ను పొందుతూ ఉండడమే కాదు; ఎనభై దశకం చివరినుంచీ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆర్థికంగా బలోపేతమవుతున్న మధ్యతరగతిలోని ఒక విద్యాధిక యువతరం ఇప్పుడు విశ్వనాథను, ఆయన భావజాలాన్ని నూతనంగా కనుగొంటూ ఆయనను ఒక స్ఫూర్తిదాయక ఐకాన్ గా తిరిగి ప్రతిష్టించే ప్రయత్నం వరకూ దాదాపు ఒక వందేళ్ల కాలగమనాన్ని కళ్ళముందు నిలుపుకుని చూస్తే అందులో సరళరేఖా సదృశమైన ఒక కచ్చితమైన క్రమం కనిపిస్తుంది. ఆ సరళరేఖకు ఆ చివర గాంధీ భావజాలం ఉంటే; ఈ చివర ఉన్నది ఛాందస హైందవాద భావజాలం, అది సాధించిన పునరాధిక్యత. రాజకీయంగా చెప్పాలంటే, గాంధీ భారతంపై సావర్కర్ భారతం సాధించిన పునర్విజయం.

‘మాలపల్లి’ దళితులకూ స్ఫూర్తిదాయకం కాలేదు, నమూనా కాలేదు. కారణం స్పష్టమే. అందులో ఉన్నది ఒక బ్రాహ్మణ రచయిత చిత్రించిన గాంధీ మార్కు హైందవ తాత్వికత. గాంధీకి ఆనాడు అంబేడ్కర్ ప్రతిద్వంద్వి అయిన పరిస్థితిలో దళితులు గాంధీ మార్గాన్ని కాక అంబేడ్కర్ మార్గంవైపే మొగ్గు చూపారు. మొత్తానికి, సనాతన ధర్మాన్ని చిత్రించారని సుదర్శనంగారు చెప్పిన ‘మాలపల్లి’ రచయిత దళితులకు సరే, అగ్రవర్ణాలకూ పనికిరాకుండా పోయాడు.

ఇంతకీ ‘వేయిపడగలు’లో విశ్వనాథ ఘనంగా చెప్పదలచుకున్న వ్యవస్థా స్వరూపం ఎలాంటిది? సుదర్శనంగారి మాటల్లో చెప్పాలంటే, ఆయన ‘దృక్పథ శైథిల్యం’ ఇంకా ఎలాంటి మలుపులు తిరిగింది?

దాని గురించి తర్వాత….

*

 

మీ మాటలు

  1. amarendra dasari says:

    a scholarly ఆర్టికల్ …ఈ రకమైన అంచనాలూ చర్చలూ మనకు అలవాటు లేవు కదా !! అభిమానం, అది ముదిరితే భక్తి …పోస్ట్ 90s scenario లో ఆయన గురించి మధ్య తరగతి లో కొత్త ఆసక్తి పుట్టుకు రావడం అన్న observation ఎంతో విలువైనది

  2. నరసింహారావు says:

    భాస్కరం గారూ!
    ఈ మీ వ్యాఖ్యకు మీక గల చారిత్రక ఆధారాలేమిటో మీకు వీలుంటే వివరించగలరు. మీ ఉద్దేశంలో ఛాందసవాద హైందవ శక్తులు అంటే ఆ స్వాతంత్రోద్యమ కాలంలో ఎవరెవరో చెప్పగలరా? లేదా ఏయే రాజకీయ, ధార్మిక పక్షాలో చెప్పగలరా? ( ఉదాహరణ : ఆర్. ఎస్. ఎస్.)
    ‘‘ఈ ఛాందసవాద హైందవ శక్తులు కూడా గాంధీ నాయకత్వంలోని నాటి స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఆ శక్తుల అండదండలతో, భావజాలంతో ప్రాణం పోసుకుని నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి కూడా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటానికి దూరంగానే ఉన్నాయి‘‘

    • కల్లూరి భాస్కరం says:

      నరసింహారావుగారూ… గాంధీ నాయకత్వంలోని స్వాతంత్ర్యోద్యమానికి ఎవరెవరు, ఏయే కారణాలతో దూరంగా ఉన్నారో ఆ చరిత్ర అంతా ప్రజాక్షేత్రంలో పుష్కలంగా ఉంది. ఇప్పుడు మరింతగా చర్చలోకి వస్తోంది. స్వాతంత్ర్యోద్యమంపై పుస్తకాలు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇప్పటికప్పుడు నాకు అందుబాటులో ఉన్న పుస్తకాలు:
      1. మోహన్ దాస్-రాజ్ మోహన్ గాంధీ రాసిన గాంధీ బయోగ్రఫీ(ఈ పుస్తకానికి నా తెలుగు అనువాదం ఎమెస్కో ప్రచురించింది)
      2. ఇండియన్ పార్టీ పాలిటిక్స్-శివ చంద్ర ఝా.
      3. బిజెపి అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ హిందూ నేషనలిజం-పార్థా ఎస్ ఘోష్

      • Srinivas Vuruputuri says:

        “ఈ ఛాందసవాద హైందవ శక్తులు కూడా గాంధీ నాయకత్వంలోని నాటి స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఆ శక్తుల అండదండలతో, భావజాలంతో ప్రాణం పోసుకుని నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి కూడా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటానికి దూరంగానే ఉన్నాయి”.

        “నేడు హిందుత్వ శక్తులు అనిపించుకుంటున్నవి” అన్న ముక్క బాగానే అర్థమవుతోంది. కానీ ఆ సంస్థలకు అండదండలిచ్చి, ప్రాణం పోసిన “ఆ శక్తులు” ఏవో అర్థం కాలేదు. ఒకరిద్దరినైనా పేర్కొనగలరా?

        నాకు తట్టిన ఒక రెండు పేర్లు: మదన మోహన మాలవీయ, పురుషోత్తం దాస్ టాండన్. కానీ వాళ్ళిద్దరూ స్వాతంత్ర్యోద్యమంలో బాగా పాల్గొన్న వాళ్ళే కదా?

        ఇక ఆరెస్సెస్ మాటకొస్తే – నాకు గుర్తున్నంతలో –

        ఆరెస్సెస్ స్థాపకుడైన హెడ్గేవార్‌కి బెంగాల్ విప్లవ కార్యకర్తలతో సంబంధం ఉండేది. అనుశీలన సమితి సభ్యుల్లో ఒకడని, సీఐడీలు ఆయన్ని వెంటాడేవారని చదివిన జ్ఞాపకం. కాంగ్రెస్ సభ్యుడు కూడా. నాగపూర్ కాంగ్రెస్ సభలో సేవాదళ్ పనులను పర్యవేక్షించారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని సెడిషన్ కేసు కింద ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. ఖిలాఫత్ ఉద్యమం తదనంతర పరిణామాలు ఆరెస్సెస్ స్థాపనకి దారి తీసాయి.

        ఆరెస్సెస్ లక్ష్యం స్వరాజ్య సాధన కన్నా విభిన్నమైనదీ, దీర్ఘ కాలికమైనదీ అయినందున తన సంస్థను స్వాతంత్ర్యోద్యమం నుంచి దూరంగా ఉంచారు హెడ్గేవార్. అలాగని వ్యక్తి స్థాయిలో తమ కార్యకర్తలెవరైనా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాలనుకుంటే వద్దనే వారూ కాదు. భగత్ సింగ్ బలిదానానంతరం విప్లవ పథాన్నాశ్రయిద్దామనుకున్న కొందరు యువ కార్యకర్తలను నచ్చజెప్పి వారించిన ఉదంతం ఇందుకు మినహాయింపేమో. ఆయన తరువాత నాయకత్వాన్ని స్వీకరించిన గోల్వల్కర్‌కు రాజకీయాల పట్ల ఉండిన వైముఖ్యం బహుశా మరో కారణమై ఉంటుంది – ఆరెస్సెస్ స్వాతంత్ర్య సమరానికి దూరంగా ఉండిపోవడానికి.

        గాంధీ రాజకీయాల పట్ల వ్యతిరేకతా కారణమై ఉండవచ్చును.

        గమ్మత్తేమిటంటే – క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించటం గురించీ, (అదే సమయంలో) అంబేద్కర్ వైస్రాయి కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగటం గురించీ “ప్రజాక్షేత్రం”లో పెద్దగా సమాచారం లభిచకపోవటం!

  3. Dr. Y. Kameswari says:

    @Amarendra dasari,
    Well said andi. We are not used to discussions and estimates. It applies to works of every writer including Chalam, Buchibabu, SriSri etc. Any article focusing something other than established view of the writer will face a number of obstacles to get published. We have fixed opinions

  4. manjari lakshmi says:

    హైందవానికి, సనాతన ధర్మానికి తేడా ఏమిటండీ?

    • కల్లూరి భాస్కరం says:

      సుదర్శనంగారి దృష్ట్యా చెప్పుకుంటే; సమన్వయానికి, తత్వానికి, వైవిధ్యానికి, వ్యక్తిగత సాధనకు ప్రాధాన్యమిచ్చేది సనాతన ధర్మం. అదే హైందవవ్యవస్థకు మూల తత్వం. ఆ వైశాల్యంనుంచి తప్పుకుని, కుంచించుకుని, తత్వాన్ని విడిచిపెట్టి, కేవలం వ్యవస్థను, ప్రతీకలను పట్టుకుని పాకులాడేది హైందవం.

  5. రచన చూసి రచయిత వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలమా! కవి తన వ్యక్తిత్వాన్ని మించిన కాకుంటే తగ్గించుకున్న సమకాలీన లేక ఇతిహాసాల్లోకి ద్రుష్టి సారించడం సమర్ధించలేమా ! ఒక రచనని కవికి కథనానికి సంభంధం ముడిపెట్టకుండా ఆస్వాదించలేమా.!
    ఏ రచనని ఎలా విశ్లేషించగలం.అది అయ్యే పనేనా?

  6. Prof P C Narasimha Reddy Ph D says:

    There seems to be no need to re-evaluate Sri Viswanatha interms of modern relevance. But he continues to interest those who advocate Hindutva for socio-political gain. (Sri RSS analysis was as slippery as his novel “Samsara Vriksham” is)
    – Prof P C Narasimha Reddy

  7. Mandapaka Kameswar Rao raju says:

    విశ్వనాధ వారి సాహిత్యం పైన త్రిపురనేని మధుసూధన్ రావ్ గారు పెట్టిన విమర్శ మరో సారి ఆకళింపు చేసుకో వల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.

  8. తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ప్రభావం తప్ప,కొంత కాలం వరకు కను మరుగై ఉన్న విశ్వనాథ వారు మళ్ళీ ఇటీవలి తెరపైకి లేచారు ఎందుకు చెప్మా ! విషయం జగద్విదితమే !

  9. కల్లూరి భాస్కరం says:

    శ్రీనివాస్ వురుపుటూరి గారూ…

    1. మీకే కాక, పాఠకులు అందరికీ ముందుగా ఒక వివరణ ఇవ్వడం అవసరమనిపించింది.
    నా వ్యాఖ్యలో “…గాంధీ నాయకత్వంలోని స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్న” అనే మాటను సాభిప్రాయంగా వాడాను. స్వాతంత్ర్యోద్యమం అంతా గాంధీ నాయకత్వంలోనే జరిగిందనే అభిప్రాయానికి తావు ఇవ్వకూడదనే ఆ జాగ్రత్త. గాంధీ పోరాటానికి ముందునుంచీ, దానికి సమాంతరంగా వివిధ పంథాలలో స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయి. బెంగాల్ విప్లవకారులు, గదర్ పార్టీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, కమ్యూనిష్టులు…ఇలా ఉదహరించుకోవచ్చు. వీటిలో వేటి వేటికి ప్రజల మద్దతు ఏమేరకు లభించిందన్నది వేరే విషయం.
    2. మీరు ఉదహరించిన నా వ్యాఖ్యలో ‘హిందుత్వ శక్తులు’ అనడంలో నేను ఉద్దేశించినది వ్యక్తులను కాదు, వర్గాలను. వ్యక్తుల విషయానికి వస్తే మీరు పేర్కొన్న మదనమోహన మాలవీయే కాక, లాలా లజపతి రాయ్ తదితరులు కూడా హిందూ ప్రయోజనాల పరిరక్షణకోసం, హిందువుల సమీకరణకోసం ప్రయత్నించినవారే. వారిది నేరుగా 1906లో బ్రిటిష్ ప్రాపకంతో అవతరించిన ముస్లిం లీగ్ పట్ల ప్రతిస్పందన. లజపతి రాయ్ పంజాబ్ లో ప్రారంభించిన హిందూ సభే ఆ తర్వాత హిందూ మహాసభ అయింది. లజపతి రాయ్, మాలవీయ హిందూ మహాసభతోనూ, కాంగ్రెస్ తోనూ కూడా అసోసియేట్ అయినవాళ్ళు. గాంధీతో కలసి పనిచేయడానికి వీళ్ళకు మొదట్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాంగ్రెస్ కు ఉన్న ఒక ప్లాట్ ఫామ్ స్వభావం రీత్యా (ఆ స్వభావాన్ని గాంధీయే తీసుకొచ్చారా లేక దానికి ముందు నుంచీ ఉందా అన్నది ఇంకో పరిశీలనార్హమైన ప్రశ్న) గాంధీ హిందూవాదులతోనే కాక, సోషలిష్టులతోనూ, కమ్యూనిష్టులతోనూ కూడా పని చేశారు. వారితో ఒక ఈక్వేషన్ స్థాపించుకోగలిగారు. ఇంకొక విషయం ఏమిటంటే, లజపతి రాయ్, మాలవీయవంటివారు హిందూ ప్రయోజనాల పరిరక్షణ కోరుకున్నారు కానీ, హైందవేతరులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడాలని అనుకోలేదు.
    3. అయితే, ఖిలాఫత్ /సహాయనిరాకరణ ఉద్యమాలు/ అస్పృశ్యత మొదలైన అంశాలను గాంధీ చేపట్టిన తర్వాత అంతవరకు గాంధీకి హిందూవాదులతో ఉన్న ఈక్వేషన్ మారింది. ఆ మార్పు అటు ముస్లిం లతోనూ వచ్చింది. ఈ విధంగా ప్రీ అండ్ పోస్ట్ ఖిలాఫత్/సహాయనిరాకరణ ఉద్యమాలు/అస్పృశ్యత అన్న విధంగా విడదీసి చూస్తే కొంత క్లారిటీ వస్తుంది.
    4. పోస్ట్ ఖిలాఫత్ వగైరాల నేపథ్యంలో కాంగ్రెస్ కు దూరంగా స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నించిన హిందూ మహాసభ ఆర్ ఎస్ ఎస్ కు దారి ఇస్తూ క్రమంగా బలహీనపడిపోయింది. హిందూప్రయోజనాల పరిరక్షణ కేంద్రం నాగపూర్ కు మారింది. లజపతి రాయ్, మాలవీయలకు భిన్నమైన వ్యక్తుల నాయకత్వంలోకి వెళ్లింది. సావర్కర్/హెడ్గేవార్/గోల్వాల్కర్ లమసామాజిక, పశ్చిమ భారతప్రాంతీయ నేపథ్యం కూడా దానికి ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని ఇచ్చింది. హెడ్గేవార్ కాంగ్రెస్ లో పని చేసినవారే. కానీ పోస్ట్ ఖిలాఫత్/సహాయనిరాకరణ ఉద్యమాల సందర్భంలో ఆయన కాంగ్రెస్ నుంచి తప్పుకుని ఆర్ ఎస్ ఎస్ స్థాపనవైపు మళ్ళారు. సహాయనిరాకరణ ఉద్యమంలో “బ్రాహ్మణ, బ్రాహ్మణేతర ఘర్షణ నగ్నంగా కళ్ళకు కట్టడం”(రాజ్ మోహన్ గాంధీ తన ‘మోహన్ దాస్’ అనే గాంధీ బయోగ్రఫీ లో ఉటంకించిన హెడ్గేవార్ మాట)వల్ల కలిగిన విచారం అందుకు వివిధ కారణాలలో ఒకటి. ఇక్కడి నుంచి ఒకసారి గాంధీ దక్షిణాఫ్రికానుంచి 1915లో భారత్ కు వచ్చిన తర్వాతా, అంతకు ముందూ ఉన్న స్వాతంత్ర్యోద్యమ పరిస్థితిని చూస్తే, అంతవరకూ శిష్ట వర్గాల చేతుల్లో ఉన్న ఉద్యమానికి గాంధీ మాస్ స్వభావం ఇచ్చారు. అది దళిత, ముస్లిం లు సహా అన్నివర్గాలనూ ఉద్యమంలో భాగస్వాముల్ని చేసింది. రాజకీయ అధికార, సామాజిక, మత, సాంస్కృతిక సహా అన్ని రంగాలలో పరిస్థితి పూర్తిగా కదలబారే ప్రమాదాన్ని అది రూపుకట్టింది. ఇందుకు భిన్నంగా గాంధీకి ముందునుంచీ స్వాతంత్ర్యోద్యమంలో ఉన్నవారు, పోస్ట్ ఖిలాఫత్ వగైరాల తర్వాత మరింత ప్రణాళికాబద్ధంగా, మిలిటెంట్ స్వభావంతో హిందూ సమీకరణకు ప్రయత్నించినవారు స్టేటస్ కోను కోరుకున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సహాయనిరాకరణ ఉద్యమంతో “భ్రాహ్మణ/బ్రాహ్మణేతర ఘర్షణ నగ్నంగా కళ్ళకు కడుతోందని” హెడ్గేవార్ విచారించడంలో ఆ సూచన స్పష్టమే.
    5. ఇది- వీల్ వితిన్ ది వీల్ అన్నట్టుగా విస్తృత స్వాతంత్ర్యోద్యమంలో ఒక అంతర్ ఉద్యమం. ఇది ఆ దశలో ప్రధానంగా గురి పెట్టింది గాంధీ నాయకత్వానికి. లజపతి రాయ్, మాలవీయ వంటివారితోనే కాక; సోషలిష్టులతోనూ, కమ్యూనిష్టులతోనూ కూడా ఒక ఈక్వేషన్ ను స్థాపించుకోగలిగిన గాంధీకి ఈ నాగపూర్ వర్గం కొరుకుడు పడలేదు. అది ఆయన వైఫల్యాలలో ఒకటి.
    6. గాంధీ ఛాందసవాద హైందవశక్తులతో జరిపిన పోరాటం మరో ఘట్టం. ఈ శక్తులనుంచి ఆయనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.
    7. ‘ఇండియన్ పార్టీ పాలిటిక్స్’ అనే తన పుస్తకంలో శివచంద్ర ఝా అనే రచయిత ఇలా అంటారు: The Bharatiya Janata Party…in fact is the new edition of the former Bharatiya Jan Sangh, founded in 1951…The Bharatiya Jan Sangh was the only party whose founders and leaders had no Congress background of any kind, while even the Communists, as we saw earlier, were mixed up with the Indian National Congress in the beginning. The Bharatiya Jan Sangh came into being when the country was out of the British danger zone.
    8. ఈవిధంగా గత వందేళ్ల చరిత్రను(1915లో గాంధీ భారతరాజకీయాల్లోకి క్రియాశీలంగా అడుగుపెట్టి ఇప్పటికి సరిగా వందేళ్లు దాటింది)పరిశీలిస్తే యాంటీ-గాంధీయిజం, ఆ తర్వాత యాంటీ-నెహ్రూయిజం(గాంధీ-నెహ్రూ)వేళ్ళు ఎక్కడ ఏయే వర్గాలలో ఉన్నాయో, అందుకు కారణాలేమిటో అర్థమవుతుంది. ఈ యాంటీ-గాంధీ, నెహ్రూ శక్తులే ఆర్ ఎస్ ఎస్, బీజేపీలకు కోర్ బేస్ గా మారడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
    9. ఖిలాఫత్/సహాయనిరాకరణ ఉద్యమం తర్వాత ముస్లిం లలో ఏర్పడిన వేర్పాటు సమీకరణ పార్స్వాన్ని కూడా పక్కన పెట్టి దీనినంటినీ మదింపు వేయవలసిన అవసరాన్ని నేను కాదనను. అప్పుడు కూడా యాంటీ గాంధీ-నెహ్రూయిజం అనే చారిత్రక యథార్థం మారదు.
    10. ఆర్ ఎస్ ఎస్ ఒక్కటే కాదు, స్వాతంత్ర్య సమరానికి దూరంగా ఉన్న వర్గాలు మరికొన్ని ఉన్నాయి. అంబేడ్కర్ వర్గీయులు, ద్రవిడ ఉద్యమం మొదలైనవి కూడా అందులోకి వస్తాయి. ఆర్ ఎస్ ఎస్ విషయానికి వస్తే, మీరన్నట్టు
    “ఆరెస్సెస్ లక్ష్యం స్వరాజ్య సాధన కన్నా విభిన్నమైనదీ, దీర్ఘ కాలికమైనదీ అయినందున తన సంస్థను స్వాతంత్ర్యోద్యమం నుంచి దూరంగా ఉంచారు హెడ్గేవార్. అలాగని వ్యక్తి స్థాయిలో తమ కార్యకర్తలెవరైనా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాలనుకుంటే వద్దనే వారూ కాదు. భగత్ సింగ్ బలిదానానంతరం విప్లవ పథాన్నాశ్రయిద్దామనుకున్న కొందరు యువ కార్యకర్తలను నచ్చజెప్పి వారించిన ఉదంతం ఇందుకు మినహాయింపేమో. ఆయన తరువాత నాయకత్వాన్ని స్వీకరించిన గోల్వల్కర్‌కు రాజకీయాల పట్ల ఉండిన వైముఖ్యం బహుశా మరో కారణమై ఉంటుంది”
    అన్నది ఒకవైపు నిజం కావచ్చు. ఇంకోవైపు నుంచి గాంధీ నాయకత్వం పట్ల వ్యతిరేకతా అంతే నిజం. చర్చించే విషయాన్ని, సందర్భాన్ని బట్టి ఎంఫసిస్ మారుతుంది.
    11 “గమ్మత్తేమిటంటే – క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించటం గురించీ, (అదే సమయంలో) అంబేద్కర్ వైస్రాయి కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగటం గురించీ “ప్రజాక్షేత్రం”లో పెద్దగా సమాచారం లభిచకపోవటం!” అన్న వ్యాఖ్య విషయానికి వస్తే,
    నా వ్యాసంలో చర్చిస్తున్న అంశాలకు సంబంధించినది కనుక స్వాతంత్ర్యోద్యమానికి కొన్ని శక్తులు దూరంగా ఉండడం గురించి ప్రస్తావించాను. ఈ శక్తులైనా, కమ్యూనిష్టులైనా(క్విట్ ఇండియాకు)స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉన్నారన్న చారిత్రక వివరం వెనక కారణాలు ఏమిటన్నది చూడడం మీదే నాకు ఆసక్తిగానీ, దానిని వారి దేశభక్తికి కొలమానంగా తీసుకునే ఉద్దేశం నాకు లేదు. ఆర్ ఎస్ ఎస్ స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉందన్న ఆక్షేపణ ఏ సందర్భంలో వచ్చిందో గమనించండి. ఇతరుల దేశభక్తిని, జాతీయతావాదాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతివాదంగా చేస్తున్న ఆక్షేపణ అది. కమ్యూనిష్టులు ఆ పని చేసినా వారికీ ఇలాంటి ఆక్షేపణే ఎదురవుతుంది. అప్పుడు ఆ చర్చా ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా వస్తుంది.

    • hari.S.babu says:

      కేవలం గాంధీమార్గాన్ని అనుసరించననతమాత్రాన తిరోగమనవాది అనెయ్యటం అంత వాస్తవికంగా ఉండదేమో!తమిల మేధావులు అసలు స్వాతంత్ర్యాన్నే వ్యతిరేకించారు మరి.కనీసం ముస్లిముల వలె వేరే దేశం కూడా కోరుకోకుండా మీ యూనియన్ జాక్ చల్లని నీడలోనే బజ్జుంటాం అన్నారు.కదా!

      • కల్లూరి భాస్కరం says:

        హరిబాబుగారూ…గాంధీ మార్గాన్ని అనుసరించని వాళ్ళు అందరూ తిరోగమనవాదులని నేను అనలేదు. అలాంటి ఉద్దేశం నాకు లేదు.

  10. hari.S.babu says:

    నవయుగ వైతాళుకుడు గురజాడ అప్పారావు గారు ఇంగ్లీషువాళ్ళ మీఅద్ పోరాడటం అటుంచి కాస్త ఉద్రేకంగా విమర్శించినా సహించలేకపోయేవాడు.ఆయన కూడా కరుడు గట్టిన శక్తుల ప్రతినిధియేనా?

  11. Srinivas Vuruputuri says:

    భాస్కరం గారూ

    “కానీ పోస్ట్ ఖిలాఫత్/సహాయనిరాకరణ ఉద్యమాల సందర్భంలో ఆయన కాంగ్రెస్ నుంచి తప్పుకుని ఆర్ ఎస్ ఎస్ స్థాపనవైపు మళ్ళారు. సహాయనిరాకరణ ఉద్యమంలో “బ్రాహ్మణ, బ్రాహ్మణేతర ఘర్షణ నగ్నంగా కళ్ళకు కట్టడం”(రాజ్ మోహన్ గాంధీ తన ‘మోహన్ దాస్’ అనే గాంధీ బయోగ్రఫీ లో ఉటంకించిన హెడ్గేవార్ మాట)వల్ల కలిగిన విచారం అందుకు వివిధ కారణాలలో ఒకటి…మరింత ప్రణాళికాబద్ధంగా, మిలిటెంట్ స్వభావంతో హిందూ సమీకరణకు ప్రయత్నించినవారు స్టేటస్ కోను కోరుకున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సహాయనిరాకరణ ఉద్యమంతో “భ్రాహ్మణ/బ్రాహ్మణేతర ఘర్షణ నగ్నంగా కళ్ళకు కడుతోందని” హెడ్గేవార్ విచారించడంలో ఆ సూచన స్పష్టమే.”, అన్నారు మీరు.

    మీరు కోట్ చేసిన వాక్యం నుంచి “మిలిటెంట్ స్వభావంతో హిందూ సమీకరణకు ప్రయత్నించినవారు స్టేటస్ కోను కోరుకున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది.” అన్న ఇన్ఫరెన్స్ లాగటం కష్టమేమో. హిందూ సమీకరణ కావాలంటే – ఎంతో కొంత – కులాన్ని, ఛాందసత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది కదా. అయన విచారం బ్రాహ్మణేతరుల అసెర్టివ్^నెస్ గురించి కాదు. హిందూ ఐక్యతకు ఈ ఘర్షణలు అవరోధమవుతున్నాయని.

    రాజమోహన్ గాంధీ వాక్యం ఇలా ఉంది:

    “Whereas Gandhi saw ‘the awakening among the masses’ as ‘a tremendous gain’, Hedgewar lamented that following non-cooperation the ‘Brahmin/ non-Brahmin conflict was nakedly on view’. As a counter-strategy, the RSS would strive to unite all Hindu castes against the presumed threat from Muslims.”

    మీ జవాబులో ఎంఫసిస్ ముస్లిం వ్యతిరేకత నుంచి (సామాజిక సంబంధాల) యథాతథ స్థితికి జరిగినట్లనిపించింది. అందుచేత కొంచెం నిర్దిష్టత తగ్గినట్లనిపించింది,

    • కల్లూరి భాస్కరం says:

      శ్రీనివాస్ గారూ…
      ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్ -3 రాయడంలో ఉండడంవల్ల వెంటనే స్పందించలేకపోయాను.
      కేవలం నేను కోట్ చేసిన ఆ ఒక్క వాక్యం నుంచే, “మిలిటెంట్ స్వభావంతో హిందూ సమీకరణకు ప్రయత్నించినవారు స్టేటస్ కోను కోరుకున్నా”రన్న ఇన్ఫరెన్స్ లాగడం నా ఉద్దేశం కాదు. “బ్రాహ్మణ, బ్రాహ్మణేతర ఘర్షణపై” హెగ్డేవార్ విచారం వ్యక్తం చేశారన్న వాక్యాన్ని ఒకానొక అంశంగా మచ్చుకు మాత్రమే రాజ్ మోహన్ గాంధీ నుంచి కోట్ చేశాను.
      రాజ్ మోహన్ గాంధీ పుస్తకం ప్రకారమే చెప్పుకుంటే, గాంధీ భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టేటప్పటికి ఇక్కడ జనసామాన్యం నిద్రాణంగా ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటానికే కాదు, సామాజిక రంగంలో మరేం చేయాలన్నా మొదట వీళ్లలో చైతన్యం కలిగించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. ఆయన దృష్టిలో జనంలో చైతన్యం కలిగించడమే అప్పటికి గొప్ప ప్రయోజనం. ఖిలాఫత్ ఉద్యమం అనంతర పర్యవసానాల దృష్ట్యా ఆ ఉద్యమం తప్పుడు నిర్ణయం అన్న విమర్శలు ఆయనపై వచ్చాయి. అప్పుడు కూడా జనంలో జాగృతి కలగడమే గొప్ప విలువ అన్న అభిప్రాయాన్ని గాంధీ వ్యక్తం చేశారు.
      కానీ హెడ్గేవార్ బ్రాహ్మణ/బ్రాహ్మణేతర ఘర్షణపై విచారం వ్యక్తం చేయడం గాంధీకి, ఆయనకు జన జాగృతి విషయంలో ఉన్న దృక్పథ భేదాన్ని సూచిస్తుంది.
      గాంధీలో ఎన్ని లోపాలున్నా, అప్పటి నాయకులందరిలో ఆయన ప్రణాళిక విస్తృతమైనది. ఆయన నిర్మించిన మాస్ బేస్ విశాలమైనది. ఆయన అంతకుముందు లేని ఉమ్మడి ప్రాతిపదికమీద అన్ని మతాలను, కులాలను, తెగలను సమీకరించడానికి ప్రయత్నించారు. వ్యూహరచనలో, వ్యూహ వైశాల్యంలో, ప్రణాళికా విస్తృతిలో ఆయన ఎత్తుకు ఎదిగినవారు ఆనాడు ఎవరూ లేరు. ఇది మేటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా అంటున్న మాట.
      గాంధీ విశాల వ్యూహానికి, విస్తృత ప్రణాళికకు హెడ్గేవార్ ది ఒక సెక్టేరియన్ ప్రతిస్పందన మాత్రమే. ముస్లిం లకు వ్యతిరేకంగా హిందువులను సమీకరించడమే ఆయన లక్ష్యం. కనుక బ్రాహ్మణ/బ్రాహ్మణేతరుల మధ్య ఘర్షణ ఎందుకు వస్తోంది, దానిని ఎలా నివారించాలి, దానికి బ్రాహ్మణేతరులను కూడా ఒప్పించగల బ్లూ ప్రింటు మన దగ్గర ఏమైనా ఉందా అన్నది ఆయనకు అవసరం లేదు. మతం అనే భావోద్వేగ అంశంపై వారిని సమీకరించడం ఒక్కటే ఆయన ముందున్న మార్గం. అది తేలికైన మార్గం కూడా. అందరినీ కలుపుకుని వెళ్ళే గాంధీ విశాల ప్రణాళిక కారణంగా బ్రాహ్మణేతరులలో కలుగుతున్న జాగృతి, వారిని హిందూ ప్రాతిపదిక మీద సమీకరించాలన్న తన లక్ష్యానికి అడ్డంకి. అందుకే ఆయనకు బ్రాహ్మణ/బ్రాహ్మణేతర ఘర్షణ విచారం కలిగించింది. గాంధీ స్టేటస్ కోను చెదరకొడుతున్నాడు. ఆ పరిస్థితిలో హెడ్గేవార్ కు కావలసింది స్టేటస్ కొ ను కాపాడడం.
      క్రమంగా గాంధేయ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఆర్ ఎస్ ఎస్ కు గోల్వాల్కర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ తదితరులు ఒక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక పరమైన సైద్ధాంతిక ప్రాతిపదికను అభివృద్ధి చేసి ఉండవచ్చు. కానీ గాంధీది భారతీయమార్గం. ఆర్ ఎస్ ఎస్ ది హిందూమార్గం. ఎదురుగా, పక్కన ముస్లిం ఉన్నంతకాలం తాము హిందువులమన్నది ఎసర్ట్ చేసుకోవడం తప్ప మరెలాంటి అస్తిత్వ ప్రకటనలకు, అంతర్గత ఘర్షణలకు అందులో అవకాశం లేదు. ఇందుకు తోడ్పడేది స్టేటస్ కొ మాత్రమే. అయితే, రాజ్యాంగం కల్పించిన నిర్బంధాల రీత్యా, ఆధునికత కల్పించిన అనివార్యతల రీత్యా పైపైన కొన్ని సర్దుబాట్లు తప్పవు. కోర్ మాత్రం స్టేటస్ కొయే.

మీ మాటలు

*