“దేవపుత్ర” కాదు మట్టిబిడ్డ!! 

deva

Artwork: Akbar

     *

1990 కి ముందు చదువరులకు ముఖ్య కాలక్షేపం వారపత్రికలే! వాట్లో వచ్చే కథలు, నవలల కోసం వారం పొడుగునా ఎదురు చూసే కాలమది.
 
     అప్పుడు నల్లమాడలో నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడ్ని. కథల మీద ఆసక్తి ఉన్న ముగ్గురం మూడు వారపత్రికల్ని  కదిరి నుంచి తెప్పించేవాళ్లం.
 
     1987 డిశెంబరు ఆంధ్రసచిత్ర వారపత్రికలో “ఇరుకు” అనే కథ వచ్చింది. ఆ కథను మేం ముగ్గురమే కాక, సాయంత్రం వాకింగుకు వెళ్లి దూరంగా బండమీద కూర్చొనే మా ఉపాధ్యాయ మిత్రులకంతా చదివి వినిపించాను. వారు దాన్ని మెచ్చుకొని మరికొందరితో చదివించారు. ఆ కథను రాసింది చిలుకూరి దేవపుత్ర!! అప్పట్నుంచీ అతని పేరు నాలో ముద్రించినట్లు స్థిరపడి పోయింది.
 
     అప్పుడతంది ఏవూరో? ఏ ఉద్యోగమో చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. అయినా పత్రికల్లో పేరు కనబడితే మొదట అతని కథనే చదివే వాడిని.
 
     మరలా హిందూపురానికి బదిలీపై వచ్చాక, డా.పెద్దిరెడ్డిగారి సాహచర్యంతో 1993  ప్రాంతంలో దేవపుత్రది అనంతపురమే అని, ఇంకా సింగమనేని నారాయణ, శాంతినారాయణ, బండినారాయణ స్వామి వంటి ప్రసిద్ధ రచయితల్ది కూడా అనంతపురమే అని తెలిసి సంతోషించాను.
 
     చిలుకూరి దేవపుత్ర 1951 ఏప్రిల్ 15 నాడు అనంతపురం జిల్లా బెళుగుప్ప దగ్గర కాలువపల్లెలో ఆశీర్వాదం, సరోజమ్మ అనే దంపతులకు జన్మించాడు. దళితుడైన అతని తండ్రి చిన్నపాటి ఉద్యోగి కావడంతో దేవపుత్ర ఇతర దళితుల్లాగా అవమానాలకూ, అంటరాని తనాలకూ గురికాకుండా పెరిగి ఉండవచ్చు!!
 
     అయినా తన వర్గానికి జరిగిన, జరుగుతున్న వెలివేతల్నీ, అంటరానితనాల్నీ, అణగదొక్కడాల్నీ గమనిస్తూ అందరిలాగా చూసీ చూడనట్లు పోలేదు. వారి అసహాయతల్నీ, జీవన శైథిల్యాల్నీ, ఇతర సామాజిక రుగ్మతల్నీ 100 కు పైగా కథల్లోనూ, ఐదు దాకా నవలల్లోనూ సజీవ రూపాలుగా అక్షరబద్దం చేశాడు.
 
     అతడు చదివింది S.S.L.C నే అయినా సమకాలీన సమాజాన్ని, తాను పనిచేసిన రెవెన్యూ శాఖ రుగ్మతల్ని బాగా ఆకళింపు చేసుకొన్నాడు. అతను రాసిన కథల్లో సగందాకా తను పని చేసే శాఖలోని బలహీనతలూ, లంచగొండితనాలూ, దొల్లతనాల్ని గురించి రాసినవే!! అతడంత ధైర్యంగా రాయగలిగాడంటే ఎంతగా వృత్తికి అంకితమై వుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 
     అతని కథలు “వంకర టింకర ఓ” “ఆరు గ్లాసులు” “ఏకాకి నౌకచప్పుడు” “బందీ” చివరి మనుషులు” అనే సంకలనాలుగా వచ్చాయి.
 
     ఇతను, ప్రసిద్ధ కథకుడు సింగమనేని నారాయణ గారి సాహచర్యం వల్ల వామపక్ష భావాల్ని ఆకళింపు చేసుకొని తన రచనల్ని మెరుగులు దిద్దుకొన్నాడు. ఆ భావజాలంతో 1977 లో మొదట రాసిన “మానవత్వం” అనే కథను రంగనాయకమ్మ గారు మెచ్చుకొని అచ్చువేశారు. అప్పట్నుండీ అదే బాటలో చివరిదాకా నమ్మిన సిద్ధాంతాన్నీ, పట్టిన దారినీ వదలకుండా అద్భుతమైన రచన్లు చేశాడు.
 
     “అద్దంలో చందమామ” నవల- తమ అధికారాల కొమ్ములూడినా రెడ్డీ కరణాల ఆధిపథ్య ధోరణినీ, దళారీతనాల్నీ, దళితులపట్ల వారి కల్ముష వైఖర్లనీ వివరిస్తుంది. “పంచమం” నవల- దళితుల దైన్య జీవితాలను అద్దంపట్టే రచన. “ప్రజల మనిషి” నవల- అవకాశాలు కల్పిస్తే దళితులు కూడా తమ ప్రతిభల్ని చాటుకోగల సమర్థులు అని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. “కక్షశిల” నవల- పేరులోనే రాయలసీమ కక్షల కాఠిన్యాన్ని ధ్యనిస్తుంది. సీమ ముఠా కక్షల్లో బలి అవుతున్నబలహీన బడుగువర్గాల సజీవ సత్యం. “చీకటి పూల” నవల- తెలియని వయస్సులో నేరాలు చేసి జైళ్లకు వెళ్ళే బాలల హృదయవిదారకమైన దుస్థితిని గుండెల్ని తాకేలా చెప్పింది.
 
     “రచయితలు తమ తరానికి జవాబుదార్లు.
      వారు తమకు తామే జవాబు చెప్పుకోవలసిన వారు” అని, ఆదివాసుల వాస్తవ స్థితిగతుల్ని కళ్లకుకట్టి చూపించిన మహోన్నత రచయిత్రి మహాశ్వేతాదేవి గారన్నట్లు, చిలుకూరి దేవపుత్ర మా అనంతపురం జిల్లాలోని కరువు, దళితసమస్యలు,ఫ్యాక్షనిజం మొదలైన విషయాలను ఇక్కడి సామాన్యప్రజల నిత్య వ్యవహారాల పదజాలంతో, ఎటువంతి కల్పనలకూ, అతిశయోక్తులకూ పోకుండా అక్షరబద్దం చేశాడు.
 
    అతను చాలా యేళ్లు కలెక్తరు కార్యాలంలో పని చేశాడు. నేను ఆకాశవాణికి ధ్వనిముద్రణకు వెళ్లినప్పుడల్లా కలిసేవాణ్ణి. అతను చాలా సార్లు “సడ్లపల్లీ! నువ్వు కథల్లో ఆవేశం, కసి రవ్వంత తగ్గించుకో!! పాత్రల్ని పక్కకు నెట్టి నువ్వెందుకు చొరబడతావు??” అని సూచనలు చేసేవాడు. “వీరమాండలికుడు” అని నాకు చురకలంటించి, సరళ మాండలికం రాయించిన ఘనత దేవపుత్రదే!!
 
     ఎంత భయంకరమైన సామాజిక నగ్నాలు, సంఘర్షణలూ తన రచనలో చెబుతున్నప్పటికీ ఆవేశాన్ని కానీ, అసహనాన్ని కానీ, ధర్మోపదేశాల్ని కానీ చేయడు. పాత్రల పరిధికి మించి ఒక్క మాటకూడా ఎక్కువగా మాట్లాడించడు.
 
     కథను ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన బహుకొద్దిమంది  రచయితల్లో దేవపుత్ర ఒకడు.
 
     ఊడలమర్రి, ఇదెక్కడిన్యాయం, ఔషధం, విలోమం, ఆయుధం, సమిధలు, గురుదక్షిణ, నేను పెసిడెంటు సుట్టమురాల్ని మొదలైనవి దళితకథలు. వీటిలో రిజర్వేషన్ల మూలంగా దళితులకు సంక్రమించే పరిపాలనాధికారాలు భూస్వాముల మూలంగా ఎలా అనుభవించలేక పోతున్నరో బలంగా చెప్పిన కథ. గురుదక్షిణ- కథనైతే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ అయిన బాపు “నాకు నచ్చిన కథ”అని కితాబిస్తూ, తన చేతుల మీదుగా అద్భుతమైన బొమ్మ గీసిన ఆణిముత్యం వంటి కథ.
 
     ఐడెంటిఫికేషన్, మీసాలు, ఆర్డర్లీ, ఆరుగ్లాసులు, విడుదల, దొంగయితే బాగుండు తదితరకథలు వైవిద్య భరితమైన అధికార్ల నిరంకుశత్వాన్ని చెప్పేకథలు.
 
     మట్టికీ దాన్ని నమ్ముకొన్న రైతుకూ వున్న సంబంధాన్ని గొప్పగా చిత్రించిన కథలు మన్నుతిన్న మనిషి,ముంపు. రైతుకూ అతని పెంపుడు నేస్తం పశువుకూ వున్న ఆత్మీయబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే రచన నెర్లు. మనిషియొక్క శాడిజం మీద రాసింది సిహ్మమ్నవ్వింది అనే కథ.
 
     అతని రచన్లన్నీ మొదట్నుంచీ చివరిదాకా చదివించే, ఆలోచింప చేసేవయినప్పటికీ, నాకు అపరిమితంగా నచ్చిన కథ “రెండు రెండ్ల నాలుగు” అది ఎంత హాస్యంగా మొదలై మనల్ని కడుపుబ్బ నవ్విస్తుందో, ముగింపు గుండెల్ని చెమర్చేలా చేస్తుంది. అలా రాయడం అందరిచేతా అయ్యేపని కాదు!!
 
     “చివరి మనుషులు” కథ నేటి సమాజంలో సంపన్న వర్గాలవారూ, వామపక్ష భావాలవారూ,అధికారులూ,ప్రజల్నేలే నాయకులూ చేసే ప్రసంగాలకూ ఆచరించే దొళ్లతనాలకూ పొంతనలేని భేషజాల్ని ఉతికి ఆరేసిన రచన. ఆ కథలో తమపిల్లల్ని తెలుగుపాఠశాలలో చదివించే ఆంగ్లోపన్యాసకుడు వేరెవరో కాదు! అతడు తెలుగుతల్లి అభిమాన భాషా మానస పుత్రుడైన  చిలుకూరే!!
 
     అతడు తన ఇదరు పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో తెలుగుమాధ్యమంగానే చదివించాడు. కుమార్తె చిలుకూరి దీవెన కవయిత్రి, కథకురాలుకూడా!!
 
     ఇంకొక విషయం ఏమిటంటే అతని భార్య లక్ష్మీదేవిగారిది కర్నాటక. ఆమె అక్కడ చదివింది కేవలం నాలుగో తరగతి దాకానే! ఇతని సాంగత్యంతో తెలుగు చదవడం రాయడం నేర్చి ఓపన్ యూనివర్సిటీలో డిగ్రీకూడా పాసయ్యింది. ఇరవై దాకా కథలుకూడా రాసిన ఏమే దేవపుత్ర కథలకు మొదటిశ్రోత, విమర్శకురాలునూ!!
 
     ఇతడు రాసిన కథలు, నవలలకు ఇరవైకి పైగా అవార్డులూ, సత్కారాలూ అందుకొన్నాడు. చివరగా జాషువాజయంతిని పురష్కరించుకొని సెప్టెంబరు 28 నాడు విజయవాడలో “గుర్రం జాషువా” పురష్కారాన్ని అందుకొన్నాడు. ఇరవైఐదు దాకా విశ్వవిద్యాలయాలు ఇతని రచనలని పాఠ్యాంశాలుగా చేర్చుకొన్నాయి. పది మంది దాకా విద్యార్థులు ఇతని రచన్లపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు, యం.ఫిల్ పట్టాలు పొందారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీవారు ఆంగ్లంలో ప్రచురించిన దళితకథా సంకలనంలో ఇతని గురుదక్షిణ తీసుకోవడం మన తెలుగు కథక జాతికే గర్వకారణం.
 
    ఆగష్టు 23 నాడు హిందూపురంలో తపన సాహిత్యవేదిక తరపున తమిళనాడులోని తెలుగు సోదరులు రాసిన “రాగెన్నుల రాజ్యం” మరికొన్ని పుస్తకాల ఆవిష్కరణలతో పాటు, మా అబ్బాయి పెండ్లికి హాజరై, రాత్రి 11 దాకా నాతో ఏకాంతంగా గడిపి కుటుంబ నేపథ్యాన్నతా అదిగి తెలిసుకొని “నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, బ్రహ్మరాక్షసుడివి నీ కథ రాసి తీరుతా” అని కౌగిలించుకొని ముద్దు పెట్తుకొన్నాడు!!
 
    ఇతడు స్నేహశీలి, సౌమ్యుడు, చాలా సున్నితమైన మనస్వి. ఉబికివచ్చే ఆనందాన్ని తన్లో దాచుకోలేని వ్యక్తి. ఒక సారి అనంతపురానికి వచ్చిన గోరటి వెంకన్నతో మేమంతా కలిశాము. “సంత” తో ముడిపడిన జీవితాల్ని అభినయిస్తూ అద్భుత పదచిత్రాల పూలని తనదైన శైలిలో మా హృదయాలమీద చిలకరిస్తున్నాడు. మేము రెప్పవాల్చకుండా గుండెల్ని కూడా శబ్దించకుండా నిశ్శబ్దపరచి ఆస్వాదిస్తున్నాము.
 
     చిలుకూరి ఉన్నఫళంగా లేచి గోరటివెంకన్నను కౌగిలించుకొని తన స్పందనల్ని మాటలుగా మార్చలేక చిన్న పిల్లాడిగా ఏడ్చేశాడు. అదొక్కటి చాలు సమస్యల పట్ల ఎంతగా చలించిపోయే వాడో అని అంచనా వేయడానికి!!
 
    సెప్టెంబరు 27 నాడు పత్రికల్లో వార్తవచ్చింది చిలుకూరికి జాషువా అవార్దు ఇస్తున్నత్లు. ఫోన్ చేసి అభినందనలు చెప్పి, “మా ఊరికి ఎప్పుడొస్తావ్ మా సంస్థతరపున సన్మానం చేయాలనుకొన్నాం” అన్నాను.దానికతడు నవ్వుతూ, “నువ్వు రైతుల కతలు రాయప్పా! అదేనాకు చేసే సన్మానం” అన్నాడు.
 
     అక్తోబరు ఒకటో తేదీ నాడు ఫోన్ చేసి, “సడ్లపల్లీ! వేదగిరి రాంబాబుగారు మన కథల ప్రూఫులు పంపినాడు. ఐ.డి. చెప్పు మెయిల్ చేస్తాను అన్నాడు. “పుత్రా అయితే రేపు అనంతపురానికి నేను రావాల్సిన పని లేదా?” అన్నాను.
 
    “ఔ గదా!! రేపు అభ్యుదయ రచయితల సంఘం తరపున గురజాడ- గుర్రం జాషువాల వ్యక్తిత్వాలపై సమావేశముంది కదా!! పొద్దున్నే ఇంటికొచ్చేయ్” అన్నాడు. అతను జిల్లా రచయితల, అభ్యుదయ రచయితల సంఘాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి.
 
     మరుసటి దినం తొమ్మిదింటికే మరో కడప మిత్రునితో కలిసి ఇంటికెళ్లాను. అప్పటికే మంచం వెడల్పునా కల్లంలో రైతులు పండిన ధాన్యాన్ని నెరిపినట్లు కూర్చోవడానికే సందు లేకుండా పేపర్లనూ, పుస్తకాల్నీ పరుచుకొని, నేను పెసిడెంటు సుట్టమురాల్ని – కథ ప్రూఫు దిద్దుతున్నాడు.
 
     అతని శ్రీమతి లక్ష్మి దేవిగారు కమ్మని కాఫీ అందించారు. పిచ్చా పాటీ మాటలయ్యక, “టైమయితా వుంది, నేను బిరీన స్నానం చేసొస్తాను. ఈ ప్రూఫ్ అట్ల దిద్దు నువ్వూ మాండలికుడివే కదా” అన్నాడు నవ్వుతూ.
 
     దానికి నేను “మాండలికం అంతే భాష పరిధిని కుదించి చట్రంలో బిగించినట్లుంటుంది. ప్రాంతీయ యాస అంటే బాగుంటుంది కదా” అన్నాను.
 
    “ఎందుకు బాగుండదు! ఇంక మీదట అట్లనే పిలుద్దాంలే” అని స్నానానికి పోయాడు. దిద్దడం అయిపోయాక నా కథను కూడా అతనే తీసుకొని హైదరాబాదుకు పంపిస్తానన్నాడు. మధ్యాన్నానికి సభ ముగిసింది.
 
     అక్టోబరు 15 శుక్రవారము. శాంతినారాయణ, దేవపుత్రా ఫోన్ చేసి” మన జిల్లావే నావుగయిదు కథలున్నాయి. ఆదివారం కథల సంకలనం ఆవిష్కరణ వుంటుందని, వేదగిరి రాంబాబు మైల్ చేశాడుకదా! నువ్వు కూడా వచ్చేయ్ అందరూ కల్సి పోదా” మన్నారు. కొన్ని పునులుండడంవల్ల నేను రానని చెప్పాను.
 
     అక్టోబరు 18, ఉదయం పది గంటల సమయంలో శాంతినారాయణ గారు ఫోన్ చేసి”చిదంబరరెడ్డీ.. ఒక దుర్వార్త…” అని కొంచెం సేపు గుండెను బిగబట్టుకొన్నట్లు ఆగి మన దేవపుత్ర అని చెప్ప బోయాడు. ఏదో ప్రమాదం లాంటిది జరిగి వుండొచ్చనుకొని  ఏం జరిగింది సార్?? అన్నాను. గుండెపోటుతో మనకు దూరమైనాడు” అని ఫోను పెట్టేశాడు.
 
     నాకు కొంతసేపు ఏమి చేయాలో తోచలేదు. వెంటనే ఫేస్ బుక్కులో అతన్ని గురించి నాలుగు మాటలు రాసి, సంతాపం తెలుపుతూ పోస్టు చేసాను.
 
    క్షణాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల నుండీ  ఎడతెరిపి లేకుండా సంతాప సందేశాలు పంపిస్తుంటే- అంతమంది అభిమానులు అందునా యువకులు ఉండడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. మరి కొంత మందయితే అతని కనుమరుగును జీర్ణించుకో లేక నేరుగా నాకు ఫోను చేసిగాని నమ్మలేక పోయారంటే… ఆ సాను భూతిని, అభిమానాన్ని, ప్రేమా వాత్సల్యాల్ని ఎలా వ్యక్తం చేయను?? (ఇప్పుడు 29.10.2016 రాత్రి 10 గంటలప్పుడుకూడా దూరప్రాంతాల్లో వుండి ఆలశ్యంగా తెలుసుకొన్న వారు అతనికి సంతాప స్పందనలు వస్తూనే వున్నాయి)
 
     విషాద వార్త తెలుస్తూనే దేవపుత్ర ఇంటికి వెళ్లిన కథారచయిత బండినారాయణ స్వామి”అతని మరణంలో విషాదంతో పాటు ఒక సంతోషం కూడావుంది. ఉదయం యథాప్రకారం వాకింగు నుండి వచ్చాడు. కాఫీ తాగినాడు. భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలి పొయాడు. ఆమె భయంతో అరిచింది. అతన్ని బతికించుకోవడానికి గుండెపై ఒత్తిడి చేస్తుంటే నిద్రనుంచి లేచినట్లు లేచి “నేను నిద్ర పోతున్నాను. నాకు అందమైన కలలు వసున్నాయి. దయచేసి పాడు చేయవద్దు” అని అతని చివరి మాటలు వివరిస్తూ, “అతడు సమాధుల తోట్లో పూసిన ఒక పూవు. నా నల్లని చందమామ”అన్నాడు.
 
     రెవెన్యూ శాఖలో ఇనస్పెక్టరుగా పని చేస్తున్న వ్యక్తి ఇంతికి కావాల్సిన చక్కెర, కిరోసిన్ వంటివి అందరిలాగే బ్లాకులో కొనడం మీరెక్కడైనా చూశారా??
 
    అదేశాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని, అదే సంస్థ”మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. యథాప్రకారం ఆఫీసులోనే వచ్చి కూర్చొండి. చేతనయితే ఏదయినా పని చేయండి. మీరు ఇక్కడికి రావడమే మా కార్యాలయానికి గౌరవ సూచిక. ప్రతి నెలా గౌరవ వేతనం పదివేలిస్తాం.”అని ఎక్కడైనా అన్నట్లు విన్నారా??
 
     అంగ్లేయుల కాలంలో చెప్పలేను కానీ, ఇప్పటి వ్యవస్తలో అంతటి నిజాయితీ, వృత్తికి అంకితమై పోయిన మొదటివాడూ చివరివాడూ బహుశహా చిలుకూరి దేవపుత్ర ఒక్కడేనేమో!!
 
     బయటి ప్రపంచానికి తెలియని దళిత, బడుగు వర్గాల జీవితాల కఠోర సత్యాల్ని ఇంకా చెప్పాల్సిన దేవపుత్ర మరణం అభ్యుదయ సమాజానికీ, అణగారిన ప్రజానీకానికీ తీరని లోటు.
 
    అతడందించిన కథల కేతనాన్ని యువతరం అంది పుచ్చుకొని,విశ్వమానవ సమాజం వైపు నడిపించుకు పోయినప్పుడే  అతనికి నిజమైన నివాళి !!

*

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  దేవపుత్ర గారి సాహిత్యం గురించీ వ్యక్తిత్వం గురించి మంచి విశ్లేషణ

 2. ఎ కె ప్రభాకర్ says:

  కంట తడి పెట్టించారు. దేవపుత్ర సాహిత్యం దేవపుత్ర వేరు కాదు అని నిరూపించారు. ఇంకా నాలుగు కాలాలు గొప్ప సాహిత్యం పండించాల్సిన యీ కాలపు నిబద్ధ రచయిత అకస్మాత్తుగా వెళ్లిపోవడం విషాదం.

 3. ప్రగతి says:

  దేవపుత్ర గారి అన్ని రచనలనూ పాఠకులకు అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరం చాలా వుంది. కొన్ని పుస్తకాల కోసం నేను ఎంత ప్రయత్నించినా దొరకలేదు.

  • Sadlapalle Chidambarareddy says:

   రెండు సంకలనాలు కోసం 9490472427 నంబర్ను సంప్రదించండి

 4. విజయ్ కోగంటి says:

  మంచి అనుభవాలు పంచినందుకు కృతజ్ఞతలు సడ్లపల్లి గారూ.

 5. చాలా బాగుంది మీ వివరణ సర్

 6. వినయ్ కుమార్ ఉన్నవ says:

  దేవ పుత్ర గారి గూరించి తెలియని విషయాలు చక్కగా వివరించారు.,,ఆయన సాహిత్యాన్ని మొత్తాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి…వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ అందించగలరు..డిశంబర్ మొదటి వారంలో విజయవాడలో బహుజన సాహిత్యసభ పెడుతున్నాం.అందులో ఒక సెషన్లో దేవ పుత్ర గారి రచనల మీద మాట్లాడాలి:

  • Sadlapalle Chidambarareddy says:

   అతని నంబరు 8500436856. అతను ముఖ పుస్తకంలో ఉన్నాడు దాని ద్వారా అతని కుటుంబాన్ని సంప్రదించండి.

 7. Chilukuri Devaputragaari Sahithyam mariyu vyakthitwam gurinchi chadivi manasu pongipoyindi. Ika mana madhyalo leranna vishsyam anthe badapettindi. Vaarini parichayam chesina meeku dhanyavadhalu.

 8. చొప్ప.వీరభధ్రప్ప says:

  చాల ఉత్తములు సౌమ్యులు సహృదయులు దేవపుత్రగారు .ఇప్పటికీ ఆయన మనమధ్య వున్నట్లే నాకనిపిస్తుంది.వారినిగూర్చి మంచి విశ్లేషణ చేసినారు. మీ మాట లు చదువుచూ కళ్ళ నీళ్ళుభికి వచ్చాయి. చిదంబరరెడ్డిగారూ

  • Sadlapalle Chidambarareddy says:

   వీరభద్రప్పా మన ప్రాంతంలో పుట్టి మన సమస్యల మీద నిజాయితీగా రాసిన అతన్ని గురించి సమాజానికి చెప్పడం మన బాద్యతకదా!! మీ హృదయానికి వందనాలు.

 9. m.viswanadhareddy says:

  మట్టి బిడ్డల గురించి రాసిన మానవ మాత్రుడి పేరు దేవపుత్రుడు. పేరులో నేమున్నది ? పైరులో పాటున్నది.
  మట్టిలో మమతున్నది. మనిషి శ్వాసలో మట్టి ఊసున్నది. ఆ మనిషి మన్నుతిన్న మనిషి కథను షార్ట్ ఫిలిం చేశాను
  చూడండి అంటే చూసి ఫోన్లో చిన్న పిల్లోడల్లే గంటసేపు మాట్లాడి ఎక్కువ తప్పులు చూపితే ఎక్కడ డీలా పడతానేమో అని నా భాషను మీ చిత్తూరు యాసలోకి మార్చుకొని అద్భుతంగా తీశావని భుజం మీదకు పార ఎత్తుకున్న మాదిరి నన్ను మోసిన మనిషి గురించి ఎన్నని మాట్లడను.. మనిషి లేడు మట్టివాసన ఉన్నంత వరకు ఆ మనిషి మాట మట్టిలో మొలకెత్తుతూనే ఉంటుంది

  • Sadlapalle Chidambarareddy says:

   మట్టి వాసన తెలిసిన మెత్తని మాగాణి హృదయులు కాబట్టే మీ మనసుకు మట్టి జీవి అతని అక్షరాల్లో దర్శనమిచ్చాడు. సీమ పొలాల్లో ఎండిన మట్టిపెళ్లని మా శ్రమ జీవుల చెమటల్తో తడిపి, దాన్ని మీ పాదాలకు పారాణిగా రాద్దామనిపిస్తోంది నేస్తమా!! ఆ చిన్న సినిమా అందుబాటులో ఉంటె నాకు లింకు చేస్తే ఆనందిస్తాను . మీ స్పందనకు వందనాలు.

మీ మాటలు

*