ఓ జాబిలి…ఓ వెన్నెలా…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

ఒంటరి ఆకాశంలో
నువ్వున్నప్పుడు
జంటగా నిన్ను చూస్తూ
చలించిపోతుంటా!

 

మౌనంగా కళ్ళు
నీ వెన్నెల నింపుకుని
మాటలకందని భావాలు
ఊయలలూపుతుంటే
మనసును తడుముతూ
నన్ను చూస్తూ

 

తెలియనట్టుగా
మబ్బులచాటుకు వెళ్ళిపోతావు చూడూ!
అక్కడే తపన!!

 

నిన్ను వెదికేందుకు
మల్లె తీగలను బ్రతిమాలుకుంటా
పువ్వుల వాన కురిపించమని!

విరజాజులతో జాతర నవుతా
నీ ఆనవాళ్ళను రప్పించడానికి!

 

పచ్చని చెట్ల కొమ్మల చాటున
దిగులుగా ఒదిగిపోయి
నీకై యెదురుచూసే విపంచినవుతుంటా!

 

లోపలి వినీలాకాశంలో
విశాల కాంక్షలలో
ఎప్పుడో
నన్నెప్పుడో నీవెన్నెల కౌగిట్లో
బంధించిన జ్ఞాపకాలను నెమరువేస్తూ
వలపుల తలపులలో ప్రేమగీతికనవుతుంటా!

 

మబ్బు తెరలను తుంచుకొని
నువు మనో విహంగమై చేరినప్పుడు
కాసింత కన్నెర్రజేసినా
లోలోపల నవ్వుకుంటా!

 

నీప్రేమపూర్వక ఆహ్వానంలో
తన్మయత్వంలో కరిగిపోయి
మరోమారు దూరమవకుండా
మనసుతోనే నిను కట్టేస్తా!

 

పిల్లగాలిలా చల్లగా వచ్చి చేరుతావు!
చిరునవ్వులు కురిపిస్తావు
మబ్బులను తరిమే
మహోన్నత వ్యక్తిత్వానివవుతావు

 

నీమాటలతోటలో
పదాల పల్లవినై
పెదవులపై వాలే
నవ్వులను …నిన్నూ వదిలి నడిచినా
నువ్వు నాలో తోడై నడిచే సుగంధానివి
వెన్నెల కౌగిళ్ళ వాకిళ్ళు తెరచే
నా ఉఛ్చ్వాసానివి!
కరచాలనానికి అందనంత చీకటిని
వెలుగుగా మార్చే నా ప్రియతమ హృదయానివి!
నాలోని కవితాంతరంగానివి!

*

మీ మాటలు

  1. బావుంది కవిత

  2. kolluru siva says:

    గుడ్ గుడ్

మీ మాటలు

*