ఇరుసంధ్యల ఇరుసు కృ.శా.కి తెలుసు!

konni sephalikalu

ఈ నెలలో కృష్ణ శాస్త్రి గారి పుట్టిన రోజు ఒకటో తారీకని కొంతమంది, పదిహేనో తారీకని కొంతమంది వివాదిస్తున్నారు.మనం ఒకటవ తేదీనే  నిర్ధారిద్దాం. కృష్ణ శాస్త్రి గారు పుట్టిన ఊరు పిఠాపురం దగ్గరున్న   చంద్రంపాలెంలో యువతీ యువకులు ఇప్పటికీ ఆయన పుట్టిన రోజు చేస్తున్నారు.ఇది నూట ఇరవయ్యో పుట్టిన రోజు.

నా చిన్నప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్నప్పుడు ఆయన పేరు తెలీకుండా ఆయన పాట ప్రార్ధనా గీతంగా నేర్చుకుని ఎన్నో చోట్ల పాడేదాన్ని. ‘ జయ జయ ప్రియ భారత ‘ అనే పాట కేవలం దేశభక్తి గీతం కానే కాదు.  అదొక సముజ్వలమైన భావగీతం.  నాకు తెలీకుండా ఆ పాటచరణాల్లోని దీర్ఘ సమాసాలు పాడుతుంటే ఎత్తైన పర్వతం మీద పతాకాలు ఎగరేస్తున్నట్టనిపించేది.  చూడండి “ జయ వసంత కుసుమలతా చలితలలిత చూర్ణ కుంతల” భారత జనయిత్రి చూర్ణ కుంతలాలకు జయ జయ ధ్వానం అలాంటి కవి తప్ప మరెవరు చెయ్యగలరు. “జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ” అన్నప్పుడు ఆయన మదిలో కాళిదాసు ,రవీంద్రుడు వంటి వాళ్ళు మెదిలి ఉంటారు .కానీ నేను ఆ దిశాంతం వరకు వెళ్ళిన శకుంత గానంలో కృష్ణ శాస్త్రి గొంతు కూడా గుర్తు పట్టాను.  ఆ చిన్న వయసులో ఆ పాట  వేదికల మీంచి పాడుతుంటే ఒక పులకింతతో కూడిన గర్వం అనుభవించడం నిన్నటి మొన్నటి కథలా ఉంది.

నిన్న మొన్నటి సభలో కుడా మరెవరో గాయకుడు అదే పాటను వేదిక మీద పాడితే నాతో పాటు సభలో వారందరూ భావుక శ్రోతలుగా మారిపోయి పులకించారు.  అది కృష్ణ శాస్త్రి పాట మాధుర్యం. పాటలోని పదాల మాధుర్యం.  వజ్రాన్ని సానబట్టినట్టు ప్రతి పదాన్ని ఏరుకుని ఎంచుకుని ఒకదాని పక్కన ఒకటి పొదుగుతూ తయారు చేసే స్వర్ణకారుడు కృష్ణ శాస్త్రి అని అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలుస్తోంది.

డిగ్రీ చదివే రోజుల్లో మా తెలుగు మేడం సావిత్రి గారి దగ్గర విని నేర్చుకోకుండా ఉండలేకపోయిన గీతం “మ్రోయింపకోయ్ మురళి”. అసలు ఎత్తుగడే వినూతనం.’ మ్రోయింపవోయ్’ కాకుండా ‘మ్రోయింపకోయ్’ అంటూ ఇలా రాయగలిగేవాడే కవి.  వేటూరి సుందర రామ్మూర్తి ఎంతో అందమూ,మరింత హొయలూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్న అమ్మాయిచేత “అందంగా లేనా? అసలేం బాలేనా?” అని అనిపిస్తూ పాట రాస్తాడు.  ఈ పాట  ఎంతగా మారు మోగిందో.  అలా రాయడం ఆ కవి పొగరు.  రాయగలగడం అతని ప్రతిభ.  అలాంటి కవి పొగరుకు కృష్ణ శాస్త్రి గురువు.  కృష్ణా నీ మురళి మోయించకు, వద్దు, వద్దు అంటూ గేయం మొదలు పెట్టారు.  ఎందుకూ ? అంటే కారణాలు తరవాత చరణాల్లో రాసుకొస్తాడు.

ఎందుకంటె “మురళి పాటకు రగిలి మరుగు ఈ వెన్నెలలు, సొగయు నా ఎదకేల తగని సౌఖ్య జ్వాల”అందుకు. రగిలి, మరుగు, సొగయు ఏం పదాలివి? వెన్నెలలు మరిగిపోతాయట.  మండడం కాదు, మరగడం.  ఏం క్రియా పదం?! నా హృదయానికి ఎందుకు ఇంతటి సౌఖ్య జ్వాల. ప్రశంశ అంతా ఆ ‘సౌఖ్య జ్వాల’ దగ్గర ఉంది.  ఇలాంటి పదం తర్వాత ఈ నూట ఇరవై ఏళ్ళ లోను మరే కవి అయినా రాయ గలిగాడా ?

చిన్నతనంలో, మరీ చిన్నతనం కాదు గానీ ఇంత కవిత్వావగాహన లేని వయసులో రెండో చరణం “కాలు చల్లదనాలో, కనలు తియ్యదనాలో” అంటే ఏమీ అర్ధం అయేది కాదు.  అచ్చ తెలుగు పదాలే కాని, పదాల వెనుక ఉన్న తియ్యని బాధ అర్ధం కావాలి కదా.  చల్లదనాలు కాలుస్తాయని, తియ్యదనాలు కనలిపోయేలా చేస్తాయని, ఎందుకూ అంటే “వలపు పిల్లన గ్రోవి – వలపులో, సొలపులో” అంటాడు.  ఈ పిల్లన గ్రోవి మామూలు ది కాదు. ‘వలపు పిల్లన గ్రోవి’. వలపు ప్రియరాలు మీదో, ప్రియుడు మీదో ఉండాలి. కాని పిల్లన గ్రోవి మీద ఉంది.  ఇక్కడ ‘మురళి’ అనలేదు. అంటే ఈ అందం రాదు ‘వలపు మురళి’ అంటే చూడండి, ఏమీ బాగా లేదు. వలపు పిల్లన గ్రోవి, పిలుపులోనూ, సొలపులోనూ కాలు చల్లదనాలు, కనలు తియ్యదనాలూ ఉండి బాధిస్తాయట. అందుకని మ్రోయింపకోయ్ అంటున్నాడు కవి. ఇక్కడ కృష్ణ శాస్త్రి అనే వ్యక్తి లేడు. పూర్తిగా ఆయనను ఆక్రమించుకున్న కవే ఉన్నాడు.

చివరికి ‘భరమోయి నీ ప్రేమ’ అంటాడు. భారమోయి అనడు.  ఎందుకంటే అది భరమయినా తనకు వరమే కాబట్టి. “వరమే నేటి రేయి” అని పూర్తి చేస్తాడు.  పాట పాడుకున్నా, విన్నా ‘సౌఖ్య జ్వాల’ మనని వదలదు. దాని అనురాగంలో దగ్దమేనా అవ్వాలి.  ప్రకాశమానమేనా అవ్వాలి.  ఈ పాట యాభై ఏళ్ళుగా పూవులో పూవునై అన్నట్టుగా నాలో కలిసిపోయింది.  అప్పుడప్పుడు మోగుతూ ఉంటుంది. మ్రోయింపకోయ్ అంటూ.

ఇప్పుడు  టాగూర్ కవిత్వం గురించి కృష్ణ శాస్త్రి గారు చెప్పిన కొన్ని మాటలు తల్చుకోవాలి. ఇక్కడ కవిత్వం అంటే గేయ రూప కవిత్వం. అది రాయడం మరింత కష్టం.

“కళలన్నింటి లోకీ ఒక దృష్టితో చూస్తే సంగీతం గొప్పది. మానవానుభవాలలో ఇది అందుకోని ఎత్తులూ, లోతులూ లేవు.  మాటకు లొంగని ఆవేశాలనూ, అనుభవాలనూ సంగీతం అందుకుంటుంది. అందిస్తుంది.  అందుకనే ఋషులు ఛందములను గానం చేసారు. భక్తులు పాటల రెక్కల మీద పరమపదం అందుకున్నారు.

సుదూరమైనవీ, సూక్ష్మమైనవీ అయిన ఒక మహా కవి ఆత్మానుభూతులు వ్యక్త పరచడానికి శబ్దాలు సామాన్య రీతిలో ఉపయోగిస్తే చాలదు.వాటిని అవసరాన్ని బట్టి ఏరి, చేరదీసి, ఒకమూస లో పోసి అక్కడ ఆ గానానికి ఉండే శక్తిని పొందించాలి. కవికి పర్యాయపదాలు లేవు. ప్రతిదానికీ ప్రత్యేకమైన రంగూ, రుచీ ఉన్నాయి. ఛందస్సులూ, గణాలు ఒప్పుకున్నా కవికి ఏదో’ ఒక్కటే’ తప్పకుండా ప్రయోగించి తీరవలసిన శబ్దం ‘ఒకే ఒకటి ఉంటుంది’. ఆ విధమైన కూర్పు లిరిక్ – గేయం – గీతి అవుతుంది” అంటారు ఆయన.

krushaa

కవిత్వానికి, ముఖ్యంగా గేయానికి కావలసిన పదం ఆ కవి ఆత్మకి స్ఫురించాలి అంటారు.  ఈ స్ఫురణ ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక ధ్యాన స్థితిలో. కవికి ఆ ధ్యానం అవసరం, అందుకే కృష్ణ శాస్త్రి గారి శిష్యుడు ఇస్మాయిల్ కూడా ఈ ధ్యానం గురించే పదే పదే చెప్తారు.అందరూ ఆయన్ని చెట్టు కవి అంటారు, గానీ నిజానికి ఆయన ధ్యాన కవి

మరో పాటలో పదాలు చూద్దాం. “ముందు తెలిసెనా ప్రభూ ! ఈ మందిరమిటులుంచేనా” ఇక్కడ ఇల్లు, గృహం అనవచ్చు, కానీ మందిరం అనే రాస్తారు.  అందులో ఉన్న పద వైభవం, మన మనసు స్నిగ్ధంగా ఉండి ఉంటే దానికి అంది తీరుతుంది.  “నీవు వచ్చు మధురక్షణమేదో” అని “కాస్త ముందు తెలిసెనా” అంటారు.  మరీ ముందక్కర్లేదు.  ‘కాస్త’ ముందు తెలిసినా చాలు అంటూ.

ఈ పాట కాస్త ప్రేమించే హృదయమున్న ప్రతీ ఒక్కరికీ అనుభవంలోకి వస్తుంది “వాకిటనే సుందర మందార కుంద  సుమ దళములు పరువనా” ఈ పదాలు ఎలా ఉన్నాయంటే వాకిట్లో పరిచిన ఆ మందార కుంద పూల రేకుల్లా ఉన్నాయి.  మొదటి చరణంలో ఏరిన పూల లాంటి పదాలతో పూల దారి వేసి వాటి మీద అడుగుల గురుతులు ఇవ్వు చాలు అంటాడు.

ఇక రెండవ చరణంలో ఆయన గురుదేవుడు టాగూర్ పలవరిస్తాడు ఆయన గొంతులో. “బతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు” పూర్తి వచనం ఇది.  కానీ ఇందులో ‘పట్టున’ అనే పదంలోనూ “రానే రావు” అనే మాటలోనే అంతా ఇమిడ్చాడు.  కానీ ఇందులో అందమేమిటంటే “ఎదురు చూసినప్పుడే రావు, అంతే గాని అసలు రావని కాదు”.

“ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు” ఇది ఎంత సార్వ జనీనమైన అనుభవం. ఎంతగా మన అనుభవాలని మనం ఈ మాటల్లో చూసుకుంటాం.  పదాలు ఎలా మెరుస్తున్నాయి. ఛిజిల్ చేసిన వజ్రాల్లా.  ఎదురు – అరయని వేళ, ‘ఇట్టే’ మాయమవడం ఇక్కడ “అంతలోనే’ అనొచ్చు, కానీ ‘ఇట్టే’ అన్నప్పటి ‘తక్షణత’ వస్తుందా?

ఇక ఆ చివరి వాక్యం చూద్దాం “కదలనీక నిముషము నను వదలి పోక, నిలుపగా, నీ పదముల బంధించలేను హృదయము సంకెల చేసి” ఎంత పొడుగు వాక్యం. సంకెల లాంటి వాక్యం. వాక్యంలో అతని లేదా ఆమె యొక్క కాళ్ళను కట్టేస్తోన్నట్లు ఉంది ఈ వాక్యం. హృదయము సంకెల చెయ్యడం అన్న మాటలోనే ఉంది అనురాగం తాలూకు అర్ధమూ, పరమార్ధమూను.  ఈ పాట ఆయన ఒక గేయంగా రాసుకున్నది. దీన్ని తరవాత కాలంలో మేఘ సందేశం సినిమాలో పెట్టుకున్నారట.

అంటే కేవలం తన అనుభూతిని, తన విన్నపాన్ని అలా గేయంలో, ఆ మాటలలోఅమర్చుకుని  సమర్పించుకున్న కానుక కావడం వల్ల అది ఎవరికివారం మన హృదయాన్ని కుడా ఆ మాటల ద్వారా మీటుకుంటున్నాం.

టాగూర్ గురించి ఎవరో మహానుభావుడు చెప్పిన మాటల్ని కృష్ణ శాస్త్రి గారు ఆయన నోటితో ఇలా చెప్తారు. “టాగూర్ కవిత్వంలో కవిత్వం కాక మరేదో ఉంది, అతని కవిత్వంలో లిరిసిజం – అంటే గేయత్వాన్ని మించిన దేదో ఉంది.  అతని కవిత్వం అతని పెర్సనాలిటీని, అంటే అతని అంతరమూర్తిని వ్యక్త పరిచేదే గాక, దాన్ని అంతకంతకు సుందరంగా వికసింపజేసే సాధనం కూడా.  అతడు రుషి.  అతని అనుభూతులు ఇహపరాలకు నిచ్చెనలు.  అతని ప్రతి దిన సంభాషణమే శ్రోతల మనస్సులలో ఒక వింత కాంతి నింపేది.”

ఇవి కృష్ణ శాస్త్రి గారికి కుడా సరిపోయే మాటలు.  ఆయన కవిత్వం అలా ఉంచి కేవలం పాటలు చూసినా ఈ మాటలు ఆయనకీ చెందుతాయని అనిపిస్తాయి. “నీవలె సుకుమారములు, నీవలెనే సుందరములూ పూవు లేరి తేవే చెలి  పోవలె కోవెలకు” అన్నప్పుడు ఆయన దృష్టి కోవెల మీద తో పాటు చెలి  మీద కుడా గట్టిగానే ఉంది.  కానీ “అనరాదా! నీ కృపయే అనరాదా” అంటూ భగవంతుడి దయని అర్ధం చేసుకోడానికి ఎవ్వరూ రాయలేని మాట రాస్తారు. “నడిచే దారి ఒంటరియై, గడిచే సీమ ఎడారియై, అడుగే పడనపుడనరాదా ! నీ కృపయే అని అనరాదా!” అంటూ ఇంకా “కేలేత్తీ మరి అనరాదా! నీ కృపయే అనీ అనరాదా” అంటారు.  మనిషి లోపలి మూర్తిని అంతకంతకూ సుందరంగా వికసింప చేసే సాధనం అతని కవిత్వం అన్న మాట ఇలాంటి పాటలు విన్నప్పుడు మరీ మరీ గుర్తొస్తుంది.

ఎడ్గార్ ఎలెన్ పో గురించి చెప్తూ “జాగ్రత్తగా దారి బత్తెం ఉపయోగించు కుంటూ నడిచే యాత్రికుడు కాదు ‘పో’.  కళ్ళు మూసుకుని జీవితాన్ని రెండు చేతులతో ఖర్చు పెట్టినట్టుంటాడు.  తనకు సంబంధం లేని లోకంలోకి వచ్చినట్టుంటాడు” అంటారు.  సుఖ దు:ఖాలు వెలుగు చీకట్లలా అందరి జీవితాల్లోను కలగలిసి ఉన్నా కొందరి జీవితం ఉదయసంధ్యలా ఉంటే, మరి కొందరి జీవితం సాయంసంధ్యలా ఉంటుంది. ఉదయ సంధ్య లో చీకట్లు తక్కువ, సాయం సంధ్యలో చీకట్లు ఎక్కువా అంటారు ఆయన, పో జీవితం సాయం సంధ్య అని చెప్తూ. కానీ కృష్ణశాస్త్రి గారి కవిత్వం లాగే  జీవితం కూడా ఉదయ సాయం సంధ్యలు రెండూ కలగలిసి పోయినట్లుంటుంది.

అందుకే ఎర్రటి కాడలు ,తెల్లటి రేకులు ఉన్న పారిజాత పూలలాంటి కవిత్వం రాయగలిగేరు

*

 

మీ మాటలు

 1. Rajasekhar (Chandram) says:

  చాలా గొప్పగా రాశారు..
  ఇరుసంధ్యల ఇరుసు కృ.శా.కి తెలుసు!..
  కృష్ణశాస్త్రి గారి కవిత్వం గురించి మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు అనాలని ఉంది…

 2. Chinaveerabhadrudu says:

  చాలా చక్కటి ప్రశంస. తెలుగులో, ఆధునిక కాలంలో, కవి అంటే కృష్ణశాస్త్రి మాత్రమే. ఎందుకో, ఈ రచన తేటతెల్లం చేస్తోంది. పాటలు వినడం మటుకే కాదు, అవి మన రక్తంలో కలిసిపోతేనే, ఆ కవిత్వస్మరణ, కవి స్మరణ, ఇంత అందంగా ఉంటాయి.

 3. వారణాసి నాగలక్ష్మి says:

  ‘అలా రాయడం ఆ కవి పొగరు. రాయగలగడం అతని ప్రతిభ. అలాంటి కవి పొగరుకు కృష్ణ శాస్త్రి గురువు’.
  వీర లక్ష్మి గారు, కృష్ణ శాస్త్రి గారి కవిత్వపు గాఢత మీ వ్యాసంలో సుకుమారంగా సుందరంగా ప్రతిఫలించింది, పారిజాత పరిమళంలా.

 4. Vaadhoolasa says:

  “అందుకని మ్రోయింపకోయ్ అంటున్నాడు కవి. ఇక్కడ కృష్ణ శాస్త్రి అనే వ్యక్తి లేడు. పూర్తిగా ఆయనను ఆక్రమించుకున్న కవే ఉన్నాడు”.అది అనుభవైకవేద్యం.

  స్మరణీయం వ్యాసం అతి
  రమణీయం అంశం
  పదముల పూదోటమాలి
  ఎద ఆవిష్కరణం

  వెన్నెలకై కృష్ణపక్ష
  మెన్నుకున్నవాడు
  మల్లెలకై కోకిలనే
  ముందు పిలిచినాడు

  గొంతు మౌనమూనిందని
  మురళి ఊదినాడు
  ప్రియభారతి జయ గానము
  మురిసి పాడినాడు

  భావకవితలల్లిన కవి
  మన దేవులపల్లి
  గేయసుందరిని వలచిన
  ఇతడాంధ్రా షెల్లీ

  చక్కని వ్యాసం రాసిన మీకు అభినందనలు .

 5. వ్యాసం అద్భుతంగా ఉంది మాడమ్ గారు. ఒక్కోసారి అనిపిస్తూంటుంది, కృష్ణ శాస్త్రి భావచిత్రాల శైలి తరువాత కవులలో చాలా కొద్దిమందే అనుసరించారు. చాలామంది తెలుగు కవులు శ్రీశ్రీ ప్రభంజనంలో కొట్టుకొని పోయారు.

  చక్కని విశ్లేషణ కు థాంక్యూ అండి.

 6. పాఠకులను శాస్త్రి గారి సాహిత్య సౌందర్యం లో తడిపారు. ఇంత లోతైన పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. .

 7. గన్నమరాజుగిరిజామనోహరబాబు says:

  శీర్షికలోనే కృష్ణశాస్త్రి ప్రభావ బలం తెలుస్తూ ఉంది … కృ.శా. కవిత్వమంత మధురమైన విశ్లేషణ … ఆయన పదాల్లోని మార్దవాన్ని , మాధుర్యాన్నీ తెలిపే చక్కని రచన ….

 8. అంతటి శాస్త్రి గారి కవితకి అంతటి స్థాయి విశ్లేషణాత్మక వివరణాత్మక వ్యాసాన్ని వ్రాసి మీరు మామ్మని ధన్యులను చేశారు
  కృతజ్ఞతాభినందనాలు

 9. అద్భుతంగా వివరించారు

 10. కె.కె. రామయ్య says:

  ” ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య ప్రేమలు పొసగవని
  ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవని … నాకు తెలుసు, నాకు తెలుసు ” అన్న;

  ” విశ్వ మహాకావ్యాలన్నీ వేదనల అశ్రు బిందువులు ” అన్న
  అంతః సంఘర్షణ కవితా బింబం ఆలూరి బైరాగి అన్నా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఆత్మీయమే అనుకుంటా కాకినాడ అక్కయ్య గారు.

  జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, ముళ్ళపూడి వారు పేరడీ చేసిన కృష్ణశాస్త్రి గారి
  ‘ఏల ప్రేమింతును’ కవితా ఖండిక వాక్యాలు

  ‘సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు?
  చంద్రికల నేల వెదజల్లు చందమామ?
  ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
  ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

  ” కొమ్మల గువ్వలు గుసగుసమనినా
  రెమ్మల గాలులు ఉసురుసురనినా
  అలలు కొలనులో గలగలమనినా
  దవ్వుల వేణువు సవ్వడి వినినా
  నీవు వచ్చేవని నీ పిలుపే విని
  కన్నుల నీరిడి కలయ జూచితిని
  ఘడియ యేని ఇక విడిచిపోకుమా
  ఎగసిన హృదయము పగులనీకుమా… ” మల్లీశ్వరి

  • Vvlakshmidevi@gmail.com i says:

   రామయ్యగారు
   ఆపేసేరేం, ఇంకా చాలా పాటలు గుర్తొస్తున్నాయి కదూ
   థాంక్స్

 11. దేవరకొండ says:

  ప్రపంచ స్థాయి అత్యున్నత శ్రేణి కవులలో ఒకరైన దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారిని అదే స్థాయిలో చిన్ని మధుర వ్యాసంగా సమర్పించిన వీరలక్ష్మి దేవి గార్కి ధన్యవాదాలు. కవి, కవిత్వాల ఆత్మను ముందుగా ఆవహింపచేసుకొని ఆ సౌందర్యాన్ని అక్షర మాలలుగా కూర్చి రచించే అరుదైన విద్య ను సాధించుకున్న ఈ తల్లికి నా నమస్సులు!

 12. డా .సుమన్ లత రుద్రవఝల says:

  శరదృతువు లోని మెత్తదనం .ఉభయ సంధ్యల్లోని ఆహ్లాదం .పారిజాతాల పరిమళం …………ఎన్నెన్నో అద్భుతమైన భావాల మధువు నింపుకుని ఆయన తన కలం తో …కాదు -కాదు మెత్తని మనసు తో కవితలు రాసేవారేమో అనుకుంటూ ఉంటాను.ఎన్నో సందర్భాలలో సగర్వంగా జయ జయ ప్రియ భారత ……పాడి మహా గర్వంగా ఇది కృష్ణ శాస్త్రి గారి రచన అని ఇతరులకి పరిచయం చేసిన సందర్భాలెన్నిటినో గుర్తు చేసుకునే చక్కని అవకాశం మీ అద్భుత శేఫాలిక ద్వారా కలిగింది .
  రోజూ రాలే పారిజాతాలు చూస్తున్నప్పుడు మరిన్ని శేఫాలికలు అనే అనుకుంటాను .నిజం !! మీ సాహిత్య శేఫాలికలకి నిత్యం శరద్రుతువే కదా !! కవికి తగినట్లే మీ పరిచయమూ మనసును భావావేశం లోకి నెట్టేసింది .
  ధన్యవాదాలు . సుమన్ లత రుద్రావఝల

 13. అద్బుతం మీ రచన. Tqu మేడం గారు 😊
  కాసేపు మేఘాలలో. . పారిజాతాలు మద్య వున్నట్టు అనిపించింది.

 14. మీ వ్యాసాన్ని ఎలా మిస్ అయ్యానో వీరలక్ష్మి గారు అదీ ..నా బాల్యం నుండి (9th/10th స్టాండర్డ్ ) లోమనసులో దృడంగా నాటుకుపోయిన కృష్ణ శాస్త్రి కవిత్వం పై మీ అద్భుత విశ్లేషణ.

  క్కృష్ణశాస్త్రి గారి భావ ధార లో మునిగి మాటలు
  కరువై మౌన ముద్రలో ఆ మాధుర్యాన్ని అనుభవించటమే …

  జీవిత ఉదయ సంధ్యల ఇరుసు తెలిసి
  అద్భుత పద జాలం తో మనసును దోచే మరపు రాని మధుర కవి – మీవిశ్లేషణ నా
  మనసుకు ఎంతో సంతోషాన్ని స్వాంతన నిచ్చింది. ధన్యవాదాలు .

 15. కె.కె. రామయ్య says:

  ఎవరైనా ప్రింటు కాపీలు పంపిస్తే కానీ చదివే వీలులేని ఇబ్బంది ని అధిగమించి, సారంగ అంతర్జాల పత్రికను నోట్ పాడ్, లాప్ టాప్ ల మీద ఆన్ లైన్లో చదువుకోగల స్థాయికి వఛ్చి …. కృష్ణ శాస్త్రి గారి మీది ఈ అద్భుత వ్యాసాన్ని చదివి ఎంతో ఆనందించానని చెప్పమన్నారు త్రిపుర గారి శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు.

 16. “నా దారి ఎడారి, నా పేరు బికారి” అంటూనే “విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు – అసలు నా మరోపేరు ఆనందవిహారి” అని ప్రవర చెప్పుకుని “ఏనాటికొ ఈ గరీబు కాకపోడు నవాబు” అన్నంత ధీమా చూపించిన కృఇష్ణశాస్త్రి గారి కవితలు నాకు చాల ఇష్టం.

  నేనప్పుడెప్పుడొ రాసుకున్న ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను: http://boldannikaburlu.blogspot.com/2012/04/blog-post.html

 17. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద మీ వ్యాసం చదవగానే – నేను ఇష్టంతో రాసుకున్న నా బ్లాగ్ పోస్ట్ పంచే హడావిడిలో అసలు సంగతి మరిచాను. మీ వ్యాసం చాలా బావుందండి. నేనిన్నాళ్లూ పాడుకునే “పూర్ణకుంతల” తప్పూ – “చూర్ణకుంతల” – ఒప్పూ అని ఇవాళే గమనించాను. శుభాభినందనలు!

  • Vvlakshmidevi@gmail.com i says:

   లలితగారూ
   మీ వ్యాసం లోఎన్నో పాటలు గుర్తుచేశారు
   థాంక్యూ వెరీమచ్

 18. Annapurna Dhulipala says:

  Adugaduguna gudi vundi ..andarilo gudi vundi…enta suluvugano oka Saswata satyanni cheppagala kavi pogaruni pratibhani gurtupatti anta andanganu anta pogaruganu (kshaminchandi) cheppagala pratibha Mike vundi…erranikadala tellani rekula parijatalanu erukuntu vundipoyanu…chala bagundi..

 19. R Bhargavi says:

  చాలా బాగుంది చాలా చిన్న మాట కానీ అది తప్ప వేరే మాట దొరకడం లేదు ఇంట మంచి వ్యాసం రాసిన మీకు శిరస్సు వంచి vinamrataanjali

మీ మాటలు

*