ధింసా ఆడే కాళ్ళు..

Artwork: Rafi Haque

Artwork: Rafi Haque

జనపథపు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు
పోరాట సంబరాన్ని చిందించే ముఖాలు
ఏవేవో ఆశయాలతో రక్తం ఉరకలెత్తే ముఖాలు….
ఈ ముఖాల్ని యూనిఫారం తొడుకున్న హైనాలు పట్టి పీకాయి
రాజ్యం కత్తిపీటై క్రూరంగా చెక్కేసింది
పోరాటం చేసేవాళ్ళు సజీవులుగానే కాదు
శవాలుగా కూడా రక్తాన్ని మరిగింప చేస్తారు
ఒక్కో మృతదేహానికి ఒక్కో సజీవ చరిత్ర
అది వాళ్ళ స్తంభించిన కనుపాపల్లో కనిపిస్తుంది
****
రండి కార్పొరేట్ బాబులూ
ఇనుమడించిన ఉత్సాహంతో రండి
పలుగు పారలు డైనమేట్లు బాంబులు పొక్లైనర్లతో రండి
ధ్వంసంచేసి దోచుకున్నదాన్ని ఎత్తుకెళ్ళడానికి
బహుళజాతి కంటైనర్లతో రండి
మీ తరపున యుద్ధం చేసి
రాజ్యం పరిచిన నెత్తుటిమడుగుల రెడ్ కార్పెట్ల మీద
పరుగులెత్తుతూ రండి
బాయొనెట్లతో పొడిచేసిన ముఖాల్ని
ముఖాల్లేని మొండేల్ని
తెగిపడ్డ అవయవాల్ని తొక్కుకుంటూ ఉబలాటంగా  రండి
లక్షల ఏళ్ళుగా నిటారుగా ఎగిసిన
కొండలనన్నింటినీ పేల్చిపారేయండి
భూమిని బద్దలు చేయండి
చెట్లని బాంబులతో కూల్చి
పత్రహరితం పేగుల్ని మెడలో వేసుకు తిరగండి
కొండల రొమ్ముపాలులాంటి
జలపాతాలకి నిప్పెట్టండి
ఆదివాసీల అందమైన అమాయకపు
ధింసా ఆడే కాళ్ళు నరకండి
కొమ్ముబూరల్ని పగలగొట్టండి
దండారీ కొలాంబోడీ పండగల్లో
ఒళ్ళుమరిచి పులకరించే గూమేలా కోడల్ డప్పుల్ని
మోకాళ్ళకేసి కొట్టి విరగ్గొట్టండి
కాలికోం, పేప్రి, కింగ్రి వాయిద్యాల పీక నులిమేయండి
రేలపాటల గొంతుల్లో సీసం పోయండి
గోండు గుస్సాడీ కిరీటాల్ని విరిచేసి నెమలిపింఛాల్ని తగలబెట్టండి
వాళ్ళ కాళ్ళ గజ్జెల్లోని తుంగగడ్డల పూసల్ని చిందరవందరగా విసిరేయండి
గదబ గిరిజనుడి గుడిసె ముందున్న మట్టి అరుగు మీదే
మొదటి గునపం పోటెయ్యండి
ఏ ప్రకృతి విలయం చేయలేని
వినాశనానికి పూనుకోండి
అడవినంతా ఓ కబేళాగా మార్చి
నగరాల్లో ఫ్లై ఓవర్లు, పబ్బులు క్లబ్బులు కాఫీ షాపులు కట్టుకోండి
ప్రకృతి సంపదని
డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
అమ్ముకోవడమేగా పరిపాలన అంటే!
దండయాత్రలు చేసేవాడు
స్వదేశీయుడైతనేం విదేశీయుడైతేనేం?
*****
కానీ వీళ్ళు మాత్రం
పుడుతూనే విల్లంబులు బాణాలతో పుట్టినవాళ్ళే!
*

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  చాల బాగా ఉద్వేగంగా రాసారు అరణ్యకృష్ణ గారు. మీదైన శైలిలో . పదాలలో అక్కడ జరుగుతున్న పోరాటాన్ని కదిలించేలా రాశారు.

  జనపథపు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు
  పోరాట సంబరాన్ని చిందించే ముఖాలు
  ఏవేవో ఆశయాలతో రక్తం ఉరకలెత్తే ముఖాలు….
  ఈ ముఖాల్ని యూనిఫారం తొడుకున్న హైనాలు పట్టి పీకాయి
  రాజ్యం కత్తిపీటై క్రూరంగా చెక్కేసింది
  పోరాటం చేసేవాళ్ళు సజీవులుగానే కాదు
  శవాలుగా కూడా రక్తాన్ని మరిగింప చేస్తారు

 2. Krishnagaru, very powerful writing. While reading the poem, the Dhimsa Dance danced in front of my eyes. And also the cruelty that is going on in the name of డెవలప్మెంట్.

 3. మూర్తి says:

  రెడ్ ఇండియన్స్…..మెక్సికోజనపదం…ఆఫ్రికాలో నల్లోడు…మల్కనగిరిలో…కోదు వాడు…తెగలువేరైనా.నాగరికత ప్రవాహంలో తెగినవారే….సానుభూతి మంచిదే….కానీ…చరిత్రగమనంలో…..మాసిపోతున్న…మనుషులకు సానుభూతి చాలదు.

 4. దండయాత్రలు చేసేవాడు..
  ఎవడైతేనేమి
  కొల్లగొట్టడం..కోట్లకు పడగలెత్తడం
  నయా రాజకీయ రాబందుల రాక్షసక్రీడ.
  నిజాలను నిప్పుకణికల్లా …
  పచ్చదనపు అడవుల్లో
  రాలిపోతున్న ఆశల ఆక్రోశాలని
  అణువణువూ మండించినట్లుంది.

 5. Krishnagaru,Very powerful writing. While reading, the dimsa dance danced in front my eyes. The cruelty in the name of Development. Thank you.

 6. MurtyChalarojuluayyidi mee power choodaka really an appreciate n relevant poem –balraj

 7. Vasu (Srinivasa Nyayapati) says:

  “ప్రకృతి సంపదని
  డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
  మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
  అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
  బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
  అమ్ముకోవడమేగా పరిపాలన అంటే!” .

  మీ కన్నా బాగా ఇటువంటి కవిత ఇంకెవరూ రాయలేరు. One gem of a poem.

 8. Sadlapalle Chidambarareddy says:

  “ప్రకృతి సంపదని
  డబ్బుకట్టల్లోకి విలాసాల్లోకి
  మార్చుకోవడమేగా నాగరీకత అంటే!
  అడవి కడుపు కొల్లగొట్టి అక్కడి ఖనిజాల్ని
  బులియన్ మార్కెట్లలో షేర్లు షేర్లుగా
  అమ్ముకోవడమేగా పరిపాలన ……. baga cheppinaru

 9. renuka ayola says:

  కృష్ణ గారు మీరు రాసిన. ఈ కవిత ఉద్వేగంగా సందేశంగా చాలా బాగుంది …

 10. నిజాలింతే…ప్రతీ పదం జ్వలిస్తూ నిస్సహాయ నిర్లిప్త ముఖాలకో వెలుగు దారి చూపంటోంది.

 11. Narayanaswamy says:

  బాగుంది అరణ్యా ఉద్వేగమూ ఆక్రోశమూ ఆగ్రహమూ కలగలిపి చాలా శక్తివంతంగా వచ్చింది కవిత – అందుకో వెచ్చని కరచాలనం

మీ మాటలు

*