ఏమైనా మారిందా?

 krishnudu

ఒక రాత్రి పుచ్చిపోయిన వేళ, ఒక దినం చచ్చిపోయిన రోజు, సూర్యుడు చిరాకు కలిగించిన వేళ, వెన్నెల కిటికీలోంచి రక్తం క్రక్కుకుంటున్న పూట నీపై నీకు అసహ్యం కలిగినప్పుడు నీ వ్రేళ్లు అప్రయత్నంగా వెలిగ్రక్కే ద్వేషమా కవిత్వం?

ఉదయం పూట పేపర్‌ను చూసి ఉండచుట్టి విసిరివేయాలనుకుంటున్నప్పుడు, పదే పదే వినపడే వాడి ఉపన్యాసం శూలంగా గుండెలో గ్రుచ్చుకుంటున్నప్పుడు, మనుషుల్లో శవాలనూ, శవాల్లో మనుషులనూ చూడడం అలవాటై, క్రుళ్లిపోయిన వెలుతురును చూడలేక కళ్లు మూసుకున్నప్పుడు బలవంతంగా బయటకు వచ్చిన కన్నీటి చుక్కా కవిత్వం?

నీవు బతికున్నప్పుడు చస్తావు. చచ్చిపోయినప్పుడు జీవిస్తావు. అదేనా కవిత్వం?

నీవు మారతావు. కవిత్వం మారదు.

నేను ఆకులో ఆకును కాను. ఆకుపై రాలిన కన్నీటి బిందువు స్పృశిస్తున్న మృతదేహాల్ని చూసి ఆక్రోశిస్తాను. నేను పూవులో పూవును కాను. బూట్ల క్రింద నలిగిపోయిన పూలను చూసి విలపిస్తాను. నేను కొమ్మలో కొమ్మను కాను. విరిగిపోయిన కొమ్మల వాడిపోయిన నునులేత రెమ్మల శిథిలాలను చూసి బిక్కుబిక్కుమని ఎగిరిపోయిన పక్షుల్ని చూసి విషాదగీతం రాస్తాను. అదేనా కవిత్వం..

మనిషి పాతబడతాడు. కాని నేను పాతపడని కవిత్వాన్ని చూశాను. సమాజం తిరగబడడాన్ని చూడలేదు. కవిత్వం తిరగబడడాన్ని చూశాను.

ఆకాశం బ్రద్దలై విగతజీవిగా మారడం చూశాను. మేఘాలు తుత్తునియలై నేలరాలడం చూశాను. గాలి కకావికలై ప్రాణాలు కోల్పోయి కనురెప్పల మధ్య చేరడం చూశాను. వాన చినుకు ఛిన్నాభిన్నమై రక్తాశ్రువులతో పాటు ఎండిపోవడం చూశాను. నేల బీటలు వారి తనపై నడుస్తున్న చచ్చిన పాదాలను దిగులుగా చూడడం గమనించాను.

కల ఒక మోసమై ప్రతి రోజూ ఒక పసిగొంతును నులుముతోందా?కవిత్వం మాత్రం నిన్ను మోసం చేయదు.

ఎందుకో నాకిప్పుడు దిగంబర కవిత్వం అధునాతనమనిపిస్తోంది. ‘మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. జీవితంలో జంతువుల్లా బతికే అధికారం ఎవరికీ లేదు. జీవితం తాటస్య్థాన్ని వరించకూదు. నిరర్థక జీవన విధానంలో మనిషి జీవించలేడు.. నిన్ను నీవు ఒక్కసారి దిగంబరం చేసుకో. దేన్నీ నమ్మకు..’ అని స్పష్టం చేసిన దిగంబర కవిత్వం తొలి తెలుగు అధునాతన రాజకీయ కవిత్వం. ఒక అధ్యాయం అప్పుడే ప్రారంభమైంది.

మహా స్వప్నా ఎక్కడున్నావు? మానవత రెండు కళ్లూ మూసుకుపోయినప్పడు, విప్పుకుంటున్న మూడో కన్నునై, కాలం వాయులీనం మీద కమానువై, చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానువై వస్తానన్నావు కదా.. కడుపు రగిలి, పుడమి పగిలి పుడతానన్నావుకదా.. దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పావా?

మనిషీ,ఇంకా నువ్వింకా బానిసవే అని చెప్పిన చెరబండరాజూ.. ఏమైంది? బానిసత్వం తొలగిపోయిందా? చెర వీడిపోయిందా? అడుగు అడుగులో సహారా ఎడారి అదృశ్యమైందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం కరిగిపోయిందా? ఆకాశం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నదెందుకు? అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం ఇప్పుడు మరింత నవనవోన్మేషంగా మారిందా? కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలన్నావు కదా?

సూర్యుడికడ్డంగా నించున్న ఆ మబ్బుతునక పేరేమిటి? అని ప్రశ్నించిన నగ్నమునీ, ఆ పేరు తెలిసిందా? అర్థం కాని అనంతశూన్యం అంచుమీదికి ఆకారం లేని కుర్చీనొకటి లాక్కొనిస అర్థవంతమైన బతుకు వెన్నెల చుక్కల్ని కప్పులో ఒంపి ఒక్కొక్క క్షణం పెదవులకు ఆనించి విషాదాన్ని ఇంకా ఆరాధిస్తూ ఉన్నావా? నీ రక్తం నిండా విశ్వరహస్సముద్రాల జంత్రవాద్యాలు ఇంకా ఉన్నాయా? భూగోళం మరణం విని, రోదసిలో తలవంచిన పతాకంలో నీ శవాన్ని దహనం చేశావా? అందాకా నీవు రాసిన గీతాల్ని నీవే భక్షించావా? భూమి ఇప్పుడు ఎట్లున్నది? ఇంకా అమెరికన్ ప్రసిడెంట్ మెదడులా అమానుషంగా ఉన్నదా? డాలర్‌లోని పురుగు ప్రసరిస్తున్న పుర్రెల వెన్నెలతో వెలిగిపోతున్న శ్మశానంలోకి వెళ్లావు కదా.. పురుగును బట్టి నేలరాచావా? కంపుగొడుతున్న జాతి పిరికితనం కాక మరేమైనా కంటుందా?

నా దేశంలో నేను ఏకాకిని అని ప్రకటించిన నిఖిలేశ్వర్, ఇప్పుడు సామూహికమైనావా? మరుభూములపై నిలుచున్న సాయంత్రాల చెట్లను ఇంకా చూస్తూనే ఉన్నావా? బుద్దుడు ఇంకా అనాథుడే కదా? చీకటి చుంబించకుండా శ్మశానం నృత్యం చేస్తుందా?గడ్డకట్టిన సౌందర్యంలో రమిస్తున్న శవభోగులు కనపడడం మానివేశారా? కత్తిమొనపై హఠాత్తుగా మెత్తగా తెగిన వేలులా మృత్యువు భౌతిక సత్యాన్ని ఇంకా మోసుకువెళుతుందా?

జ్వాలా ముఖీ, పునర్ యోనీ ప్రవేశం చేశావా? సత్య సౌందర్యావరణలో శివమై తాదాత్మ్యం చెందావా? దిక్కులేని కుష్టున్యాయం దిక్కుల్ని తడిమి తడిమి గాయపడ్డావా? తూర్పు పేలి పగులుతున్న చప్పుడు దగ్గరలో వినబడుతున్నదన్నావు కదా.. ఇప్పుడు సమీపించిందా? హింస విప్లవానికి మంత్ర సాని అన్నావు కదా.ఎంత మంది మంత్రసానులుమరణించారు?

భైరవయ్యా,. కొండచిలువ మరోసారి ఆవులించడం ఆగిపోయిందా?ఏమైతేనేం, లోకం ఎట్లా ఉంటేనేం, కొత్త నెత్తురుతో గానుగెద్దుని పునరుద్దరించడం ఆగిపోతుందా?కొడిగట్టిన చుట్టనుసిలా, ముసుగేసుకున్న విధవలా వెన్నెల అలుముకోవడం మానిపోతుందా? మనం సాకిన విష నాగుల విషకీలలు మన తలకే కొరివిపెట్టయా?

అవును ఆరుగురు కవుల కవిత్వం ఇంకా  అధునాతనమే. వారి కసి అధునాతనమే. ఏ ఆచ్చాదనకూ తల ఒగ్గని, ఏ భయాలకూ లొంగని నిరంతర సజీవ మానవుడికోసం వారిచ్చిన పిలుపూ అధునాతనమే.

ఏం మారిందని? ప్రజల అవసరాలు పట్టించుకోని రాజకీయాశుద్దంలో పొర్లుతున్న అడ్డగాడిదలు మారారా? ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పీఠాధిపతులు మారారా? ప్రజలచెమట సొమ్ముతో కళ పేరుతో తోలు వ్యాపారం సాగిస్తున్న వారు మారారా? రాజకీయ పురుగులకీ, సినీ మడత కొజ్జాలకీ ఆంధ్రదేశాన్ని తారుస్తున్న ఈ పత్రికాధిపతులు, సంపాదకులు మారారా? కుష్టువ్యవస్థని, దుర్గంధసంస్కృ­తిని తరతరాలకీ అంటించి ఒదులుతున్న విశ్వవిద్యాలయాలు మారాయా?

నిజాలు చెప్పనివ్వకుండా గొంతులు నొక్కేసే పరిస్థితుల్ని ప్రోత్సహించే, విషవలయాన్ని సృష్టిస్తున్న వీళ్లందర్నీ, వీళ్ల కోసం భారత దేశమంతటా విస్తరిస్తున్న కుష్టువ్యవస్థ ను పోషిస్తున్న వాళ్లనీ, వ్యవస్థనీ సర్వనాశనం చేయడానికి దిగంబర కవులు పూనుకున్న నాటి రోజులు మారాయా?

అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ? అన్నాడొక దిగంబర కవి,.

ఈ ప్రశ్న ఇంకా విలువైనది. కవిత్వం ఇంకా ఇంకా. ఇంకా అనాచ్ఛాదితం కావాలి.


మీ మాటలు

  1. D. Subrahmanyam says:

    చాలా బాగా రాశారు. “ఏం మారిందని? ప్రజల అవసరాలు పట్టించుకోని రాజకీయాశుద్దంలో పొర్లుతున్న అడ్డగాడిదలు మారారా? ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పీఠాధిపతులు మారారా? ప్రజలచెమట సొమ్ముతో కళ పేరుతో తోలు వ్యాపారం సాగిస్తున్న వారు మారారా? రాజకీయ పురుగులకీ, సినీ మడత కొజ్జాలకీ ఆంధ్రదేశాన్ని తారుస్తున్న ఈ పత్రికాధిపతులు, సంపాదకులు మారారా? కుష్టువ్యవస్థని, దుర్గంధసంస్కృ­తిని తరతరాలకీ అంటించి ఒదులుతున్న విశ్వవిద్యాలయాలు మారాయా?” నిజమే కృష్ణారావు గారూ. మార్పు కోసం ప్రజలని ఆలోచించేలా చేసే కవిత్వం వస్తోంది . ఇంకా రావాలి కూడా.

  2. Narayanaswamy says:

    అద్భుతం కృష్ణుడూ – కళ్ళ నీళ్ళనీ పిడికిట కోపాన్నీ తెప్పించినవు నెత్తురు మరిగించినవు – కవిత్మాత్మకమైన వచనం విసురు సుడిగాలుల్తో మా ముసుగుల్ని అనాచ్చాదితం చేసినవు – వెచ్చని కరచాలనం – ఆత్మీయ ఆలింగనం నీకు

  3. venkatrao m says:

    చాల బాగుంది సర్

  4. చంపొదిలి పెట్టాడు నాయనా!

  5. Prj pantulu says:

    దిగo బర కవిత్వం కు భాష్యం చెప్పిన మీకు అభినం ద న లు sir.

  6. Dr Nagasuri Venugopal says:

    Well written coupled with force, realty and poetry …

  7. KRISHNARAO says:

    సుబ్రహ్మణ్యం, నారాయణ స్వామి, వెంకటరావు, రాఘవ, పిజెఆర్ పంతులు,నాగసూరి వేణుగోపాల్ గార్లకు ధన్యవాదాలు.

  8. బాగున్నాయ్ మీ మాటలు

Leave a Reply to D. Subrahmanyam Cancel reply

*