అసలు  ‘హక్కుదార్లు’ యెవరు ?

painting: Rafi Haque

painting: Rafi Haque

 

“అమ్మా నాకు చలి వేస్తుందే , మంట వేయవూ?”

“నాయనా బొగ్గులు లేవురా”

“అమ్మా బొగ్గులెందుకు లేవే?”

“మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ!”

“నాన్నకు పనెందుకు పోయిందమ్మా?”

“బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!”

_ రాషెస్డల్

యెంతో వింతగానూ వైరుధ్యభరితం గానూ మినీ కథలానూ వున్న యీ ఆర్ధిక విశ్లేషణ మన సింగరేణికి అతికినట్టుగా సరిపోతుంది. అందుకే గత మూడున్నర దశాబ్దాలుగా సింగరేణి సామాజిక ఆర్ధిక శాస్త్ర వేత్తలకి  అధ్యయన వేదిక అయ్యింది. అక్కడి సమాజం రచయితలకి సాహిత్య పాఠశాల అయ్యింది. 1981 లో బొగ్గు గనుల్లో యాభై ఆరు రోజుల పాటు జరిగిన చారిత్రిక సమ్మె దరిమిలా  సింగరేణి కార్మికుల ‘బండ కింది బతుకులు’ సాహిత్యంలో వస్తువు లయ్యాయి. ‘బొగ్గు పొరల్లో …’ మొట్టమొదటిసారిగా ‘నల్లకలువ’ లెన్నో వికసించాయి. రాజయ్య  , రఘోత్తం రెడ్డి, పి చంద్ వంటి రచయితల సామూహిక కర్తృత్వంలో (కార్మిక పేరుతో ) , సొంత పేర్లతో  కార్మికోద్యమ కథలెన్నో వెలువడ్డాయి. హక్కుల కోసం , మెరుగైన జీవితం కోసం సెమ్మాసులు పట్టిన కార్మికుల చైతన్యం ‘నల్లవజ్ర’ మై  మెరిసింది. క్రూర నిర్బంధాల నేపథ్యంలో కార్మికుల్లో పోరాట స్ఫూర్తి నింపిన  ఆ నాటి సాహిత్యం అపూర్వమైనది.

తర్వాతి కాలంలో ’90ల్లో మొదలైన నూతన ఆర్ధిక సంస్కరణలు గనుల్లో ప్రైవేటీ కరణకి దారులు వేశాయి. ప్రభుత్వాల బొగ్గు పాలసీలు కాలరీల్లో పెను మార్పులు తెచ్చాయి. కార్మికుల మెడ చుట్టూ కనిపించని వురితాళ్ళు పేనాయి. అణచివేత – అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహాన్ని కంపెనీ అమలుపరచింది. ప్రైవేటు కాంట్రాక్టర్లకి రెడ్ కార్పెట్ పరిచింది. ఔట్ సోర్సింగ్ కంపారటీవ్ అడ్వాంటేజ్ అని నమ్మి- నమ్మించి ఆచరణలో పెట్టింది. అవుట్ సోర్సింగ్ ని ‘ఒక కిల్లర్ అప్లికేషన్ గా – ఒక పనసియా (సర్వరోగనివారిణి) గా ప్రచారం చేసింది. డిపెండెంట్ వుద్యోగాల్ని కూడా రద్దు చేసింది. కార్మికులు రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళని తీసుకోవడం మానేసింది. ఓపెన్ కాస్ట్ ల సంఖ్యని పెంచి  వాటిలో భారీ యంత్రాలని దించింది.  కార్మికులకు పని యివ్వకుండా నిర్వ్యాపారులుగా కూర్చోబెట్టి కృత్రిమమైన సర్ప్లస్ మేన్ పవర్ ని సృష్టించింది. వాళ్ళ శక్తిని మరో చోట ఉపయోగించుకొనే అవకాశం వున్నప్పటికీ వోవర్ బర్డెన్ రిమూవల్ తో పాటు నెమ్మదిగా వొక్కో రంగాన్నీ ప్రైవేటైజ్ చేస్తూ పనులు కాంట్రాక్టర్లకి అప్పజెప్పింది. సంస్కరణల హేతుబద్ధతని ప్రశ్నించే వాళ్ళపై  తీవ్రవాద ముద్ర వేసి అణచివేతకి పూనుకొంది. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని వారితోనే వొప్పందాలు  చేసుకొంటూ మిలిటెంట్ స్వభావంతో పనిచేసే  సికాస లాంటి సంఘాలని నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రచించింది.

1 లక్షా 20 వేలు వుండే కార్మికుల సంఖ్యని  సగానికి పైగా కుదించివేసి లాభాల బాటలోకి నడిపిన గత పదిహేనేళ్ళ చరిత్ర రక్త సిక్తమై  యెంత అమానవీయంగా వుందో తెలియజేస్తూ  పి చంద్ లాంటి రచయితలు కథలు  (జులుం) , యండి మునీర్ లాంటి వాళ్ళు వ్యాసాలు  రాశారు. అయితే యీ క్రమాన్ని మరో దృష్టికోణం నుంచి పరిశీలించిన కథ  ఎం. రఘువంశీ రాసిన ‘హక్కుదార్లు’. ( అరుణతార : ఆగస్ట్ 2016)

[ కథ లింక్ : http://www.virasam.in/article.php?page=223  పే.11-20 ]

“వచ్చిన లాభాల పంపకం వాటికి కారణమైన వాళ్ళ మధ్య సజావుగా ఉందా ? అసలు వాటాదార్లు ఎవరు?” అని ప్రశ్నిస్తుంది యీ కథ. అసలు నష్టాల్లో నడిచే కంపెనీ లాభాల్లోకి యెలా ప్రవేశించింది? ఆ క్రమంలో యెవరి పాత్ర యెంత? శ్రమ యెవరిది ? సిరి యెవరిది? వాటాలు పంచుకొనే దారిలో కార్మికుల్లో యెటువంటి  మార్పులు వచ్చాయి? కార్మిక సంఘాల ధోరణి ఏమిటి? కంపెనీ క్షేమం – కార్మిక సంక్షేమం మాటల నిర్వచనాలు యెలా మారిపోయాయి? సంస్కరణల అమల్లో యాజమాన్యాల కాంట్రాక్టర్ల విధానాలేంటి? మిడిల్ మేనేజ్ మెంట్ లో అధికారుల రోల్ ఏంటి? ఈ అంతటిలో పాలకుల వైఖరి ఏంటి?పబ్లిక్ రంగ సంస్థ ప్రాథమిక లక్ష్యం లాభార్జనేనా? దాని సామాజిక బాధ్యతలేంటి? కంపెనీ అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధికి యే మేరకి దోహదం చేసింది? ఈ క్రీ నీడలో మగ్గి పోయిందెవరు ? అందరూ పల్లకిల్లో వూరేగుతున్న పంచరంగుల స్వప్నావిష్కారంలో అసలు బరువు మోసిందెవరు? మేక్రో లెవల్లో ప్రపంచీకరణకు మైక్రో లెవల్లో సింగరేణి యెలా అద్దంగా నిలబడింది? … యిలా సవాలక్ష ప్రశ్నలకు వొక సాహిత్య రూపం యివ్వడం అందునా వాటికి సమాధానాలు వెతికే బృహత్ కార్యాన్ని వొక  కథలోకి కుదించే ప్రయత్నం సాహసమే. ఆ సాహసాన్ని యిష్ట పూర్వకంగా యెత్తుకొన్న రచయిత రఘువంశీ. ఈ పేరు యింతకు ముందు విన్నది కాదు. కథా వస్తువు , కథా రచన అతనికి కొత్త కాదు అనిపిస్తుంది. కథ రాసింది చేయి తిరిగిన యిన్ సైడ్ రచయితేనేమో అని  అనుమానం కలుగుతుంది. కథ నడిపిన తీరు కూడా దాన్నిబలపరుస్తుంది.

కథని కార్మికులవైపు నుంచీ గాక మిడిల్ మేనేజ్ మెంట్ లో పనిచేసే ఉద్యోగుల దృష్టి కోణం నుంచీ నడిపి పై ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం మరీ కత్తి మీద సాము లాంటిదే. ఆ సాములో  రచయిత యే మేరకు సఫలమయ్యాడో చూద్దాం.

లాభాల్లో కార్మికుల వాటా నిర్ధారించడానికి మెయిన్ ఆఫీసులో మేనేజిమెంట్ గుర్తింపు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి మీటింగ్ పెట్టుకొనే సమయానికి (సంస్థ లాభాలు గడించడం మొదలైన తొలి నాళ్లలో లాభాల్లో కార్మికుల వాటా పది శాతం వుండగా రాను రానూ అది  యిరవై శాతం వరకూ పెరిగింది. ఈ సంవత్సరం అది 23 శాతం) ఆఫీసు ముందు ఔట్ సోర్స్డ్ కార్మికులు ధర్నాకి దిగడం దగ్గర కథ మొదలైంది. ధర్నా కారణంగా ఆఫీసులోకి పోలేని ఆఫీసర్లు , ఉద్యోగులు, రెగ్యులర్ కార్మికులు చిన్న చిన్న గుంపులుగా బయట యే చెట్టు నీడనో కూర్చొని ధర్నా పూర్తి కాగానే లోపలోకి పోదామని యెదురు చూస్తుంటారు.

వాళ్ళలో అన్ని స్థాయీలకి చెందిన వాళ్ళున్నారు.  మే డే  ఫ్లెక్సీ మీద కూర్చొని స్మార్ట్ ఫోన్లలో విమన్స్ డే ఫోటోలు చూసుకొంటూ ముచ్చట్లు పెట్టుకొనే ఉద్యోగినులున్నారు. రావాల్సిన ప్రమోషనో కోరుకొన్న పోస్టింగో  రాక మేనేజిమెంట్ మీద అలిగిన ఆఫీసర్లున్నారు. మీడియా కెమెరా ముందు స్లోగన్లు యిచ్చి  కవరేజి అయిపోయాకా ధర్నా చేసే వాళ్ళు సర్దుకుపోతారని భావించే అత్యాధునికులున్నారు.  అమెరికాలో వున్న  కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో పోయొచ్చి అక్కడి నుంచీ తెచ్చుకొన్న వస్తువుల్ని ప్రదర్శించుకొనే క్లర్క్ లున్నారు.

యెవరి సామాజిక నేపథ్యాలు వాళ్ళకున్నా కళ్ళ ముందు జరిగే ధర్నా పట్ల వాళ్ళ వైఖరి మాత్రం వొక్కటే. నిర్లిప్తత. దాన్ని ఎష్టాబ్లిష్ చేయడానికి రచయిత చక్కటి వాతావరణం సృష్టించాడు.  మే డే వుమెన్స్ డే వేడుకలుగా కేవలం వుత్సవాలగానో మొక్కుబడి కార్యక్రమాలగానో  పరిణమించిన వైనం వంటి కథాంశానికి పనికి వచ్చే యెన్నో విషయాలు వాతావరణ వర్ణన ద్వారా ప్రతీకాత్మకంగా వ్యక్తమయ్యాయి.

అయితే ఔట్ సోర్స్డ్ కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల సానుభూతి , వాళ్ళ  డిమాండ్ లో న్యాయ బద్ధత పట్ల సహానుభూతి వున్న సీనియర్ ఆఫీసర్లు కూడా అక్కడ వున్నారు. వాళ్ళ మాటల్లో  సంస్థ పని తీరు గురించి యెన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతుందన్న స్పృహ కూడా వాళ్లకు వుంది. దాన్ని అర్హులందరికీ  పంచకుండా స్వార్థంతో తామే  అనుభవిస్తున్నామన్న అపరాధ భావనకూడా వుంది (ఒక విధంగా అటువంటి అపరాధ భావనే నాతో యీ వ్యాసం రాయిస్తోంది). హెచ్ ఆర్డీ లో పని చేస్తున్న సుదర్శన్ ఆలోచనల కేంద్రంగా చర్చ నడుస్తుంది. అదే డిపార్ట్ మెంట్ లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ చర్చల్లో వ్యక్తమైన  ఆలోచనల్ని తార్కికంగా విశ్లేషిస్తూ పబ్లిక్ రంగ సంస్థల లక్ష్యాల్ని నిర్వచిస్తూ ప్రగతిశీల భావజాలంతో వచ్చిన మార్పుల పట్ల సమగ్ర దృష్టి  ప్రదర్శిస్తాడు.  ఫైనాన్స్ అధికారి చక్రపాణి సమస్యలోని ఆర్ధిక కోణాల గురించి సందేహాలు లేవనెత్తుతూ వుంటాడు. వయస్సులో అనుభవంలో జూనియర్ అయిన ఎకనామెట్రిషియన్ ప్రతిభ మధ్యలో ప్రశ్నలు సంధిస్తూ వుంటుంది. సుబ్రహ్మణ్యం మోహన్ రావు లాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచీ మాటలు అందిస్తూ వుంటారు. వీళ్ళందరి మాటల్లో కార్మికోద్యమాల నేపథ్యంగా సంస్థ గత చరిత్ర  వర్తమాన పరిస్థితుల  మధ్య సేతు నిర్మాణం జరుగుతూ వుంటుంది.

ధర్నాలతో సమ్మెలతో పని స్తంభింప జేయలేమని ధర్నా చేస్తున్న వాళ్ళకి తెలుసు. బయట చెట్ల కింద కూర్చున్న ఆఫీసర్లు కొందరు  లాప్ టాప్ ల ద్వారా ఆన్ లైన్లో ఆఫీసు పని చేస్తూంటారు. వెన్యూ మార్చుకొన్న మీటింగ్ తో సహా  యేదీ ఆగలేదు.

లాప్ టాప్ లు వర్చ్యువల్ ఆఫీసులు నడపొచ్చేమో గానీ బొగ్గు తవ్వలేవని కూడా ధర్నా కార్మికులకు తెలుసు. ‘తుపాకులు బొగ్గు తొవ్వలేవని నల్లటి బొగ్గుతో రాసిన గోడమీది నినాదం మసకబారిందేమో గానీ వాళ్ళ మనసుల్లో నుంచీ మాత్రం చెరిగిపోలేదు. ‘టోపీల వర్తకుడు – కోతుల కథ లో లాగా వర్తకుడికే కాదు ; కోతులకూ వాళ్ళ తాత తమ అనుభవాలు , జరిగిన చరిత్ర చెబుతాడుగా !’ అని ఆ సందర్భంలో  రవిప్రసాద్ చేసిన  వ్యాఖ్యానం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ రాబోయే చర్చలో అతని మాటల విలువని అంచనా కట్టడానికి తోడ్పడుతుంది.

కంపారటీవ్ అడ్వాంటేజ్ ప్రిన్సిపుల్ పేర్న అమల్లోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ కొందరికే అడ్వాంటేజ్ గా పరిణమించడం గురించి , కార్మికులకీ మేనేజిమెంట్ కీ మధ్య వొకప్పటి ఘర్షణాత్మక వైఖరి పోయి  లాభాల పంపకాలు మొదలయ్యాకా  నెలకొన్న సామరస్య విధానాల  గురించి ,  ట్రేడ్ యూనియన్ల మారిన  ప్రాధమ్యాల గురించి,  ప్రైవేట్ కాంట్రాక్టర్ల యాజమాన్యపు పని తీరు  గురించి , లాభార్జనలో భాగంగా కార్మికుల సంఖ్యని తగ్గించడంలో చేపట్టిన చర్యల గురించి , ఉపరితల గనుల గురించి , మెకనైజేషన్ గురించి , ఉత్పత్తి పెంపు గురించి , పర్యావరణ పరిస్థితుల గురించి అనేక విషయాలు వారి మాటల్లో చర్చకు వస్తాయి.

ఇవ్వాళ మేనేజిమెంట్ కీ  కార్మికులకీ మధ్య వైరుధ్యాలు తొలగిపోయి సయోధ్య సామరస్యాలు ఏర్పడడంతో యిద్దరికీ  విన్ విన్ సిట్యుయేషన్ లా కనిపిస్తుంది అని వొకరంటే అది  ‘దొంగలూ దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్టుంది’ అని గనుల్లో పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన  సుబ్రహ్మణ్యం తన భాషలో బదులిస్తాడు .

తన పాతికేళ్ళ వుద్యోజీవితాన్ని వొక్క సారి వెనక్కి తిరిగి చూసుకొన్న సుదర్శన్ కి సంస్థ గమనమంతా కళ్ళముందు కదలాడింది. జరిగిన సంఘటనల సారాంశం చూస్తే అతనికి యేదీ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించలేదు. అతనిలో యెన్నో సమాధానాలు తెలిసిన ప్రశ్నలే పునరావృతమౌతూ వుంటాయి.

సంస్కరణల అంతరార్థం అతనికి తెలుసు.  స్వచ్ఛంద పదవీ విరమణ(వి ఆర్ ఎస్) స్వర్ణ కరచాలనాలు (గోల్డెన్ షేక్ హాండ్స్) వంటి పథకాల అమలు ద్వారా ‘మిగిలిన ఉద్యోగ కాలంలో వచ్చే జీతాల కన్నా ఇవ్వజూపే పరిహారం ఎక్కువయ్యింది’. అయినా కంపెనీ వాటిని అమలు చేసింది. ఆ కార్మికుల ఉద్యోగుల స్థానంలో ఔట్ సోర్స్ కార్మికుల్ని తీసుకొంది. ఆ రోజోల్లో ఉత్పత్తి ఉద్పాదకత యంత్రీకరణ లాభాలు అన్న మాటలు తప్ప యాజమాన్యం కార్మికుల దృష్టి యితర విషయాల మీదికి పోకుండా వూదరగొట్టింది. అయితే ‘గనుల్లో కార్మికులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న మాన్ రైడింగ్ సదుపాయాలూ . షాఫ్ట్ లు ఏర్పాటు అవుతూ వచ్చాయి. సెమి మెకనైజేషన్ లో భాగంగా భూగర్భ గనుల్లో చిన్న స్థాయి యంత్రాలు వచ్చాయి. గని కార్మికులకు పీడకల లాంటి భుజాలపైనో తలపైనో తట్టలో ఖనిజం మోసే పని దగ్గర దగ్గర అంతర్ధానమైపోయింది.’ 80 ల్లో సింగరేణి కార్మిక కథల్లో రచయితలు వర్ణించిన దుర్భర పరిస్థితులు యిప్పుడు లేవు.

ఇదంతా – సంస్కరణల వల్లే జరిగిందని మేనేజిమెంట్ గొప్పగా చెప్పుకోవచ్చేమో గానీ – దశాబ్దాల పాటు కార్మికుల పోరాటాల ఫలితమే. ఉద్యమాల ద్వారా సాధించిన విజయమే.

ఈ విషయాన్ని కూడా రచయిత స్పష్టంగానే చెప్పాడు. ‘ ఇప్పుడున్న చట్టాలు … అందులోనూ కార్మిక చట్టాలు గమనిస్తే అనేక డిమాండ్ల ద్వారా … పోరాటాల ద్వారా ఇప్పుడున్న స్థితికి వచ్చాయి.’ అని పేర్కొంటాడు. అదేవిధంగా  సంస్థను అభివృద్ధిబాటలో నడిపించడానికి కార్మికుల హాజరు శాతం పెంచడం , ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం , ఉత్పత్తి వ్యయం తగ్గించడం , యంత్రాల సామర్థ్యం పూర్తిగా వినియోగించడం వంటి సంస్కరణలు ఉడత సాయం లాంటివేననీ , ‘కృష్ణుడు చేసిన సాయం లాంటిది మాత్రం అవుట్ సోర్సింగేనని’ సుదర్శన్  నిర్మోమాటంగా  ప్రకటించాడు. ఆ గొంతు రచయితదే. సుదర్శన్  అవగాహనే రచయిత దృక్పథం.

అయితే కార్మికుల సంఖ్య కుదించడంతో మిగిలివున్న వారికి  వసతులు సౌకర్యాలు పెరిగాయి. ఒకప్పుడు నీటికోసం నీడకోసం గనుల్లో రక్షణ కోసం  కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితులుండేవి. పర్మినెంట్ కార్మికుల జీతాలతో గానీ సదుపాయాలతో  గానీ పోల్చి నప్పుడు  ఔట్ సోర్స్డ్ కార్మికులు యెంత దోపిడీకి గురవుతున్నారో తెలుస్తుంది (ఔట్ సోర్స్డ్ కార్మికుల జీతం కంటే కంపెనీ కార్మికుల జీతం యెనిమిది రెట్లు యెక్కువ) .

ఈ క్రమంలో అన్ని విధాల  బాగుపడి బలిసిపోయింది  మాత్రం కాంట్రాక్టర్లే అన్నది జగమెరిగిన సత్యమే కానీ సంస్థ సాధించలేని దాన్ని వాళ్ళెలా సాధిస్తున్నారన్నదే తేలని నిగ్గు.

ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ , యెంతో పెద్ద సెటప్ , దశాబ్దాల అనుభవం , ప్రొఫెషనల్ మానేజిమెంట్ , డెవలప్ మెంట్ ప్రోగ్రాములు , ట్రైనింగులు , విదేశీ స్టడీ టూర్లూ చేయలేని చేయించుకోలేని పనిని యే మాత్రం అనుభవం లేని కాలేజి డ్రాపవుట్ కాంట్రాక్టర్ – కెపాసిటీ తక్కువ మెషీన్లతో తక్కువ ఖర్చుతో  క్వాలిఫైడ్ కాని వాళ్ళతో సాంకేతిక నైపుణ్యం లేనివాళ్ళతో  చిన్న సైన్యంతో చాలెంజి చేసి యెలా సాధించగలుగుతున్నాడన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మిడిల్ మేనేజ్ మెంట్ ని సైతం తొలుస్తూనే వుంటుంది. కాంట్రాక్టర్ అనుసరించే పద్ధతుల్నే కంపెనీ కూడా ఫాలో అవ్వొచ్చుగా అంటే సమాధానం లేదు. లోపం ఎక్కడ వుంది? చేసే వాళ్ళలోనా – చేయించుకొనే వాళ్లలోనా ? కార్మిక వర్గ ప్రతినిధి అడిగే ప్రశ్నకి సమాధానం యిచ్చే నాథుడు లేదు.

అనేకమంది సృష్టించింది అందరూ అనుభవించాలి కానీ సంపద సృష్టించినవాడికి దక్కకుండా వొకరే అనుభవించడం  – యాజమాన్యం వొకప్పుడు – ఆ స్థానంలో మరికొంత మంది కార్మిక వర్గానికి చెందినవారు కూడా తోడవ్వడంతో  కార్మిక సమైక్యతకి పెద్ద విఘాతం ఏర్పడింది. కార్మికుడు మధ్యతరగతిగా యెదిగి తన మూలాలు మర్చిపోయి  పెటీ బూర్జువాగా తయారయ్యాడని కూడా రచయిత కథలో గుర్తించాడు.

కార్మికులు , చిన్న స్థాయి ఉద్యోగులు ‘నీడ్స్ హైరార్కీలో ఒక స్టెప్ పైకెళ్ళారు. ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు…  టేబుల్ కి ఆపోజిట్ సైడులో ఉండవలసిన వాళ్ళు రెండో వైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మానేజిమెంటు పనిచేయించేది అనుకుంటే కార్మికులు పనిచేసేవారు. కొద్ది మినహాయింపులతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పనిచేయించే వాళ్ళయ్యారు. అవుట్ సోర్సుడు కార్మికులు పనిచేసున్నారు.’ కార్మికులూ కార్మిక నాయకులూ వర్గస్పృహ కోల్పోయారనీ వాళ్ళ వర్గస్వభావమే మారిపోయిందనీ రచయిత రవిప్రసాద్ ముఖత: చెప్పిన మాటల్లో  నిజం బాధించినప్పటికీ  అతని  విమర్శనాత్మక దృష్టిని కాదనలేం.

‘ప్రపంచాకార్మికులారా ఏకం కండు’ అని నినదించే ట్రేడ్ యూనియన్లు తోటి కార్మికుల కష్టాలకు స్పందించని స్థితికి చేరుకొన్నాయి. దేశంలో ట్రేడ్ యూనియనిజం వూబిలోకి స్వచ్ఛందంగా దిగిన   కార్మికులు  వేతనశర్మలుగా మారారు. సింగరేణి అందుకు మినహాయింపు కాదు.

 ‘ఎలెక్టయిన యూనియన్ నాయకులు ఆల్ మోస్ట్ ఒక డైరెక్టరు హోదా అనుభవిస్తున్నారు. ఎస్ యూ వీ ల్లో తిరుగుతూ,  ఒక ప్రజా ప్రతినిధికో , పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం , డ్రెస్సింగు , బాడీ లాంగ్వేజ్ తో అనుచచరగణంతో కనిపిస్తున్నారు’ .

రఘువంశీ పేర్కొన్న యూనియన్ నాయకుల యీ ధోరణిని ’80 ల్లో వచ్చిన కార్మిక కథల్లోనే రచయితలు తీవ్రంగా  అసహ్యించుకొన్నారు. చైతన్య వంతులైన కార్మికులు వారికి బుద్ధి చెప్పడం కూడా ఆ కథల్లో కనిపిస్తుంది.

యమ్మెన్సీ ల్లో గానీ కార్పోరేట్ సంస్థల్లో గానీ ట్రేడ్ యూనియన్ల వునికినే లేకుండా చేసిన పరిస్థితే కనపడుతుంది. అక్కడ కలెక్టీవ్ బార్గెయినింగ్ వుండదు. ఉద్యోగి యిండివిడ్యువల్ గా సంస్థతో డీల్ చేసుకుంటాడు. అక్కడ ఎంప్లాయీ మొబిలిటీ కూడా ఎక్కువే. కానీ పబ్లిక్ సెక్టార్లలో పరిస్థితి అలా కాదు. సంస్థతో ఉద్యోగులకు పర్మినెంట్ రిలేషన్ వుంటుంది. వేతన వొప్పందాల్లాంటివి యూనియన్ల ద్వారా జరగాల్సిందే.  కానీ సింగరేణిలాంటి సంస్థల్లో కూడా  ట్రేడ్ యూనియన్లు కార్మికుల బదిలీలు   క్వార్టర్ ఎలాట్ మెంట్లు లాంటి వాటికే పరిమితమయ్యాయి.

తొలి రోజుల్లో ఔట్ సోర్సింగ్ కీ మెకనైజేషన్ కీ ప్రైవేటీకరణకీ  వ్యతిరేకంగా పోరాడుతూ వాటిలోని అవినీతిని యెండ గడుతూ స్ట్రైక్ లూ  నిరసనోద్యమాలూ నడిపిన కార్మికుల్లో  తర్వాతి కాలంలో మార్పు వచ్చింది. ఉపరితల గనుల్లో లాగానే భూగర్భ గనుల్లో సైతం పనులు అవుట్ సోర్సింగు చేసి ఉత్పత్తి పెంచి ఇంటెన్సీవ్ ఇస్తే బాగుండునని భావించే దిశగా వాళ్ళు నడుస్తున్నారు.

ఒకప్పుడు నష్టాల వల్ల బి ఐ ఎఫ్ ఆర్ కి వెళ్ళి పునర్నిర్మాణ పేకేజీ కొన్ని మాఫీలు కొన్ని రాయితీలు కొన్ని ఆంక్షలతో కంపెనీ లాభాల బాట పట్టాకా  రెగ్యులర్ ఉద్యోగులకూ కార్మికులకూ బోనస్ రూపంలోగానీ ప్రత్యేక ఇన్సెంటీవ్ రూపంలో గానీ అందుతున్న లాభాల్లో  ప్రైవేట్ /కాంట్రాక్ట్ / ఔట్ సోర్స్డ్ కార్మికుల పాత్ర బుద్ధిపూర్వకంగానే విస్మరణకి గురైంది.  ఒకరి లాభం మరొకరి నష్టం అన్న సూత్రం ప్రకారం ఆలోచిస్తే విషయం స్పష్టమౌతుంది. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతున్న విషయం తెలిసీ రెగ్యులర్ కార్మికులతో పాటు వారిక్కూడా వాటా పంచడానికి కంపెనీ సిద్ధంగా వుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. అయితే ‘కింద పడ్డ చిక్కుడు గింజను సైతం నలుగురూ పంచుకావాల’న్న స్ఫూర్తితో  తోటి కార్మికులకి భాగం యివ్వడానికి కంపెనీ కార్మికులు అంగీకరిస్తారా అన్నది దాని అనుబంధ ప్రశ్న.

ధర్నాకి నాయకత్వం వహిస్తున్న ‘లక్ష్మణ్’ సరిగ్గా యిదే అడుగుతున్నాడు. శ్రమ ఫలాలు అందరికీ దక్కకపోవడం గురించే అతనికి పేచీ.

‘గత దశాబ్ద కాలంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య ఎంత? అప్పటి ఉత్పత్తి ఎంత? ఇప్పటి ఉత్పత్తి ఎంత? పెరిగిన ఉత్పత్తి తగ్గిన మానవ వనరులతో ఎలా సాధ్యపడింది?? ఉత్పత్తిలోనూ లాభాలలోనూ పెరుగుదలకు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత , అందులో కాంట్రాక్టరు ద్వారా పనిచేసే మా పాత్రేమీ లేదా?’ అని అతను నిలదీస్తున్నాడు. అందుకే కంపెనీ ఉద్యోగులతో పాటు లాభాలలో న్యాయబద్ధమైన  వాటాని డిమాండ్ చేస్తున్నాడు.

సాంకేతికంగా కంపెనీ యాజమాన్యానికి ప్రైవేటు కార్మికులతో సంబంధం లేదని కంపెనీ వాదన. నిజానికి కార్మిక కుటుంబాలకు విద్య – వైద్యం , వసతి సౌకర్యాలు , పి ఎఫ్ , గ్రాటిట్యుటి , ప్రమాదాల్లో నష్ట పరిహారాలు వంటి  కార్మిక  సంక్షేమాల  బాధ్యత నుంచి  తప్పించుకోడానికే ఔట్ సోర్సింగ్ వంటి నూతన విధానాల్ని కంపెనీలు అమల్లోకి తెచ్చాయి.

ఒకప్పుడు బర్మా క్యాంప్ , పంజాబ్ గడ్డ, ధనబాద్ కాలనీ లాంటి నరక కూపాల్లో నిత్య పీడననీ దోపిడీనీ యెదుర్కొన్న వలస కార్మికుల కంటే  ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి మెరుగేనని రచయిత పేర్కొన్నప్పటికీ కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేయండంలో కాంట్రాక్టర్లు ఆరితేరి పోయారు.  ఔట్ సోర్సింగ్ కార్మికులకు అన్ని విధాలా  కాంట్రాక్టరే యజమాని. కంట్రాక్టర్ కనీస వేతనాలు చెల్లించాలనీ పి ఎఫ్ వంటి కార్మిక చట్టాలని వర్తింపజేయాలనీ కంపెనీతో వొప్పందాలు వుంటాయి. కానీ అవి సరిగ్గా అమలవుతున్నాయా అన్న పర్యవేక్షణ నామమాత్రమే. ఔట్ సోర్స్డ్ కార్మికులకి కంపెనీ  మేనేజ్ మెంట్  అదృశ్య శత్రువు. దాంతో చేసే పోరాటం మేఘనాథుడితో యుద్ధం చేసినట్టే. అందుకే  కాంట్రాక్ట్ కార్మిక నాయకుడికి రచయిత ‘లక్ష్మణ్’ అని పేరు పెట్టాడు.

కంపెనీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య చీలిక తెచ్చి  శత్రు వైరుధ్యం సృష్టించడంలో యాజమాన్యం యేదో వొక మేరకి సఫలమైంది. అందుకే ధర్నా పట్ల కార్మికులకీ వుద్యోగుగులకీ వొక రకమైన అనాసక్తి. నిర్లిప్తత. ఒకప్పుడు ఆ ధర్నా స్థలంలోనే తాము కూర్చుని యెన్నో డిమాండ్లు సాధించుకొన్నా మని కూడా వాళ్ళు మర్చిపొయారేమో! లేదా న్యాయబద్ధమైన ఔట్ సోర్సింగ్ కార్మికుల పోరాటానికి మద్దతిస్తే తమ వాటాలో కోత పడుతుందని స్వార్థంతో కూడిన  భయంకూడా కావొచ్చు.  యాజమాన్యానికి వ్యతిరేకంగా  కార్మికులందరి పోలరైజేషన్ జరిగితే సంస్థ ఉద్యోగులూ కార్మికులూ యెటు నిలబడతారన్న విషయంలో కొత్త సందర్భంలో సందేహానికి తావు లేదు.

కథ నిర్మాణం విషయానికొస్తే కథలో సంఘటనల్లేవు. కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాతో కథ ప్రారంభమైనప్పటికీ తోటి వుద్యోగుగులకూ కార్మికులక్కూడా అదొక సంఘటనలా అనిపించలేదు. ఏదో రొటీన్ గా  అలవాటైన కార్యక్రమంలా ‘పెద్ద ఉత్సుకత కలిగించలేదు’. కథ మొత్తం  ధర్నాకి కారణమైన పరిస్థితుల్నే చర్చించింది కానీ సారంలో కథాంశాన్ని పాఠకులకు చేరవేయడంలో వొక  వ్యాసంలా నడిచింది. రఘు వంశీకి యిదే మొదటి కథ కాకపోవచ్చని కథ చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. వ్యాసంలో చెప్పాల్సిన విషయాల్ని కథలోకి తీసుకురావడంలో యిబ్బందుల్ని అధిగమించడానికి రచయిత పడిన స్ట్రగుల్ అడుగడుగునా కనిపిస్తుంది. కార్మికుల వైపు నుంచీ కాకుండా ఆఫీసర్ల చర్చలు సంభాషణలు వాదోపవాదాల ద్వారా నడిపిన టెక్నిక్ కొత్తది కాదు ;కానీ యీ జెనర్ లో కథా నిర్వహణ చాలా కష్టం. తుమ్మేటి రఘోత్తం రెడ్డి ‘చావు విందు’ గుర్తుకు వచ్చినప్పటికీ ముళ్ళపూడి సుబ్బారావు ‘రెండు నదుల మధ్య’ లో వాడిన  టెక్నిక్ కి యిది దగ్గరగా వుంది (శిల్ప పరంగా ఇంగ్లీష్  సినిమా ‘Bridge on the River Kwai’ , రావిశాస్త్రి కథ ‘ఆఖరి దశ’ లీలగా తన మనస్సులో మెదిలాయని రచయిత నాతో మాటల్లో ప్రస్తావించారు).

కథ చివరికొచ్చేసరికి జరిగిన సంఘటన – రైతు ఆత్మహత్య. దాంతో కథలోకి నూత్న కోణాలు వచ్చి చేరాయి. కథలో రచయిత తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి ఆ యా సందర్భాలకు అనుగుణంగా అవసరమైన కంఠ స్వరాల్ని యెన్నుకొన్నప్పటికీ రైతు ఆత్మహత్య ద్వారా దాన్ని బలంగా ఆవిష్కరించగలిగాడు. అంతవరకూ కేవలం తర్కబద్ధ వాదనలకీ సంభాషణలకీ పరిమితమై ఇమోషనల్ కోషేంట్ కి అవకాశంలేక డ్రైగా వున్న కథలోకి వొక బలమైన  వుద్వేగపు అల చొచ్చుకువచ్చి పాఠకుణ్ని తాకుతుంది.

ఉపరితల గనుల  పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు  దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో యెక్కడికక్కడ వ్యవసాయ భూములు సాగు యోగ్యతను కోల్పోయాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. జంతు జీవాలకూ ముప్పు యేర్పడింది. పంటపొలాల్లో భూసారం తగ్గిపోయి, ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు , పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నట్లు , పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ రైతు మరణానికి అదృశ్య కారణాలే.

ఉత్పత్తి ప్రక్రియలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి , ఆ ప్రాంత ప్రజలు కోల్పోయిన మానసిక ప్రశాంతత గురించి , బొగ్గు రవాణా సందర్భంలో  చోటుచేసుకొనే యాక్సిడెంట్లు గురించి, ‘సోషల్ కాస్ట్’ గురించి , దాన్ని భరిస్తున్న పౌర సమాజం గురించి  లోతుగా ఆలోచించి  కంపెనీ లాభాల్లో న్యాయబద్ధమైన  యితర వాటాదార్లు గురించి ప్రస్తావించిన రచయిత దృష్టి యెందుకో రైతు చావుకి కారణాల పైకి , ఓపెన్ కాస్ట్ యజ్ఞంలో సమిధలైన  భూనిర్వాసితుల స్థితి గతులపైకి పోలేదు. అవన్నీ చెప్పాలంటే పెద్ద నవలే అవుతుందేమో! ఇప్పటికే కథ నిడివి పెరిగింది. కానీ సింగరేణి నిర్దిష్టత నుంచి మొత్తం దేశంలో కార్పోరేట్ కి అనుకూలంగా అమలయ్యే పారిశ్రామిక విధానంలోని అపసవ్యతని – పేద్ద భూతాన్ని చిన్న సీసాలో బంధించి చూపినట్టు – కథలోకి యిమిడ్చిన నేర్పు అభినందనీయం.

పాప పరిహారం లాంటి సి యస్ ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) లోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి రచయిత వెనకాడ లేదు. దాన్ని చాటల కొద్దీ స్వయంపాకం తీసుకొని అందులో వొక గుప్పెడు గింజలు వొక కూరగాయ తిరిగి యిచ్చి రుణ విముక్తుడయ్యే యాయావార బ్రాహ్మణుడి వ్యవహారంతో పోల్చాడు. అది  కార్పోరేట్ సంస్థలు అపరాధ భావన నుంచి తప్పించుకొనే మొక్కుబడి  మాత్రమే. మళ్ళీ పాప పంకిలం లో దొర్లడానికి సిద్ధమయ్యే  గంగా స్నానం వంటి కంటి తుడుపు వ్యవహారం అది. అదొక పర – ఆత్మ వంచనల అందమైన మేళవింపు.

రైతు ఆత్మహత్య వుదంతాన్ని మరీ కథ చివర్లో కాకుండా కథ మధ్యలోనే చెప్పి దానికి కారణమైన పరిస్థితుల్నీ అందుకు వుపరితల గనుల్లో చోటుచేసుకొన్న రిగరస్ మైనింగ్ ప్రమేయాన్నీ ప్రస్తావించి కార్మికుల ధర్నానీ రైతుల వూరేగింపునీ సమాంతరంగా నడిపి వుంటే కథలో చిక్కదనం వచ్చేది. ‘ఒక వేళ కాంట్రాక్ట్ కార్మికులు పొందాల్సింది పొందితే తర్వాత మిగులులో వాటా కోసం రైతులే ధర్నాకి కూర్చుంటారేమో’ అని రచయిత ( సుదర్శన్ ద్వారా ) లేవనెత్తిన సందేహం మరింతగా జస్టిఫై అయ్యేది. కేవలం వాదోపవాదాలకే కాక ఉద్వేగ భరిత కథనానికి  కూడా కథలో చోటు దొరికేది. కథ పొడవునా వొక మూడ్ క్యారీ అయ్యేది. అల్లం రాజయ్య ‘అతడు’ కథలో యీ టెక్నిక్ ని గమనించవచ్చు.

యేది యేమైనా శ్రమజీవుల స్వేద ఫలం దాని నిజమైన ‘హక్కుదార్ల’కు  దక్కేవరకూ  మహాశ్వేతాదేవి బషాయి టుడు లాగా ‘అతడు’ -రమాకాంత్ కావచ్చు,  కథలోని లక్ష్మణ్ కావచ్చు, భూనిర్వాసితుడు కావొచ్చు , పర్యావరణ ప్రేమి కావొచ్చు  – మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. ధర్నా చౌక్ రణస్థలి గానే వుంటుంది. పాత్రలు పాత్రధారులు మారినా అన్యాయానికి విరుద్ధంగా పోరాటాలు ఆగవు , పోరాడే శక్తులు యేదో వొక రూపంలో నిత్యం చలన శీలంగానే వుంటాయి-  అనే యెరుకని అంతిమంగా కల్గించినందుకు రచయితకి థేంక్స్.

 

 •                         

 

మీ మాటలు

 1. ఎ వి రమణమూర్తి says:

  మంచి కథని వెలికితీశారు, ప్రభాకర్ గారూ! అభినందనలు!

  ఈ కథ వచ్చిందన్న సంగతి తెలిసినా, మీ ఈ వ్యాసం చూసే వరకూ దాన్ని చదవగల తీరిక దొరకలేదు. ఇప్పుడు మీ వ్యాసం చదవాలి కాబట్టి, దానికి ముందుగా కథని చదివితీరాలి కాబట్టి – రెండు పనులూ పూర్తయ్యాయి.

  కథ గురించి మీరు చెప్పినదానికన్నా అదనంగా చెప్పగలిగింది ఏమీ లేదు. అసలు, కథలో రచయిత చెప్పినదానికన్నా అదనంగా చెప్పటానికి ఏమీ లేదు! ఈ మధ్యనే ఒక కోర్టు తన తీర్పులో – కాంట్రాక్ట్ లేబర్ కి కూడా, రెగ్యులర్ ఉద్యోగుస్థులతో సమంగా జీతభత్యాలు ఇవ్వాలన్న విషయాన్ని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ఆధారంగా మిగతా సంస్థలు కూడా లబ్ధి పొందటం తరువాత జరగబోయే పరిణామాలు. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ స్థానంలో కూచున్నవాళ్లు తమ ఉనికి స్వరూపాన్ని మార్చుకుంటారు. భద్రతావలయంలోకి వస్తారు. ఆ స్థానంలో మరో కొత్త వేరియబుల్ ఏదో వచ్చి చేరుతుంది. మనుషులు స్థానాలు మారుతుండటం గురించే కదా, కథంతా!

  శిల్పం అనేదాన్ని పట్టించుకోకుండా రాయబడ్డ ఈ కథలో బుద్ధికి పనిచెప్పగల చాలా అంశాలు చోటుచేసుకున్నాయి. అన్నీ ఆలోచించవలసిన విషయాలే. వాటిని సరైన సమ్మిశ్రమంలో పేర్చినట్టయితే మరింత మంచికథ అయివుండేది. నవలంత విస్తృతి ఉన్న ఈ కథ నిజానికి మొదట్లో ‘అనుక్షణికం’ నవలని గుర్తుచేసింది – సంవిధానం దృష్ట్యా.

  రైతు ఉదంతం కథ చివర్లో చెప్పటమే సమంజసం నా దృష్టిలో. Setting/Exposition కథలొ సింహభాగాన్ని ఆక్రమించి, live action అనేది కథ చివర్లో ఉంటే కథ ఎంత అద్భుతంగా ఉంటుందో – Cynthia Ozick రాసిన The Shawl లాంటి కథలు ఇంతకుముందే నిరూపించాయి. ఈ కథ కూడా – దాదాపు – అలాంటి స్కీం మీద నడిచింది.

  ఇంతకీ, ఈ రచయిత ఎవరో మీకు నిజంగానే తెలియదంటారా? నమ్మమంటారా? :)

 2. ఎ కె ప్రభాకర్ says:

  హక్కుదార్లు కథ మీద నేనీ నాలుగు మాటలు రాశాకా రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి : కాంట్రాక్ట్ కార్మికులకి పర్మినెంట్ కార్మికులతో సమాన వేతనం యివ్వాలని సుప్రీంకోర్టు తీర్పు. రెండు : డిపెండెంట్ వుద్యోగాల పునరుద్ధరణ.
  కథలో రచయిత పెర్స్పెక్టీవ్ యెంత న్యాయబద్ధమైందో బలమైందో యీ రెండూ రుజువు చేస్తున్నాయి.
  రచయిత గురించి మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు రమణమూర్తి గారూ! ఎనీ వే వ్యాసం నచ్చినందుకు థేంక్స్ !!

మీ మాటలు

*