మంచు బిందువుల మాల కట్టనా!?

seetaram1

దృశ్యాన్ని  బంధించడం  అంటే ఒక ఊహని బంధించడమే!

ఆ ఊహ కొన్ని సార్లు  నైరూప్యంగా  కూడా ఉండచ్చు, దాని రూపం యేమిటో  అంతుపట్టకపోవచ్చు!

జీవితం ఎంత అందమైందో దృశ్యం అంత  అందమైంది. కనిపించే  ప్రతి  రూపంలోనూ ఒక అందమేదో గూడు కట్టుకొని వుంటుంది.

అలాంటి  అందాన్ని ఇక్కడ  కెమెరా కవి  దండమూడి  సీతారాం పట్టుకున్నాడు.

మరి..

అదే  అందాన్ని మీరు అక్షరాల్లో  పట్టుకోగలరా?!

ప్రయత్నించండి!

ఈ దృశ్యం  మీకెలా అనిపిస్తోందో  ఆ అనుభూతిని  కవితగానో, ఇంకో భావనారూపంగానో తర్జుమా  చేసి, ఇక్కడ రాయండి!

*

 

 

మీ మాటలు

 1. Bhavani Phani says:

  *ఓ ఉదయం పూట….ఓ ఫిషింగ్ రాడ్*

  ఒట్టి కర్రగా మిగిలిపోయాక ఒంటరితనమంటే భయమేం లేదిప్పుడు
  వానపాములూ, ముళ్ళూ ; చిక్కుబడిన చేపలూ…. జ్ఞాపకాలన్నీ తోడేగా
  అలవాటుగా వంగి చూస్తుంటే పచ్చగా నవ్వుతూ కనిపించింది నేల
  ఆకాశానికి గేలమేసి లాక్కున్న నీటి చుక్కలన్నిటినీ ఎప్పుడో తాగేసినట్టుంది

  రాత్రంతా వెన్నెల కొక్కేనికి చిక్కుబడి వేళ్లాడిన వేలకొద్దీ చీకటి బొట్లు,
  ఇప్పుడే ఇలా ఉదయపు నోట్లో పడి మాయంకావడం మైమరపునిస్తోంది
  తొలిపొద్దు వేసిన వెలుగుల వలల్లోకి మెలకువతో మెలికపడ్డ అమాయకపులోకం,
  శక్తినంతా చెమట చుక్కల్ని చేసి సమర్పణకు సిద్ధపరుచుకుంటోంది

  ఇంతలో….విరుచుకున్న నా ఒంటినించి బద్దకంగా తెగిపడ్డాయి కొన్ని దారప్పోగులు
  ఏ పనికీ రానన్న విషయాన్ని పసిగట్టిందేమో, అదెప్పుడో కట్టేసింది తెలివైన తన గూడు
  ఎన్నాళ్లపాటో ఆడేసిన ఆటేగా, మాటువెయ్యడం కాటు వెయ్యడం
  అయినా ఎప్పటికప్పుడు అంతే కొత్త మజా, ఇలా వలలవెనుక నిలబడి వేచిచూడటం

  ఏ ప్రాణం పడుతుందో ఇప్పుడిక తన అజ్ఞానపు ఉచ్చులో తనే!
  గిలగిలా తన్నుకుంటూ అది తెలివి తెచ్చుకుంటుంటే,
  ఎదురు చూపులు ఫలించిన వినోదం, వెలకట్టేది కాదుగా వేటగాడికి
  అయ్యో ! ఇదేమిటి? మంచు బిందువుల మాలకట్టింది సాలె గూడులో,
  తానోడుతూ నన్నోడిస్తూ !

 2. Ramanuja Rao says:

  చాలా బాగుంది

మీ మాటలు

*