నిన్ను వోడించే యుద్ధం!

dali-hiroshima-melancholy1

ఉన్నట్టుండి

యెప్పటిదో గాయం

తలుపు తెరచుకుని నీ ముందు నిలబడుతుంది

వూహించని మెరుపు తాకిడికి

నీ కలల్తో సహా నువ్వు వులుకులికి పడ్తావ్

అప్పుడిక అందరూ తలా వొక వాయిద్యం మోగిస్తూ

నీ గాయానికి శబ్ద లేపనాలేవో పూస్తూ వుంటారు

నువ్వు గాయాన్నే చూసుకుంటూ  వుంటావ్ గానీ

నిన్ను గాయపరచిన శత్రువెవరో తెలియనివ్వని

మంత్రగానమే  వింటూ వుంటావ్  గానీ

అంతకంటే యేమీ తెలియని అమాయకత్వంలోకి

తలకిందులుగా జారుకుంటూ వెళ్ళిపోతావే

అప్పుడనిపిస్తుంది నీ కోసం కాసింత జాలి కూడా నేరమే అని-

 

2

వొక నిండు దేహాన్ని

రెండు ముక్కల కింద తెగనరికినప్పుడు కూడా నువ్వు అంతగా చలించలేదు గానీ

యిప్పుడు సరికొత్తగా తొడుక్కున్న చొక్కాలో

నీది కాని కవచంలో నిన్ను ఎంత పిరికిగా మడత పెట్టేశారో తలచుకుంటే

నాకు  అన్నమూ సయించదు, నిద్రా దారి చూపదు

ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదుకొట్టమే కదా!

నిన్ను రెండుగా  చీల్చి, నీకు హద్దులు గీసినప్పుడు

ఆ హద్దులన్నీ నీ కోసమే అని కదా నువ్వు సంబరపడ్డావ్

నిన్ను కప్పిన అంబరానికి ఖడ్గం దూసి-

ఇవాళ సరే

యింకెప్పటికైనా  తెలుస్తుందా  సరిహద్దుల సర్జికల్ కోతలు

నీ కోసం  కానే కాదని!

 

3

తొలియవ్వనాల మెరుపు శరీరాల్తో వెళ్ళిన వాళ్ళు

వొట్టి గాలి తిత్తులై యింటికొచ్చారని

కలల ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు

నెత్తుటి ముద్దలై తరలి వచ్చారని

రోజుకిన్ని కన్నీళ్లు  ధారపోస్తున్నావే కాని

యెవరి యుద్ధం ఇది

యెవరి ఆయుధాలు వాళ్ళు

అని మాటవరసకైనా నీ పగిలిన అద్దంలో జిన్నానో

నీ నెత్తిన ఊరేగుతున్న  మాటల మోళీనో

అబద్ధమై రాలిపోతున్న నిన్ను నువ్వో  అడగలేదుగా నువ్వు!?

యీ  యుద్ధాలు నీ కలలు కావు

నీ నాలుగు మెతుకుల కోసమూ  కాదు

ఆ సరిహద్దుల మాదిరిగానే-

 

4

యివాళ నువ్వు తాగుతున్న నీళ్ళలో నెత్తురూ

నువ్వు తినబోతున్న అన్నంలో నిషిద్ధ మానవ మాంసాల తునకలూ విసిరి

వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో

నువ్వే వోడిపోతావ్ ఎప్పుడూ!

నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని

దాన్ని భక్తిగా తర్జుమా  చేసుకోలేను యెప్పటికీ,

నువ్వు క్షమించకపోయినా సరే!

 

నాకు యే దేహమైనా అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది యెప్పుడూ,

యే “దేశ”మైనా ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ-

యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ

అక్కడ ఆ గరీబు వొంట్లోనూ

వొకే ఆకలి కేక

వొకే వెతుకులాట-

 

వొక్కటే అనుకుంటాను,

నిన్ను శవంగా కూడా మిగలనివ్వని

యీ ఆటకి నువ్వే డప్పు వాయిద్యానివి!

యుద్ధమూ ఆగదు, డప్పూ ఆగదు ఆకలిదప్పుల్లాగే!

శవాలు ఇంటికొస్తూనే వుంటాయి

అన్నీ తుడిచేసుకొని కేవలం అంకెలయి-

 

5

నువ్వు ఎదురుచూస్తూ వుంటావ్

నీ అంకె ఎప్పుడా అని-

మీ మాటలు

 1. అద్భుతంగా రాశారు సార్

 2. //రెండు ముక్కల కింద తెగనరికినప్పుడు కూడా నువ్వు అంతగా చలించలేదు గానీ
  యిప్పుడు సరికొత్తగా తొడుక్కున్న చొక్కాలో
  నీది కాని కవచంలో నిన్ను ఎంత పిరికిగా మడత పెట్టేశారో తలచుకుంటే
  నాకు అన్నమూ సయించదు, నిద్రా దారి చూపదు
  ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదుకొట్టమే కదా! //
  పుట్టుకతో స్వేచ్ఛ జీవి అయిన మానవుడు, అడుగడుగునా సంకెళ్ళకు గురివుతున్నాడు రూసో గుర్తొస్తున్నాడు

  //నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని
  దాన్ని భక్తిగా తర్జుమా చేసుకోలేను యెప్పటికీ,
  నువ్వు క్షమించకపోయినా సరే! //
  దేశభక్తులు గమనించగలరు.

  • THIRUPALU says:

   పైన ఉదాహరణ మొదటి భాగం లో “రెండు ముక్కలు…” అంటే అర్థం అయినా, (రెండు దేశాలు) రూసోన ఉదాహరణ చూపాను కనుక అర్ధం అవలేదేమో భావన కలగకుండా …….

 3. Kcube Varma says:

  Pratee dehamu oka annam పళ్లెం
  Pratee desamu danni dongilinche dongaga kanapddam nikkachaina nijanni chepparu sir.. great poem sir.

 4. విలాసాగరం రవీందర్ says:

  ఇవాళ సరే

  యింకెప్పటికైనా తెలుస్తుందా సరిహద్దుల సర్జికల్ కోతలు

  నీ కోసం కానే కాదని!

  Touching poem sir. No words

 5. D. Subrahmanyam says:

  ఎంత గొప్ప భావం తో రాసారు అఫ్సర్ సాబ్. ముబారక్ హొ.

  నువ్వు గాయాన్నే చూసుకుంటూ వుంటావ్ గానీ

  నిన్ను గాయపరచిన శత్రువెవరో తెలియనివ్వని

  మంత్రగానమే వింటూ వుంటావ్ గానీ

  అంతకంటే యేమీ తెలియని అమాయకత్వంలోకి

  తలకిందులుగా జారుకుంటూ వెళ్ళిపోతావే

  అప్పుడనిపిస్తుంది నీ కోసం కాసింత జాలి కూడా నేరమే అని – ఎంత నిజమయిన మాటలను చెప్పారు సార్ .

 6. LaksHmu Orsu says:

  పదాలు కూర్చాలన్నా మనసు వుడకాలి ఆ అక్షరాలు ఇలాగే వుంటాయి

 7. గొప్ప పొయెం సార్

 8. Sadlapalle Chidambarareddy says:

  నా కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్లుంది. ఎవరిదో అనుకోని నా పేగుని నేనే సరుక్కున కోసుకొన్నట్లుంది. చాలా అద్భుతంగా స్పందించారు సార్!!

 9. Mythili Abbaraju says:

  అన్నం పళ్ళెం…నిజం. ఏ వైపున్నా.

 10. knvmvarma says:

  గ్రేట్ పోయెమ్

 11. Loved each word of it Sir. Such a wonderful poem…

 12. గొప్పగా రాశారండీ ,అఫ్సర్ గారు.

 13. సరిహద్దుల దగ్గిర జరుగుతున్న బలిదానాల మీద నాకేమీ శంకలు లేవు! వాళ్ళ త్యాగాలని కళ్ళకి అద్దుకోవాల్సిందే! కాని అటు పాకిస్తాన్ నించి ఇటు ఇండియా దాకా రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోసం “ప్రదర్శించే” దేశభక్తి మనకి అక్కర్లేదని నా అభిప్రాయం! బాగా చదువుకున్నామనీ, సమాజం అర్థమైపోయిందనీ రచనలు పండించే వాళ్ళు ఆ రాజకీయ పార్టీల బ్రాండ్ దేశభక్తికి దాసోహం అవడం కన్నా దేశద్రోహం ఇంకోటి లేదు. ఇప్పుడు బాగా అర్థమవుతోంది చలం అన్న మాట- “దేశభక్తి కన్నా హీనమైన పాపం ఇంకోటి లేదు!! ” దేశాన్ని ప్రేమిద్దాం కాని రాజకీయ మార్కు “దేశభక్తి”ని ద్వేషిద్దాం!

  • వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో

   నువ్వే వోడిపోతావ్ ఎప్పుడూ!
   మనసుని తాకిన అక్షరాలు. నా బాధ్యత ఏమైనా ఉందా? నేనేమైనా చేయగలనా . పసి నెత్తురు నేలపైన పడగూడదు. పడుతోంది. రేపు ఎవడి నైతిక బాధ్యత ఎంత ఉందొ అంత ప్రతిఫలం అనుభవించాల్సివస్తుంది. పసి బిడ్డ కూడా టాక్స్ కట్టాల్సి వస్తుంది..
   రాజులు రాజ్యాలేలినపుడు నాయకుడు పోరాట యోధుడిగా నిలబడే వాడు. వాడే సైనికులకు ఉత్తేజం. ఈ రోజు నాయకులకి ఆ అవసరం లేదు! కాబట్టి ఎన్ని యుద్ధాలకైనా వారు సిద్ధం. యుద్ధం చెయ్యొచ్చు. ఒక్క అమాయక ప్రాణాన్ని బలి తీయననే హామీ ఇచ్చినప్పుడు. కాని పక్షంలో , యుద్ధం ఎప్పుడూ చెడ్డదే.
   . పనికి మాలిన మానవ జాతి, ఇంకా నాగరికత సంతరించుకొనే లేదు.

  • Vvlakshmidevi says:

   నేనూ ఈ మాటల్ని కాపీ చేసి పేస్టు చేస్తున్నాను

 14. రాఘవ says:

  ఏం మాట్లాడగలం…

 15. wonderful poem సర్. ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. దేశాలమధ్య ఉద్రిక్తతలకు ఆర్ధిక ప్రాతిపదిక కారణమని బుద్దికి తెలుస్తూనే ఉంటుంది. దీనికి తోడు ఈ ఉద్వేగాలకు మధ్యయుగపు లక్షణమైన మత ప్రాతిపదిక కారణమవుతూంది ప్రపంచమంతటా కూడా.
  చలం కొటేషన్ నా యవ్వనం నుంచి వెంటాడే వాక్యం అది. ఏంటది పెద్దాయన అంత మాటనేసాడు అని. దానికి వివరణ మ్యూజింగ్స్ లో లభిస్తుంది. ఖద్దరు టోపీలు పెట్టుకొని ఆత్మవంచన చేసుకొంటూ, ఊదరగొట్టే ఉపన్యాసాలిచ్చే ఆనాటి నాయకులపై వేసిన సెటైర్ అది. ఈనాటికీ రిలవెన్స్ పోలేదు దానికి.

  చాలా శక్తివంతమైన పొయెమ్. రాజ్యం వేరు,మీడియా వేరు, సైనికులు వేరు, పౌరులు వేరు. ఎవరి పాత్రలు వారు పోషిస్తారు. ఇలాంటి సందర్భాలలో కవులేం రికార్డు చేస్తున్నారో చరిత్ర గమనిస్తుంది.

  పౌరుల దృక్కోణాన్ని కవులు రచయితలే చెప్పగలరు. ఎక్కువమంది మొదటి ఇద్దరి ప్రభావంలో పడి అమరులంటూ, తలలు తెగిపడాలంటూ, దేశమాతకు రక్తాభిషేకాలంటూ మిడియోక్ర్ భావప్రవాహంలో కొట్టుకు పోతారు. కొద్ది మంది మాత్రమే తమ భావాల్ని ప్రవాహానికి ఎదురీది ఇలా వ్యక్తీకరిస్తారు.

  మొదటి ప్రపంచయుద్దం జరుగుతున్న సమయంలో టాగోర్
  అతను తన ఆయుధాలను
  తన దేముళ్ళుగా చేసుకొన్నాడు
  అతని ఆయుధాల విజయం అతని ఓటమి (45) అని- ఒక తుపాకి పేలటం మానవత్వం ఓటమిగా భావించాలని చెపుతాడు.

  ఇపుడీ కవితలోని ఈ వాక్యాలు చూడండి

  వొక్కటే అనుకుంటాను,
  నిన్ను శవంగా కూడా మిగలనివ్వని
  యీ ఆటకి నువ్వే డప్పు వాయిద్యానివి!
  యుద్ధమూ ఆగదు, డప్పూ ఆగదు ఆకలిదప్పుల్లాగే!
  శవాలు ఇంటికొస్తూనే వుంటాయి
  అన్నీ తుడిచేసుకొని కేవలం అంకెలయి-//

  //
  ఏదేశమైన మెతుకొల్ని లాక్కొనే దొంగే…… ఏ దేశమైన కొద్దిమంది Men in Suit ల ఆస్థే….. ఏ దేశమైనా కొన్ని వ్యాపార అగ్రిమెంట్ల సముదాయమే…..

  థాంక్యూ అఫ్సర్ గురువుగారూ, మంచి కవితను అందించారు.

  • అఫ్సర్ says:

   బాబాజీ, మీ విశ్లేషణ కి షుక్రియా! కొంత మంది ఈ కవిత వేపు చూడడానికి కూడా బెదిరిపోతున్న సమయంలో మీ వివరణా, లోతైన ఆలోచనా హృద్యంగా వుంది. కవిత అంతఃస్సారం మీకు పూర్తిగా అర్థమైంది. యుద్ధాన్ని ప్రేమించమని ఇప్పుడు నా “శాంతికాముక” దేశీయులు చెప్తుంటే ఆశ్చర్య విషాదంగా వుంది. యుద్ధం ఎవరి అవసరమో ఇన్ని అనుభవాల తరవాత కూడా తెలుసుకోలేకపోతున్నామంటే మన మధ్యతరగతి ఎంతటి భ్రమల్లో కూరుకుపోతోందో అని జాలేస్తోంది!

 16. సీ.వి.సురేష్ says:

  అఫ్సర్ సర్…ఎంతగా మదనపడ్డారో….మీ మనసు ఎంత సున్నితమో….ఈ యుద్ధ పరిస్థితులు…కొన్ని వర్గాల అంతర్మధనం …సున్నిత మనసులు…. గుండె లోపలి అంతరఘోష…. ఎంత ఆర్దంగా చెప్పారో….అసలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సున్నిత ఇష్యూ…!
  ప్రస్తుత పాక్-భారత యుద్ధ పరిస్థితుల్లో ఇది ఎన్నో మనసులను మెలిపెడుతూనే ఆలోచింప చేస్తుందని భావిస్తున్నాను…

  ఈ కవిత ను. పొరలు పొరలుగా విడమర్చి వివరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను..
  ..
  మీ ఆంతరంగమేఈకవిత కాదు… ఎందరో దుఃఖిత మనస్సుల చీకటి నొప్పి…!
  హాట్స్ ఆఫ్ సర్…

 17. venkatrao.n says:

  నువ్వు గాయాన్నే చూసుకుంటూ వుంటావ్ గానీ

  నిన్ను గాయపరచిన శత్రువెవరో తెలియనివ్వని

  మంత్రగానమే వింటూ వుంటావ్ గానీ

  అంతకంటే యేమీ తెలియని అమాయకత్వంలోకి

  తలకిందులుగా జారుకుంటూ వెళ్ళిపోతావే

  అప్పుడనిపిస్తుంది నీ కోసం కాసింత జాలి కూడా నేరమే అని-

 18. Karimulla Ghantasala says:

  ఎప్పటికీ అర్థమే కాని ఒక అంకె.. ఒక బండి సున్నా.. మనిషిలోంచి మనిషిని తగలేసి, మనిషిని ఖాళీ చేసే ఒక ద్వేషాగ్నిగుండం.
  అద్భుతం అఫ్సర్, మీ కవిత్వం.

 19. Aranya Krishna says:

  దేశ ప్రేమికుడు వేరు దేశభక్తుడు వేరు. దేశ ప్రేమికుడు తోటి ప్రజల్ని ప్రేమించేవాడు. దేశభక్తుడు పక్క దేశాల్ని ద్వేషించేవాడు. కేవలం యుద్ధం మీద రాసిన కవిత కాదిది. దేశభక్తికి యుద్ధోన్మాదానికి వున్నసంబంధం, యుద్ధానికి సామాన్యులకు వున్న వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసిన కవిత. ఇది ఖఛ్చితంగా అఫ్సర్ రాయాల్సిన కవితే. దుఃఖం ఆగ్రహం కన్నా శక్తివంతమైనది. ఆ దుఃఖం పరాయీకరణకు చెందినదైతె అది మరింత శక్తివంతమైనది. ఇంకా ఆలోచించే వాళ్ళం వున్నాం. అంకెల లెక్కింపుల్ని వ్యతిరేకిస్తూ మనసుల మధ్య సరిహద్దుల్లేని వాళ్ళం చాలామందిమే వున్నాం.

 20. Madhu Chittarvu says:

  ఏ యుగం లో నైనా యుద్ధం ఒక హింస మాత్రమే .రాజులు రాజకీయనాయకుల వ్యూహాల మధ్య సామాన్య మానవులు నలిగిపోతుంటారు .అప్పటి మహాభారత యుధ్ధాల నుంచి ఇప్పటి సిరియా లోని భయంకర యుధ్ధాలు, వాటినుంచి పారిపోయే శరణార్థులు ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలని పావులు గా వాడుకునే మాయలే.అలాంటి హింసని దేశ భక్తి పేరుతోనో మతం పేరు తోనో ఆర్ధిక సిధ్ధాంతాల పేరుతోనో ప్రజలు మీద రుద్ది వారి తో ఆటలాడుకుంటూఉంటారు .అందుకే యుద్ద్ధం వద్దనే పవర్ఫుల్ కవిత ఇది. .ప్రస్తుత పరిస్థితుల్లో అందరిని ఆత్మపరిశీలన చేసుకునేట్లు చేస్తుంది.అయితే ఆత్మ రక్షణ కోసం ఒక్కప్పుడు హింస తప్పని సరి అవుతుంది.ఇది అనాది గా సాగుతున్న సంఘర్షణే .

  నిన్ను శవంగా కూడా మిగలనివ్వని

  యీ ఆటకి నువ్వే డప్పు వాయిద్యానివి!

  యుద్ధమూ ఆగదు, డప్పూ ఆగదు ఆకలిదప్పుల్లాగే!

  శవాలు ఇంటికొస్తూనే వుంటాయి

  అన్నీ తుడిచేసుకొని కేవలం అంకెలయి-…

  చాలా శక్తివంతమైన కవిత

 21. దేవరకొండ says:

  ఎవరిబాగు కోసం ఎవరు ఎవరితో ఎందుకు చేస్తున్న యుద్ధమో ఎవరికీ తెలియనంత అయోమయంలో జరుగుతున్న “యుద్ధం” అనే ఒక క్రూర క్రీడలో పర్యవసానాలు మాత్రం అంతకంటే క్రూరంగా సామాన్య (సైనిక?) మానవుల్ని ఎలా వెంటాడుతాయో సాటి మనిషి కోసం రోదిస్తూ చెబుతున్న ఇలాంటి కవితలు చరిత్రలో నిల్చి ఉంటాయి… చరిత్ర గతిని సూచిస్తూ…! ఏమీ రాయలేక ఆ కవితా పంక్తుల్నే కాపీ చేస్తున్నారు ఇంతమంది …ఇదే ఈ కవిత ప్రత్యేకతను చాటుతోంది…కవిని అభినందించడానికి కూడా తెలియని బాధ…..

 22. Suparna mahi says:

  వాట్ ఏ గ్రేట్ పోయెమ్… ప్రతీ పదం అద్భుతమే… క్లాప్స్ & క్లాప్స్ సర్…

 23. దేవరకొండ says:

  “అయితే ఆత్మ రక్షణ కోసం ఒక్కప్పుడు హింస తప్పని సరి అవుతుంది.ఇది అనాది గా సాగుతున్న సంఘర్షణే ” అన్నారు పైన మధు గారు. మూర్ఖులు, బలవంతులైన ధనమదాంధులు యుద్ధాలు మొదలు పెడతారు. అందువలన ఆత్మరక్షణ కోసం అవతలివారు శాంతికాముకులు అయి కూడా యుద్ధం చేయడం అనివార్యం అవుతుంది. ఎవరికి వాళ్ళు తమ యుద్ధం అనివార్యంగా నమ్మించడానికి ప్రయత్నించడమే తమాషా! అలాంటి తమాషాల్ని కవులే కనిపెట్టి బట్టబయలు చేస్తారని అఫ్సర్ గారు ఈ కవితలో రుజువు చేశారు!

 24. Poem bagundi.
  I read in prajasakti
  Yuddaalu eppudoo prajasakti kosam jaragavu kadaa!

 25. ఫణీంద్ర says:

  అఫ్సర్ జీ, మీరు రాసిన ఈ శక్తివంతమైన కవితలో నాకు పూర్తిగా అర్థం కాని కొన్ని అస్పష్ట భావాలు ఉన్నప్పటికీ (అది ఒక కవితా శైలి/ప్రక్రియ ఏమో మరి, నాకు తెలీదు), కవితలో కనిపించే మీ మనసు మహోన్నతంగా ఉంది. “నాకు యే దేహమైనా అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది యెప్పుడూ, యే “దేశ”మైనా ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ!” అన్న వాక్యాల్లో మానవచరిత్ర సారాంశం అంతా ఇమిడి ఉంది! మీరన్నట్టు యుద్ధం అందరినీ ఓడించేదే ఎప్పుడూ! “విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?” అని సిరివెన్నెల కూడా అన్నారు!

  అయితే తీవ్రవాదులపై విరుచుకుపడిన “సర్జికల్ స్ట్రైక్” ని యుద్ధంగా, “నీ కోసం కానే కాని సర్జికల్ కోతలు” గా నేను ఒప్పుకోను! తీవ్రవాదులని సైనికులతో, ఇరుదేశాల రాజకీయాలతో ముడిపెట్టడం అనవసరం! ఈ తీవ్రవాదులు కాశ్మీరులో చేసిన ఊచుకోతలూ, కాశ్మీర్ పండిట్లపై సాగించిన మతమారణహోమాలూ మీకు తెలియనివి కావు! ఈ తీవ్రవాదకోణాన్ని పూర్తిగా విస్మరించడం (లేదా ఈ తీవ్రవాదాన్ని కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించడం) మీ కవితలో కనిపించే ప్రధాన లోపం! ఇంకో లోపం మనదేశాన్నీ, పాకిస్తాన్నీ ఒకే గాటన కట్టడం! యుద్ధాలవల్ల రాజకీయ నాయకులు ఎప్పుడూ బాగుపడతారు మీరన్నట్టు. అయితే కాశ్మీరుని యుద్ధక్షేత్రంగా మార్చినదీ, ఆ యుద్ధంపైనే మనుగడ సాగిస్తున్నదీ ఎవరు? మన దేశం కాదే?

  కాబట్టి మీ కవిత యుద్ధం వల్ల ఏమీ ఒరగదనే నిజాన్ని గుండెకి హత్తుకునేలా చెప్పిన గొప్ప కవితని నేను అంగీకరిస్తూనే, వాస్తవాలని పూర్తిగా చూపని అసమగ్ర కవితనీ అంటాను! మీకు అభినందనలు! మీ నుంచి మరిన్ని గొప్ప కవితలు ఆశిస్తాను!

 26. THIRUPALU says:

  యుద్ధం ఎప్పుడు ఎముక ముక్క కోసం కాట్లాడే కుక్కల్లానే కనిపిస్తుంది నాకెప్పుడూ!
  మానవ జీవితం ఇంతకంటే ఉన్నతమైనది కాదనుకొండి ! అయినా ……….
  ఉన్నదంతా దొడ్డిదారిన దోచి పెడుతూ వాడెవడో మనల్ని కబళించుక పోతాడని నమ్మించడం ఎంతటి జాణ తనం!
  ఆహా! ఇది కదా ప్రపంచ స్టేజి మీద ఆడుతున్న మేజిక్ షో అంటే !

మీ మాటలు

*