రెండు నాల్కల బతుకు మీద బ్రహ్మాస్త్రం!

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

దహన సంస్కారాలు జరగవలసిన ఒక శవం ఎదురుగా ఉన్నపుడు, సాటి మనిషి ఆలోచనల్లో ఏముంటుంది? అది ఒక బ్రాహ్మణ అగ్రహారంలో జరిగితే అగ్రహారీకుల స్పందన ఏమిటి? ఆ మరణించిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడై ఉండి, బ్రాహ్మణ్యాన్ని తుంగలో తొక్కిన వాడైతే? ఒక వేశ్యను తెచ్చి ఇంట్లో ఉంచుకుని, ముసల్మానుల్ని హిందూ ఆలయంలోకి తీసుకుపోయి కోనేరు లోని”దేవుడి చేపల్ని” పట్టి ఇంట్లో వండి, వాళ్లతో కలిసి తిన్నవాడైతే? నిత్యం మద్యం తాగకుండా రోజు గడపని వాడైతే?  జంధ్యం తీసి పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పడేయడానికి సిద్ధపడ్డ వాడైతే ? ఆ శవానికి సదాచార సంపన్నులుగా పేరుపడ్డ ఇతర బ్రాహ్మలు దహన సంస్కారం చెయ్యాలా వొద్దా? మరణించిన వ్యక్తి బ్రాహ్మణ్యాన్ని వదిలేసినా, బ్రాహ్మణ్యం అతడిని వదిలేస్తుందా?వదిలేయదా?

అతడు బతికుండగా అగ్రహారం మొత్తం అతడిని వెలి వేసినట్టే చూశారు. మరి అతడి సంస్కారం జరిగేదెలా? భార్యా పిల్లలు లేని ఆ వ్యక్తి శవానికి దహన సంస్కారం ఎవరు చేయాలి?  ఎలా తెగుతుంది ఈ సమస్య?

కన్నడ సాహిత్యంలో  గొప్ప విద్యా వేత్త, అత్యంత శక్తి వంతమైన భావజాలంతో రచనలు చేసిన వ్యక్తిగా, జ్ఞానపీఠం అవార్డీ గా అనంత మూర్తి సుప్రసిద్ధుడు. అంతకు మించి హిందుత్వం మీద ఆయన చేసిన విమర్శలు, లోక ప్రసిద్ధం!

ఆయన రచనల్లో అన్నిటికంటే పేరు తెచ్చుకుంది, వివాదమైంది, సినిమాగా నిషేధించబడిందీ, బ్రాహ్మల ఆగ్రహానికి గురైందీ, అన్నిటికీ మించి లక్షల మెదళ్ళలో కోట్ల ఆలోచనలని రేకెత్తించింది “సంస్కార” నవల!

 

పడమటి కనుమల మధ్య, తుంగభద్ర ఒడ్డున ఉన్న ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారంలో నడిచే ఈ కథ ఒక బ్రాహ్మడి శవం చుట్టూ, దానికి జరగబోయే దహన సంస్కారం చుట్టూ తిరుగుతుంది. దహనమయ్యే లోపు, దహనమయ్యాకా  కథ అనేక మలుపులు తిరుగుతుంది. పరిస్థితుల ప్రభావంతో ఒక్కొక్కరి మనసులో ఎలాటి ఆలోచనలు రేగుతాయో, సందర్భాన్ని బట్టి మనుషులు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తూ, తమ ప్రవర్తన సహజమేననీ ఎదుటి వ్యక్తులే బొత్తిగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారనీ ఎలా నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తుంటారో..వీటన్నిటినీ అనంత మూర్తి  పాత్ర చిత్రణల ద్వారా మానవ సహజ ప్రవర్తనలని బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టేస్తాడు ఈ నవల్లో

నారాయణప్ప చావుతో మొదలవుతుంది ఈ నవల. ఈ కథలో నారాయణప్ప శవంగానే మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే నడుస్తుంది. దుర్వాసపురం అగ్రహారంలో పరమ నిష్టగా బతికే బ్రాహ్మణుల మధ్య అన్నిటినీ అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు బతికేసే నారాయణప్ప  మరణ వార్తను అతను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వేశ్య చంద్రి,ఒక ఉదయాన్నే పరుగున వచ్చి అగ్రహారానికి  పెద్ద దిక్కు అయిన పరమ పూజ్యుడు ప్రాణేశాచార్యుడికి చెపుతుంది. శివ మొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్ర జ్వరంతో బాధ పడి చనిపోయాడని వార్త!

అగ్రహారీకులంతా తరతరాలు గా వస్తున్న ఆచారాలను పాటించడమే తప్ప, వాటి పర్యవసనాలు, ఫలితాలు, వాటి మీద ప్రశ్నలూ, మీమాంసలూ ఎరిగిన వారు కాదు!  ఒకరి శాఖ మీద మరొకరు బురద జల్లుకోడానికి మాత్రం తోసుకుని వచ్చి ముందు లైన్లో నిల్చుంటారు.  బ్రాహ్మణ్యాన్ని వదిలేసిన నారాయణప్పను బ్రాహ్మణ్యం వదిలేస్తుందా? ఇప్పుడా శవానికి అంతిమ సంస్కారం ఎవరు చేస్తారు? కుల భ్రష్టుడు కాబట్టి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడా చార్యులు ఇద్దరూ అగ్రహారీకులే! అయినా వాళ్ళూ ముందుకు రారు. బతికున్నపుడు నారాయణప్ప చేసిన పనులన్నీ ఒక్కొక్కరు గుర్తు చేసుకుని మరీ ఏకరువు పెట్టి, తాము ఈ పనికి తెగబడేది లేదని కుండబద్దలు కొట్టేస్తారు.

ఇంతలో చంద్రి తనకు తెలీకుండానే అగ్రహారీకుల సహజ మానవ నైజానికి, స్వార్థానికి  ఒక సవాలు విసురుతుంది! తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి కుప్పగా ప్రాణేశాచార్యుల ముందు పెట్టి దహన సంస్కారాలకు వాడమని, ప్రాధేయపడుతుంది.

చంద్ర మనఃపూర్వకంగానే ఆ పని చేసినా అగ్రహారీకులు ఈ దెబ్బకు గింగిరాలు తిరిగి పడతారు. రెండువేల రూపాయలు (ఇప్పట్లో అయితే లక్షల మాటే)  విలువ చేసే బంగారం! ఎవరు అంతిమ సంస్కారం చేస్తే వారికి దక్కుతుంది. చాలీ చాలని సంపాదనతో, సంభావనల్తో  అర కొరగా బతుకులీడుస్తున్న బ్రాహ్మలందరికీ సహజంగానే దాని మీద ఆశ పుడుతుంది. సహజ మానవ స్వభావంతో  బంగారం నాకు దక్కాలంటే నాకు దక్కాలనే స్వార్థం జడలు విప్పుతుంది.

samskara

నెమ్మదిగా మెత్తబడి మాట్లాడతారు. ఎదుటి వాడు ఒప్పేసుకుంటాడేమో అని ఇద్దరి గుండెలూ దడ దడ లాడతాయి. “ఎంత కాదనుకున్నా నా తోడల్లుడు కదా! నిజానికి ఆ బంగారమంతా నా మరదలు కి దక్కాల్సింది. ” అని లక్ష్మణా చార్యులు, “వాడు మనల్ని కాదనుకున్నా, మనం వాడిని కాదనుకోగలమా? ” అని గరుడా చార్యులూ సంస్కారం చేసే అవకాశం తమకు దక్కాలంటే తమకు దక్కాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు.  ఇద్దరూ ఒకరి ముందు ఒకరు బయట పడక పోయినా ప్రైవేట్ గా వెళ్ళి ప్రాణేశాచార్యులను అంతిమ సంస్కారం చేయడానికి తాము సిద్ధమంటారు. అంతకు ముందు ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న వారినే ఇపుడు ఆ పని కోసం తన్నుకునేలా బంగారం ప్రేరేపిస్తుంది.

ఈ లోపు అగ్రహారం మరొక ఆలోచన చేస్తుంది. పొరుగున ఉన్న పారిజాత పుర అగ్రహారీకులెవరైనా ఈ పనికి ఒప్పుకుంటారేమో కనుక్కోవాలని. ఎందుకంటే వారు స్మార్తులు కాబట్టి, పైగా అక్కడ నారాయణప్ప కు చాలా మంది మిత్రులున్నారు కూడా ! స్మార్తులు  తమ కంటే తక్కువ కాబట్టీ వాళ్లకి పట్టింపు లేదనీ! వెళ్ళి అడిగాక.. వాళ్ళు అందుకు ఒప్పుకోరు. భ్రష్టుడైన వ్యక్తి శవానికి సంస్కారం చేయడానికి ఒప్పుకుంటే మధ్వుల ముందు తాము తలొగ్గినట్టే అని వాళ్ళ ఆలోచన !

అగ్రహారంలో ఎంత మూర్ఖత్వమూ, అజ్ఞానమూ  రాజ్యమేలుతూ ఉంటుందంటే, శవం ఒక పక్క కుళ్ళిపోతూ ఉంటుంది. ఇళ్ళలో వంటా, తిండీ ఉండవు. మరొక పక్క ఎలుకలు కుప్పలు కుప్పలుగా చచ్చి పడుతుంటాయి. అయినా దాన్ని భయంకరమైన అంటువ్యాధి ప్లేగు గా గుర్తించరు. ఆ ఎలుకల కోసం కాకులూ గద్దలూ ఇళ్ళ మీద వాలుతుంటే అరిష్టం చుట్టుకుందని శంఖాలు పూరించి వాటిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ హడలి పోతారు తప్ప గ్రామం లోకి ప్లేగు వ్యాపించిందని తెలుసుకోరు.

ప్రాణేశుడు నగల మూట చంద్రికి తిరిగిచ్చేసి  తన దగ్గరే ఉంచుకోమని చెప్తాడు

ఆ తర్వాత ఏం చేయాలో తోచని స్థితిలో అతడు ధ్యానంలో కూచుని ఆంజనేయుడి నుంచి సందేశమేమైనా లభిస్తుందేమో అని చూస్తాడు గానీ ప్రయోజనం ఉండదు. ప్రాణేశాచార్యుడు నిండా నలభయ్యేళ్ళైనా నిండని యువకుడు . బెనారస్ లో చదువుకుని వేద విద్యనార్జించిన జ్ఞాన వృద్ధుడు, అన్నీ తెల్సిన వాడు. ఏరి కోరి సంసార జీవితానికి పనికి రాని రోగిష్టి స్త్రీని వివాహమాడి ఆమెకు సేవ చేస్తూ ఇహ లోక సుఖాలకు అతీతంగా జీవిస్తున్న పరమ పురుషుడూ, పూజ్యుడూ ఆ అగ్రహారంలో! ఎవరూ  ఆయన మాటకు ఎదురు చెప్పరు కదా, ఆయన మాటనే శిరోధార్యంగా పాటిస్తారు.

అగ్రహారీకులు భార్యా పిల్లలని పుట్టిళ్ళకు పంపి, ధర్మ స్థలంలోని మధ్వ మఠంలో గురువు గారు ఈ విషయంలో ఏమి చెప్తే అలా చేయాలని గుంపుగా బయలు దేరతారు.

pranesha-and-chandri

****

అనుకోని విధంగా కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. అడవిలోని ఆంజనేయుడి గుడిలో ధ్యానంలో కూచున్న ప్రాణేశుడు సందేశం దొరకక నిరాశతో లేచి చీకటి పడ్డాక ఇంటికి బయలు దేరతాడు. ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్ర ఇసక తిప్పల్లోని అరటి తోటలో పండ్లు కోసుకోడానికి వెళ్తుంది. చీకట్లో తిరిగి వస్తున్న ప్రాణేశుడిని గుర్తించి ఆయన కాళ్ళ మీద పడుతుంది. వివాహమైనా స్త్రీ స్పర్శ గానీ, సౌఖ్యం గానీ ఎరగని ఆజన్మ బ్రహ్మ చారి ప్రాణేశుడు చంద్రి స్పర్శతో అనుకోని ఉద్రేకానికి, ఉద్వేగానికి లోనై లోనవుతాడు. ఆ వేసవి చీకటి రాత్రి, అడవిలో ఆరుబయట  చంద్రి పరిష్వంగంలో మరే ఆలోచనకూ తావులేని క్షణాల్లో కరిగి ఆమె అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

అది ఎలా సాధ్యపడుతోందన్న ఆలోచన ఇసుమంతైనా కలగని అమోఘమైన, అద్భుతమైన క్షణాలవి అతనికి!  జాడ లేకుండావిచక్షణ అదృశ్యమైన క్షణాలవి!

చంద్రిది ఆవేశం కాదు. పదేళ్ళు నారాయణప్పతో కల్సి జీవించినా ఆమెకు సంతానం కలగలేదు. తన తల్లి చెప్పిన సలహా ఏమిటంటే , సంతానం పొందాలనే ఆలోచన కలిగితే సతుపురుషుల వల్లే పొందాలి తప్ప ఎవరి వల్ల బడితే వాళ్ళ వల్ల కాదని!

ఆ ఉద్రేక క్షణాలు కరిగి కదిలి పోయాక ఈ లోకంలోకి వచ్చిన ప్రాణేశుడు చింతనలో పడతాడు. తానెరగని ప్రపంచం ఒకటుందనే ఎరుక ఆవహిస్తుంది.  చంద్రితో అంటాడు “పద, ఇద్దరం కలిసే వెళ్దాం వూళ్ళోకి, జరిగిందంతా చెప్పేద్దాం” అని!  చంద్రి స్థిర చిత్తంతో అతని వెనుకగా వూర్లోకి బయలు దేరుతుంది గానీ అనుసరించదు.  ఆ అర్థరాత్రి నారాయణప్పతో తనకు గల బంధం పట్ల నిబద్ధతతో తన బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్తుంది చంద్రి.  ఒక సాయిబుల బండి వాడిని బతిమిలాడి, డబ్బులిచ్చి మూడో కంటికి తెలీకుండా ఇంట్లో ఉన్న కట్టెలతో సహా శవాన్ని స్మశానానికి తీసుకు పోయి దహనం చేయించి, ఆవేదనతో ఆ వూరు విడిచి కుందాపురం వెళ్ళిపోతుంది.  దాంతో చంద్రి ప్రసక్తి నవలలో ముగిసి పోతుంది. మరో పక్క మఠానికి  బయలు దేరిన అగ్రహారీకుల్లో కూడా ప్లేగు తో  కొందరు మరణిస్తారు దార్లో ప్రాణేశుడు ఇంటికి చేరిన కాసేపటికి అతడి రోగిష్టి భార్య తీవ్ర జ్వరంతో, ప్లేగు గడ్డతో కన్ను మూస్తుంది. ఏ వికారాలూ తనకు అంటవనుకున్న ఆ పండితుడు భార్యతో మొదటి నుంచీ ఎలాటి శారీరక బంధం లేక పోయినా, మానసిక బంధంతో దుఃఖిస్తూ అంతిమ సంస్కారం పూర్తి చేస్తాడు. వూర్లో ఎవరూ లేరు. అందరూ మధ్వ మఠానికి వెళ్లారు. ఏం చేయాలి ఆ వూరులో! ఇప్పుడు తాను నారాయణప్ప శవాన్ని దహనం చేయడానికి అర్హుడేనా? మఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగొస్తే? ఏం చేయాలో తోచని ఒక అగమ్య గోచరమైన స్థితిలో  ఆ వూరు నుంచి దిక్కు తెలీని గమ్యాన్ని అన్వేషిస్తూ బయలు దేరతాడు.

snehalatha

ఎక్కడికో  తెలీదు! నడుస్తూ వెళ్తుంటే దార్లో అతడికి పుట్టన్న అనే బోయవాడు కలుస్తాడు ప్రయాణంలో! అతడి తండ్రి బ్రాహ్మడే అయినా తల్లి బోయజాతి స్త్రీ!  కల్లా కపటం తెలీని పుట్టన్న  విరామం లేకుండా ప్రాణేశుడితో కబుర్లు చెప్తూ అతనికి కొత్త లోకాలు చూపిస్తాడు.

ఆ ప్రయాణంలో ప్రాణేశుడు కొత్తగా తిరిగి జన్మిస్తాడు పుట్టన్న తెచ్చిన కొబ్బరి బెల్లం తీసుకుంటాడు తినడానికి. మడీ, ఆచారాలతో నిత్యం జ్వలిస్తూ ఉండే ఆచార్యుడు సంతలో కాఫీ తాగుతాడు. భార్య పోయిన మైలలో ఉండీ, దేవాలయ ప్రవేశం చేసి సంతర్పణ భోజనానికి కూచుంటాడు.  పద్మావతి అనే దేవదాసి పుట్టన్న దగ్గరకు తీసుకెళ్తే, చంద్రి ఇచ్చిన అనుభవం తాలూకు స్మృతులతో పద్మావతిని  చూసి మోహంలో పడతాడు మళ్ళీ! దేవాలయ సంతర్పణ తర్వాత ఆమె దగ్గరకు తిరిగి వెళ్ళాలనే కాంక్షిస్తాడు.

మరో పక్క అతనిలో ఆలోచనలు అంతూ పొంతూ లేకుండా ఉత్పన్నం అవుతుంటాయి. తానెన్నడూ చూడని జీవితాన్ని చూస్తూ, కలలోనైనా ఊహించని మనుషులని తాకుతూ, వారి మధ్య నడుస్తూ తిరుగుతున్నా అతనిలో అంతర్మధనం మాత్రం ఆగదు. గుడిలో ఎవరో బ్రాహ్మడు తన కూతురికి సంబంధం చూడమని అడుగుతాడు. సంభావనల కోసం, ఒక పూట చారుతో కూడిన సాధారణ భోజనం కోసం వచ్చిన బీద, సామాన్య బ్రాహ్మల మధ్య కూచుని ఎన్నో ఆలోచనలు చేస్తాడు. వడ్డన చేస్తున్న బ్రాహ్మల్లో ఒకడు “అయ్యో, మీరు దుర్వాస పుర అగ్రహారం ప్రాణేశాచార్య కదూ! ఈ పంక్తి మీ వంటి వారికి కాదు, లేవండి, వేరే పంక్తికి తీసుకెళ్తా పదండి” అనే సరికి ఉలిక్కి పడి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బెదిరి పోయి లేచి పోతాడు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణేశుడుఅకస్మాత్తుగా మేల్కొంటాడు.  తానేం చేస్తున్నదీ, ఎటు పోతున్నదీ తోచదు. భోజనానంతరం పద్మావతి దగ్గరికి తీసుకెళ్తానన్న పుట్టన్న మాటలు మరి చెవిన పెట్టక ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఉద్దేశంతో దుర్వాస పురం అగ్రహారం దారి పడతాడు. మొత్తం చెప్పేసి అగ్రహారం ముందు తన భారం దించుకోవాలని సంకల్పిస్తాడు.

ఆ తర్వాత  ఏమవుతుంది? ఆయన తప్పుని అగ్రహారం ముందు ఒప్పుకుంటాడా? ఆయన తప్పుని అగ్రహారం క్షమిస్తుందా? అసలు ఆయన చేసింది తప్పేనా? లేక ప్రకృతి సహజమా?మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో మట్టి కొట్టుకు పోయిందా?

ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు లేదు! ఎందుకంటే ఆ తర్వాత ఏమవుతుందనే ప్రశ్నతోనే నవల ముగిసి పోతుంది. ప్రాణేశుడి పయనం మాత్రం సాగుతుంది దుర్వాసపురానికేసి.

ఈ నవలను అనంత మూర్తి విదేశాల్లో పి హెచ్ డీ చేస్తున్నపుడు రాశారు. 1965 లో పబ్లిష్ అయిన ఈ నవల 1970 లో ఇది సినిమా గా రూపు దిద్దుకుంది. పెళ్ళి నాటి ప్రమాణాలు భాగ్య చక్రం లాటి సినిమాలకు నిర్మాత గా వ్యవహరించిన తిక్కవరపు పట్టాభిరామి రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా ఈ నవలను పార్లల్ సినిమాగా తెరకెక్కించారు. ప్రాణేశుడిగా గిరీష్ కర్నాడ్, పఠాభి భార్య స్నేహలత ఈ సినిమాలో చంద్రిగా నటించారు. కుల విభేదాలని రేకెత్తించేది గా  ఉందన్న కారణంతో మొదటి ఈ సినిమాని  సెన్సార్ బోర్డు నిషేధించినా, తర్వాత విడుదలై జాతీయ అంతర్జాతీయ అవార్డులు  సైతం గెల్చుకుంది.

నవల విషయానికొస్తే సాహిత్య అకాడమీదీన్ని  తెలుగులో ప్రచురించింది. తెలుగు లోకి అనువదించింది శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రి. ఒరిజినల్ నవల చదువుతున్నట్టే ఉంటుంది తప్ప ఇది అనువాదమని పసిగట్టలేం! ప్రస్తుతం తెలుగు కాపీలు అందుబాటులో లేవు. ఇంగ్లీష్ లో చదవాలనుకునే వారు చదవవచ్చు. నవలగా కూడా ఇది అనేక విమర్శలకు గురైంది. అనంత మూర్తి స్వయంగా బ్రహ్మణుడై ఉండి, బ్రాహ్మణ్యం మీద చేసిన విమర్శలు, చాలా మందికి బొత్తిగా మింగుడు పడలేదు. నిజానికి ఆయన మనుషుల సహజ స్వభావాలు ఎలా ఉంటాయన్న విషయానికే ప్రాధాన్యం ఇచ్చి, వాళ్ళ హిపోక్రసీ పరిస్థితులను బట్టి ఎలా జడలు విప్పుతుందో ఎద్దేవా చేస్తూ రాసినా, కథ,  పాత్రలు బ్రాహ్మణాగ్రహారానికి చెందడం వల్ల సహజంగానే బ్రాహ్మణుల ఆగ్రహానికి గురైంది ఈ నవల. కానీ నిజం మాట్లాడాలంటే ఈ నవల్లో అనత మూర్తి పాత్రల ద్వారా చెప్పించిన మాటలు గానీ,చేసిన విమర్శలు గానీ నోరు మూసుకుని ఒప్పుకుని తీరవలసినవే!  భుజాలు తడుముకుని ఊరుకోవాల్సిందే . అందులో రెండో మాటకు తావు లేదు.

నవలను రెండు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి నారాయణప్ప దహన సంస్కారం అయితే రెండోది ఒక వేద పారంగతుడైన ఒక బ్రాహ్మడు ధర్మ సంకటంలో పడి చేసుకున్న ఆత్మ విమర్శ! ఈ రెండో విభాగం నవలకు చాలా కీలకం.

ప్రాణేశాచార్య అంతరంగ మథనాన్ని అనంతమూర్తి రచయిత స్థానంలో ఉండి పరిశీలిస్తూ, అత్యంత అద్భుతంగా చిత్రీకరిస్తాడు.

చంద్రి సాంగత్యానికి ముందు, ఆ తర్వాత అతని ఆలోచనల్లో ఏర్పడిన మార్పు, ఒప్పుకోలు, కొంత పశ్చాత్తాపం, తనను తానే మోసగించుకోవడం, అంతలోనే కాదు కాదని సర్ది చెప్పుకోవడం..ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తాయి.

అగ్రహారంలో అందరికీ మార్గదర్శకంగా , దారి చూపిస్తూ ఉండే ప్రాణేశుడు తీరిక వేళల్లో పురాణాలు  శృంగార కావ్యాలు చదివి విపులంగా విశదీకరించి, అగ్రహారీకులకు రసానందం కలిగిస్తూ ఉండేవాడు. ఆయన కావ్యాల్లోని వర్ణనలను మరింత విశదీకరించి చెప్తుంటే ఎంతోమంది అక్కడ గుమికూడే వారు వినడానికి. వారిలో లక్ష్మణా చార్యుడి అల్లుడు కూడా ఉండేవాడు. అతడిని భార్యతో కూడకుండా అత్తగారు అడ్డుపడుతూ ఉంటుంది. అలా కొన్నాళ్ళు చేస్తే, ఇక కొంగున కట్టుబడి ఉంటాడ్దని ఆవిడ ప్రగాఢ విశ్వాసం! ఎన్నో సార్లు భార్యను చేరబోయి భంగపడిన అతడు, ఒకనాడు ప్రాణేశాచార్యుడు మత్స్యగంధిని గురించి చేసిన వర్ణనలను విని ఉత్తేజితుడై, ఆ ఉద్రేకంలో వెళ్ళి, తుంగభద్రలో స్నానం చేస్తున్న మాల పిల్ల బెల్లీతో గడుపుతాడు. ఇలాటి వాటిని శరీర ధర్మాలు గా  భావించే బెల్లీ అభ్యంతరం చెప్పదు. పైగా బ్రాహ్మల అయ్యోరు కదాని భయ భక్తులతో ఉంటుంది.

ఈ సంగతి తెలిశాక ప్రాణేశాచార్యులు కొంత కలరవర పడి, శృంగారం బొత్తిగా లేని భక్తి రస ప్రధా కావ్య పఠనం మొదలు పెడితే.. పాపం శ్రోతల సంఖ్య బహు స్వల్పం!  శ్రోతలెక్కువమంది లేక పోయే సరికి ప్రాణేశుడికి సైతం ఆసక్తి లేకుండా పోతుంది. (ఇలాటి సంఘటనలను వాస్తవంగా చిత్రిస్తూనే అనంతమూర్తి వ్యంగ్యం దట్టిస్తాడు).

girish-karnad

ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ప్రాణేశుడికి. రస రమ్యంగా తాను కావ్యాలను వర్ణిస్తుంటే యువకుల మనఃస్థితి ఎలా ఉండేదో, వర్ణనల ద్వారా వాళ్లను ఎలా ఉద్రేక పరిచాడో తనకు ఇప్పుడు అవగతమైందనుకుంటాడు.  “నిజానికి అవన్నీ శ్రోతలకు మాత్రమే చెప్తున్నాననీ, తనకలాటి విషయ వాసనలేవీ అంటకుండా ఉన్నాయని తాను భ్రమించాడే తప్ప, తనలో ఆ కోరికలూ ఆ వాసనలూ పెద్ద పులిలా లోపల పొంచే వున్నాయి. సరైన అవకాశం కోసం వేచి చూస్తోంది ఆ పెద్ద పులి. చంద్రి స్పర్శ తగలగానే అది బయటికి దూకింది.” అని ఒప్పుకుంటాడు.

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు. ఎవరినో పిలుస్తున్నా, తననే అని ఉలిక్కిపడతాడు.

రోగిష్టి భార్యకు సేవ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తుంటాడు. తాను ఇహ లోక సౌఖ్య భావనలన్నిటినీ అధిగమించానని భావిస్తుంటాడు కానీ అది అబద్ధమని చంద్రి సౌందర్యం, సాంగత్యం రుజువు చేస్తుంది.

దేవాలయంలో సంతర్పణ పంక్తిలో కూచున్నా, అతని కళ్ళ ముందు అగ్రహారం, నారాయణప్ప శవం, ఇవే! తాను, చంద్రి నెరపిన అద్భుత శృంగారం మరో పక్క వెంటాడుతుంది. ఈ సంఘర్షణలో అతనికి మాల పిల్ల బెల్లీ మట్టి రంగు శరీర వర్ణం గుర్తొస్తుంది. ఆ పిల్ల శరీర సౌష్టవాన్ని కూడా  తాను పరికించి చూశానన్న సంగతిని మనస్సాక్షి ముందు ఒప్పుకుంటాడు.

తనలో పశ్చాత్తాపం అంటే భయం ఎక్కువగా ఉన్నదని గ్రహిస్తాడు “ఒకవేళ నేను నిజం బయట పెట్టక పోతే, నారాయణప్ప శవానికి సంస్కారం చేయక పోతే భయం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు!  నేనొక అభేద్యము, అమోఘమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావాలి. పరోక్షంగా ఉన్న విషయాలన్నీ ప్రత్యక్షంగా తీసుకురావాలి. సూటిగా మనుషుల కళ్లలోకి చూడగలిగి ఉండాలి. విషయాలు దాచి పెడితే జీవితాంతం భయం పిశాచానికి బద్ధుడినై ఉండాలి.  బహిర్గతం చేస్తే ఇన్నాళ్ళు నా సనాతన ధర్మ బద్ధతకు ఔన్నత్యం కల్పిస్తున్న బ్రాహ్మణ్యం ముందరే నిజం బయట పెట్టి, బ్రాహ్మణ్యం ముందే దుమ్ము పోసిన వాడినవుతాను.  నా నిశ్చితార్థం తో ఇతరుల జీవనాన్ని ముడి పెట్టడానికి నాకేం హక్కుంది?  పరంధామా ! నిర్ణయమూ తీసుకోలేకుండా ఉన్నాను. రోజు రాత్రి అడవిలో నా ప్రమేయం లేకుండా కూడా, నీవు నా నిర్ణయాన్ని విధంగా విధించావో, అదే విధంగా ఇప్పుడు కూడా నీవు నా నిర్ణయాన్ని విధించు. జరగవలసిందేదో ఒక్కసారిగా జరగనీ ! …” 

 ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలనుఅని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మూర్ఛ రోగిని నారాయణప్పకు కట్టబెట్టి అతని సహజ వాంఛలను తీరకుండా చేసిన బంధువుల చర్యను తాను ఒక్కనాడైనా మనసులోనైనా ఖండించలేదు.  నారాయణప్ప కు మాత్రం శృంగారం అవసరం లేదా?  ఎప్పుడూ నారాయణప్పకే నీతులు బోధించి మార్చడానికి ప్రయత్నించాడే!

జీవితాంతం నారాయణప్పని మార్చడానికి ప్రయత్నించిన ప్రాణేశాచార్య , అతను మరణించాక అతని వైపునుంచి ఆలోచిస్తాడు!

ఆలోచనలతో అతడి మెదడు హోరెత్తుతుంది.

ఆంజనేయ స్వామి నన్ను దారి తప్పించాడు. నారాయణప్ప నా మీద పగ సాధించాడు.  దుర్వాసపురం బ్రాహ్మణులు  బంగారానికి వాచి పోయారు. చంద్రి చీకట్లో వేచి ఉండి తనకు కావలసిన దాన్ని పొంది వెళ్ళిపోయింది. భాగీరథి (భార్య) బాధతో ఆర్తనాదం చేసి చచ్చి పోయింది. మరి నేను?”

అని ఆలోచిస్తుండగానే పుట్టప్ప పద్మావతి ప్రసక్తి తీసుకురాగానే మళ్ళీ మనసు చంచలం!

image1-2

వెళ్తాను. దుర్వాస పురానికి తిరిగి వెళ్తాను. ఇక్కడి జీవనానికి దూరంగా, జీవిత విన్యాసంలో నగ్న సత్యం మాదిరి బెదిరి పోయిన బ్రాహ్మణుల మధ్య వ్యక్తమవుతాను. ఇంతవరకూ వాళ్ళ ముందు ఒక గురు తుల్యుడిని, పెద్దను, అర్థ రాత్రికల్లా కొత్త మనిషిగా మారతా! బహుశా అగ్ని జ్యోతి నారాయణప్ప శరీరం మీద నాలుకలు జాపి నాట్యం చేస్తుంటే నా మనసు స్థిమిత పడవచ్చు. వాళ్లకు నా సంగతి అంతా చెప్పేటపుడు నాలో పిసరంతైనా పశ్చాత్తాపం ఉండకూడదు. నేనొక పాపం చేసి విచారిస్తున్నానేమో అన్న అనుమానం రవ్వంతైనా ఉండరాదు. లేక పోతే సంఘర్షణ లో నేను ద్వంద్వాతీతుణ్ణి కాలేను.మన మనసులో యే రూపాలు భావించుకుంటామో అవన్నీ నిస్స్సందేహంగా సత్స్వరూపాలే… ” ఇలా ఆలోచనల ప్రవాహం సాగాక మొదటి సారి అతడు పుట్టన్న భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి మాట్లాడతాడు. అతడి హృదయం తేలిక పడుతుంది. మనసుని పట్టి ఉన్నదేదో వీడి పోతుంది.

ఇలా ప్రాణేశుడి అంతరంగ మథనం సాగుతుంది. అనంతమూర్తి అగ్రహార బ్రాహ్మల్లోని ద్వంద్వ ప్రమాణాలను కుండ పగలేసినట్టు బయట పెట్టి అనేక మందిని ఉలిక్కి పడేలా చేస్తాడు. దుర్వాస పురం అగ్రహారం లోని ఏకైక స్మార్తుడు దుర్గా భట్టు ప్రతి విషయంలోనూ మధ్వ సంప్రదాయాలకు  అనుగుణంగా మధ్వుల ప్రవర్తన ఉందాలేనా అని కొలతలేసి ఎంచుతుంటాడు. నారాయణప్ప వేశ్యాలోలుడు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుని “దక్షిణ కన్నడంలో బస్రూరు సంగతి అందరికీ తెలిసిందే కదా, అక్కడి బ్రాహ్మలు అంతా భోగం కొంపల చుట్టూ తిరిగే వారేగా? వాళ్లను బ్రాహ్మలు కాదన్నారా ఏంటి నారాయణప్పను తప్పు పట్టేందుకు” అంటాడు “మీ మధ్వులంతా తిరుగుబోతులే ” అనాలన్న ఉద్దేశంతో .

మధ్వులను వెక్కిరిస్తున్నాడని మండిన గరుడాచార్యులు “మీ శంకరాచార్యులు కూడా సంపూర్ణ అనుభవాలు కావలసిన ఆశ కొద్దీ రాజుగారి బొందిలో ప్రవేశించి రాణీగారి సహవాసం లో లేడా” అని బదులు తీర్చుకుంటాడు. దుర్గాభట్టుకి ఇదంతా మధ్వుల ఆంతరంగిక వ్యవహారం. ఏదో మాట కలిపాడు కానీ నిజానికి అతడు వచ్చింది చంద్రిని చూడ్డానికి. నారాయణప్ప ప్రాపకంలో ఉండగా చంద్రి ఎన్నడూ బయటికి వచ్చింది కాదు. మధ్వుల నీతి గురించి తానేదో నీతిపరుడైనట్టు మాట్లాడిన భట్టు అటువంటి పరిస్థితిలో కూడా చంద్రిని అణువణువూ తనకు తనే వర్ణించుకుంటూ చూస్తాడు.  “ఎంతటి అందమైన సౌష్టవం ? నారాయణప్ప పడి చచ్చాడంటే చావడూ “అని లొట్టలు వేస్తాడు .

ఇహ పారిజాత పురంలోని స్మార్తులు తక్కువేమీ కాదు ! ఇప్పటికే తమను మధ్వులు తక్కువగా చూస్తున్నారు , ఎంత మిత్రుడైనా తాగుబోతు , మాంసాహారి , వేశ్యాలోలుడు అయిన నారాయణప్ప శవానికి సంస్కారం చేయడానికి ఒప్పుకుంటే ఇంకా లోకువైపోతామని, అందుకు ఒప్పుకోరు . పైగా అక్కడి స్మార్త ప్రముఖుడు మంజయ్య ” ఖర్చులకు ఇబ్బంది పడకండి ! దానాలు ఇతర ఖర్చులన్నీ నేను చూస్తాను , దహనం మీరే కానివ్వండి ” అంటాడు , మధ్వుల లోభ గుణాన్ని ఎత్తి పొడుస్తూ !

తిండికి మొహం వాచీ ఉండేమరొక బ్రాహ్మడు దాసాచార్యుడు శవం అగ్రహారంలో ఉండగా , ఆకలికి తాళ లేక పారిజాత పురం వెళ్లి మంజయ్య ఇంట్లో , నారాయణప్ప దహన సంస్కారాల గురించి మాట్లాడ్డానికి వచ్చినట్టు ఆ మాటా ఈ మాటా చెప్పి వాళ్ళు పెట్టిన ఉప్మా కడుపునిండా భుజిస్తాడు . అతడు తిండికోసమే వచ్చాడని గ్రహించలేని దద్దమ్మ కాదు మంజయ్య! తమకంటే అధిక శాఖ బ్రాహ్మడు తన ఇంట్లో తిన్నాడని ఎగతాళి గా నవ్వుకుంటాడు ! దాసాచార్యుడు భ్రష్టుడైతే తనకు ఆనందమేగా

ఈ విధంగా అనంతమూర్తి చెయ్యని వ్యంగ్యం లేదు, బయటపెట్టని బండారమూ లేదు ఈ నవల్లో !

anantamoorthy

లక్ష్మణా చార్యుడి అల్లుడు శ్రీపతి మాలపిల్ల బెల్లీతో గడుపుతాడు తప్ప ఆమె తో కనీసం ఒక మాట మాట్లాడాలని తోచదు. వూరునుంచి తిరిగొస్తూ బెల్లీ దగ్గరికి వెళ్ళి ఆమె శరీరం మీద తన దండయాత్ర కొనసాగిస్తాడు తప్ప “వూర్లో ఏదో మహమ్మారి రోగం వచ్చిందయ్యా” అని బెల్లీ చెప్పబోతుంటే వినడు. అతనికి ఆమె శరీరంతోనే పని. “బెల్లీ పడుకోడానికి మాత్రమే బావుంటుంది, మాట్లాడ్డానికి కాదు” అంటాడు అనంతమూర్తి అక్కడ!

కులం వల్ల తమకు సంక్రమించాయని చెప్పుకుంటున్న ఉత్తమ సుగుణాలూ, ధార్మిక లక్షణాలూ, నైతికతా ఇవన్నీ అబద్ధాలు, పరిస్థితులకు అనుగుణం గా మారే మనిషి ప్రవర్తన మాత్రమే నిజం!ఇదే ఈ నవల మొత్తం వ్యాప్తమై కనిపిస్తుంది.

ఒక మనిషి బతికుండగా ఎలాటి వాడైనా, ఏ కులానికి చెందిన వాడైనా , ఏ ధర్మాన్ని పాటించిన వాడైనా , మరణించాక అతడు బ్రాహ్మడూ కాదు , శూద్రుడూ కాదు ! అదొక దేహం మాత్రమే ! దాన్ని గౌరవంగా ఈ లోకం నుంచి సాగనంపాల్సి ఉంటుంది . శవానికి కులమేమిటి ? ఈ విషయం మీద ఈ నవలలో జరిగిన చర్చ చాలా రోజులు వెన్నాడుతుంది !

భారతీయ  నవలా సాహిత్యంలో ఎంచి చెప్పుకోదగ్గ నవలగా సంస్కార స్థానం చాలా స్థిరమైనది.

సినిమా ఆన్ లైన్లో అందుబాటులో ఉంది.

అయితే నవలలో ఉన్న చిక్కదనం సినిమాలో కనిపించక, కొంత నిరాశ పరిచింది నన్ను! ప్రాణేశుడి అంతరంగ మథనం దృశ్యరూపం దాల్చడంతో రచయితగా అనంతమూర్తి అదృశ్యమై ,నటుడిగా గిరీష్ కర్నాడ్, దర్శకుడిగా పఠాభి మాత్రమే అక్కడ  కనిపిస్తారు. చాలా గొప్ప నవలలు సినిమా దాకా వచ్చే సరికి ఎలా తేలిపోయాయో అలాగే సంస్కారకీ మినహాయింపు లేదనిపిస్తుంది

అద్భుతమైన కథా వస్తువు, అమోఘమైన పాత్ర చిత్రణలతో  మూఢ సంప్రదాయాల మీదా , మనుషుల ద్వంద్వ ప్రమాణాల మీదా మీద అనంతమూర్తి సంధించిన  బ్రహ్మాస్త్రమే “సంస్కార”

తెలుగులో లభ్యం కాకపోయినా ఇంగ్లీష్ లో రామానుజన్ అనువాదం అందుబాటులో ఉంది! వీలు చేసుకుని చదవదగిన గొప్ప నవల

 

*

 

 

 

 

 

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  ‘’సంస్కార ‘’ సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక, 1977 లో ఇందిరా గాంధి ఎమర్జన్సీ బాధితురాలై అసువులు బాసిన స్నేహలత అక్క ( స్నేహలతా రెడ్డి గారు ) జ్ఞాపకం వస్తుంది.

  అమూల్యమైన, అద్భుతమైన సాహిత్యాన్ని పరిచయం చేసుతున్న సుజాత గారి రుణాన నేనొక్కడినే ఎందుకు పడిపోవాలని వారి “చదువరి డైరీ” వ్యాసాల్ని చదివి మురిసిపోయే పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారికి ఈ వ్యాసం ప్రింటు కాపీని కూడా పోస్ట్ చేస్తున్నా.

  హస్తభూషణం గానో, గృహాలంకరణకు పనికొస్తుందనో యు.ఏ. అనంతమూర్తి గారి “సంస్కార” నవలను కూడా కొని దాచుకుంటాను; సుజాత గారి పుణ్యమా అని.

 2. తహీరో says:

  మీ పరిచయం సమగ్రంగా బాగుంది. శాస్త్రి గారి తెలుగు అనువాదం చదివాను. మంచి అనువాదమే కానీ పుట్టెడు అక్షర దోషాలు. అడుగడుగునా ముద్రా రాక్షసాలు. సినిమా కోసం ప్రయత్నించా – దొరకలేదు.

 3. రాధ మండువ says:

  సుజాత గారూ,
  చాలా బావుంది. చదువరి డైరీలోని మిగిలినవి (పాత సమీక్షలు) కూడా చదవాలి. అభినందనలు

 4. విజయ్ కోగంటి says:

  యీ వ్యాసంతో చదువరుల డైరీ మరింత సార్ధకం. అభినందనలు.

 5. కాజ సురేశ్ says:

  ఎంత బాగా రాసారండి సుజాత గారు. హాట్సాఫ్. ఇంక నవలెందుకు చదవటము.

 6. Vvlakshmidevi@gmail.com i says:

  ఈ నవలను ఈ మధ్యనే సుజాత పట్వారీ కూడా అనువదంచారు. ఆమె తెలుగు బాగా వచ్చిన కన్నడ మధ్వ స్త్రీ. గొప్ప ముందు మాట కూడా రాశారు. నేను శాస్త్రి గారి అనువాదం కూడా చదివాను.
  నేను ఈ నవల మీద చినుకు లో సమగ్ర సమీక్ష చేసాను. నవల లోని ప్రధానాంశం ప్రాణేశ్వరాచార్యుల ఆధ్యాత్మిక ప్రయాణంగా సుజాత పట్వారీ గారూ నేనూ భావించాం. సమీక్ష జూన్2015సంచిక లో వచ్చింది
  పట్వారీ గారు నవలలోని లోపాలను కూడా వదలలేదు. ఎనీహౌ సుజాత గారు విపులమైన సమీక్ష చేసారు. బావుంది

  • సుజాత says:

   వీరలక్ష్మి గారూ, పైన రివ్యూలోనే నవలని రెండు విభాగాలుగా అర్థం చేసుకోవాలనీ, అందులో ఒకటి ధర్మ సంకటంలో పడిన వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడి అంతరంగ మథనం అనీ, అది నవల్లో చాలా కీలకమైనదనీ ప్రస్తావించాను. ప్రాణేశాచార్యుడి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్య భాగమైన అంతరంగ మథనాన్ని మాత్రమే నేను ఈ రివ్యూలో ప్రస్తావించాను.

   నాకు మొదటి విభాగాన్ని ప్రత్యేకించి విపులంగా విశ్లేషణాత్మకంగా చూడాల్సిన అవసరం ఉందనిపించింది. సినిమాలో కూడా దాని మీద దర్శకుడు కొన్ని సీన్లు ప్రత్యేకంగా తీశాడు. అందుకే దానిమీదనే కేంద్రీకరించాను.

   అతని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆధ్యాత్మిక కోణంలోనే విశ్లేషిస్తూ పోతే, రివ్యూకి రెండో భాగం కూడా రాయవలసి వస్తుంది. అలా రాసినా, అది నవలలోని మొదటి భాగంతో కనెక్ట్ కాక తప్పదు! సమన్వయించకా తప్పదు

   సుజాత పట్వారీ గారి పుస్తకం కూడా తెప్పించుకుని చదువుతాను. మధ్వ స్త్రీ అవడం నవల అనువాదం మీద ప్రభావాన్ని చూపి ఉంటుందా, అగ్రహారీకులను ఏ విధంగా అర్థం చేసుకున్నారో (ముందుమాటలో తెలుస్తుందేమో) చదవాలని ఉంది అలాగే మీ సమీక్ష కూడా. అది నెట్ లో అందుబాటులో ఉంటే చెప్పండి. ఫిజికల్ కాపీ నాకు లభ్యం కావడం నాకు కష్టం! నేను ఇండియాలో లేను.

   మీ స్పందనకు ధన్యవాదాలండీ!

   • Vvlakshmidevi@gmail.com i says:

    సుజాతగారు
    మీ మెయిల్ ఐడి చెప్తే నా సమీక్ష పంపగలను. అది నెట్ లో లేదు

  • సుజాత says:

   నా ఐడీ sujatha.bedadakota@gmail.com

   ఎదురు చూస్తానండీ, థాంక్యూ

 7. D. Subrahmanyam says:

  సంస్కార నవల మీద ఇంగ్లీష్ లో వచ్చిన రివ్యూ లు చదివాను. వాటన్నిటికంటే సుజాత గారి విపులమయిన విశ్లేషణ అమోఘం గా ఉంది. బ్రాహ్మలు తాము చెప్పిందే గొప్ప , వాళ్ళని వాళూ ప్రశ్నించుకోరని, ఈ మధ్య, వాళ్ళని చిన్న బుచ్చడమే కాకా అసహ్యకరమయిన భాషతో ఇంచుమించు తిడుతూనే రాస్తున్న వారు , అనంతమూర్తి గారు బ్రాహాముదు అయ్యుండి, బ్రాహ్మలలో ఉండే లోపాలను ఈ నవలలో చూపించిన పద్ధతి అందరూ చదవాలి. సుహతగారు ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివేలా చేసిన మీ విశ్లేషానికి హార్దిక అభినందనలు .

  • సుజాత says:

   సుబ్రహ్మణ్యం గారూ, చక్కని దృష్టి కోణంలో చదివారు రివ్యూ ని! థాంక్ యూ

 8. సుజాతా !!
  ఇంత గొప్ప నవల ని ఇంత వరకూ చదవక పోవడం నా దురదృష్టం ..ఇప్పటి కైనా దొరికించుకుని చదవాలి .సమగ్రంగా పరిచయం చేసారు ..ధన్య్వాదాలు .

  వసంత లక్ష్మి .

 9. సుంకర శ్రీనివాసరావు. says:

  సుజాతా జీ గొప్పగా ఉంది మీ సమీక్ష.. ఎప్పటి లాగే. థాంక్స్.

 10. మంచి సమీక్ష ..చాలా కూలంకషంగా విశ్లేషించారు .అభినందనలు సుజాతాగారూ !

 11. సంస్కార చదివాను. ఇంగ్లిష్ లో కూడ చదివాను. సినిమా కూడా చూసాను. ప్రీవ్యూ. మీ వ్యాసం కూడా చదివాను. సంస్కార మీద రచయిత మీద ప్రతికూలంగా వచ్చిన పరిచయాలు / సమీక్షలు కూడా చదివాను. మీ పరిచయం చదివాకా మళ్ళీ చదవాలనిపిస్తున్నది. చదువుతాను.

 12. మంచి సమీక్ష అండి

 13. ధీర says:
  • నరసిింహారావు says:

   ధీర గారూ!
   మీ పరిశీలన గురించి అక్కడ సరయిన చర్చ జరగలేదే అని నేను కొంచెం బాధపడిన మాట నిజం. అయితే, ఇక్కడ దానికి ఏదైనా అవకాశం వుంటుందేమో చూద్దాం.
   నా పరిశీలన ఏమటే, ఒక రకమైన సాంప్రదాయ ప్రతిఘాతుకమైన అవగాహనలో, అంటే, **Ananthamurthy had narrated how he had pissed on an idol to prove that the idol had no powers and to rid himself of the fear induced by his traditional upbringing.” ఇలాంటి వైపరీత్య ప్రతిక్రియలలో నుంచి పుట్టిన సృజనాత్మకత (?) ఏదైనా తన సహజ స్వభావమైన పాషాణ నిబద్ధతను వెదజల్లుతూనే వుంటుంది.

   • Srinivas Vuruputuri says:

    On URA’s “urination on idols” – there seems to have been a media created confusion. I didn’t get a chance to read what the man wrote in his book that he wrote in ’90s but I did watch the news reports of late Kalburgi’s speech (available on Youtube). Kalburgi quoted URA to the effect that the latter peed on the evil stones (the Kannada expression sounded like “bhootade kallu” or something to that effect; the evil stones were certainly not idols or “Hindu idols” as some media reports suggested.) in his village when he was young to test if he would really incur their wrath. And I think, he grew out of that. He wished that Kalburgi didn’t talk about it.

    What exactly did you mean by “పాషాణ నిబద్ధత”?

   • నరసింహారావు says:

    “Ananthamurthy wrote about that childhood experience in an essay titled “Bettale Puje Yake Kudadhu”, in which he discusses the idea of sacredness in the context of the nude-worship ritual performed by Dalits at the Chandraguthi temple in Sorab taluk of Shimoga district. Nude worship was banned by the government in the 1980s.

    The statement in question appears on page 39 (in certain editions, and roughly translated as): “I had to breach the Puranic traditions in which I had been brought up. I wanted to ascertain that there was no greater supernatural power than me. So I urinated on the Devva stones of our village. I still remember the fear I had that night. The themes of the stories I wrote in my youth were about the dilemma of transgressing the notion that everything was sacred.”

    “పాషాణ నిబద్ధత” అనేది నా అప్పుతుచ్చు పొరపాటు. అది “పాషాణ నిబంధత” అని వుండాలి. అంటే, నా ఉద్దేశంలో Rock hard conditioned అని. ( నాకు ఆంగ్లం పెద్దగా రాదు) ఒక నిబంధతను వదిలించుకునే క్రమంలో వేరొక నిబంధతలో ఘనీభవించడం.

 14. d.ravindra says:

  మీ విశ్లేషణ , సైధాంతిక సమీక్ష ప్రక్రియ చాలా బావుంది , ఈ నవల~సినిమా పరంగా చూస్తె ఇందులొని కొంత ఇతివ్రుత్తం …బాపు గారి “వంశవ్రుక్షం” సినిమా లొ కూడా వాడుకున్నారెమొ.. !!

 15. భారతీయ భాషలలో అగ్ర స్థానంలో చదివించే ఈ నవల తెలుగు అనువాదం ఎందరికో చదివే అవకాశం ఇచ్చింది.మరో విమర్శ పుస్తకాన్ని ప్రస్తుత కాలచదువరుల దగ్గరకు తెస్తుంది.చదవాల్సిన 5 పుస్తకాల వడిలో ఉండే అద్భుత సృష్టి

 16. కె.కె. రామయ్య says:

  కినిగె మాస పత్రిక జనవరి 1, 2014 సంచికలో ” పొసగని సంస్కారం ” పేరిట రాసిన వ్యాసానికి లింకు ఇఛ్చినందుకు ధన్యవాదాలు ధీర గారు. ( http://patrika.kinige.com/?p=1006 )

  ఒక బ్రాహ్మణ అగ్రహారంలో దైవాన్నీ, ఆచారాల్నీ ధిక్కరిస్తూ, నిరసిస్తూ బ్రతికిన నారాయణప్ప అనేవాడు మరణిస్తాడు. అతనికి భార్యాపిల్లలు లేరు. చంద్రి అనే శూద్ర స్త్రీ మాత్రం అతనితో వుంటూ వుంటుంది. అగ్రహారంలో వున్న ఒకరిద్దరు బంధువులతోనూ అతనికి సంబంధాలు లేవు. ఇపుడు ఆ శవానికి సంస్కారం ఎవరు చేయాలి ఎలా చేయాలి అన్నది పెద్ద ధర్మ సందేహమవడం, అగ్రహారంలోని మహాపండితుడు ప్రాణేశాచార్యతో సహా ఎవరూ దానికి పరిష్కారం చెప్పలేకపోవడం, ఆ శవం కుళ్ళిపోవడం, అగ్రహారమంతా దుర్వాసన వ్యాపించడం – ఇలా మొదలవుతుంది “సంస్కారం” అనే ఈ నవల.

  నారాయణప్ప ప్లేగు వ్యాధితో మరణిస్తాడు. ఆ వ్యాధి అగ్రహారమంతా వ్యాపించి మరికొందరు చనిపోతారు. శవాన్ని ఏం చేయాలన్న సమస్యకి పరిష్కారం మాత్రం దొరకదు.

  ఆ నారాయణప్పకి కాస్త ఆస్తి వుంటుంది. అతనికి సంస్కారం చేసినవాళ్ళకి అది దక్కుతుందన్న ఆశ ఒకపక్క అలాంటి వాడికి సంస్కారం చేస్తే కులభ్రష్టులమవుతామేమోనన్న భయం ఒకప్రక్క ఆ అగ్రహారం బ్రాహ్మణులని పీడించడంతో సమస్య తేలదు.

  నారాయణప్ప బ్రతికున్నంత కాలం పండితుడు, నిష్టాగరిష్టుడు అయిన ప్రాణేశాచార్యని సవాలు చేస్తూ వుంటాడు. అతను చనిపోయాక ఊరంతా సమస్యకి పరిష్కారం కోసం ప్రాణేశాచార్య మీద ఆధారపడుతుంది. కానీ ప్రాణేశాచార్యకి ఏం చెప్పాలో తెలియదు. ధర్మశాస్త్రాలన్నీ తిరగేసి సమాధానం దొరకక దేవాలయానికి వెళ్ళి భగవంతుడి ముందు కూర్చుంటాడు, నువ్వే సమాధానం చెప్పాలి అంటూ. ఆ భగవంతుడేమీ చెప్పడు. ఆకలితో, దిగులుతో ఏడుస్తున్న ఆచార్యులవారిని చీకట్లో పట్టుకుని నారాయణప్ప ఉంపుడుగత్తె అయిన చంద్రి ఓదారుస్తుంది. రోగిష్టి భార్యని కట్టుకుని స్త్రీసుఖం ఎరగకుండా బ్రతుకుతున్న ప్రాణేశాచార్య చంద్రి యిచ్చిన అనుభవంతో ఆత్మశోధన(?) లో పడతాడు. ఈ సంఘటన జరిగిన రాత్రే చంద్రి నారాయణప్ప శవాన్ని ఒక తురక వ్యక్తి సహాయంతో తగలబెట్టించేసి, తన స్వగ్రామానికి వెళ్ళిపోతుంది.

  ఆ విషయం ఎవరికీ తెలియదు. శవం యింకా ఆ యింట్లోనే ఉందనుకుంటూ వుంటారు. ప్రాణేశాచార్య పరిష్కారం చెప్పలేకపోవడంతో మఠానికి వెళ్ళి గురువుగారి సలహా అడుగుదామని అగ్రహారంలోని మగవాళ్ళందరూ బయల్దేరి పోతారు. ఆడవాళ్ళని పుట్టిళ్ళకి పంపుతారు.

  భార్యని వదిలిపెట్టి వెళ్ళలేక ప్రాణేశాచార్య అగ్రహారం లోనే ఉండిపోతాడు. వాళ్ళటు వెళ్ళగానే ఆయన భార్య మరణిస్తుంది. ఆవిడ్ని దహనం చేసి, ఆయన కాళ్ళు నడిపించిన దిశగా నడిచిపోతాడు. దారిలో పుట్ట అనే వ్యక్తి కలుస్తాడు. అతనితో సంభాషణ. ప్రయాణం. రెండు రోజులపాటు ఏవేవో ఆలోచనలు. అనుభవాలు. వాటన్నిటిలోనుంచీ చివరికి ఏదో తెలుసుకున్నాననుకుంటాడు. వెనక్కి వెళ్ళి నారాయణప్ప శవానికి తానే సంస్కారం చేసి, చంద్రి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఉండిపోదామని నిర్ణయించుకుని ఆగ్రహారానికి తిరుగు ప్రయాణమవుతాడు. ఇదీ కథ.

 17. Mandapaka Kameswar Rao raju says:

  చాలా మంచి పరిచయాం..
  బ్రహ్మణుల మడ్య వైరుధ్యాల్ని చాలా చక్కగా చిత్రీకరించిన నవల ఇది..70 ప్రాంతాల్లో రచయితతో వరంగల్లో చర్చలో పాల్గొన్న రోజులు గ్యాపకం వచ్చింది.

 18. B.Simhadri Rao says:

  After the death of U.R.Anantamurty,I have read the novel Samsara published by Oxford University Press which is thought provoking novel and the above review is good.

 19. Dr. Y. Kameswari says:

  Pl visit the link given by Dhira garu and come back. The novel is illogical and hypothetical, it may be fashion to condemn Brahmins , Sashtras, and what ever good from past is considered good. But one has to see if any logic is applied.

 20. Charvakudu Kathi says:

  సుజాత గారు విపులమైన సమీక్ష చేసారు. బావుంది మంచి సమీక్ష ..

 21. కె.కె. రామయ్య says:

  ” అనంతమూర్తి సంధించిన బ్రహ్మాస్త్రo “సంస్కార” నవల తెలుగు అనువాదం సులభంగా లభ్యం కాక పోయినా ఇంగ్లీష్ లో రామానుజన్ అనువాదం ” కి లింకు ఇక్కడ ( గొరుసన్న కోసం )

  https://asian.fiu.edu/about/director/courses-taught/modern-asia/samskara-by-ur-anantha-murthy.pdf

  • తహిరో says:

   నేను చూడాలనుకున్నది దృశ్యాన్ని !

   • సుజాత says:

    పైన నేనిచ్చిన లింకు మీకు ఇండియాలో పని చేస్తుందో లేదో చూశారా

 22. మీరెవరో నాకు తెలియదు కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం వ్యక్తపరచాలనుకొంటున్నాను .
  అనంతమూర్తి సంధించిన బ్రహ్మాస్త్రం అన్నారు .ఎవరి మీదో ఏమిటో తెలియలేదు.ఒకవేళ అది ఆచారాల మీద అని అనుకొంటే అంతమూర్తి గారు ఏమి ఆచారాల మీద యుద్ధం చేసాడో వాటిలో మీరు ఎంతమంది నిష్ణాతులో లేక ఎంతమంది పాటిస్తారో ……మనము పాటించకుండా ఎదుటివాళ్ళు పాటించే ఆచారాలు బహుశా మనకు దురాచారాలుగా అనిపించవచ్చు ఇది మనిషి యొక్క హ్రస్వ ద్రుష్టి లేదా మరొకటి.
  లేదు ఇది బ్రాహ్మణ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఏంటో ఉన్నతమైనది అణగారిన లేదా సంస్కారాలకి మానసిక బానిసలుగా బ్రతుకుతున్న వాళ్లకు ఒక చుక్కాని వంటిది అంటే అది కూడా నేతిబీర చందమె.
  ఎందుకంటే ఏ సంస్కారాన్ని ఎవరి వద్దనుండి గ్రహించాలో అంటే నారాయణప్ప నుండా లేదా ప్రాణేశాచార్యుల నుండా ఇది కవి హృదయం లేదా పాఠకుని దృక్కోణం మీద ఆధారపడినదే కానీ ఒక నీతి కథ లాగ అందరికి ఒకటే నీతి కనపడి ఉండకపోవచ్చు.

  • ప్రియమైన రామయ్య గారికి
   సమయం తీసుకుని జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు.మిలన్ స్వరూప్ శర్మ గారి సమీక్షా చదివాను .పుస్తకాలు చదవడమే ఒక గొప్పవిషయమైతే వ్రాయడం చాల చాల గొప్ప విషయం .ఐతే చదువరులందరు మంచి వ్రాతగాళ్ళు కాక పోవచ్చు అలాగే రాసే వాళ్ళందరూ గొప్ప చదువరులు కాకపోవచ్చు.సంస్కార కధ ప్రపంచ చరిత్ర గతి లేదా భారత దేశం లోని మూఢ ఆచారాలను కూలంకషం గ పెకలించివేసే నవల అని సమీక్షల లో ఉంది.
   సంస్కార నవల సమాజంలోని ఒక వర్గం అదికూడా మిగిలిన సమూహాలతో అంతగా లేదా అస్సలు కలవని ఒక వర్గానికి సంబంధిచినది .ఒక సమూహం యొక్క ఆచార వ్యవహారాలు అందులో ఉండే వాళ్లకు బాగా తెలుస్తాయి కనుక అనంతమూర్తి గారు అవి కావాలంటే వ్యక్తీకరించగలరు లేదా వక్రీక రించగలరు.విసుగు అని అనుకోకపోతే ఒక చిన్న ఉదాహరణ .మనిషి మరణించిన తరువాత కొన్ని సమూహాలలో భూమిలో పాతిపెడితే కొంతమంది దహనం చేస్తారు కొంతమంది శరీరాన్ని రాబందులు వదిలి వేస్తారు మరికొన్ని చోట్ల శరీరాన్ని ముక్కలుగా చేసి రాబందులవంటి వాటికీ ఆహరం గ పెడతారు.ఇది కేవలం అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఎలాగంటే .టిబెట్ వంటి ప్రదేశాలలో దహనం లేదా భూ స్థాపితం రెండు సాధ్యపడవు.ఇప్పుడు భూస్థాపితం చేసే ఆచారాలున్న వాడు హిమాలయ ప్రాంతం లో చని పొతే , వాడిని భూస్థాపితం చేస్తే పరిస్థితి ఊహించండి.
   ఇక్కడ కూడా ఒక సమూహపు ఆచారాల మీద వ్రాసిన నవల ఇది.అంతేగాని ఒక విశ్వ జనీనమైన సత్యం కాదు.ఆచారం అంటే ఆచరణీయమైనదే అని నా అభిప్రాయం.అది దేశ కాల మాన పరిస్థితులమీద ఆధారపడి ఉటుంది.
   మరలా కలుద్దాం .
   మిత్రుడు

   • కె.కె. రామయ్య says:

    ప్రియమైన శ్రీ చక్ర గారు,

    ” కులం వల్ల … (జాతి, మతం, కులం, సాంఘిక, ఆర్ధిక నేపధ్యాల వల్ల) … తమకు సంక్రమించాయని చెప్పుకుంటున్న ఉత్తమ సుగుణాలూ, ధార్మిక లక్షణాలూ, నైతికతా ఇవన్నీ అబద్ధాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే మనిషి ప్రవర్తన మాత్రమే నిజం!ఇదే ఈ నవల మొత్తం వ్యాప్తమై కనిపిస్తుంది ” అని విశ్లేషించిన సుజాత గారి వాక్యాలు ఆలోచింపజేస్తున్నాయి.

    అంతే కానీ ఇది కేవలం నారాయణప్ప శవానికి అంతిమ సంస్కారం కి సంబందించిన విషయం గా చూడగూడదనిపిస్తున్నది.
    ప్రాణేశాచార్యుల వారి అంతరంగ మథనం, ఆత్మ విమర్శ, తదుపరి ప్రయాణం, సంస్కార నవలకు ఆయువు పట్టు కదా. ఆ దృష్ట్యా సంస్కార నవలకు ప్రాధాన్యత ఉన్నది.

    ధన్యవాదాలతో

 23. మంచి సమీక్ష & పరిచయం. శుభాభినందనలు!

 24. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు అద్భుతంగా …పాత్రలతోపాటు మేమూ ఉన్నట్టుగా అనిపించేలా .చాలా బాగా రాసారు.

 25. కె.కె. రామయ్య says:

  ఆవొక్కటీ అడక్కు అనే ధైర్నం లేదు తహీరో గోరండి.
  ప్రింటు పేజీలు సరే, 24 ఫ్రేమ్స్ “దృశ్యం” ఎక్కడ అంటే
  క్రింద ఇవ్వబడిన యూట్యూబు లింకులో చూడుడి అనే కంటే
  బెంగుళూరు “మాక్స్ ముల్లర్ భవనం” వాళ్ళ నడిగి ఓ DVD కాపీ తీసుకుని అంపిస్తే మంచిదనిపిస్తోంది.

  https://www.youtube.com/watch?v=etFi-హెక్యూయ్లక్

  “సంస్కార” సినిమా డౌన్లోడ్ కోసం సుజాత గారు ఇచ్చిన వెబ్సైటు విండియాలో పనిచేయటం లేదు.

  వీటి కన్నా ముఖ్యం Chakra గారి ప్రశ్నలకి సమాధానం సంపాదించాలి.

 26. కె.కె. రామయ్య says:

  చక్ర గారు దయచేసి ఈ చిన్న వివరణ ని పరీశీలించరా :

  Rituals in Conflict with Modernization: A Critical Perspective on U.R. Ananthamurthy’s Samskara
  by MILAN SWAROOP SHARMA

  The novel Samskara is an accurate estimate of brahmin society in the sixties or more correctly the brahmin societies of all times which suffer the serious problems of backwardness despite having intellectuals among them. Reason behind all silly problems that emerge is that their energy is directed by age-old convictions, beliefs, customs, traditions and superstition. Ananthamurthy raises questions on very sensitive issues like rituals, samskara, untouchability, sex, community feeling. He scans human weakness such as greed, lust and lack of human concern in the Brahmin community. Ananthamurthy’s characters favour freedom from the life in shackles of ritualistic performances. Naranappa the rebel character is anti brahminical in deeds ,but Praneshacharya who earned the title ‘the crest jewel of vedic learning’ rejects the double standard thinking after the death of his wife Bhagirathi. He wants to settle his life with Chandri a prostitute. The sudden death of Naranappa brings the real examination of Acharya’s ideals, learning, and wisdom. This event brings a real man out of Acharya’s being, burdened with suffocating scriptural knowledge. He wants to live like an ordinary man neither a righteous brahmin nor the crest jewel of vedic learning.

 27. పొసగని సంస్కారం

  http://patrika.kinige.com/?p=1006

  ముఖ్య పాత్ర ప్రాణేశాచార్యే మనకి ప్రపంచంలో ఎక్కడా ఎప్పటికీ కనబడే అవకాశం లేని పాత్ర. వైరుధ్యానికి పరాకాష్ట. ఈయన గొప్ప పండితుడు. కాశీలో సంస్కృతం అభ్యసించాడు. అక్కడ వేదాంతం చదువుకుని వచ్చి దక్షిణ భారతమంతా పేరుగాంచిన వేదాంత శిరోమణి. కానీ ఆయనకి నారాయణప్ప శవాన్ని ఏం చేయాలి అనే చిన్న విషయం తెలియదు!!

  తెలియదు అని పూర్తిగా అనడానికీ లేదు. ఎందుకంటే అందరూ ఒకచోట చేరగానే ఆయన నోటినుంచి మొదట వచ్చిన వాక్యం “సంబంధీకులు లేకపోతే ఏ బ్రాహ్మణుడైనా చేయొచ్చని ధర్మశాస్త్రం చెప్తోంది.” అన్నదే.

  అంత చిన్న విషయం తర్వాత సమస్య ఎందుకు అయింది అన్న విషయమే హేతుబద్ధంగా వుండదు. నారాయణప్ప సాలగ్రామాన్ని వీధిలోకి విసిరి కొట్టాడని, మద్యమాంసాలు స్వీకరించాడనీ, శూద్ర స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడనీ ఇవన్నీ ప్రాణేశాచార్యకీ తెలుసు. దానితో పాటూ అతనికి పిల్లల్లేరనీ, బంధువులతో సంబంధాలు లేవనీ కూడా తెలుసు. తెలిసే ఆ పరిష్కారం చెప్పాడు. మరి మళ్ళీ అది సమస్య ఎందుకవుతుంది? తెలుసు కానీ ఒక్క క్షణం మర్చిపోయాడు. మర్చిపోయి మామూలుగా పరిష్కారం చెప్పేశాడు, కానీ అందరూ నారయణప్ప భ్రష్టుడయ్యాడన్న విషయాన్ని గుర్తు చేయడంతో సంకటంలో పడ్డాడు అనుకుందామా అంటే – అందరూ గుర్తు చేశాక కూడా “… వాడు బ్రాహ్మణీకం వదిలేసినా వాణ్ణి బ్రాహ్మణీకం వదల్లేదు. వాడికి బహిష్కరణ వెయ్యలేదు. శాస్త్రోక్తంగా వాడు బహిష్కృతుడు కాకుండానే చావడం వలన వాడు బ్రాహ్మణుడిగానే చచ్చినట్లు లెక్క…” అని అపుడూ మళ్ళీ స్పష్టంగానే చెప్తాడు.

  మరి ఇక సమస్య ఏమిటి? తెలీదు. నవల నడవడానికి ఒక సమస్య కావాలి కనుక రచయిత దానిని “సమస్య” చేశారు అని అర్ధమవుతూనే వుంటుంది

 28. చక్కటి సమీక్ష. ఆలోచింపచేసేదిగా ఉంది.సుజాతగారికి ధన్యవాదములు మంచి నవలను పరిచయం చేసినందుకు

 29. ప్రియమైన రామయ్య గారికి

  “” కులం వల్ల … (జాతి, మతం, కులం, సాంఘిక, ఆర్ధిక నేపధ్యాల వల్ల) … తమకు సంక్రమించాయని చెప్పుకుంటున్న ఉత్తమ సుగుణాలూ, ధార్మిక లక్షణాలూ, నైతికతా ఇవన్నీ అబద్ధాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే మనిషి ప్రవర్తన మాత్రమే నిజం! ””

  ఆమనిషి ప్రవర్తనే ఆచారంగా వ్యవహరింప బడుతుంది
  మనుషులని కలిపేవి నిలిపి ఉంచేవి ఇవేకదా

  అద్భుతమైన వాక్యాలు .మానవ జీవన సంఘర్షణ అంతా దీని చుట్టూనే కదా తిరిగేది .
  పోరాటాలు ఆరాటాలు అంతా వీటిగురించి కదా
  రావాలనుకొంటున్న మార్పు తేవాలనుకొంటున్న మార్పు అంతా ఇదేకదా
  ఆ సమాజం కోసమే అందరు లేదా కొందరు లేదా నేను చూసేది

  నేను కూడా ఈ అంశమే లోపించిందని అనుకొన్నాను నవలలో
  ధన్యవాదాలు
  మరో సమీక్ష ఏదయినా వుంటే అందులో కలుద్దాం
  మిత్రుడు
  chakra

మీ మాటలు

*