ఆ ఆఖ‌రి మ‌నుషుల కోసం… ఆర్తిగా..!

akshara2

‘‘క‌ళ బ‌త‌కాలంటే…ముందు క‌ళాకారుడు బ‌త‌కాలి’’అంటాడు అక్ష‌ర‌కుమార్‌. త‌న‌ది మూడు ప‌దుల వ‌య‌సు. క‌ల్లోలిత క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పుట్టిన ఈ కుర్రాడు సినిమా ఇండస్ర్టీలో ప్ర‌స్తుతం త‌న సామర్ధ్యాన్ని, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌రీక్షించుకుంటున్నాడు. క‌ళ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌న్న త‌ప‌న ఉన్నోడు తాను. అంతేకాదు నిత్యం సాహిత్యం చుట్టూ వైఫైలా తిరిగే అక్ష‌ర‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమా స్ర్కిప్ట్‌లు రాయడం హాబీలు. వీట‌న్నింటికీ తోడు అంత‌రిస్తున్న క‌ళారూపాల‌ను చూసి, ఆవేద‌న చెందుతుంటాడు. అట్లా ప్ర‌స్తుతం కాకిపడిగెల వారి మీద ఏకంగా ఓ ఫిచ‌ర్ ఫిల్మంత డాక్యుమెంట‌రీనీ తీశాడు. అదే కాకి ప‌డిగెల క‌థ‌.

డాక్యుమెంట్ చేయ‌డం వ‌ల్ల ఎప్పుడూ రెండు ప్ర‌యోజ‌నాలుంటాయి. అవి ఒక‌టి వ‌ర్త‌మాన స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న మ‌రో ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా ఆలోచ‌న రేకిత్తించ‌డం. మ‌రొక‌టి భ‌విష్య‌త్ త‌రాల‌కు ఒక క‌ళారూపం యొక్క గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌డం ప్ర‌స్తుతం గ్లోబ‌లైజేష‌న్ రెండ‌వ ద‌శ‌లో ఉన్నవాళ్ల‌కు ఇవేవి ప‌ట్ట‌ని సంద‌ర్భం ఇది. ఈ స‌మ‌యంలో ఓ కుర్రాడు వేల యేండ్ల చ‌రిత్ర క‌లిగిన  ఓ క‌ళారూపాన్ని బ‌తికించుకోవాల‌నే త‌ప‌న‌తో చేసిన ప‌నే ఈ డాక్యుమెంటరీ.

ముదిరాజుల మిరాశి కులం కాకిప‌డిగెల‌. వీరి జ‌నాభా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో నామ మాత్రంగా ఉంది. వీరికి వార‌స‌త్వంగా వ‌స్తున్న క‌ళారూపంతోనే వీరి బ‌తుకు గ‌డుస్తోంది. ప‌ట‌మేసి పాండ‌వుల క‌థ చెప్పే సంప్ర‌దాయం వీరిది. చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉన్న ఈ కుల‌స్తుల కుటుంబాలు ఒక‌టి వ‌రంగ‌ల్లో ఉంటే మ‌రొక‌టి సిద్ధిపేట ప‌రిస‌ర గ్రామాల్లో ఉంది. వంద‌ల యేండ్లుగా కాకిప‌డిగెలు క‌థ చెప్పుకుంటూ బ‌తుకీడుస్తున్నారు. ఇలాంటి వారి ప‌ట్ల అక్ష‌ర‌కు ఎడ‌తెగ‌ని మ‌మ‌కారం. వారి క‌ళ ప‌ట్ల గౌర‌వం ఉంది. వారి చ‌రిత్ర‌ను బ‌తికించాల‌నే తండ్లాట ఉంది. ఆ తండ్లాట‌లోనుండే ఈ డాక్యుమెంట‌రీ రూపొందింది. ఎవ‌డికి ఎవ‌డూ కాని  లోకంలో, ఓ అంత‌రిస్తున్న క‌ళ గురించి,క‌ళాకారుల గురించి ఈ యువ ద‌ర్శ‌కుడు మ‌ధ‌నప‌డుతున్నాడు. క‌ళాకారుల క‌ళ‌నే కాదు, ఆ క‌ళ వెనక  దాగిన క‌న్నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు. అందుకే జాగ్ర‌త్త‌గా వారి గ‌తాన్ని వ‌ర్త‌మానాన్ని రికార్డు చేస్తున్నాడు.

akshara1

పురాణాలు అంతిమంగా బ్రాహ్మ‌ణిజం చుట్టే తిరుగుతాయి. అవి హిందు దేవ‌త‌ల‌ను కొలిచే ముగింపునే క‌లిగి ఉంటాయి. ఈ పుర‌ణాల మీద ఆధార‌ప‌డి  సృష్టించ‌బ‌డిన క‌ళారూపాలు కూడా ఆ మూస‌లోనే కొన‌సాగుతుంటాయి. అంతమాత్రం చేత వాటినే న‌మ్ముకున్న క‌ళాకారులు అంత‌రించాల‌ని కోరుకోవ‌డం తిరోగ‌మ‌న‌మే అవుతుంది. హిందు కుల వ్య‌వ‌స్థ ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులాన్ని సృష్టించింది. ఈ సంస్కృతి ఆయా కులాల చ‌రిత్ర‌ను గానం చేసే ప్ర‌స్థానంతో మొద‌లై ఉంటుంది. మాదిగ‌ల‌ను కీర్తిస్తూ చిందు,డ‌క్క‌లి, బైండ్ల కులాలు ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో క‌థ‌లు చెబుతుంటాయి. మాదిగ‌లు ఇచ్చే త్యాగం మీదే వీరి జీవితాలు గ‌డుస్తుంటాయి. అలా ముదిరాజు కుల చ‌రిత్ర‌ను గానం చేస్తూ ప‌టం మీద పురాగాథ‌ల్ని పాడే కుల‌మే కాకిప‌డిగెల కులం. ఈ క‌ళాకారులు మిగిలిన ఆశ్రిత కులాల క‌ళాకారుల వ‌లెనె అంప‌శ‌య్య మీద జీవ‌నం సాగిస్తున్నారు.

కాకి ప‌డిగెల సంప‌త్‌! ఈ పేరు ఈ డాక్యుమెంట‌రీ చూసే వ‌ర‌కు నాకైతే తెలియ‌దు. ప్ర‌స్తుతం క‌ళా రంగంలో ఉద్ధండులైన పండితుల‌కు కూడా ఈ పేరు కొత్తే. కాకిప‌డిగెల సంప‌త్ క‌థ చెబితే ప‌ల్లె తెల్ల‌వార్లు మేల్కొని చూడాల్సిందే. క‌థ‌ను త‌న మాట‌ల‌తో ప్ర‌వ‌హింప జేసేవాడు సంప‌త్‌. తాను పురాగాథ‌ల్ని గానం చేస్తుంటే ఒక మ‌హా వాగ్గేయ‌కారుడు మ‌న కండ్ల ముందుకొస్తాడు. అడుగులు క‌దుపుతూ డోల‌క్ ద‌రువుల‌కు, హార్మోనియం రాగాల‌కు గాలిలో తెలియాడుతూ చేసే సంప‌త్ ప్ర‌ద‌ర్శ‌న ఎవ్వ‌రినైనా మంత్ర ముగ్ధుల్ని చేసేది. అందుకే ఢిల్లీ వ‌ర‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌రంప‌ర కొన‌సాగింది. ఆశ్రిత కులాల క‌ళాకారులు ఎంత గొప్ప ప్ర‌తిభ క‌లిగినా వారికి ద‌క్కేది ఏమీ  ఉండ‌దు. అకాల మ‌ర‌ణాల పాల‌వ్వ‌డ‌మే ఈ వ్య‌వ‌స్థ వారికిస్తున్న బ‌హుమ‌తి. అలా అనారోగ్యంతో సంప‌త్ నేలరాలాడు. ద‌శాబ్దాలుగా కాకిప‌డిగెల క‌ళారూపానికి జీవితాన్ని అంకితం చేస్తే, త‌న భార్యా బిడ్డ‌ల‌కు తాను సంపాదించింది ఏమీ లేదు. మ‌ళ్లీ అదే పూరి గుడిసె, అవే డోల‌క్ తాళాలు. తండ్రి అందించిన క‌ళారూపాన్ని త‌మ ఆస్తిగా భావించారు సంప‌త్ ఇద్ద‌రు కొడుకులు. ఇప్పుడు వారు మ‌ళ్లీ కాకిప‌డిగెల క‌థ చెబుతూ త‌మ తండ్రికి మ‌న‌సులోనే నివాళులు అర్పిస్తున్నారు. గ్లోబ‌లైజేష‌న్ వ‌చ్చి త‌మ పొట్ట‌కొట్టినా తాము ఆక‌లితో అల్లాడిపోతున్నా త‌మ క‌థ ఆగొద్ద‌నేదే వారి భావ‌న‌. అందుకే అన్నీ మ‌రిచిపోయి ఆట‌లోనే శిగ‌మూగుతున్నారు. ఇదీ విషాదం. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకే అక్ష‌ర కుమార్ అంకిత‌మ‌య్యాడు.

ఈ యువ‌ద‌ర్శ‌కుని ప్ర‌తిభ ఇందులో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. డాక్యుమెంట‌రీలు అన‌గానే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఏదో ఇంట‌ర్ ప్రిటేష‌న్ వ‌స్తుంటుంది. దాన్ని నిర్మిస్తున్న‌వారి ఆబ్జెక్టివ్స్ వారికుంటాయి. కాని, అక్ష‌ర ఈ రొటీన్ వ‌ర్క్ మాడ‌ల్‌ని బ్రేక్ చేశాడు. వారి లైఫ్ స్టైల్, వారి స్ర్ట‌గుల్, వారి లెగ‌సీ, వారి ట్రాజెడీ అన్నీ వారితోనే చెప్పించాడు. ఉన్న‌ది ఉన్న‌ట్లు క‌ళ్ల ముందుంచి, ప్రేక్ష‌కుణ్ణే ఆలోచించ‌మంటాడు. ఇక సినిమా ఇండ‌స్ర్టీ అనుభ‌వాల‌ను కూడా రంగ‌రించాడు అక్ష‌ర‌. డాక్యుమెంట‌రీని ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా మ‌లిచేందుకు శ‌త‌థా ప్ర‌య‌త్నించాడు. ఒక దృశ్య‌కావ్యం మ‌న మ‌న‌సుల్ని ఆక‌ట్టుకోవాలంటే అందులో హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌ని ప‌లికించాలి. ఇదే అక్ష‌ర ఉద్దేశం కూడా. అందుకే క‌ళ‌ను న‌మ్ముకున్న ఈ ఆఖ‌రి మ‌నుషుల అంత‌రంగాన్ని ఆవిష్క‌రించేట‌పుడు కూడా ఎమోష‌న్స్‌ని వ‌దిలిపెట్ట‌లేదు. ఆక‌లితో అల‌మ‌టిస్తూనే వారి పండించే హాస్యాన్ని కూడా తెర‌కెక్కించాలంటే ద‌మ్ముండాలి. ఆ ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు అక్ష‌ర‌. అందుకే వారి దుఃఖాన్ని ప‌ట్టుకున్నంత సుల‌భంగా వారి ధైర్యాన్ని ఏటికి ఎదురీదేత‌నాన్ని కూడా ప‌ట్టుకున్నాడు.

కులం స‌ర్టిఫికెట్లు జారీచేయ‌డానికి అర్హ‌త క‌లిగిన  6432 కులాల జాబితాలో పేరు లేని కులం ఈ కాకిప‌డిగెల‌. దీంతో వీరికి విద్యా ఉద్యోగం అనేవి ద‌రిచేర‌నివిగానే మిగిలిపోతున్నాయి. కాళ్లావేళ్లా ప‌డితే వీరికి బీసీ-డీ స‌ర్టిఫికెట్ ఇచ్చి చేతులు దుల‌పుకుంటున్న‌ది స‌ర్కార్‌. ఈ విషాదానికి తెర‌ప‌డాల‌న్న‌దే ఈ డాక్యుమెంట‌రీ ఉద్దేశం. తెలంగాణ నూత‌న రాష్ర్టంలో కోల్పోయిన చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మాణం చేసుకుంటున్న ద‌శ ఇది. ఈ స‌మ‌యంలో ఈ జాన‌ప‌ద క‌ళాకారుల‌పైన వారి క‌ళారూపాల‌పైన అక్ష‌ర కుమార్‌కు ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రామాల‌కు వెళ్లిన‌పుడు ఏ క‌ళారూపాన్ని లెక్క‌చేయ‌ని యువ‌త‌, ప‌ట్నానికొస్తే శిల్పారామంలో మాత్రం ఎగ‌బ‌డి డ‌బ్బులు పెట్టి మ‌రీ జాన‌ప‌ద క‌ళారూపాల‌తో, క‌ళాకారుల‌తో సెల్పీలు దిగే వైవిధ్యం నేడున్న‌ది. ఇలాంటి జ‌మానాకు దూరంగా నిజాయితీతో జాన‌ప‌ద క‌ళారూపాల‌ను బ‌తికించాల‌నే ల‌క్ష్యంతో అక్ష‌ర కుమార్ చేసిన ఈ ప్ర‌యత్నం వృథాపోదు. రేప‌టి త‌రాల‌కు కాకిపడిగెల జీవితం దృశ్య రూపంలో అందుతుంది. ఇలాంటి ప‌నిని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, చేసిన అక్ష‌ర కుమార్‌కు అభినంద‌న‌లు. అక్ష‌ర‌కుమార్ సంక‌ల్పానికి అండ‌దండ‌గా నిలిచిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు, జాతీయ అవార్డు గ్ర‌హీత మామిడి హ‌రికృష్ణ అభినంద‌నీయులు. తెలంగాణ‌లో ఉన్న డెభ్భైవేల మంది జాన‌ప‌ద క‌ళాకారుల్ని త‌న కుటుంబ స‌భ్యులుగా భావించే మామిడి హ‌రికృష్ణ‌గారి ఔదార్యం గొప్ప‌ది. అక్ష‌ర అండ్ టీం శ్ర‌మ‌కోర్చి నిర్మించిన ఈ దృశ్య‌రూప కావ్యం ఈ నెల 4వ తేది సాయంకాలం ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది.

ఆఖ‌రి మ‌నుషుల కోసం అల్లాడిన ఆర్తి ఇది

క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళారూపానికి క‌న్నీటి భాష్యం

కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం

గ్లోబ‌ల్ ప‌డ‌గ గాయాల‌ను మాన్పేందుకు.. అక్ష‌ర హృద‌య ఔష‌ధం

రండి అంద‌రం క‌లిసి వీక్షిద్ధాం..

ఆత్మీయ క‌ర‌చాల‌నాల‌తో అభినందిద్ధాం…  

*

మీ మాటలు

  1. venu udugula says:

    ఎక్సలెంట్ రైటప్ … మీరు స్పందించటం బాగుంది.కృతఙ్ఞతలు

  2. narayayanaswamy says:

    చాలా బాగా రాసినవు రవీందర్ – డాకుమెంటరీ కి మంచి అక్షర రూపం ఇఛ్చినవు – ఆశ్రిత కులాల గురించీ వారి కళారూపాలు వాళ్ళ జీవితమూ కలల గురించీ ఈ గ్లోబల్ సన్నివేశం లో చెప్పాలి, మనం నేర్చుకోవాలి కూడా – అక్షర కు మనఃపూర్వక అభినందనలు – పద్మశాలీల ఆశ్రిత కులమైన కూనపులి వారి గురించి లక్ష్మణ్ ఏలే అన్న ‘పటం కథ’ అనే డాకుమెంటరీ తీసినరు. కాస్ట్ జీనియాలజీ గురించి మంచి పరిశోధన చేసినారు అన్న.

  3. Katta Srinivas says:

    Very good write up for an excellent work in a right time

  4. విభిన్న కళారూపాలు బ్రతికినపుడే, విభిన్న అస్తిత్వాలు బతుకుతాయి….i am saying as a anthropologist

  5. శశిధర్ says:

    ఆఖరి మనుషులు అన్న మాట దుఃఖాన్ని కలిగిస్తుంది… బాగా రాసారు అన్నా….

  6. దేవరకొండ says:

    కులం అంతరించాలి. మనుషులు బతకాలి. ఇక్కడ మనుషులు అంతరిస్తున్నారు, కులం బతికే ఉంటోంది. ఇదే సారంగలో ‘ఆఖరి కులం….’ అని మనమంతా చదివే రోజు ఎప్పుడో! ‘ఆఖరి మనుషుల’ ఆర్తిని అంతే ఆర్తితో జనబాహుళ్యానికి పంచుతున్న అక్షర కుమార్ గార్కి, వారిని, వారి శ్రమను పరిచయం చేసిన రవీందర్ గార్కి అభినందనలు.

  7. Aranya Krishna says:

    అయ్యో! నేను మిస్సయ్యాను స్క్రీనింగ్ ని. మీ ఆర్టికల్ లేట్ గా చదివాను. మీ పరిచయం చాలా బాగుంది.

  8. మన్నె ఏలియా says:

    అక్షర కుమార్ గారి ప్రయత్నానికి నా అభినందనలు .కళ పట్ల కళాకారుల పట్ల ఇంతటి శ్రద్ద వహిస్తున్నందుకు .ప్రభుత్వాలు చేయలేని పని మీరు చేస్తున్ననదుకు మనస్పూర్తిగా మరియొకసారి అభినందనలు . అక్షర ఇలాంటి ఇంకా ఎన్నెన్నో కులాలను బతికించాలని నా మనవి .రానున్న తరాలకు మీరిచ్చే అపుర్వాకానుక .
    అన్న పసునూరికి ప్రత్యెక వందనాలు . మీ రచన చదువుతుంటే ఈ సమాజం ఎంతటి కళ రూపాల్ని కోల్పోతుందో నని బాధ కల్గుతుంది .ఆశ్రిత కులాలలో ఆత్మ విశ్వాసం పెరిగేల ఈ డాకుమెంట్లు దోహదపడతాయని నా విశ్వాసం . మన్నే ఏలియా

  9. తాంక్స్ సార్ ఫర్ యువర్ కామెంట్

  10. పసునూరి అన్నకి అఫ్సర్ సార్ కి వేల వేల శనర్తులు

  11. కె.కె. రామయ్య says:

    కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం ( డాక్యుమెంట‌రీని ) యూ ట్యూబు వంటి వాటి ద్వారా నలుగురికీ అందుబాటులో ఉంచేలా చెయ్యడం కుదురుతుందా అక్షర కుమార్

  12. వెంకటేశ్వర్లు బూర్ల says:

    ఇంత గోసను తెరకెక్కించిన అక్షర కుమార్ కు దాన్ని మాటల్ల పెట్టిన పసునూరికి శనార్తులు… కే.కే. రామయ్య గారి అభిప్రాయమే నాది కూడా…. వీలయితే ఆ డాక్యుమెంటరీ, ఆ కళా ప్రదర్శనను చూసేలా చేయడం మంచిది…

    • తాంక్స్ సార్ తప్పకుండా ఈ వారం లో కరీంనగర్ కి వస్తున్న తప్పకుండా కలిస్తా ఈసారి మీకు కూడా శనర్తులు అధ్యక్షునికి ఎన్నికైనందుకు

  13. కె.కె. రామయ్య says:

    తమ్మి అక్షర కుమార్, హైదరాబాదులో ఆంధ్రజ్యోతి పేపరాఫీసులో ఉండే “గజఈతరాలు” కదా రచయత గొరుసన్నను పిలవటం మరవొద్దు. ఆయప్పకు ఇట్టాటివి బాగా అర్ధం అవుతాయి.

    • అన్న తప్పకుండా గోరుసు జగిదీశ్వర్ రెడ్డి సార్ కి చెప్పకుంట ఉంటాన

Leave a Reply to అక్షర కుమార్ Cancel reply

*