మూడు మెలకువలు నీలోకి…

Artwork: Satya Sufi

Artwork: Satya Sufi

1

ప్రేమంటే పొదువుకునే హృదయమే కాదు

చీకటి భ్రమల్లో కృంగిపోతున్న జీవితానికో మేల్కొలుపని

ప్రతి కదలికలో తోడయ్యే నీ చూపు కదా చెప్పింది!

ఘనీభవించిన భయాలను ఒక్కొక్కటిగా సింహదంతిలా సాగనంపుతూ

నా చేతి వేళ్ళను నీవేళ్ళతో అనువుగా హత్తుకుంటుంటే

అప్పుడేగా తెలిసింది మన ప్రాణాలొకటేనని!

ఎగసే భావాలకు అర్థాలెరుగని నా పిచ్చిదనాన్ని

నిలువెత్తు నిలబడి నీలో కలిపేసుకుంటావే

అదిగో ఆ ఆప్యాయతే కదా నా కాలమెరుగని సుఖం!

ఎడబాటు వెలిగించే అభద్రతలో

నమ్మకాల నలుపు తెలుపుల నా వూగిసలాటచూసి  నువ్వు నవ్వేస్తుంటే

వూదారంగేదో నా కన్నుల్లో  నెమ్మదిగా నిండుకుంటోంది !

నీ మెడవొంపులో వొదిగే సమయం మంచుకరిగేంత

స్వల్పమే అయినా మరో కలయిక కోసం

నన్ను సజీవంగా ఉంచే సంజీవనే అదే కదా!!!

 

2

వేళ్ళ కొసల్లో జారుతున్న ముగ్గులా

జ్ఞాపకాల ధార …

ఆరోజు మాటలేవో కలిపానా

మనసునలాగే నిలిపేసుకున్నావ్ !

అందమో ఆనందమో మృదువుగా తాకుతుంటే

దాని కేంద్రమై విస్తరిస్తావ్ !

సన్నాయిలా నీ ఊపిరేదో నాలో వూదేసి

వొంట్లో గమకాలై  వొణికిస్తావ్ !

దూరాన్ని ముద్దాడుతూ పెదవిపైనే వుంటావ్

నాలో కలిసిపోయి మధురగానమై వేధిస్తావ్ !

 

చీకట్లో పరుగును బిగికౌగిలితో ఆపి

రెండు ప్రాణాల కలయికలో..ప్రియా! నీవు చేసిన అద్భుతం

హరివిల్లుగా  ప్రేమ సుగంధం …తెలుపు నలుపుల జీవితానికి రంగులద్దుతూ!

 

3

అల్లరి కళ్ళూ …కొంటె నవ్వులూ

ప్రాణవాయువుని ప్రసాదించే మెత్తటి పెదవులు

ప్రేమగా శిరసు నిమిరే నీ వేలి కొసలూ

బలంగా హత్తుకునే బాహువులూ

మనసు నింపేస్తుంటే

ఇక చేరాల్సిన తీరమేదో తెలిసిపోయింది

 

వేలయుగాలుగా ఆగని పరుగు నీ చేరికకేనని

తెలిసిన ఈ  క్షణం ఉనికిని మరిచి పెనవేసుకొనీ

ఏకత్వాన్ని అనుభవించనీ

ప్రేమతీవ్రతను  ప్రకటించే దేహబంధాలూ

నీ పెదవులు దాటి నను తాకే ప్రతి పదబంధమూ

ఒక్కో మృత కణానికీ మళ్ళీ  పురుడుపోస్తోంది ప్రియతమా!

*

మీ మాటలు

  1. గంగాధర్ వీర్ల says:

    మీ తొలి కవిత్వపు అక్షరీకరణ
    మల్లెల్ని గుప్పెట్లోకి తీసుకుని సుతారంగా.. పాలరాతి పలకాలపై పేర్చినట్టుగా ఉంది
    ఆనక వాటిని తనివితీరా తడుముతూ.. వాటితోనే ఊసులాడుతూ.. ప్రేమగా మాట్లాడినట్టు ఉంది.
    ….
    కీపిట్ అప్ ఝాన్సీగారు…
    మరిన్ని.. కవితలు రాయాలని కోరుకుంటూ…

  2. Venu udugula says:

    Awesome ….liked alot. Kudos to you💐💐💐💐

  3. వాసుదేవ్ says:

    మీరెవరో నాకు తెలీదు కానీ మీ అక్షరాలవెంట నడుస్తున్నంతసేపూ మీరు నాకు తెల్సనే భ్రమలోనే ఉన్నా. మిమ్మల్నిక్కడ చూడటం ఇదే మొదటిసారనుకుంటా..కాలాన్ని కాగితంలో చుట్టేసి ఆ కాగితానికి భలే రంగు రంగుల అక్షరాల గౌన్లన్నీ తొడిగారు. ఇంకా సూటిగా రాయగలరనుకుంటా, మీరు కావాలనుకుంటే! అభినందనలు

  4. Kcube Varma says:

    Hrudayaanni hattukune bhaava veechikalu.. abhinandanalu..

  5. మూడు మెళకువలు అద్భుతమైన మెలకువ లోకి సారి తీస్తుంది.చాలా కవిత్వం గా సాగిపోయింది కవిత.

మీ మాటలు

*