ఒక పరిమళం, ఒక ఊపిరి వెచ్చదనం!

swamyనేల మీద పాదాలు ప్రతిరోజూ నడవనక్కర్లేదు. ఆ నేల నీదైతే చాలు. ఆ నేల నీ పాదాలకోసం ఎదురు చూస్తుంటుంది. నేలకూ పాదాలకూ ఒక విడదీయరాని అనుబంధం ఉన్నది. నీవెక్కడుంటేనేం? అది నీ గుండెలో ఉంటుంది. ఆ నేల తడి కోసం ఎదురు చూస్తుంటుంది. వాన చినుకుకోసం తపించుకుపోతుంది.

నారాయణ స్వామి మనసులో ఒక బీటలు వారిన నేల ఉన్నది. ఆ పగుళ్ల గాయాల మధ్య అతడు నిత్యం ఆక్రందిస్తున్నాడు. ఆ నేలలో నెత్తురు ఇంకిపోయిఉంది. ఆ నేలలో చెట్లు మ్రోడులయ్యాయి. పండుటాకులు ఎన్నడో రాలిపోయాయి. ఆ నేల వైపు మేఘాలు లేని ఆకాశం దీనంగా చూస్తుంటుంది. పక్షులు రెపరెపా కొట్టుకుంటూ ఎక్కడికో పయనమైపోతుంటాయి.

నేలపై పచ్చికబయళ్లు ఏర్పడేటప్పుడు? ఆ పచ్చిక బయళ్లను మంచు బిందువులు ఆలింగనం చేసుకునేది ఎప్పుడు? ఆ మంచుబిందువులను నీ పాదాలు స్ప­ృశించేటప్పుడు? ఆకాశంలో మేఘాలు దట్టమయ్యేదెప్పుడు? అవి దట్టంగా క్ర మ్మి, వాటి గుండెలు బ్రద్దలై అహోరాత్రాలు వర్షించినప్పుడే నేల గుండె శాంతిస్తుంది. నేల పరిమళం నిన్ను ఆవహిస్తుంది.

‘వానొస్తద?’  ఒక అద్భుతమైన ప్రతీకాత్మకమైన కవిత్వం. వాన రావాలన్న కోరిక అందులో ప్రగాఢంగా ఉంది. కాని వాన రావడం లేదన్న బాధ అంతకంటే లోతుగా ఉన్నది. వాన రావడం సహజమైన ప్రక్రియ. అది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. కనుక ఎప్పుడో ఒకప్పుడు వాన వచ్చి తీరుతుందన్న ఆశాభావం కూడా ఈ కవిత్వంలో ఉన్నది. మన దూప తీర్చేందుకు మనమే జడివాన కావాలన్న ఆశాభావం ఇది.

‘వానొస్తద?’  అన్నది ఒక విమర్శనాత్మకమైన కవిత్వం. వాన యాంత్రికంగా రాదు. వానకోసం ప్రయత్నించే వాళ్లంతా ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. వానొస్తందని నమ్మిన వాళ్లు, వానకోసం సంఘర్షించిన వాళ్లు నేల పగుళ్ల మధ్య సమాధి అయ్యారు. ఎందరి నెత్తురో నేలను తడిపింది కాని వాన నీరు రాలేదు. వాన కోసం ఎదురు చూసే కళ్లు లోతుకుపోయాయి కాని బావుల లోతుల్లో ఊటైనా రాలేదు. కాగితపు పడవలు సిద్దంగా ఉన్నాయి. చిన్న నీటి ప్రవాహం వస్తుందోమో తేలుతూ పసిపిల్లల కళ్లలో ఆనందం చూసేందుకు..

‘వానొస్తద?’  అన్నది ఒక విషాద కవిత్వం. ఒక ఆత్మహత్యకూ, ఒక హత్యకూ అంకితమైన కవిత్వం. కన్నీళ్లతో నేలను తడపాలనే ప్రయత్నించిన కవిత్వం. హత్యలూ, ఆత్మహత్యల మ«ధ్య కాలాన్ని బంధించిన కవిత్వం. అది ఉదయం, సాయంత్రాల మధ్య రెపరెపలాడిన కాలం. విగ్రహాలు పడగొట్టిన వాడు లేడు. వాడు లేడన్న వార్తను జీర్ణించుకోలేని కవిత్వం. ఉరి తాడుకు కలలు ఊగుతూనే ఉంటాయి. ఒకరొక్కరే వెళ్లిపోతున్నారు నిశ్శబ్దంగా బయటకు రాన్ని శోకాన్ని, పుట్టెడు దుఃఖాన్నీ మన గొంతుల్లో మిగిలించి.. ఎంతమందిని ఊరుపేరు లేక మంట్ల గలిపిండ్రు? బిడ్డలారా, మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి.. ఎందర్ని పోగొట్టుకున్నం, ఎన్ని సార్లు కాటగలిసినం.. ఎన్ని కన్నీళ్లు మూటగట్టుకున్నం..

krishnudu

‘వానొస్తద?’  ఒక ఏకాకి వాస్తవ కవిత్వం. కవి ఎప్పటినుంచో ఒంటరి. నిద్రకు వెలిఅయ్యాడు ఒకడు. దినాల్లో కాళ్లీడ్చాడు మరొకడు. గ దిలోపలి చీకటిలో ఒకడు, చీకటిక్షణాల అగాధాల్లో, ఎండిన ఆకుల్లాంటి నదీ తీరాల్లో మరొకడు. వీడిది దొరికినదాన్నే ప్రతిసారీ పోగొట్టుకుంటున్న ప్రయాణం. ఇంతమందీ ఉండి నిర్జనమైన కూడళ్లలో ఒంటరిగా ఆరిపోయిన కొవ్వొత్తుల మధ్య వాడే. సమూహమే ఒంటరైనప్పుడు ఒంటరే సమూహమైన కల ఎక్కడ? జవాబివ్వండి నిరంతర నినాద, అనంత సుదీర్ఘ విప్లవ ఆకాంక్షావాదులారా? స్వాప్నికులారా?

‘వానొస్తద?’  ఒక తప్త హృదయ కవిత్వం. ఎన్ని శతాబ్దాలైంది మనిషిని కౌగలించుకోక? ఎంతకూ కనబడని మొగులు. ఎవరైనా ఇంత మట్టి వాసన చూపిస్తారా? గడ్డకట్టిన సుదీర్ఘ అపరిచయం. కందరీగలా కుట్టే కనికరంలేని ఒంటరి చిన్నతనం. ఒక నిశ్శబ్దాన్ని గుసగుసగా నైనా వినాలన్న తాపత్రయం.

‘వానొస్తద?’ ఒక స్వాప్నిక కవిత్వం. తొలి పొద్దు కర స్పర్శకు రెక్కల్ని విచ్చుకున్న కొత్త రాగాల పాటల్ని ఆలపిస్తుంది.

‘వానొస్తద?’  పుస్తకం పేరులోనే కాదు. పుస్తకం నిండా ప్రశ్నల కవిత్వం. ఎన్ని ప్రశ్నలో.. ఎక్కడైనా ఉన్నామా? అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహాల్లో చిక్కుకుపోయామా?. ఎట్ల వొస్తవో? ఏ వెలివాడల్లో వెతకాలి నిన్ను? దారేది అవుతలికి? దొరుకుతద? దొరకని దానికోసమా వెదుకులాట? మళ్ల వస్తవ? బాపూ.. నీ యాది..తొవ్వ తెలుసా? ఎట్టపోతవు ఒక్కనివే. ఈ పట్టపగటి చీకటి పూట? ఆడుకున్న బస్తీ.. చెయ్యి పట్టుకున్న తంగెడుపూలు ఏవీ? వాళ్లెవరో? కాలం కళేబరం ఊరేగింపులో పూలయి గీసుకపోతరు..

వాన బయట కురవడం లేదు. నారాయణ స్వామి మనసులో కురుస్తున్నది. చప్పడు బయటకు వినిపిస్తున్నా, వాన మాత్రం లోపల కురుస్తున్నదని నారాయణ స్వామికి తెలిసిపోయిందని కెఎస్ ఒక్క మాటలో చెప్పాడు.

‘వానొస్తద?’ ఒక పసివాడి కవిత్వం. చిన్నప్పుడు తాగిన పాల తీపినీ, ఆడుకున్న బొమ్మల్నీ, పాత అర్ర వెనుక ఒంటరితనపు దోస్తుల్నీ అన్వేషించే కవిత్వం. ప్రేమ రాహిత్యాన్ని సహించలేని మనస్తత్వం. ప్రేమకాకపోయినా కనీసం ద్వేషాన్నైనా తడి వెచ్చగా తొలకరించమని తపించే కవిత్వం. గమ్యం కనపడని ప్రతిసారీ పుస్తకాల్లో దాచుకున్న బంతిపూల రెక్కల్ని తడిమి చూసుకున్న కవిత్వం.

ఈ పసివాడిని మనం హత్తుకుందాం.. అతడు అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని దూరం చేద్దాం.ఎందుకంటే ఆతడు మనకు దూరంలో లేడు. దూరంగా ఉన్నాననుకుంటున్నాడు. కాని అతడిదీ మనదీ ఒకటే బాధ.. ఇది సామూహిక బాధ. ఇది సామూహిక కవిత్వం.  ‘వానొస్తద?’ మన సంభాషణ, మన సందర్భం. మన కాలం. మన రోదన. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పడనీ..

నారాయణ స్వామి వచ్చాడు.. ‘వానొస్తద?’ మనకు ఇచ్చాడు. నీ రాకని నీ పరిమళం చెప్పనీ.. నీ సమక్షాన్ని నీ ఊపిరి వెచ్చదనం తెలుపనీ. నువ్వులేని తనాన్ని నీ మౌనం పలకనీ.. ‘వానొస్తద?’ ఒక పరిమళం. ఒక ఊపిరి వెచ్చదనం. ఒక మౌనం.

(నారాయణ స్వామి కవిత్వం ‘వానొస్తద?’ సమక్షంలో ) 

మీ మాటలు

  1. Writer has shiwn the presrnt siciety deep fighting between social revolution between feudal culture and modern technology.
    Commodity control to currency controlled economies consumer is flying like a paper where and he will fell doesn’t know

  2. విలాసాగరం రవీందర్ says:

    కవి హృదయాన్ని గుండె చప్పుడును చక్కగా ఆవిష్కరించారు కృష్ణుడు గారు

    • krishnarao says:

      ధన్యవాదాలు రవీందర్ గారు.. గుండె చప్పుడు విన్నందుకు

  3. Delhi Subrahmanyam says:

    మిత్రులు కృష్ణారావు గారి కృష్ణపక్షం కోసం నిరీక్షణ ఫలించింది . మిత్రుల నాయణస్వామి గారి “‘వానొస్తద?’
    ను తన దైన గొప్ప కవి పద్ధతిలో చక్కగా , తప్పక చదివించేలా పరిచయం చేసారు. ఇప్పడు నేను అర్జెంట్ గా హైదరాబాద్ లోని మిత్రుల సహాయం తో ఈ పుస్తకం వెంటనే తెప్పించేసుకుంటాను .

  4. narayanaswamy says:

    కృష్ణుడూ చాలా బాగా రాసినరు – గొప్ప తడితో ఆర్ద్రతతో ప్రేమతో పలికిన మీ ఆప్త వాక్యాలు కదిలించాయి – మీకు బోలెడన్ని నెనర్లు

  5. Sivalakshmi says:

    ఎంతో ఆర్ద్రంగా విశ్లేషించి “వానొస్తద?” పరిమళాల్ని చక్కగా అర్ధం చేయించినందుకు అభినందనలు కృష్ణా!

    • krishnarao says:

      సుబ్బు, స్వామీ, శివలక్ష్మి గార్లకు ధన్యవాదాలు.

Leave a Reply to Giribhai10 Cancel reply

*