ప్రయాణ ప్రణవం

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

బ్లిస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్

ఆనందమే నా సామాను అతి సౌకర్యవంతంగా

అహంకారాల సంచులన్నీ విడిచి పెట్టాను

రుజు స్ఫూర్తులు తప్ప

ఏ భుజ కీర్తులూ నాతో  తెచ్చుకోవడం లేదు

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

ఎక్కడో కలుస్తాను నిన్ను

పొద్దులు సద్దు లేక ముద్దాడుకునే

తెలుపు నలుపు చుంబనాలలోనో-

అవునూ,  ఆకాశం పెదవులపై

మిగులుతుంది కందిపోయిన ఎర్రదనం

వెలుతురు , చీకటి ముద్దాడుకునే సంజలలో –

సిగ్గులేని సూర్య భూతాలవి!

భూమిని మరిగించి కరిగించే

రసవిద్య పేరు రాత్రీ, పవలూ-

ఎక్కడో కలుస్తాను నిన్ను

పాతాళ  ఆకాశంలోనో

పర్వతాలయిన నదుల శిఖరాలపైనో

ఆకుపచ్చ అలల కడలి అడవిలోనో

పిట్టల ఎర్రని గొంతుల దాగిన

బ్రహ్మాండ భానుగోళ భావనలోనో

నాలుక్కాళ్ళ ధర్మపు గోష్పదీ చిహ్నాలలోనో

తనూరహస్య ఖనులలో

తరుణ మణులున్నలోతులలోనో

ఎక్కడో కలుస్తాను నిన్ను  

దిక్కులు దిక్కుమాలిపోయిన ఎత్తులలో

చుక్కలు సృక్కి బూడిదయ్యే బలివితర్ది వీధుల్లో

ఎడారి ఎడతెరిపి లేక కనే నీటి గలగలల కలలో

చొక్కాలు కుట్టిచ్చి కుట్టిచ్చి దేవుడికి

ప్రతి మత దర్జీలూ అలసిపోయిన ,

కుట్టు యంత్రాలు  మూల పడిన

గోపురాల మీద పాదాలు శుభ్రం చేసుకుని –

ధ్వజ స్తంభాల చేయూతలొదులుకుని

చంద్ర వంకలను ఇంకా ఎదగాల్సిన

దశలున్నాయని హెచ్చరించి

సురలో గల దైవ రక్త బంధాన్ని నిరాకరించి

నిన్నుకలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

కాలమిక్కడ ఆకస్మిక కాస్మికం

కార్య కారణాతీతం

కర్త కర్మ క్రియల సాలె గూటి దారపు జ్ఞానానికి  

తన పొట్టలోంచి తనే  దారాలు తీసి

తన పుట్ట తానే నిర్మించుకునే సాలెపురుగు

అర్ధమవుతుందా –

దారపు పొగునే నేను

బయలుదేరాను విశ్వ వస్త్రంలో కలవడానికి –

చీరలోని దారం చీరనెరుగుతుందా –

నువ్వెవ్వడివిరా బయలుదేరడానికి –

విశ్వ వస్త్రం లో  కలవడానికి నీ చేతనౌతుందా –

ఎరుగు – నువ్వున్నదే విశ్వ వస్త్రంలో

సూర్యుడు నీ అద్దకాల కుంచె

భూగోళం నీ ఆకలి కుండ

అంటోంది బరువు చూసుకుందామని

వెయింగ్ మెషీన్ పై నిలబడితే –బయటకొచ్చిన టికెట్టు

చూపిస్తోంది బరువు సున్నా అని –

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

తోడేళ్ళ గుంపులో నిలబడ్డ ఏడేళ్ళ మౌగ్లీలా

ఆటవిక జ్ఞానమే నాకు అమ్మా నాన్నా

ఆదిమ నిరక్షరాస్యతే – నా ఆధునిక పట్టభద్రత

సనాతన జీవ కషాయం నాలోనూ పారుతోంది

భూమి విచిత్రమైన  కుమ్మరి

ప్రాణం చిప్పిల్లే పచ్చి కుండలనే

పదికాలాలు మననిస్తుంది

ఎండి పోయామా – మండిస్తుంది కప్పెడుతుంది

మృత్తిక కావాలి కదా కుత్తుకబంటి దాకా

పిసికి పిసికి మట్టిపాయసం చేసి సారె కెక్కించడానికి

ఎన్నిసార్లు మండి పోయానో , ఖననమైనానో

ఎన్నెన్ని సార్లు సారె పైనుంచి పచ్చి కుండనయ్యానో –

ఎక్కడ వాసన చూడను తల్లిని

పచ్చికుండలేమై పోతాయోనని తల్లడిల్లే తల్లి తనువంతా

బాలింత వాసన –

నా ప్రయాణ సందోహం చూసి నవ్వాయి గడ్డిపరకలు

నువ్వు బయలుదేరడమేమిటి

తిరిగే నేలమ్మే ప్రయాణిస్తున్నది కాల సొరంగంలోకి

తెలుసుకో నీది రజ్జు సర్ప భ్రాంతి –

ఇది తాడు కాదు నిన్ను నువ్వు చేదుకు పైకి పోవడానికి

ఇది పామే –

అరక్షణంలోనే అనంతమూ అవగతమైన పుణ్యశ్లోకులం

అనేకాకులం, మేం బహుళం –

గడ్డి పరకలం –పాము పడగలం –

అనంత కాలం వేచి ఉన్నా అరక్షణాన్ని అర్ధం చేసుకోలేని

జనాభా మీరు –

పామే ఇది  – ఇది కాల మహోరగం  –

నెమ్మదిగా మింగుతున్నది విశ్వపదార్ధాన్ని

అయినా వెళ్ళిరా కాలు సాగినంత మేరా

అయినా వెళ్ళిరా లోకాలు సాగినంత మేరా –

నది మూలం , ఋషి మూలం, తృణమూలం అడగరాదు

అవిజ్ఞానపు చీకటి నుయ్యిలు – మహా కృష్ణ బిలాలు

అమ్మ పాల పుట్ట లో వాంఛా మథనాలు జరిగి

అమృతంగమయులైన మానవుల్ని

పుట్టిస్తుంది జగత్కార్మిక శాల

పుణ్య తిలకం దిద్ది బతుకు పేరంటానికి పిలుస్తుంది

తానే జననీజనక ద్వయమని చెప్పక

ఓ ఇద్దర్ని పేరెంట్లు అని చూపిస్తుంది –

అక్కడే బయలుదేరిపోయావు నువ్వు ఎరుక లేకనే

అమ్మ కడలి లోపలి చిచ్చులో –

అడిగింది గడ్డం కింద చేయి పెట్టుకుని గడ్డి పరక

అప్పుడే బయలుదేరి పోయావు నువ్వు

ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కడికి బయలుదేరుతావు చెప్పు?

అయినా సరే –

గడ్డి పరకల విశ్వవిద్యాలయానికి నమస్కరించి

నిన్ను కలవడానికే బయలుదేరాను

నాలోకి ప్రయాణం చేస్తున్నాను

వెనుక దారి తరిగి పోతోంది

ముందు దారి పెరిగి పోతోంది

చక్రాల్లేని రైళ్లు , తెడ్లు లేని పడవలు , రెక్కల్లేని పక్షులు

వేళ్ళు  లేని చెట్లు, కాళ్ళు లేని ప్రాణులు

 అందరూ గోచరమౌతున్నారు

తమకు తెలీకుండానే ప్రయాణిస్తున్నారు

ఇప్పుడే తెలిసింది ఒక సంచారి ఇచ్చిన సమాచారం

నువ్వూ నన్ను కలవడానికే బయలుదేరావట

యుగాల ముందర

తీరా  నీవున్న చోటికి నే చేరిన వేళ అక్కడ నువ్వుండవు

నువ్వొచ్చే  వేళకి – నా చోట నేనూ ఉండను

ఖాళీ, సున్నా, శూన్యం ఎదురవుతుంది ఇద్దరికీ –

ఇద్దరిలోనూ ఇద్దరమూ ఉన్నామన్న

పూర్ణత్వ భావన కలుగుతుంది

పూర్ణస్య పూర్ణమాదాయ – ఈశావాస్య  వాక్యం మిగులుతుంది

ఎక్కడున్నాం, ఎక్కడుంటాం, ఎప్పుడుంటాం,  ఎప్పుడు  లేం

శూన్యపు సూది ఒకటి కుడుతోంది  –

పాలపుంతల మగ్గం నడుస్తోంది

దారపు పోగుల మధ్య దూరమెంత ఉన్నా

అవి ఈ ఆకస్మిక కాస్మికం లోనే ఉన్నాయి

శూన్య పూర్ణానికి , పూర్ణ  శూన్యానికి నమస్కరిద్దాం

బయలుదేరడానికి ముందే చేరిపోయిన యాత్ర లో –

ఇక ఎప్పటికీ కలుసుకోలేము

ఎందుకంటే ఎప్పుడూ విడిపోనే లేదు కనుక.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Excellent..kavitha.nakunachindi.sir..nomorewords.Telugutyping…naakuravatamledhu.

మీ మాటలు

*