వెచ్చని ఊపిరి!

swati

సంధి కుదరని అస్తిత్వంతో భావం పలకని విశ్రాంతికి అలవాటుపడిన వ్యక్తిగా తన పరిచయాన్ని వినిపిస్తారు స్వాతి బండ్లమూడి. కాలనాళికలో తానొక రంగులొలికిన చిత్రంగా దార్శనికత. ‘ దినచర్యలో స్పృశించిన పల్లవులు పొదువుకున్నచోట మిగిలిపోతాయి.’ఎంత చక్కని అభివ్యక్తి!కళ్లతోకాక మనసుతో చదవాల్సిన కవితలివి.ప్రతిపదము అక్షర ఆర్తిని వినిపిస్తుంది. మనసులోని మమత శ్రావ్యమైన వేణునాదమై వినిపించినపుడు  వెచ్చని ఊపిరి మనసును ఆవిరై కమ్ముకుంటుంది.దైవాన్ని మనోచక్షువులతో కాంచిన మురళీగానం వినిపించిన కవిత ‘ ఊపిరిపాటకు చూపేది’.

మనసున దాగున్న వేదన గుర్రపుడెక్కలా పరచుకుని సలుపుతుంటే కదంతొక్కిన పదాలు  మిగిల్చిన ఆనవాళ్లను పద్యాలరొదగా వర్ణించడం అద్భుతం.పాటలు పసిపాపలై కాళ్లకు పెనవేసుకున్నాయని ఒక్క అక్షరమైనా తాకని ఖాళీ కాగితాలన్నీ జాలిగా ఎగిరి రెక్కలార్చి నీ గుండెలపై వాలిపోయాయనీ ..అంటారు.భావుకత నిండిన పదనర్తనమంటే ఇదే! ‘ అరచేతిలో కొవ్వొత్తి వెలిగించుకుంటే తప్ప ఓర్చుకోలేనంత దుఃఖం ఉందని నమ్మలేరంటారు.’

‘గుండె చిల్లు పెట్టుకుని ఇద్దరిని చెరొక దరిని విసిరేసి మునిగిన పడవ అతుకేసుకుని మరో ప్రయాణం మొదలెట్టినా కథ ముగిసేది మాత్రం అవ్యక్తంకాని బాధతోనే ’ అని చెప్పే భావలాహిరి మనల్ని పట్టి ఊపుతుంది.

‘పెద్దయ్యాక తల్చుకుని బాగుందనుకోవడానికి బాగుంటుందికదా చిన్నతనం?’ బాల్యపు అమాయకత్వం,విసుగు తెప్పించేలా అన్నిటికీ ఆధారపడటం ఎప్పటికీ గుర్తుంటుందంటారు.

‘ఎప్పుడైనా ఒకరోజు-అలమరలో పాత పుస్తకాలు దులిపి ఎవరికో చూపిస్తూ, ఎందుకో!ఈ మధ్య కుడివైపు కూడా బాగా ఎక్కువగా…అని కూలబడ్డప్పుడు-పలకరించొద్దు.కవిత్వం గొంతుకి అడ్డుపడొచ్చు.’ఈ వాక్యాలు చదవగానే ఆనందమో,దుఃఖమో తెలియని భావమేదో పొటమరించి ఆ వాక్యాలకడనే మోకరిల్లాలనిపిస్తుంది.

భావుకత పరిణితి పరిపుష్టమై ప్రతి అక్షరాన్ని అల్లుకుని వాక్యనిర్మాణాన్ని మెట్టు మెట్టుగా ఉన్నతీకరిస్తూ పాఠకులను ఆలోచనలతో చుట్టిపడేస్తారు.ఆకుపచ్చ దుప్పటి మట్టివేర్లతో మనమీద పరచుకుందన్నా,పచ్చికపై రాలే పూలశబ్దాల కింద అదమరచామన్నా కవయిత్రి పసిపాపై ఆడుకుంటూ వెదజల్లిన అక్షరాలను జారిపోకుండా ఒడిసిపట్టుకుంటాం.

భావప్రకటనలో వెలువడే ప్రకంపనలు,వ్యక్తీకరణలో అసాధరణ పదమాధుర్యం,దృష్టికోణంలో విభిన్నపార్శ్వాలు!ఇంత భావచైతన్యానికి కరదీపిక సమాజమే కదా!సంఘర్షణ,సంక్షోభం,సంతోషం సమాలోచనవైపు అడుగిడమంటాయి.మనసులో భావజ్వాలలు ప్రజ్వరిల్లినప్పుడు పదవిస్ఫోటనం భళ్లుమంటుంది.స్వాతికుమారి బండ్లమూడిగారి నివాసం చల్లని చలివేంద్రం మదనపల్లియైనా ఆమె కవితలు నింపిన ఆవిరి చలికాలంలో వెచ్చనిదుప్పటి అందించే వెచ్చదనమే!

*

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  ‘కళ్లతోకాక మనసుతో చదవాల్సిన’ స్వాతికుమారి గారి “ఆవిరి” కవితల బుక్కులు ఇక్కడ లభ్యం

  ఆనంద్ బుక్స్ : http://www.anandbooks.com/Aaviri-Telugu-Book-By-Swathi-Kumari-Bandlamudi?search=aviri

  కినిగె : http://kinige.com/book/ఆవిరి

  ‘ఊపిరిపాటకు చూపేది’ గొప్పదే కావచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు కూడా కవయిత్రి కంట్లో పడొద్దూ.

  “ఈ మధ్య కుడివైపు బాగా ఎక్కువగా… ” అంటున్న నాలాంటి నేలక్లాసు సణుగుడు రాయుళ్ల ప్రార్ధన ఆలకించి వారు ఓ చూపు ఎడమవైపు కూడా వెయ్యాలని మనవి.

 2. రాజనాల వెంకట రమణ says:

  స్వాతి కుమారి గారి భావుకత నిండిన పదనర్తనల కవితల పుస్తకం “ఆవిరి” ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

మీ మాటలు

*