ఇగ మనమే పోల్చుకోవాలె

 

painting: Rafi Haque

painting: Rafi Haque

 

చెక్క పెట్టెలకు నంబర్లే

పేర్లుండవు.

 

చెక్కపెట్టెల్లో కుక్కేసిన శరీరభాగాలే

గుర్తుపట్టటానికి ముఖాలుండవు…

ఒకప్పుడు బతికిన మనుషుల

ఆనవాల్లేవీ వుండవు.

 

*****

చాలా దూరం నుంచి వస్తము  బంధువులం  ఆప్తులం

దగ్గరి వాళ్ళం…

కళ్ళు తుడుచు కుంటూ శ్వాస  ఎగబీల్చుకుంటూ

ఇంకా మిగిలిన సత్తువను   కొంగులనో,  దస్తీ  లనో మూట  కట్టుకుని…

 

చాలా దూరం నుంచి వస్తము చివరి చూపైన దొరుకుతుందని,

కనీసం పోల్చుకుంటమని.

****

ఒక్కొక్క చెక్కపెట్టె తెరవండి…

శరీర భాగాలను చూసి మనుషుల్ని పోల్చుకుందాం

కోసేసిన స్థనాలు

చెక్కేసిన ముఖాల ముక్కలు

విరిచేసిన కాళ్ళూ చేతులూ

తూట్లు పొడిచిన తొడలు

వలిచిన ఛాతీ చర్మాన్ని పొడుచుకొస్తున్న పక్కటెముకలు

కడుపులనుండి బయటికొచ్చిన ఊగులాడుతున్న పేగులు

 

చెక్కపెట్టె #20   –

తల లేదీ స్త్రీ శరీరానికి

వెతుకుదాం తల కోసం

రాలిపోయిన కళ్ల కోసం

కళ్ళలో వెలిగిన చివరి కలల కోసం

వెతుకుదాం

చెల్లా చెదురైన భాగాల కోసం

తెగ్గోసిన నినాదాల కోసం

 

కూల్చిన చెట్లకు వెళ్లాడుతున్న పేగులు

యెండిన నల్లటి కొమ్మలనుండి కారుతున్న నెత్తుటి చుక్కలు

పచ్చి పచ్చి గా అడవినిండా అడుగడుగునా కోసిన గాయాలు

పదండి వెతుకుదాం

****

గుర్తుతెలియకుండా మూటకట్టిన మాంసపు ముద్దలు

యెవరెవరివో చంపినోడు ఎందుకు  చెప్తడు

యే శరీరానిదే భాగమో  ఛిద్రం చేసినోడు ఎందుకు  చెప్తడు?

ఇగ మనమే పోల్చుకోవాలె

 

మనమే ఒక్కొక్క భాగాన్నీ అతికించుకోవాలె

ఒక్కొక్క మాంసపు ముద్ద యెవరిదో

మనమే ఆనవాలు పట్టాలి

యే చిరునవ్వు ఎక్కడ రాలిపోయిందో

యే కొమ్మల కే నెత్తురంటిందో

యే చెట్ల  మొదళ్ళలో

యెవరి మాంసఖండాలున్నాయో

మనమే పోల్చుకోవాలి

 

చెల్లాచెదురైన

నెత్తుటి మరకల గుర్తులన్నీ

మనమే పోగు చేసుకోవాలె

 

బలవన్మరణాల జ్ఞాపకాలన్నీ

అతి పదిలంగా

గుండెలకు హత్తుకోవాలె

*

 

 

 

 

 

మీ మాటలు

  1. రక్తాశ్రువులు స్రవించే మీ ఆర్త కవిత చదివాక అనిపించింది :
    పదాలకింత పదునుంటుందని, కత్తులతో కవిత్వాన్ని రాయొచ్చని,
    అర్ద్రత తడిపిన అరుణ వాక్యాలతో రుధిర చిత్రాలను గీయొచ్చని .
    మీ గుండెల్లో ఎన్ని అశ్రుజలపాతాలు దూకకుంటే
    ఇన్నిన్ని విద్యుత్తులు కత్తులు దూస్తవి !
    నమస్సులు నారాయణస్వామి గారూ .

  2. D. Subrahmanyam says:

    మిత్రమా హ్రిదయాన్ని తట్టి లేపే కవిత రాసారు. స్థబ్దు గా ఉన్న మన తోటి సోదరులను ఈ కవిత ఆలోచించేంచేలా చేస్తుంది/చేయాలి .

  3. చాలా మంచి కవిత. రాజ్య హింస కొత్త ఆయుధాలతో దూసుకొస్తున్న ఈ సమయంలో రావాల్సిన కవిత. వచ్చింది.

  4. S.Haragopal says:

    రాజ్యహింస మారలేదన్నా
    మరింత పెరిగిన
    ధార్త్రరాష్ట్రులు మారలేదన్నా
    జనంతోని కలిసిబతికే
    వెలుగురేకల మింగినారన్నా
    గుర్తు మిగిలిన వెలుగుజెండే
    ఆర్తితోని పిలుపు జెండే

  5. T.W. Sudhakar says:

    Very nice poem Kavigaru

  6. Vijay Koganti says:

    రగిలే గుండె ముక్కలు
    రాలుతున్న కన్నీటి చుక్కలు
    మాటలు మూగపోతున్నై మిత్రమా

  7. S N RASOOL says:

    రక్తసిక్త నిర్జీవ దేహాలు
    కన్నీటి సందోహలు
    ఎన్నెనో సందేహాలు
    ట్రిగ్గర్ నొక్కిన చేయికి తెలీని
    హృదయ సంఘర్షణలు
    శిధిల జ్ఞాపకాల ఛిద్ర శిల్పాలు
    రాత్రి ఓడిలో నిద్రించే
    ఆ అడవికెలా తెలుసు
    రేపటి సూర్యుడు తెల్లబోతాడని..

  8. రాఘవ says:

    అవును…పోల్చుకోవాలె.. ఎవరు మనవాళ్ళో మనుషులో పోల్చుకోవాలె. ఇకనన్నా పోల్చుకోవాలె.

  9. narayanaswamy says:

    రామస్వామి గారు, సుబ్రహ్మణ్యం గారు, మహమూద్ గారు, హరగోపాల్ గారు, సుధాకర్ గారు, విజయ్ గారు, రసూల్ గారు, రాఘవ గారు – కవిత నచ్చినందుకు మీ అందరికీ చాలా థాంక్స్

    మన వాళ్ళని పోల్చుకోకుండా రాజ్యం మన మీద మన సున్నితత్వాల మీద తీవ్రమైన హింస ప్రయోగిస్తోంది – దాన్నే మనం ఎదుర్కోవాలి – జీవితం లో అన్ని రంగాల్లో – ఏ ఓ బీ హత్యాకాండా, తర్వాత జరిగిన దారుణాలు బాగా కలచివేసినాయి నన్ను – దానికి ప్రతిఫలమే ఈ కవిత – నా దుఃఖాన్ని ఆగ్రహాన్ని పంచుకున్నందుకు మీకందరికీ నెనర్లు

    • నరసింహారావు says:

      నారాయణ స్వామిగారూ!
      **మన వాళ్ళని పోల్చుకోకుండా రాజ్యం మన మీద మన సున్నితత్వాల మీద తీవ్రమైన హింస ప్రయోగిస్తోంది – దాన్నే మనం ఎదుర్కోవాలి – జీవితం లో అన్ని రంగాల్లొ‘‘

      ఈ మీ వ్యాఖ్యలో మీరు ‘‘రాజ్యం’’ అన్నది మీ దృష్టిలో ఇప్పుడున్న హిందూత్వ రాజ్యమా? లేక ఇప్పటివరకూ వున్న అన్ని ప్రభుత్వాలా?
      “”సున్నితత్త్వాల మీద తీవ్రమైన హింస ప్రయోగిస్తున్నది” అన్నారు, కాస్త వివరించగలరా?
      సున్నితత్త్వాలు మనలో వర్తమానంలోను, గతకాలంలోనూ నిజంగా వున్నాయా? అవి గతంలో వుండి ఇప్పుడు ఈ రాజ్యం కారణంగానే మనం సున్నితత్త్వాన్ని కోల్పోయామా?
      ప్రతిదానికీ రాజ్యం మీద పడిపోవడం వల్ల మన సున్నితత్త్వాలు పరిరక్షించబడతాయా?
      పౌరులకి హక్కులతో బాటు బాధ్యతలు కూడా వుంటాయా? ఉంటే, పౌరులు అని మీ ఉద్దేశంలోని నిజంగా సున్నితత్త్వం కలిగిన మనం అవి నిజంగా పట్టించుకుంటున్నామా? పట్టించుకోకపోవడానికి నిజంగా రాజ్యమే కారణమా?

  10. సుధా కిరణ్ says:

    స్వామీ,
    చాలా మంచి కవిత..

Leave a Reply to S.Haragopal Cancel reply

*