ఆఖరి మజిలీ

Art: Rafi Haque

Art: Rafi Haque

అస్తమించేవేళ ప్రచండ భానుడైనా,
శీతల కిరణాలు ప్రసరించినట్లు
అనంత విశ్వాన్నీ ఆక్రమించిన అహం
మరెన్నో ఆత్మ గాయాలు చేసిన అహం
ఎందరిపై పిడికిలి బిగించినా
ఎంత ఎత్తుకు ఎదిగినా నీ అస్తిత్వం……..
నిష్క్రమించేవేళ ఆరడుగుల నేలలోనో
గుప్పెడు బూడిదై ఓ చిట్టి పిడికిలిలోనో
నిను ద్వేషించే, ప్రేమించే మనసుల్లో
రూపం లేని జ్ఞాపకంగానో
మాటల్లోనో, మౌనంగా కారే
కన్నీటి చుక్కల్లోనో కరిగిపోతుంది.
ఎంత దూరం నడిచినా పోటీ బ్రతుకులో
ఎంత ఎత్తుఎగిరినా ఆశలూ, ఆశయాలూ
ఉరమకుండా పిడుగు రాలినట్లు
మృత్యువు నిను కబళించినపుడు
అలవకున్నా కనుపాపలు మూసుకోవాల్సిందే
శిఖరం తాకకున్నా, నేల రాలాల్సిందే
నువు చూసే ప్రపంచంలోంచి
నిన్ను చూసే ప్రపంచంలోకి జారాల్సిందే
ఎన్ని నిండు చందమామలుంటేనేం నీ జీవితాకాశంలో
నీకు చివరకు మిగిలేది అమావాస్యే
బ్రతుకు పగలున ఎంత వెలిగినా,
అసలు వెలుగే చూడకున్నా
తిరిగి కరగాల్సింది తిమిరంలోకే
ప్రాణం పోసుకున్నపుడూ, పోయినప్పుడూ చీకటే
సగం జీవితమూ గడిచేది చీకట్లోనే
వెలుగుందని, వెలుగుతున్నాననుకున్నపుడూ అజ్ఞానపు చీకటే
సన్నని వెలుగు రేఖనైనా, ఆకాశంలో తారనైనా మెరిపించేది చీకటే
మెలకువలో ముట్టని మట్టి తనలో నినుకలుపుకున్నపుడు
గర్వపడిన సత్కారాలేవీ అక్కరకు రావు
దూరం పెట్టిన ధూళి పూలే అక్కున చేర్చుకునేది
పయనమెప్పుడూ తిమిరంలోంచి తిమిరంలోకే
కాలం ఈదరినుంచీ ఆదరికి చేర్చే వంతెనే
ప్రవాహంలోకి జారిపడ్డాకా చినుకుకు
వేరుపడి దారి నిర్ణయించుకునే కోర్కె తీరదు
అందుకే ప్రేమించాల్సింది వెలుగుల్నికాదు
నీకు నీ నీడని కూడా మిగల్చని చీకటిని
వెలుగుకి మెరుగులు దిద్దే అంధకారాన్ని
నువు మునిగిన భవసాగరాల్ని మధించి
తీసిన జీవనామృత భాండాన్నీ
ఒక్క క్షణంలో అర్ధరహిత వ్యర్ధ ప్రయాస చేసే
ఆఖరి మజిలీలోని ఆఖరి క్షణమిచ్చే జ్ఞానోదయాన్ని.

మీ మాటలు

  1. Suparna mahi says:

    పయనమెప్పుడూ తిమిరం లోంచి తిమిరం లోకే
    కాలం ఈదరి నుంచి ఆదరికి చేర్చే వంతెనే…

    వాట్ ఏ గ్రేట్ ఫిలసాఫికల్ పోయెమ్ శారదమ్మా… క్లాప్స్…

  2. ఆఖరి మజిలీలోని ఆఖరి క్షణమిచ్చే జ్ణానోదయాన్ని ఒక మంచి కవిత్వంగా మార్చారు మేడమ్

  3. విలాసాగరం రవీందర్ says:

    ప్రేమించాల్సింది వెలుగుల్నికాదు
    నీకు నీ నీడని కూడా మిగల్చని చీకటిని
    వెలుగుకి మెరుగులు దిద్దే అంధకారాన్ని

    Good poem madam

  4. satyasrinivas says:

    bagundi

  5. PADMAVATHI NC says:

    Jeevitha satyam bagaa cheppavu sarada!

  6. Heart touching sarada

  7. వాణి వెంంకట్ says:

    అద్భుతంంగా రాశారు శారద గారు …చాలా నచ్చింంది పోయెంం

Leave a Reply to Suparna mahi Cancel reply

*