అక్షరాల్లో బతికిన మాట!

Velturu2

1

1980ల  చివరి రోజులు-

వొక శనివారం  సాయంత్రం పురాణం గారింటి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశం ముగిసింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో  నండూరి గారు నన్ను ఆపారు. “నువ్వు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంత చదివావ్?” అని అడిగారు. నిజానికి నేను అప్పటికి కొంత మాత్రమే చదివాను, నా  ప్రాణమంతా  ఇంగ్లీషు కవిత్వంలో  వుంది కాబట్టి! “కొంత కూడా చదవలేదు!” అన్నాను సిగ్గేమీ  పడకుండా! (సిగ్గేలా తెలుగు కవికి?!) “ఇవాళ్టి నించి రెండు నెలలు నీకు కృ.శా. క్రాష్  కోర్సు!” అని అప్పటికప్పుడు ఆయన వాళ్ళింటికి తీసుకువెళ్ళి, కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు అరువిచ్చారు. అప్పుడు తన  దగ్గిర వున్న గొప్ప  నిధిని కూడా నాకు చూపించారు. అవి కృష్ణశాస్త్రి గారు మాట పడిపోయాక చేసిన లిఖిత సంభాషణల చీటీలు! మాట పడిపోయినా ఆయన మాట్లాడడం మానుకోలేదు. చిన్ని చిన్ని కాయితాల మీద రాతపూర్వక సంభాషణలు చేసే వారు. నండూరి ఆ చీటీలన్నీ ఎంతో శ్రద్ధగా దాచి పెట్టుకున్నారు. “మాట- విలువ మనకి తెలీదు నోరు పనిచేస్తున్నంత కాలం! కాని, ఆ నోరు పడిపోయినప్పుడు ఎంత వేదన లోపల గూడు కట్టుకొని వుంటుందో కృ.శా. ని చూస్తూ ఎంత బాధపడే వాడినో! ఈ  కాలంలో మనకి నోరుంది కాని మాటల్లేవ్. మాట్లాడాలీ అన్న ఆయన తపన ముందు మూగతనం వోడిపోయింది!” అన్నారొక సారి నండూరి!

నేను పెన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నించి నెలరోజులుగా రోజూ చదువుతున్న కవి – తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! జీవితానికి ఎంత  దయలేదో ఎప్పుడూ అర్థం కాదు. పలికితే ముత్యాలు రాశిపోసినట్టుండే ఈ స్వీడిష్ మహాకవికి కూడా మన కృష్ణశాస్త్రిలాగానే మూగతనం వచ్చేసింది. ఇరవై ఏడేళ్ళ కిందట అంటే తనకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో విపరీతమైన ప్రయాణాలూ, వెళ్ళిన చోటల్లా అద్భుతమైన ప్రసంగాలూ చేస్తూ వచ్చిన తోమాస్ కి గుండెపోటు, పక్షవాతం వల్ల నోరు పడిపోయింది. కాని, జీవితం పట్ల ప్రేమా తపనా తోమాస్ ని బతికించింది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ  మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు!

 

2

తోమాస్ ని ఎందుకు ఇంతగా చదువుకుంటున్నానో నాకు ఇంతదాకా తెలియదు. బహుశా, కొందరు కవులు మనతో పాటే కొంత దూరం నడుస్తారు, మన భుజాల మీద చేతులేసి! ఆ చేతుల స్పర్శలోని భద్రభావమేదో ఆ కవిని మనకి దగ్గిరగా తీసుకొస్తుంది. ఈ కవి  ఈ క్షణంలో నా తోడు నిలవాలి అనిపిస్తుంది. అలాంటి భావనే కావచ్చు!

మాట పడిపోయాక తోమాస్ కూడా కృష్ణశాస్త్రి గారిలాగానే చిన్న చీటీల మీద రాతపూర్వక సంభాషణలు చేసేవాడు. ఆ చీటీల్ని కూడా ఎంత ప్రేమించాడో తోమాస్! అతనికి అవి తన టీనేజ్ లో కాలేజీ పాఠాల మధ్య లెక్చరర్ల కన్నుకప్పి,  స్నేహితులతో పంచుకున్న చీటీల్ని గుర్తుకు తెచ్చాయట! అందుకే వాటికి “Inspired Notes” అని పేరు పెట్టుకున్నాడు తోమాస్!

తోమాస్ తో నా ప్రయాణం ఆ Inspired Notes అనే కవిత్వ పుస్తకంతోనే మొదలయింది. తోమాస్ అంటున్నాడు:

“నా కవితలు సంగమ స్థలాలు. సాంప్రదాయ భాషా, దృష్టీ అంతగా పట్టించుకోని వివిధ వాస్తవాల మధ్య ఆకస్మిక చుట్టరికాలు కలపడం కవిత్వం చేసే పని. వొక లాండ్ స్కేప్ లోని చిన్నా పెద్దా వివరాలన్నీ కలుస్తాయి, భిన్న సంస్కృతులు, మనుషులూ కలుస్తారు. ప్రకృతీ యాంత్రికత కూడా సంగమిస్తాయి. చూడగానే ఇదొక సంఘర్షణ అనిపించేది ప్రతీదీ కవిత్వంలోకి వచ్చేసరికి స్నేహమైపోతుంది!”

కవిత్వం ఎందుకూ అనే ప్రశ్నకి అనేకమంది అనేక సమాధానాలు వెతుక్కున్నారు. దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం అనిపిస్తుంది నా మటుకు నాకు! మాటపోయిందని మూగతనంతో సమాధానపడలేదు అప్పటి కృష్ణశాస్త్రి, ఇప్పటి తోమాస్!

The organ stops playing and there is deathly silence in

The church but only for a few seconds- అనుకున్నాడు తోమాస్.

ఇంకో కవితలో అంటున్నాడు:

మాటల్ని నింపుకొచ్చిన వాళ్ళందరితోనూ

విసిగిపోయాను

కేవలం మాటలే కదా, భాషలేని మాటలు!

 మంచు కప్పిన ద్వీపానికి వెళ్లాను

అక్కడ  మాటలేమీ లేవు

కాని,

రాయని పేజీలెన్నో

నల్దిక్కులా పరచుకొని వున్నాయి.

ఆ మంచులోనే

అడివి జింకల అడుగుల్ని దాటుకుంటూ వెళ్లాను

అదంతా భాషే,

మాటల్లేని భాష!

tomas-transtrc3b6merw

 

3

స్టాక్ హోం లో 1931 ఏప్రిల్ పదిహేను పుట్టాడు తోమాస్. తల్లి స్కూల్ టీచర్. తండ్రి విడాకులు ఇవ్వడంతో తోమాస్ తల్లితోనే వుండిపోయాడు. స్టాక్ హోం యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్నాడు. కేవలం పదిహేడు కవితలతో 1954 లో మొదటి పుస్తకంతో మొదలయింది తోమాస్ అక్షరయానం. 2015లో చనిపోయే నాటికి పదిహేను కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి. 2011లో కవిత్వానికి నోబెల్ అందుకున్నాడు.

తోమాస్ పిల్లల జైల్లో సైకాలజిస్ట్ గా పనిచేసే వాడు. కవిత్వం అంటే తోమాస్ కి ఎంత ప్రేమ అంటే- వొక సారి న్యూయార్క్ లో కవిత్వం చదివాక ఇష్టాగోష్టి జరుగుతోంది. “మీ వృత్తి అంటే పిల్లల జైల్లో పని మీ కవిత్వం మీద ప్రభావం చూపించిందా?” అని అడిగారు. దానికి ఆయనేదో సమాధానం చెప్పాడు కాని, ఆ సమాధానాన్ని ముగిస్తూ “ కాని, ఆ ప్రశ్న – మీ కవిత్వం మీ వృత్తి మీద ఏమైనా ప్రభావం చూపించిందా” అని అడిగితే చాలా సంతోషించే వాణ్ని” అన్నాడు. కవిత్వం అనేది దానికదే వొక స్వతంత్ర భావంగా మిగలాలని తోమాస్ చివరిదాకా కోరుకున్నాడు.

నిజానికి తోమాస్ తనదైన కవిత్వ లోకంలోనే బతికాడు. ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా, కవిత్వమే అతని ఊపిరి. అతని ఆప్త మిత్రుడు, ప్రసిద్ధ అమెరికన్ కవి Robert Bly అన్నట్టు- “తోమాస్ కవితలు వొక రైల్వే స్టేషన్ లాంటివి. బహుదూరం నించి అక్కడికి రైళ్ళు వచ్చి, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయి. వొక రైలు కింద రష్యన్ మంచు కనిపించవచ్చు. ఇంకో రైలు చుట్టూరా  ఎక్కడివో పూల పరిమళాలు ఉండచ్చు. సుదూరం నించి పలకరించే వొక రహస్యమేదో అతని కవిత్వంలో వుంటుంది.”

 

4

నాకు చాలా నచ్చిన వొక కవితతో తోమాస్ నించి సెలవు తీసుకుంటాను ఇక-

 

వొక ఉత్తరానికి జవాబు

~

ఆ సొరుగు అట్టడుగున

వొక వుత్తరం-

ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందటిది.

వుద్విగ్నమైన ఉత్తరం

ఇప్పుడు తెరిచినా అది రొప్పుతూనే వుంటుంది.

 

యీ యింటికి అయిదు కిటికీలు

నాలుగు కిటికీల్లోంచి

పగలు మెరుస్తుంది ప్రశాంతంగా-

అయిదోది మటుకు

చీకటి ఆకాశంలోకీ, ఉరుములు మెరుపుల్లోకీ ముఖం తిప్పుకొని వుంటుంది.

 

ఆ ఐదో కిటికీ ముందు

నిలబడి వున్నాను,

అది ఆ ఉత్తరం-

 

అప్పుడప్పుడూ ఓ రెండ్రోజుల మధ్య

అగాధమేదో తెరచుకుంటుంది.

ఆ ఇరవై ఆరేళ్ళూ

జారిపోతాయి వొక్క క్షణంలో-

 

కాలం ముందుకే సాగిపోయే సరళ రేఖ కాదులే!

అదొక రహస్య వలయం.

ఎదో వొక గోడకి వొత్తిగిలి

హడావుడిగా పరిగెత్తే అడుగులూ గొంతుకలూ వింటావ్-

 

అవతలి వైపు నించి నువ్వే

గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

గుర్తు లేదు,

ఎప్పటిదో కదా  ఆ వుత్తరం!

 

ఎన్నో కెరటాలు అటూ ఇటూ తిరుగాడుతూనే వున్నాయి,

తడిసిన నేల మీద గంతులు వేసే కప్పలా-

మనసు

వొక్కో క్షణాన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది.

తుఫానుల్ని కనబోతున్న కారుమబ్బుల్లా పేరుకుపోయాయి జవబివ్వని ఉత్తరాలు.

సూర్యకిరణాల వేడిని కూడా అవి చిన్నబుచ్చుతున్నాయి.

 

ఎప్పుడో వాటికి

జవాబివ్వాలి నేను!

ఎప్పుడో వొకప్పుడు వెళ్ళిపోతాను కదా

అప్పుడైనా వాటి వైపు కాసింత సేపు చూడాలి.

లేదూ

ఇక్కణ్ణించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి

నన్ను నేను తవ్వుకోవాలి కనీసం-

 

ఎప్పుడో వాటికి జవాబివ్వాలి నేను

యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే –

వేల వుత్తరాల సందోహంలో

ఆ పాత వుత్తరం కనుమరుగు కాకముందే-

*

 

 

 

మీ మాటలు

  1. అద్భుతమైన కవిత్వాన్ని పరిచయం చేసారు.
    ఇప్పుడే రాయబడని ఉత్తరాలకోసం ఎదురుచూస్తూ ఏదో రాసుకుని ఇంతలో యాదృఛ్ఛికంగా ఇది చదవడం జరిగింది.
    ఆ కవి మనస్సెంత సున్నితం.

  2. కె.కె. రామయ్య says:

    ” యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే – …”
    ఎప్పుడో అఫ్సర్ సాబ్ కి నేనూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.
    కవిత్వ లోకంలోనే బతికిన కృష్ణశాస్త్రి గారిని ప్రస్తావించినందుకు,
    తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ ను పరిచయం చేసినందుకు.

    ( విజయవాడలో పురాణం సుబ్రహ్మణ్యం గారింటి మేడ, నండూరి రామ్మోహన్ రావు గారి చెంత గురించి
    ప్రస్తావిస్తూ … ఆంద్రజ్యోతి వారపత్రిక స్వర్ణ యుగాన్ని తలుపుకు తెచ్చినందుకూ )

  3. Bhavani Phani says:

    ఎప్పట్లానే చాలా బాగా రాసారు సర్, తోమాస్ గారి కవిత్వమే కాదు, సమస్యల్ని ఎదుర్కోవడంలో ఆయన చూపిన ధైర్యం కూడా స్పూర్తిదాయకంగా ఉంది. ధన్యవాదాలు.

  4. Afsar garu…baagunnara? Meeru yemi rasinaa,adhi sahithya parimalanni addukuntundi.tomas,krishna sasitri ni parichayam chesaru.valla kavitvam ,vennela laantidi.yentha tadisinaa ,tanivi teeradhu.

  5. అవి 2010,11 రోజులు . స్వీడన్ లో ఒక విధంగా ఒంటరి జీవితం గడుపుతున్న రోజులు. అప్పుడు వచ్చాడు తొమస్ నా జీవితంలోకి తన రచనల ద్వార. ఆ రోజులని మళ్ళీ గుర్తు చేసారు అభినందనలు

  6. Mythili Abbaraju says:

    అక్షరం కదా అది,అది బ్రతికే ఉంటుంది !
    Thank you for a lovely essay

  7. సుబ్బలక్ష్మి says:

    తోమాస్ ని పరిచయంచేసినందుకు ధన్యవాదాలు

  8. బాగుంది కవిత.ఎన్నాళ్ళు నాలో దాగుంటుందో ఉత్తరంలాగ. మూయని మనసు కిటికీ ఆవల…

  9. మణి వడ్లమాని says:

    అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు! గుండె ని తడిపాయి. అప్సర్ జీ మాటల్లో రాయలేని అనుభూతి

  10. వెంకటకృష్ణమూర్తి పులిపాక says:

    ఎక్కడి కృష్మశాస్త్రిగారు?ఎక్కడి తోమాస్?మాట మూగిదైనా మనసు మూగదిగా మార్చుకోకుండా తమదైన శైలిలో చిన్నచిన్న చీటీలమీద పెట్టి అవి చదివే మనసులతో మాట్లాడి మనసున్న మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ ఈ రోజుకు వారివారి మన:ప్రపంచంలోకి మనలను లాక్కెళ్ళుతున్న వారు ఎప్పటికీ చిరస్మరణీయులు,పఠితల గుండెల్లో చిరంజీవులేగా!నమస్తే!వ

  11. ‘పెన్ యూనివర్సిటీ’ దాటి ‘ఓపెన్ యూనివర్సిటీ’  లో స్నేహపూర్వకం గా అందమైన పాఠం చెప్పినట్టుంది !!
    అన్నట్టు  మా నార్వేజియన్ భాష లో  ” పెన్” అంటే అందమైన అని !!
    మీ ” పెన్”, రచన  అందమైనవి  అని నార్వే వాళ్లకి కూడా తెలిసిందన్న మాట !!

  12. Dattamala says:

    అవతలి వైపు నించి నువ్వే

    గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

    ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

    గుర్తు లేదు,

    ఎప్పటిదో కదా ఆ వుత్తరం!…..

  13. Paresh Doshi says:

    దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం. How true! So long the poet is a square peg in the round hole, he keeps creating. And the day he falls in place he bids adieu to the creative world. Kudos.

  14. D. Subrahmanyam says:

    కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ (తోమాస్) అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు – చాలా బాగా జ్గ్నాపకం చేసారు.

    తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! అంత మంచి కవి ని ఆయన కవిత్వాన్ని ఇంత బాగా పరిచయం చేనందుకు అభినందనలు అఫ్సర్ గారూ. మీరూ, మితృలుడూ వేణు చేసే మంచి పరిచయాల వల్ల నా లాంటి ఆ, ఆ లు మొదలు పెట్టిన ) వారికి కవిత సాహిత్యంలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

  15. Jayashree Naidu says:

    Lovely essay afsar ji

  16. Suparna mahi says:

    చాలా గొప్ప ఆర్టికల్, జస్ట్ లైక్ ఏ లెసన్…
    థాంక్యూ సర్…🌼

  17. చక్కని కవినీ, కవిత్వాన్నీ పరిచయం చేశారు అఫ్సర్ జీ ! ధన్యవాదాలు! మీ రచనా శైలి ఆకట్టుకునేలా గుండెకి హత్తుకునేలా ఉంది!

  18. venu udugula says:

    అబ్బ ఎం రాసినవ్ అన్న ….సాహిత్య పాఠం ఇది. i loved it !

  19. Sivalakshmi says:

    ముసలితనమే శాపమనుకుంటే మూగతనం ఇంకెంత విషాదం?
    కృష్ణశాస్త్రి – తోమాస్ లిద్దరూ రెండింటినీ అధిగమించిన తీరు చిన్న చిన్న కష్టాలకే బెంబెలెత్తిపోయే వారందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
    ఒకసారి మిత్రులందరం శ్రీ రమణ పేరడిలలో శ్రీ శ్రీ, నండూరి లాంటి ప్రముఖ రచయితలందరూ వారి వారి ప్రియురాళ్ళకు ఉత్తరాలెలా రాస్తారో,తిరిగి వారి ప్రేయసిలు వారికెలా జవాబులిస్తారో కలిసి చదువుకుంటూ,ఆనందిస్తున్నాం. శ్రీ శ్రీ తన ప్రేయసికి రాసే ప్రేమలేఖ,వారి ప్రేయసి ఆయనకి రాసే జవాబు,ఇలా ఒక్కొక్క రచయిత గురించి రాశారు శ్రీ రమణ. మిగిలినవారందరికీ వారి ప్రేయసుల దగ్గరినుంచి జవాబులొస్తాయి కానీ కృష్ణశాస్త్రి గారికి మాత్రం వారి ప్రేయసి నుంచి జవాబు రాదు! ఎందుకంటే వారి విరహగీతాలు తెలుగువారికి కావాలి కదా? అంటారు శ్రీ రమణ.
    అది వినగానే “ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని” అని పాడారొకరు.అదంతా గుర్తొచ్చి ఒకవైపు సంతోషం,ఇంకోవైపు వీరిద్దరూ మూగబోవడం బాధను కలిగించాయి!
    “అక్షరాల్లో బతికిన మాట” భలే Refresh చేసింది అఫ్సర్!

  20. Afsargaru, mee parichayam Thomar gurinchi ,mariyu comments chadivi chaala santhsam kaligindi.

  21. BHUVANACHANDRA says:

    అఫ్సర్ , మీరో అద్భుతాన్ని ఆవిష్కరించారు….. మాట ఎలా మౌనం లో ఒదిగిపోతుందో కళ్ళకు కట్టించారు …ఆయుష్మాన్ భవ

  22. Venkat Suresh says:

    బ్యూటిఫుల్ ఆర్టికల్

Leave a Reply to Phanindra Cancel reply

*