కవిత్వం నాకెప్పుడూ మాయా వస్తువే!

prasada2

హిమాలయం ఎక్కుడుంది? అని

బడి బయట గాలిపటం ఎగరేసుకుంటున్న పిల్లాడిని అడిగాను

అదిగో అదే అని వాడు పై పైకి ఎగురుతూ పోతున్న

తన గాలిపటాన్ని చూపించాడు

హిమాలయం ఎక్కడుందో

 నాకు మొదటిసారి తెలిసిందని ఒప్పుకోనా మరి?

అని ప్రముఖ హిందీ కవి దిగ్గజం కేదార్ నాథ్ సింగ్ అంటాడో కవితలో. నిజమే మనకేం తెలుసు? బహుశా కవిత అంటే ఏమిటని ఎవరైనా పిల్లాడిని అడిగితేనే కాని తెలియదనుకుంటా నా మట్టుకు నాకు.

     అనాదిగా అదే సూర్యుడు అదే చంద్రుడు. అదే చీకటి అదే వెలుగు. అదే ఏరు అదే నీరు. అదే చెట్టు అదే నీడ. అదే పిట్ట అదే గాలి. అదే నింగి అదే నేల.  యుగాల పేగుల్లో ఊపిరి పోసుకుని  ఒకరిగా బయటకు రావడం. అనాది మానవ అనంత ఛాయా  ప్రవాహంలో కలిసి వెళ్లిపోవడం అంతా అదే.  రోజూ రాత్రి మరణం..ఉదయమే జననం. బతుకు నిండా పునరుక్తే. ఆలంకారికులు పునరుక్తిని దోషమన్నారు కాని దీన్ని అలంకారంగా మార్చుకోవడమే కవిత్వం అనుకుంటా.

        ఇది నా అయిదో కవితా సంకలనం. నాలుగో కవితా సంపుటి పూలండోయ్ పూలు వచ్చి రెండేళ్ళు దాటింది. ఈ రెండేళ్ళలో దేశంలోను, ప్రపంచంలోను, నాలోనూ చాలానే జరిగాయి. ఏది కవిత్వం..ఏది కాదు? అన్నది నాకెప్పుడూ ఒక పజిలే. నేను రాసేదంతా కవిత్వమేనా అన్నది కూడా ఎప్పుడూ నన్ను నా అక్షరాలే గిచ్చి గిచ్చి అడుగుతున్నట్టు అనుమానమే. అయితే కవులుగా మొనగాళ్ళు అనిపించుకున్న పెద్దల నుండి ఈ తరం యువకవుల వరకూ నా కవితల మీద వ్యక్తం చేసిన అపారమైన ఆత్మీయ రసస్పందన చూస్తే ఎక్కడో లోపల కించిత్తు తృప్తి కలుగుతుంది. అదే నా లోని ఆలోచనలను..స్పందనలను..భావాలను కవితలుగా మలిచే జీవధాతువుగా పనిచేస్తుంది.

           కవిత్వం దేని మీద రాయాలి అన్ని విషయంలో నాకెలాంటి ఊగిసలాటలi లేవు. ఎలాంటి నిషేధాలూ లేవు. అయితే కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరించకూడదన్నదే నా వాదన..నా నివేదన. ఈ పుస్తకం మొదటి, చివరి కవితలు ఆ బాధ్యతను గుర్తు చేసేవే. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య కవులు సందర్భాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇష్యూస్ వెంట రచయితలు కొట్టుకుపోతున్నారని కొందరు వింత వాదనలు చేస్తున్నారు. ఇది అనాదిగా వున్న విమర్శే. వాళ్ళన్నదే నిజమైతే కవులు రచయితలు సరైన మార్గంలోనే పయనిస్తున్నట్టు లెక్క. కాని వర్తమాన చరిత్రలో కొనసాగుతున్న దుర్మార్గపు పరిణామాలను కవులు కళాకారులు పట్టించుకోవలసినంతగా పట్టించుకోవటంలేదన్నదే నా కంప్లయింట్.

   సాధు జంతువులు జనం మీద విరుచుకుపడుతుంటే కవులే పులల వేషం కట్టి అసహాయుల పక్షాన పంజా విసరాల్సిన  తిరకాసు కాలమొకటి వచ్చింది. నిర్భయ భారతమంతా   అక్షరాల కొవ్వొత్తులు నాటాల్సిన సందర్బం ఏర్పడింది. అక్షర గర్భంలోనే ఆత్మహత్యకు పాల్పడే పెరుమాళ్ మురుగన్ ల చేతుల్లో భరోసా బాంబులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరాల్లో కల్బుర్గీలు..అడవుల్లో శ్రుతి రక్తధ్వానాలు.. బుల్ డోజర్లకు వేలాడు తున్న వేలాది నిర్వాసిత గ్రామసమూహాలు..ఎన్నెన్ని తరుముతున్నాయి? కత్తుల రెక్కలతో ఎగురుతున్న క్యాంపస్ లు కనిపించడం లేదా..?  చుక్కల ఆకాశంలోకి ఎగరిపోతున్న రోహిత్ లను కాపాడుకోవడానికి గుండెల్ని పెకలించుకుని అన్ని దిక్కులా కాపలా పెట్టాల్సిన అవరసంలో వున్నాం కదా..! ఒకపక్క శతాబ్దాల నుంచి తరిమేసి తరిమేసిన తిరిగి ఆ  ఇళ్ళల్లోకి.. అదే ఊళ్ళల్లోకి ఆజా..ఆజా వాపస్ అజా ఆజా అంటుంటే ఏది ఆహ్వానమో..ఏది ఆదేశమో..పిలిచేది చేతులో కత్తులో గుర్తెరిగిన కలాలు కావాల్సిన అనివార్య సందర్భాలు కావా ఇవి?  ఎలా? కవులు మరి ఈ అంశాలను కళ్ళెత్తి చూడకుండా ఎలా వుండగలరు?

      కాకపోతే ఆయా అంశాలను కవులు ఎంత కళాత్మకంగా కవిత్వీకరించారన్నదే ముఖ్యం. సామాజిక కళాంశాలను ఏకం చేసే నేర్పరితనం లేకపోతే ఎన్ని ఇష్యూస్ మీద ఎంత కవిత్వం పోగులు పెట్టినా వ్యర్థం. నేను 2016, ఫిబ్రవరి 2న ఆంధ్రజ్యోతిలో రాసిన కవిత ఎప్పుడైనా అన్నది రోహిత్ గురించే. కాని ఎక్కడా పేరు పెట్టలేదు. దాన్ని సరిగానే కన్వే చేశానని వచ్చిన స్పందన చూశాక అర్థమైంది. అరుణ్ సాగర్ మెసేజ్ (అట్టచివర వున్నది) దాన్ని చదివి పెట్టిందే. వాదన కోసం వాదనలాగా కవితో..కథో రాయకూడదన్నది నా అభిప్రాయం కూడా. ఆ అంశాన్ని కళాత్మకంగా పతాక స్థాయికి తీసుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో భాగంగా నేనేమంత పెద్దగా రాణించానా అంటే నాకేమీ అంత నమ్మకం కలగటం లేదు. కడ దాకా ఆ ప్రయత్నం ఒక తపస్సులా సాగుతూనే వుండాలి.  

                   కవిత్వం నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో ..ఏది తక్షణ ప్రాధాన్యమో..తత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో..ఎప్పుడూ గందరగోళమే. కొన్ని వాదనలతోనో ..కొన్ని విశ్వాసాలతోనో..కొందరు కొన్ని కవితల్ని విపరీతంగా ప్రేమిస్తారు. కొందరికి అవి చాలా సామాన్యంగా పేలవంగా కనిపిస్తాయి. వందల ఏళ్ళు   ముందుకుపోయి ఆలోచిస్తే  వర్తమానాన్ని రికార్డు చేయలేవు.. రిప్రజెంట్ చేయలేవు. ఈ కాలంలోనే  ఇరుక్కుపోతే విశ్వాంతరాళంలో ఏ గోళం పైనా నీ చూపుల నీడలు వాల లేవు. అందుకే కవిత్వం నాకో మాయ వంతెన. మాయ దీపం. మాయ రూపం . మాయ చూపు. మాయ నవ్వు. మాయ కౌగిలి. మాయ ఊయల.మాయ శవ పేటిక. ఈ మాయామేయ  చలచ్చల వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని కవిత్వానికి వస్తే నాకో చూపుంది. దానికెంత స్పష్టత వుందో చెప్పలేను కాని..చూడాల్సిందేదో చెప్పగలను. రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు అది నా జీవన వ్యాపకం కాబట్టి.

     నా అంతర్ముఖీనత్వం, వయసురీత్యా అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్త్విక ధోరణులు, శిల్పం మీద  మోజు నన్ను మరో వైపుకు నెడుతూనే వుంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే..పలకరింపులే..పలవరింతలే ఈ కవితలు.

                                               —————————

                                                                                       prasada1

మీ మాటలు

  1. విలాసాగరం రవీందర్ says:

    కవిత్వం దేని మీద రాయాలి అన్ని విషయంలో నాకెలాంటి ఊగిసలాటలi లేవు. ఎలాంటి నిషేధాలూ లేవు. అయితే కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరించకూడదన్నదే నా వాదన..నా నివేదన. ఈ పుస్తకం మొదటి, చివరి కవితలు ఆ బాధ్యతను గుర్తు చేసేవే. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య కవులు సందర్భాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇష్యూస్ వెంట రచయితలు కొట్టుకుపోతున్నారని కొందరు వింత వాదనలు చేస్తున్నారు. ఇది అనాదిగా వున్న విమర్శే. వాళ్ళన్నదే నిజమైతే కవులు రచయితలు సరైన మార్గంలోనే పయనిస్తున్నట్టు లెక్క. కాని వర్తమాన చరిత్రలో కొనసాగుతున్న దుర్మార్గపు పరిణామాలను కవులు కళాకారులు పట్టించుకోవలసినంతగా పట్టించుకోవటంలేదన్నదే నా కంప్లయింట్….

    నాకున్న అనుమానాలు పటాపంచలయ్యాయి మూర్తి సార్

    మీ పుస్తకం ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఎదిరిచూస్తున్న

మీ మాటలు

*