యివే లేకుంటే …

vandana1వందన టేటే రాంచి, ఝార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ కవయిత్రి. రాజస్థాన్ విద్యాపీఠ్ లో తన విద్యను పూర్తిచేసి యే.కే.పంకజ్ ను వివాహమాడి ఆధార్ ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించి ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఝార్ఖండ్ ఆదివాసీల భాష,సాహిత్యం,సంస్కృతులను ప్రతిబింబించే ‘అఖాడా’ అనే పత్రికకు సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వందన టేటే వ్యక్తిగా చాలా ప్రశాంతంగా కనిపించినా ఆమె కవితలు మాత్రం చదివేకొద్ది మనలో నిద్రపోతున్న అలజడులను సృష్టించి మేల్కొల్పుతాయి. యిలాటి అనుభవం కోసం యీమె రచించిన స  ‘కోన్జోగా’ అనే కవితా సంకలనం చదివి తీరాల్సిందే. కొండలతో, నదులతో,పాటలతో తయారైన వో ఆదివాసీ స్త్రీ కి అంకితమిచ్చింది యీ కవయిత్రి. స్త్రీ మారిన తన యింటిపేరనే బరువును మొండిగా,నిర్భయంగా మోస్తున్నదని అవేదన చెందుతుంది. తన పూర్వీకుల త్యాగాలను కీర్తిస్తూ,తన వారి అస్తిత్వ సంక్షోభాలను కవిత్వంగా వినిపిస్తూ వారిలో నమ్మకాన్ని, యేకత్వాన్ని సాధించడాన్ని నిరంతరం కృషి చేస్తున్న కవయిత్రి సామాజిక కార్యకర్త కూడాను.

vandana

సీతాకోకచిలుక
——————–

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు వున్నవి
అందంగా కనిపించేందుకో లేక
యెగిరేందుకో కాదని
రెక్కలు దీని అస్తిత్వంలో భాగం అని
యివే లేకుంటే దానికి వునికే లేదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
మనసును ఆకర్షించేందుకో లేక
వాటి రంగులను నిర్వచించేందుకో కాదని
రంగులు దాని జీవితపు అంగాలు అని
యివే లేకుంటే దానికి యెలాంటి గుర్తింపూ వుండదని

నాకు తెలుసు
సీతాకోకచిలుక రెక్కలు
ప్రియుణ్ణి వాటికింద పొదివించుకునేందుకు కాదని
కేవలం పిల్లలను పోషించేందుకు కాదని
దీని రెక్కలు ప్రకృతి శ్వాసలని
యివే లేకుంటే
యీ భూమి జీవించడం కష్టం అని…

*

మీ మాటలు

  1. THIRUPALU says:

    ఏమీ లేనట్టు ఎంత మంచి కవిత !

  2. Suparna mahi says:

    గొప్ప పరిచయం … చక్కని అనువాదం… ధన్యవాదాలు అన్నయ్యా…

  3. Sharada Sivapurapu says:

    ఎంతో అర్ధవంతమైన కవిత. చక్కటి అనువాదం

  4. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    మీ స్పందనలకు ధన్యవాదాలండిీ

  5. వెంకటేశ్వర్లు బూర్ల says:

    అస్తిత్వ భావనని ఎంత గొప్పగా చెప్పిందీ కవిత… మంచి పరిచయం… ధన్యవాదాలు

Leave a Reply to వెంకటేశ్వర్లు బూర్ల Cancel reply

*