మనసు గీసిన బొమ్మలు ఈ సినిమాలు!

                     

                               siva1

                               

“ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖ చిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి నొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యత నిద్దాం. ప్రేమిద్దాం!గౌరవిద్దాం”-అని అంటారు ముస్తఫా కమాల్ అటాటర్క్.

చలన చిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు-ఎక్కువ దృశ్యాలు. కినిమా అంటే పురోగమనమని అర్ధం. దాని సమానార్ధకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లి విరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే  జీవితాంతం మనసులో ముద్ర పడి పోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాల పాటు న  వ్విన దృశ్యం. ఒకసారి చూసిన వారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షలమంది పుస్తకాలు చదివితే  ఎన్నో కోట్ల మంది  సినిమాలు చూస్తారు.ఏది సాధించాలన్నా ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మనదేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు.కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి.కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసివస్తాయి.ఎవరు చెప్పినా నమ్మం కనుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన అమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తులనుంచి,వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి,ప్రశ్నించి, ప్రతి ఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ  చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది.  ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు,కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చెయ్యడానికి తమ జీవిత కాలమంతా శ్రమించి,పోరాడి,రహస్యంగా పని చేసి,చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో విమర్శలతో చీల్చిచెండాడాడు.

రష్యాలో మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని “మాంటేజ్” కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్ ఐసెన్ స్టీన్,వుడోవ్ కిన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు.  ఫుడోవికిన్ గోర్కీ “మదర్”ని చలన చిత్రంగా నిర్మిస్తే, ఐజెన్ స్టీన్   “స్ట్రైక్” లాంటి చిత్రాలను “మాంటేజ్” విధానంలో రూపొందించారు.

లాటిన్ అమెరికా సినిమా రచయితలు. “ప్రతీకారమో, ప్రాణ త్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై “విప్లవానికి ప్రేలుడు పదార్ధాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జర్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకుని 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్, మార్గరెట్ వాన్ ట్రోటా, డొరిస్ డెర్రీ, హెల్కే సాండర్స్ వంటివారు ఉత్తమ ప్రపంచ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్టు సినిమా బైసికిల్ తీఫ్. సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనపడని అసలు దొంగ ఫాసిజం అని తేల్చి చెప్తుంది.1948 లో వచ్చిన సినిమా మన సత్యజిత్ రే కి ప్రేరణ నిచ్చిపథేర్ పాంచాలివాస్తవమైన అద్భుత సృష్టికి  కారణమైంది.

మన దేశం విషయాని కొస్తే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, భూపేన్ హజారికా, శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్, శ్యాం బెనెగల్, గౌతం ఘోష్ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఇక మన తెలుగు విషయాని కొస్తే “జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది”అని  కె.వి.ఆర్. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50,60 దశకాల్లో వచ్చాయి. “సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో దగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది” అన్నారు సినిమారంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌర వంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత అంటే 2013 లో వచ్చి నన్ను అమితంగా దుఖపెట్టి, కదిలించి,  కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన  రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ఒసామా”(Osama)

ఇది ఆఫ్గనిస్తాన్ చిత్రం. దర్శకుడు బర్మెక్. 1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్,నెదర్లాండ్స్,జపాన్,ఐర్లాండ్,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది.ఈ సినిమా ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కల గలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు,మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

siva2

 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనా లుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది.తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు.వారిని ఎవరూ చూడ కూడదనుకుంటారు. ఎందుకంటే  మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశన మవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం.పనిహక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి.యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకుని,అనాధలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్  మండేలా సూక్తి తో  సినిమా   మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా  నీలి రంగు బుర్ఖాలు  ధరించిన   మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.

“మేము వితంతువులం”.

“మాకు పని కావాలి”

“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

 

చావుకి తెగించి  మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన  దృశ్యం. తర్వాత  సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ-మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ  రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ  అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటి కొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా,బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీ తో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి,అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు.బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది.నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది.అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది.తండ్రి స్నేహితుణ్ణి బతి మాలి అబ్బాయికి చిన్న టీదుకాణంలో పనికి కుదుర్చుకుంటారు.అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసినఎస్పాండీఅనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనేఒసామా అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు.నాకు తెలుసు.అతను అబ్బాయే, పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

 siva3

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతక నివ్వ దల్చుకోలేదు. గ్రామంలోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే రజస్వల కూడా అయినందువల్ల  ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ, ఒక విదేశీ వనితతో  పాటు ఆమెను జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ  మరణ శిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. పదమూడేళ్ళ  పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతని కిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు.  ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు  పెట్టే హింస  చిన్నారిని  బాధిస్తూనే  ఉంటుందని  చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా  ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత  “సిద్దిక్ బర్మెక్. ఆయనే దర్శకులు, ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు.

మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి  అమానుష భౌతిక, మానసిక హింసలు  జీవితకాలమంతా  ఆఫ్గనిస్తాన్ లో  అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా  ఉందీ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో బర్మెక్ చూపించారు.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. దేవరకొండ says:

  మతమౌఢ్యం మనిషిని (మగవాణ్ణి) క్రిమి కీటక స్థాయి కన్నా హీన స్థితికి ఎలా దిగజార్చుతుంది, అందువలన మరీ ముఖ్యంగా స్త్రీ బతుకు ఎంత దుర్భరమవుతుందీ ఇలాంటి కళారూపాల ద్వారా మిగిలిన మానవ లోకానికి తెలుస్తుంది. హృదయ విదారకమైన అలాంటి స్థితిని చూపించిన సినిమాను పరిచయం చేసిన శివ లక్ష్మి గారికి ధన్యవాదాలు.

 2. manjari lakshmi says:

  బాగా రాసారండి.

 3. Sivalakshmi says:

  ఆర్తితో చదివి, స్పందించిన దేవరకొండ, మంజరి లక్ష్మి గార్లకు హ్రదయపూర్వక కృతజ్ఞతలు!

  • మనసు కోతకు గురయ్యే కధ చెప్పారు. చిన్న విషయాలకే తల్లడిల్లే చాలామందికి కష్టం ఇలా ఉంటుంది అని విడమరచి చెప్పినట్టుంది.
   నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నలుగురితో ఈ ఆర్తి పంచుకోవాలి. దిగాలుపడే ఓ నలుగురిలో ఈ కథ మార్పుతేగలిగితే చాలు.

మీ మాటలు

*