సిందూరపు సాయంత్రం 

 evening-walk
మళ్ళీ ఎన్నాళ్ళకి వచ్చింది ఇట్లాంటి  సాయంత్రం
నీరెండ కాంతిలోకి వానచినుకులు జారినప్పుడు
ఆకాశం ఒడిలోకి ఇంద్రధనస్సు ఒంగిన సాయంత్రం
కళ్ళకు కట్టిన గంతలు వీడినప్పుడు
చేతులారా ఓ కలను తాకిన సాయంత్రం
సూర్యుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, వెలుతురు విడిచిన సాయంత్రం
అప్పుడే మెరుపులద్దుకున్న చిన్న నక్షత్రం కోసం
చందమామ కొత్త కాంతితో ఉదయించిన సాయంత్రం
కలిసి వేసే మన నాలుగడుగుల కోసం
ఎప్పటినుంచో ఒడ్డును కనిపెట్టుకున్న ఈ పెద్ద ప్రవాహం
ఏది ముందో ఏది వెనకో తేల్చుకోలేక
మాటలన్నీ మౌనంలోకి ఒదిగిన సాయంత్రం
ఎవరి వెనుక ఎవరో, ఎవరికెవరు తోడో తెలియని చిన్న ప్రయాణం
కంటిచూపు వేసిన ప్రశ్నకు చిరునవ్వు చెప్పిన అందమైన సమాధానం
ఎవరికివారు విడివిడిగా నేర్చుకున్న మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ
గతమూ … భవిష్యత్తూ తగలని ఒక నిర్మల వర్తమానంలో
ఇప్పటికిప్పుడు ఈ క్షణాల్లో ఉండడం కంటే గొప్ప స్వేఛ్చ మరేదీ లేదనుకుంటూ…
వయసుమళ్ళిన నడకలు ఇక అలసిపోని సుదీర్ఘమైన సాయంత్రం… !!
గతకాలపు దిగుళ్ళకు రెక్కలొచ్చి గుండెను ఖాళీ చేసి ఎగిరిపోతున్న సాయంత్రం
మిగిలిన జీవితానికి మధురమైన మలుపై నిలిచిపోబోతున్న సాయంత్రం
ద్వితీయార్ధంలో సింధూరం దిద్దుకున్న శుభారంభపు సాయంత్రం, !!
ఎన్నాళ్ళకొచ్చింది ఇట్లాంటి  సాయంత్రం!
———————— రేఖా జ్యోతి

మీ మాటలు

 1. Venkat Suresh says:

  చాలా చాలా బాగుంది…

 2. వాసుదేవ్ says:

  అవునెన్నాళ్ళకొచ్చిందీ సాయంత్రం! గొంతులో చిక్కుకున్నదేదో మీరు సునాయాసంగా తీసేసిన అనుభూతినిచ్చారు కవిత చివరికొచ్చేసరికి. శిల్పంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు—సాయంత్రాన్ని చాలా జాగ్రత్తగా వాడారు. మరీ ఎక్కువగా వాడకుండానూ అలానే ఆ పదాన్ని పాఠకుల స్మృతినుంచి విడిపోకుండా జాగ్రత్తపడ్డారు…నచ్చింది.

  • “… గొంతులో చిక్కుకున్నదేదో తీసేసిన భావన ..” ధన్యవాదాలండీ మీ స్పందనకు !!

 3. చాలా బాగుంది ….

 4. మైత్రేయి says:

  గతమూ భవిష్యత్తు తగలని నిర్మల వర్తమానం….తలచుకుంటేనే హాయిగా వుంది.కానీ…
  అసలు సాధ్యమేనా !?!

  • :) పూర్తి ఏకాగ్రత ఆ సాయంత్రాన్ని చదవడంలో మాత్రమే నిలిపినప్పుడు … ఒక నిర్మల వర్తమానం సాధ్యపడింది !! మీ ‘ హాయి ‘ స్పందనకు ధన్యవాదాలండీ ..

మీ మాటలు

*