బ్లాక్ ఇంక్

Art:  Satya Sufi

Art: Satya Sufi

 

 

కిటికీ అవతల నాలుక చాపిన తోడేలులా నల్లటి నిశ్శబ్దం.

అంచులు మాసిన కాగితాలు. తీగల్లా మెలితిరుగుతూ పాకిన పదాలు. బ్లాక్ ఇంక్‌లో. తుఫాను మిగిల్చిన లోపలి చెల్లాచెదురుతనాన్ని పగలబడి వెక్కిరిస్తూ ఆకుమళ్లలాగా పొందికగా. ఆ పదాలకి అర్థాన్నీ, అర్థాలకి శాశ్వతత్వాన్నీ వెదికే త్రాణ పోగొట్టుకుని చాలా యేళ్లైంది. ఇప్పుడు అప్రయత్నంగా, ఆ ఆత్మలేని సిరా మరకల్లోంచి వికృతంగా రూపం పొందుతున్న మాటలు- “మై డియర్ చిప్‌మంక్!”, “డియర్ లిటిల్ ఆలిస్!”, “హలో మై స్వీట్ పంప్‌కిన్!” అన్నిటికిందా అతని సంతకం, వంకీ తిరిగిన “వై” అక్షరం తో.  విషపు సాలీళ్లలా కనిపించి విసిరికొట్టాను.

తల తిప్పి చూశాను. టేబుల్ మీద కాన్‌ఫరెన్స్‌కి వెళ్ళే ముందు నేను రాసుకున్న పేజీలు . అద్దం మీద అంటించిన స్టిక్‌నోట్స్. పర్స్ తెరిచాను. మూడు పెన్నులు. అన్నీ… అన్నీ బ్లాక్ ఇంక్. బలమంతా వాడి విరిచేశాను. అలసటతోనో, అసహ్యంతోనో శరీరమంతా మొద్దుబారినట్టైంది. వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాను. రెప్పల వెనకాల బ్లాక్ ఇంక్. భయమేసి కళ్లు తెరిచాను. శుభ్రం చేసే కన్నీళ్లు వచ్చే ఆశలేదు. గాయం మానిపోయిందనుకుని ఎప్పుడో ఇసుకలోకి ఇంకిపోయింది ఆ ఏటిపాయ.

పెన్‌తో రాయటం ఓ గొప్ప ఉత్సవంగా ఉండే రోజుల్లో వచ్చాడతను మా స్కూల్‌కి ఇంగ్లిష్ టీచర్‌గా. Pied Piper of Hamlin. పాతికేళ్లలోపే వయసు. భాషని తళుకు ముక్కలుగా తురిమి గాల్లోకి ఎగరేసి గారడీ చేసేవాడు. అప్పటిదాకా ర్యాపర్ తీయకుండా చాక్లెట్ తింటున్న మాకు భాష రుచి చూపించాడు. ఊరికే మహాకవుల్ని కోట్ చేసే తెంపరితనం. పదాల్ని వేలికొనలమీద ఆడించే అల్లరి. అసైన్‌మెంట్లకి నవ్వించే కామెంట్స్ రాసేవాడు. బ్లాక్ ఇంక్‌లో. వెనుకే నడవటానికి ఓ హీరో కావల్సివచ్చే ఆ వయసులో అందరం ఆ రంగు ఇంకే వాడేవాళ్లం.

అప్పటికే నేను మంచి స్టూడెంట్‌ని.  ఓసారి “Dance of Seasons” గురించి రాసిన నా అసైన్‌మెంట్ పై అతని కామెంట్. “Excellent! Meet me at the staffroom.”. మొదటిసారి నన్ను ప్రత్యేకంగా గుర్తించటం. గట్టిగా కొట్టుకుంటున్న గుండెతో వెళ్లాను. “I think you have a wonderful flair for writing Dhanya! I would love to see more from you.”. ఊహించనంత పెద్ద ప్రశంస. ఓ కొత్త స్నేహం మొదలు. క్లాస్‌లో స్పెషల్ ట్రీట్‌మెంట్. అందరికంటే ఎక్కువ మోటివేషన్ ఇచ్చేవాడు నాకు. ఏదైనా మాట్లాడే చనువు ఏర్పడింది. ఆత్మవిశ్వాసం పదిరెట్లయ్యింది. ఒక్కోసారి అతని పైనే జోక్ చేసేంత. అద్దం ముందు అతన్ని అనుకరిస్తూ ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇవ్వటం సాధనచేసేదాన్ని. భయంలేకుండా స్టేజీ పై మాట్లాడేదాన్ని. ఆ సంవత్సరం నా పేరు స్కూల్ మొత్తం తెలిసింది. ఇయర్‌బుక్‌లో నేను రాసిన కథ ఎంపికైంది.

రోజూ అతని దగ్గరికెళ్లి మాట్లాడటం ఓ దినచర్య. ఓ అబ్సెషన్. ఓ వెర్రి ఇష్టం.

సెలవుల్లో ఉత్తరాలు రాసేదాన్ని. చదివిన పుస్తకాల గురించీ, చూసిన సినిమాల గురించీ. రెండు రోజుల్లో జవాబు వచ్చేది. ఒక్క పేజీ ఉత్తరం. ప్రతీసారీ ఓ కొత్త సంబోధనతో.

ఇవాళ యే జ్ఞాపకం తాకబోయినా చేతులంతా నల్ల సిరా. పొగలాంటి వాసనతో. రక్తమంత చిక్కగా.

ఆ తర్వాతి సంవత్సరం రెండవ టర్మ్ పూర్తవుతూ ఉండగా ఒక ఉదయం- బస్ దిగగానే అవగతమైన శూన్యం. ఎర్రబడి వాచిన కళ్లతో హాస్టల్ స్నేహితులు చెప్పారు. అతను ఆ ముందు రోజు రాత్రి హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని. కారణమేంటో ఎవ్వరికీ తెలియలేదు. మరో చోట మంచి ఉద్యోగం వచ్చిందన్నారు. ఎవరో సీనియర్ టీచర్లతో గొడవైందన్నారు. కవితలూ, పాటలూ రాసి భక్తి చాటుకున్నారు కొందరు. ఆ సీనియర్ టీచర్లని మనసారా ద్వేషించి తృప్తి పొందారు మరికొందరు.

ఊరికే అలవాటుపడగలిగే అదృష్టవంతులు వాళ్లంతా. మార్పుకైతే అలవాటుపడొచ్చు. భూకంపానికో?

ఏడుస్తూ రాసిన పదిపేజీల ఉత్తరానికి మూడు లైన్ల జవాబు. “డియర్ ధన్యా! నిన్ను ఎప్పటికీ మర్చిపోను. ఇన్నాళ్ల స్నేహం నాకు మంచి గుర్తు. బాగా చదువుకో.” తరువాతి  ఉత్తరాలకీ, గ్రీటింగ్ కార్డ్‌లకీ, బహుమతులకీ

జవాబు రాదని కష్టం మీద అర్థం చేసుకున్నాను. పాఠాల మీద శ్రద్ధ పోయింది. దిగులు. తవ్వేకొద్దీ.

కొన్ని నెలలకి సీనియర్ల దగ్గర అతని ల్యాండ్‌ఫోన్ నంబర్ దొరికింది. ధైర్యం చేసి ప్రయత్నించాను. ఎవరో ఆడమనిషి ఎత్తింది. ఫలానా స్కూల్ నుంచీ అనగానే మండిపడింది. బాగా తిట్టాక “అసలు మీకూ వాడికీ యేముంటాయి మాటలు? మీ పనికిమాలిన మాటల వల్లే వాడు ఇవాళ ఉద్యోగం ఊడి రోడ్డుమీద పడ్డాడు! ఇంకొక్కసారి ఎవరైనా ఫోన్ చేసినా ఉత్తరాలు రాసినా మర్యాదగా ఉండదు.” ఆక్రోశంగా అరిచి ఫోన్ పెట్టేసింది.

Kadha-Saranga-2-300x268

గాజు పాత్ర భళ్ళున పగిలినట్టుంది. రూపం ఛిద్రమైనా నాజూకు కోల్పోని గాజు తునకల్ని ఏరుకున్నాను. వేళ్ళు తెగకుండా వాటిని పట్టుకోవడమెలాగో కాలం నేర్పింది నెమ్మది మీద. తరువాతి మానవసంబంధాలన్నీ దాదాపు ముళ్లకంచెకి ఇవతలినుంచే. ఎవరైనా దాటి వస్తుంటే దడగా ఉండేది. కారణం లేకుండా నన్ను వదిలేస్తే మళ్లీ పగిలే శక్తిలేక.

ఆవిడెవరో అన్నమాటలు మాత్రం డేగల్లా తిరిగేవి తలపై ఒక్కోసారి. దుర్బలంగా, నిస్సహాయంగా అనిపించేది. జవాబు తోచేది కాదు. నా తప్పేంటో తెలిసేది కాదు. అసలు తప్పెవరిదో ఇవాళ మధ్యాహ్నం తులసిని చూసి మాట్లాడేదాకా నా ఊహకి కూడా అందలేదు.

తులసి. మా స్కూల్లో చాలామందిలాగా హాస్టల్లో ఉండి చదువుకున్న పల్లెటూరి పిల్ల. నల్లగా, పల్చగా పొడవుగా ఉండేది. ఏ కొంచెమైనా నాగరికత లేని భాష. ఎర్ర రాయి ముక్కుపుడకా, చెవులకి చుట్టు రింగులూ. పొద్దుటి కాన్‌ఫరెన్స్‌లో హుందాగా బ్లేజర్ వేసుకుని, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది తనేనన్న సంగతికి నేను అలవాటు పడేందుకు చాలాసేపు పట్టింది.

మా క్లాస్‌లో తులసి కేవలం ఒక రోల్‌నంబర్. ఆఖరి బెంచీలో కూర్చుని నిద్రపోయే డల్ క్యాండిడేట్. ముక్కీ మూలిగీ పరీక్షలు పాసయ్యే తెలివితక్కువది. ఎనిమిదోక్లాసులో తను స్కూల్ మారినప్పుడు తులసి నంబర్ కానీ, అడ్రస్ కానీ తీసుకోవాలని ఎవ్వరికీ తోచలేదు. ఇన్నేళ్లుగా ఎక్కడుందో కూడా తెలీదు.

స్టేజ్ మీంచే గుర్తు పట్టిందేమో. ప్రెజెంటేషన్ అవ్వగానే దగ్గరికొచ్చి చెయ్యినొక్కింది. లంచ్‌కి తన హోటల్ రూంకి వెళదామంది. యూ ఎస్‌లో ఉంటోందట. దారంతా ఏవేవో కబుర్లు చెప్తూ, ఎవరెవరినో పలకరిస్తూ, ఫోన్‌లో ఏవో పనులు చక్కబెడుతూ. ఇంగ్లిష్‌లో. స్పానిష్‌లో. గలగలా… కలకలా… కలలో నడిచినట్టు వెళ్తున్నా తనవెనకాలే.

రూంకి చేరాక  భోంచేస్తూ సగంపైన తనే మాట్లాడింది. తన వర్క్ గురించీ, అక్కడి ఇంటి గురించీ, బాయ్ ఫ్రెండ్ గురించీ. కాసేపాగి నా వైపు నిశ్శబ్దాన్ని నింపేందుకు మొహమాటంగానే అన్నాను, మరేం మాట్లాడాలో తెలియక “నువ్వు వెళ్లిపోయాక ఎక్కడున్నావో ఎవ్వరికీ తెలీదన్నారు తులసీ!”

తలుపు మూసినట్టు మౌనం. నవ్వు మధ్యలో తెగింది. “నేనే చెప్పలేదే ఎవ్వరికీ…”

నీడలు తిరుగుతున్న తన కళ్లవంకే చూస్తున్నాను.

“అదే కాదు ధన్యా. ఇంకా చాలా చెప్పలేదు ఎవ్వరికీ.” రక్తం గడ్డకట్టించేంత ద్వేషం తన కంఠంలో. “వింటావా? విని నమ్ముతావా?”

గొంతు పెగుల్చుకుని “చెప్పు” అన్నానో లేదో.

“మన ఇంగ్లీష్ టీచర్. గుర్తున్నాడా? నీకు చాలా ఇష్టం కదా. మర్చిపోయుండవులే. ఒక రోజు రాత్రి స్టడీ అవర్ తర్వాత బాత్రూంకి వెళ్ళి వస్తుంటే ఎదురుపడ్డాడు. Do you know what he made me do? That bloody pervert! “

తర్వాతి మాటలన్నీ స్పృహలో ఉండి విన్నానో లేదో తెలీదు. ఒళ్లు చల్లబడటం నాకే తెలుస్తోంది. తన చేతులు పట్టుకోబోయి ఆగలేక కౌగిలించుకున్నాను. ధైర్యం ఇవ్వటానికా తీసుకోటానికా? తెలీదు నాకే.

“వదిలెయ్యి ధన్యా! I think I am over it now. చాలా కష్టంగా ఉండేది మొదట్లో. రాత్రీ పగలూ ఆలోచిస్తూ కూర్చునేదాన్ని. చదువు మానేస్తానని ఏడ్చేదాన్ని. నాన్న ధైర్యం చెప్పి వేరే స్కూల్లో చేర్చకపోతే ఇవాళ ఇలా ఉండేదాన్ని కాదు. దౌర్భాగ్యమేంటంటే అదొక్కసారే కాదు. నేనొక్కదాన్నే కాదు. చాలామంది పిల్లలు. అమాయకులు. అసహాయులు. తలుచుకుంటే ఎంత రివోల్టింగ్ గా ఉంటుందో. కొట్టేవాడు చాలా. ఇంగ్లిష్ రాదు కదా నీకు… ఎవరికి కంప్లెయిన్ చేస్తావ్? అని నవ్వేవాడు. నా మాట ఎవ్వరూ నమ్మరని నాకు బ్రెయిన్‌వాష్ చేసేవాడు…”

మళ్ళీ మౌనం. ఉరుములు ఆగినట్టు.

“ధైర్యం చేసి ఒకసారి నాలాంటి అమ్మాయిలందరం కలిసి ఒక మేడంతో చెప్పుకున్నాము ఈ మాట. మా పేర్లు బయటికి రాకుండా చూస్తానన్నారు. రెండో రోజే డిస్మిస్ అయ్యాడు నికృష్టుడు. ఎంత సంబరపడ్డానో లోపల. అయిస్ క్రీం తినాలనిపించింది. స్కూల్ పేరు పోతుందని హష్ అప్ చేసిపారేశారు. జైల్‌కి పంపి ఉంటే ఇంకా బావుండేది. Son of a b***h!”

నాకు మాట రావట్లేదు. నెమ్మదిగా పెదాలు కదిలించాను.

“నువ్వేం అడుగుతావో నాకు తెలుసు ధన్యా! మరి నీతో, మిగతా అమ్మాయిలతో ఎప్పుడూ అలా లేడు అనేగా. తెలివెక్కువ వాడికి. క్రిమినల్. మీరైతే నోరున్నవాళ్లు. పైగా పేరెంట్స్ ఊర్లోనే ఉంటారు. అందుకని భయం. అయినా  మీకు చెప్పినా నమ్మేవారు కారేమోనే అప్పుడు.”

మతిపోతోంది నాకు. గొంతు పొడిబారిపొయింది.

“నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు అప్పట్లో. కానీ నువ్వంటే అడ్మిరేషన్. నీలాగా ధైర్యంగా ఉండాలనిపించేది. బాగా చదవాలనిపించేది. స్టేజ్ పై మాట్లాడాలనిపించేది. ఇంగ్లిష్ రాదన్నాడుగా నాకు. ఇప్పుడు స్పానిష్, ఫ్రెంచ్ కూడా మాట్లాడతాను. ఆగుతాడా నా ముందు?”

అతను  వెళ్లిపోయిన యేడాది స్కూల్ గార్డెన్ పార్టీ గుర్తొచ్చింది. అందరూ ఆడుకుంటుంటే తులసి మాత్రం ఎక్కడో మూలగా. గడ్డి పీక్కుంటూ. శూన్యంలోకి చూస్తూ. బహుశా ఆ ముందురోజే అతను… అందరం తెగ ఏడిపించాం. ఆడుకోవెందుకే అని. ఏవేవో పేర్లు పెట్టి తమాషా చేశాం. ఎంత పొగరు అప్పుడు! ఆ రోజు ఒక్కసారి మళ్లీ వస్తే ఎంత బావుండు! తులసిని ఓదార్చగలిగుంటే. కనీసం తను చెప్పేది వినగలిగుంటే… అయ్యో!

“ఫేస్‌బుక్ లో ఉన్నావా నువ్వు?” తనే టాపిక్ మార్చింది.

“ఊఁ”

“అరే వదిలెయ్యవే. అలా అయిపోతావేంటి! ఎప్పటి విషయాలో ఇవన్నీ. ఈసారి యూ ఎస్ వస్తే తప్పకుండా కాంటాక్ట్ చెయ్యి నన్ను. సరదాగా ఉందాం ఒక వారం. చక్కగా వండి పెడతా నీకు. సరేనా?”

నవ్వుతూ బై చెప్పింది. ఫ్లైట్ ఎలా ఎక్కి ఇల్లు చేరానో తెలీదు.

తెల్లారి మూడున్నరౌతోంది. కొన్ని పక్షులు అప్పుడే నిద్రలేచాయి. పిచ్చివాళ్ల అభ్యర్ధనల్లా ఉన్నాయి వాటి అరుపులు. మిగిలినవి కాసేపటికి వాటిని ఊరుకోబెట్టాయి. మళ్లీ నెమ్మదిగా ముద్దకట్టింది నిశ్శబ్దం. తేలికపాటి నిద్ర ఆవరించింది. కలలంతా నల్ల సిరా. వీధుల్లో పారుతూ, కుళాయిల్లోంచి కారుతూ. బాగా తెలిసిన ఒక మొహమంతా అలుముకున్న నల్ల సిరా.

కొరియర్ బాయ్ బెల్‌తో నిద్ర చెదిరింది. నా పేరు లోని “వై” వంకీ తిప్పకుండా సంతకం చేసి వచ్చాను.

ఫేస్‌బుక్ లో తులసి రిక్వెస్ట్. విచ్చుకుని నవ్వుతున్న ఓ సెల్ఫీ తన ప్రొఫైల్ పిక్.

మరుగుతున్న టీ కింద స్టవ్ నీలి మంటల్లో కాలుతున్నాయి. బ్లాక్ ఇంక్ అక్షరాలు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    పరిగెడుతున్న వాక్యాల మీ “బ్లాక్ ఇంక్” కధ చాలా బాగుంది. అభినందనలు.

    త్రిపుర గారి “పాము” కధని ( పాము స్వభావం కల విషపు నవ్వు శేషాచలపతి ని ) చదివారా సాంత్వన గారు? త్రిపుర కథలంటే మీకు ఇష్టం కలుగుతుందని నా నమ్మకం.

  2. Sasikala Volety says:

    ధైర్యం ఇవ్వడానికా , తీసుకోడానికా……,పక్షుల అరుపులు పిచ్చివాళ్ళ అభ్యర్ధనల్లా ఉండడం……ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇంత భావావేశం. నీదయిన శైలి. లేత వయసు ఆకర్షణలు, అవి పన్నే వలలు,పొగచూరిన నల్లింకు అక్షరాలు……వెరసి ఒక గుణపాఠం, ఒక విజయం, ఒక కనువిప్పు.అద్భుతం కన్నా పెద్ద మాటలుంటే బావుణ్ణన్న క్షణాలు చదవగానే.

  3. Idi katha leka nizama plz clarify

  4. కథ చదివాక వేల విస్పోటనాలు లోలోపల …..

  5. Blackink..kadhabhagundhi..be good writer..

  6. Bhavani Phani says:

    కథ బావుంది సాంత్వన గారూ , నేరేషన్ కూడా. అభినందనలు. ఇలానే మరెన్నో రాయాలి మీరు.

  7. Vvlakshmidevi@gmail.com i says:

    సాంత్వనా
    కథ చాలా బాగా రాశావమ్మా. కథ2016 పుస్తకానికిఎంచవలసిన కథ.
    ముఖ్యంగా కొత్త పోలికలు. Great

  8. Venkat Suresh says:

    సాంత్వన గారు, మీరు ఎప్పుడూ సరదా రాతలతో నవ్వించటం, మంచి భావుకతతో కూడిన వ్యాసాలూ, చిన్ని కవితలు భలే రాసేవారు. ఇలాంటి సీరియస్ సబ్జెక్టు ఎంచుకోవటం పెద్ద సాహసం, ఎంచుకొని అందరినీ మెప్పించటం ఇంకా గొప్ప విషయం. నాకు చాలా బాగా నచ్చింది ఈ కథ. ముఖ్యంగా శైలి, కధనం అద్భుతం.

  9. సాంత్వనా !!
    ఇంత చిన్న వయసులో ఎన్ని కొత్త భాషా సొబగులు ఎలా పట్టు బట్టించుకున్నావు ? ఎంత ,ఎన్ని నల్ల అక్షరాలు వెంట నీ కళ్ళు పరుగులు పెట్టి ఉంటాయి !! నల్ల ఇంకు లో ఇంత నీచమైన నల్ల రక్తం ఉందని పసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ? తులసి కనిపించిన ఆ రోజు ఎంత సుదినం ..చదువుతూ ఉంటేనే కాళ్ళూ చేతులూ చల్ల బడిపోయాయి .నెరేషన్‌ లో చమక్కులు కురిపించి నల్ల ఇంకులో నీదైన రంగులు చూపించావు ..ఇంకా ఎన్నో మంచి ముత్యాల లాంటి కథలు అందించి ఓ చక్కని కథా హారం తయారు చేస్తావు అని నా నమ్మకం …
    వసంత లక్ష్మి .

  10. కధా వస్తువు( ఇలా అనొచ్చో లేదో…..) లోని సీరియస్ నెస్సో, కధనంలోనిభాషగాంభీర్యమో కకాసేపటిదాకా అచేతనం గా అనిపించింది. ఎందుకిలాగ? ఇటువంటి నేరాలకి యేళ్ళతరబడి సాగతీసి విచారణ చెయ్యకుండా కఠినమైన శిక్షలుండాలి.

  11. Jalandhara says:

    మైధిలి కూతుర్ని అనిపించావు అనలేం.అమ్మ భావుకత తో పాటు నిజాన్ని చూసే ,ఒప్పుకునే, చెప్పె దయ, ధైర్యము వున్నాయి నీకు.అమ్మ చాల రోజులు reader gaa migili poyindi.మీతో షేర్ చేసుకుని మీకు ఆలోచించడం నేర్పింది….మీ ఎదుగుదల చూసి మురిసిపోయింది.చాలా రోజుల తరవాత ఆ కోయిల పలుకు విన్నాం.అబ్బుర పడ్డాం.కాని నువ్వొ?.అలోచించి చెప్ప డా నికి అద్భుతమైన భాష ఉపయోగిస్తూ …good.keep it up bangaru talli.

  12. అద్భుతమైన శైలి ,అక్షరాలకూర్పులో కవితా ధోరణి ,సూటిగా విషయాన్ని చెప్పగల నేర్పు …భవిషత్తు లో తల్లిని మించిన రచయిత్రివి కాగలవు గాడ్ బ్లెస్స్ యు స్వాంతనా!

  13. విలక్షణమైన శైలి, కథనం…మంచి కథ చదివించారు. అభినందనలు!!

  14. కథ చాలా బావుంది – ఆపకుండా చదివించింది – శుభాభినందనలు!

  15. kolluru siva says:

    శైలి బాగుంది ఎక్కువగాను తక్కువ గాను కాకుండా వ్రాసారు

  16. నిడదవోలు మాలతి says:

    కథ ఇప్పుడే చదివేను చాలామంది వ్యాఖ్యానించినట్టే ప్రతిభావంతంగా చిత్రించారు. ఈమధ్య ఇటీవల వస్తున్న కథలన్నీ ఇలాటి అంశం తీసుకున్నప్పుడు వెగటు పుట్టించేలా రాస్తున్నారు.
    లోకంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. వాస్తకవికత పేరుతో ఆ ఘోరాన్ని మాత్రమే వర్ణించడంలో ప్రతిభ లేదు ఆ సంఘటనకి తట్టుకుని ఎలా పరిష్కారం వెతుక్కుని తమ జీవితాన్ని సరి దిద్దుకున్నారు, లేచి నిటారుగా నిలభడ్డారు అని చిత్రించడంలోనే ఉంది సామాజిక ప్రయోజనం. అది చిత్రించడంలో మీరు మంచి నైపుణ్యం చూపేరు.
    శైలిలో వారెవరో అన్నట్టు మీ అమ్మ, బహుశా వంశలక్షణమేమో, బాగానే పట్టు బడింది. పదనిర్మాణం, శైలి కూడా సాధించేరు. భవిష్యత్తులో ఇంకా మంచి కథలు రాస్తారని ఆశిస్తున్నాను.
    సాధారణంగా తెలుగు కథలకి ఇంగ్లీషు శీర్షికలు నేను హర్షించను కానీ ఈ కథకి మాత్రం చాలా బాగా కుదిరింది బ్లాక్ ఇంక్ అన్న పదం.

  17. Rajyalakshmi says:

    కథ బావుంది.

  18. Ravikanth Reddy says:

    ఎంత బాగా రాశారండీ. “మార్పుకైతే అలవాటు పడచ్చు. భూకంపానికో?” ఈ ప్రయోగం ఇప్పటిదాకా చూడలేదు. అసలు ప్రతీ వాక్యం ఫ్రెష్ గా ఉంది. పరిణతి కొట్టొచ్చినట్టు కనపడుతుంది నెరేషన్ లోని ప్రతి అంగుళంలో.

    As someone told in the above comments, portraying the bouncing back in life from these traumatic incidents must be the purpose of literature or fiction. And you dealt with it so nicely. Wonderful.

  19. Thanks a lot andi!! Glad you liked it!

  20. అవినేని భాస్కర్ says:

    ఈ కథ గూర్చి ఫేస్‌బుక్ లో అభిప్రాయం చెప్పిన ఒకరు “ఇది ఒక రచయిత తొలి కథంటే నమ్మలేకున్నాను” అని అన్నారు. కారణమేంటంటే తొలికథలోనే ఇంత చక్కగా కథ చెప్పే నైపుణ్యం ఆశ్చర్యం కలిగించి ఉంటుంది!

    సాధించిన, ప్రసిద్ధికెక్కిన ఏ రచయితనైనా తీసుకొండి, వారి తొలి రచనని ఓ మారు చదవండి. వాళ్ళనెందుకు సమాజం నెత్తినపెట్టుకుందో అర్థం అవుతుంది. ఆసక్తికరమైన కొత్తదనం ఏదో ఉండే ఉంటుంది. ఈ కథలో కూడా అది ఉంది. Hats off to the writer!

    కొన్ని వాక్యాల్లో కవితలు ఇమిడిపోయున్నాయి!

    “శుభ్రం చేసే కన్నీళ్లు వచ్చే ఆశలేదు. గాయం మానిపోయిందనుకుని ఎప్పుడో ఇసుకలోకి ఇంకిపోయింది ఆ ఏటిపాయ”

    “భాషని తళుకు ముక్కలుగా తురిమి గాల్లోకి ఎగరేసి గారడీ చేసేవాడు”

    “వెనుకే నడవటానికి ఓ హీరో కావల్సివచ్చే ఆ వయసులో అందరం ఆ రంగు ఇంకే వాడేవాళ్లం”

    “మార్పుకైతే అలవాటుపడొచ్చు. భూకంపానికో?” – ఎంత గాఢత ఉందో ఈ వాక్యంలో!

    కథ చివర్లోకొచ్చేసరికి గుండెల్ని పిండేసేంత దుఃఖం!

  21. కె.కె. రామయ్య says:

    ఫాంటసీ ఫిక్షన్ రచయితగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న టెర్రీ ప్రాచెట్ స్వర్గస్తులైన సందర్భంగా ( March 19, 2015 ) సాంత్వన గారు pustakam.net లో రాసిన ఈ వాక్యాలు చదవండి అన్నయ్యకీర్తనల అభిమాని ఆవినేని భాస్కర్ గారు, మీకే అర్ధం అవుతుంది సాంత్వన గారి రచనా సామర్ధ్యం :

    “తళతళా మెరిసే పదునైన వాక్యాలు ఆయనవి. రెండు ఫుల్ స్టాపుల మధ్య దట్టం గా కూరుస్తారు రంగు రుచి వాసన అన్నీ కలిగిన పదాలని. మచ్చుకైనా చప్పదనం అనేది కనపడదు. ప్రతి వాక్యానికి ఒక ప్రయోజనం, లక్ష్యం ఉంటాయి. నవ్వు తెప్పించటం, కొంత కోపం రప్పించటం, కాస్త అల్లరి గా గిల్లి వదిలి పెట్టడం, మొత్తానికి ఆలోచింపచెయ్యటం … ”

    ( సాంత్వన గారు త్రిపుర కధలు ఎప్పుడు చదువుతారా అనే నేను ఎదురు చూస్తున్నా )

    • ఎప్పటిదో వ్యాసం మీరు ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో తెలియట్లేదు సార్. త్రిపుర కథలు ఈ వారమే చదవటం మొదలుపెడతాను.

    • అవినేని భాస్కర్ says:

      చదివాను రామయ్య గారూ. గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

    • కినిగె లొ ఈబూక్ కొన్నాను సార్. చదవటం మొదలు పెట్టాను. “పాము” కథ చాలా నచ్చింది.

  22. ఇలాంటి కథలు సాదారణంగా ద్వేషంతో మొదలయ్యి, ద్వేషాన్ని మరింత పెంచి ముగుస్తాయి. కానీ మీరు అనవసరమైన రాద్దాంతాన్ని పక్కనపెట్టి, అవసరమైన నాలుగు ముక్కలూ చెప్పి ముగించారు.

    భాషని తళుకు ముక్కలుగా తురిమి గాల్లోకి ఎగరేసి గారడీ చేసేవాడు. అప్పటిదాకా ర్యాపర్ తీయకుండా చాక్లెట్ తింటున్న మాకు భాష రుచి చూపించాడు.

    వెనుకే నడవటానికి ఓ హీరో కావల్సివచ్చే ఆ వయసులో

    ఊరికే అలవాటుపడగలిగే అదృష్టవంతులు వాళ్లంతా. మార్పుకైతే అలవాటుపడొచ్చు. భూకంపానికో?

    రూపం ఛిద్రమైనా నాజూకు కోల్పోని గాజు తునకల్ని ఏరుకున్నాను. వేళ్ళు తెగకుండా వాటిని పట్టుకోవడమెలాగో కాలం నేర్పింది

    ఇలాంటి వాక్యాలు అలోచింపజేస్తూ, కథను లైవ్లీగా నడిపాయి.

    ఎంజాయిడ్ రీడింగ్ ఇట్. ఇలాంటి కథ ఎంజాయ్ చేయటమేంటని అడక్కండి :)

  23. Thanks a lot andi! :)

  24. కె.కె. రామయ్య says:

    సాంత్వన గారు, మీరు మరోలా అనుకోక పొతే,

    హైదరాబాదు లోని నవోదయా బుక్ హౌస్, కాచీగూడా వారికి చెప్పి కానీ
    ( http://www.telugubooks.in/products/thripura-kathalu )

    కినిగె e-బుక్స్ వారికి కానీ చెప్పి
    ( http://kinige.com/book/tripura+kathalu+print+బుక్
    http://kinige.com/book/Tripura+O+Gnaapakam )

    త్రిపుర కధలు పుస్తకం, త్రిపుర నివాళి పుస్తకం మీకు పంపించమని చెబుదామని ఉన్నది.
    కానీ మీరు విదేశాల్లో ఉంటె ప్రింటు పుస్తకాలు పంపించటం అంత సులువైన పని కాదని ఓ సందేహం.

    మీలాంటి యువ ప్రతిభావంతులకు త్రిపురని పరిచయం చెయ్యాలని, త్రిపుర గారి ఆప్త మిత్రులు, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారి కోరిక కూడా ( వారికి మీ తల్లితండ్రుల చిరు పరిచయం ఉన్నదనుకుంటా )

    • అవినేని భాస్కర్ says:

      మీరు ఇంతలా వెంటపడి త్రిపుర ప్రచారం చెయ్యడం పైనుండి ఆ త్రిపురగారు చూస్తూనే ఉంటారు. ఆయన మిమ్ముల్ని విసుక్కుంటారేమో జాగ్రత్తండి :-)

  25. ఏం చెప్పారు! అద్భుతం!

  26. చాలా బాగుంది. అక్షరాల వెనుక నిదానంగా పరిగెత్తించారు. ఒక్కో వ్యాక్యం అంత అద్భుతంగానో వుంది. కీప్ wriitng

Leave a Reply to Santwana Cancel reply

*